శ్రీరాముడికో "లైకు" - యాజి

    పొద్దున్నే లేవంగానే అలవాటుగా బెడ్రూంలో భాగంగా ఒక మూలలో ఉన్న నా కంప్యూటర్ డెస్క్ వైపు నడిచా. కిటికీ కర్టెన్ తెరిచుంచటం వల్ల, ఇంటి చుట్టూరా ఉన్న ఫెన్సింగు మీదు కూర్చున్న  పక్షులూ, దూరంగా పచ్చని కొండలూ కనపడుతున్నాయి. దగ్గరకెళ్ళి సర్రున కర్టెన్ లాగి మూసేశా. మరి లేకపోతే ఆ కిటికీగుండా బే ఏరియా ఉదయపు సూర్యకిరణాలు ఏటవాలుగా వచ్చి, సరిగ్గా మానిటర్ మీద పడుతుంటే, చిరాకెత్తదూ! మానిటర్ ఆన్ చెయ్యంగానే తెరచి ఉన్న బ్రౌజర్ లోని ఫేస్‌బుక్ పేజీలో కుడి వైపు పైభాగం లోనున్న ఎర్ర సూచనల వైపు అప్రయత్నంగా నా కళ్ళు మళ్ళాయి. 

    “అమ్మయ్యా..ఓ పాతిక పైనే ఉన్నాయి! నిన్న పెట్టిన పోస్టులకీ, అప్లోడ్ చేసిన ఫోటోలకీ మంచి స్పందనే వచ్చింది” అని నాలో నేనే మౌనంగా మురిసిపోతూ, ఆ అందమైన ఉదయాన, ఫేస్‌బుక్ ప్రపంచంలో ఎవరెవరో పెట్టిన పర్వతాల, పిట్టల, ఫోటోలలోని ప్రకృతి  సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, నా రోజు ప్రారంభించా.  

    ఎప్పటి లాగానే  కీబోర్డు టకటకల సుప్రభాతంతో నిద్ర చెడిన మా ఆవిడ సన్నాయి మేళం మొదలయ్యింది. 

    “పొద్దున్నే లేవటం, ఇంకా నిద్రపోయేవాళ్ళు ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా, ఎప్పుడూ మొహమైనా చూడని వాళ్ళతో టకటకలూ! రోజు రోజు కీ నీ పిచ్చి ముదిరిపోతోంది. ఉదయాన్నే ఓ ఎక్సర్సైజు లేదు, సరదాగా కాఫీ పెట్టి, కలసి తాగుతూ నాలుగు ఖబుర్లు లేవు...” 

    అలా మేళం వినకపోతే ఏదోగా ఉంటుంది కానీ, దానికి అలవాటు పడ్డ నా పై మాత్రం ఏ ప్రభావం చూపలేదు సరికదా, ఇంకా ఎక్కువైన ఏకాగ్రతతో ఫేస్‌బుక్కులో కామెంటటం మొదలెట్టాను. 

    మూడు నాలుగు రోజులుగా ఓ “పేజ్ సజెషన్” తెగ చిరాకు పెడుతోంది. మిత్రులెవరో చాలా మంది లైకు కొట్టారుట, ఫేస్‌బుక్ నేనెక్కడ మిస్సవుతానో అని ఆరాటపడిపోతూ, “లైక”మని తెగ ప్రాధేయపడుతోంది.  “లార్డ్ రామా” పేజి మీద క్లిక్ కొట్టంగానే, పెద్ద రాములోరి ఫోటో నా 21 అంగుళాల స్క్రీనంతా దాదాపు కప్పేసింది.

    ఎప్పుడొచ్చిందో, కుర్చీ వెనకాలే నుంచుని మానిటర్ వంకే చూస్తున్న మా ఆవిడని గమనించలా! 

    దో స్టాకుల్లో అకస్మాత్తుగా డబ్బులొచ్చినట్టు .. ఎన్నడూ లేనిది, పొద్దున్నే ఇంత  దైవభక్తి ఎట్లా పుట్టుకొచ్చింది నీకు?”

    “భక్తా, పాడా, దో నొక్కితే, ఎక్కడికో తీసుకెళ్ళింద్దన్నట్లు...”

    “మంచికే జరిగిందిలే. ఈ వీకెండు కన్నా రామా టెంపుల్ కి వెళ్దాం. ఎప్పుడో మూడేళ్ళ  క్రితం మన బాబుకి అక్షరాభ్యాసం చేయించండి అని మీ అమ్మ షంటితే, వెళ్లాం. ఆ తరవాత మళ్ళీ ఇప్పుడు, ఇదుగో ఇలా గుర్తుచేశాడు, ఆ పైవాడు.”

    “అదెక్కడో అరవై మైళ్ళ దూరంలో ఉంది. టౌనుకో బాబా గుడున్నప్పుడు, అంత దూరం వెళ్ళటమవసరమా? అయినా ఏ కాలానికా దేవుణ్ణి  పట్టాలి కానీ.. అస్సలు పాపులారిటీ తగ్గిపోయిన రాములోరి గుడికే అంటే ఎలా చెప్పు?”

    “రామ, రామ .., భయం, భక్తీ మొదటినుంచీ లేవు, నీ ఫేస్‌బుక్ మిత్రుల పోస్టులు ప్రభావమేమో ఇప్పుడు ఎగతాళి కూడా!”

    “మధ్యలో వాళ్ళెందుకోయ్! ప్రాక్టికల్ గా ఆలోచించు. రాముడు ఈ రోజున ఎవరికైనా ఆదర్శమా? కపత్నీ వ్రతం, తండ్రి మాట వినటం, చెప్పిన మాట చెయ్యటం, ఇలాంటి చిన్నచిన్నవి చాలా పురుషోత్తముడైపోటానికి? ప్రెగ్నెంట్ గా ఉన్న భార్యని ఏకాకిగా అడవులపాలు చెయ్యటం లాంటి పనుల్ని బుద్ధున్న ఎవ్వరూ వెనకేసుకు రాలేరు. అందుకే ఈ రోజున రాముడిని చాలా మంది పట్టించుకోవటం మానేశారు. మీ  ఆడవాళ్లకే  ఈయనంటే అస్సలు కిట్టదు తెలుసా?” ఈ విషయం మీద పి.హెచ్.డి. చేసినంత  అథారిటీతో చెప్పేశా.

    “నీతో పొద్దున్నే వాదన పెట్టుకుంటే నా టైం వేస్టు. మధ్యాహ్నం నాలుగింటికి, పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ కి రావటం మర్చిపోకు. మన బాబు సంవత్సరమంతా కష్టపడి చేసిన ప్రాజెక్టులన్నీ చూపిస్తాడుట ఈ రోజు. నువ్వు మాత్రం వాడి టీచర్ కి ఈ ఏడాది ఒక్క సారి కూడా మొహం చూపించలేదు” అంటూ నా సమాధానం కోసం ఆగకుండా ఎప్పటిలాగానే నేనంటున్నది పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోయింది మా ఆవిడ.

    నేనూ ఇటువంటి చిన్న విషయాలని పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయ్యింది. సిరియా పై అమెరికా దాడి, ఇండియాలో ఎక్కువవుతున్న మానభంగాలు, ఆంధ్ర రాష్ట్ర విభజన లాంటి పెద్ద ప్రపంచ విషయాలు, స్టేటస్ అప్డేట్ల  రూపంలో నా ఫేస్బుక్ గోడపై చేరటానికి తెగ పోటీ పడుతున్నాయి కదా. కానీ అవన్నీ పక్కకు నెట్టి  ఈ రోజు  పెట్టబోయే స్టేటస్ అప్డేట్ గురించి గట్టిగా ఓ నిర్ణయానికొచ్చేశా. 

    “ఒక్క మాటా, ఒక్క పత్నీ, పితృవాక్పరిపాలనా, ఇన్ని గుణములు ఉన్న రాముడు చూలాలైన ఆలిని అడవికంపాడు. తాను వలచిన భూజకు గౌరవంగా అశోకవనాన ఆశ్రయమిచ్చిన, రాక్షస రావణుడే మేలు రాముని కంటే!” గబగబా టైప్ చేసి కుర్చీ వెనక్కు నెట్టి రాసిన మెసేజిని పైనుంచి కిందకి ఒక సారి చూసుకున్నా. 

    దో వెలితిగా అనిపించింది, ఈ వచనాన్నే కవితగా మారిస్తే? వచ్చే స్పందనే వేరుగా ఉంటుందన్న లోకజ్ఞానం నాకాల్రెడీ అబ్బిన విషయమే. కవిత్వాన్ని ప్రోత్సహిద్దాం అనే సదుద్దేశంతో ఏమి రాసినా మెచ్చుకొనే సమూహాలు ఉన్నప్పుడు, నాకిక అడ్డేది? 

    దీనికి తోడు తమను తాము ఫెమినిస్టుల మనుకుంటూ డెభ్భైల్లోని తీపి జ్ఞాపకాలలోనే ఆగిపోయి ఇంకా బయటపడని చాలా మంది మిత్రుల ప్రోత్సాహక వ్యాఖ్యలూ! 

    వెంటనే నాలుగు “ఎంటర్” కీ స్ట్రోకులతో వేడి వేడి కవిత తయార్!

    “ఒక్క మాటా ఒక్క పత్నీ పితృవాక్పరిపాలనా
    ఇన్ని గుణములు ఉన్న రాముడు చూలాలైన ఆలి నడవికంపెను
    తా వలచిన భూజను గౌరవంబుగ అశోకవనాన
    ఆశ్రయమిచ్చిన రాక్షస రావణుడే మేలు రాముని కంటెన్”

    “పోస్ట్” బటన్ నొక్కానో లేదో ఓ రెండు లైకులు వెంటనే వచ్చేశాయి. నే పోస్టు చేసింది చదివే టైం కూడా వృధా చెయ్యకుండా లైకులు కొట్టిపారేసే మిత్రుల మీద కొంచెం చిరాకనిపించింది. అయినా భగవంతుడు పొడుగాటి వేళ్ళూ, దాని చివర అందమైన గోళ్ళూ ఇచ్చింది, ఒకరి వీపునొకరు గోక్కోటానికే కదా అని సమాధానపరుచుకొని, ఆఫీసుకెళ్ళటానికి లేవబోయా.

    ఇన్‌బాక్స్ లో ఒక మెయిల్ వచ్చింది సాండ్రా నుంచి. ”నేను బే ఏరియా వచ్చాను. సాయంత్రం ఆరుగంటలకి కలవగలవా? ఒక్క గంట మాత్రమే టైం ఉంది నాకు” అని దాని సారాంశం. ఒక్కసారి వంట్లో ఒక జలదరింపు కలిగింది, ఒక భయంతో కూడిన ఉత్సాహం కూడా. కాసేపు ఆలోచించి “విల్ సీ యూ ఎట్ సిక్స్” అని సమాధానం ఇచ్చి, వేగంతో కొట్టుకుంటున్న గుండెను తడుముకుంటూ షవర్ లోకి నడిచా.

    వేడి షవర్ వంటికి తగులుతూ ఉంటే, సాండ్రా తో గడిపిన ఆ సాయంత్రం గుర్తుకొచ్చింది. నిజానికి, తనను నేను కలిసింది ఒక్కసారే. ఆఫీస్ పని మీద ఒక్కడినే ఆస్టిన్ వెళ్ళినప్పుడు, నా క్లైంట్ వైపు నుంచి ఆమె నన్ను రిసీవ్ చేసుకొంది. వర్క్ అయిన తరువాత డిన్నర్ కి వెళ్లాం. తనకింకా పెళ్లి కాలేదు, నాకు పెళ్ళైన విషయం దాచలేదు. మా ఆవిడ, అబ్బాయి ఫోటోలు చూపిస్తే “క్యూట్ ఫామిలీ” అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. 

    తనకు నాలో ఏమి నచ్చిందో తెలియదు కానీ, నాతో చనువుగా ప్రవర్తించటం మొదలెట్టింది. మొదట్లో ఇబ్బందిగా అనిపించిన నాకు కూడా, రెండు డ్రింకులూ, కొంత సమయం తరవాత ఎక్సైటింగ్ గా అనిపించసాగింది. తన స్మార్ట్ ఫోన్ లోని ఫోటోలు నాకు చూపిస్తూ, నా దగ్గరగా వచ్చి తన భుజాలనూ, కాళ్ళనూ నాకు తాకిస్తూ చనువుగా నన్ను టచ్ చేస్తున్నప్పుడు, నాకు అడ్డుచెప్పాలన్న ఆలోచనే రాలేదు. 

    నేనూ ధైర్యం చేసి, ఆమె పొట్టి స్కర్ట్ దాచలేని ఆమె కాళ్ళ అందం మీద, ఆమె తన ఫొటోస్ లో చూపిస్తున్న తన ఫిగర్ మీదా విరాళంగా కాంప్లిమెంట్లు ఇచ్చాను. డిన్నర్ తరువాత ఇద్దరం బార్ దగ్గర కూర్చొని మరికొంత సమయం గడిపాం. ఏదో బేస్ బాల్ గేం టీవీలో వస్తోంది. నాకు ఏ మాత్రం ఆసక్తి లేకపోయినా, ఆమె టెక్సాస్ రేంజర్స్ ఫ్యాన్ అనుకుంటా, వాళ్ళు కొట్టిన ప్రతి రన్ కూ, నాకు హగ్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. మొదటి రెండు పరుగుల తరువాత, నేను ఆమెకంటే ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ, ఆమెకు టైట్ హగ్గులివ్వటం మొదలెట్టాను. ఆ రోజు రేంజర్స్ తొమ్మిది పరుగులు కొట్టారు!

    ఆ రోజు రాత్రి నా హోటల్ కి వెళ్ళేముందు, తనేమైనా ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని నా రూమ్ కి వస్తానంటుందేమోనన్న ఆలోచన ఒక్క సారి ఫ్లాష్ అయ్యింది. సరిగ్గా ఆ సమయంలో మా ఆవిడ దగ్గర నుంచి వచ్చిన కాల్ వల్ల అనుకుంటా, ఆమె “బై” అని నాకు ఒక హగ్ ఇచ్చి, నా బుగ్గ మీద అంటీ అంటనట్టుగా ఒక కిస్ పెట్టి వెళ్ళిపోయింది. ఆ తరవాత ఎప్పుడైనా ఈ-మెయిల్స్ లో తప్పితే పెద్దగా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఆ సాయంత్రం మాత్రం ఒక అందమైన అనుభవం గా మిగిలిపోయింది. 

    “ఇంకా ఎంత సేపు షవర్లో?” అన్న మా ఆవిడ మందలింపు మళ్ళీ నన్ను వర్తమానంలోకి ఈడ్చింది. బయటకు వచ్చి త్వరగా రెడీ అవ్వటం మొదలెట్టా. 

    “నీ అయిదొందల డాలర్ల సూట్ కి ఈ రోజైనా బోణీ కొట్టు, ఎదో ముఖ్యమైన మీటింగ్ ఉందన్నావు కదా” అంటూ మా ఆవిడ గుర్తు చేసింది. మధ్యాహ్నం ఓ కొత్త క్లైంట్ కి టెక్నికల్ ప్రెజెంటేషన్ ఒకటి చేసి మా బాసు గాడి బిజినెస్ కి  కొత్త ఎకౌంటు తెప్పించాలన్న విషయం గుర్తుకొచ్చింది. ఇటువంటి అవసరాల కోసమే ఆ ఖరీదైన సూట్ ని కొనిపెట్టా. ఓ కొత్త బిజినెస్ అడుక్కొనేటప్పుడు, మన దర్పం, ధనబలం, దుస్తుల ద్వారా, వాహనం ద్వారా, అసలు హోదాకి మించి ప్రదర్శించినప్పుడే, మనం ఎంతో అభ్యాసంతో సాధించిన మాటల్లోని వినమ్రత, బాగా భిన్నంగా కనపడి, అవతలివాడికి మనపట్ల అమితమైన గౌరవం కలిగిస్తుందన్న ఎత్తుగడ, ఇంతకు ముందు చాలా సార్లు పని చేసింది, మరి.

    బాబి గాడు తన బ్యాక్ పాక్ ను తన బుజ్జి భుజాలమీద మోసుకొని నా కోసమే వెయిట్ చేస్తున్నాడు. నాకు తెలుసు, కారులో నాతో పాటు ఇంటి నుంచీ, వాడి స్కూల్ వరకూ గడిపే ఆ పదిహేను నిమిషాల సమయం కోసం వాడు ఎంత ఎదురు చూస్తూ ఉంటాడో. వీక్ డేస్ లో అంతకంటే సొంత కొడుకుకి కూడా ఎక్కువ టైం స్పేర్ చెయ్యలేని ఈ బిజీ డాడ్ కి వాడు అలా అలవాటు పడిపోయాడు. కారులోకెక్కంగానే ఎంతో ఉత్సాహంగా, తను చెప్పదలుచుకున్నది చెప్పే లోపలే స్కూల్ వచ్చేస్తుందేమోనన్న భయంతో నేమో 

    “డాడీ .. టుడే ఫోర్ కల్లా వచ్చెయ్యాలి నువ్వు. మా టీచర్ చాలా స్ట్రిక్ట్, కొద్దిగా లేటైనా టార్డీ స్లిప్ ఇస్తుంది. నేను మమ్మీ కి  ఒక సర్ప్రైస్  ఇస్తున్నాను. మమ్మీ పిక్చర్ ఒకటి డ్రా చేశాను. ఇంకా చాలా ఆర్ట్ వర్క్ కూడా చూపిస్తాను. వన్ మోర్ థింగ్ డాడ్.  జాన్ వాళ్ళ డాడ్ వాడితో స్కూల్ అయిపోయిన తరువాత పార్క్ లో బేస్ బాల్ ఆడుతూ ఉంటాడు. హి ఈజ్ రియల్లీ నైస్. నన్ను కూడా జాయిన్ అవ్వమన్నాడు. మమ్మీ నాతో, “అలా రోజూ వెళ్ళద్దూ, బాగోదు” అని చెప్పింది.  నువ్వు నాతో వారానికి ఒక్క రోజైనా ఆడచ్చు కదా?”

    నాకు గబుక్కున ఏం చెప్పాలో తట్టలేదు. నాకసలు అలాంటి డాడ్ లంటేనే చిరాకు. నాలుగింటికి స్కూల్ లో పిల్లాడితో ఆడుతున్నాడంటే, వాడికెంత పనీ పాటా లేదో మరి! ఇటువంటి వాళ్ళని చూసి, “అయ్యో, నేను మంచి డాడ్ ని కాదేమో” నన్న వెధవ గిల్టీ ఫీలింగొకటి! మాయల మాటగాణ్ణి కదా, నా తడబాటు కొన్ని సెకండ్లే!

    “బాబీ..నేను జాన్ వాళ్ళ డాడీ లా ఇక్కడ పుట్టిపెరిగిన అమెరికన్ని కాదు కదా. మనం ఉంటున్న నైస్ హౌస్, ఈ లెక్సస్ కారూ, ప్రతి క్రిస్మస్ కీ వెకేషన్, ఇలాంటి వన్నీ కావాలంటే నేను బాగా కష్టపడి పని చెయ్యాలన్నమాట. మమ్మీ, మనం హ్యాప్పీ గా ఉండాలంటే, నేను నా జాబ్ లో లాంగ్ అవర్స్ పని చెయ్యక తప్పదు.”

    నేనిచ్చిన వివరణలోని డొల్లతనాన్ని పసి కట్టే వయసు కాదు కదా వాడిది, అర్థమైనట్లుగా తలాడించి, “ఈవినింగ్ తప్పకుండా వస్తావుగా డాడ్? ప్రామిస్?” అని అడిగితే, ఆ పసిమొహం లోని అమాయకత్వాన్ని చూసి ఒక్క సెకండు పాటు కలుక్కుమన్న వెధవ గుండెను లెక్కచెయ్యకుండా “పామిస్” అని చెప్పేసి, బాబీని స్కూల్ దగ్గర దించేసి ఆఫీసుకి బయల్దేరాను.

    సెల్ ఫోను మ్రోగటం మొదలెట్టింది. కాలర్ ఐ.డి. చూసాను. ఇండియా నుంచి నాన్న. బ్లూటూత్ ద్వారా కార్లో ఉన్న ఎనిమిది స్పీకర్ల ఆడియో సిస్టంలో కాల్ తీసుకున్నాను. “హలో రా.. ఎలా ఉన్నావు?”, నాన్న స్వరం ఎంతో గంభీరంగా కారంతా వ్యాపించింది. దేనికోసమో తెలియని తొందరలో నేను, “డ్రైవ్ చేస్తున్నాను నాన్నా, ఏమైనా విశేషాలు ఉంటే త్వరగా చెప్పు” అని ఒత్తిడి చేసాను. 

    “మీ అమ్మకి ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదు, బి.పి. కంట్రోల్ లో ఉంచుకోవట్లేదు అని డాక్టర్ అంటున్నాడు. నిన్నూ, మనవడినీ చూసి చాలా కాలమైందన్న బెంగ కూడా నేమో. ఈ సమ్మర్లోనైనా వస్తున్నారా?” ఎంతో క్యాజువల్ రంగు పులిమిన వేఁడికోలు ను నా ముందుంచాడు నాన్న. 

    తెలివితేటలు తన నుంచే ఆస్తిగా నాకొచ్చాయని మర్చిపోయినట్లున్నాడు నాన్న. నాకు తెలుసు ఇక్కడ అసలు నిజమేమిటో. నాలుగేళ్ల క్రితం రెండో సారి హార్ట్ ఎటాక్ వచ్చినప్పటినుంచీ, ఆయనకు ఏ క్షణమైనా పోతానని భయం పట్టుకుంది. అప్పటి నుంచీ ఎప్పుడూ మా ధ్యాసే. మమ్మల్ని చుద్దామనీ, మాతో గడుపుదామనీ.

    ఆయన్ని మాతో పాటు తెచ్చి కొంత కాలం ఉంచుకోవచ్చు. కానీ, జరగకూడనిది ఏమైనా జరిగితే? ఇది ముందరే ముదిరిన రోగం అని చెప్పి, ఆరోగ్య భీమా కంపెనీ వాళ్ళు వాళ్లు డబ్బుకట్టకుండా జారుకుంటే? నేను దివాలా తియ్యల్సిందే! ఆయన  చావు భయం ముందు, నా ఇంష్యురెన్స్ భయం, ఆయన పుత్రప్రీతి ముందు నా ప్రాక్టికాలిటీ చాలా సులువుగా విజయం సాధించేశాయి. 

    అక్కడికీ రెండేళ్ళ క్రితం అందరం వెళ్లి ఒక రెండు వారాలు గడిపొచ్చాం. ఉన్న వెకేషన్ అంతా ఈ ట్రిప్పులకే సరిపోతే మిగిలిన ప్రపంచాన్ని చూసే టైమెక్కడుంటుంది? 

    మా ఆవిడతో ఈ విషయం ఓ సారి చర్చిస్తుంటే, ఎక్కడి నుంచొచ్చాడో, ఎంతవరకూ విన్నాడో కానీ, బాబి గాడు ఓ ప్రశ్నాస్త్రం సంధించాడు, నా పై. “నాన్నా మరి గణేశా చిన్నప్పుడు, వాళ్ళ ఆమ్మా నాన్నా చుట్టూరా రౌండ్లు కొట్టి, ప్రపంచమంతా చుట్టేసినంత గొప్ప పని చేశాడని నువ్వే చెప్పావు కదా. మనం కూడా మీ మమ్మీ డాడీ దగ్గర కెళ్తే, ప్రపంచం అంతా చూసేసినట్లే కదా?”

    ఒక్కోసారి ఆ దేవుడే పిల్లల రూపంలో వచ్చి, నేనిలాంటి దరిద్రపుటాలోచనలు చేస్తునప్పుడు, ఛెళ్ళున కొట్టే ప్రశ్నలడిగిపిస్తాడా అన్న అనుమానం కూడా వచ్చింది. అదే దేవుడు టి.వి లో అదే సమయంలో పవర్ రేంజర్స్ షో ని పంపించబట్టి సరిపోయింది కానీ, సమాధానం చెప్పాలంటే నా దుంపతెగుండేదారోజు.
మా అమ్మ పేరు చెప్పి మమ్మల్ని చూడాలని ఆశ పడుతున్న మా పిచ్చి నాన్న ఉద్దేశాన్ని నేను గ్రహించానన్న విషయం ఆయనకు తెలియకుండా దాస్తూ, “ఈ సారి కుదరట్లేదు నాన్నా, ఆఫీసులో మరీ బిజీ గా ఉంది. అమ్మకు నువ్వే నచ్చజెప్పు. క్రిస్మస్ కి తప్పకుండా వస్తాం” అని చెప్పాను.  “సర్లేరా..కాసేపు బాధపడినా, సర్దుకుంటుందిలే అమ్మ...నీ వీలు చూసుకొని రా” అని ఫోన్ పెట్టేశాడు నాన్న.  నేను మరీ స్వార్థపరుడిలాగా  ప్రవర్తిస్తున్నానా  అన్న ఆలోచన ఆఫీసుకి వెళ్ళటానికి మిగిలిన ఆ కొద్ది దూరం లో నా గతాన్ని తవ్వుకునేలా చేసింది.

    నేను చిన్నప్పటినుంచీ “రాముడు మంచి బాలుడు” టైపే. మా నాన్న చెప్పిన స్కూల్ కే వెళ్లాను, ఆయన చదివించిన చదువే చదివాను. ఆయన వెళ్ళమంటేనే, ఆయన తీసుకొన్న లోను డబ్బులతోనే అమెరికా లో యం.యస్ చేశాను. ఆయన ఎంపిక చేసిన, ఆయన కొలీగ్ అందమైన కూతుర్నే పెళ్ళాడాను. ఇప్పుడూ, ఆయన మాట కాదనట్లేదు, అర్థం అవ్వనట్లుగా నటిస్తున్నానన్న విషయం ఆయనకు తెలియకుండా జాగర్త పడుతున్నాను. “ఐ యాం నాట్ ఏ బ్యాడ్ సన్” అని నాకు నేనే సర్దిచెప్పుకొనేలోపల ఆఫీసు దగ్గర కొచ్చేశాను.

    ఆఫీస్ లో టైం చాలా వేగంగా పరిగెత్తింది. అలవాటైన గారడీ నే కాబట్టి, ప్రెసెంటేషన్ బాగానే జరిగింది. టైం మధ్యాహ్నం మూడు గంటలయ్యింది. ఇప్పటికి కానీ తీరుబడి దొరకలేదు, సాయంత్రం ప్లాను గురించి ఆలోచించటానికి. మూడున్నరకి బయలుదేరితే సన్నీవేల్ నుంచి ఫ్రీమాంట్ కి నాలుగింటికల్లా చేరుకోవచ్చు, ట్రాఫిక్ ఉండదు కాబట్టి. బాబి గాడి స్కూల్లో ప్రోగ్రాం అయ్యాక, అయిదింటికి ఆఫీసులో పన్లున్నాయని చెప్పి రెడ్ వుడ్ సిటీ కి బయలుదేరితే, సాండ్రాని తన హోటల్ లో  ఆరు గంటల కల్లా కలవచ్చు. ఒక గంట మాత్రమే స్పేర్ చెయ్యగలనంది కాబట్టి, ఏడింటికి బయలుదేరితే, ఓ అరగంటలో ఇంటికి చేరుకోవచ్చని పడకబ్బందీగా ప్లాన్ వేసేశా.

    సాండ్రా నుంచి కాల్. అతివేగంతో గుండె చప్పుడు మళ్ళీ మొదలు. కాల్ తీసుకొనే లోపల బాస్ రావటంతో వాయిస్ మెయిల్ కి సాండ్రా ని వదిలెయ్యాల్సివచ్చింది. నా అసహనాన్ని పట్టించుకోకుండా, నా బాస్ నన్ను తెగ పొగుడుతూనే ఉన్నాడు. ఆ క్లైంట్ కి నేను బాగా నచ్చేశాననీ, ఆ కాంట్రాక్ట్ తమకే రావటం తధ్యమనీ, ఇంకా ఏవో చెప్తూనే ఉన్నాడు. మూడున్నర అయిపోయింది. నేను వెళ్ళాలి అని చెప్పి, హడావిడిగా కార్ కీస్ తీసుకొని బయల్దేరాను.

    కారు 880ఎన్ హైవే ఎక్కంగానే సాండ్రా కాల్ సంగతి గుర్తుకొచ్చి వాయిస్ మెయిల్ డయల్ చేశా. తన హస్కీ వాయిస్ లో వదలిన మెసేజ్ సారాంశం “నేను ఎప్పటిలాగా రెడ్ వుడ్ సిటీ లో లేను, శాన్ ఫ్రాన్సిస్కో డౌన్టౌన్ లో ఉన్నాను. ఏడు తరవాత దొరకను. నిన్ను మాత్రం పర్సనల్ గా కలవాలని ఎంతో ఆతృతతో ఉన్నాను, డిజప్పాయింట్ చెయ్యద్దు.” ఒక్క సారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. ఈ ట్రాఫిక్లో అక్కడి దాకా వెళ్ళాలంటే రెండు గంటలైనా పడుతుంది. అంటే నేను నేరుగా సాండ్రాని కలవటానికెళ్తే తనని కలవగలుగుతాను. బాబి గాడి మీటింగ్ కి వెళ్తే మాత్రం సాండ్రాని కలవలేను. సాధారణంగా చాలా వేగంతో నిర్ణయాలు తీసుకొనే నేను ఈ సారి మాత్రం కొద్దిగా సంకటంలో పడిపోయాను.

    హైవే మీద నా ఎక్సిట్ రావటానికి ఇంకా పది నిమిషాల టైం ఉంది. ఒక్క సారి ఆలోచనలు చుట్టుముట్టాయి. బాబి గాడికి నేను చేసిన ప్రామిస్ ఒక వైపు, నన్ను కలవటానికి సాండ్రా హస్కీ వాయిస్ లో నాకు కనపడిన ఆతృత మరో వైపు. బాబి గాడి టీచర్ తో సుత్తి, వాడి ఆర్ట్ ప్రాజెక్టులు ఒక వైపు, నా మనస్సులో నడుస్తున్నది సాండ్రాలోనూ నడుస్తుంటే, నేను ఒక గంట పాటు అనుభవించబోయే కైపు మరోవైపు, నన్ను చిత్రహింస పెట్టటం ప్రారంభించాయి. హైవే ఎక్సిట్ సైన్ బోర్డు దగ్గర కొచ్చేసింది. నాకు దానినిండా బాబి గాడి మొహం సగం, సాండ్రా మొహం సగం కనపడుతున్నాయి. కుడివైపు ఉన్న లేన్ లోకి మారిపోయా. ఎక్సిట్ ఇంకో పది మీటర్లుందనంగా దిగకుండా నేరుగా హైవే మీద వెళ్ళిపోయా. మనసుపై పురుషాంగ విజయమంటే ఇదేనేమో!

    కాల్ చేసే ధైర్యం లేదు. మా ఆవిడ సెల్ ఫోన్ కి ఎస్సెమ్మెస్ కొట్టా. “కంపెనీ ప్రెసిడెంట్ తో మీటింగ్ లో ఉన్నాను, రావటానికి కుదరట్లేదు, సారీ!” అని. యూనియాన్ సిటీ దాటి ఒక్లాండ్ వైపు దూసుకెళ్లా. ఈ పాటికి బాబి గాడి టీచర్ తో మీటింగ్ మొదలయ్యుంటుంది, వాడి బిక్క మొహం ఒక్క సారి నాకు రేర్ వ్యూ మిర్రర్ లో కనపడింది. సడన్ గా బ్రేక్ కొట్టాను, ట్రాఫిక్ మొత్తం ఆగిపోయి ఉంది రోడ్డు మీద. ఎక్కడో చాలా దూరంలో శాన్ ఫ్రాన్సిస్కో మహానగర్ స్కైలైన్ కనబడుతోంది. “మల్టిపుల్ కార్ కొలిజన్, చాలా ఘోరమైన ఆక్సిడెంట్ జరిగిందిట, క్లియర్ చెయ్యటానికి గంటా గంటన్నర పట్టచ్చు” అని జనాలు రోడ్డు మీద కారు దిగి మాట్లాడుకుంటున్నారు.

    నా టైం చూసుకున్నాను. 4.45 అయ్యింది. బాబి గాడి మీటింగ్ అయిపోయుంటుంది. ఇంకొక అరగంట గడచినా నా కారు ఒక్క మీటర్ కూడా కదలలేదు. “పొయెటిక్ జస్టిస్” అంటే ఇంతే నేమో అనిపించింది ఆ క్షణంలో. ఇంకొక పావుగంట తరువాత చీమ లాగా కదులుతున్న ట్రాఫిక్ తో పాటు నేనూ నా కారుని నడుపుకుంటూ తరువాతి ఎక్సిట్ దగ్గర దిగిపోయా. సాండ్రా కి మెసేజ్ కొట్టా..”సారీ. రాలేకపోతున్నాను” అని. సరాసరి ఇంటికి వెళ్ళిపోయా లోపలి రోడ్లెంబడి.

    నాకు బాబి గాడి కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు. ఇంట్లో మా ఆవిడ కోల్డ్ ట్రీట్మెంట్ ఇస్తోంది. తిడితే భరిస్తాను కానీ, ఈ అస్త్రాన్ని తట్టుకోలేకపోవటం బహుశా అందరి మగాళ్ళ వీక్నెస్ ఏమో! “బాబీ సారీరా..నువ్వు ఎక్బాక్స్ గేం ఒకటి ఎన్నో రోజులుగా అడుగుతున్నావు చూడు, అది కొందామా?” అన్న చిన్న లంచంతో వాడి మూడ్ చాలా వరకూ బాగైపోయింది. ఆరో నెల కడుపుతో ఉన్న మా ఆవిడ సైలెన్స్ బ్రేక్ చెయ్యాలంటే ఒక్కటే మార్గం కనపడింది. “ఆఫీస్ లో ఎవరో చెప్పారు, మన ఇండియన్ స్టోర్లో మామిడి కాయలు స్టాక్ కొత్తగా వచ్చిందిట. తినాలనిపిస్తోందన్నావు కదా, నువ్వూ సరదాగా రాకూడదూ, నీకూ వాకింగ్ అయినట్టుంటుంది”.  

    ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో అదేమీ రద్దీనో కానీ, కార్ పార్కింగ్ ఎక్కడో దూరంగా చెయ్యాల్సొచ్చింది. మామిడికాయలు కొని స్టోర్ బయటకు వచ్చి కారుకి సగం దూరం వరకూ నడవంగానే, హటాత్తుగా వాన మొదలయ్యింది. నా అయిదొందల డాలర్ల కోటు తడిసిపోతోంది! అంతే, నా జాగింగ్ స్కిల్ అంతా ఉపయోగించి, ఒక్క ఉదుటున కారు వైపు దౌడు లంఘించా. కారు డోరు లాగి లోపలికి దూకాక, నేను తీసుకున్న పదిహేను సెకండ్ల టైమింగు కి కించిత్తు మురిసిపోయా. 

    అప్పుడు చూశా తనని దూరంగా బాబి గాడితో. ఆ వర్షంలో నెమ్మదిగా నడుస్తూ, బాబి గాడి తలపై తన దుపట్టా కప్పేసి, ఒక చేత్తో క్యారీ బ్యాగ్ లోని మామిడి కాయలతో, మరొక చేత్తో బాబిగాడి చెయ్యిపట్టుకుని, కడుపులో మా రెండో బిడ్డని మోస్తూ, నెమ్మదిగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ, వర్షంలో తడిసి ముద్దవుతూ వస్తున్న మా ఆవిడని. అప్రయత్నంగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కన్నీటి చుక్క గబుక్కున ఊరిపోయింది నా కంట్లో. 

    వేలి అంచుతో తుడిపేస్తే ఆ ఒక్క చుక్కా మాయం అయ్యింది కానీ, మా ఆవిడ కార్లో బాబి గాడితో పాటు వెనక సీట్లో కూర్చున్నప్పుడు, తన ముఖం మీద నుంచి జారుతున్న నీళ్ళలో వర్షపు నీరెంతో, కన్నీరెంతో తెలుసుకోవటానికి కూడా భయం వేసింది. ఇల్లు చేరంగానే, తన వెనకాలే బెడ్రూం లోకి నడిచా. తనని చుట్టేసుకొని “ఐ యాం సారీ..ఐ యాం సారీ..ఫర్ ఎవ్విరి థింగ్!” గద్గదమైపోయిన గొంతుతో నా మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నప్పుడు, నా కన్నీళ్లు చూస్తే, తట్టుకోలేకపోతానని అనిపించిందేమో తనకి, నా మొహాన్ని తన గుండెకు గట్టిగా హత్తుకొని, “ష్...ష్” అంటూ ఉంటే, అలాగే చాలా సేపు గడిపాం. ఆ క్షణంలో నాకు “క్షమయా ధరిత్రీ” ఎందుకో అతిశయోక్తిగా అస్సలు అనిపించలేదు.

    రాత్రి పదకొండయ్యింది. వాడి గదిలో బాబిగాడూ, మా బెడ్డు మీద మా ఆవిడా నిద్ర పోతున్నారు. నా కెందుకో బాబిగాడి ముఖం చూడాలనిపించి వాడి గదిలో కెళ్ళాను. వాడి ప్రాజెక్ట్ వర్కంతా బెడ్ మీద చెల్లాచెదురుగా పడేసి ఉంది. ఎన్ని బొమ్మలు గీశాడో, తప్పకుండా వాళ్ళమ్మ నుంచే వచ్చింది, ఆ కళ. ఒక్కొక్క బొమ్మా చూస్తుంటే నాకు ఎక్కడో సూది పోట్లు పొడిచినట్లనిపించింది. ప్రతి “ఫ్యామిలీ” బొమ్మలోనూ, వాడూ, వాడి చెయ్యిపట్టుకొని నవ్వుతూ అమ్మ. నేను ఒక బొమ్మలో ఎక్కడో కూర్చొని ల్యాప్టాప్ చూసుకొంటుంటే, ఇంకొక బొమ్మలో మొబైల్, వాళ్లిద్దరికీ చాలా దూరంగా.

    నా ఎక్బాక్స్ లంచం తో వాడి అలక తీరిందేకానీ, వాడు పసితనం వల్ల గుర్తించలేని ఆ లోతైన గాయాన్ని మాన్పటానికి, నేనే లంచమూ ఇవ్వలేని  ఆశక్తుడనన్న నిజం, ఒక్క సారిగా నన్ను తొలిచేసింది.

    మానిటర్ ఆన్ చేసి, ఫేస్‌బుక్ ఓపెన్ చేశా. ఇంతలో సాండ్రా నుంచి మెయిల్ రావటంతో నా ధ్యాస అటు మళ్ళింది. మెయిల్ సారాంశం నన్ను మరింత చిన్నవాణ్ణి చేసింది. “నీ తో పర్సనల్ గా కలిసి నీ కీ గుడ్ న్యూస్ చెబ్దామనుకున్నాను. వచ్చే నెల రాబర్ట్ తో నా వెడ్డింగ్. నువ్వు తప్పకుండా రావాలి.  మీ ఫామిలీ ని కూడా తీసుకురా. మనం కలిసింది ఒక్క సారే అయినా, నిన్ను చుస్తే నా కెందుకో, నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కార్ ఆక్సిడెంట్ లో చనిపోయిన నా పెద్దన్నయ్య గుర్తుకొస్తాడు. నీలాగే తన ఫామిలీ ని అమితంగా ప్రేమించే వాడు. పెద్ద రేంజర్స్ ఫ్యాన్ కూడా!”

    నేను పెట్టిన రాముడి పోస్టుకి నూట యాభై లైకులు, ఎనభై కామెంట్లు! ఆ పోస్టు లోని అక్షరాలు ఒక్కొక్కటీ స్క్రీన్ లోంచి బయటకు వచ్చి నా చుట్టూ నాట్యమాడసాగాయి. “ఒక్క మాట”, బాబి గాడి మొహం, “ఒక్క పత్నీ”, సాండ్రా గురించి నా ఆలోచనలూ, “పితృవాక్పరిపాలన”, నా కార్ సౌండ్ సిస్టం లో ఎఖో అవుతూ మా నాన్న కంఠం, అన్నీ పరీక్షలో ఆన్సర్ తెలియని ప్రశ్నల్లాగా చెమటలు పట్టించసాగాయి. “చూలాలైన ఆలి” దగ్గర కొచ్చేసరికి, ఆరటానికి బయట ఉంచిన కోటు కూడా గాల్లో ఎగిరి గేలి చేస్తోందా అన్న భావన. ఒక్క ఉదుటున, ఎవరు లైకారో, ఎవరు కామెంటారో కూడా చూడకుండా, పోస్టుని డిలీట్ చేసి పారేశాను.  

    పట్టు వదలని ఫేస్‌బుక్ చేస్తున్న పేజ్ సజెషన్ ని ఫాలో అవుతూ, రాముడి పేజీ కి ఒక లైక్ కొట్టా. పోస్టుని డిలీట్ చేసినంత తేలికగా మనసులో జరుగుతున్న సంఘర్షణలని డిలీట్ చెయ్యలేం కాబట్టి, రాత్రి ఎంతో సేపు నిద్ర పట్టలేదు. 

    నా సంగతి నాకు బాగా తెలుసు. మార్పు రావాలని ఉన్నా, నా కలవాటైన జీవనశైలినీ, ఆలోచనాసరళినీ  ఒక్కసారిగా మార్చుకోవటం  అనుకున్నంత సులువు కాదు. నాకొక స్ఫూర్తి కావాలి, ఒక మార్గదర్శకుడు కావాలి, ఓ పార్టనర్ కావాలి...పొంతన లేని ఆలోచనలు....ఎడా పెడా..

    ఆ రాత్రి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు కానీ , మర్నాడు పొద్దున్నే లేచి, ఫిల్టర్ కాఫీ తో సహా మా ఆవిడను నిద్ర లేపా. బెడ్ రూమ్ కిటికీ అద్దం గుండా దూరంగా కనపడుతున్న సగం పొగమంచు తో కప్పబడిన కొండలను చూస్తూ, నా పక్కనే కూర్చొని కాఫీ సేవిస్తున్న మా ఆవిడతో చెప్పా “ఈ వీకెండ్ ఒక్కసారి రాములోరి గుడి కెళ్దామోయ్!”

(తానా పత్రిక అక్టోబర్ 2013 సంచికలో ప్రచురితం)
Comments