శ్రీవారూ..! ఏమిటిలాగయ్యారు..! - కె.కె.రఘునందన

  
 
అదేం మాయదారి పిచ్చోగానీ, తిరుగుబాటుపిచ్చి దె య్యంలా మా ఆయన్ని పట్టేసింది.. ఎక్కడ అన్యాయం, అక్రమం జరిగినా పేద్ద గొంతెట్టుకుని అరుస్తున్నారు.

    అదే నాకు నచ్చనిది.

    ఓసారేమో... శ్రీవారు మా ఇంటి ఓనర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఊరి శివార్లలో ఎవరో అమ్మాయిని వెంటేసుకోని బైకుమీద వెళుతూండగా ఈయనగారి కంటపడిందట. అది కాస్త వాళ్ళావిడ చెవిలో ఊదేసారు. దాంతో ఆ ఆలుమగల మధ్య అగ్గిరాజుకుంది. వాళ్ళ కోపతాపాల ఫలితం మేం చెల్లించే అద్దెపై పడింది. అంతేగాక, ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఈయనగారికి జరిగినట్టుగానే ఫీలయిపోయి పేట్రేగిపోతున్నారు.

    "మీకెందుకండీ! మీరసలుపట్టించుకోద్దు..." అన్నా విననంత మొండిగా తయారయ్యారు.

    పైగా "ఎవరూ పట్టించుకోకపోతే ఈ దేశం ఎలా బాగుపడుతుంది?" అని వీరలెవెల్లో ఉపన్యాసాలు దంచటం మొదలెట్టారు.
ఇక వినే ఓపిక నశించింది..!

    ఈయన ఉద్యమాలు, దండయాత్రలు అంటూ ఊళ్ళు పట్టుకు తిరుగుతూంటే కొంప కొల్లేరవుతుందేమోనని ఓ పక్క, ఈయనగారి వెర్రి మొర్రి పనులకు ఏ రౌడీ షీటరో ఒక్క దెబ్బకు మట్టికరిపించడు కదాని.. మరో వైపు గిలగిలలాడి ఛస్తున్నానుకోండి.

    నేనెంత చెప్పినా తన ధోరణి తనదే!

    ఒక రోజు ప్రచండ భానుడి మల్లే ఇంట్లో ప్రవేశించారు.

    "కాయకష్టం చేసుకునే ఆ పుల్లయ్య టీ కొట్టుని కబ్జా చేస్తారా నా కొడుకులు? వాళ్లంతుచూడనిదే నిద్రోయేది లేదంతే!" అని గంగవెర్రెత్తిపోయారు.

    "ఇంతకీ ఎవరండీ?" అని తాపీగా అడిగాను.

    "మరెవరు... ఆ ఇంద్రయ్య. వాడాడుతున్న నాటకమే.. టీ కొట్టుని నేలమట్టం చేయించి, అక్కడ బార్ పెడతాడట" అని కారాలు, మిరియాలు నూరారు.

    'హతోస్మి!'

    "మీరు కొండతో తలపడుతున్నారు" హెచ్చరించాను.

    అయినా వింటేనా!... ఆ మధ్యనా అంతే! కేబుల్ వాళ్ళతో గొడవ పడ్డారు. వాళ్ళు అమాంతం రేట్లని చుక్కల్లోకి ఎత్తేసారని, మండిపడింది కాక, ఈ పల్లెటూరి గబ్బిలాయిలకి నాలుగే నాలుగు చానళ్ళుచూపిస్తూ సొమ్ములు మాత్రం ముక్కుపిండి వసూలుచేస్తున్నారని వినియోగదారులందరినీ కూడగట్టి తిరుగుబాటు బావుటాను ఎగురవేసారు. అయితే వాళ్ళు మరీ గట్టి పిండాలు. పెంచిన రేట్లు చెల్లించనట్టయిన కనెక్షన్ పీకుడు కార్యక్రమం మొదలుపెడతామని హెచ్చరించి వెళ్లారు. దాంతో ఎవరిమట్టుకు వాళ్ళు భీతల్లిపోయి ముడుపులు ముట్టజెప్పేసారు. మరి మా శ్రీవారిది ఒంటరిపోరాటమే అయింది. ఆ ఫలితం నాకు ఏ చానెల్ చూడలేని దురదృష్టం వరించింది.

    కట్టుబాటులేని వాళ్ళతో జత కట్టిన ఫలితంతో బొప్పికట్టినా అదే తత్వం, పైగా తిరగుబాటు ధోరణి జీర్ణించుకుపోయింది. ఏ షాపుకెళ్లినా బిల్లుఇవ్వనిదే వస్తువు పుచ్చుకోరు. ఎందుకండీ అంటే 'రేప్పొద్దున్నవస్తువు పాడయితే నేను కన్స్యూమర్ ఫోరంలో కేసు వేయద్దూ' అని వాడి మొహం ముందే తెగేసి చెప్పేవారు. అంతే! అక్కడ అదో రసాభాస...

    కాంట్రాక్టర్ల విషయంలో తలదూర్చి ఇసుక, సిమెంట్ పాళ్ళు తనిఖీ చేసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళేవారు. టెలిఫోన్ నాలుగు రోజులపాటు మూగపోతే పేపర్ కిచ్చేవారు. ఓ పూట కొళాయి రాకుంటే చాలు మున్సిపాలిటీ వారి మీద ధ్వజమెత్తేవారు. పాలవాడిమీద లాక్టోమీర్‌తో దాడి చేసేవారు.

    ఇలా నానా రకాల విప్లవాలు లేవదీసి జనాల నోట్లోతెగ నానిపోయారు. అయితే అవన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడీ ఇంద్రయ్య వ్యవహారం వేయిరెట్లెత్తు.

    "ఆహా! అలాగా... ఏ ప్రాంతంలో కబ్జా జరిగింది? ఒక అలగావాడు నడివీధిన పడుతున్నాడా? వాకబు చేసి న్యాయం చేస్తాలెండి" అనేసాడు ఇంద్రయ్య ఏమీ ఎరగనట్టుగా.

    ఈయన ఊరుకోకుండా ఉవ్వెత్తునలేచిన అల మాదిరి ఎగిరారుట! అది చూసి ఇంద్రయ్య రెచ్చిపోయి "నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో" అని బేఖాతరుగా ప్రవర్తించాడట!

    అంతే.. శ్రీవారిలో ఎక్కడ్లేని ఉద్రేకం తిరగతోడేసింది. మా వీధంతా కాలుగాలినపిల్లిలా తిరిగారు.

    'ఆ ఇంద్రయ్యతోనా పెట్టుకున్నారు. అమ్మో ఏమయినా ఉందా?' అని నోళ్ళు నొక్కుకున్నారంతా!

    "మీరు నేను చేసే నిరాహారదీక్షలో తోడుంటే చాలు" అని వారిని బుజ్జగించి తనవెంట తిప్పుకున్నారు.

    "ఆ పుల్లయ్యకి అన్యాయం జరిగిందని వెర్రెత్తిపోతున్నారు గాని, మీ చేతి సొమ్ము ఎంత కరుగుతుందో ఆలోచించారా" అని ఒళ్ళుమండి అన్నానా మాట.

    "వెధవ డబ్బు ఎలాగయినా సంపాదించవచ్చు. తోటివారిని ఆదుకునే భాగ్యం ఎలా కలుగుతుంది?"అని తను నమ్మిన సిద్ధాంతాలను వల్లిస్తూ, ఆనాటి అల్లూరి ఉద్యమ స్ఫూర్తిని సైతం ఏకరువు పెట్టారు.

    "ఇదిగో.. నేను వెళుతున్నా.. ఎలా ఉంటుందో చెప్పలేను పొజిషన్.. నువ్వేం బెంగ పెట్టుకోకు" అని కంటితుడుపు మాటలాడి వెళ్లిపోయారు.

    అది మొదలు గుండెల్లో రైళ్ళు...

    ఈ సమర శంఖారావమంతా మా ఊర్లో మయూరీ జంక్షన్‌లో...

    నాకుండబట్టలేదు. ఎదురుగా ఉన్న రిక్షా వీరిగాడిని పిలిచి అక్కడ వాతావారణం కనుక్కుని రమ్మని పంపాను.

    వీరిగాడు గంటలో రివ్వున తిరిగివచ్చాడు.

    "అమ్మగోరూ! నా సామిరంగా.. బలె.. బలె.. ఎంత కలొచ్చీసిందనుకున్నారు. జంక్షన్‌కి జనం యిరగబడిపోతున్నారనుకోండి" అన్నాడు మహా సంతోషంగా.

    "గలాటాలేం జరగడం లేదు కదా?" బెంగగా అడిగాను.

    "గలాసుల్లో ఒంపుకోని తాగటానికి గలాటాలెందుకమ్మా? అక్కకడ తాగనోడే పాపాత్ముడమ్మా! పుల్లయ్యగాడి కొట్టేటి పనికొస్తాది. ఇంద్రయ్య గోరి బాందీ దుకానం దగ్గర" అన్నాడు తెగ ఉబ్బిపోతూ.

    వాడి ఊగుడు, వాగుడు బట్టి పూటుగా తాగొచ్చాడని చెప్పొచ్చు. సంత చేసుకురమ్మంటే సానిదగ్గరకు పోయొచ్చాడట వీడిలాటివాడే!

    మరి నా గాబరా గురించి వేరే చెప్పనక్కర్లేదనుకుంటా.

    సిటీ కేబుల్ వార్తల దగ్గర చతికిల పడ్డాను. హెడ్‌లైన్స్‌లో ప్రధాన వార్త. "వెంకోబరావు దీక్షా శిబిరం వద్ద బాంబుదాడి" అని ఇంకా ఏదోచెప్పేలోపే కరెంట్ కటాఫ్...

    ఓరి దేముడా! ఈయనగారికేమైందిరో నాయనా! నా కొంపకి అగ్గెట్టరు కదా! అని ఒకటే ఏడ్చుకున్నాను... ఏ గూండాగాళ్ళో ఓ బాంబు పడేసి శిబిరం బూడిద చేయలేదుకదా! అలా నేను అలోపోలోమని ఏడుస్తూంటే...

    "సక్సెస్... గ్రాండ్ సక్సెస్... నాదే గెలుపు... తల్లో జేజమ్మ కూడా పలకాల్సిందే!" కటిక చీకటిలో ఉన్నా సరే ఆయనగారి గరుగ్గొంతును నే పోల్చకనా!

    "ఏమండీ! మీకేం కాలేదు కదా!"అని తడుముకుంటూ దగ్గరగా వెళ్ళబోయేంతలో కరెంట్ వచ్చేసింది.

    ఒక్కసారిగా వెర్రిగా కేకేసా.. మొహాన ఎర్రటి సందూరబ్బొట్టు.. మొయ్యలేని దండలతోకింద కొరిగిన కొంకిమెడ. ముక్కుమీదకి జారే కళ్లజోడు... కొంగబుర్ర.. అచ్చం భూతమే!

    "మీరు... మీరు..."

    "నేను నేనే విప్లవవీరుడు వెంకోబరావును. ఎందుకా అనుమానం? అసువులు బాసాననుకున్నావా దేవీ!"

    "ఛ! పాడు మాటలు మాటాడకండి. టీవీలో బాంబు దాడి అని న్యూస్ వస్తేనూ..." నా కంగారు తగ్గలేదింకా.

    "పిరికివెధవలు. బాంబు దాడికి ప్రయత్నం చేసారు. ఈలోగా ప్రతిపక్షాల మద్దతుతో భగ్నమయింది వారి కుట్ర... ఈ ఉద్యమం మరింతగా ఉధృతపరచి, నష్టపోయిన పుల్లయ్యని ఆదుకుంటా" అని మహా ధైర్యంగా అన్నారా మాట.

    ఈయన పిచ్చికి మరింత ఊతమిస్తున్న ప్రతిపక్షాల వారిని మరింత తిట్టుకున్నాను.

    ఆ రాత్రంతా ఏదో కసరత్తు చేస్తునే ఉన్నారు. నేనేదో సణిగాను.

    "ఎల్లుండి ఊరేగింపుకి ప్లాన్ చేస్తున్నా. బ్యానర్లు అవీ రాయించాలి. నినాదాలు తయారుచేసుకుంటున్నాను" చిరాగ్గా అనగానే మరా పరిసరాల్లోకి వెళ్ల సాహసించలేదు.

    ఆ మర్నాడుదయం త్వరగా తెమిలి హడావుడిగా పరుగులెట్టారు. ఆయనలా వెళ్లినాసరే నాకు ముద్ద దిగలేదంటే నమ్మండి.
విప్లవాల పేరుతో ఊళ్లు తిరిగే ఈయనకు రేపు పిల్లా జెల్లా కలిగితే మమ్మల్ని పట్టించుకుంటారని?... ఇలాటి ఆలోచనలతో నేను వేగిపోతున్నపుడే పొరుగింటి గున్నమ్మగారు పిచ్చాపాటికి దిగారు.

    "ఏవండీ! మీ శ్రీవారు ఈమధ్యన విప్లవవీరుడిమల్లే విజృంభిస్తున్నారట. ఉండాల్లెండి. అటువంటి వాళ్ళు నూటికో కోటికో తమ జీవితాలనుద్యమాలకే అంకితం చేసినవాళ్లుంటారు.. మా వారా! ఉత్త పిరిగ్గొడ్డు. ఏది అడగాలన్నా సరే బెంబేలెత్తిపోతుంటారు. అందువల్ల మీరు నాకో సాయం చేసి పెట్టాలి" అన్నది శ్రీవారిని పొగిడిపారేసినాక.

    "ఏమిటి?"

    "మరేంలేదు. మేం వీరారెడ్డి అనే ఆయనకి పాతిక వేలు అప్పిచ్చాం. కనీసం వడ్డీ కూడా ఇవ్వకుండా మొండికేస్తున్నాడు. అందుకని మీ వారు కాస్త పూనుకుని తిరగబడితే మా సమస్య పరిష్కారం అవుతుంది."

    ఆవిడ మాటలు వినడంతోనే నాకు మంటెత్తిపోయింది.

    శ్రీవారు వీళ్ళందరి కళ్లకి అప్పనంగా విప్లవాలు సృష్టించే శాల్తీలా కనిపిస్తున్నారా?

    అంతే! నా మొహంలో మొటమొట చూసిన ఆమె మరి అయిపు లేదు. ఇప్పటికే ఉద్యమాల స్ఫూర్తి శృతిమించి రాగాన పడుతోంది. అటువంటిది ఇరుగమ్మలకి, పొరుగమ్మలకి కూడా మద్దతిస్తే ఈవెర్రి కాస్త ముదిరి పాకాన పడుతుంది.

    ఆయన ఆ రాత్రి పది గంటలకి కొంపకి చేరారు.

    రిక్షాలోంచి బ్యానర్స్ దించారు.

    'రోడ్డున పడ్డ పుల్లయ్యను ఆదుకోవాలి.'

    'కబ్జా చేసిన స్థలాన్ని అప్పగించాలి'

    'ఇంద్రయ్య వెంటనే పదవులకి రాజీనామా చేయాలి' అని శ్రీవారు అరుస్తూ ఇంట్లోకి అడుగుపెట్టారు.

    "ఈ బ్యానర్స్ నిండా స్లోగన్స్.. రేపు భారీ ఊరేగింపుకి సకల సన్నాహాలను చేసుకొచ్చాను. కోట దగ్గర ప్రారంభించి, మూడు లాంతర్ల మీదుగా గంటస్తంభం, ఆపైన మయూరి జంక్షన్‌నుండి కలెక్టరేట్. దానికి ప్రతిపక్ష నాయకుడు పున్నాగరావు పూర్తి మద్దతు" అని మహా గొప్పగా చెప్పారు.

    కాళ్లు కడుక్కుంటున్నపుడు, అన్నం తింటున్నపుడు కూడా అదే గోల.

    అడ్డుపుల్లలు వేద్దామనుకున్న సరే.. నా పప్పులు ఆయన ఉప్పొంగే ఆవేశం ముందు ఉడకనే ఉడకవు. భారీ ఊరేగింపు ముగిసేదాకా శ్రీవారికి కునుకు పట్టేటట్టు లేదు.

    ఇలా తెల్లారిందో లేదో అలా బ్యానర్లు పట్టుకుని చెక్కేసారు. మధ్యాహ్నానికి భారీ ఊరేగింపు దృశ్యాలు కొన్ని క్షణాలపాటు టీవీ వార్తల్లో చూపించారు. మంది, మార్బలం మహ భేషుగ్గా ఉంది.

    ఆ సాయంత్రం రిక్షా వీరిగాడు ఉరుకులు, పరుగులతో మా యింటి ముందర వాలాడు.

    "అమ్మగోరూ! అమ్మగోరూ! గోరం జరిగిపోనాదండి..." అని వాడు ఆయాసపడుతూ చెపుతూంటే నా గుండెలు మరి లేవనే చెప్పాలి.

    "మరి.. మరి.. ఊరేగింపు కలకటరాఫీసు కాడకి తీసుకెల్లినారంట. అక్కడ పోలీసోల్లు లాటీల్తోటి ముడుకులిరగ్గొట్టినారంట. కొందర్ని టేసన్కి తీసుకెల్నారట. మరి బాబుగోరేమయ్యారోనమ్మా!" అని గుండెలు బాదీసుకున్నాడు.

    నేనిలా బోరుమని విలపిస్తున్నానో లేదో అయ్యగారు దిగారు. ఆయనగారు మెక్కుతూ వస్తున్నారేమోనని ముడుకులవైపు జాలిగా చూస్తున్నాను.

    కానీ, "పిరికి సన్నాసులు. దగాకోరులు. ఆ ఇంద్రయ్య మాతో సాల్లేక లాఠీఛార్జీ చేయించాడు. ఆఫ్ట్రాల్ పుల్లయ్యగాడి జాగా మీదనా కన్ను" అంటూ ఆయన పిచ్చెత్తినట్టు తిట్టసాగారు.

    "ఇక ఊరుకోరాదూ! మీ కెందుకండీ! వెధవ సంతగోల" అనేసరికి అగ్గగ్గలాడుపోయారు.

    "ఊర్కొనేది లేదంతే! పుల్లయ్యకు జరిగిన అన్యాయాన్ని ప్రతిపక్షాలద్వారా అసెంబ్లీలోకి తీసుకువెళతా. రేపే ప్రయాణం. ఛలో అసెంబ్లీ" వీరావేశంలో అదే తరహా.

    గట్టు తెగిన గోదారాయన...!

    వెళ్ళినట్టు వెళ్లిన శ్రీవారు మరలా మూడు రోజులకి సిద్ధం...  మొహం కళ తప్పింది.

    నేనేమైనా అడుగుతానేమోనని చూస్తున్నానని గ్రహించారు కాబోలు. ఆయనే మాటలు ఎత్తుకున్నారు.

    "ఎంత ఘోరం! దొంగ పత్రాలు సృష్టించాడు. పుల్లయ్య ఉసురు ఇంద్రయ్యకు తగలకపోదు. పాపం! పుల్లయ్య బ్రతుకు మీదనే నాకు జాలి" అన్నారు తెగ వాపోతూ.

    "ఏదీ నావైపు ఓసారిలా చూడండి. నిజంగా మీకు పుల్లయ్య కుటుంబం మీద జాలిగా ఉంది కదూ!"

    "ఔను! నేను పెట్టే గొడవంతా అతడి గురించే కదా"

    "అయితే సూటిగా నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి" ధైర్యం కూడగట్టుకుని నిలదీసాను.

    "అడుగు" గరుగ్గొంతు సవరించుకుని అన్నారామాట.

    "మొదట్లో ఈ ఊర్లో నిరాహారదీక్షకు పూనుకున్నారే.. దానికి మీకెంతయింది?"

    "ఆ...! మహా అయితే మూడు వేలు".

    "తర్వాత భారీ ఊరేగింపుకి ఎంత ఖర్చయింది?.. అదే.. బ్యానర్లకి వగైరాలకి"

    "బహుశా పదివేలయుంటుంది"

    "సరే! ఛలో అసెంబ్లీకి ఓ అరవైమందిని మోసుకెళ్లారుకదా... వాటికయిన సొమ్ము"

    "కనీసం ముప్ఫైవేలయుంటుంది. అయినా ఈ లెక్కలన్నీ నీకెందుకట?"

    "మీరింతదాకా ఖర్చుపెట్టిన డబ్బు సుమారు ఓ యాభైవేలయుంటుంది. ఔనా? మరి ఈ డబ్బంతా పుల్లయ్య రోడ్డున పడ్డప్పుడే దానం చేసి వుంటే, వాడి బ్రతుకు బాగుపడేది. మీరిలా నానా హైరానా పడే శ్రమా తప్పేది. ఆ ఇంద్రయ్య లాటి పెద్దవాళ్ళ దృష్టిలో పడేవారూ కాదూ!" నిష్కర్షగా అనేసానామాట.

    "ఔననుకో.. మరి నా విప్లవాలు.. ఉద్యమాలు.."తదేకంగా చూస్తూ అన్నారు.

    "ఆ!... ఇంత జరిగినా మరలా మీరు..."

    మహాప్రభో...! మా వారిక మారరు...!

(ఆంధ్రభూమి దినపత్రిక 25 ఫిబ్రవరి 2012 సంచికలో ప్రచురితం)
Comments