స్పర్శించే స్వరం - ఎ.రవీంద్ర బాబు

    ఆశబోతు, పొగరుబోతు. సమకాలీన వీరుడు. ఒక్క అక్షరం ముక్కతో సమాజాన్ని ఎదిరించినోడు. జీవితాన్ని యుద్ధమంత అందంగా జీవించినోడు. ప్రగతిశీల ఉద్యమాల బాటలో పూలై పూసినోడు. చీకటి జీవితంలో కూడా చిరునవ్వును వీడనోడు. ఆకాశానికి, భూమికి హద్దులు చెరిపేసినోడు. మాటలకు, రాతలకు మధ్య ఖాళీని పూరించినోడు, ప్రపంచాన్ని తిరగేసి సత్తా చాటాలనేటోడు. ఎగిరే జెండాలకు దరువైనోడు. బతుకుపుటల్లో కవిత్వపు మెతుకులు తిన్నోడు.

    తాగుబోతు, తిరుగుబోతు. సాహిత్యమంటే తీరని ప్రేమున్నోడు. సముద్రాన్ని ఎదురించి అలలకు తన తాత్వికత బోధించెటోడు. హిందీ అయినా, ఇంగ్లీషైనా అనువాదాల నిండా తన ముద్రను చెరిపేసుకోగలిగినోడు.

    మనిషిని ... మనసును తనకు మించి ప్రేమించగలిగినోడు. సమాజపు పొరలు దాటి బతకటం చేతైనోడు. హృదయానికి స్వేచ్ఛను, స్వచ్ఛతని ఇవ్వగలగినోడు.
    
    వాడు .. నిజంగా ... నిఝంగా వాడే. వాడి గురించి ఇలా రాస్తూపోతే అక్షరాలు ఎరుపెక్కుతాయ్ ... నల్లరంగు పులుముకొని నవ్వేస్తాయ్ ... మౌనంగా రోదిస్తాయ్ ... ద్రవాలై స్రవిస్తాయ్ ... ఆపై క్రీడిస్తాయ్.

* * * 

    ఉదయం ఎనిమిది గంటలు. అపార్ట్‌మెంట్‌లో ఐదో ఫ్లోర్. బెడ్ పై మగత నిద్రలో బద్ధకంగా శరీరాన్ని సాగదీస్తున్నా. కప్పుకున్న దుప్పటి వెచ్చదనం దూరమై చాలా సేపైనట్లుంది. కిచెన్లో మా ఆవిడ అంజలి టిఫిన్ కై  కుస్తీపడ్తూ శబ్దాలు చేస్తోంది. ఆ శబ్దాలలో హాల్లోనుంచి వస్తున్న నా సెల్ రింగ్ టోనూ కలిసిపోయిందేమో ...! నాకు వినపడలేదు.

    "ఏవండీ ... ఇందాకట్నుంచీ ఫోన్ రింగవుతుంటే ...'' అంటూ సెల్ తీసుకొచ్చి ఇచ్చింది. పేరు చూసి లిఫ్ట్ చేశాను. వాడు కాదు. అపరిచిత కంఠం.

    "హలో చెప్పండి ...'' అన్నాను.

    "ఈ ఫోనతను ఇక్కడ చనిపోయి పడివున్నాడండీ ... రెండు మూడు నెంబర్లు డైల్ చేస్తే ఏవీ రింగ్ కాలేదు. మీదయింది ... ఈ సెల్ అతనిదే. మీరు ...'' అన్నాడు అతను.

    అంతకుమించి ఆ వ్యక్తి మాటలు నాకు వినపడలేదు. గుండె బరువెక్కి కళ్లల్లో నీళ్లు తన్నుకొచ్చాయి. శరీరం మొత్తం పిడచగట్టుక పోయినట్లయింది. నరాలు తెగుతున్న శబ్దం నాలో నాకే వినపడసాగింది.

    "ఎక్కడ ...?'' అని పెగలని గొంతుతో అడిగాను.

    అవతలి వ్యక్తి అడ్రస్ చెప్పాడు.

    వాయిస్ కట్ అవుతూ ... కట్ అవుతూ వినిపించింది. బహుశా నా చెవులే పూడుకుపోయాయేమో...! "అంజలీ త్వరగా ...'' అంటూ అట్లానే దూకుడు లాంటి నడకతో లిఫ్ట్ ఉన్న విషయం మర్చిపోయి  అపార్ట్‌మెంట్‌  స్టెప్స్ దిగుతుంటే ...

    "ఏమైందండీ...? ఎవరు...? ఎక్కడికి...?'' అంటూనే అంజలి నన్ను అనుకరించింది.

    ఆటో ఎక్కాం.

    "... వాడు చనిపోయాడంట...!'' అంజలి నమ్మలేనట్లు నా కళ్లల్లో బయటకి రాలేక బాధపడుతున్న నీళ్లను చూసింది. బహుశా ఆగిపోతుందేమో అనుకున్న నా గుండె శబ్దం అందులో కనపడ్డదేమో ...! మౌనంగా ఇక ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఇద్దరి మధ్య స్మశానమంత నైరాశ్యం. శూన్య స్థలానికి అటు ఇటు వేలాడ దీసినట్లు మా మనసులు. మా శరీరాలు రెండు దుఃఖ సముద్రాలయ్యాయి. మా హృదయాల నిశ్శబ్ద చప్పుళ్ళ మధ్య ఆటో శబ్దం వినపడటం లేదు.

    "త్వరగా పోనివ్ ...'' అని అంజలి ఆటో అతనిని తొందర చేసింది.

    ఆటో రోడ్డును  చీలికలు చేస్తూ వెళ్తోంది. నా మనసు వాడికి సంబంధించిన గతాన్ని చీలికలు పేలికలు చేస్తోంది.

  * * *

    ఆఫీసు పక్కన టీ క్యాంటిన్లో కూర్చొని సిగరెట్ పొగల మధ్య సాహిత్య సువాసనను పీలుస్తున్నాను. ఎదురుగా ఇద్దరు కొలీగ్స్. "మీ ఫ్రెండ్ మూమెంట్లో ఉన్నప్పుడు మంచి కవితలు ... పాటలు రాశాడు. ఇప్పటికీ అవి చదువుతుంటే ...'' "ఏవో కొన్ని జీవిత అనుభవాల నుంచి వచ్చిన తీవ్ర ఉద్వేగ క్షణాల్లో రాసినవి అయ్యి ఉంటాయి'' ఇంకోతను.

    "అవును ... మూమెంట్ నుండి ఎందుకు బయటకొచ్చినట్లు ?'' ప్రశ్న. "చెట్టే కాదు ... శాఖలూ అస్తిత్వాన్ని కోరుకుంటున్నప్పుడు తప్పదు కదా ...'' తెలీక అలానే చెప్పాను. బహుశా తెలిసే చెప్పానేమో నాకూ తెలియదు.

    "ఏమైతేనేమి లెండి ... స్త్రీ వాద, దళితవాద, ప్రాంతీయవాద సాహిత్యానికి వెన్ను దన్నుగా వున్నాడు'' మొదటతను. ఇంతలో ... వాడే వచ్చి అలవాటుగా నా పక్కన కూర్చొని, చేతిలో సిగరెట్ లాక్కున్నట్లు తీసుకొని నాలుగు పఫ్‌లు  తాగాడు. ఎదురుగా ఉన్నవాళ్లకు ముక్తసరిగా రెండు పలకరింపులు విసిరేశాడు.

    "ఎంతుంది జేబులో ...'' అంటూ క్వార్టర్ మందుకు ఎంత అవసరమో అంతే తీసుకొని వెళ్లిపోయాడు.

    "రాత్రికి ముకు వస్తే వస్తా లేకపోతే లేదు ... '' సగం మాటలు గాల్లోనో వాడి నోటి నుంచి వచ్చే మందు వాసనలోనో కొట్టుకుపోయాయి.

* * *

    "నాకేమో ... సాలరీ రాలేదు. బాగా ఆలస్యం అయ్యేటట్లుంది. ఖర్చులకి డబ్బు లేదు. రూం అద్దె కట్టలేదు. ఏం చేద్దాం పైగా నీ ... తాగుడికీ ...'' చివరి పదాన్ని కావాలనే వ్యంగ్యంగా అన్నాను.

    మరి వాడ్ని వాడి జీవితాన్ని ఉద్ధరిద్దామని బతిమాలి రూంలో ఉంచుకుంటున్నాను. కానీ ... అది నావల్ల కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

    "నువ్వు ఆఫీసుకు పోయిరా... రాత్రికి ఎట్లానో చూద్దాం లే'' అన్నాడు.

    రాత్రి ఆఫీసు నుంచి వచ్చేసరికి మందు, బిర్యానీ మధ్య విరక్తిగా నవ్వేస్తూ వాడు.

    "ఎలారా...?'' అన్నాను.

    "కూర్చో'' అంటూ నాకొక బిర్యాని పొట్లం ఇచ్చి, నాకోసం తెచ్చిన కూల్ డ్రింక్  సీసా ఇచ్చాడు.

    "ఏం ... లేదురా ... మనకు తెలిసిన పబ్లిషర్ చాలా రోజుల్నించి రెండు ట్రాన్స్లేషన్ వర్క్స్ చేసిపెట్టమని చంపుతున్నాడు. సరే చేస్తానని తెచ్చాను. అందుకు అడ్వాన్స్ ఇచ్చారు. ఇదిగో ...'' అంటూ జేబులో ఉన్న మొత్తం నా చేతిలో పెట్టాడు. "నువ్వూ ఉంచుకోరా కొంత'' అంటే -

    "నువ్విస్తావు కదరా ... అవసరమైనప్పుడు'' అన్నాడు.

    అప్పుడిక అలవోకగా ఎన్నో ప్రపంచ సాహిత్యపు కబుర్లు ... పాటలు ... కవితలు మా మధ్య మత్తుగా దొర్లిపోయాయి. ఆపై నిషాగా దిగిపోయాయి.

    అర్ధరాత్రి మెలుకువ వచ్చి చూద్దును కదా ... వాడు ట్యూబ్లైట్ కాంతిలో అనువాదాలకి మన భాషా నగీషీలు అద్దుతున్నాడు. ఏ ప్రఖ్యాత ఆంగ్ల రచయితనో, ఫ్రెంచి రచయితనో తెలుగు వాళ్ల గుండెలపై చెక్కుతున్నాడు.

    అలా వాడు వారం రోజులు రూమ్ దాటిపోలేదు. వర్క్ పూర్తయ్యాక వారం రోజులు కనపడలేదు. నేను ఫోన్ చేస్తే "ఎక్కడికి పోతాను? వస్తాను'' ఇదే సమాధానం.

    ఏ సాహిత్య మీటింగుల్లోనో ... సభలు సమావేశాల్లోనో తత్వశాస్త్రానికి సాహిత్యాన్ని అనుసంధిస్తూ లేక చరిత్ర గతిని తిప్పిన కవిత్వ వాక్యాల గురించో ఆవేశపడుతుంటాడు.

* * *

    ఆ రోజు అంజలిని వాడికి పరిచయం చేసినరోజు.

    "బాగుందిరా నువ్వూ ప్రేమలో పడ్డావ్ ... పెళ్లి చేసుకోబోతున్నావ్ ...!'' అది ఆనందమో, విరక్తో ఇప్పటికీ నాకర్థం కాదు. కొంత పరిచయం పెరిగాక అంజలి వాడ్ని అడిగింది. నాకు తెలుసు ఆ ప్రశ్నలకు వాడి నుంచి సమాధానాలు రావని.

    "నువ్వూ ... పెళ్లి చేసుకోవచ్చు కదా?''

    ఒక నవ్వు నవ్వాడు ... మూతిని వంకర తిప్పడానికి ప్రయత్నిస్తూ.

    "అంటే ...?'' అంది అంజలి.

    "గమ్యం దూరమైనప్పుడు అస్తిత్వం కోసం ప్రయాణించడం కూడా తప్పేమో ...! అయినా నాకు నేను లేనప్పుడు ఇంకొకరికి ఎలా ...?'' అన్నాడు.

    అర్థమై అర్థంకాని వాక్యాల మధ్య వాడి జీవితాన్ని, ఆలోచనలను ఆలోచించి నేనే టాపిక్ కట్ చేయించాను అంజలి చేత.

* * *

    ప్రెస్ క్లబ్ జనంతో నిండిపోయింది. సభలో పెద్ద పెద్ద కవులు, రచయితలు, విమర్శకులు, సాహిత్య ఉద్యమకారులు ఉన్నారు. స్టేజి మీద వాడొక్కడే మాట్లాడుతున్నాడు. సాహిత్యానికి ... సమకాలీన సాహిత్యానికి దిశానిర్దేశం చేస్తున్నాడు. మధ్యమధ్యలో అలవోకగా కవిత్వాన్ని ముక్కలుగా విడగొట్టి శిల్ప రహస్యాలను విచ్ఛేదం చేస్తున్నాడు. సుమారు రెండుగంటలకు పైగా సాగింది వాడి ఉపన్యాసం.

    తర్వాత రికార్డు చేసిన వాడి ఉపన్యాసాన్ని ఒక సాహిత్య ప్రచురణ సంస్థ పుస్తకంగా తీసుకొచ్చింది. అది హాట్ కేకుల్లా అమ్ముడైంది. పునర్ముద్రణలు పొందుతూనే ఉంది. పరిశోధకులకు, విమర్శకులకు, సాహిత్యాభిమానులకు కరదీపికలా వెలుగుతూనే ఉంది. వివాదాలు రేపుతూనే ఉంది.

* * *

    "శారద నుంచి నాలుగైదు సార్లు ఫోన్ వచ్చిందిరా'' అని చెప్పాను.

    "శారదా ...'' ఆశ్చర్యంగా, అనుమానంగా, ఇష్టంగా అడిగాను.

    "అవును. ఎందుకో పొద్దుట్నుంచి నాలుగైదు సార్లు చేసింది'' చెప్పాను.

    "డబ్బులెంతున్నాయ్...?'' అంటూనే గోడకు తగిలించి ఉన్న నా షర్టు జేబులోంచి తీసుకొని వెళ్లిపోయాడు.

    రెండు రోజుల తర్వాత వచ్చాడు.

    "ఒరేయ్ ... ఇలాంటి స్నేహాలు మానవా? అయినా ... శారదన్నా, విజయన్నా ఎందుకురా పడిచస్తావ్?'' అడిగాను. "వాళ్లు డబ్బుకోసం శరీరాల్ని అమ్ముకునే వాళ్లు. అందరిలా మనసుల్ని కూడా అమ్ముకోలేని అభాగ్యులు. అంతో ఇంతో ఈ శరీరంతోనే కాదు, ఈ మనసుతో కూడా సంబంధం ఉన్నోళ్లు. తప్పదు'' చెప్పాడు.

    "మరి పెళ్లి చేసుకోవచ్చుగదా ... వాళ్లల్లో ఎవర్నన్నా'' అన్నాను తెలివి తక్కువగా.

    "ఊఁ ... ఇప్పుడు వాళ్లు వాళ్ల ఇష్టప్రకారం శరీరాల్ని అమ్ముకుంటున్నారు. పెళ్లితో వాళ్ల అన్ని ఇష్టాలకు గిరిగీయలేను. అలాగని గీయకుండా ఉండలేనేమో ...!'' నిక్కచ్చిగా చెప్పాడు.

    కొత్తగా వాడు వేసిన కవితా సంపుటిలోంచి 'వాల్మీకం' కవితను తీసి వినిపించాడు.

    ఇక మాట్లాడటానికి నా దగ్గర మాటలే కాదు, ఆలోచనలూ లేవు. అంతా నిశ్శబ్దం.

* * *

    ఆటో మా నిశ్శబ్దాన్ని భగ్నం చేసే శక్తి లేక పోతూనే ఉంది.

    చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. ఆటో ఆపి దిగాం. వాళ్ల మధ్యలోంచి నేను అంజలి దగ్గరకు వెళ్లాం.

    వాడు నిశ్చలంగా యోగ నిద్రలో ఉన్నట్లున్నాడు. వాడు పడుకున్న తీరు చూస్తుంటే వాడి ఆలోచనలే గుర్తొచ్చాయి. నా కళ్ల నుండి నాకు తెలుస్తూనే కన్నీటి చుక్కలు ఛేతనంగా రాలుతున్నాయి. తుడిచే ప్రయత్నం చేయలేకపోయాను. అంజలి నిస్సత్తువగా వాడి పక్కనే కూలబడిపోయింది.

    ఎలా చనిపోయాడో, ఎప్పుడు చనిపోయాడో వాళ్ల వాళ్ల కల్పనతో అక్కడున్న వాళ్లు చెప్పుకుంటున్నారు.

    "ఇదిగో సార్ .. అతని సెల్. నేనే ఫోన్ చేసింది'' అంటూ నాకు సెల్ తెచ్చి ఇచ్చాడు ఒకతను.

    ఐదు నిమిషాలు ఏం చేయాలో అర్థంగాక వాడి వైపే చూస్తూ నిలబడిపోయాను నేను శవంలా ...!

    చెప్పుల కింద నలుగుతున్న సిగరెట్ పీకలు, దొర్లుతున్న ఖాళీ సీసా ... సముద్రంలోంచి వెనక్కు ప్రవహిస్తున్న నది. గాలికి ఊగే ధాన్యం రాలిపోయిన వరి పొలాలు. వెన్నెల కురవని చెంద్రుడు. అన్నీ అలా ... అలా గుర్తుకు వచ్చాయి. మనలోకంలోకి వచ్చి చూద్దును కదా ... వాడి జేబులోంచి ఇంకుపెన్ను విరగబడి నవ్వుతోంది. ఆ నవ్వులో ఓ తృణీకారం. చావును సైతం లెక్కచేయని ధిక్కారం.

    ఎక్కడో ఎప్పుడో చదివిన వాక్యాలు గుర్తుకొచ్చాయి.

    'కాలం అప్పుడప్పుడు కుట్రలు చేస్తుంది'

    నా అంతరంగిక సాహితీ మిత్రులు నలుగురైదుగురికి ఫోన్ చేసి విషయం చెప్పాను. శారదకు, విజయకు ఫోన్ చేయాలా వద్దా అని అనుకున్నా ... చెప్పాను.

    ఎలా తెలిసిందో తెలియదు. పత్రికల వాళ్లు, టీవీ వాళ్లూ వచ్చారు. ఫోటోలు, వీడియోలు ... అన్నీ వాడికి ఇష్టం లేనివే ... సమాజానికి ఇష్టమైనవే ...

    "ఎందుకిలా జరిగింది ...? ఎలా చనిపోయాడు...?'' ఒక టీవీ అతను స్పీకర్ నా ముందు పెట్టాడు. ఏం చెప్పాలో తెలియదు. చలం గుర్తొచ్చాడు ... ఆ వాక్యాలూ ఇలా గుర్తొచ్చాయి.

    'ఈ ప్రపంచానికీ వాడికీ ఎప్పుడూ యుద్ధమే
    ఈ విలువల తోటి ఈ నీతి నియమాలతోటి'

    పోలీసులు వచ్చారు.

    నేను ఫోన్ చేసిన స్నేహితులూ వచ్చారు.

    అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోతూ ఉంది.

    పోలీసులతో విషయం డిస్కస్ చేశాం. అన్నీ సజావుగానే సాగుతున్నాయ్ ...

    రేపు ఎంతమంది సాహిత్యకారులు వీడి అనుబంధానికి తమ పేరుకు వాడుకుంటారో...!

    రేపు ఎన్ని సత్యాలు అసత్యాల్ని పూసుకొని వీడి జీవితాన్ని మలినం చేస్తాయో ...!
వాడు ... ఎందుకు బతికాడో ... ఎలా బతికాడో ... అన్నీ ఆ క్షణం నుంచే వాడి నుండి దూరం చేయబడుతున్నాయి. సాక్ష్యాలూ ... తారుమారవుతాయి. సాహిత్యంలో ...! వాడి జీవితంలో ...! ముసుగేసుకున్న ఈ వ్యవస్థలో ...!

(ఆదివారం ఆంధ్రజ్యోతి 5 జూన్ 2011 సంచికలో ప్రచురితం)

Comments