శ్రీనుగాడి తత్వమీమాంస - నంబూరి పరిపూర్ణ

    "అమ్మా!"

    .....

    "అమ్మోయ్!"

    .....

    "ఓ అమ్మా! ఎంత పిలిచినా పలకవేమిటే?" అంటూ వంటింట్లో వున్న తల్లి దగ్గరకు పరిగెత్తాడు శ్రీను.

    కత్తిపీట ముందేసుకుని బెండకాయలు తరుగుతూ 'ఇక్ష్వాకుల తిలకా - ఇకనైన పలుకవే, రామచంద్రా!' అంటూ సన్నగా పాడుకుంటున్న తిరువెంగళమ్మ తారాస్థాయిలో కొడుకు పిలుస్తూ, పరిగెత్తుకురావడం చూసి కొంచెం ఉలిక్కిపడి "ఏంటినాన్నా! ఎందుకూ అంత గట్టిగా పిలుస్తున్నావ్?" అని అడిగింది. 

    "మరి ఇందాకటి నుంచి నెమ్మదిగా ఎన్నిసార్లు పిలిచినా నువ్వు పలికావా? అందుకే గట్టిగా పిలవాల్సి వచ్చింది" నిష్టూరంగా అన్నాడు శ్రీను. 

    "అంతేగదా! ఇంకేం జరిగిందోనని భయపడ్డాను. సరే ఇంతకూ పిలిచింది దేనికీ? ఏం కావాలి?"

    "ఏం లేదులే... మరే అమ్మా!... భలే ఆకలవుతోందే!"

    "ఓరి పిచ్చినాన్నా! ఇందుకా అంత ఉపద్రవంగా పిలవడం! ఇంట్లోకొచ్చి అన్నం పెట్టమనకూడదూ!"

    "కాదమ్మా, నిజంగా ఎంతాకలేస్తున్నదో! కడుపునొప్పి కూడా వచ్చేసింది."

    "మా నాన్నే! మా బంగారమే! ఒక్క పదినిమిషాలాగమ్మా! బెండ ముక్కలు వేయించేస్తాను. పప్పుచార్లో నంజుకుందువుగాని" అంది తిరువెంగళమ్మ కొడుకుని దగ్గరకు తీసుకుని తల నిమురుతూ.

    "ఊహూ! నా కన్నమేం వద్దు" బుంగమూతి పెట్టాడు శ్రీను. 

    "ఇదేంటి మళ్లీ! చచ్చే ఆకలవుతోందని ఇప్పుడే అని - అన్నం తిననంటావేమిటి? తిక్కా?"

    "ఆకలైతే అవుతున్నదనుకో... కాని అమ్మా! మరే... మరే... ఒకటి ముందుగా చేయనిస్తే అప్పుడన్నం తింటాను." 

    "ఏమిటీ జామకాయలు కోస్తానంటావా? అన్నీ పిందెలు, మీ నాన్నొచ్చి తంతారు" 

    "ఆహా... అదికాదు. ఇంకో పని."

    "ఇంకోటేమిటీ? పిన్ని నడిగి వెన్నపూస తెచ్చుకుంటావా?"

    "నాకేం వద్దు - వెన్నా గిన్నా"

    "మరేమిట్రా! అదేమిటో తిన్నగా చెప్పరాదూ! అన్నం కావాలా వద్దా?" అంటూనే వేగుతున్న బెండముక్కల్ని  అట్లకాడతో పైకీ కిందకీ కదుపుతోంది తిరువెంగళమ్మ.

    అమ్మకి కోపమొచ్చిందని గ్రహించిన శ్రీను - వెనుకనుంచే అమ్మను కావలించుకొని "అన్నం తింటానుగానీ - ముందు కొంచెం మృదంగం వాయించుకొని - తింటానమ్మా" అన్నాడు ఎంతో అభ్యర్థనగా.

    "ఏమెత్తులురా కొడుకా! ఆకలో అని గోలబెట్టి తీరా వడ్డించబోయే సరికి మృదంగం వాయించుకుంటానంటావా! అదేమన్నా పాడయితే మీ నాన్నూరుకుంటారా?"

    శ్రీను ఏం మాట్లాడకుండా తల్లి ముఖంలోకి అతి దీనంగా చూశాడు. "సరే. జాగ్రత్తరా - ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు వాయించుకో. శృతి చెడిందంటే నువ్వేదో చేశావని - మీ నాన్నొచ్చి కొడతారు సుమా!" అంటూ పర్మిషనిచ్చింది వెంగళమ్మ మురిపెంగా కొడుకుని చూస్తూ.

    శ్రీను చిలక్కొయ్య నుంచి మృదంగాన్ని దించి ముందుంచుకొని వాళ్ల నాన్న వాయించే మూడు నాలుగు వరుసల్ని ఆనందంగా లయబద్దంగా వాయించసాగాడు. 

    శ్రీను నాన్నగారు సొంతూళ్లోనే టీచరుగా చేస్తున్నారు. అతని పూర్వీకులంతా నలభై ఏళ్ల క్రితం వరకూ వీధి నాటకాలాడడమే వృత్తిగా చేసుకు జీవించిన భాగవతులు. సహజంగానే కేశవదాసుకు డ్రామా పిచ్చి జాస్తి. పైగా ఎకరం మాగాణి తప్ప మరీ ఆస్తి లేని పేదలు. దారాసుతులతో పాటు ముసలి తల్లిదండ్రుల్ని, విధవక్కగారిని పోషించాలంటే కాస్తో కూస్తో వేరే సంపాదించక తప్పదు. అందుకే చుట్టుపట్ల జరిగే నాటకాలలో డ్రామాలలో వేషాలు వేస్తుంటాడు లేదా మృదంగిస్టుగా సహకరిస్తుంటాడు.

    పూటకు ఆరు కంచాల్లేవాలి ఇంట్లో. అన్నింటికీ ఇబ్బందిగానే వుంటుంది. శ్రీనుకి అన్నం మీదకన్నా చిరుతిండ్లు అంటే చాలా ఇష్టం. అమ్మ రోజూ టిఫెన్లూ, పిండివంటలూ చేసి పెడుతుంటే ఎంత కమ్మగా తినొచ్చు అని అనుకుంటూ వుంటాడు.

    దొరగాని మనవడు 'పండుబాబు'- స్కూలు కొచ్చీరాగానే తనేం టిఫెన్ తినొచ్చాడో, ఏమేం పళ్లు తిన్నాడొ చెబుతుంటాడు. అప్పుడు శ్రీను నోట్లో ఎన్ని నీళ్లూరుతాయో! అంతేగాక - అతనిలా తనూ మంచి బట్టలేసుకుని - బూట్లు టకటక మనిపిస్తూ స్కూలుకు రావాలనిపిస్తుంది. అసలు దొరగారి లోగిలిలాంటిది తమకూ ఎందుకు లేదు? లోగిలి చుట్టూ రెండు కైవారాల ప్రహరీ - ఎత్తయిన గేట్లు - ఎంత దర్జాగా ఉంటుందో!

    పండుబాబుకి తనంటే చాలా ఇష్టం. అందుకని తననప్పుడప్పుడు ఇంటికి తీసుకెడుతుంటాడు. అతని పనులన్నీ ఎంచక్కా దాసీలే చేసేస్తూ వుంటారు. స్నానం చేయించి, బట్టలు తొడిగి, తల దువ్వుతారు. అన్నం కూడా తినిపిస్తారు. 'ఏమండీ చిన్నదొరగారూ!' అంటూ గౌరవంగా పిలుస్తారు. ఇతనికి కోపమొస్తే ఎంతో భయపడతారు. పండుబాబు ఆడుకునేందుకు ఒక గది నిండుగా ఎన్నో ఆటబొమ్మలుంటాయి. విమానాలు, హెలికాప్టర్లు, రకరకాల మోటారు కార్లు, నవ్వే బొమ్మలు, నడిచే బొమ్మలూ!

    ఆదివారం నాడు పొలం చూసి రావాలని అమ్మతో బయలుదేరాడు శ్రీను. మాగాణి చేలల్లోకి దొరగారి దివాణం ముందునుంచే పోవాలి. దివాణపు గేటు ముందుకి వచ్చాక శ్రీను అక్కడే ఆగి నిలబడి "అమ్మా! నేనొకటడుగుతానుగాని చెబుతావా?" అన్నాడు సీరియస్‌గా.

    "ఏమిట్రా అదీ! బుర్రలో ఏం తొలుస్తున్నదీ?" అంది తల్లి నవ్వుతూ.

    "చూడవే అమ్మా! దొరగారికైతే ఇంత పెద్ద ఇల్లుంది. బోల్డు పొలాలున్నాయి. ఇంట్లో అందరికీ - చివరకు చిన్నపిల్లలకు కూడా - వేరే వేరే దాసీలున్నారు. నాలుక్కూరలూ, పిండివంటలూ లేందే భోజనం చేయమని పండుబాబు నాకు చెబుతుంటాడు. మరి నాన్నలాగా - మనూళ్లో వాళ్లలాగా ఒక్కళ్లూ బయటికొచ్చి పనిచెయ్యరు కదా - వీళ్లకింత డబ్బెలా వుందమ్మా!" అంటూ ప్రశ్నించాడు శ్రీను.

    "ఇన్ని ఆలోచనలుండబట్టే ఇంత పెద్దగా వుందిరా నీ బుర్ర. దొరగారిలాంటి వాళ్లు వెనకటి జన్మలో ఎంతో పుణ్యం చేసుకొని వుంటారు. అందుకని ఈ జన్మలో గొప్ప కులంలో గొప్ప ధనవంతులై పుట్టారు."

    "మరి మొన్న శేషమ్మ పిన్నితో చెబుతుంటివే - మా నాన్నగారి తాతలు, తండ్రులు గొప్ప రామభక్తులనీ, ఎన్నో పుణ్య తీర్థాలు పోయి వస్తూ, సంతర్పణలూ సమారాధనలూ చేస్తూ అందరికీ మంచిగా వుండేవాళ్లట - అని. మరి మనమెందుకవలేదు గొప్పవాళ్లం?"

    "అందుకదృష్టం కలిసి రావాల్లే నాన్నా! అందరిళ్లల్లోకీ వస్తుందా ధనలక్ష్మీ!"

    "ఏంటే నీ మాటలు! కాసేపు పుణ్యం చేసుకోవాలంటావ్, కాసేపు అదృష్టమంటావ్. ఇంకాసేపు ధనలక్ష్మంటావ్. నాకేం అర్థం కావడం లేదు."

    "చిన్నవాడివి, ఏం అర్థమవుతాయీ? పెద్దయినాక తెలుస్తాయిలే అన్నీ"

    "సరేగానమ్మా, దొరగారు వడ్డీలకిస్తుంటాడట. వడ్డీకి వడ్డీ కట్టి బాకీలు తీర్చలేని వాళ్ల పొలాలూ, ఇళ్లూ లాగేసుకుంటాడట గదా! చిన్న తప్పు చేస్తే కూడా చితకబాదుతాడట పాలేళ్లని. పాపం చేసేవారు వచ్చే జన్మలో కుక్కగానో, నక్కగానో నీచపు జన్మెత్తుతారని నువు చెబుతుంటావు కదా - మరి దొరగారు అలాంటి జన్మే ఎత్తుతారా? చచ్చిపోయాక?"

    "ఓరి నాయనా గట్టిగా అనబోకురా! దొరగారి మనుషులెవరైనా విన్నారంటే మనని నిలువునా పాతేస్తారు. పద పద - పొద్దెక్కిపోతూ ఉంది." అంటూ కొడుకు చెయ్యి పట్టుకుని పొలాల వైపుకి లాక్కెళ్లింది వెంగళమ్మ.

* * *

    ప్రతిరోజూ తెల్లవారు ఝామున లేచి కసవూడ్చి, కళ్లాపి జల్లి, ముగ్గేస్తుంది తిరువెంగళమ్మ. తరువాగ పెరుగుకుండలో కవ్వం తిప్పుతూ "గుమ్మడేడే గోపీదేవి గుమ్మడేడే కన్నతల్లీ - గుమ్మడగుపడజూపవే మాయమ్మ గోపమ్మా - గుమ్మడేడే!" అంటూ పాడుతోంటే - తల్లి కమ్మని పాట విని శ్రీను నిద్ర లేస్తాడు. మజ్జిగ పనయ్యాక తల్లి దేవుడి పటం ముందుకూర్చుని ఆధ్యాత్మిక రామాయణం కీర్తనలు పాడుతుంటే శ్రీను కూడా తల్లి ప్రక్కకొచ్చి  కూర్చుని పాడతాడు. భగవంతుణ్ణి స్తుతించాక తల్లితోపాటు సాష్టాంగపడి నమస్కరిస్తాడు. 

    తీరికగా కూర్చున్నప్పుడల్లా తిరువెంగళమ్మ కొడుక్కి వేదాంత బోధ చేస్తూ ఉంటుంది. సృష్టిలోని పద్దెనిమిది లక్షల జీవరాశుల్నీ భగవంతుడు సృష్టించి రక్షిస్తుంటాడని, చిన్నతనం నుంచి అబద్ధాలాడకుండా ఎవరినీ హింసించకుండా మంచి పనులు చేస్తూ వుంటే అలనాటి ధృవుడిలాగా మోక్షప్రాప్తి కలుగుతుందని తల్లి చెబుతోంటే శ్రీనుకు ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే పుణ్యం చేసుకున్నవాళ్లంతా స్వర్గలోకంలో వెళ్లి ఆకలి దప్పులు గానీ, నిద్రకాని లేకుండా అనంతకాలం అక్కడే బ్రతుకుతుంటారనే విషయం మాత్రం వాడికెందుకో నచ్చదు. 

    వెంగళమ్మ భోగి పండుగ నాడు అరిసెలు చేస్తోంది. కోటమ్మత్త, సీతమ్మ పిన్ని వచ్చి ఆమెకు సహాయపడుతున్నారు. బాణలిలో వేగుతున్న అరిసెల్ని దేవి - చెక్కల నడుమ పెట్టి నూనంతా వత్తేస్తున్నారు. తరువాత వాటిని చాపమీద పరిచిన తెల్లని కొత్త వరిగడ్డి మీద వరుసలుగా వేస్తున్నారు.

    తిరువెంగళమ్మ అరిసెలు అరిటాకు మీద వత్తి బాణలిలో వదుల్తూ, మధ్య మధ్యలో గడ్డిమీదున్న వేగిన అరిసెల్ని పెద్ద పెద్ద తాంబూలప్పళ్లాల్లో నింపుతోంది. 

    వాకిట్లో ఆడుకుంటున్న శ్రీను ముక్కుపటాలు అరిసెల కమ్మని వాసనలతో నిండి నోరూరిపోతోంది. ఎప్పుడెప్పుడు అమ్మ తనను పిలిచి అరిసె చేతికిస్తుందా అని ఎదురు చూస్తూ మధ్యమధ్యలో వంట వసారాలో కొచ్చి "అమ్మా! నన్ను పిలిచావా?" అని అడుగుతున్నాడు. వాడి ఆతృత చూసి ముత్తయిదువలు ముగ్గురూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు.

    ఆఖరుకి వుండబట్టలేక వసారా గుమ్మంలో నుంచుని "అమ్మా! ఒక అరిసె ఇవ్వవే - రుచి చూస్తాను!" అన్నాడు శ్రీను.

    తల్లి వెంటనే చూపుడు వేలు పెదవుల మీదుంచుకుని "అయ్యో! అదేమిట్రా! దేవుడికి నైవేద్యం పెట్టకముందే ఎంగిలి చెయ్యవచ్చా!" అంది.

    "అయితే నైవేద్యం పెట్టెయ్" అన్నాడు.

    "ఇప్పుడేనా? అన్నీ అయినాక మొత్తం దేవుడి ముందుంచి నైవేద్యం పెడదాం. తరువాత ఒకటేమిటీ - నీ ఇష్టమొచ్చినన్ని తిందువుగాని."

    "దేవుడు అన్నీ తినడు గదమ్మా! ఆ పళ్లేల నిండా వున్నవి చాలు నైవేద్యానికి."

    "అమ్మో! అలా చేశామంటే మన నాలికలూడిపోతాయి. దేవుడికి భలే కోపమొస్తుంది."

    "నీవన్నీ ఉట్టి ఉత్తుత్తి మాటలు. దేవుడసలు ఒక్కటీ తినడు... సరేగానమ్మా మనం రోజూ భోంచేయకముందు దేవుడికి నైవేద్యం పెడుతుంటాము గదా - అందువల్లేమవుతుంది?" 

    "ఏమవుతుందేమిటీ; దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడుతుంటాడు."

    "మనం చచ్చిపోయాక స్వర్గంలోకి తీసుకెళ్లి తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు గదూ!"

    "అవును ఆయన్ని నిత్యం భక్తితో పూజించి, సత్కార్యాలు చేసినవాళ్లు స్వర్గానికెళ్లడమే కాదు పరమాత్ముడిలో శాశ్వతంగా లీనమైపోతారు."

    "అంటే ఏమిటమ్మా! లీనమవ్వడమంటే అదెలా జరుగుతుంది?"

    "పరమాత్మంటే భగవంతుని ఆత్మ అన్నమాట. దాన్నే పరంజ్యోతి అని అంటారు. అదో గొప్ప వెలుగు! ఎప్పటికీ ఆరకుండా దివ్యకాంతుల్ని వెదజల్లుతూ వుంటుంది. పుణ్యాత్ములను జీవాత్మలంటారు. ఈ జీవాత్మలన్నీ చచ్చిపోయాక - పరమాత్మలో ఐక్యమవుతాయి. మళ్లీ మళ్లీ జన్మలెత్తి బాధలు పడే పనుండదు."

    మెడకాయ వంకరగా పెట్టి కాసేపు దీర్ఘంగా ఆలోచించి "అలా భగవంతుని వెలుగులో మనమూ ఒక వెలుగై కలిసిపోతే ఏమిటమ్మా లాభం?" అడిగాడు శ్రీను. 

    "లాభమని చిన్నగా అంటావేమిట్రా? ఎన్నెన్నో జన్మలెత్తుతూ రోగాలు రొష్టులూ, దరిద్రమూ దుఃఖాలతో బ్రతకాల్సిన అవస్థ వుండదు గదా!"

    "అమ్మా! నాకైతే ఎల్లకాలం అలా వెలుగులో వెలుగై ఉండాలని లేదే! మళ్లీ మళ్లీ పుట్టాలనిపిస్తుంది. మన గేదె ఈనినప్పుడు నువ్వొండిపెట్టే జున్నులాంటి జున్నూ, కొత్త అటుకులూ, జొన్న ఊచ బియ్యం, తంపటేసిన పచ్చేరు శనక్కాయలూ మళ్లీ మళ్లీ తింటూ వుండకపోతే ఎలాగే! అసలు మామిడి పళ్లు తింటూ ఉండకపోతే ఎలా? ప్రొద్దున్నే మన ఊరు చెరువులో రంగురంగుల తామర్లనీ - దాని చుట్టూ చెట్లకి వెళ్లాడే గిజిగాళ్లని చూస్తుండకపోతే ఇంకేం బ్రతుకు?"

    "ఓరి సన్యాసి! అసలు బ్రతుకే వద్దని, బ్రహ్మలో ఐక్యమైపోవాలని గదరా భక్తులు పాటుపడేది!"

    "అదేనమ్మా! అలా కుదర్దు నాకు. ఎప్పుడూ బ్రతికుంటూ మాయాబజార్, మల్లీశ్వరి లాంటి సినిమాలు లెక్కలేనన్ని సార్లు చూస్తుండాలి. బస్సుల్లో, రైళ్లలో, మోటార్ సైకిల్ మీద ఝామ్మంటూ తిరుగుతుందాలి. పెద్దాణ్ణయి మన దేశమంతా తిరిగి రావాలి. మళ్లీ జన్మలోనైనా అమెరికా, ఇంగ్లాండ్ చూసిరావాలి. ఇవన్నీ ఏం లేకుండా ఏమిటో వెలుగులో వెలుగై కూర్చుంటే ఏం జరుగుతుందిటా?"

    "ఒరే శ్రీనుగా! ఎప్పుడైనా నీతో వాదించి గెలవగలిగానేట్రా? లోకమంతా కాచి వడబోసిన ముసలాళ్లా మాట్లాడతావయ్యే!" లోలోపల కొడుకు తెలివికి మురిసిపోతూ అంది తిరువెంగళమ్మ.

    "ముసలాణ్ని గాకేమిటే. మా నాన్నేమంటూ వుంటాడూ? మా తాతయ్య తన కడుపున నేనై పుట్టాడనడూ. అందుకని నేను ముసలి తాతనే."

    "సరేగానీ ఇంకాపుజెయ్యి తండ్రీ నీ వాగుడు. ఆ పళ్లేలను ముట్టుకోకు. ఇంద, ఇప్పుడే తీసిన ఈ రెండరిసెలు పట్టుకెళ్లి తిను. ఇహ పో మరి..." అంటూ అరిటాకులో రెండరిసెలు కొడుకు చేతికిచ్చింది తల్లి.

    శ్రీను ముఖం వెయ్యి కాంతులతో వెలిగిపోయింది. అంతులేని ఆనందంతో కళ్లు మిలమిలా మెరిశాయి. అరిసెల పొట్లంతో ఇంటిప్రక్క గడ్డివాము దగ్గరకు ఒక్క పరుగు పెట్టాడు.

    అరిశె ముక్క నోట్లో పెట్టుకునే ముందు - శ్రీను ఆకాశం వైపు చేతులు జోడించి - "ఓ భగవంతుడా! మా ఇంట్లో అందరి కన్నా ముందు నేనేమి తింటున్నా మా నాన్న మురిపెంగా చూస్తూ చాలా సంతోషిస్తాడు. మరి నువ్వు - అందరికీ తండ్రివి, నీకు నైవేద్యం పెట్టకుండా తింటున్నందుకు కోపగించుకోవు గదూ!" అని వేడుకొని చకచకా నమలడం మొదలెట్టాడు.          
Comments