శివా, ఎక్కడున్నావు? - పెయ్యేటి రంగారావు

        వలిమలపైన - సొగసుగ చెలగే

        బేసి కన్నుల - దొర, నా దొరా

        కలియుగ బాధల - కుములుచు వేగే

        నాదు వినతుల - వినవా నా దొరా ǁ

 

        పగలంత కూటికై ఆరాటము

        రేయేమొ కోరికల చెలగాటము

        నిముసమ్ము నిను కొలవ నిలుకడలేదు

        నిఖిలేశ - నీ దయకు యోగ్యత లేదుǁ

 

        ఎడద సవ్వడులు - ప్రతి వక ఘడియ

        మృత్యు యాత్రలో - పదధ్వనులాయెను

        తొండపు వేలుపు తండ్రీ, నీ దయ కలుగక

        బ్రతుకే గండ మాయెనుǁ

 

        స్మరణము తోడనె తరణ మిడుదువని

        హర హర యనగనె - భవభయహరమని

        నిను ధ్యానింతును - శివమ్, శంకరమ్

        త్వమేవ శరణమ్ - మమ దేహి అభయమ్ǁ


    శివయ్య కన్నుల నించి అశ్రువులు ప్రసవిస్తున్నాయి.


    ఈశ్వరుడిని తలుచుకుంటేనే అతడి శరీరంలో అలౌకికమైన పులకరింత!


    మనస్సులో అతీంద్రియమైన తాదాత్మ్యత. 


    శివయ్య వంటవాడు. 


    అది అతడికి వంశపారంపర్యంగా అబ్బిన విద్య.


    పారంపర్యంగా వస్తున్న ఈ సంప్రదాయానికి అడ్డుకట్ట వేద్దామని అతడి తల్లి ప్రయత్నించినా, అతడి తండ్రి మాత్రం పొసగనివ్వలేదు. తనకి తోడుగా ఉంటాడని, బాల్యంలోనే శివయ్యని కూడా తనతో వంటపనులలోకి తీసుకు పోతుండేవాడు అతని తండ్రి.


    అటువంటి శివయ్య బాల్య, కౌమారావస్థలు దాటి యవ్వనంలోకి అడుగు పెట్టేసరికి అతడికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించి, అతడి తల్లిదండ్రులు శివ సాయుజ్యాన్ని పొందారు. 


    తాను దూర కంత లేనప్పుడు మెడకో డోలు వద్దనుకుని బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు శివయ్య.


    శివయ్యకి జీవితంలో ఒకే ఒక్క కోరిక ఉంది.


    అది దినదిన ప్రవర్థమానమవుతూ వచ్చి అతడి మనసునంతా సంపూర్ణంగా ఆక్రమించుకుని అతడి నిద్రని మనశ్శాంతిని హరించివేసి పీడించసాగింది.


    అతడికున్న కోరిక -


    కాటికి పోయే ముందు ఒక్కసారన్నా కాశీకి పోయి, ఆ తల్లి గంగమ్మ ఒడిలో సేదదీరి, ఆ తండ్రి విశ్వేశ్వరయ్యను తనివితీరా దర్శించుకోవాలని!


    అయితే శివయ్యకి తన కోరిక తీరే మార్గం మాత్రం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించటంలేదు.


    కారణం?


    అతడి అంతంత మాత్రపు సంపాదన అతడి జీవితాన్ని ఎదుగూ బొదుగూ లేకుండా సాగించడానికి మాత్రం సరిపోతోంది. ఎంతో పట్టుదలగా నాలుగు పరకలు నిలవచేయగలిగినా, ఆ మరుక్షణాన్నో, మర్నాడో ఆ పరకలని అధిక ధరలనే గోముఖ వ్యాఘ్రం నమిలేసి పోయేది!


    కాశీకి వెళ్లి వచ్చిన వాళ్లు కాశీతాడు తెచ్చి శివయ్యకిస్తే అతడికి పండగలాగే అనిపిస్తుంది. సాక్షాత్తూ ఆ విశ్వేశ్వరుడే అవధరించి తనని ఆశీర్వదించాడన్నట్లు భక్తి ప్రపత్తులతో పులకరించి పోయేవాడు. కాశి నించి వచ్చిన తాటికే తనలో అంత పరవశం కలుగుతోంటే, సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోగలిగితే - అబ్బో, ఇంక తన జీవితానికి పరమార్థం లభించినట్లే అనిపించేది శివయ్యకి.


    'ఈ గుండె పిలుపు, ఓ వేలుపూ!

    నీ కందేనా, లేక,  ఈ జీవి చరితము

    ఇలవేలుపూ! ఇక ముగిసేనా?

    ఈ గుండె పిలుపు నీకందేనాll

    

    బిల్వదళముల సవ్వడి విని

    నీ వస్తివని వడి, వడి

    ఘడియ ఘడియకు తడబడే

    ఈ గుండె పిలుపు నీ కందేనాll


    తనువు వల్లరి, సరి, సరి

    పాము ఆపై ఒక విరి

    నీదు దయకు నోచలేదు

    దరిసెనమ్ముకు దారి లేదు

    చషకమందున విషము నింపి 

    గుండె గతులను నిలిపి వేసి

    ముక్తినిమ్మని మోకరిల్లే

    ఈ గుండె పిలుపు నీకందేనాll '

    అని కన్నీళ్లతో పాడుకుంటూండే వాడు శివయ్య.


    ఈ ఆదాయ వ్యయాల దోబూచులాటలో, ఈ ఆశయ సాధన కోసం అంతరంగ కురుక్షేత్రంలో జరిగే ధర్మ యుద్ధంలో ఎప్పటికైనా తన పంచేంద్రియాల పాండవులకి విజయం లభించకపోతుందా అన్న నిరీక్షణలోనే శివయ్య ముప్ఫయి నాలుగు వసంతాలు ఖర్చు పెట్టేశాడు. 

    శివయ్యకి ఆదాయం పెరగకపోయినా, పేరు ప్రతిష్ఠలు మాత్రం బాగానే పెరిగాయి. అతడిది అమృతహస్తమని, అతడు వంట చేస్తే నలభీములు కూడా ఆత్రంగ విందుకు రావలసిందేనని మృష్టాన్నప్రియులు సిద్ధాంతీకరించారు. 

    ఆ పేరు ప్రతిష్టలే, కొడిగడుతున్న అతడి ఆశల దివ్వెకు ఒకనాడు ఊపిరి పోశాయి!

    అతడి ఊరు నించి కొంతమంది కాశీ, రామేశ్వరం, గయ, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల సందర్శనానికి వెళ్తున్నారు. వారంతా కలిసి ఒక కంట్రాక్టరు ఏర్పాటు చ్వేసిన రెండు టూరిస్టు బస్సుల్లో మరొక ఇరవయి రోజులలో బయలుదేరుతున్నారు. ఉత్తరాదికి వెళ్తున్నారు కనుక, ఆ వంటలు వాళ్లకి వంటబట్టవు కనుక, తమతో ఒక మంచి వంటవాడ్ని కూడా తీసుకెళ్తే బాగుంటుందనుకున్నారు. దాంతో శివయ్య పంట పండి, వంటవాడిగా వాళ్లని అనుసరించే భాగ్యం కలిగింది.

    ఇంక శివయ్య ఆనందానికి అవధులు లేవు. తన జీవితం ధన్యం కాబోతోందన్న ఆనందాతిశయంలో అతడికి కంటి మీద కునుకు కూడా రావటంలేదు. 

    తను కాశీ వెళ్తాడు. అక్కడ గంగమ్మ తనని లాలించి, లాలపోసి, నాన్న ఒడిలోకి తీసుకు వెళ్తుంది!  

    తను ఎక్కువ ఉద్విగ్నతకి ఏమైనా సరే లోనుకాకూడదు. ఎందుచేతనంటే, ఆ పరిస్థితిలో తన కళ్ళు చెమరిస్తే విశ్వేశ్వరుడి దర్శనం మసకబారవచ్చు. అంచేత నిశ్చలంగా ఉండి పరమేశ్వరుడిని దర్శించుకోవాలి. అంతేకాదు. ఆయనకి నమస్కరించేటప్పుడు కళ్లు కూడా మూసుకోకూడదు! కళ్లు తెరిచే ధ్యానించుకోవాలి!

    ఆ పై గయ వెళ్లి అక్కడ తనకి తనే శ్రాద్ధకర్మలు జరిపించుకోవాలి!

    చాలు! ఇంక తనకి ఇహపర సాధన జరిగినట్లే! ఇహంలో ఎన్నాళ్లున్నా మనశ్శాంతితో బ్రతుకుతాడు. పరానికి ప్రయాణం కూడా సంతృప్తితో చేస్తాడు.

    ఆ తర్వాత కైలాసంలో ఆ తండ్రి దగ్గిర ఏ భృంగీశ్వరుడుగానో మిగిలిపోతాడు.

    "ఈ విధంగా నా జన్మ చరితార్థం చేస్తున్నావా శివా" అనుకుంటూ తన్మయత్వాన్ని పొందేవాడు.

    'శివా శివా అని స్మరియించు 
    పాపం, తాపం హరియించు
    భుజగ భూషణుని నుతియించు
    ఆరువైరులను వధియించు
    భూతంలో నీవేమి చేసినా
    భూతనాథుడే భావి కాచెను!!'

    'ఆహా స్వామీ ఎంత ధన్యుడ్ని కాబోతున్నాను దేవదేవా!'

    అక్కడ్నించి అనుక్షణం శివయ్యకి తన ప్రయాణం గురించిన ఆలోచనలే.

    ప్రతి రాత్రీ అతడికి ముక్కంటి గూర్చిన కలలే!

    ఒక్కొక్క రోజూ ఒక్కక్క యుగంలా గడుస్తోంది శివయ్యకి.

    వాళ్లు మాఘ బహుళ సప్తమి నాడు బయలుదేరుతారట. మా బహుళ చతుర్దశి నాటికి, అంటే మహాశివరాత్రికి కాశీ చేరుకుంటారట. ఆ పర్వదినాన కాశీవిశ్వేశ్వరుడ్ని దర్శించుకుంటారట. 

    'సప్తమి ఇంకా రాదేం? ఆ తిథి రావడానికి ఇన్ని యుగాలు పడుతుందా?'

    శివయ్యకి చాలా అశాంతిగా ఉంది.

    ఏమేం వస్తువులు అక్కడ అవసరముంటాయో, అవన్నీ ఒక లిస్టు తయారు చేశాడు. ఏదీ మర్చిపోవడానికి వీలులేదు. అందుకని రోజూ ఆ లిస్టుని పరిశీలించుకునేవాడు. రోజూ ఏదో ఒక కొత్త వస్తువు గుర్తుకు వచ్చేది. అన్నీ జాగ్రత్తగా సర్దుకునేవాడు. మళ్లీ అసంతృప్తి. అన్ని మూటలూ తిరిగి విప్పేసి మళ్లీ సర్దుకునేవాడు. కాశికి వెళ్లేలోపున తనకేమీ కాకూడదని, ఏ అనారోగ్యమూ కలగకూడదని పదే పదే శివపంచాక్షరి జపించుకునేవాడు.

    ఇలా అతడు ప్రయాణ సన్నాహాలు చేసుకుంటూ ఉండగా, ఆఖరికి అతడి కోరిక మేరకి ప్రయాణం రోజు రానే వచ్చింది. 

    ఆ విశ్వేశ్వరుడి కరుణాకటాక్షం వల్ల ఏ ఆటంకమూ లేకుండా అతడు కూడా యాత్రీకులతోపాటు బస్సెక్కాడు. 

    అప్పటికి శివయ్యకి కొంచెం మనస్తిమితం చిక్కింది. 

    'అమ్మయ్య. బస్సులోకి వచ్చి పడ్డాను. ఇంకేమీ ఇబ్బంది లేదు. అంతా సజావుగానే జరుగుతుంది' అని సమాధానపడ్డాడు.

    బస్సులు కాశీ చేరుకున్నాయి.

    అంతా ముందే ఏర్పరచుకున్న సత్రంలో దిగారు.

    అక్కడి నించి హడావిడి మొదలైంది. ఎవరికి వారు గంగా స్నానానికి కావాల్సిన సరంజామా తీసుకుని బయలుదేరుతున్నారు.

    శివయ్య కూడా గబగబా దంతావధానం ముగించుకుని తుండుగుడ్డలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ లాంటివన్నీ ఒక సంచీలో కుక్కుకుని వాళ్ల దగ్గరికి చేరుకున్నాడు.

    అప్పుడే వచ్చింది అసలైన ఇబ్బంది!

    ఆ యాత్రలు ఏర్పటు చేసిన కాంట్రాక్టరు - పేరు చక్రపాణి - గబగబా శివయ్య దగ్గరికి వచ్చాడు. 

    "అయ్యా శివయ్యగారూ, ఎంతవరకూ వచ్చాయి ఏర్పాట్లు?"

    శివయ్య అయోమయంగా అడిగాడు.

    "ఏం ఏర్పాట్లు?"

    "బాగుందండీ. మీ వ్యవహారం చూస్తుంటే, మీరు కూడా ఇన్ని వేలు పోసి టికెట్లు రిజర్వు చేయించుకుని వచ్చిన యాత్రికులతో సమానంగా జల్సాగా తిరుగుదా మనుకుంటున్నట్లున్నారే? వాళ్లు గంగాస్నానం చేసిరాగానే వాళ్ల కింత టిఫిను చేసిపెట్టి, పాలో, కాఫీలో, టీలో వాళ్ల మొహాన కొట్టొద్దూ? పిల్లలుంటారు, పాప లుంటారు, ముసలీ - ముతకా ఉంటారు. వాళ్లకి వేళ కింత కడుపులో పడక పోతే ఆ పరంధాముడి సంగతెలా ఉన్నా, ఆత్మా రాముళ్లు ఆరళ్లు పెట్టేయరూ? ఊఁ గబగబా చేయండి. ఈ పూట ఎక్కువ మంది ఉపవాసాలే ఉంటారు కనక, ఎక్కువగా పదార్థాలు వండి తగలెయ్యక, తక్కువ మోతాదులో ఉప్మా చేసి పడెయ్యండి. అంతగా సరిపోకపోతే, ఉప్మా చెయ్యడం ఎంతస్సేపు! మళ్లీ మరికాస్త వండి తగలేద్దురుగాని, ఊఁ ఇంక త్వరగా కానివ్వండి."

    ఇంక శివయ్యకి మాట్లాడటానికి అవకాశమివ్వకుండా చక్రపాణి యాత్రికుల నుద్దేశించి అన్నాడు.

    "అయ్యలారా, భక్త శిఖామణులారా! మీరంతా బస్సులెక్కితే మనం వెళ్లి గంగలో మునిగి వద్దాం. ఆకలేస్తే ఆగలేని వాళ్లుంటారు కనక వాళ్లకి టిఫిన్లు రెడీ అవుతున్నాయి. ఆ కార్యక్రమాలు త్వరగా ముగించుకుంటే, ఆ పైన అందరం కాశీవిశ్వనాథుడ్ని తనివితీరా దర్శించుకుని తరిద్దాం. పదండి, పదండి."

    శివయ్య బిక్క మొహం వేసుకుని చూస్తుండగానే అందరూ "హరహర మహదేవ్" అని భక్తి పారవశ్యంతో నినాదాలిస్తూ బస్సు లెక్కేశారు.

    మరుక్షణంలో బస్సులు రయ్యిమంటూ గంగానది వైపు పరుగులు తీశాయి.

    శివయ్య మనస్సు విలవిల్లాడిపోయింది.

    'ఏమిటి? కాశీదాకా వచ్చి గంగాస్నానం చెయ్యలేకపోవడమా? పరమేశా! ఏమిటి నా కీ పరీక్ష?' అని కుమిలిపోయాడు.

    కాని అది వాస్తవమే కదా! తనేం డబ్బులిచ్చి యాత్రలు చేస్తున్నాడా? అదిన్నీ కాక తనుకూడా పల్లకి ఎక్కితే మోసే దెవరు? వాళ్లు స్నానాలు చేసిరాగానే ఫలహారాలు వండి వడ్డించవలసిన బాధ్యత తనదేకదా? చక్రపాణి అన్నదాంట్లో అసమంజసమేముంది?

    పైగా విజయవాడలో ప్రతి ఇంటి కుళాయిలోంచి కృష్ణమ్మ తల్లే జాలువారుతుంది. 

    అలాగే ఇక్కడి కుళాయిల్లోంచి కూడా గంగమ్మ తల్లి కాక వేరెవరు వచ్చి సేద దీరుస్తారు?

    అందుకని ఈ గంగలోనే స్నానమాడి, వాళ్లు వచ్చేసరికి గబగబా టిఫిన్లు పెట్టేస్తే, ఆ పైన వాళ్లతో పాటు ఆనందంగా విశ్వనాథుడి దర్శనానికి పరుగులెట్టవచ్చు.

    ఈమాత్రం విషయానికి మనసు పాడుచేసుకుని ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.

    శివయ్య హడావిడిగా కుళాయి కింద 'అపవిత్రః పవిత్రోవా' అనుకుంటూ స్నానం ముగించాడు. ఆ పైన గబగబా వంట కార్యక్రమంలోకి వెళ్లిపోయాడు. 

    వెళ్లిన వాళ్లంతా ఒక గంటలో తిరిగి వచ్చారు. 

    రాగానే ఫలహారాల మీద దండయాత్ర సాగించారు.

    చక్రపాణి వాళ్లతో అంటున్నాడు -

    "అయ్యా! అందరూ గబగబా ఫలహారాలు ముగించి మళ్లీ బస్సులెక్కేస్తే విశ్వేశ్వరాలయానికి వెళదాం. అసలే అక్కడ చాలా రద్దీగా ఉంటుంది."

    మళ్లీ శివయ్యకేసి తిరిగి అన్నాడు - "అయ్యా శివయ్యగారూ! ఈ ఫలహారాల తంతు పూర్తి కాగానే గబగబా వంట కార్యక్రమం మొదలుపెట్టండి. మేము సరిగ్గా పన్నెండున్నరకల్లా వచ్చేస్తాం. భోజనాలు కాగానే మళ్లీ మిగతా చోట్లన్నీ చూడడానికి వెళతాం. ఈ లోపు మీరు రాత్రి భోజనాలు రెడీ చెయ్యండి. భోజనాలు కాగానే రాత్రికి రాత్రే బయలుదేరేస్తాం. ఈ కార్యక్రమమంతా సవ్యంగా జరగాలంటే అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు వేళకి వండి వడ్డించకపోతే, అంతా రసాభాస అయిపోతుంది.'

    శివయ్యకి ఒళ్లు జలదరించింది!

    అంటే తను - విశ్వేశ్వరాలయానికి వెళ్లటం లేదా? గంగా స్నాన ఫలం ఎటూ లభించలేదు. కాని - గుడికి తను వెళ్లొద్దూ?

    అతడి కళ్ల నించి ఆగకుండా కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి.

    'పరమేశా, నాకు ఇదెక్కడి శిక్ష విధించావు స్వామీ? నీ ఇంటి గుమ్మం దాకా రానిచ్చి, నీ ఇంటిలోకి అడుగుపెట్టనివ్వకుండా చేస్తున్నావా స్వామీ? నేను ఏ జన్మలో ఏ ఘోరపాపం చేశానని నా కింత శిక్ష విధిస్తున్నావు తండ్రీ?

    అమ్మా! అన్నపూర్ణమ్మ తల్లీ! చూశావామ్మా మీ ఆయనగారి వరస? నా మీద కక్ష కట్టేశాడమ్మా! నేను తనని చూడకూడదట! అంతటి పాపాత్ముడినా తల్లీ? నువ్వన్నా చెప్పమ్మా. మీ కొడుకుని ఇలా శపించటం తగునా తల్లీ?

    పోనీ - నేను దుర్మార్గుడినే - రౌరవాది నరకాల్లో శాశ్వతంగా కాపురం పెట్టాల్సినంతటి పాపాత్ముడినే - కాని, అమ్మా కుపుత్రో  జాయేత్  క్వచిదపి కుమాతా న భవతి -

    నేను నీకు కుపుత్రుడ్ని కావచ్చు తల్లీ. కానీ నువ్వు నాకు కుమాత వవుతావా అమ్మా? అది భావ్యం కాదు కదా!'

    శివయ్యకి ఆశ చావలేదు. వెళ్లి చక్రపాణి ఎదర నిలుచుని చేతులు జోడించాడు.

    చక్రపాణి చిరాగ్గా అడిగాడు.

    'ఏమిటండీ?'

    శివయ్య దీనంగా అన్నాడు.

    'అయ్యా, నాకు కూడా విశ్వనాథుణ్ణి దర్శించుకోవాలని ఉందండీ'

    చక్రపాణి పగలబడి నవ్వాడు.

    'బాగుందయ్యా పంతులూ! ఇదుగో నేను కట్టుకున్న ఈ జరీ పంచె, ఈ కండువా అన్నీ విప్పేసి నీ కిచ్చేస్తాను. ఇవి నువ్వలంకరించుకో. నీ నీరుకావి గావంచా, ఆ చిరుగుల తువ్వాలు నా మొహాన తగలెయ్యి. ఆ అలుగ్గుడ్డలు నేను చుట్టుకుని, పులుసులో పోపు తగలేస్తూ, అన్నం వండివారుస్తూ అఘోరిస్తాను - వెళ్లు నాయనా' అన్నాడు.

    శివయ్య మౌనంగా వంటలు చేయడానికి వెళ్లిపోయాడు.

    యాత్రలన్నీ దిగ్విజయంగా ముగిశాయి. 

    అన్ని స్థలాల్లోను ఇదే తంతు. ఇదే తతంగం!

    తెల్లవారు జామునే లేచి వాళ్లందరికీ కాఫీలూ టిఫిన్లూ తయారు చెయ్యడం, వాళ్లు బయట తిరిగి రాగానే వాళ్లకి భోజనాలు వండి వడ్డించడం, మళ్లీ వాళ్లు అన్ని చోట్లకీ హాయిగా వెళ్లి భక్తి చెల్లించి పుణ్యం సంపాదించుకురాగానే వాళ్లకి రాత్రి భోజనాలు, ఫలహారాలు వండి అమర్చడం - ఇంతే.

    సత్రం దగ్గర బస్సు దిగితే వంటపనిలోకి వెళ్లిపోవడం, మళ్లీ బస్సు మరొక ఊరికి బయలుదేరితే అందులో కెక్కి కునికిపాట్లు పడడం -

    చివరికి ఆ చేదు అనుభవాలన్నీ మూటకట్టుకుని స్వగ్రామం వచ్చిపడ్డాడు!

    శివయ్య ఈ అనుభవంతో చాలా క్రుంగిపోయాడు. జీవితమంటేనే రోత పుట్టింది. జీవించాలంటేనే అసహ్యమేస్తోంది. 'ఆ కాశిలోనే ఏదన్నా జాడ్యమొచ్చి ఊపిరాగిపోతే గంగలోకి తోసేద్దురు కదా, అలాగన్నా మోక్షమొచ్చి ఉండేది కదా' అని విలపించేవాడు.

    కొన్నాళ్లిలా గడిచాయి.

    శివయ్యకి తగిలిన గాయం కొద్ది కొద్దిగా మానసాగింది.

    మళ్లీ శివయ్యలో పాత కోరికలు పడగలు విప్పి నర్తించసాగాయి.

    'పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉండుగాక! ఆ పరమేశ్వరుడే భవానితో కలిసి తన దగ్గరికి రానివ్వకుండా నన్ను తరిమెయ్యడానికి ప్రయత్నించుగాక! కాని, నేను ఎవర్ని? నేనూ శివయ్యనే. ఆయన హాలాహలాన్ని మింగి, చిరునవ్వులు చిందించగలిగాడు. కనుక నేను కూడా ఎన్ని ఆటంకాలొచ్చినా, మొక్కవోని ధైర్యంతో మొండి పట్టుదలతో అనుకున్నది సాధించి తీరతాను. మరణించేలోగా నా కోరిక తీర్చుకుని మరీ చస్తాను'

    శివయ్య తన మీద తనకే కలిగిన సానుభూతితో కన్నీళ్లు వంపుకున్నాడు.

    మళ్లీ మొండిపట్టుదలతో కసిగా నవ్వుకున్నాడు.

    'అవును. ఇవాళ్టి నుంచి నా తపస్సు మొదలవుతోంది. పైసా పైసా కూడబెడతాను. కడుపుకట్టి దాచి పెట్టుకుంటాను. కూటికీ, గుడ్డకీ కూడా ఖర్చుపెట్టకుండా కక్కుర్తి పడి ఆదా చేస్తాను. ఎన్ని సంవత్సరాలయినా సరే, నాకు వృద్ధాప్యం వచ్చినా సరే, సరిపడినంత సొమ్ము పోగుచేసి, అటువంటి టూరిస్టు బస్సులలోనే ప్రయాణం చేసి కాశి, రామేశ్వరం, గయ అన్నీ చూసి వస్తాను.

    కాని ఈ సారి వెళ్లేటప్పుడు వంటవాడిగా వెళ్లను. యాత్రికుడి హోదాలో వెళ్తాను. అన్నీ కరువు తీరా చూస్తాను. ఆ విశ్వనాథుడ్ని దర్శించి తీరతాను. ఆ గయలో నాకు నేనే పిండ ప్రదానం చేసుకుని తరించి తీరతాను.'

    ఇప్పుడు శివయ్య జీవితానికి ఒక ధ్యేయం ఏర్పడింది. 

    ఆ ధ్యేయసాధన కోసం ఒక దృఢసంకల్పంతో కృషి చెయ్యసాగాడు.  

    ఒక సరదా లేదు. ఒక సంబరం లేదు. ఒక పావలా ఖర్చు పెట్టాలంటే గుండె గిలగిల లాడేది.

    ఈ విధంగా శివయ్య ద్నాలుగేళ్ల జీవన వాసం చేశాక, శారీరకంగా కృంగి,కృశించి, ఎముకల పోగులా మిగిలిపోయాక, ఏభయ్యో పడిలోకి ఇంచుమించు అడుగుపెట్టే వేళకి, తను పోగుచేసిన సొమ్మునంతా లెక్కపెట్టుకుని తృప్తిగా తలాడించుకుని, ఆత్మవిశ్వాసంతో, పధ్నాలుగు సంవత్సరాలుగా ఉగ్గబట్టుకున్న నిశ్వాసను దీర్ఘంగా విడిచి, కంట్రాక్టరు దగ్గరికి వెళ్లాడు.

    ఆ కంట్రాక్టరు పేరు అమృతపాణి. అతడు కీర్తిశేషుడైన చక్రపాణిగారి సుపుత్రుడు.

    తండ్రి అడుగుజాడలలోనే అతడు పయనిస్తూ, యాత్రా స్పెషల్సు ఏర్పాటు చేస్తూ, నాలుగు రాళ్లు కూడబెట్టుకుంటున్నాడు.

    మరి పదిహేను రోజులలో బస్సులు బయలుదేరతాయట!

    అన్ని పుణ్యప్రదేశాలనీ సందర్శించుకుంటూ మహాశివరాత్రి నాటికి కాశి చేరుకుంటారట!

    శివయ్య తృప్తిగా తలపంకించి కట్టవలసిన డబ్బు కట్టి రశీదు తీసుకుని తేలికబడ్డ హృదయంతో ఇంటికి చేరుకున్నాడు.

    అక్కడినించి, విశ్వనాథుడితో మనసులో ఛాలేంజి చేసి గర్వంగా నవ్వుకునేవాడు.

    'చూశావా పరమేశా! నువ్వు నా మీద శీతకన్నేశావు. కాని నేనేం తక్కువవాడిని కాదు సుమా! రావణాసురుడు, భస్మాసురుడు లాంటి అసురాధములే దురుద్దేశ్యాలతో నిన్ను ధ్యానిస్తే, ఉబ్బులింగడివైపోయి, వాళ్లు కోరిన ఘాతుకపు వరాలన్నీ ప్రసాదించి పడేశావు. అటువంటిది నేను నిన్ను కేవలం నీ దర్శన భాగ్యం ప్రసాదించవయ్యా స్వామీ అంటే, వేడుకుంటే, అతి దీనంగా ప్రార్థిస్తే దానికి పెద్ద అట్టహాసం చేసి, నన్ను నిర్లక్ష్యంగా చేసేసి నన్ను అవమానాలపాలు చేసి నిశ్చింతగా, నిర్లిప్తంగా ఉండిపోయావు!

    ఇప్పుడు చూడు!

    నా భక్తి గొప్పదో, నీకు నా ఎడల ఉన్న విరక్తి గొప్పదో రుజువు కాబోతోంది.

    ఆరు నూరైనా, అటు సూర్యుడిటు పొడిచినా, సప్త సముద్రాలూ ఉప్పొంగి ప్రళయమే ఏర్పడినా, ద్వాదశార్కోదయమయి సృష్టి యావత్తూ భస్మీపటలమయిపోయినా, నీ బిడ్డడు - ఈ శివయ్య - వారణాసికి వచ్చి తీరతాడు.

    నీ గంగమ్మతో తన గోడంతా చెప్పుకుని, ఆమె కనీళ్లలో ఆ చన్నీళ్లలో తానమాడి నీ చెంతకు వచ్చి నీ దర్శనం చేసుకుని వంచించబోయిన విధిని పరిహసించి తరిస్తాడు!'

    శివయ్యకి చాలా కసిగా ఉంది.

    తను అనుకున్నది ఇన్ని సంవత్సరాల ఘోరతపస్సు తర్వాత, ఇన్ని వేల ఘడియల కఠోర సాధన తర్వాత కార్యరూపానికి తీసుకురాబోతున్నాడు.

    అనుకున్న శుభ ముహూర్తానికి బస్సులు బయలుదేరాయి. 

    ఇక శివయ్యలో వైరాగ్యం ఉప్పెనలా వచ్చేసింది.

    సర్వకాల సర్వావస్థల యందు శివపంచాక్షరి జపించుకుంటూ, ఏకాగ్రచిత్తంతో పరమేశ్వరుని ధ్యానించుకుంటూ ప్రయాణం సాగించాడు.

    అతడి భక్తి తత్పరతకి, అతడి నిశ్చల చిత్తానికి, తోటి ప్రయాణికులు చాలా అబ్బురపడసాగారు. 

    కొందరైతే అతడి భక్తిపారవశ్యాన్ని, జపతీవ్రతని చూసి, ఇతడికేమన్నా జరగదు కదా అని భయం కూడా పడ్డారు. 

    అయితే ఏ ఇబ్బందులూ ఎదురవకుండా బస్సులు వారణాసికి చేరుకున్నాయి.

    శివయ్య మనసులో ఏదో తెలియని పారవశ్యం. 

    ఒళ్లంతా ఏదో లోకంలో విహరిస్తున్న అనుభూతి. 

    ఈ పార్థివ శరీరం తాను కాదని, ఈ శరీరంలో ఉన్న ఆత్మ మాత్రమే తానని, తను అంటే ఈ ఆత్మ, పరమాత్మని చేరుకోవడం కోసమే ఈ కాశికాపురికి ఏతెంచానని శివయ్యకి అనిపించసాగింది.

    బస్సులు సత్రం దగ్గర ఆగాయి.

    శివయ్య ఒక సంచి నిండా పూలూ, పళ్లూ, పసుపు, కుంకుమ, ఇంకా ఇతరత్రా సరంజామా అంతా పెట్టుకుని, గంగా స్నానానికి మిగతా అందరితో కలిసి బయలుదేరాడు. 

    అంతలో కంట్రాక్టరు అమృతపాణి తమతో వచ్చిన వంటవాడితో ఏదో గొడవపడుతుండడం కనిపించింది. ఏమిటా అని అటు వెళ్లాడు. 

    అమృతపాణి వెకిలిగా నవ్వుతూ బొంగురు గొంతుకతో అరుస్తున్నాడు.

    'బాగుందయ్యా పంతులూ! ఇదుగో నేను కట్టుకున్న ఈ జరీ పంచె, ఈ కండువా అన్నీ విప్పేసి నీ కిచ్చేస్తాను. ఇవి నువ్వలంకరించుకో. నీ నీరుకావి గావంచా, ఆ చిరుగుల తువ్వాలు నా మొహాన తగలెయ్యి. ఆ అలుగ్గుడ్డలు నేను చుట్టుకుని, పులుసులో పోపు తగలేస్తూ, అన్నం వండివారుస్తూ అఘోరిస్తాను - వెళ్లు నాయనా, వెళ్లి గంగలో మునిగి, శివదర్శనం చేసుకునిరా!'

    అమృతపాణి వికృతంగా నవ్వుతున్నాడు.

    కర్ణ కఠోరంగా నవ్వుతున్నాడు.

    ఆ వంటవాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

    శివయ్య ఆ వంటవాడి కేసి చూశాడు.

    అతడికి సుమారు డెబ్బయి అయిదేళ్లుండవచ్చు. మనిషి కాస్త ఆరోగ్యంగానే కనిపిస్తున్నా అంతవయసుపైబడ్డ వాడు ఏ క్షణాన్నయినా రాలిపోక తప్పదు.

    శివయ్య అతడి దగ్గరికి వెళి జాలిగా భుజం మీద చెయ్యివేశాడు.

    ఆ వంటవాడు ఏడుస్తూ అన్నాడు.

    "చూడండయ్యా! ఒక్కసారన్నా కాశికి వచ్చి గంగలో మునిగి, ఆ విశ్వనాథుడ్ని దర్శించుకోవాలని ఈ జీవితమంతా తాపత్రయ పడ్డాను. కాని ఇంటిగుమ్మం దాకా వాచ్చి ఇంట్లోకి ప్రవేశించలేకపోతున్నాను. నా జీవితం దారుణంగా వ్యర్థమయి పోయిందయ్యా. ఇక నేను బ్రతకడం కూడా అనవసరం. అయినా ఇంత వయసు వచ్చి ఇక నేను బ్రతికుండేది కూడా కల్ల!"

    శివయ్య అతడ్ని అనునయిస్తూ అన్నాడు.

    "చూడండయ్యా. నేను కూడా వంటవాడిని. కాని మీలా ముదివగ్గును మాత్రం కాదు. నాకు నలభై ఎనిమిదేళ్లే. ఆ విశ్వనాథుడు కరుణిస్తే ఇంకా నేను చాలా కాలం బ్రతుకుతాను. అందుకని నాకు మళ్లీ ఎప్పుడైనా కాశికి రావడానికీ, గంగలో స్నానమాచరించడానికీ, విశ్వనాథుడ్ని దర్శించుకోవడానికీ పుష్కలంగా అవకాశాలున్నాయి. మీరేమీ సంకోచించకుండా ఈ సంచీ పుచ్చుకుని బస్సెక్కండి. మథన పడకుండా గంగలో స్నానం చెయ్యండి. అక్కడ్నించి గుడికి వెళ్లి సంతోషంగా నిర్మల చిత్తంతో, నిశ్చల ధ్యానంతో విశ్వనాథుడ్ని దర్శించుకోండి. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి"

    అతడేమీ అనేలోగానే శివయ్య అతడి చేతిలో సంచి కుక్కి తాను నీరుకావి గావంచా చుట్టుకుని వంటశాల వైపు సాగిపోయాడు.

    కాని ఇప్పుడు శివయ్య మనసులో బాధ లేదు. వ్యథ లేదు. దుఃఖం లేదు. అసంతృప్తి లేదు. నిరాశలేదు. చింతలేదు. 

    అతడికేదో జ్ఞానోదయమైనట్లు అనిపించసాగింది.

    ఆ విశ్వనాథుడు ఎక్కడ లేడు గనుక! మనసనే ఈ మందిరంలో, ఈ గుండె గుడిలో ఇన్ని సంవత్సరాలుగ గూడు కట్టుకుని శాశ్వతంగా నిలిచిపోయాడే - ఇంకా వెర్రివాడిలా ఆయనకోసం ఎక్కడో ఎందుకు వెతకాలిట? 

    'అవును శివయ్యా - నువ్వు ఈ నిరుపేద శివయ్య గుండెలో ఎప్పట్నించో బందీవై పడి ఉన్నావు. ఇంతకన్నా మహద్భాగ్యం నాకేలనయ్యా పరమేశా!' అని అనుకుంటూ కన్నుల నించి ఆనందాశ్రువులు రాలుతుండగా కూరలు తరగసాగాడు.

    చెమరించిన అతడి హృదయం తన్మయంగా పాడుకుంటోంది.

    'అహరహం ఇహరంలో హాలాహలం!
    హరా, హరా అనుకొంటే పీయూషం!
    ఇహంపైన వ్యామోహం వదలుకొంటే
    అహం వీడినిను నీవు తెలుసుకొంటే
    అనుక్షణం ఉల్లాసం!
    ఇహమందే కైలాసం!!'

(ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక 31 మే - 6 జూన్ 1995 సంచికలో ప్రచురితం)       
Comments