శేషప్రశ్న - మేడా మస్తాన్‌రెడ్డి


    
పద్మ నుండి వచ్చిన ఉత్తరం చదివాక నా బుర్ర వేడెక్కిపోయింది. సత్యం వాళ్లమ్మ మీద చేయి చేసుకున్నాడట. ఈ సెల్ ఫోన్ల కాలంలో కూడా సరిహద్దులో కాపలా వున్న మా జవాన్ల క్షేమ సమాచారాలకు ఈ జాబులే ఆధారం.

    "సంక్రాంతి సెలవులకు మరోవారానికి నేను మా ఊరిలో వుంటాను. అప్పుడు చూపిస్తాను వాడికి ఈ ఆర్మీవాడి దెబ్బ!" అనుకుంటూ సెంట్రీ పోస్టులో ఉన్న డ్యూటీ సిపాయిని మార్చేందుకు బూట్లు తొడుక్కున్నాను. 

    చివరికి ప్రయాణం రోజు రానే వచ్చింది.

    రైలు ప్రయాణంలో నా ఎదురుగా ఒక స్త్రీమూర్తి ఏడాది పాపకు పాలిస్తూ తన నాలుగేళ్ల కొడుకు అల్లరిని భరిస్తోంది. సరిగ్గా పాతికేళ్ల క్రితం సత్యం కుటుంబం బతుకు తెరువు కోసం మా ఊరు వచ్చింది. అప్పుడు అంకురించిన మా స్నేహం అప్రతిహతంగా కొనసాగుతూ వుంది. మా వూరివారు చేసిన సాయంతో సత్యం అమ్మ రాఘవమ్మ ఒక గేదెను కొని పాలు అమ్ముతూ క్రమేపీ పాడిని పెంచింది. ఊరిచివర సొంత ఇల్లు కూడా కట్టింది. 

    ఆమెకు కొడుకు మీద ఎనలేని ప్రేమ. ఒకసారి, అయిదేళ్ల సత్యం గడ్డిలో ఆడుకుంటూ కెవ్వున కేకపెట్టాడు. పాలు పితుకుతున్న రాఘవమ్మ చెంగున లేచి వాడి వద్దకు వెళ్లింది. కందిన పాదం చూపుతూ గుక్క తిప్పకుండా ఏడ్చే కొడుకునే చూసింది. అంతే! ఉత్తరక్షణాన వాడిని భుజాన వేసుకుని మైలు దూరాన వున్న ధర్మాసుపత్రికి పరుగెట్టింది.

    బిడ్డను తేలుకుట్టిందని గుండెలు బాదుకుంటూ, రక్షించండని డాక్టరుకు పొర్లుదండాలు పెట్టింది. 'కుట్టింది తేలుకాదని, గండు చీమ' అని వైద్యుడు నిర్ధారించాకగానీ తన ఒంటి మీద లంగా, రవిక మాత్రమే ఉన్నాయన్న స్పృహ ఆమెకు కలుగలేదు. కట్టుకున్న చీర దారిలో ఎప్పుడు ఊడిపోయిందో ఆ 'అమ్మ'కు తెలియలేదు.

    అటువంటి 'తల్లి'ని ఈ దౌర్భాగ్యుడు ఎందుకు కొట్టవలసి వచ్చింది? వాడి నాన్న ఎండ్రిన్ తాగిపోయాక తానే తండ్రి కూడా అయి అపురూపంగా పెంచినందుకా? తన శక్తి మేరకు చదివించి ఘనంగా పెళ్లి చేసినందుకా? పెళ్లయిన రెండేళ్లకే ఆ అయోగ్యుడికి పెళ్లాం బెల్లమూ, తల్లి అల్లమూ అయిందా? అన్నీ ప్రశ్నలే. మాతృదేవతను కొట్టాడంటే వాడు నాకు స్నేహపాత్రుడు కాడు. ఒక నిర్ణయానికి వచ్చి బెర్తు మీద పడుకున్నాను. 

    చివరికి గమ్యస్థానం చేర్చింది రైలు. 

    లగేజీని ఇంట్లో వదిలి సత్యం ఇంటికి వెళ్లి, "అమ్మా" అని పిలిచాను. 

    నడివయసుకే మధుమేహంతో చూపు మందగించిన రాఘవమ్మకు ఏడాది నుండి పూర్తిగా కనబడటంలేదు. నన్ను పొదివి పట్టుకుని రోదిస్తుందనుకున్నాను. ఆశ్చర్యం! అనూహ్యం!

    నవ్వుతూ నా రెండు చేతులు పట్టుకుని ఒత్తుతూ "నాయనా! ఎప్పుడొచ్చావు? ఎప్పుడో ఏమిటి నా మొఖం? ఇప్పుడే వచ్చి వుంటావు. వచ్చాక నీ నేస్తాన్ని చూడకుండా క్షణం వుండలేవు కదా! ఈ రోజు ఆఫీసులో తనిఖీ ఉందని త్వరగా వెళ్లాడు. లక్ష్మి పక్కింటికి వెళ్లింది. కూర్చో" అంది. సత్యం తాలూకా కేంద్రంలో రెవెన్యూ క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. "ఎలా ఉన్నావమ్మా?" అడిగాను కుతూహలాన్ని అణచుకుంటూ.

    "నాకేం బాబూ! లక్ష్మి బంగారం లాంటి కోడలు. ఈ కబోదిని కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఉదయాన్నే బాత్‌రూంకి తీసుకెళ్తుంది. నా ఎంగిలి కంచం తనే తీస్తుంది. ఒకటేమిటి? సకల సేవలూ అందుకుంటూ మహరాణిలా వున్నాను" అంది. 

    ఆమె మాటల్లో నాకు దాపరికం కనిపించలేదు. "సరేనమ్మా! మళ్లీ వస్తాను!" అంటూ వెనుదిరిగాను. నా భార్య తప్పుగా లేఖ రాసిందా? మిత్రభేదం కలిగించాలనుకుందా?" అదే అడిగాను పద్మను. 

    "ఒట్టండీ!" అంది పద్మ నెత్తిపై చేయిపెట్టుకుని నిజాయితీగా.

    ఆ రాత్రి ఊరి చెరువు గట్టు సాక్షిగా మిలటరీ రమ్ము సీసా సగం ఖాళీ అయింది. కోపాన్ని దిగమింగుతూ విషయం కదిపాను.

    "నిజమేరా! కొట్టాల్సి వచ్చింది" అన్నాడు సత్యం.

    "అరచేతికి ఆ గాయం ఏమిటి?" అడిగాను.

    "ప్రాయశ్చిత్తం!" అన్నాడు అదే గద్గద స్వరంతో.

    "అర్థం కాలేదు!" మద్యం గ్లాసు కిందకు దించుతూ అన్నాను.

    "అయితే విను. నా భార్య గురించి నీకు తెలియని సంగతి ఒకటి చెప్పాలి. నేను ప్రేమిస్తున్న వారిని లక్ష్మి ద్వేషిస్తుంది. ద్వేషించిన వారిని ప్రేమిస్తుంది. ఆమెకున్న ఈ విచిత్రమైన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఏడాది పట్టింది. 

    మా అమ్మ నన్నూ చెల్లిని ఎలా పెంచిందో సాకిందో నీకు తెలియంది కాదు. అలాంటి అమ్మ నేను చూపిస్తున్న ప్రేమానురాగాలకు తాను ఉడికిపోయేది. నేను ఇంట్లో లేని సమయంలో అమ్మను ఈసడించడం, అనరాని మాటలు అనడం గ్రహించాను. చివరికి బుగ్గలు కూడా పొడవడం, నా అలికిడి విని సర్దుకోవడం గమనించాను. 

    'నిరాదరణకు గురవుతున్న అమ్మ ఆత్మాభిమానంతో నాన్నలాగే ఆత్మహత్య చేసుకుంటే?' ఆ ఊహే దుర్మార్గంగా అనిపించింది. అటు శరీరాన్ని ఇచ్చిన తల్లి, ఇటు శరీరాన్ని పంచి ఇస్తున్న పెళ్లాం. గుండెను రాయి చేసుకుని చిన్న చిట్కాను ప్రయోగించాను. అమ్మను నేను తిట్టడం మొదలుపెట్టాను. లక్ష్మి కరుణ చూపించసాగింది. 

    నా మనసు కుదుటపడింది. దృశ్యాన్ని మరింత పండించడానికి ఉత్తుత్తి కోపంతో ఒకరోజు గాల్లోకి చేయి విసిరాను. గుడ్డి తల్లి తల ముందుకు వంచింది. చెంప ఛెళ్లుమంది. నా గుండెకు చిల్లుపడినట్లయింది. వెంటనే కమ్మరి ఇంటికి వెళ్లి కాలుతున్న ఓ గునపాన్ని చేత్తో పట్టుకుని ఉపశమనం పొందాను. ఆ రోజు నుండి లక్ష్మి మా అమ్మను అత్తలా చూడడం లేదు. కన్నతల్లిలా ఆదరిస్తుంది" ఆగి మానుతున్న అరచేతి గాయాన్ని చూసుకున్నాడు సత్యం.

    నాకు మత్తు దిగింది. "అమ్మది అమృత హృదయం. నన్ను అపార్థం చేసుకోలేదు" సత్యం కన్నీళ్లు తుడుచుకున్నాడు.

    వాత్సల్యంతో వాడి అరచేతిని ముద్దుపెట్టుకుంటూ "మరి మీ ఆవిడ నన్ను అప్యాయంగా మర్యాద చేస్తుంది కదా!" అన్నాను. "నీ పరోక్షంలో నిన్ను ఆమె ఎదుట బండబూతులు తిడుతూంటాను కదా!" అని నవ్వేడు.

    నాకూ నవ్వాగలేదు. సీసా ఖాళీ అయింది. అయితే నన్ను మరో ప్రశ్న వేధించసాగింది. ఏడాది క్రితం మా అమ్మ ప్రమాదవశాత్తు నీట్లో పడి చనిపోయిందా? లేక ఇలాంటి కుటుంబ సమస్య మూలంగానే కావాలని దూకిందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు.

(శ్రీలక్ష్మి మాసపత్రిక ఏప్రిల్ 2012 సంచికలో ప్రచురితం)    
Comments