శృతిలేని రాగం - విశాల వియోగి

    "హలో శృతీ!" ఆశ్చర్యంగా చూశాడు వినయ్ సినిమా హాల్లో కనిపించిన ఆమె వంక చూస్తూ.     "హాయ్!" అంటూ దగ్గరికి వచ్చింది శృతి "ఇక్కడ?"     "ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉన్నాను - ఉద్యోగం చేస్తున్నాను" చెప్పాడు వినయ్. "వాట్ అబౌట్ యూ?"     "అక్క దగ్గరికి వచ్చాను - పెళ్ళి సంబంధాలున్నాయంటే."     "ఎవరికీ - నీకే!" ఆశ్చర్యంగా అడిగాడు.     "వైనాట్...నేను పెళ్ళి చేసుకోకూడదా - సరే... సినిమా అయింతర్వాత కనిపించు - అక్క పిలుస్తోంది..." హడావిడిగా వెళ్ళిపోయింది.

    "ఎవర్రా ఆ అమ్మాయి..." లోపలికి రాగానే చెవిలో అడిగాడు మురళి... సినిమా చూస్తూనే... పక్కనే ఎవరూ లేరుకాబట్టి... వివరాలు ఆరా తీశాడు.     "శృతీ... అని యెమ్మేలో నా క్లాస్‌మేట్... చాలా కలుపుగోలుగా ఉంటుందిలే..." వినయ్ చెప్పాడు.     సినిమా అయిన తర్వాత బయటకొచ్చేసరికి ఆమె అక్కతో సహా వినయ్ కోసం ఎదురుచూస్తోంది.     "మురళి...నా కొలీగ్...శృతి...నా క్లాస్‌మేట్!" పరస్పర పరిచయాలయ్యాయి. "మీన, మా అక్క" చెప్పింది.     రాత్రి తొమ్మిదయింది.     "కాఫీ తాగి పోదాం... హోటల్‌కు వెళదామా?" బిడియ పడూతూ వినయ్ అడిగాడు. శృతి తల ఊపింది.     కానీ మీనా మొహంలో విసుగు స్పష్టంగా కనిపిస్తోంది.

    "ఏం ఫర్వాలేదు... వినయ్‌ని కల్సుకుని చాలాకాలం అయింది. అక్కా! కాఫీ తాగిపోదాం రావే..." చనువుగా ఆమెని లాక్కొచ్చింది హోటల్‌కు.     "టిఫిన్!" అడిగాడు వినయ్...     "అబ్బ - కాఫీతో సరిపెడదామనుకున్నావా? ఉద్యోగం చేస్తున్నావుగా... మంచి పార్టీ ఇవ్వాలి... ప్రస్తుతానికి ఒక ఉల్లిపాయ పెసరట్టు చాలు!" శృతి అడిగింది.     శృతి చొరవకు మురళి సైతం ఆశ్చర్యపోయాడు.

    "ఏమిటే ఆ మాటలు... కొత్తా పాతా లేకుండా..." మందలించింది మీనా చిరుకోపంతో.     "నీకు తెలియదులే అక్కా...అడగందే అమ్మైనా పెట్టదు. ఈ వినయ్ ఒట్టి పిసినారి!" చెప్పింది శృతి.     "అన్యాయం...నాతో బిల్లు వదిలిస్తూనే ఆ మాట అనడం ఏం బాలేదు... మీ బావగారు ఏం చేస్తున్నారు?" అడిగాడు వినయ్.     "బావ బ్యాంక్ క్లర్క్ ఈ ఊళ్ళో... ఆయనకు క్షణం తీరిక వుండదు. సినిమాకు రమ్మన్నా రాలేదు" శృతి చెప్పింది.

    "దీనికర్థం కాదులేండి...అన్నట్లు మీకు పెళ్ళయిందా?" మీనా అడిగింది వినయ్‌ని.     "పెళ్ళా... అప్పుడే..."సిగ్గు పడ్డాడు వినయ్ శృతిని చూసి...     "మావాడికి కాలేదు లేండి... తనకు నచ్చిన అమ్మాయి దొరకలేదు..." చెప్పాడు మురళి.     "ఏ దివ్య భారతినో... నగ్మానో ప్రేమించి ఉంటాడు!" శృతి నవ్వింది గలగలా... వినయ్ కళ్ళలోకి చూస్తూ.     బేరర్ ఉల్లిపాయ పెసరట్టు తెచ్చి పెట్టాడు. నవ్వుతున్న శృతిని ఒక్కక్షణం చూసి వెళ్ళాడు.     శృతి గొప్ప అందగత్తె కాదు. అట్లాగని అనాకారి కాదు. ఎప్పుడూ మేకప్ చేసుకుని ఉండటం వలన ఆకర్షణీయంగా ఉంటుంది. ఫ్రీగా ఉండే ఆమె మనస్తత్వం అబ్బయిల్ని ఇట్టే ఆకర్షిస్తుందని మురళి కనిపెట్టాడు.

    "ఇంతకూ ఏం చేస్తున్నావు?" వినయ్ అడిగాడు.     "ప్రస్తుతానికి ఉద్యోగాల వేటలో ఉన్నాను... కానీ రామాయణంలో పిడకల వేటలా...ఇక్కడ సంబంధాలు చూస్తాం - రమ్మని, రాస్తే వచ్చాను...బైదిబై... నీ సంగతేంటి?" శృతి.     "ఏముంది...నేను ఓ చిన్న స్కూలు టీచర్ని. ట్యూషన్ల మీద కొద్దో గొప్పో సంపాదిస్తున్నాను. మురళి నా రూంమేట్! ఇతనూ నా కొలీగే!" చెప్పి కాఫీకి ఆర్డరిచ్చాడు.

    శృతి కాలేజీ కబుర్లు చెప్పి విరగబడి నవ్వుతోంది. అది హోటల్ అన్న స్పృహ ఆమెకున్నట్లు లేదు. నలుగురు ఆమెవనెక చూస్తున్నారన్న ధ్యాసలేదు. వినయ్ ఇబ్బంది పడ్డాడు చుట్టూచూసి.     "చిన్నప్పటి నుండి ఇంతేనా?" మీనాను అడీగాడు.     "ఆ! వస ఎక్కువ పోసింది మా అమ్మ! చివరిది కదా అని అల్లారు ముద్దుగా పెంచింది. తను ఆడింది ఆట - పాడింది పాట!" మీనా చెప్పింది కాఫీ కప్పు క్రింద పెడుతూ.     ఆ వాతావరణం లోంచి బయటపడాలని వెంటనే లేచి బిల్లు చెల్లించాడు వినయ్.     శృతి తన బావ విజిటింగ్ కార్డు తీసి ఇచ్చి రేపు రమ్మని చెప్పింది. మీనా, శృతి ఇద్దరూ వెళ్ళిపోయారు.     తుఫాన్ వెలిసిన హాయి కలిగింది మురళికి.

    మరునాడు మురళిని తీసుకుని శృతి ఇంటికి వెళ్ళాడు.
    "రండి...నా పేరు రమేష్... శృతి బావని" పరిచయం చేసుకుంటూ వీరిని ఆహ్వానించాడు. "శృతి మీ గురించి చెప్పింది."     శృతి... మీనా జత అయ్యారు. లోకాభిరామాయణం చాలా జరిగింది. మురళి కూడా కలిసిపోయాడు వాళ్ళలో.     ఓ గంట తర్వాత వెళతాం అని లేచారు మిత్రులు..."అయ్యో! టిఫెన్ చేయకుండానే... ఈ రాత్రికి మా ఇంట్లో పూరి చేస్తాం తిని వెళుదురుగాని, అసలే బ్రహ్మచారులు" మీనా చెప్పింది.

    "అబ్బె! ఇప్పుడెందుకండీ శ్రమ" నసిగాడు వినయ్.     "నో...నో...దిసీజ్ మై ఆర్డర్... మా ఇంట్లో తిని తీరాల్సిందే..." శృతి వినయ్‌ని ఆజ్ఞాపించి మీనాను తీసుకుని లోనికెళ్ళింది.     "మీరేమనుకోకపోత... ఓ చిన్నమాట..." రమేష్ అన్నాడు.     "చెప్పండి" వినయ్ చిరునవ్వుతో అడిగాడు.     "శృతికి సంబంధాలు చూస్తున్నాం... మంచి మంచి సంబంధాలు వస్తూనే వున్నాయి. కానీ, కాలేజీలో... మీరు..."రమేష్ కేసి ఆగాడు. వినయ్ కేసి చూశాడు.     మురళి కూడా ఉలిక్కిపడ్డాడు.     "...శృతి అంటే మీకు తెగ ఇది అని చెప్పింది. మీరామెను పెళ్ళిచేసుకోవచ్చు గదా...ఐ మీన్ ఇది నా అభ్యర్థన..." రమేష్ వినయ్ చేతులు పట్టుకున్నాడు.     మురళి ఆ ఐడియా తనకు రానందుకు చింతించాడు. వినయ్ వంక చూశాడు... అతని మొహం ఒక్క క్షణం పాలిపోయింది.

    "ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు...కాలేజీ రోజుల్లో మీరూ...ఇంకో నలుగురు మిత్రులు ఆమె చుట్టూ తిరుగుతూండేవారని నాకు తెల్సింది...అట్లాగని మీకేం అన్యాయం జరగదు. ఆమెకిద్దామనుకున్నంత కట్నం మీకు ఇస్తాం... ఎలాగూ తను ఉద్యోగం చేస్తుంది" రమేష్ ప్రాధేయపడ్డాడు.
    ఇంత గొప్ప ఛాన్స్ వినయ్‌కి తగిలినందుకు... మురళికి సంతోషం కలిగింది. అతనూ ఎన్నో సంబంధాలు చూశాడు. ఏదీ నచ్చలేదు.     "సారీ! ఆలస్యం అయింది. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు, నా పెళ్ళి నిశ్ఛయమైపోయింది" వినయ్ చెప్పాడు.     "ఈజిట్... నిశ్చయమైపోయిందా?" విచారంగా అడిగాడు రమేష్.     "యస్...ఒక్కవారం క్రిందట మీరు అడిగివుంటే" వినయ్.     "మాకు ప్రాప్తంలేదు..." రమేష్ బాధ పడ్డాడు.     లోపల గిన్నెలు క్రింద పడ్డచప్పుడు...     "మళ్ళీ కలుద్దాం..." వినయ్ లేచాడు మురళిని తట్టి. రమేష్ అభ్యంతరం చెప్పలేదు.     "ఎందుకురా అబద్ధం చెప్పావు?" బాధ పడ్తూ అడిగాడు మురళి.     "నేను సగటు భారతీయ యువకుణ్ణిరా! మొగాళ్ళతో ఫ్రీగా ఉండే అమ్మాయితో స్నేహం చేయగలను కానీ... పెళ్ళి చేసుకోలేను... నా భార్య పరాయివాళ్ళతో మాట్లాడితే భరించలేను" వినయ్ అన్నాడు.
    "శృతిలేని రాగాన్ని ఎవరు హర్షిస్తారులే!" సమర్థించాడు మురళి.
    

    
Comments