శిశిరానికి చోటీయకు - స్వాతికుమారి బండ్లమూడి

  
 
ఇంత చిన్న జీవితానికి అంతలేసి వేదనలెందుకిస్తావు స్వామీ! పంచుకునే హృదయమేమో అనంతమైన సంశయాల ఆవల, ఇక ఈ బరువంతా అక్షరాలపైకి దింపుకోవాల్సిందే. తనువు కృశించి, మనసు దహించి.. రేపటిపై ఆశ నశించి… ఒక్క క్షణం, ఈ నిరంతరాయ నిర్వేదం నుండి విడిపడి, ఒక్క తేలికపాటి క్షణం నా అస్తిత్వమంతా తుళ్ళిపడేంతగా నవ్వే అదృష్టం ఎప్పటికి?

    కొన్ని సంభాషణల్ని రికార్డ్ చెయ్యసర్లేదు, రాసి పెట్టుకోనవసర్లేదు . అతన్తో మాట్లాడిన ప్రతి మాటా అచ్చుతప్పులతో సహా గుర్తుంటాయి.

    బాగా గిలకొట్టి మూత తీయగానే సీసా లోని ద్రవం బుస్సున పొంగినట్టు అణిచి పెట్టిన ఆక్రోశమంతా ఏకాంతం దొరగ్గానే ఎగదన్నుకొస్తుంది.

* * *

    ’ఏమిటింకా ఉన్నావ్?’ మాములు పలకరింపులా అనిపించటానికి గొంతుని ఎంత మోడ్యులేట్ చేసుకున్నా ’థాంక్స్, నాకోసమింతసేపున్నావ్’ అనే కృతజ్ఞత దాగలేదు.

    చాలా ఫార్మల్ గా నవ్వి ’కొంచం పనుంది’ అన్నాను. దారుణమైన అబద్ధం, మధ్యాహ్నం నుంచి ఖాళీ గానే ఉన్నాను. ఆ విషయం తనకి తెలుసు. ’మరి నువ్వు?’ ఏం చెబుతాడో చూద్దామని.. .

    ’ఏం లేదు. లాస్ట్ డే కదా. డెస్క్ లో ఉన్న నా వస్తువులన్నీ తీసి సర్దుకుంటున్నాను.’

    ’హ్మ్మ్!కాఫీ?’ చివరిసారి నాతో కలిసి కాసేపు కూర్చోవూ అనే అభ్యర్ధన ని చాలా కాజువల్ గా మార్చాను.

    ’ తప్పకుండా, పద వెళ్దాం.’ నిన్ననే ఖాళీ అయిన టేబుల్ అరలని ఇప్పుడే సర్దటం పూర్తయినట్టు నిట్టూర్చి లోపలకి తోశాడు.

    ఆఫీస్ కాఫెటీరియా లో కూర్చున్నాం. ఆ చుట్టు పక్కలంతా సాయంత్రం షిఫ్ట్ జనాల భోజనం బాక్సులు, అక్కడక్కడా టేబుళ్ల మీద తాగి వదిలేసిన పేపర్ టీ కప్ లు. డ్యూటీ అయిపోయి బయల్దేరిన హౌస్ కీపింగ్ స్టాఫ్ యూనిఫామ్ లేకుండా చూస్తే కొత్త మనుషుల్లా ఉన్నారు. ఇందాకట్లాగా ’ఈ టేబుల్ కొంచం తుడువు బాబూ’ అని చెప్పాలంటే ఇప్పుడు అధికారం లేనట్టు అనిపిస్తుంది. అప్పుడే డ్యూటీ లోకి వచ్చి ఎర్రటి డ్రెస్ వేసుకున్న కొత్త అబ్బాయి ఎందుకో పొగలు కక్కుతున్న టీ కప్ లా అనిపించాడు.

    ’సో. ఏమంటున్నాడు జిడ్డు కృష్ణ మూర్తి?’ టేబుల్ మీద వేళ్లతో గీస్తూ మాటలు మొదలెట్టాడు.

    నిన్ను నువ్వు అర్ధం చేసుకోవటానికి ఇతురులతో నీకున్న సంబంధాలే ఆధారం.  ఆఫ్టరాల్, సమాజమంటే నీలాంటి నువ్వు లు నాలాంటి నేను లు కొందరి మధ్య ఉండే సమీకరణాలే కదా. నీ అభిప్రాయం తో నిమిత్తం లేకుండా సమస్య ని యాధాతధం గా చూడగలిగితేనే గమనం.

    ’ఏముంది! క్రియేటివిటీ, రియాలిటీ, క్రియేటివ్ రియాలిటీ. సృజన కి పరిపూర్ణత, గమ్యమూ లేదట, నిశ్శబ్ధం లాగానే.’

    పక్క టేబుల్ మీద ఇద్దరమ్మాయిలు ట్రైనింగ్ విశేషాలు ఉత్సాహం గా మధ్యల్లో పెద్దగా నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారు. బహుశా, కొత్తగా ఉద్యోగం లో చేరినట్టున్నారు.

    “మరి మన జనం ఏమంటున్నారు నా గురించి?”

    నిక్షేపం లాంటి ఉద్యోగం వదిలేసి బొమ్మలేసుకుంటాను అంటే కామన్ సెన్స్ ఉన్నవాళ్ళెవరైనా ఏమంటారు? వెర్రి అంటారు, కొంచం మొహమాటముంటే ’ఆల్ ద బెస్ట్’ అంటారు.

    “కొందరు నమ్మట్లేదు. ఏదో ఆఫర్ ని దాచి ఇలా చెప్పావని వాళ్ల అనుమానం.”

    “ఊ!! అనుకోనిద్దాం. అవునింతకీ నాకిచ్చిన గిఫ్ట్ నువ్వేనా సెలెక్ట్ చేసింది. అది చూసి తెగ నవ్వుకున్నా.”

    ఒక్క క్షణం చివుక్కుమనిపించింది. ఆ బహుమతి ఒక పెయింటింగ్. దాదాపు నిర్మానుష్యం గా ఉన్న రైల్వే స్టేషన్ లో బెంచ్ మీద ఒంటరిగా పుస్తకం చదువుకుంటూ ఓ కుర్రాడు, ఆ ప్లాట్ఫామ్ కి ఒక వైపు నుండి మరోవైపు కి గొలుసు ఆకారం లో ఒంపు తిరిగిన ట్రాక్. చాలా ముచ్చటగా అనిపించింది. కానీ ఇంతలా నవ్వుతాడనుకోలేదు.

    “నీకు నచ్చుతుందనుకున్నా. టైం లేక ఈ దగ్గర్లో ఉన్న చిన్న షాప్ లో కొన్నాం.” ఛ, సంజాయిషీ కూడా ఇవ్వాల్సొచ్చింది.

    “నవ్వితే నచ్చనట్టేనా? కొనేప్పుడు దాని కింద సంతకం చూడలేదా! పోయిన వారమే పూర్తి చేసి అక్కడిచ్చా.కొత్త స్టోర్ కదా డబ్బులివ్వలేదింకా. ఇవ్వాళెళ్ళి తెచ్చుకోవాలి”

    “ఓహ్! నిజమా. ఇంకా నా టేస్ట్ ని ఎగతాళి చేస్తున్నావని ఫీలైపోయా” చిన్నగా నవ్వేశా.

    “ఏమిటి, ఫేర్వెల్ మీటింగా?” ఓ కొలీగ్ అటుగా వెళ్తూ పలకరించాడు. కొందరి వెటకారం లో మాటల శాతం కనిపెట్టడం కష్టమే.ఇట్నుంచి యే సమాధానం లేకపోయినా ధారాళం గా అనుచిత సలహాలిస్తూ కాసేపక్కడే కూర్చున్నాడు. ఏ మాత్రం చనువు లేకపోయినా మరొకరి వ్యక్తిగత నిర్ణయాలపై చాలా అధికారం తో మాట్లాడెయ్యడం కొందరికలవాటు. ఇదెదో ముదిరే ముందే ముగించాలని ఏదో అనబోయేంతలో అవతలివైపు నుండొచ్చింది సమాధానం క్లుప్తం గా  “థాంక్స్” అని. వెళ్ళిపొమ్మనే హెచ్చరిక అర్ధమైందనుకుంటా ’సరే మరి. నా షిఫ్ట్ మొదలౌతుంది, వస్తా’ అంటూ నిష్క్రమించాడు

    కొన్ని సందర్భాలు చాలా చిరాకెత్తిస్తాయి. బయటికి రాలేని అసహనం అన్ని వైపుల్నించీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంతా సవ్యం గా ఉన్నప్పుడు ఎవరో వచ్చి కనీసం మాట్లాడుకోలేనంత ఇబ్బందిని మన మధ్య పెట్టేసి జారుకుంటారు. నాకే ఇలా ఉంటే ఇంతసేపూ ఒక ఉపన్యాసానికి సబ్జెక్ట్ గా మారిన తన పరిస్థితి ఊహించుకోవాలి. లేత ఎరుపు లోకి మారిన ఆ చేతి వేళ్ళు చూడగానే  టేబిల్ మీద స్క్రిబ్లింగ్ పాడ్, పెన్సిల్ ఆ వైపు కి నెట్టి అరచేత్తో కప్ తిప్పుతూ కూర్చున్నాను. చేదెక్కిన నాలుక మీద చల్లారిన కాఫీ రుచి ఉప్పగా తగిలింది. ఆ ఉప్పదనపు పుట్టిళ్ళను దాయడానికి టిష్యూ పేపర్ తీసుకుని కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ నిల్చున్నాను. పుష్య మాసపు  చలి గాలులు తెరచిన అద్దాల్లోంచి తడి చెక్కిళ్ళను ఆరబెడుతున్నాయి. దూరం గా కొండరాళ్ళకవతల దీపాల కొలువులా చిన్న బస్తీ, మధ్యలోంచి కొన్ని క్షణాలు లయబద్ధం గా సాగుతూ లోకల్ ట్రైన్. కంపార్ట్మెంట్ డోర్ లో పక్కపక్కన నిల్చుని ఒకేసారి ప్రకృతి ని ప్రేమించటం,  పరిగెడుతున్న చెట్ల ని చూస్తూ హృదయం లోంచి తొణికిన పారవశ్యాన్ని పంచుకోవటం, చుట్టుముట్టిన మనుషుల సొదలో, రొద లో సైతం ఏకాంతాన్ని జంటగా అనుభూతించడం.. మళ్ళీ మళ్ళీ దొరకదా! ఈ జీవితానికింతేనా?

    నిముషాలుగా పిలవబడే కొన్ని ఆవేదనల నిశ్శబ్ధం తర్వాత ఊహించకుండా వచ్చిందా ప్రశ్న “కెన్ యు వెయిట్ ఫర్ మీ?”

    “వ్వాట్?” నిజం గానే అర్ధం కాలేదు నాకు.

    “ఏం లేదు. ఫేర్వెల్ మెయిల్ రాసేసొస్తాను.”

    ట్రాక్ కి ఇవతలి వైపు కొలిమి లో కొడవళ్ళు కాలుతున్నాయి, పైగా సుత్తి దెబ్బలేమో!

    “సరే బయట గేట్ దగ్గరుంటాను, వచ్చెయ్.” ఎదురుగా కూర్చుని మరికాసేపు నీ మొహం చూసే ధైర్యం లేదు నాకు.  స్క్రిబ్లింగ్ పాడ్ మీద గీస్తున్నది పూర్తి చేసి నా చేతికిచ్చి నేను ఆశ్చర్యం గా చూస్తుండగానే వర్క్ స్టేషన్ దగ్గరికెళిపోయాడు.

    సెక్యూరిటీ రిజిస్టర్ లో సంతకం బరికి లిఫ్ట్ దగ్గర హౌస్ ఫుల్ కోలాహలం లో ఇమిడే మూడ్ లేక మెల్లగా మెట్లు దిగి గేట్ దగ్గర కి నడిచాను. సిటీ అంతా మెల్లగా స్వెట్టర్ల లోకి దూరుతుంది. కాంపౌండ్ గోడ పక్కన  పానీ పూరీల బండి పొగలు కక్కుతుంది. కుతూహలం ఆగక కాగితాలు తిప్పి చూస్తే….వావ్! అనుమానం లేదు, కంటి కింద పుట్టుమచ్చతో, కాఫీ కప్ చేతిలో తిప్పుతూ ఉన్న అది నా బొమ్మే, సంతకానికి పైన ఉర్దూలా కనిపించే తెలుగు రాతలో ’నేను చెయ్యవల్సిన పని నాకన్నా ముందు నీకు తెలియటం .. వింతగా లేదూ?’ టప్ మన్న శబ్దం లేకుండానే ఆ కింద సంతకం తడిచి అలుక్కుపోయింది.

    “అయింది. నీ బస్టాప్ ఇక్కడేగా, జాగ్రత్త, నేనెళ్ళొస్తా” ఇదే ఆఖరు సారని తెలిసినా రేపు కలవబోతున్నంత మాములుగా ఎలా మాట్లాడతావ్?

    “సరే! కీప్ ఇన్ టచ్” నేను మాత్రమెందుకు తగ్గడం.
   
     
   
     
  
    “ఒక మాట”
    
    
    
    “నాకోసం ఎదురు చూస్తావా?”

    “ఊ?? కమ్ ఎగైన్” ఈసారి నిజంగా అర్ధమయ్యి కూడా అడిగాను.

    “బహుశా కొన్ని నెలల పట్టొచ్చు, లేకపోతే ఒకట్రొండు సంవత్సరాలు. నా నమ్మకాన్ని .. కనీసం నా మూర్ఖత్వాన్ని ప్రూవ్ చేసుకోవటానికి, అప్పటిదాకా ?”

    కరిగేవరకూ ఎవరికీ తెలీదు హిమనగం లో కూడా నీరే ఉందని. ఆ కళ్ళద్దాల వెనక ఎర్రటి జీర చాలు లోలోపలి మధనాన్ని బయటపెట్టడానికి.

    “తప్పకుండా! నీ కోసం కాదు నా కోసం” ఇక దాచటమెందుకు? రెప్పల చాటున నీలోత్పలాల్ని నీళ్ళాడనివ్వచ్చు.

    పానీ పూరీ బండి మీద పెద్ద శబ్దం తో ఏదో మసాలా పాట వినిపిస్తుంది.

    గజిబిజి వాహనాలు, మతిలేని వేగాల మధ్యలో రోడ్డు దాటుతూ అతను, వెనక్కి తిరిగి చూసే అవకాశం లేకుండా. పైన అసందర్భం గా మొహమంతా మసి పూసుకున్నట్టు ఆకాశం..

    అహ! కాదు.

    నల్లగా మసకేస్తేనూ.. మబ్బుతునకనుకున్నా,

    సన్నగా కరిపోతుంటే.. నిన్నటి అమావాస్య చెదిరిన మెరుపు మరకని చూస్తున్నా,

    సంజెగాలి అటు మెసలి గగనపు కాన్వాస్ మీద రంగులన్నీ ఒలకబోసుకుంటే గానీ తెలీలేదు.

    భాస్కరా!

    నువ్వెళుతున్నా వస్తున్నా

    వర్ణార్ణవమేనని!!

* * *

Comments