సోదా - దేవరాజు మహారాజు

    
'ఈ హెడ్డు బాడ్కావ్ ఏడబోయిండో గదా' అనుకున్నాడు కానిస్టేబల్ మస్సూధన్.

        మస్సూధన్ అప్పటికే టౌన్ సెంటర్లో చూశాడు. అక్కడికి ఫర్లాంగు దూరంలో వున్న పోలీస్ స్టేషన్లో చూశాడు. రెండు చోట్లా కనిపించక పోతే సైకిలేసుకుని రైల్వే స్టేషన్ అవతల సంజయ్ నగర్ లోని గుడిసెలలో తిరిగాడు. ఆ గుడిసెల మధ్య పది పదిహేను పెంకుటిళ్ళున్నయ్. అందులో ఒకటి హెడ్‌కానిస్టేబల్ లక్ష్మీనారాయణది. కానీ అందరికీ నారాయణ అంటేనే తెలుసు.

    మస్సూధన్ ఆ సందులలో సైకిల్ తిప్పుతూ వుంటే కోడిపిల్లలు, కుక్క్లపిల్లలూ గొంతులు కలిపి ఆహ్వానించాయి. మురికి గుంటల్లోని పందులు గుర్ గుర్ మని లేచి దారి విడిచాయి. ఎంతో ప్రయత్నించి, బ్యాలన్స్ ఆపి పిల్ల మూత్రం, దొడ్డి... సైకిల్ టైర్లకు అంటకుండా చేయాలన్న ప్రయత్నం ఫలించలేదు. తీరా వెళితే హెడ్డు ఇంటికి తాళం వుంది. చుట్టు పక్కల ఆరాతీస్తే - స్పిన్నింగ్ మిల్ల్స్ ఎదురుగా ఖాజా డబ్బా దుకాణంలో కూచుంటాడని తేలింది. మళ్లీ అక్కడి నుండి మరో మైలు సైకిలు తొక్కిన్ ఖాజా హోటల్ చేరేసరికి - గురుడు కనిపించాడు.
    'హమ్మయ్య!'... అనుకున్నాడు మస్సూధన్.     మిల్ వర్కర్లను ఇద్దర్ని కూచోబెట్టి ఊళ్ళోని విశేషాలను అంతర్జాతీయ సమస్యలుగా వర్ణించి చెబుతున్నాడు... హెడ్డు. శాల్యూట్ చేసి నిలబడగానే హెడ్డు తలతిప్పి పరమానందంతో లేచొచ్చాడు.

    "మీర్రమ్మంటిరి గదాని ఊరంత తిరిగి తిరిగి ఎతుకుతాన సార్"... అన్నాడు మస్సూధన్.     హెడ్డు బొలబొలా నవ్వాడు. "నేనెప్పుడైనా అంతే. కలువు అని చెప్తా అంతే! ఎక్కడా ఏమిటీ? అన్నీ మీరే తెలుసుకోవాలె. హెడ్డును పట్కోకపోతే ఇగ మీరు దొంగల్నేం బడ్తరు?"... అని రోడ్డు వైపు చూస్తూ ప్రశ్నించి, అంతలోనే గొంతు తగ్గించి "నిజంగా చాన తిర్గినవ్‌లే" అని అభిమానంగా కళ్ళలో కళ్ళు పెట్టి పరామర్శించి "ఇప్పుడే మన ఇస్మాయి లొస్తడు కూసుందాం" అని చెప్పి హోటల్ లోపలిగదిలో దూరాడు హెడ్డు.

    చిన్న గుడిసె హోటలది. ముందు భాగంలో చిన్న పాన్‌షాప్ ఉంది. దాంట్లో పాన్ నములుతూ ఖాజా గల్లా పెట్టె దగ్గర కూర్చున్నాడు. అతని ఇద్దరు కొడుకుల్ని సర్వర్లుగాను, భార్యను కుక్‌గానూ మార్చాడు. హోటల్లో ఒక ముసలతను వేడి వేడి టీలో బన్ ముంచుకుని తింటున్నాడు. మరో ఇద్దరు సమోసాలు లేవనగానే నిరుత్సాహ పడి పూరీకి ఆర్డరిచ్చారు. ఓ మూల రెండు చాయలను ముగ్గురు పంచుకుని తాగి మాటల్లో మునిగారు. బయట చీకటి పడుతోంది. వర్కర్లంతా యిళ్ళకు పోతున్నారు. రోడ్డు రద్దీగా వుంది, అప్పుడే...     ఖాజాహోటల్ ముందు లారీ ఆగింది. అందులోంచి కానిస్టేబుల్ ఇస్మాయిల్, డ్రైవర్ గంగారాం ఇద్దరూ దిగారు. ఇస్మాయిల్ చేతిలో బరువైన సంచీవుంది. గంగారాం నల్లగా భయంకరంగా కొమ్ములు తిరిగిన వీరుడినా, మీసాలు తిరిగున్నాడు. ఇస్మాయిల్ బక్క పల్చగా వున్నాడు. నవ్వకపోయినా నవ్వుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఇద్దరూ నేరుగా హోటల్లో జొరబడ్డారు. మస్సూధన్‌ని చూడగానే "హాయ్ మేరి బుల్‌బుల్" అని గాల్లోనే ముద్దు విసిరాడు ఇస్మాయిల్. బజారున పోతున్న ఒక అమ్మాయి - ఫ్యాక్టరీ వర్కరు అయోమయంగా వెనక్కి తిరిగి చూసింది. మస్సూధన్ నవ్వుకున్నాడు. పోలిస్ ఉద్యోగంలో కొత్తగా చేరిన మస్సూధన్‌కు తన తోటి పోలీసుల ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తోంది. పైఅధికారుల ప్రవర్తన అంత కంటె విచిత్రంగా వుంది.

    కొద్దిసేపటికి లోపల్నుండి పిలుపొచ్చింది... మస్సూధన్‌కు. ఖాజా ఎర్రని నోతరంతా వూపుతూ, కళ్ళెగరేస్తూ లోనికెళ్ళమని సైగ చేశాడు. మస్సూధన్ బెరుకు బెరుకుగా గుడిసె గుంజల మధ్యనుండి నడిచి, వంటగదికి వేలాడుతూ వున్న గోనె తట్టును తొలగించే సరికి ఖాజా భార్య కాబోలు గాడి పొయ్యిల మీద మూకుడులో పకోడీలు వేస్తోంది. పిండి కలిపి పెట్టిన గిన్నెలు, జల్లి గంటెలు, పొయ్యి కట్టెలు, అప్పదేవే పుల్లలు, ఖాళీ నూనె డబ్బాలు గదంతా ఇరుకిరుకుగా గజిబిజిగా వుంది.

    గది దాటాక పెద్ద ఖాళీ జాగా వుంది. త్వరగా రమ్మని ఇస్మాయిల్ చెయ్యి తెగ వూపుతున్నాడు. ఖాళీ ప్రదేశం చేరేసరికి అక్కడ పాతగోడలు, పూలచెట్లు, కూరగాయల చెట్లు, కోడిపిల్లలు కనిపించాయి. పాతగోడల్లోకి దారి తీశాడు ఇస్మాయిల్. అందులో ఓ చోట శుభ్రంగా వూడ్చి, 'సానిపి' జల్లి, చాపలు వేసిన చోటు కనిపించింది. చాపలో నిండుగా కూర్చొని వున్నాడు హెడ్డు. గంగారం గోడకు జారగిలబడ్డాడు.
    సాయంత్రం చల్లగా వుంది. హెడ్డు చాలా చల్లగా వున్నాడు. "మస్సూధన్ దా కూసో..." అని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తమాషా చూడబోతున్నావ్ అన్నట్లు హెడ్డు మస్సూధన్ కళ్ళలోకి వింతగా చూశాడు.
    "ఊఁ ఓ వంద ఏస్తవా? రెండా?" - అన్నాడు హెడ్డు. అయోమయంగా చూశాడు మస్సూధన్ "ఏంది సార్?" అని! గంగారం హెడ్డును అదో రకంగా చూసి, తల తిప్పుకుని చూపుడు వేలు, పెద్ద వేలు నుదురు తాకించుకుని, కళ్ళు మూసుకుని, లోలోన నవ్వుకున్నాడు.

    "గద్దెల్వంది గీ పోలిసు కొలువేంజేస్తవ్ పిలగా" అని ఎంతో ఆత్మీయత వలక బోసి "మన ఇస్మాయిల్ చెప్పిండులే, నీకది నడ్వదని! బీర్ తెప్పిచ్చిన బీర్ నడుస్తది కదా!" అన్నాడు ఎంతో ప్రేమగా. మస్సూధన్‌కు అప్పుడు అర్థమైంది. కొంచెం సిగ్గు పడుతూ చిరునవ్వాడు. ఆ నవ్వులో హెడ్డు తన నవ్వు కలిపి పెద్దది చేశాడు.

    నవ్వు సాగుతూ వుండగానే, ఖాజా చిన్న కొడుకు వేడిగిన్నె తెచ్చిపెట్టాడు. మసాలా వాసనల వల్ల అది చికెనని తెలుస్తూనే వుంది. మళ్లీ వెంటనే వంటగదిలోకి పరిగెత్తి, నాలుగు సాసర్లు, చెంచా తీసుకొచ్చాడు. మస్సూధన్ ఆ పిల్లవాణ్ణి, అతడు తెస్తున్న సామాగ్రిని మార్చి మార్చి చూశాడు. సాసర్లు అక్కడక్కడా పెచ్చులు వూడి పోయి పగుళ్ళు బట్టి వున్నాయి. చెంచా రాతి వెండిది. అన్నీ కడిగినవే అయినా, అపరిశుభ్రత తొంగి చూస్తూనే వుంది. కుర్రవాడి బట్టలు నల్లగా మాసిపోయినయి. పొడుగ్గా వేలాడుతున్న వాడి పైజామా నాడా నడుస్తున్నప్పుడు కాళ్ళకు తాకి ఎగిరెగిరి పడ్తోంది. ఆ వయసులో వాడు అలాంటి పనులు చేస్తున్నందుకు 'అయ్యోపాపం' అని అనేక సార్లు అనుకున్నాడు.

    "అరే చొటే - దో ప్లేట్ పకోడ, చార్ ప్లేట్ మిక్చర్, ఔర్ చార్ ఆంలెట్ - పట్కరాపో... బిరాన్రావాలే" అని ఆదేశించాడు గంగారాం. వాడు చిరునవ్వులు కళ్ళ మెరుపులు రాల్చేసి 'ఓస్ అదేమత ఘనకార్యం' అన్నట్టు మళ్ళీ దౌడు తీసాడు. మస్సూధన్‌కు కొత్తగా వుంది. మిగతా వాళ్ళకు అదంతా మామూలుగానే వుంది.     యిస్మాయిల్ గ్లాసులు, సీసాలు తెచ్చాడు. అందరికీ సమానంగా సారా పోశాడు. మస్సూధన్ వంక చూసి,
    "ఏ-ఏం గాదు. నువ్ గూడ ఎయ్యరాదు" అడిగాడు. మస్సూధన్ భయం నటించాడు. "ఆఁ అయితే సరే, ఇద్దాగు. ఈ సీసా నీకె" - అని బీర్ సీసా తెరిచి పెట్టాడు. బీర్ బుస బుసా పొంగి కొంత నేల పాలయ్యింది. వీళ్ళ సాహచర్యంలో తనలోని శక్తి కూడా ఇలాగే అయిపోతోందా అని అనుకున్నాడు మస్సూధన్.

    గంగారాం ఆ తరవాత హెడ్డు నారాయణ గ్లాసులు పూర్తి చేశారు. ప్లేట్లలో చికెన్ ముక్కలు తీసి అందించాడు ఇస్మాయిల్. చికెన్ గిన్నె మీద రొట్టెలున్నయి. అవి అందరూ తీసుకునే విధంగా పెట్టాడు. గొంతు మందులో తడిచాక గంగారాం కు హుషారెక్కువైంది. అప్పటిదాక నిశ్శబ్వ్దంగా కూర్చున్న వాడల్లా ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు.     "అన్నా! నిన్న... ఇయ్యాల్లప్పటికి శెవులపిల్లి కూర దిన్ననే"     "అగో - చెప్పవ్ కతా, గదెక్కడిదిరో" ఆశ్చర్య పొయ్యాడు హెడ్డు.     "బండి మీద లేడె పోరడు సైదులు గాడు. వానిది నిషానంటె! ఉరుకుతున్న లారీల్నించి షికార్ జేస్తడు. నిన్న సూడ్రాదు. ఆదిలాబాద్ కెల్లి లోడ్ ఏస్కోని పట్నం బోతన. ఫుల్ లోడుతోనుంది బండి. కదలకుంట్ తీస్కొస్తాన. కామారెడ్డి రాకముందె జంగల్ల - రోడ్డు కడ్డంగబడి శెవులపిల్లి ఉర్కుతాంది. నేను బ్రేకులేశి స్లో జేసుకుంటనే వున్న మావోడు క్లీనరు గులేరు దీస్కోని కుందేల్ను ఎయ్యనే ఏశిండు. దానికి దెబ్బ సరింగ కన్నుకు దాకింది. ఏం కనబడకుంట అయ్యింది. పొదల నక్కింది. వీడురికి ఎతికి పట్టుకొచ్చిండు. ఇగ నడమల ఓ బాయికాడ ఆగినం. బాయి కాడి ఇండ్లోల్లు కూర వొండి పెట్టిన్రు. ఇంత మందేసుకున్నం. అదీ ఇదీ జబర్దస్తుగయింది. నీకెంద్కూ?"     గంగారంకు కలిసొచ్చిన అదృష్టానికి ఆనందించాలో ఆశ్చర్య పోవాలో తెలియక ఒక వెకిలి నవ్వు నవ్వాడు హెడ్డూ. హెడ్డుకు కూడా మందు తలకెక్కింది. అందరి ముఖాల్లో రంగులు మారుతున్నాయి. యిస్మాయిల్ అందరి గ్లాసులు నింపి, నింపాదిగా తన పని కానిస్తున్నాడు. 'చూడడానికి ఇలా వున్నారు గానీ ఇందులో చిన్న గురువెవడు కాదు - అందరూ అందరే' - అన్నట్టు అందరి ముఖాలు అనుమానంగా చూసి, ఒక్క గుటకలో గ్లాసు ఖాళీ చేసి ముక్కందుకున్నాడు యిస్మాయిల్. ఎక్కువ మాట్లాడకున్నా చూపులు, చేతలు ఎంతో అర్థవంతంగా వుంటాయి.     "ఏమిటో మన హెడ్డు గురుడు ఇంకా ఏం మొదలు పెట్టలేదు" అని అనుకుంటుండగానే...     "తమ్మీ -" అని పిలిచి హెడ్డు గంగారాం వీపుమీద చెయ్యి పారేశాడు. ఆఁ మొదలయ్యింది ఇక ఫరవాలేదు - అనుకుని మోచేత్తో మస్సూధన్‌ను పొడిచి వాళ్ళిద్దరిని చూడ మన్నట్టు కనుబొమలు ఎగరేసి తనలో తాను నవ్వుకుంటూ గ్లాసెత్తాడు ఇస్మాయిల్.
    సగం బీర్ సీసా అయిపోయే సరికి మస్సూధన్‌కు మత్తొచ్చేసింది. ఉద్యోగం రాకముందటి గడ్డు రోజులు జ్ఞాపకానికొచ్చినయి. ఒక్కొక్కడు ఎంతెంత తిప్పలు పెట్టీండో జ్ఞాపకాని కొచ్చింది. ఒగణ్ణి అనేదేముంది? అస్సలుకాలమే ఇట్లా ఏడ్చింది... అనుకుంటూ వుండగానే పక్కనే హెడ్డు మరోసారి "తమ్మీ!" అని గట్టిగా పిలిచాడు.

    "ఆఁ ఆఁ - ఇంటున్న"... అని గంగారాం తలవూపాడు.     "మా ఎస్సై ఎంకట్రత్నం గూడ ఏం షికారనుకున్నవ్? మోట్రసైకిల్ మీద అర్వయి మైల్లస్పీడు పోవు కుంట బజార్లపోయే లం-దాన్ని గుర్తు పడ్తడు. మొన్న ఆర్నెల్ల కింద ఎసువంటి పిట్టను పట్టిండనుకున్నావ్? వహ్."
    అందరి ముఖాలలో ఉత్సాహం ఉబ్బుకొచ్చింది. "సన్నగ, తెల్లగ అవ్వల్దర్జగుంది. రాత్రి రౌండు దీస్కొని వొస్తొస్త... ఎందుకు అనుమాన మొచ్చిందో ఏమో శాంతి అండ్ శాంతి లాడ్జిల గుసాయించిండు, మా గురుడు. సరింగ రెండో అంతస్తు మీద వాటర్ టాంక్ పక్కకు ఓ చిక్కులోడు, ఇదీ బరివాతల దొరికిండ్రు. ఆడు యాన్నో బార్డర్ల పంజేస్తడంట. సెలవు మీదొచ్చిండంట. మిల్ట్రీల, గిల్ట్రీల ఎండ్ల పంజేస్తడో ఏమోగని, ఎత్తు పొడుగు వాటంగున్నడంట. ఆనికి మబ్బుల్నే రైలుంది. అందాక ఇగగీపని వెట్కున్నడంకోరాదు. జేబుల నాలుగు ఒందలుండంగ చేతుల వెట్టిండంట. తప్పైందని కాల్లు పట్టుకున్నడట..." హెడ్డు శర్టు గుండీలు విప్పి, కాలరెగరేసి, ఉఫ్ మని రొమ్ముమీద ఊదుకుని ఒకసారి అందరినీ కలయజూసి మళ్లీ మొదలు బెట్టాడు.

    "ఇగ ఇది శిన్నదా? బాగ సద్వుకున్నదేనట. పెద్దకులంల బుట్టందేనట. మరి ఎట్ల మోసపోయిందో ఏమో, చిక్కులోడు పెండ్లి జేసుకుంటనన్నడట. ఇది నమ్మింది. పొలీసోల్లకు దొర్కంగనే చిక్కులోడు దుల్పుకొని బయటవడ్డను. ఇగ మావోడు దాన్ని పట్కొచ్చి లాకప్పుల బెట్టిండు. వారం రోజులు దాంతోని బిజినెస్ నడిపిండు. ఎం.ఎల్యే, సమితి ప్రశిడెంటు, సిన్మాటఖీసు ఓనర్లు, పెద్ద పెద్ద సేఠ్‌లు, గిట్ల... రోజు మూడొందలు, నాలుగొందలు... ఆఁ మూణ్ణాలుగొందలు ఫీజు!" హెడ్డు సర్కాస్టిక్‌గా నవ్వాడు. "మూడొంతులు మా యస్సై గానికి, ఒక వంతు దానికి, ఇండ్లనే మా సి.ఐ.గాడు ఛాన్సు కొడుదామనుకొన్నడు కని, యస్సైగాడు కంత్రీ. డిపార్టుమెంటోల్ల వాసన తలగొద్దని మంకుపట్టు పట్టిండు. ఏ షకీల కేసోలెనో అయితే మల్ల భోంభోం అయితదని బుగులుబడి ఇడిశిండు. ఆ పోరి ఎడ్డిది. నోట్లె నాల్కెలేనిది."     "అయితె మీ యస్సైగాని శెయ్యిబడనే లేదన్నమాట -" నిరుత్సాహంగా అన్నాడు, గంగారం ఖాళీ అయిన ప్లేటు నింపుకుంటూ.
    "ఆహాఁ - మావోనికి గట్ల సన్నగ, బక్కగుంటె ఆనరు. ఆని పెండ్లామెట్లున్నది? మా వోడు ఇగో గిట్ల...గిట్ల కాగలిచ్చుకున్నడనుకో - ఈ చేతులు కల్వనే కల్వయి." - అని చెబుతూ గాలిని కౌగిలించుకుంటూ ఎగిరెగిరి పడ్డాడు హెడ్డు. ఆ వింత చేష్టలకు యిస్మాయిల్ "కొక్కోక్కొకో" అని కేకేసి పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వాడు. గంగారం గోడకు మరింత జారగిలబడి, కాళ్లు బార్లా చాపుకుని "ఇహ్హిహ్హీ" - అని మాంత్రికుని నవ్వు నవ్వాడు. ఎస్సై సంగతేమో గాని, ముందు వీళ్ళని చూస్తూ నవ్వాపుకోలేక పొయ్యాడు మస్సూధన్.

    ఎస్సై గురించి చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి మస్సూధన్‌కు. అవెంతో కష్టం కలిగిస్తున్నాయ్. మనసులో ఎంతో ఉదాత్తంగా ఎదిగిన పై అధికారి వ్యక్తిత్వం మరీమరీ కుంచించుకుపోతోంది. అందమైన ఆదర్శాల భవనం పగుళ్లుబారి కూలి పోతోంది. ఎస్సై ముందు, ఎస్సై భార్యముందు మంచితనం ప్రదర్శించే హెడ్డు ఇక్కడ ఇలా మాట్లాడటం ఎంతో ఘోరంగా అనిపిసోంది. ఇంట్లో యజమాని కాళ్ళు నాకి, బయట రోడ్డుమీద మొరిగే కుక్క నయమనిపించింది. మాటకు పదిసార్లు సారుసారని పలికే హెడ్డు ఇప్పుడిక్కడ వాడు వీడని మాట్లాడటం వల్ల, నీచమైన వ్యక్తిత్వం బయట పడుతోంది. ఏదో ఉన్నత విలువల కోసం పాటుపడుతున్న వాడిలా పోజు పెట్టే యస్సై నిజస్వరూపం హెడ్డు మాటల్లో బయట పడుతోంది. మస్సూధన్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. గుండెల్లో ఏదో బరువు. మెదడు మొద్దుబారింది. వళ్ళు తిరుగుతోంది. తాగమని ఇస్మాయిల్ మరీమరీ బలవంతం చేస్తున్నాడు. స్వంత మెదడు, స్వంత ఆలోచన ఉన్నట్టుగా కనిపించడు ఇస్మాయిల్. పైవాడి చేతిలో కీలుబొమ్మగా మారిన తోలుబొమ్మ. తనకు బాగా తాగించమని హెడ్డు పురిగొల్పి వుంటాడు. ఇవన్నీ మామూలే. ఇవిలేకపోతే అసలు డిపార్టుమెంటులోనే పనికిరావన్నట్లు మాట్లాడుతున్నారు. ఏదో అగాధంలో పడిపోతున్నట్లుంది మస్సూధన్‌కు. ఉద్యోగంలో చేరిన కొత్తలో మరీ బెరుకు బెరుకుగా వుండేవాడు. క్రమక్రమంగా తనూ వాళ్ళలో చేరుతున్నాడా? అనుమానం వచ్చింది అతనికి!
    "అన్నా! ఎంతైనా ఈ యస్సై జరస్టిక్టె గదా! పైస గూడ జర కమ్మితింటుండొచ్చు" - గంగారాం అన్నాడు.

        "స్టిక్టు - యమ స్టిక్టు! ఇంక దాని కడుగుతావ్? కని ఏర్పడకుంట తింటడు. ఎంకముందు చూస్తడు. ఎవ్వని దగ్గర పడ్తె వాని దగ్గర చెయి జాపడు. పైసదింటె మాత్రం పంజేస్తడు. ఇయ్యాల్రేపు పైస దిన్నాగాని పన్జేసేటోడేడి? గప్పుడు రెండేళ్ళ కింద మూర్తి అని యస్సై ఒచ్చెసూడు. ఆదేంది? ఆడు దినకపాయె. యాల్ల పొద్గాల్ల తోవ్వ బట్టియాల్సి ఒచ్చె. గట్లుంటది. ఈ యస్సై రాకముందు వెయ్యి పదిహేను వందలొచ్చేవి - మామూళ్ళు. ఈయనె రాంగనె ఇంకొవెయ్యి పెంచిండు. స్టూడెంటు పోరగాల్లను పిక్‌పాకెటీర్లను, ఫ్యాక్టరీ వర్కర్లను అందర్నీ హడల్ల బెట్టిండు. ఈల్లేంది? పెద్దపెద్దోళ్ళనే ఒనికిచ్చు కుంటడు. ఈల్ల పెదనాయిన ఒకడు డిఐజి వున్నడు. ముగ్గురు నలుగురు మినిష్టర్లు బాగ దగ్గరోల్లున్నరు. వారం పదిరోజులకొకసారి పట్నం పోయి... అందరిండ్లల్ల సలాంగొట్టుకుంట తిరిగొస్తడు గదా? అందుకని ఈడ టౌన్ల ఎవ్వనికేం బయపడేదుంటది? ఇగ టౌన్లున్నప్పుడు ఒక్క సుక్క తాగడు. అదే పట్నం పోతే ఏ బార్ల సూడు ఈడె. ఈని దోస్తు ఓడున్నడు కమర్షల్ టాక్స్ ఆఫీసరు. వాడు వీడు జంట. పోటీలు పెట్కొని కమాయిస్తరు. పోటీలు పెట్కోని బంగ్లాలు గడ్తరు."     "అయ్యో మర్శిన! యస్సైది ఏదో లోడుందట గద! పట్క పోయేడిదున్నదని యిస్మాయిల్ జెప్పిండు..."
        "గదే గదే శెప్తాన. ఇయ్యాల్ల రాత్రి టేకు చెక్కలు రోడ్డు మీదికొస్తయి. ఏడికి? గాంది బొమ్మ అవుతలి చౌరస్త ఉంది గద. అద్దాటి నంక కారం మిశినుంది సూడు, ఆడ నీ బండి ఆపుకో - ఆడికి లోడు దెచ్చేస్తం. తెల్లారెటలకు పట్నంల దిల్‌సుక్ నగర్‌ల ఎయ్యాలె. రెండు మూడు లక్షల బిల్డింగు గడ్తాండు మా గురుడు ఆడ! ఓ నాల్గు చెక్కలు అంబరు పేటల మనింటి కాడ ఎయ్యాలె - నీ యెంట యిస్మాయిల్ ఒస్తడు. అన్ని జెప్తడు.

        "మరి గాడ కట్టెల మండెక్కడిది? కట్టె కోత మిషిని గిట్ల కొత్తగ బెట్టిన్రా?" గంగారాం అనుమానంగా అడిగాడు. హెడ్డు అది అంతేలే అన్నట్టు చిన్నగా నవ్వి "ఆయన్ని నీకెంద్కు? ఆ బాదేదో నేనూ మా యిస్మాయిలూ, మస్సూధనూ పడతం. అంద్కే గదా మా కియ్యాల పర్మిషనిచ్చి పంపిండు. ఇగో గీ దావతుకు పైస లిచ్చిండు - లేకుంటే ఎవని పెండ్లికి? పుణ్యానికి రెండు మూడు వేల మామూళ్ళు మింగుతాండు. ఈ రాత్రికి ఇదయితే - రేపు మల్ల మనకు రమ్ము పార్టీ ఉంది..."     మస్సూధన్‌కు, గంగారాంకు ఉత్సుకత పెరిగింది. అంతా తెలిసిన వాడిలాగా యిస్మాయిల్ మామూలుగా ఉన్నాడు. ఆంలేట్లు తెచ్చిపెట్టిన చోటేను దగ్గరికి పిల్శి వాని నోట్లో సారాబొట్టు బలవంతంగా పోశాడు. వాడు ముఖమంతా వికారంగా పెట్టాడు. వెంటనే వేడి వేడి పకోడీలు తెమ్మని యిస్మాయిల్ మళ్ళీ పురమాయించాడు. వాడు సారా ఘాటుకు తట్టుకోలేక కాండ్రించి ఉమ్మేసి వంటింట్లోకి పరుగు దీశాడు.     హెడ్డు తన పేరు కూడా తలవడంతో మస్సూధన్‌కు విషయమేమిటో తెలుసుకోవాలనిపించింది.     "నేను గూడానా సార్, ఏం జెయ్యాలె?"     "మన మీదికేం రాదు బయపడకు"     "ఏందేయ్ బయపడకని మీ వోల్లకు లావులావు జెప్తున్నవ్ ఏం సంగతి? ఎవని కొంప ముంచుతరు నాయనా?" అని దీర్ఘం తీస్తూ అడిగాడు గంగారాం.     ఏదో రహస్యం చెబుతున్న వాడిలాగా హెడ్డు ముఖం గంభీరంగా పెట్టాడు. అందరూ వినండి అన్నట్టు అందరి వైపు చూసి మొదలు పెట్టాడు.     "గుడిమెట్ల బుచ్చయ్యని టీచరున్నడు. వజీఫా దీసుకున్నడు. మంచి పంతులని బాగా పేరున్నది. కష్టపడి పిల్లల సదివిచ్చు కున్నడు. పెద్దోడు ఇంజనీర్. ఖమ్మంల ఏదో కార్ఖానా పెట్టిండు. ఓ పిల్ల డాక్టరు కోర్సు సద్వుతాందట. అందరికంటె శిన్నోడు ఇయ్యాల్రేపు ఈ రాడికల్స్‌ల తిరుగుతాండు. జర... మూమెంటంటడు, ఇప్లవమంటడు. బియ్యే అయిపోయింది. లా సద్వుతున్నడు. ఒకటి రెండు గట్టి కేసులు పట్కోని మా గురుని మీద పైకి కంప్లెంట్ రాసి పంపిండు. అది మా వోనికి మంట! ఎట్లనన్న ఆల్లను దొంగ కేసుల యిరికించి సతాయించాలని పడ్డది. రెండ్రోజుల నుంచి ఇంట్ల ఎవరుంటలేరంట. ముసలోడు, ముసల్ది వుంటున్నరంట. ఇయ్యాల్ల రాత్రికి ఆల్లయిల్లు సోదా జేద్దమన్నడు."     మస్సూధన్‌కు అనుమానం వచ్చింది.     "ఓర్ని అన్నాలం పాడుగాను, ఏం దొంగ సొమ్ముందని వాల్లిల్లు సోదా జెయ్యాలె సార్"
         "హే - నోర్ముయ్. బాంచోత్. ఈ మాకెలౌడిగానికి ఏం దెల్వదేందిరా? పై వోని తోని ఏం మాట్లాడాలె తెల్వక పాయె..." హెడ్డు తీవ్రంగా కసిరిచ్చుకున్నాడు. ఆ మాట, ఎవరినన్నాడో మస్సూధన్‌కు తప్ప, మిగతా ఇద్దరికీ తెలిసిపోయింది. కొద్ది నిమిషాల ముందు అతను మాట్లాడిన తీరుకు ఇప్పటి తీరు పూర్తి విరుద్ధం. ముఖమంతా ఎర్రబడి క్రూరంగా తయారయ్యింది. మళ్లీ అంతలోకే నవ్వు తెచ్చి పెట్టుకుని "అరే మస్సూధన్ " అని పెద్దగా అరిచాడు. బొటన వేలు పైకెత్తి చూపుడు వేలు పిస్టల్‌లా గురిపెట్టి "ధనా-ధన్ నీ యవ్వ! నీకింకా తెల్వదు పోలిసోల్ల ఎవ్వారం. సొమ్ము దొంగదైనా, దొరదైనా సోదా చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు. మన కాకి బట్టల పవరు నీకింకా తెల్వకపాయె" - అని బిగ్గరగా నవ్వాడు. మస్సూధన్ తల తిరిగి పోయింది. తను అడిగిన దాంట్లో ఏం తప్పుందని హెడ్డు అంతంత మాటలంటున్నాడు. వళ్ళు మండింది. మిగతా ఇద్దరినీ చూసాడు. హెడ్డు ప్రవర్తన మామూలే అన్నట్లు వాళ్ళు నవ్వుకుంటూ గ్లాసులెత్తుతున్నారు.

        "సాబ్, మాఫ్ కర్‌నా సాబ్. మస్సూధన్‌కు ఏమి ఎరుక? మీరు ట్రెయినింగ్ ఇయ్యాలె. మీ తర్ఫీదు బాగుంటది" అన్నాడు ఇస్మాయిల్ వినయంగా. హెడ్డు దర్జాగా నవ్వాడు. యిస్మాయిల్ మస్సూధన్ వైపు తిరిగి కన్ను కొట్టాడు. చూసావా హెడ్డును ఎలా దారిలో పెట్టానో అన్న భావం వుంది అందులో.     "ఆఁ సోదా చేసి ఏం జేస్తరు?" - దొంగ నవ్వు నవ్వాడు లారీ డ్రైవరు.     "అర్థరాత్రి ఇంటిమీద బడి మీ ఇంటికి వాడొస్తడా వీడొస్తడా అని అడుగాలె. తీవ్రవాదుల తోటి సంబంధమున్నదని బెదిరియ్యాలె. గౌర్నమెంటు ఖిలాఫ్‌ల పంజేస్తున్నరని అదరగొట్టాలె. సామానంత కల్లం కల్లం జెయ్యాలి. చిన్న కొడుకుయి పుస్తకాలు దొరుకుతయి. అన్ని మూటగట్టుకోవాలె. రావాలె."     "మరి టేకు చెక్కల కత శెప్పకనే పోతివీ?" అసలు విషయం చెప్పనే లేదని గుర్తు చేశాడు గంగారాం.
        "ఆఁ చెక్కలా!" - అని అర్థవంతంగా నవ్వి "ఉన్నయి ఉన్నయి. అవి గూడ ఉన్నయి. ఎస్సై ఇన్వెస్టిగెషన్ల బడ్తడు. ఎక్కడెక్కడి రూల్సు దీసి అడుగుతడు. సెక్షన్లు జెపత్డు, నానా హంగామ జేస్తడు. వాడో పెద్ద పత్తిత్తుగాడు గాదు! మమ్ముల సోదా జెయ్యమంటడు. మేం జేస్తం. రాత్రికి ఆ బజార్ల కరెంటు రాకుండ జేశినం. కొట్టంల కోశి పెట్టిన చెక్కలు మా బచ్చాగాండ్లు రోడ్డుమీదికి మోస్తరు" అని హెడ్డు మెచ్చుకోలుగా చూశాడు - యిస్మాయిల్‌ను, మస్సూధన్‌ను.

        గంగారాం కండ్లు మూసుకుని, తెరలు తెరలుగా విపరీతంగా నవ్వి "నీ గు- నీ యస్సై గు-" అంటూ నోటినిండా కసికసిగా బూతులు తిట్టి "ఠూ నీ యవ్వ - మీ పోలీసోల్లంత దొంగలు ఎవ్వల్లేరారి!" అని ఉమ్మేశాడు.     "అసలే ఆడు బత్కలేక బడి పంతులు. ఎంత కష్ట పడి కొన్నడో ఏమో ఇంటి చెక్కలు!" - నుదురు కొట్టుకున్నాడు గంగారాం.     "ఆఁ -ఆఁ- కొన్నడు. కొన్నడు. కొన్నదంతా ఎల్తది. ఆని శిన్న కొడ్కు అడవులల్ల గోండాగాండ్ల తోటి తిరిగేది ఎవని కెర్కలే. ఆల్లను బుట్టలేసుకుని, దొంగతనంగా శెట్లు గొట్టించిండని దబాయించే తెల్వి లేదనుకున్నవా?" - అని బొమ్మలెగరేస్తూ, పెదాల సందుల్లోంచి నవ్వు విషం కక్కాడు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మి నారాయణ.     "ఆఁ దబాయిస్తరు మీదేం బోయింది. కర్మగాలి కేసు పెద్దగయినా మీకు లెక్కలేదు. అయినా కేసు పెద్దగెట్లయితది? వకీల్లాయర్లను పొట్టుపొట్టున తంతరాయె. పేపరోళ్లు ఏమన్న రాస్తే ఆల్ల ఈపు ఇమానం మోగిస్తారాయె. లఫ్‌డా గాల్లు మీక్కేసెక్కడిది? లవుడెక్కడిది" హెడ్డు అహం పూర్తిగా దెబ్బతీయాలనుకున్నాడు లారీ డ్రైవరు గంగారాం. కాని అలా జరగలేదు. అతనికి కోపం రాలేదు.     ...రాత్రిపూట రైడింగ్ వగైరా మస్సూధన్‌కు కొత్త. భయంగా వుంది. చుట్టూ చూశాడు. మత్తుగా వుంది వాతావరణం. ఇది ఎస్సై గాడు ఎక్కించిన మత్తన్న మాట! మస్సూధన్‌కు కండ్లు తెరుచుకున్నట్లయింది. పైన మబ్బులు నల్లగా ఐనాయి. ఉరుములు మెరుపులు మొదలైనాయి. మస్సూధన్ మానసిక స్థితి లాగే వాతావరణం భయంకరంగా మారుతోంది. అధికారం ఆజ్ఞల్లాగా ఉరుములు భయపెడుతున్నాయి. చేతులకు బేడీలేసినట్లుగానూ, ఉద్యోగం జైలు లాగానూ అనిపించింది. మెల్లగా మత్తు తేలిపోతున్నట్లు, దుఃఖం ముంచుకొస్తున్నట్లు అనిపించింది. అందరి ముఖాలు మార్చి మార్చి చూశాడు మస్సూధన్. అందరూ ఘనకార్యం చేయబోతున్న వాళ్ళలాగా ఉత్సాహంగా ఉన్నారు...     "అవునుమల్ల మరేమనుకున్నావ్? సాంతి బద్రతలు కాపాడాలె" - అని విశ్వరూపం ప్రదర్శించాడని చెప్పబడే శ్రీకృష్ణ భగవానుడిలా అభయముద్ర్ద పెట్టి, చిద్విలాసంగా నవ్వాడు హెడ్డు లక్ష్మినారాయణ.     హెడ్డు విశ్వరూపం చూడలేక లేచి - పిచ్చోడిలా నవ్వుతూ, కుప్పిగంతులేస్తూ, తూలుతూ తూలుతూ అక్కణ్ణించి వెళ్ళిపొయ్యాడు మస్సూధన్.     టీచరు ఇల్లు సోదా చేయడానికి సరైన కారణం లేదు. పైగా విలువైన టేకు చెక్కలు ఎత్తుకు రావాలని తెలిసాక, తన ఉద్యోగమ్మీద అసహ్యం వేసింది - మస్సూధన్‌కు. బ్యాంకు దోపిడీల వెనుక, నగర శివార్లలోని దొంగతనాల వెనుక, కేబరేలు నడిపే హోటళ్ళ వెనుక, పెద్ద పెద్ద పోలిసు అధికారుల చేయివుందని, ఎవరో అంటే - కోపం తెచ్చుకున్నాడు గానీ, ఇప్పుడు అవన్నీ ఆలోచించాల్సి వస్తొంది.     తన ఉద్యోగం తనను అక్రమంగా సోదా చేసి, అంతరాత్మను దోపిడి చేస్తున్నట్లయింది మస్సూధన్‌కు.
(జ్యోతి మాసపతిక్ర దీపావళి ప్రత్యేక సంచిక 1985లో ప్రచురితం)
Comments