స్థిత ప్రజ్ఞత - వాలి హిరణ్మయీదేవి

    కిటికీ తెరచి, ఎదురింటివైపు చూసింది పులకిత.
    ఎప్పట్లాగే, హరిత సన్నటి పొడవాటి వేళ్ల నుంచి జారుతున్న ముగ్గుపిండి, రెప్పపాటులో చక్కటి రంగవల్లిగా రూపు దిద్దుకొంటోంది. రోజూ చూస్తున్నా పులకిత కిదెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. పనికి తను ఆమడ దూరం. చూసి మెచ్చుకొనే కళాత్మక హృదయం మాత్రం పుష్కలం. పులకిత జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఇంట్లోని పనీ - వంటా ఆమెతో పాటూ తోడుగా ఉండే ఆమె తల్లి కనకమ్మగారే చేస్తూండటం వల్ల - వంటింటికి ఆమడ దూరంలో ఉంటూంటుంది. భర్త చలపతిది తరచూ టూర్స్ వెళ్ళే జాబ్ - టూర్స్ నుంచి వచ్చినప్పుడల్లా అత్తగారికి పనిలో సాయం చేస్తూ, భార్యకి కాస్తయినా పని నేర్చుకోమని చెబుతూ ఉంటాడు. కొత్తగా వాళ్లు ఇంట్లో చేరినా - అంతకు ముందే పులకితకు ఆ వీధిలో అందరూ బాగా పరిచయం. ఈ మధ్యనే తమ ఎదురింట్లో ఉంటోన్న హరితతో పరిచయం పెంచుకోవాలని తెగ ఉవ్విళ్ళూరుతోంది. కారణం వారికి - తమకీ పనిమనిషైన రంగమ్మ మాటల వల్ల హరితంటే చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. అదీగాక అందమయిన రూపం, ఆమె పొడవాటి జడ విపరీతంగా ఆకర్షించాయామెను.     పులకిత లేచి బ్రష్ చేసుకొంటూ మళ్ళీ ఎదురింటి వైపు చూసింది. ఉదయపు ఎండ మందారాలపై పడి, ఆకుపచ్చటి ఆకుల మధ్య అరుణ వర్ణాలని ఎంతో అందంగా ప్రస్ఫుటిస్తున్నది. వారి బాల్కనీ మీదుగా అలుముకొన్న జాజితీగలో విరిసిన పూలు 'హలో' చెబుతున్నట్లుగా గాలికి ఊగుతున్నాయి.     కొద్దిగా స్థలముంటే ఓ చిన్న రూం కట్టించేసి ఏ స్టూడెంట్‌కో అద్దెకిచ్చే ఇళ్ళే ఆ వీధినిండా. అలాంటిది ఇంటి ముందూ, వెనుకా స్థలం ఉన్నా ఆ పని చేయకుండా చెట్లతో - పూలమొక్కలతో నింపేసిన హరితంటే గౌరవమూ కల్గింది.

    ఆదివారం కావటం మూలంగా ఈరోజెలాగైనా హరితతో పరిచయం పెంచుకోవాలనుకొంటూ తొందరగా తయారై వాళ్ళింటి గేట్ వంక చూస్తూ కూర్చుంది. హరిత భర్త మార్కెట్‌కి బయలుదేరగానే, లేచి చెప్పులేసుకొని గబగబా ఎదురింటి వైపు నడిచింది. మూసివున్న తలుపుల మీద టకటకమంటూ కొట్టింది.
    తలుపులు తెరిచిన హరిత, పులకితను చూస్తూ ఆశ్చర్యపడుతూనే ఆ వెంటనే చిరునవ్వుతో "రండి లోపలికి" అంటూ ఆహ్వానించింది.
    "కూర్చోండి - మీరు మా ఎదురింట్లోనే ఉంటున్నారు కదూ" అంటూ "స్టవ్ ఆఫ్ చేసి వస్తాను" అంటూ లోపలికి వెళ్లింది. ఈలోగా హాలునంతా పరీక్షగా చూసింది పులకిత. ఇల్లంతా ఎంతో నీట్‌గా - పొందిగ్గా ఉంది. గోడలపై ఇంట్లోనే ఎంతో శ్రమకోర్చి కళాత్మకంగా చేసిన హాంగింగ్స్, ఇంట్లో మధ్యలో రూఫ్ నుండి వేలాడదీసిన మ్యూజికల్ బెల్స్, ముఖ్యంగా డోర్ కర్టెన్సుకి కట్టిన మువ్వలు సవ్వడి చేస్తూ వీనులకు విందు చేస్తున్నాయి. షెల్ఫ్సులో పెట్టిన అందమైన పింగాణీ బొమ్మలు ఆమె టేస్టుని తెలియజేస్తున్నాయి. మరో పక్కనున్న షెల్ఫులో పేర్చిన పుస్తకాలు చూడగానే హరిత అంటే ఏమిటో తెలిసిపోయింది.

    ప్లేట్లో కొద్దిగా కారప్పూస పట్టుకొని వచ్చి, పులకిత చేతికందిస్తూ, "బుక్స్ చదివే అలవాటుందా మీకు" అంటూ అడిగింది.
    "చాలా" చెప్పింది పులకిత. "ఇంకో విషయం. నేను మిమ్మల్ని హరితా అని పిలవదల్చుకొన్నాను. కాబట్టి నన్ను మీరు అని మన్నించొద్దు. నువ్వు అంటే చాలు" అంది పులకిత నవ్వుతూ.     "ఓ.కె." ఆమె కలుపుగోలుతనానికి ముచ్చటపడుతూ అంది హరిత.     "మీకు పెళ్ళయి, ఇద్దరు పిల్లల తల్లంటే నమ్మేటట్లు లేరు - ముఖ్యంగా ఆ పొడుగు జడ ఓహ్, మీ అందం సింప్లీ సుపర్బ్" అంది పులకిత.     కొంచెం ఇబ్బంది పడుతూ, "థ్యాంక్యూ" అంది. "బాబీ ఇలా రా" అంటూ పిలిచింది.
    ఆ పిలుపుకి ఆరేళ్ళ అభిషేక్ వచ్చాడు. పులకితను చూస్తూనే "నమస్తే పిన్నీ" అన్నాడు నవ్వుతూ. ఆంటీ పిలుపుల కలవాటు పడ్డ పులకితకా పిలుపు ఎంతో తీయగా తోచింది. "ఇలారా" అంటూ తను తెచ్చిన బిస్కెట్ పాకెట్‌ని అందించిందామె. "ఇంట్లో బాబీ అని పిలుస్తుంటాం" అంది హరిత. వెంటనే చేతులు వెనక్కి తీసుకున్నాడు బాబీ. తల్లి "ఫరవాలేదు తీసుకో" అంటేగానీ అందుకోలేదు. హరిత పెంపకం ఎంత బావుందో ఇట్టే గ్రహించింది పులకిత. "అక్కకి గూడా ఇస్తాను" అంటూ వెడుతోన్న బాబీని అనుసరించింది పులకిత. మంచం మీద పడుకొన్న పదేళ్ళ పాపాయి గోడల వంక చూస్తూ నవ్వుకుంటోంది. చూడగానే 'మెంటల్లీ రిటార్డ్' అని తెలిసిపోతోంది. 'తీయగా సాగిపోయే వీరి సంసార సంగీతంలో భగవంతుడు పొరబాటున పలికించిన చిన్న అపస్వరం ఈ పాప' అని అనుకోకుండా ఉండలేక పోయింది పులకిత.

    "రండి ఇల్లంతా చూద్దురుగానీ" అంటూ హరిత ఇల్లు చూపించి పెరట్లోకి తీసుకెళ్లింది.
    పెరట్లో ఓ పక్క కూరగాయ మొక్కలు - మరో పక్క పూల మొక్కలు, వెనుక అరటి చెట్టు, కరివేపాకు, ముద్ద మందారం - చిన్న ఉసిరికాయ చెట్లు - పక్కగా పాకిన జాజితీగ, ఇంటిబయట కాపలా కాస్తున్నట్లు సైనికుల్లా ఉన్న కొబ్బరి చెట్లు - వాటి నన్నింటిని చూసి చిన్న పిల్లలాగే సంబర పడింది పులకిత.     "నిజంగా - మీ ఓపికకు జోహార్లు. మీ భార్యాభర్తలిద్దరూ ఎంతో బాగా తీర్చిదిద్దుకొంటున్న నందనవనం ఇది. మా ఆయనను తీసుకొచ్చి చూపించాలి - నాకిక ఒక గంట క్లాస్ పీకేస్తారు. ఓ సారీ! ఆఫీస్ భాష అలా వచ్చేస్తుంటుంది. వారెంతగా చెప్పినా ఉహూ - పనంటే చాలా బద్ధకం. కానీ మిమ్మల్ని చూశాక నేను కొంచమైనా మారకపోతే నా జన్మ వృథా!" అంది పులకిత.     ఆ మాటలకు నవ్వేసింది హరిత.     "నీకు వీలు చిక్కినప్పుడల్లా వస్తూవుండు. నీ స్వంత అక్క ఇల్లే అనుకో. అమ్మగారిని కూడా తీసుకురా" అంది ఆప్యాయంగా. అభిరుచులు ఇద్దరివీ ఒకటే అయినందుకేమో, అతిత్వరలో మంచి ఫ్రెండ్సయి పోయారు వారిద్దరు. తెలీని వాళ్ళు 'చిన్నప్పట్నుండి స్నేహితులు కావొచ్చ'ని పొరపాటు పడేంత స్నేహం వారి మధ్య పటిష్ఠమయి పోయింది.

* * * * *  

    "ఈ వారం మీటింగ్ చాలా బాగా జరిగింది కదా" అంది మిసెస్ రావ్ పులకితతో. ఆ మహిళామండలిలో అందరికన్నా బాగా ధనవంతురాలామె. ఆమె తన ఐశ్వర్యాన్ని ఎన్ని రకాలుగా ప్రదర్శించవచ్చో - అన్ని రకాలుగానూ ప్రదర్శిస్తూ ఉంటుంది. నలుగురి దృష్టిని తన వైపుకి తిప్పుకోవాలన్న తాపత్రయం అధికం. 'ఎప్పటిలానే ఆమె చీరల ప్రదర్శన గాకుండా నగల ప్రదర్శన వెరైటీగా జరిగి ఉంటుం'దని మనసులో అనుకొంటూ పైకి మాత్రం చిర్నవ్వు నవ్వి ఊరుకొంది పులకిత.
    "మన మండలికి అంతా వస్తారుగానీ నీ ఫ్రెండ్ రాదేంటి? నూతిలో కప్పలా ఎప్పుడూ ఇంట్లోనే పడి ఉంటుందేంటి?" అంది హరిత గురించి.     ఒళ్ళుమండింది పులకితకు. "మీకు తెలిసే అంటున్నారా? తనకి వాళ్ళ పాపనొదలి పరిస్థితని తెలీదా? ఆయాలమీద వదిలివచ్చే రకం కాదు తను. దొరికిన ఖాళీ టైంలో పిల్లలకు అవీ ఇవీ చెబుతూ ఉంటుంది. తనకొచ్చిన సంగీతాన్ని ఏ ఫీజూ ఆశించకుండా నేర్పిస్తూ ఉంటుంది. మనకన్నా కాలాన్ని సద్వినియోగం చేస్తోంది తను" అవేశంగా అంది పులకిత.     ఆమెకి బాగా కోపం వచ్చిందని గ్రహించిన మిసెస్ రావ్ చల్లగా జారుకొంది.     హరితకు కాస్త రిలాక్స్ అవసరం అనే తను పాపని తన తల్లికప్పగించి అప్పుడప్పుడు ఆమెను సాహిత్య సమావేశాలకు, సంగీత సభలకు, లాఫింగ్ క్లబ్‌లకు ఈ మధ్య తీసుకువెడుతోంది. హరిత నేచర్‌కీ మహిళా మండలి పనులు - చేష్టలు నచ్చవనే ఇక్కడికెప్పుడూ తీసుకురాలేదు. వీళ్ళెంతో ఖర్చుపెట్టుకొని మరీ ఆ సాహిత్య సంగీత సభలకి వెళ్ళడం మిసెస్ రావులాంటి వాళ్ళకి 'పిచ్చిపనుల్లా'కన్పించడంలో వింత లేదు. 

* * * * *  

    ఆ రోజు పులకిత వెళ్ళేసరికి, హరితా వాళ్ళ ముందు రూమంతా, చిందరవందరగా ఉంది. కర్టెన్‌లు తెంపబడి ఉన్నాయి. వాటికి కట్టి ఉన్న మువ్వలన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయ్. కొన్ని పింగాణీ బొమ్మలు ముక్కలయి ఉన్నాయి.
    తలుపు చప్పుడికి తొంగిచూసిన భరత్ "హరితా! లే, మీ ఫ్రెండ్ వచ్చారు వెళ్ళు. పాపని నే చూసుకుంటాలే" అంటూ హరితను పంపించాడు. ఎన్నో లంఖణాలు చేసినట్లు నీరసించి ఉన్న హరితను చూస్తూనే ఆశ్చర్యపోయింది పులకిత.     చవితినాటి చంద్రుడిలా బలహీనమైన నవ్వొకటి విరిసింది హరిత పెదవుల మీద.     "ఏంటలా ఉన్నావ్? ఒంట్లో బాలేదా?" ఆదుర్దాగా అడిగింది పులకిత.     "బాగానే ఉన్నాను" అందామె నిర్లిప్తంగా. కొన్ని నిముషాలు మౌనంగా దొర్లిపోయాయ్.     "మన మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడిందనుకొన్నా నింతవరకు. కానీ నిజంగాదని తెలిసిందివాళ" అంతూ లేచి వెళ్ళపోయింది పులకిత.     "అలా అనకు పులకితా! మనస్సు బాగాలేదు - భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే భయం వేస్తోంది" అంది బేలగా.     "ఏమైందమ్మా!" లాలనగా అడిగింది పులకిత, హరిత రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకొంటూ. ఆ లాలనకి కరిగిపోయింది హరిత.     "పాప శిరీషతోనే రకరకాల ప్రాబ్లెమ్స్ వస్తున్నాయి. ఎంతసేప్పూ నన్ను తన దగ్గరినుండి కదలనీయదు. అభిని కాస్సేపు దగ్గరకు తీసుకొంటే భరించలేదు. నేనెప్పుడూ గమనిస్తూ ఉంటాను గదా. వాణ్ణి దాని ఎదురుగా ముద్దులాడినా, దగ్గరికి తీసుకొన్నా, వాణ్ణి గిల్లడం,రక్కడం లేదా జుట్టు వంచి లాగడం చేస్తుంది. చెప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది గానీ ఆయన నేనూ సాన్నిహిత్యంగా ఉన్నా భరించదు. ఆయన గుండెలమీద కొట్టేస్తుంది. నేనెప్పుడూ దాని దగ్గరే ఉండాలి. ఎలా సాధ్యం చెప్పు. అసలు నేనే తప్పు పని చేశాను. ఇలాంటి పిల్ల ఉండగా రెండో సారి గర్భవతిని కాకుండా ఉండవలసింది. పాపం వాడి వయసెంతని. నా ఒళ్ళో ఆడుకోవాలని, నా పక్కన పడుకోవాలనీ వాడికి మాత్రం ఉండదూ. అయినా వయసుని మించి అర్థం చేసుకొని ప్రవర్తిస్తుంటాడు. మా ఇద్దరి బుజ్జగింపులనర్థం చేసికొంటాడు."
    "ఈ పది రోజులుగా శిరీషకు జ్వరం వాంతులు - విరేచనాలు. దానికి సేవలు చేసి చేసీ నాకు నీరసం వచ్చేసింది. నాల్రోజులైతే స్నానం గూడా చేయకుండా దాని దగ్గరే ఉండిపోయాను. పక్కనుండి కదలనివ్వనిదే. మెల్లి మెల్లిగా దాన్ని వదలి పనిచేసుకొంటూ వస్తున్నాను. జ్వరం నుండి తేరుకొని వారం అయిందిలే అని. కానీ ఎలా ఎన్నాళ్ళిలా?" అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమైంది.

    "అరరె, సారీ హరితా! ఈ పది రోజులుగా ఊళ్ళో లేనుగదా. నిన్ను ఎప్పుదెప్పుడు చూస్తానా, అనుకొంటూ వచ్చాను. నా మనస్సుకి నువ్వెంత దగ్గరయ్యావో నిన్ను చూడని ఈ పదిరోజుల్లో బాగా తెలిసింది. నేనెంతో ఆత్రంగా నీ దగ్గరికి వస్తే నువ్విలా అంటీఅంటనట్లున్నావని భావం కల్గి ఆవేశంలో నోరు జారాను. రియల్లీ అయాం  వెరీవెరీ సారీ, ఛ...చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. పిల్లలన్నాక ఎప్పుడూ ఒకేలా ఉంటారా? ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. తగ్గుతూ ఉంటుంది. ఇంత స్థిత ప్రజ్ఞురాలివి నువ్వే ఇలా బెంబేలు పడితే ఎలా చెప్పూ" అంది పులకిత - ఆమె వెన్ను ఆప్యాయంగా రాస్తూ.
    ఆమె ఆప్యాయతకి బరస్టయింది హరిత. "నేనా స్థిత ప్రజ్ఞురాలిని? ఏ పాపం చేస్తే భగవంతుడీ రాత రాశాడని అల్లల్లాడిపోతూ ఉంటే? మంచి భర్తకి నిదర్శనం - నా భరత్. ఇంత మంచి భర్తని చూసుకొని గర్వంతో కొవ్వెక్కిపోతుందనేమో భగవంతుడు ఈ శిక్ష వేశాడు. భరత్ అర్థం చేసుకొనే మనిషి కాబట్టే ఈ మాత్రమయినా బతకగల్గుతున్నాను. మేమిద్దరం దాంపత్య జీవితం గడిపేది నెలకొక్కసారో, రెండుసార్లో అంటే నమ్ముతావా? అదీ భయం భయంగా పాప ఎక్కడ చూస్తుందోనన్న భయంతో. ఇవాళ ఆయనకి తలనొప్పి అంటే నా ఒళ్ళో పడుకొన్న ఆయన తలకి కాస్త అమృతాంజనం రాస్తున్నాను. అంతే, దానికి పూనకం వచ్చేసింది. నేను అది పిలుస్తున్నా పట్టించుకోలేదన్న అక్కసుతో చూడు ఎలా భీభత్సం చేసేసిందో. అది విసిరిన బొమ్మ తగిలి అభిషేక్ తలకి దెబ్బతగిలితే వాణ్ణి మా కజిన్ వాళ్ళింటికి పంపాను. పాపం అక్కడ వాడెలా ఉన్నాడో" అంటూ భోరుమంది.

    పులకితకూ ఉధృతంగా ఏడ్పు ముంచుకొచ్చింది. దాంతో హరిత నోదార్చడానికీ నోరు పెగల్లేదు. చాలాసేపటికి గాని తనని తాను సంభాళించుకోలేక పోయింది.
    "ఊరుకో, ఇక ఊరుకోమ్మా, నేను అభిని తీసుకొచ్చేస్తాను. డా.సుకుమార్ అని మంచి సైకియాట్రిస్ట్ ఇక్కడికి అమెరికా నుండి వచ్చారట. ఆయనతో ఇంటర్వ్యూ వేస్తున్నాం. అతనికి మన శిరీని చూపిద్దాం. సరేనా?" అడిగింది పులకిత.
    "ఎవరికి చూపించి ఏమీ ప్రయోజనం లేదే? నా ఒంటి మీద పాతిక తులాల బంగారం దాని వైద్యానికే వాడేశాను. ఇప్పటికీ జీతంలో సగభాగం దాని మందులకే వాడుతున్నాం. బాబీ భవిష్యత్తు కోసం ఏమీ దాయలేకపోతున్నామన్న చింత ఒకటి పట్టుకొంది. ఖర్చు చేసినా ప్రయోజనం ఉంటుందంటే ఫర్వాలేదు, కానీ అప్పులు చేసి మరీ వైద్యం చేయించలేం కదా" అంది హరిత.

    పులకిత ఏమీ మాట్లాడలేక పోయింది.
    అక్కడికీ హరితా వాళ్ళ పరిస్థితి తెలిసే ఏదో ఒక అకేషన్ పేరుతో పిల్లలిద్దరికీ డ్రెస్‌లు తీసుకోవడం, అభికి బుక్స్ బొమ్మలు కొనడం చేస్తూ ఉంటుంది. ఎవరో తెచ్చి ఇచ్చారని పిల్లలు లేని తను వాటినేం చేసుకోవాలంటూ - స్వీట్స్, పళ్ళు కొని మరీ ఇస్తూంటుంది. ఆత్మాభిమానం మెండుగా గల హరిత గ్రహించి నిరాకరించబోయినా, "అభిలో 'నా కొడుకుని' చూసుకోనీయవా" అంటూ మారు మాట్లాడనీయకుండా చేస్తూ ఉంటుంది పులకిత.     కాస్సేపు అవీ ఇవీ మాట్లాడి, హరిత కాస్త మామూలుగా అయ్యాక ఇంటికి వెళ్లింది పులకిత. అభిషేక్‌ను తీసుకొచ్చి తన దగ్గరే ఉంచుకొంది. అన్నం పెట్టి తన దగ్గరే పడుకోబెట్టుకొంది. బాబీ నిద్రలోకి జారుకొన్నాడు గానీ పులకితకే నిద్ర పట్టకుండా ఆలోచనలు కమ్ముకొన్నాయ్. అసలు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఈ నవీన వైద్యరంగంలో మార్గాలే లేవా? గర్భంలోని శిశువూ ఆడనో, మగనో తెలుసుకొనే వీలున్నట్లే - లేత దశలోనే పుట్టబోయే శిశువు - అన్ని విధాలుగా హెల్తీగా ఉందో లేదో తెలుసుకొనే పరికరమ్ని కనిబెడితే - అలాంటి శిశువ్ల్ని భూమి మీదకు రానీయకుండా చేయొచ్చుకదా. పాపం హరిత ఇంకా ఎన్నాళ్ళీ బాధలు పడాలో అని నిట్టూరుస్తూ నిద్రలోకి జారుకుంది.

* * * * *  
    "పులకితా, పులకితా" అన్న పిలుపు వింటూనే తలుపులు తెరిచిన పులకిత ఎదురుగా నిలబడి విసుగుని బలవంతాన అణుచుకొంటూ, 'రండి - లోపలికి' అంటూ దారి తీసింది.

    "ఎవరూ పడుకొన్నది, అభీనా! కొడుకుని గూడా చూసుకోకుండా నీ ఫ్రెండ్ చేసే రాచకార్యాలేముంటాయ్? ఎక్కడికీ వెళ్ళనైనా వేళ్ళదు కదా - అయినా నా కెందుకులే. ఈ ఆదివారం మన మహిళామండలిలో ఓ వెరైటీ ప్రోగ్రాం పెట్టాలనుకొంటున్నాం. నీకూ నచ్చుతుందిలే" అంటూ ఆగిందామె. 

    "ఏంటి? ఏదన్నా సాహిత్య సభ ఏర్పాటు చేశారా? లేక మ్యుజికల్ పరంగానా" కాస్త ఆసక్తిగా అడిగింది పులకిత.
    "అబ్బే అదికాదు. 'ఉత్తమ స్త్రీ' అవార్డుని ఏర్పాటు చేశాం. ముగ్గురు జడ్జీలుంటారు. సభకొచ్చిన వారెవరైనా కావచ్చు. ఒక్కొక్కరు లేచి తమకు నచ్చిన స్త్రీయొక్క మంచి పనులను గురించి చెప్పాలి. అలా సెలెక్ట్ అయిన స్త్రీకి వెయ్యినూట పదహార్లు - ఓ మాంఛి పట్టు చీర గిఫ్ట్‌గా యిస్తాం" ఏదో టీవీ చానెల్‌లో చూసిన వేరే భాషస్తులు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంని తనదిగా చెప్పుకొంటూ - మిసెస్ రావ్.     "అలా ఎవరెవరు ఏమేం చెప్పాలో గూడా నిర్ణయించేశారా" కాస్త నవ్వుతూ అడిగింది పులకిత.
    "అదేంకాదు - అప్పటికప్పుడు ఎవరయినా వచ్చి - ఎవరి గురించైనా చెప్పొచ్చు. అందరికన్నా ఎక్కువ మార్కులు ఎవరికి పడితే వారికే ప్రైజ్, తప్పకుండా రా - మరచిపోవద్దు" అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. 

    ఆ ఆదివారం రానే వచ్చింది. హరితను రమ్మంటే చేతులు జోడిస్తూ, "ప్లీజ్ నన్నొదిలెయ్" అంది. దాంతో పులకిత ఒక్కర్తే వెళ్లింది. అప్పటికే ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ముందుగా మండలి సభ్యుల అభిప్రాయాలు అయ్యాయి. ఆ తర్వాత, మిసెస్ రామనాథం దగ్గర పనిచేస్తున్న నరసమ్మ లేచి, "మా అమ్మగారెంతో మంచివారు. వారం వారం ఆవిడ పెద్ద పెద్దోళ్ళకి విందు భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. ఆ మిగిలినవన్నీ మాకే ఇస్తుంటారు. మా అయ్యగారికి చెప్పి మా ఆయనకి ఆటో కొంకుక్కోవడానికి డబ్బు గూడా ఇప్పించారు" అని చెప్పింది.
    తర్వాత సుశీలమ్మగారి డ్రైవర్ లేచి, "మా అమ్మగారు ప్రతీ ఏడాది అన్నదానం చేస్తారు. ఏడాదికోసారి మా పిల్లల చదువులకని నాకో నెల జీతం బోనస్‌గానూ ఇస్తారు" అని చెప్పి కూర్చున్నాడు.     పులకిత ఇంటి పక్కగా ఉన్న లక్ష్మి లేచి మాట్లాడడం ప్రారంభించింది. "మా వారికి ఆక్సిడెంట్ అయినపుడు పోలీస్ కేస్ అవుతుందని అందరూ భయపడి సాక్ష్యం చెప్పడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. అప్పుడు పులకితగారే ధైర్యంగా వచ్చారు. నాకు కాంపెన్సేషంగా రావాల్సిన డబ్బు అందేదాకా వెన్నంటి వున్నారు. నేనిలా తిరగవలసి వచ్చినప్పుడల్లా నా పిల్లల్ని కనిపెట్టుకొని ఉన్నది ఆమె ఫ్రెండ్ హరిత. వీరిద్దరే లేకుంటే నేనూ, నా పిల్లలూ ఏమయిపోయేవాళ్ళమో" అంది.

    ఆ తర్వాత హరిత పక్కింట్లో ఉంటోన్న లలిత, "నేనూ అందర్లాగానే పాత బట్టల్ని స్టీల్ సామాన్లవాడి కేసేదాన్ని. అలాగాకుండా ఫుట్‌పాత్ మీద చలికి ముడుచుకున్న వాళ్ళకా బట్టల్ని ఇస్తే, మనసుకెంత తృప్తి కల్గుతుందో హరితగారు చెప్పాక అలాగే చేస్తున్నాను. ఆమె దగ్గర నేను మరో మంచి విషయమూ తెలుసుకొన్నాను" అంటూ ఆగింది.     "ఏంటో చెప్పండి" చాలా మంది ఆసక్తిగా అడిగారు. దాంతో ఉత్సాహంగా మళ్ళీ చెప్పసాగింది. "బంగారంలోని ప్రతి కణానికి విలువున్నట్లే, జీవితంలోని ప్రతి క్షణామూ ఎంతో విలువైందని. అది తెలిశాక సమయాన్ని చాలా సద్వినియోగం చేస్తున్నాను. అంతకు ముందు కబుర్లతో, టీవీతో టైం వేస్ట్ చేసేదాన్ని" అంది.     తల్లి మైక్ ముందు నిలబడి చెబితే అందరూ విని చప్పట్లు కొట్టడంతో ఉత్సాహాన్ని పుంజుకొని ఆమె కూతురు కావ్య లేచి చెప్పసాగింది.     "నేనొకసారి నా పుట్టిన రోజుకి నన్ను అమ్మా వాళ్ళు సినిమాకి తీసుకెళ్ళలేదని అలిగి కూర్చున్నాను. ఆ రోజే హరితా ఆంటి పుట్టిన రోజు కూడా. ఆమె ప్రతీ పుట్టిన రోజుకి అంకుల్ తనకిచ్చిన డబ్బులోంచి పళ్ళుకొని వృద్ధాశ్రమంలో పంచుతారట. నన్ను తోడుగా తీసుకెళ్ళి ఆ రోజు పళ్ళు పంచిపెట్టారు. కొన్ని పళ్ళు నా చేతికిచ్చి పంచమంటే పంచాను. అక్కడి తాతయ్యలు, అమ్మమ్మలు నన్ను దగ్గరికి తీసుకొని ఆశీర్వదించారు. అప్పుడే నేనూ ఆంటీలా ప్రవర్తించాలని డిసైడ్ చేసుకున్నాను. అంతేగాదు. ఎవరయినా పెద్దవాళ్ళు రోడ్ క్రాస్ చేయలేక పోతే నవ్వ కూడదని - మనకి చేతనైనంతగా సాయపడాలని చెప్పారు" అంది.     కావ్యను చూసి ఆమె పక్కింటి శ్యామల లేచింది, "హరిత సాయంత్రాలు మా పిల్లల్ని, మిగతా ఇళ్ళలోని పిల్లలను గూడా పిలిచి పాఠాలు చెప్పడం, కథలు చెప్పడం, రకరకాల ఆటలు ఆడించడం చేస్తుంటారు. ఆమె మూలంగా మా పిల్లలిప్పుడు చదువులో, ఆటపాటల్లో చురుకుగా ఉంటున్నారు" అంటూ చెప్పింది.     ఇలా పిల్లా, పెద్దలందరి అభిప్రాయాలకు విలువనిచ్చి, హరితను 'ఉత్తమ స్త్రీ'గా ఎన్నిక చేశారు. ఇవన్నీ పులకిత తను పనిచేస్తున్న పేపర్‌లో ప్రచురింపబడేలా చేయటంతో, "హరిత" అందరికీ తెలిసిపోయింది. మిసెస్ రావు తెల్లబోయి సిగ్గుపడేలా ఆమె గురించెవరూ చెప్పనే లేదు.     "వాళ్ళేదో సరదాగా క్రొత్త ప్రోగ్రాం కండక్ట్ చేశారే అనుకో, నువ్వు నాతో ఒక్క ముక్కైనా చెప్పకుండా పేపర్‌లో పెద్ద గొప్పగా రాసేశావేంటి? నాకేం నచ్చలేదు నీ పని" అంది కోపంగా హరిత, అవార్డు అందుకొన్న తరువాత.     "పిచ్చీ! వాళ్ళంతమంది అన్ని చెప్పినా నేను పెదవి విప్పి ఒక్క ముక్కా చెప్పలేదు తెలుసా" అంది కళ్ళని తమాషాగా తిప్పుతూ పులకిత.     "అవునవును పెదవి విప్పకుండా మొత్తం లోకానికి చాటావ్" అంటూ హరిత కోప్పడితే, "నేనేం చేయను, వాళ్ళంతమంది చెప్పేంతవరకూ అవన్నీ తెలీదు నాకు కూడా" అంటూ నవ్వేసింది పులకిత.

* * * * *  

    రోజులు చకచకా జరిగిపోతున్నాయ్.     ఎలక్షన్స్ మూలంగా పులకితకు ఆఫీస్ లోనే ప్రతీ రోజూ లేట్ అవుతోంది. ఆ రోజు ఎప్పటి లాగే లేట్‌గా వస్తోన్న పులకితకు, శోకదేవతలా, హరిత ఎదురొచ్చింది.     "పులకితా, మన శిరీ, శిరి కనిపించడం లేదే? ఏం చేయాలో తోచడం లేదు" అంటూ.     ఆమె పక్కనే విషణ్ణ వదనంతో భరత్. వాడిపోయి అలసిన అభిలాష్.     "అసలేం జరిగింది" అడిగింది పులకిత.     "అభీకి ఒంట్లో బాగోక పోతే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాల్సి వచ్చింది. ఇక ఎలాగూ అరగంటలో ఈయనొచ్చేస్తారు కదాని, పిల్లల్నందరినీ శిరీషతో ఆడుకొంటుండమని చెప్పి వెళ్ళాను. వచ్చేసరికి ఎవరూ లేరు. అక్కడికీ అందరి ఇళ్ళకి వెళ్ళి అడిగి వచ్చాను" అంది హరిత.     "పిల్లలందర్నీ వాకబు చేశావా?" అడిగింది పులకిత.     "ఆ చేశాను. కొందరు పిల్లలు ఆడుకొని వెళ్ళిపోయాం. మాకంతే తెలుసు అన్నారు. ఇంకొందరు పిల్లలప్పుడే నిద్రపోయారు గూడా. పులకితా, నా శిరి ఏమయిందే, ఆకలయినా తెలీని అమాయకురాలు -" అంటూ భోరుమంది.

    భరత్‌ని చాటుగా పిలిచి, "పిల్లలు రోడ్ మీదగ్గానీ వెడితే ఏ ఆక్సిడెంటన్నా జరిగే ప్రమాదం ఉంటుందని మనం పంపించం గానీ ఏ పిల్లలన్న వెడుతూంటే శిరీషగానీ వెళ్ళి ఉంటుందా? ఎక్కడన్నా ఏ ఆక్సిడెంట్సేవన్నా జరిగాయా? ఆ సంగతి కనుక్కోండి" అంది హరిత వినకుండా. దాంతో భరత్ గబగబా వెళ్ళాడు.
    "హరితా! పద - లోపలికి వెడదాం. బాబీకి మందులు వేశావా?" అడిగింది పులకిత     అడ్డంగా తలూపింది హరిత.     దాంతో పులకిత లేచి పాలని వేడి చేసి తెచ్చి బ్రెడ్‌ని పాలతో బాబీకి తినిపించి మందులు వేసి పడుకోబెట్టింది.     "అమ్మ ఊళ్ళో లేకపోవడంతో ఎంత అనర్థం జరిగిందో చూశావా - అమ్మ ఉంటే శిరిని అమ్మ దగ్గరే వదిలి వెళ్ళేదాన్ని" అంటూ ఘొల్లుమంది హరిత. నిజమే పెద్దవాళ్ళ అవసరం ఏంటో గుర్తొచ్చేది ఇలాంటి సందర్భాల్లోనే.
    "ఇలా జరుగుతునని కలగన్నామా? భరత్ పాపతో తిరిగొస్తారు గానీ నువ్వ్లే, చూడు మొహం, కళ్ళూ ఎలా వాచి పోయాయో, మొగంకడుక్కొని కాస్త ఎంగిలి పడు, నా బంగారు తల్లివి గదూ" అంది పులకిత. 

    "నాకేం తినాలని లేదు. నా తల్లి అన్నెం పున్నెం ఎరుగని నా పిచ్చి తల్లి - దానికి అన్నం తినే వేళ దాటిపోయింది. అయ్యో" అంటూ తలబాదుకొంది హరిత.
    "ఛ...అంత బెంబేలు పడకు. ఎవరింట్లోనో, పెరట్లోనో, ఏ అరుగు మీదో నిద్రపోతూ ఉంటుంది. నేనూ, చలపతి వెళ్ళి వెదుకుతాం. నువ్వు అభిని చూసుకొంటూ కాస్త నడుం వాల్చు. లేదంటే నా మీద ఒట్టే" అంటూ హరితతో ఓ ముద్ద తినిపించి అలసట ముంచుకొస్తున్నా, చలపతితో కలిసి ఆ సందులన్నీ గంటవరకూ వెదికింది పులకిత.     ఆ రాత్రి అతిభారంగా గడిచింది.     హరిత వాళ్ళ ఇంటికి నాలుగిళ్ళ అవతల ఇల్లు కడుతున్నారు. అక్కడి పనివాళ్ళు పరుగుపరుగున వచ్చి చెప్పారు "మీ పాప నీళ్ళ ట్యాంక్‌లో పడిపోయిం"దని.వినగానే హుటాహుటిని వెళ్ళారంతా. పనివాళ్ళే దిగి శిరీషని బైటకు తీశారు. నీళ్ళు తాగేసి ఉబ్బిన పొట్టతో, గాలి నింపిన రబ్బరు బొమ్మలా, చలనం లేకుండా ఉన్న శిరీషను చూస్తూనే హరిత స్పృహ తప్పి పడిపోయింది.     అభిషేక్‌ను తన ఫ్రెండ్ ఇంట్లో దింపి వచ్చింది పులకిత. ఆమే, చలపతి కలిసి భరత్‌కు ధైర్యం చెప్పి, జరగ వలసిన కార్యక్రమాన్ని జరిపించారు. పది రోజులు గడిచాయి.     శిరీష అంత దూరం ఎలా వెళ్ళిందో ఎలా పడిందో అర్థం గాకుండా మిగిలి పోయింది. తిండీతిప్పలూ లేకుండా నీరసించి పోతున్న హరితతో -     "హరితా! ప్లీజ్ నాకో ఫేవర్ చేయవా" అని అడిగింది పులకిత.     "నేనా?" అన్నట్టు చూసింది గాజుకళ్ళతో హరిత.     "అవును - అభిని నాకు పెంపకానికిచ్చేయ్" అంది పులకిత.     "ఆ" నిర్ఘాంతపోతూ చూసింది హరిత.     "అవును. శిరీ పోయింది. పోయిన పిల్ల ఎలాగూ తిరిగిరాదు. ఉన్న వీణ్ణి నువ్వు పట్టించుకోకుండా దూరమెందుకు చేసుకుంటావ్ మరి. ఎలా ఉండే దానివి ఎలా అయిపోయావ్. భరత్‌గారెలా అయిపోయారో చూడు. నువ్వే వాళ్ళని మళ్ళీ మామూలుగా చేయగలవ్. ఎన్నాళ్ళు ఏడ్చినా శిరీ రాదు కదా. అయినా మన శిరి ఎక్కడికి పోతుంది. ప్రతి పసిపిల్ల నవ్వులో - మీ ఇంట్లో పూచే పూవుల్లో శిరిదాక్కొనే ఉంది" అంది పులకిత.

    ఇక అప్పటి నుండి మళ్ళీ ఏ లోకంలో పడింది హరిత.
    ఆ రోజు పులకిత, హరిత ఇంటికి బయల్దేరుతూ ఉంటే మిసెస్ రావ్ వచ్చింది షాపింగ్ పని ఉందంటూ, " ఈ కీస్ వాళ్ళింట్లో ఇచ్చేసి - వెడదాం " అంది పులకిత.     హరిత వాళ్ళ ఇల్లు చూడొచ్చన్న భావంతో - తటపటాయిస్తూనే వాళ్ళింటికి బయలుదేరారు.     గేటు తీసి తలుపు తట్టబోతుండగా భరత్ మాటలు గట్టిగా లోపల్నుండి వింపిస్తూ ఉండటంతో ఠక్కున ఆగిపోయారిద్దరూ.     "హరితా! నీకున్నంత క్షమా గుణం నాకు లేదు. నువ్వా రాణిని మనింటికి రానీయడం నేను భరించలేను" అంటున్నాడు భరత్.     గతుక్కుమంది మిసెస్ రావు. ఎందుకంటే ఆమె కూతురే - ఆ రాణీ కాబట్టి.     "ఏమండీ, మీరు నిదానంగా ఆలోచించండి. పిల్లలకు ఈర్ష్యద్వేషాలు తెలీవు. ఆట్లో తోపులాట్లో తనమూలంగానే మన శిరి నీళ్ళలో పడిపోయిందని రాణీ చెప్పకపోతే మనకు తెలిసేదా? అన్నెం పున్నెం ఎరుగని పసిది గాబట్టే చెప్పింది గాని పాపని చంపాలని తోయలేదు కదా. ఆ తల్లిక్ ఈ రాణీ గాబరా పడుతూ చెప్పింది అర్థమై ఉండకపోవచ్చు లేదా ఏ పోలీస్ కేసవుతుందోనన్న భయంతో చెప్పి వుండక పోవచ్చు. అందుకు ఈ పసిదాన్ని రానీయకుండా శిక్షించాలా?" అంటోంది హరిత.     "పోతే పోయింది. పిచ్చి పిల్ల - నువ్వేం మాట్లాడకు నిద్రపో" అని రాణిని పడుకోబెట్టిన విషయం గుర్తువచ్చి మిసెస్ రావు ముఖం నల్లబడిపోయింది. అపకారికి సైతం మేలు చేయాలన్న దానిని పాటిస్తున్న హరిత కాళ్ళ మీద పడిపోవాలంపించింది.     "ఏమో - నాకా పిల్లను చూస్తుంటే మన పాపే గుర్తొస్తోంది" దుఃఖం గరగరలాడుతూండగా అంటోన్న భరత్‌తో "ఇంకేం - రాణినే మన శిరీ అనుకోండి నాలా" అంటున్నది హరిత.     ఇక అన్ని ఇగోలని పక్కకు నెట్టేసి తలుపుల్ని ధ్డాల్న తెరిచి హరిత కాళ్ళ మీద పడబోయింది మిసెస్ రావ్. ఆ పనిని వారిస్తూ "మనమంతా నిమిత్త మాత్రులం. కలిస్ బతికే ఈ మూణ్ణాళ్ళూ ఆనందంగా బతుకుదాం - సరేనా" అంటూ ఆమె కన్నీళ్ళను తుడిచింది హరిత.     శిరీ విషయంలో అస్తమానం బేలగా కన్నీళ్ళు పెట్టే హరితను చూస్తూ "వట్టి బేల" అనుకొనేది పులకిత. కానీ అన్నీ తెలిసి అంత నిబ్బరంతో స్థిత ప్రజ్ఞతతో వ్యవహరించిన హరిత 'సబలలా' అజాత శత్రువులా తోచింది పులకిత కళ్ళకిపుడు.

(రచన ఇంటింటి పత్రిక ఆగష్టు 2006 సంచికలో ప్రచురితం)
Comments