శ్రమ సౌందర్యం - అంబల్ల జనార్దన్

        
ఠాణే నుండి బయలుదేరిన లోకల్ రైలు, ఛత్రపతి శివాజి టర్మినస్ వైపు దూసుకుపోతోంది. లగేజి డబ్బాలో, కొమురయ్య అతని సహచరుడు-రెందొందల భోజనం డబ్బాలు.     రైలు ముందుకి, కొమురయ్య ఆలోచనలు వెనక్కి.     ఎక్కడి అచ్చంపేట? ఎక్కడ ముంబయి? పాలమూరు పేరును సార్థకం చేస్తూ తనూ వలస వచ్చాడు. ఆసియా ఖండంలోనె అతిపెద్దదైన మురికివాడ "ధారావీ" లో తన మేనమామ, గత యాభై ఏళ్ళుగా పాతుకుపోయాడు. చిన్నసైజు నాయకుడిగా పార్టీల జెండాలు మోస్తున్నాడు. అడ్డమైన దార్లుతొక్కి కొట్లకు పడగలెత్తాడు. చూడడానికి రేకుల గుడిసెలా ఉన్నా, అతని రెండస్తుల ఇంటిలో, లేని హంగు లేదు. మెత్తని సోఫాలు, డన్ లప్ పరుపులు, హోం థియేటరు నుండి ప్లాస్మా టీవీ దాకా వివిధ దృశ్య, శ్రవణ యంత్రాలు, బయట ఎంత ఎండ ఉన్నా, లోపల హాయిగొల్పే ఏ.సీ.లు.     అతనేదో తనకు బతుకు దోవ చూపిస్తాడని గంపెడాశతో వస్తే? తనను నట్లేట్లో ముంచాడు. తనని పనివాని కంటే హీనంగా చూసాడు. అతని కుటుంబ సభ్యులు కూడా, తనని ఎన్నో అవమానాలకు గురిచేసారు. గొడ్డుచాకిరి చేయించుకుని కూడా, పట్టెడు మెతుకులకు కటకటలాడేట్టు చేసారు. ఆ మాత్రం తిండికి ముంబయివరకు రావాలా?     తన అన్నయ్య ఏదో ఒరగబెడతాడని మా అమ్మకు ప్రగాఢ విశ్వాసం. అదే నమ్మకంతో తను ఇంత దూరం వస్తే, తగిన శాస్తే జరిగింది. ఆ ఒక్క సంవత్సరం నరకం కళ్ళ జూసాడు తను. తిరిగి ఊరు వెళ్లడానికి మనసొప్పలేదు.     జీవితం లో పైకి రావడానికి ముంబయికి మించిన వేదిక లేదు. కేవలం ఖాళీ పొట్టచేతబట్టుకుని వచ్చి, కొట్లకు పడగలెత్తినవారెందరో, ముంబయిని జయించారు. తను కూడా, ముంబయిలోనే ఏదైనా సాధించాలి. తనను తాను నిరూపించుకోవాలి.     దృఢమనస్సుతో, కొందరు స్థానికుల మద్దతుతో, వేరే బస చూసుకున్నాడు. మేనమామ ఉక్కు పిడికిలి నుండి బయట పడ్డాడు. చిన్న, చితక పనులతో పొట్ట గడువ సాగింది.     తన గమ్యం, కేవలం భుక్తి కాదు. జీవితంలో ఎదగాలి, తన సత్తా చాటాలి, అనే పట్టుదల. బాగా డబ్బు గడించి తన తల్లిదండ్రులను సుఖపెట్టాలనే తపన. వ్యాపారం చేద్దామంటే, తగిన పెట్టుబడి లేదు. మంచి ఉద్యోగానికి సరిపడే చదువు లేదు. కేవలం తన రెండు రెక్కలే పెట్టుబడిగా ముందుకుపోవాలి.     అప్పుడు పరిచయమయ్యాడతను.     తాను నెలకు పదిహేను వేలు సంపాదిస్తున్నాననేసరికి అవాక్కయ్యాడు తను. సద్దులు మోస్తూ నెలకు అంత సంపాదనా?     అవును, అతను ముంబయి డబ్బావాలా!     కొన్నిరోజుల స్నేహంతో ఇద్దరూ తమ కష్టసుఖాలు పంచుకున్నారు. ఇద్దరిదీ గ్రామనేపథ్యమే. రాష్ట్రాలు వేరైనా, ఇద్దరి ఆర్థిక పరిస్థితి మాత్రం ఒకటే. మాటల్లో మాటగా అతను తనని, వారి డబ్బావాలా సంఘంలో చేర్చడానికి ప్రయత్నిస్తానన్నాడు. తనలోనే ఊగిసలాట!స్కూల్ ఫైనల్ పాసైన తను, డబ్బాలు మోయడమా? ఊళ్ళో తన పరువేం కాను? ముంబయి వచ్చే ముందు డాంబీకాలు పలికిన తను, తిరిగి వెళ్లి, డబ్బాలు మోస్తున్నానని చెప్పాలా?     అవునూ, సంపాదన న్యాయమైనదైతే, ఏ పని చేస్తేనేం? తన మేనమామలా, అడ్డదార్లు తొక్కడం లేదే? అటెండరుగా చేరితే, మూడు వేలకి మించి రావు. అయినా సంఘం దృష్టిలో అదో మర్యాదకరమైన ఉద్యోగం! అంతకు ఐదింతలు సంపాదించే అవకాశం ఉన్నప్పుడు, కాస్త కష్ట పడితేనేం? కలకాలం అదే పని చేయాలని లేదే? చదువు కొనసాగించి, మంచి ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేసుకునే వెసులుబాటు ఎలాగూ ఉంది. యవ్వనంలో శ్రమకోర్చుకోకపోతే, జీవితాన్నెలా జయించేది? తనలో అంతర్మథనం.     అవసరం భేషజాన్ని జయించింది.తీరా వెళ్లేసరికి, డబ్బావాలా సంఘంలో తనకు ప్రవేశం లేదన్నారు.తమసంస్థ స్థానికులకొరకే ఉన్నందున , పరాయి రాష్ట్రం వారికి తమ సంస్థలో ప్రవేశం ఇవ్వమన్నారు. తన కుటుంబ పరిస్థితులు ఏకరువు పెట్టి, వారిని ఒప్పించేసరికి, తాతలు దిగొచ్చారు. తన స్నేహితుడు ఈ విషయంలొ చాలా శ్రమ పడ్డాడు. సంఘంలో చెర్చుకోవడానికి ఇద్దరి పూచీకత్తు కావాలంటే, వారిని కూడా అతనే ఏర్పాటు చేసాడు.     ఎట్టకేలకు డబ్బావాలా ట్రేనింగ్ లో చేరాడు తను........     సి.ఎస్.టీ. స్టేషన్ వచ్చింది, కొమురయ్య వర్తమానం లోకి వచ్చాడు. అతని సహచరులు ప్లాట్ ఫాంపై తయారుగా ఉన్నారు. రైలు ఆగీఆగగానే డబ్బాల కట్టెపెట్టెలు వడివడిగా దింప సాగారు . వాటిని కొందరు స్టేషనుబయటికి మోసుకెళుతున్నారు. ఆ పెట్టెలన్నీ ఓ చోట చేర్చి, అక్కడి నుండి, తోపుడు బండ్లళ్లో కొందరు, సైకిళ్ళపై కొందరు, తమకు కేటాయించిన డబ్బాలు తీసుకుని పరుగెడుతున్నారు.     కొమురయ్య, అతని సహచరుడు ధోండూ, తమవంతు డబ్బాలు తీసుకుని, రెండుచక్రాల తోపుడుబండిని బలార్ద్ పియర్ వైపు మరలించారు.
        వేరు వేరు భవనాల వద్ద ఆగి, ఆయా సద్ది డబ్బాలు తీసుకుని ఆఫీసు క్యాంటీన్ లో పెట్టడం, మళ్లీ ఇంకో ఆఫీసుకు పరుగెత్తడం. ఉరుకులు పరుగులతో, గంటలోగా డబ్బాలన్నీ సరఫరా అయ్యాయి.
    ఆ తర్వాత, 'తమ’ డబ్బాలు తీసుకుని, దగ్గరి పార్కులో భొజనం కానిచ్చారు.     తిరుగు ప్రయాణంలొ మళ్ళీ ఆయాచోట్ల నుండి ఖాళీ డబ్బాలు తీసుకుని, సి.ఎస్.టి.లో రైలెక్కారు. డబ్బాలన్నీ వారి, వారి గూటికి చేర్చి, తమ గదికి చేరేసరికి, రాత్రి తొమ్మిదయింది. ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి, దాదాపు వంద ఇళ్ళనుండి భోజనపు డబ్బాలు సేకరించడం తో మొదలైన కొమురయ్య పనిదినం, రాత్రి తొమ్మిదింటికి ముగిసింది.     పూటకూళ్ల ఇంట్లో భోంచేసి,తనగదిలో ప్రక్కమీద వాలిన కొమురయ్యలో, మళ్లీ ఆలోచనల పరంపర…….     సిక్స్ సిగ్మా (మ్యానేజిమెంటు పరిభాషలో, నిర్వహణ నైపుణ్యానికి పరాకాష్ట) పొందిన ముంబయి డబ్బావాలాలు ప్రపంచ దృష్టినాకర్షించారు.     వారి ఖ్యాతి ప్రిన్స్ చార్లెస్ ను చేరి, ఆయన్ను వారి దగ్గరికి వచ్చేలా చేసింది. అంతే కాదు వారి నాయకులు, ఆయన ఆహ్వానం మేరకు, ప్రిన్స్ మలిమనువుకు లండన్ వెళ్లి రాచమర్యాదలు పొందారు.     ఇప్పుడు ముంబయి డబ్బావాలాలు, దేశ విదేశాల్లోని మ్యనేజిమెంటు కాలేజీల్లో, తమ అనుభవాలు పంచుకుంటూ విద్యాధికులకు పాఠాలు నేర్పుతున్నారు!     అలాంటి సంస్థలో మూడు నెలల కఠిన శిక్షణ పొదాడు కొమురయ్య. పట్టుదలతో, ఆ పనిలోని మెళకువలన్నీ అనతికాలంలోనే ఒంటబట్టించుకున్నాడు. చాకులాంటి కుర్రాడని పేరుతెచ్చుకున్నాడు. ఇప్పుడు నెలకు పదివేల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు. గంతకు తగిన బొంతలా, తనకు తగిన గూడు ఏర్పరచుకున్నాడు.     బ్యాంకు బ్యాలన్సు కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రైవేటుగా డిగ్రీ చేస్తున్నాడు.     సెలవుదినాల్లో టిప్ టాపుగా తయారై వెళ్లి, తన మేనమామ ఇంట్లోని సోఫాపై కాలు మీద కాలు వేసుకుని దర్జాగా, కూర్చోగలుగుతున్నాడు.     "నా మేనల్లుడు సద్దులు మోయడం నా కెంత అప్రదిష్ట?" అన్న మేనమామనుండే గౌరవపూర్వక పలుకరింపు అందుకుంటున్నాడు. అతని కూతురును తనకు కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు చూచాయగా తెలిసింది. పెళ్లయింతర్వాత ఏదో వ్యాపారం పెట్టిస్తాడట!     అతని కూతురూ వద్దు, అతని వ్యాపారమూ వద్దు....... కొమురయ్య నిద్రలోకి జారిపోయాడు.     కొమురయ్య తన ఊళ్లో బస్సు దిగాడు. తన డాబూ, దర్పం చూసి, అందరి కళ్ళల్లో ఆశ్చర్యం. పడుచుపిల్లలు,ఓణీలు ముఖంపై కప్పుకొని దొంగచూపులు చూస్తున్నారు. కొందరు పెద్దలు 'ఎవరీ అబ్బాయ’ని తరచి, తరచి, చూస్తున్నారు. రచ్చబండదగ్గరి పెద్దలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.     " అడ్డం పొడు బాగానే పెరిగిండు, బొంబయినీల్లు మంచిగనే ఒంటబట్టినయ్"     "మనూర్లె మొక్కగ వంగనోడు పరాయి ఊర్లే మానుగ వంగే"     " ఇక్కడ పనిదొంగతనం జేత్తే, బొంబయిల సద్దులు మోసే గతి వట్టే."     " ముంబయి శ్రమసౌందర్యం మనూరి రాతిని శిల్పంగా మార్చింది" ఆ ఊరి హెడ్ మాస్టర్ అభిప్రాయం.     తన మొహంలో మాత్రం చెరగని చిరునవ్వు.     పలకరించిన, పలకరించని పరిచయుస్తులందరికీ అభివాదం చేస్తూ, కదిలాడు తను. ఇప్పుడు తన కాళ్ళు ఇంటివైపు ధృడంగా పడుతున్నాయి.     కొమురయ్య ముంబయి రిటర్న్ డ్!     తనని చూసిన తల్లిదండ్రుల కళ్లల్లో ఆశ్చర్యానందాలు! .........     సెల్ ఫోన్ అలారం మ్రోగింది.  

        కొమురయ్య మరో పనిదినం మొదలైంది.
Comments