సౌమ్య - సత్యం మందపాటి

    
వారానికి కనీసం నాలుగుసార్లయినా మా ఇంటికి దగ్గరగా వున్న జిమ్‌కి వెళ్ళి, గంటన్నరా రెండు గంటలు ఎక్సర్‌సైజ్ జేయటం నాకూ శిరీషకీ గత పదేళ్ళుగా అలవాటయిపోయింది.

    ఆ రోజు శనివారం. ప్రొద్దున్నే తొమ్మిది గంటలకు జిమ్‌కి వెళ్ళాం.

    ఒక గంట ట్రేడ్మిల్‌మీదా, ఇంకొక గంట బరువులెత్తటం సైకిల్ తొక్కటం లాంటివి చేయటం అలవాటు. ఆరోజు ఎందుకోగానీ నాకు కావలసిన అన్ని మెషీన్లు బిజీగా వున్నాయి. శిరీషకి కావలసిన ఎలిప్టికల్ మెషీన్ ఖాళీగా వుండటంతో అక్కడికి వెళ్ళింది. ఇక నేను మేడ మీద వున్న వాకింగ్ ట్రాఖ్‌కికి వెళ్ళవలసి వచ్చింది. నేను ఎప్పుడో కానీ అక్కడికి వెళ్ళను. ట్రేడ్మిల్ మీద వున్న సౌలభ్యం నడకలో వుండదు. అక్కడక్ ట్రాక్ మీద పది రౌండ్లు కొడితే, ఒక మైలు అవుతుంది. నేను కనీసం మూడు మైళ్ళయినా నడుస్తాను. అంటే ముప్పై రౌండ్లు పైన నడవాలన్న మాట. చెవులకి ఎంపీత్రీ ఇయర్ ఫోన్లు తగిలించుకుని, ఘంటసాలవారి పాటలు వింటూ నడక మొదలుపెట్టాను.

    నాతో పాటు నలుగురైదుగురు వున్నారేమో అక్కడ. కొంతమంది జాగింగ్ చేస్తుంటే, కొంతమంది చకచకా నడుస్తున్నారు. మొదటి రౌండ్ చేస్తున్నప్పుడే అందరితోనూ గుడ్ మార్నింగులు చెప్పించుకోవటం, చెప్పటంతో స్పీడ్ పెరగలేదు. తర్వాత స్పీడ్ పెంచి 'అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం' లాటి పాటలు వింటూ, ఆనందంగా నడుస్తున్నాను.

    అప్పుడే వచ్చింది ఆవిడ. బాగా వయసున్న ఆవిడ. కనీసం డెబ్భై ఐదేళ్ళ వయసుంటుందేమో. ఐదడుగుల పొడుగుంటుంది. సన్నగా, పీలగా వుంది. తెల్లటి శరీరం, తెల్లటి జుట్టుతో, తెల్లటి నిక్కరు టీషర్టులో, చిరునవ్వులు చిందించే ముఖంతో, ఎంతో అందంగా దివి నుండి అప్పుడే దిగి వచ్చిన దేవతలా వుంది. చూడగానే నాకు ఒక విధమైన సదభిప్రాయం కలిగింది. ఆవిడ చకచకా నడుస్తున్నది.

    నాకన్నా కొంచెం ముందుగా నడవటం మొదలు పెట్టిన ఆవిడని అందుకోవటానికి ఎక్కువసేపు పట్టలేదు. ఆవిడ పక్కకి రాగానే, నా వేపు తిరిగి పలకరింపుగా నవ్వింది. వెన్నెల కురిసినట్టు వుంటుంది ఆవిడ చిరునవ్వు.

    చిన్నగా నవ్వాను 'గుడ్ మార్నింగ్' అంటూ.

    'నీ టీషర్ట్ మీద వ్రాసింది బాగుంది. ఉయ్ మస్ట్ బి ది చేంజ్ వుయ్ టు సీ అని'

    'అవును. అది మహాత్మా గాంధీ చెప్పిన సూక్తి. ఈ టీషర్ట్ మా అమ్మాయి ఇచ్చింది నాకు' అన్నాను.

    నేనూ నవ్వి వేగం పెంచాను.

    తర్వాత ప్రతి శనివారం అక్కడికి వెళ్ళినప్పుడు, కనీసం చూడటం కోసం పైకి వెళ్ళి ఒక పావుగంట అక్కడ నడవటం ప్రారంభించాను. ఆవిడ ఎక్కువగా మాట్లాడదు కానీ సౌమ్యంగా నవ్వుతుంది.

    ఆరోజు కారులో ఇంటికి వస్తున్నప్పుడు అడిగింది శిరీష నవ్వుతూ 'ఏమిటి ఈ మధ్య జిమ్‌లో మేడ మీద కాలి నడక మొదలు పెట్టావ్... ఎవరైనా మంచి అమెరికన్ అమ్మాయి కనపడిందా ఏమిటి' అని.

    'అవును. చాలా అందంగా వుంటుంది. అందంగా నవ్వుతుంది. పేరు సౌమ్య' అన్నాను నవ్వుతూ. 

    'నిజంగానే...' అంది కళ్ళు పెద్దవి చేసి శిరీష. 'అవును. నాకన్నా కనీసం పాతికేళ్ళు పెద్దది. అయినా నాకు బాగా నచ్చింది ఆవిడ. ఆవిడ చిరునవ్వు సౌమ్యంగా వుంటుది కాబట్టి, అది నేను పెట్టుకున్న తెలుగు పేరు' అన్నాను నవ్వుతూ.  

* * *

    ఆవిడ అక్కడికి వచ్చే సమయంలో ఏమాత్రం మార్పు లేకపోవటంతో, ప్రతి శనివారం కలుస్తూనే వున్నాను. ఆవిడ ఒకవేళ ఆలస్యంగా వస్తుంటే, నా కళ్ళు ఆవిడ కోసం వెతకటం కూడా మొదలుపెట్టాయి. అలా రెండు మూడు నెలలు గడిచాయనుకుంటాను. హఠాత్తుగా ఆవిడ రావటం మానేసింది.

    రెండు వారాలు కనపడకపోయేసరికి శిరీషతో 'సౌమ్యగారు రావటం లేదు, ఎందుకో మరి' అన్నాను.

    శిరీష ఆట పట్టిస్తూ 'ఏం దిగులు పడ్డావా?' అంది.

    'అవును' అన్నాను.

    'ఎందుకని అంత దిగులు' అంది నవ్వుతూ.

    ఈసారి సీరియస్‌గానే 'నిజంగానే ఆవిడనీ, ఆవిడ చిరునవ్వునీ చూడాలని వుంటుంది నాకు. సౌమ్యంగా వున్న ఆవిడ ముఖం చూస్తే ఆ రోజంతా బాగుంటుంది నాకు. రెండేళ్ళ క్రితం పోయిన మా అమ్మ ముఖంలో కూడా అదే సౌమ్యమైన చిరునవ్వు చూసేవాడిని. అందుకేనేమో...' అన్నాను.

    నా చేయి పట్టుకుని మృదువుగా వత్తింది శిరీష.

* * *

    రెండు రోజుల తర్వాత అనుకుంటాను, ఎనిమిదింటికే హాస్పిటల్‌కి వెళ్ళి నా మార్నింగ్ రౌండ్స్ ఐ.సి.యు.(ఇంటెన్సివ్ కేర్ యూనిట్) దగ్గర నించీ మొదలుపెట్టాను.

    నా ఇద్దరు పేషంట్లనీ చూసి అక్కడినించి వెళ్ళబోతొంటే, నర్స్ చెప్పింది 'రూమ్ నెంబర్ 327లో పేషెంట్‌ని కూడా మీకే రిఫర్ చేశారు' అంటూ చార్ట్ అందించింది.

    పేషెంట్ పేరు జూలీ లెన్నీ. వయసు ఎనభై ఏళ్ళు. నాకు తెలిసిన ఫామిలీ డాక్టర్ నాన్సీ, ఆ పేషెంట్‌కి కార్డియాలజిస్ట్ ఎవరూ లేకపోవటంతో నా చేతుల్లో పెట్టింది. రాత్రి తొమ్మిదింటికి హార్ట్ ఎటాక్ వచ్చి 911కి ఫోన్ చేస్తే, పేషెంట్‌ని ఎమర్జెన్సీకి తీసుకువచ్చినట్టు వుంది చార్ట్‌లో. ఆంబులెన్స్‌లో తీసుకువస్తున్నప్పుడు సి.సి.ఆర్. కూడా ఇచ్చినట్టు వుంది. ఏసిన పరీక్షలు, ఇసిజి రిపోర్ట్‌, ఇచ్చిన మందులు అన్నీ వివరంగా వ్రాసి వునాయి. 

    తలుపు మీద రెండుసార్లు కొట్టి సమాధానం రాకపోతే, నెమ్మదిగా తలుపు తెరిచి లోపలికి వెళ్ళాను.

    ముఖం ఒక్కటే కనపడేటట్టు దుప్పటి కప్పుకుని పడుకుని వుంది. ముక్కుకి ఆక్సిజన్ గొట్టాలు తగిలించి వున్నాయి. రాత్రి నిద్రపోవటానికి మందులు ఇవ్వటం వల్ల ఇంకా నిద్ర పోతున్నది.

    దగ్గరా వెళ్ళి 'మిస్ లెన్నీ' అన్నాను నెమ్మదిగా. కొంచెం కదిలింది.

    పక్కనే వున్న లైటు వేస్తూ, 'గుడ్ మార్నింగ్! హవార్యూ?' అన్నాను.

    ఆవిడ కళ్ళు తెరిచింది. అప్పుడే గుర్తు పట్టాను. ఆవిడే సౌమ్య. అసలు పేరు జూలీ అన్నమాట.

    అరె! పాపం! ఆరోగ్యంగా ఎప్పుడూ చిరునవ్వులు చిందించే ఆవిడ మరి ఇలా ఎందుకు అయిందో... 

    నన్ను వెంటనే గుర్తు పట్టింది. చిరునవ్వు నవ్వింది. అదే సౌమ్యత. అదే వెన్నెల.

    'పోయిన రెండు శనివారాలు నేను జిమ్‌కి రాలేదు... ఒంట్లో బాగా లేక...' అంది.

    'అవును. ఇప్పుడెలా వుంది?' అడిగాను.

    'గుండెల్లో నొప్పి తగ్గింది కానీ,ఇంకా అప్పుడప్పుడూ వస్తూనే వుంది. ఇంతకు ముందు ఏనాడూ అనారోగ్యం లేదు నాకు. జ్వరం కూడా వచ్చేది కాదు. నిన్న సాయంత్రం బాగా వీక్‌గా అనిపించింది. రాత్రి తొమ్మిదింటికి గుండెల్ని పిండేసినట్టుగా వుంటే విలవిల్లాడాను. వెంటనే 911కి పిలిచి, తలుపు తీసివుంచాను. వాళ్ళు ఎప్పుడు వచ్చారో కూడా తెలియలేదు. దారిలో కూడా ఆక్సిజన్ ఇచ్చి, సిసీఅర్ చేసి, మొత్తానికి ఎంత చేయాలో అంతా చేసి నా ప్రాణం పోకుండా కాపాడారు' అంది.

    'మీకు ఎవరూ లేరా?' అడిగాను.

    'లేరు. నేనొక్కదాన్నే. మా ఆయన ఏడు నెలల క్రితమే చనిపోయాడు' అంది.

    'మీకు సహాయంగా ఎవరైనా దగ్గరవాళ్ళని పిలిపించమంటే ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేను పిలిచి చెబుతాను... భయపడాల్సినది ఏమీ లేదు కానీ తోడుగా వుంటారని' అన్నాను.

    ఆవిడ ముఖకవళికలు మారాయి. అదోలో అయిపోయింది. వెంటనే తమాయించుకుని, తన టృఏడ్‌మార్క్ చిరునవ్వు నావింది.

    'లేదు. అవసరమయితే నేనే చెబుతాను' అంది.

    ఒక్క క్షణం ఆగి 'డాక్టర్! మీ పేరు' అడిగింది. చెప్పాను.

    'నన్ను చూస్తున్నందుకు థాంక్స్. మీ చేతుల్లో భద్రంగా వుంటానని తెలుసు. ఒక్క విషయం చెప్పండి. నేనింకా బ్రతుకుతానంటారా?'

    'తప్పకుండాను. మీ వయసుకి మించిన ఆరోగ్యంతో వున్నారు. రోజుకి రెండు మైళ్ళు నడుస్తున్నారు. ఏం ఫరవాలేదు. కాకపోతే కొన్ని పరీక్షలు చేసి ఆర్టరీస్ ఎంత బ్లాక్ అయ్యేయో చూడాలి. దాన్నిబట్టి మిగతా నిర్ణయాలు తీసుకుందాం' అనాను.

    'మళ్ళీ సాయంత్రం వస్తారుగా' అని అడిగింది. 

    నిజానికి అన్ని పరీక్షలూ పూర్తయి మర్నాటి లోపల డాక్టర్ రిపోర్టులు రావు. అయినా ఎందుకో వచ్చి ఆవిడ పక్కన వుండి ధైర్యం చెప్పాలనిపించింది. 'వస్తాను. బహుశా చీకటి పడ్డాక' అన్నాను.

    నేను వచ్చేసరికి రాత్రి తొమ్మిదయింది. ఆవిడ నిద్రపోతున్నది. ముఖం ప్రశాంతంగా వుంది. నిద్రలో కూడా అదే చిరునవ్వు. అదే సౌమ్యత. అదే వెన్నెల.

    నేను తెచ్చిన పూలగుత్తి, గెట్‌వెల్ కార్డు అక్కడ పెట్టి, కేస్ షీట్ అందుకుని చదివాను. అన్ని పరీక్షలూ చేశారు. కొన్ని ఫలితాలు వచ్చాయి. కొన్ని మర్నాడు ప్రొద్దుటికి కనీ రావు. ఆవిడ ఇసిజి అంత సుముఖంగా లేదు. నేను అనుకున్నంత ఆరోగ్యంగా ఏమీ లేదు.

    ఇంటికి వచ్చాక శిరీషకి చెప్పాను జరిగిన విషయం.

    'అయ్యయ్యో. ఈ వయసులో... ఎందుకొచ్చిందో పాపం. కోలుకుంటుందా?' అంది.

    'కష్టమే. రేపు మిగతా రిజల్ట్స్ చూస్తే కానీ నిర్ధారణగా చెప్పలేం' అన్నాను.

    మర్నాడు పదకొండింటికి వెళ్ళాను. నేను అనుకున్నట్టుగానే రిపోర్టులు అన్నీ వచ్చయి. ఆవిడకి రెండు ఆర్టరీలు తొంభై శాతం పైనే పూడుకుపోయాయి. బైపాస్ సర్జరీ చేయకపోతే చాల కష్టం. కానీ ఆవిడ ఆ వయసులో సర్జరీని తట్టుకోగలదా?

    లోపలికి వెళ్ళాను. నవ్వుతూ పలకరించింది.

    'ఎలా వున్నారు. రాత్రి బాగా నిద్ర పట్టిందా?' అడిగాను.

    'కొంచెం నీరసంగా వుంది అంతే. రాత్రి బాగా నిద్రపోయాను. మీరు వచ్చింది కూడా తెలియలేదు. పూలగుత్తి బాగుంది. అది చూస్తే ఏదో ఆత్మీయంగా అనిపించింది. థాంక్స్' అంది.

    చిన్నగా నవ్వి 'రిపోర్టులు అన్నీ వచ్చాయి' అన్నాను.

    'నేను ఎలా వున్నాను' అంది నవ్వుతూ.

    'అంత మంచి వార్త కాదు' అంటూ అసలు విషయం చెప్పాను.

    'బైపాస్ సర్జరీ చేయటం అవసరం. కానీ ఈ వయసులో, ఈ పరిస్థితిలో అదెంత మంచిదా అని ఆలోచిస్తున్నాను' అన్నాను.

    జూలీ ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నది. తలెత్తి అడిగింది 'సర్జరీ చేయకపోతే ఏమవుతుంది' అని.

    ఆవిడ చేయి పట్టుకుని అన్నాను. 'స్టెంట్ పెట్టటానికి సమయం మించి పోయింది. సర్జరీ చేయకపోతే గుండెనించీ రక్త ప్రసరణ ఆగిపోతుంది... గుండె పనిచేయటమే ఆగిపోతుంది'

    'అయితే ఆపరేషన్ చేయిముకోవటం ఒక్కటే మార్గమా?' అంది.

    'అవును. ఇప్పుడీ ఆపరేషన్లు చాల విజయవంతమవుతున్నాయి. దాని మీద ఏమీ అనుమానం లేదు. కానీ మీరు మానసికంగా సిద్ధపడితే, శారీరకంగా సులభమవుతుంది' అన్నాను.

    వెంటనే అంది 'అయితే నేను సిద్ధమే. కానీ మీకొక విషయం చెప్పాలి. స్వంత విషయం. దీంట్లో మీ సహాయమూ కావాలి'

    'చెప్పండి' అన్నాను

    'నాకు సర్జరీ చేసేలోగా, మా అబ్బాయికి కబురు చేయాలి. వాడిని చూసిన తర్వాతే సర్జరీ చేయించుకుంటాను' అంది జూలీ.

    'అబ్బాయా... మీకు ఎవరూ లేరన్నారు' అడిగాను విస్మయంతో.

    అదోలా నవ్వింది. 'ఉన్నాడు. లేడు. టాడ్ పంథొమ్మిదో ఏడు వచ్చేదాకా బాగానే వుండేవాడు. ఉండేవాడు కాదు, వుండేవాడని అనుకునేవాళ్ళం. అప్పుడే ఒక్కొక్కటీ బయటపడ్డాయి. వాడికి లేని దురలవాటు లేదు. త్రాగుడే కాక డ్రగ్స్‌కి కూడా బానిసయిపోయాడు. నేను ఎంతో చెప్పిచూశాను. కానీ నా మాట వినేవాడు కాదు. మా ఆయనకూడా వాడిని మామూలు మనిషిని చేయటానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఏమీ లాభం లేకపోయింది. మా ప్రేమని పక్కన పెట్టి వాడిని బలవంతంగా మారుద్దామనుకున్నాం. మారకపోగా మామీద ద్వేషం పెంచుకున్నాడు. అంతే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు మళ్ళీ మా ఇద్దరి ముఖాలూ జన్మలో చూడను అని పంతంపట్టి వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాలు అలాగే గడిపినా, తర్వాత ఏదో ఉద్యోగంలో చేరి డల్లస్‌లో వున్నాడని తెలిసింది. మా స్నేహితుడొకాయన వాడి ఫోన్ నెంబర్ సంపాదించి ఇచ్చాడు. ఎన్నిసార్లు పిలిచినా ఫోన్ తీసేవాడు కాదు. మా ఆయన చనిపోగానే రమ్మని ఫోన్ చేశాం. వాడు రాలేదు. అప్పుడే నాకు కోపం వచ్చి, నిన్ను ఎంతో ప్రేమించిన తండ్రినే కాదనేవాడికి మా ప్రేమకి అర్హత లేదని చెప్పాను. తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. కన్నతల్లిగా నా మనసు విరిగిపోయింది. కొడుకుని క్రమశిక్షణలో పెట్టాలనుకున్న తండ్రికి భార్యగా నా ప్రేమ కరిగిపోయింది...' జూలీ కళ్ళల్లో నీళ్ళు ముత్యాల్లా మెరుస్తున్నాయి.

    అక్కడే కుర్చీలో కూర్చుని జూలీ చేయి పట్టుకున్నాను. సౌమ్యంగా వుండే ఆవిడ ముఖంలో కొండంత శోకం.

    'మా ఇద్దరి మధ్యా ప్రేమ కరువయింది. తప్పు ఎవరిదైనా అది తల్లీపిల్ల ప్రేమకి అడ్డు రాకూడదు. నేను వాడికి తల్లిని. వాడంటే నాలో ఇంకా ఎనలేని ప్రేమ వుంది. అది వాడికి చెప్పాలి. ఆరోజు నీ టీషర్ట్ మీద గాంధీ సూక్తి చదివాను. ఏదన్నా మార్పు చూడాలంటే, ముందు నువ్వే మారాలి అని. అప్పటినించీ అనుకుంటున్నాను, పట్టింపులతో పని లేకుండా వాడిని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలని. నేను ఫోన్ చేస్తే వాడు వెంటనే పెట్టేస్తున్నాడు. మీరు వాడిని ఒక్కసారి వచ్చి, నన్ను చూడమని చెబుతారా?' అడిగింది. జూలీ గొంతులో జీర వినిపిస్తూనే వుంది.

    'తప్పకుండాను' అని ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఆ సాయంత్రం కొంచెం ఖాళీ అవగానే టాడ్‌కి ఫోన్ చేశాను. నేను ఫలానా హాస్పిటల్లో డాక్టర్ననీ, జూలీతో అంతకుముందే పరిచయం వుందనీ, నాకూ ఆవిడ మా అమ్మలాటిదే అనీ, జూలీ అక్కడ చేరిందనీ,ఆవిడ పరిస్థితి బాగా లేదనీ, అతను వస్తే మంచిదనీ చెప్పాను.

    అంతావిని 'మీరెందుకు పిలుస్తున్నారు? మీకేమిటి సంబంధం' అడిగాడు.

    'ఆవిడ పిలిచే పరిస్థితిలో లేదు కనుక. నన్ను ఆవిడ నిన్ను పిలవమని కోరింది కనుక. ఆఖరి క్షణాల్లో సాటి మానవుడిగా నేను అది నా బాధ్యతగా తీసుకుని పిలుస్తున్నాను. అంతేకాదు ఆవిడ చావుబ్రతుకుల మధ్య వుంది. ఒకవేళ చనిపోతే జీవితాంతం బాధ పడతావ్. ఇక నీ ఇష్టం' అన్నాను.

    అతను ఒక్క క్షణం మాట్లాడలేదు. 'నేను కొంచెం ఆలోచించుకుని చెబుతాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి' అన్నాడు.

    'అయితే త్వరలో ఇక్కడ చూస్తాను' అన్నాను, నా సెల్ నెంబర్ ఇచ్చి.

    వెంటనే జూలీ రూంకి ఫోన్ చేశాను. నర్స్ తీసుకుని, జూలీకి అందించింది ఫోన్‌ని.

    'ఇప్పుడే టాడ్‌తో మాట్లాడాను. మిమ్మల్ని చూడాలని గట్టిగా వుందనీ, త్వరలో వస్తాననీ అన్నాడు. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాననీ, ఈ మధ్య ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తున్నాననీ చెప్పమన్నాడు. అతను పూర్తిగా మారాడనిపించింది నాకు' అన్నాను.

    నేను చెప్పింది పూర్తిగా నిజం కాదని నాకు తెలుసు. కానీ అలా అనేశాక అనిపించింది, నేను చేసింది మంచిపనే అని. దీనివల్ల ఆమెకి ఎంతో సంతోషమవుతుంది. మానసికంగా సేద తీర్చుకుంటుంది. తనని ప్రేమిస్తున్న కొడుకు ఎన్నో ఏళ్ళ తర్వాత చూడటానికి వస్తున్నాడనే భావనతో, ధైర్యంగా తన అనారోగ్యాన్ని ఎదుర్కొంటుంది. ఆవిడ కోలుకోవటానికి ఎంతో అవసరమైన మనోధైర్యాన్నిచ్చే టానిక్ అది. అందుకే ఆ అబద్ధమాడటాన్ని నేను తప్పుగా అనుకోలేదు.

    మర్నాడు కారులో హాస్పిటల్‌కి వెడుతుంటే టాడ్ నా సెల్‌ఫోన్‌లో పిలిచాడు. నేను చెప్పింది తను బాగా ఆలోచించానని చెప్పాడు. తనకీ తల్లి అంటే ఎనలేని ప్రేమ అనీ, వయసులో వున్నప్పుడు ఏంచేసినా ఇప్పుడు తనూ ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకునే వయసులో వున్నాననీ అన్నాడు. అందుకే వెంటనే వచ్చి తల్లికి అండగా నిలబడతాననీ, ప్రొద్దున్నే బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా వుంటాననీ అన్నాడు. చక్కటి నిర్ణయం తీసుకున్న అతన్ని అభినందించాను. జూలీ లాటి సౌమ్యమూర్తికి ఈ వయసులో అతను తోడుగావుండటం చాల అవసరమని చెప్పాను. రూం నెంబరు ఇచ్చాను.

    నర్స్‌కి ఫోన్ చేస్తే, జూలీ ఇంకా నిద్ర లేవలేదంది. ఇక జూలీకి ఆ విషయం చెప్పలేదు, ఎలాగూ ఇంకో నాలుగు గంటల్లో చూస్తుంది కదా అనీ, టాడ్ రాక ఆవిడని ఆశ్చర్యంలో ముంచితేనే బాగుంటుందనీ.

    సమయం దాదాపు పదకొండు గంటలయింది. ఇంకో ఇద్దరు పేషంట్లని చూసి, జూలీ వున్న ఫ్లోర్‌కి వెడదామనుకుంటున్నాను.టాడ్ వచ్చేలోపలే నేను అక్కడికి వెళ్ళాలి. జూలీ ముఖంలో ఆనందం చూడాలి. అప్ప్పుడే ఫోన్ వచ్చింది.

    జూలీకి బాగా లేదనీ, కోడ్ బ్లూ అలర్ట్ చేశారనీ... ఎక్కడున్నా వెంటనీ రమ్మనీ అంది నర్స్.

    ఏమిటిలా జరుగుతున్నది. టాడ్ ఇంకో అరగంటలో వచ్చేస్తాడు. ఆవిడ అప్పటిదాకా వుంటుందా? ఆమెకి టాడ్‌ని కలిసే అవకాశం లేదా? దాదాపు పరిగెత్తుతున్న వేగంతో ఐ.సి.యు.కి వెళ్ళాను.

    అప్పటికే ఆవిడకి సి.సి.ఆర్. ఇస్తున్నారు. బ్లడ్‌ప్రషర్ వేగంగా పడిపోతున్నది. ఆక్సిజన్ పెట్టారు. ఆవిడ స్పృహలో లేదు. గుండెల మీద ఎలెక్ట్రిక్ షాక్ కూడా ఇస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళిన రెండు నిమిషాల్లోనే అంతా అయిపోయింది. శరీరానికి తగిలించినవన్నీ తీసేశారు. జూలీ ముఖంలో ఆ సౌమ్యత మాత్రం చెక్కుచెదరలేదు. 
 
    కార్డియాలజిస్ట్‌గా ఇలా పేషంట్లు అప్పుడప్పుడూ చనిపోవటం చూస్తున్నా, జూలీ మరణం మాత్రం నన్ను కలిచివేసింది. ఆమె నాకేమీ కాదు. కనీ ఎందుకో మనసంతా చెదిరిపోయింది. ఎందుకు జరిగింది ఇలా...

    ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆమె ఆత్మశాంతి కోసం మౌనంగా నిలబడ్డాను. నర్స్ వచ్చి ఒక కవరు అందించింది, జూలీ నాకు ఇవ్వమన్నదని. మూసేసిన కవరు. దాని మీద 'టాడ్' అని వ్రాసివుంది.

    పైన నాకు వ్రాసిన ఒక చిన్న స్లిప్. దాని మీద 'టాడ్ నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని నాకు చెప్పాఉ. కానీ నేను వాడిని ఎప్పుడూ ప్రేమిస్తూనే వున్నాని నేను చెప్పాలి. అందుకే ఇది. థాంక్స్ డాక్టర్' అని వ్రాసి వుంది. పక్కనే ఒక గుండె బొమ్మ, దా క్రింద విత్ లవ్ అని వ్రాసి సంతకం చేసింది.

    అప్పుడే గదిలోకి చకచకా వచ్చాడు టాడ్. ఒక్క క్షణంలోనే అతనికి జరిగిందంతా అర్థమయిపోయింది. బావురుమన్నాడు. వెళ్ళి తల్లి నుదుటి మీదా, బుగ్గల మీదా ముద్దుపెట్టుకున్నాడు. అతనికి కళ్ళల్లఒ నీళ్ళు ఆగటం లేదు. అతని దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేశాను. నేనెవరో అర్థమయిపోయింది. లేచి నన్ను కావలించుకుని నా భుజం మీద తల పెట్టి ఏడుస్తున్నాడు. నా కోటు తడిసిపోయింది.

    'మా అమ్మని ఎంతో ప్రేమిస్తున్నానని చివరికి చెప్పలేకపోయాను' అన్నాడు.

    అతనికి జూలీ ఇచ్చిన కవరు అందించాను.

    దాంట్లోనించి ఒక కాగితం తీశాడు. అది చదివిన అతని కళ్ళు మెరిశాయి. ముఖంలో ఒక విధమైన తృప్తి. నాకు తెలుసు జూలీ ఏం వ్రాసి వుంటుందో. అందుకే అతని భుజం తట్టి బయటికి వచ్చాను.

    నర్స్ పేషంట్లు వ్రాసిన వాలెంటైన్ కార్డులు అందించింది.

    అక్కడ వాలంటైన్ రోజు సందర్భంగా కట్టిన బానర్ మీద వ్రాసినది నా దృష్టిని ఆకర్షించింది.

    'నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు, అలా అని చెప్పటం మాత్రం మరచిపోవద్దు' అని.

(స్వాతి సచిత్ర మాసపత్రిక ఆగష్టు 2009 సంచికలో ప్రచురితం)

Comments