సిన్సియారిటీ - మంత్రవాది మహేశ్వర్

    
కృష్ణమూర్తి మంచి సిన్సియర్ వర్కర్.

    ప్రభుత్వ కార్యాలయాలలో అంత సిన్సియారిటీ బహుశా ఎవరికీ వుండదన్నా ఆశ్చర్యం లేదు.

    - పని మీద ఎంత శ్రద్ధ చూపిస్తాడో అంత ఖచ్చితం. దాంతో కొన్ని సమస్యలూ ఎదుర్కోవలసి వచ్చేది ఆఫీసులో.

    - శలవు ఎంతో అవసరమైతేనే కానీ పెట్టడు. ఎన్నోసార్లు ఎర్న్‌డ్ లీవ్ లాప్స్ అయిపోవడం కూడా జరిగింది.

    - అబద్ధమాడడు.

    - చాడీలు చెప్పడు.

    - లంచం పుచ్చుకోడు.

    - ఆఫీసులో నిద్రపోడు.

    - కాకా పట్టడు. - ఇలాంటి గుణాలుండబట్టే పదిహేనేళ్ళ నుంచి గుమాస్తా స్థాయి నుంచి ఎదగలేక పోయావు అన్నారు కొందరు. దానికి తను ఒప్పుకోలేదు. 

    చదివిన ఎం.ఏ. మేథమేటిక్స్, థియేటర్ అర్ట్స్ డిప్లొమో, సంగీత పరిజ్ఞానం ఏమీ పెద్దగా ఉపయోగపడలేదు. అందుకు మూర్తి బాధపడనేలేదు.

    చాలామంది ఆఫీసర్లు మారారు. అందరితో అన్నివేళలూ ఫర్‌గా వుండకపోయినా, వారిచేతే కొన్ని సార్లు పొగడబడ్డాడు కూడా.

    కృష్ణమూర్తి పన్జేసే ఆఫీసుకి కొత్త ఆఫీసర్ ఆంజనేయుల్ని వేశారు.

    కృష్ణమూర్తి 'ఖచ్చితం' - ఆయనకి, ఆఫీసరుకి 'అభిప్రాయభేదం' తీసుకొచ్చింది.

    ఇతగాడు 'యస్' అన్న కొన్నింటికి అతను 'నో' అనేవాడు. వర్క్ డిలే అయ్యేది.

    దాంతో కృష్ణమూర్తి రూల్ నోట్ చేసేవాడు.దాంతో ఆఫీసర్ 'అగ్గిరాముడు' అయ్యేవాడు. మొత్తానికి కృష్ణమూర్తి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ పాడుచేస్తానని బెదిరించాడు ఒకసారి.

    "మీ యిష్టం... నేను ఏ తప్పు చెయ్యలేదు. రూల్స్‌కి వ్యతిరేకంగా నేనేపనీ చేయను. మరొకరితో చేయించుకోమనడమే మీకు నచ్చకపోతే అదే నా యారోగెన్సీ అయితే దానికే మీరు సి.ఆర్ పాడుచేయదల్చుకుంటే చేసుకోండి. దానివల్ల నాకొచ్చే ప్రమోషన్ ఆగిపోదు. ఇంత వరకూ సి.ఆర్ లో ఏ మచ్చా లేదు. ఒకవేళ మీ చేతితో రెడ్ మార్క్ పడితే నా సిన్సియారిటీని ఒక రకంగా చంపి యారోగెంట్‌గా నన్ను మార్చిన ఘనత మీకే దక్కుతుంది. కానీ... నో అదీ దక్కనివ్వను. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. మీరు పెట్టే రెడ్‌మార్క్ వల్ల నా సిన్సియారిటీని పొగొట్టుకొని ప్రభుత్వాన్ని మోసం చేయలేను. మీ యిష్టం" అని చెప్పేసి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి.

    ఆఫీసర్ ఆంజనేయులు తీవ్రంగా ఆలోచించాడు. సి.ఆర్. పాడుచేయడానికి ఎక్కడా అవకాశం కనిపించలేదు నిజానికి.

    ఆఫీసర్ ఏంచేయలేడు అనే ఆత్మస్థైర్యం కృష్ణమూర్తిలో వుంది. ఏ తప్పూ చేయనివాడిని ఆ భగవంతుడు ఆదుకుంటాడనే దైవభక్తి వుంది.

    వారం గడిచింది.

    కృష్ణమూర్తిని హైదరాబాదు నుంచి అనంతపురంకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ఆర్డర్స్ టైపయ్యాయి. దానికి ఆంజనేయులు ప్రయోగించిన ట్రిక్కు - 

    - కృష్ణమూర్తి సి.ఆర్. పాడుచేయడానికి ఎక్కడా వీల్లేదు. ప్రతీ ఆఫీసర్ ఎక్సలెంట్ రిపోర్ట్స్ యిచ్చారు. తప్పంటూ పట్టుంటే అతని వర్క్‌లోనే పట్టుకోవాలి. అది ఎలాగూ కుదరదు. పోనీ మిస్టేక్ కావాలని కలిపిద్దంటే చేయడు. నాలుగు దులిపేసి మరీ పోతాడు. ఎలాగా - పోనీ పూర్‌ఫెలో అని వదిలేస్తే... నో - నో.

    - ఆ రోజున తను అన్నమాటకు అర్హ్తం లేదని ఆంజనేయులకి తెలుసు. అయినప్పటికీ మరో యిద్దరి ముందర అతనన్న ధోరణి హర్ట్ చేసింది. ఆ కోపం పోలేదు. కృష్ణమూర్తి అన్నది రైటా కాదా అన్నది కాదు పాయింటు. తను ఫీలవ్వడం...

    ఆంజనేయులికి తనపై పై ఆఫీసర్లకి ఎలాంటి ఇంప్రెషన్ వుందో తెలుసు.

    - పోస్ట్ వేయించడానికి లంచం తీసుకున్న సంగతి.

    -బాటిలిచ్చి పనులు చేయించుకునే పెద్దలతో వున్న పరిచయాల సంగతి.

    -ఒకసారి కొత్తగా చేరిన స్టెనోని ఆఫీసవర్స్ తరువాత బలవంతం చేయబోయిన సంగతి.

    -ఆఫీసు వాహనాలని ఫామిలీ కోసం వాడుకుంటున్న సంగతి... ఇన్నీ తెలిసినా సరియైన ఆధారాల్లేక, అధికారి కావడం చేత వెలుగులోకి రాలేదు... ఉద్యోగం ఊడలేదు. 

    -ఇటువంటి బ్యాక్‌గ్రౌండ్ వున్న తను ఏదైనా రెడ్‌మార్క్ వసినా నిలబడుతుందన్న నమ్మకం లేకపోవడంతో ఇలా వ్రాసాడు.

    కృష్ణమూర్తి లాంటి వర్కర్‌ని యింతవరకూ చూడలేదని, అతని సిన్సియారిటీ అందర్లోనూ వుంటే ఆఫీసుల్లో వర్క్ పెండింగ్ అన్న కొశ్చనే లేదని (అదని ఇదని ఆకాశానికి ఎత్తేసి) అనంతపురంలో కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టు వర్క్‌కి కృష్ణమూర్తి లాంటి వారి అవసరం వుంది కనుక అక్కడికి బదిలీ చేయవలసిందిగా పై అధికార్లకి వ్రాసాడు.

    -తప్పించుకోడానికి ఏ మంత్రి గారికీ చుట్టం కాదు.

    - మనసుల్ని మార్చే ఆర్థిక స్థోమత తనకి లేదు.

    - తనమీద కక్షతో 'అధికారం' ఈ పని చేసిందని న్యాయం కోరితే ఫలితం వుండడానికి తను వెనుకబడ్డ తరగతివాడూ కాదు.

    ట్రాన్స్‌ఫర్లే జరగని డిపార్టుమెంటులో సిన్సియారిటీకి 'అధికారం' చేసిన సన్మానమనుకున్నాడు కృష్ణమూర్తి.

    టైప్ అయిన ఆర్డర్స్ ఆరోజే యివ్వలేదెందుకో...   

*  *  *

    ప్యూన్ వచ్చి "మూర్తిసాబ్! మిమ్మల్ని ఆఫీసరుగారు రమ్మంటున్నారు" అనగానే లేచి ఆఫీసరు గదివైపు నడిచాడు.

    చూచాయగా తెలిసిన స్టాఫ్ చాలా ఫీలయ్యారు.

    నాలుగు జాలి కబుర్లూ, మూడు గాలి కబుర్లూ చెబుతూ కాగితం చేతికిచ్చాడు.

    తప్పంతా పైవాడిదంటూ తప్పించుకున్నాడు ఆంజనేయులు. 

    అందుకు కృష్ణమూర్తి ఒక చిరునవ్వు నవ్వాడు. ప్యూన్‌ని పిలిచి కాఫీ ఆర్డర్ చేసాడు. 

    'కొశ్చన్ మార్క్' ఆఫీసరు ముఖంలో యిరుక్కుపోయి ఉండగానే చెప్పాడు కృష్ణమూర్తి.

    "థాంక్సండీ! ఇందాక పైవాడు అన్నారు చూశారు! ఆపై... పైవాడు యింకా మంచివాడండి. బహుశా అతనే యితనికి 'రికమెండ్' చేసుంటాడు. అయినా నేనెక్కడ పని చేయడానికైనా సిద్ధమే అండమాన్‌లో పడేసినా ఆనందంగా పనిచేయగలను. మరో గుడ్‌న్యూస్ ఏమిటంటే అనంతపురం ఇంజినీరింగ్ కాలేజీలో మా అబ్బాయికి సీటొచ్చినట్లు నిన్ననే కమ్యూనికేషన్ వచ్చింది. కాబట్టి అబ్బాయి ఏ హాస్టల్‌లోనూ వుండి ఇబ్బంది పడకుండా హాయిగా మా దగ్గరే వుండి చదువుకుంటాడు. ఏమంటారు?"

    ఏమనలేదు... కాదు ఏమనలేకపోయాడు ఆఫీసర్.

    "తీసుకోండి సార్. కాఫీ చల్లారిపోతుంది..." అని చెప్పి బయటికొచ్చేసాడు. చాలాసేపటిదాకా కోలుకోలేదు ఆఫీసర్.

(ఆంధ్ర సచిత్ర వారపత్రిక 19 ఏప్రిల్ 1985 సంచికలో ప్రచురితం)            
Comments