సెవెన్ సీటర్ - జంధ్యాల రఘుబాబు

  
     
ఓ ఊరు. దాని పేరు లద్దగిరి. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తికి  పన్నెండు కిలోమీటర్ల దూరముంటుంది. 

    అది లద్దగిరి బస్టాండు ప్రాంతం.  పేరుకు బస్టాండే కాని ఆటోలు, ఏస్‌లు, జీపులు ఇలా బస్సే కాక ఇతర వాహనాలు కూడా అక్కడే ఆగేది. అక్కడ టీ బంకులు, టిఫిన్ సెంటర్లు, సిగరెట్, పాన్  బంకులు ఇలా అన్నీ జనానికి సంబంధించినవే ఉంటాయి.  ఏ పనీ లేకున్నా అక్కడికొచ్చి ఓ టీ తాగి, బీడీనో సిగరెట్టో ముట్టించి వేరే వాళ్ళు కొన్న పేపర్ చదివి పోయినా ఓ గంట ఇట్టే లేచిపోతుంది. నిజంగా మానవుడికి  మనుషులు కావాలి. 

    కోడుమూరు వైపునుండి ఓ ముసలాయన ఓ అయిదారు కిలోమీటర్లు నడిచొస్తాడు. ఈ లద్దగిరి బస్ స్టాండులో ఆగుతాడు. పావుగంట, అర్ధగంట అయినా సరే బస్సు కోసం వేచి ఉంటాడు. సెవెన్ సీటర్, ఏస్ లాంటి వాహనమూ ఎక్కడు. తానెక్కకపోవటమే కాదు అక్కడి జనాలకి పిల్లలు కానీ, స్త్రీలు కానీ, యువకులు కానీ ఎవరికైనా సరే ఎక్కొద్దని చెబుతాటు. బస్సే ఎక్కమంటాడు. 

    ఓ రోజు ముసలాయన ముందు ఓ సెవెన్ సీటర్  వచ్చి ఆగింది. పక్కనున్న యువకులు ఎక్కుతున్నారు. ఈయన కొద్దిగా అసహనంగా చూస్తున్నాడు నిశ్శబ్దంగానే. సెవెన్ సీటర్ డ్రయివర్ "ఏం పెద్దయ్యా, దీంట్లో ఎక్కొద్దని చెప్పలేదా! లేక చెప్పినా వినలేదా? పెద్ద ఆర్టీసీ ఎండీ వచ్చినాడు. తానెక్కడు వేరేవాళ్ళని ఎక్కొద్దంటాడు"  అని మొహం మీదే అనేశాడు. దుమ్మూ పొగ అతని మీదికి వదుల్తూ వెళ్ళిపోయిందా వాహనం. 

    ముసలాయన అసలు ఏమీ జరగనట్టు, తనను ఎవ్వరూ ఏమీ అననట్టూ అలాగే నిలబడి తన ఎర్ర బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు.  ఇంక ఈయన ఓపికను పరీక్షించలేనంటూ ఎర్రబస్సు వచ్చి ఆగింది. తన 'నిజమైన ప్రయాణికుణ్ణి' ఎక్కించుకుని బయలుదేరింది. ఓ అయిదు కిలోమీటర్లు పోయిందో లేదో మళ్ళీ ఆగింది. అక్కడ బస్ స్టాపు కూడా లేదు. పదహైదు మంది దాకా ప్యాసింజర్లున్నారు. చూస్తే ముసలాయన్ను ఎగతాళి చేసిన సెవెన్ సీటర్ ద్రయివరుతో పాటు ప్రయాణికులు చిన్న ప్రమాదం నుండి బయట పడ్డారు. అతి వేగంలోనే ఓ వాహానానికి సైడివ్వబోయి రోడ్డు దిగిన సెవెన్‌సీటర్  దాని డ్రయివర్ చిన్న గుంతను చూసుకోకపోవటం వల్ల రెండు పల్టీలు కొట్టి అదృష్టవశాత్తూ పక్కన పొలంలోకి పడిపోయింది. దాని ఆక్సిల్ విరిగి పోయింది. అందులో కూచున్నవారు చిన్న గాయాలతో తప్పించుకున్నా ఒకరిద్దరికి చెయ్యీ కాలు విరిగినట్టె అనుమానంగా ఉంది. వాటిని పరీక్షిద్దామని ముట్టుకుంటేనే నొప్పితో అరుస్తున్నారు. వారంతా ఎర్రబస్సు ఎక్కారు. ముసలాయన్ని చూసి నవ్వినవారంతా ఆయన ముందు కూచోలేక వెనక్కు పోయి కూచున్నారు ఆటో ద్రయివరుతో సహా.  

    ఓ రోజు సెవెన్ సీటర్ డ్రయివరొకడు "ఏం ముసలోడా, నీకు పనీ పాటా లేదా! వూరి జనాలందరికి , ఆటో ఎక్కొద్దు, ఏస్ ఎక్కొద్దు అని చెబుతున్నావట. ఏంది కథ, వారికి ఒక రూపాయ మిగిలితే నీ సొమ్మేమన్నా పోతుందా?  మా కడుపులు కొట్టొద్దు. ఇదే ఆటో నీకొడుకైతే ఇలాగే చెబుతావా"  అనేశాడు. మౌనమే సమాధానం.  కళ్ళు కొద్దిగా చమరించినాయి అందరి ముందు అనేసరికి. మవునంగానే తన ఎర్రబస్సులో ఎక్కి కూచున్నాడు మామూలుగా.

    రోజూ బస్సులో వచ్చే టీచర్ సురేష్ ముసలాయన్ని కదిలించాడు

    "ఏం పెద్దయ్యా, వాళ్ళేం అంటున్నా మవునంగానె ఉంటావు. సమాధానం చెప్పవు. రోజూ బస్సులో వస్తున్నందుకు నీవంటే నాకు అభిమానం. ఇంతకీ బస్సే ఎందుకు ఎక్కుతావు. ఆటో ఎక్కవు, వేరేవాళ్ళనూ వద్దంటావు. ఏమీ అనుకోకపోతేనే చెప్పు. బలవంతమేం లేదు." 

    ఈ ప్రశ్న వినేసరికి పెద్దాయన కళ్ళు చెమరించాయి. సెల్లాతో కళ్ళు తుడుచుకుని చెప్పటం మొదలెట్టాడు

    "నేను పెద్దగా సదూకోలేదు బాబు. చిన్నప్పుడు మా నాన్న ఆరో తరగతికే మానిపించి పొలం పనిలోకి తీసుకుపోయినాడు. నాకేమో పక్కూర్లో ఉన్న హై స్కూల్ లో సదవాలని పెద్ద కోరిక. అప్పుడు పెద్ద బడి అనేవారు దాన్ని. సరే నా బిడ్డల్నన్నా బాగా సదివించాలనుకున్నా చిన్నప్పుడే. నాకు ఒక్కడే కొడుకు. బాగా సదివే వాడు. ఏమైందో ఏమో పదో తరగతి పాసై ఇంటర్లో చేరాక స్నేహితులు, తిరుగుళ్ళు శానా ఎక్కువైనాయి. బాగా సదూకోరా అని వాళ్ళమ్మ రోజూ చెప్పేది. వినలేదు. ఆరు నెల్లకే కాలేజీ మానేశాడు. ఏదైనా వ్యాపారం పెడతానన్నాడు. వద్దన్నాము.

    చెప్పకూడదుగానీ, మా పిల్లోడు శానా మంచోడు సార్. టయం వేస్టు చేయకూడదు, నాకు సాయంగా  ఉంటుందని ఆటో నేర్చుకున్నాడు. నాకు తెలియకుండా  బాడుగ ఆటో నడిపి డబ్బులు తెచ్చి ఇచ్చాడు.   సరేనని పొలం తనకా పెట్టి బ్యాంకులో అప్పుచేసి స్టీరింగ్ ఆటో కొనిచ్చాను. ఆటో లో ఏడెనిమిది మందిని మించి ఎక్కించుకునేటోడు కాదు. ఒకరోజు ఖాళీగా ఆటోలో పోతున్నాడు. ఎదురుగా ట్రాక్టరు, దాన్ని దాటాలని ఇంకో సెవెన్ సీటరు ఫుల్లు జనాల్తో దాటబోయినాడు.  వాడేమో సైడివ్వడు, మా వాడి ఆటో మీదికి రాబోయినాడు. సూసి సూసి దాన్ని గుద్దలేక మావోడు సైడుకున్న గుంతలోకి ఆటో పోనిచ్చినాడు. అంతే పల్టీ కొట్టి స్టీరింగు సీటు మధ్యలో ఇరుక్కుని అక్కడికక్కడే పానాలు ఒదిలినాడు. ఆటోకొ కొట్టింటే బతికేటోడేమో, వాళ్ళకి పెమాదమేమో అని గుంతలోకి దించిండు. అందరూ మా వాడిని శానా పొగిడినారు కాని పానం పోయినాది. వాడి తల్లి కొన్నిరోజులు పిచ్చిదై పోయింది. అందుకే బాబూ అందరికీ ఆటో ఎక్కొద్దని సెప్పేది" సెల్లాతో కళ్ళు తుడుచుకుంటూ చెప్పినాడు పెద్దాయన.

    టీచర్ సురేష్ తో పాటు అందరి కళ్ళలోనూ నీళ్ళు. పెద్దాయనను దగ్గరకు తీసుకుని తల నిమరటం తప్ప ఏమీ చేయలేకపోయాడు సురేష్ కూడా.

(సాహిత్య ప్రస్థానం నవంబరు 2014 సంచికలో ప్రచురితం)

Comments