శుభవార్త - గోవిందరాజు రామకృష్ణారావు

    
సుభద్రమ్మ పేరు చెబితే ఆ వీధిలో ఆడవాళ్లకు వెన్నులో వణుకు పుడుతుంది. నోటితో జయించుకొస్తోంది. ఎవరూ ఆమెతో పేచీకి దిగరు. అయినా ఆవిడే తేలికగా పేచీ పెట్టుకుంటుంది. అసలామె నామకరణం నాడే పేచీ ప్రారంభమైంది. తల్లి, వాళ్లమ్మ సుశీలమ్మ పేరు పెట్టాలనీ, తండ్రి వాళ్లమ్మ భద్రమ్మ పేరు పెట్టాలని మంకుపట్టు పట్టారు. తెలివిగల పురోహితుడు రాజీ కుదిర్చి, చివరకు రెండు పేర్లూ కలిపి 'సుభద్రమ్మ' అని ఖరారు చేశాడు. ఇక తర్వాత సుభద్రమ్మ పేచీ ఘట్టాలు కోకొల్లలు. చెప్పాలంటే అదో పెద్ద గ్రంథమవుతుంది.

    ఎవరో వచ్చినట్టున్నారు. తలుపు చప్పుడవుతోంది. ఇంకెవరు? సుభద్రమ్మ కొడుకు వెంకటాచలం.
    'నువ్వు ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి రమ్మన్నారా! కూరల కోసం వెళ్లి గంటైంది. ఇంకారాలేదు నీ పెళ్ళాం. చూడ్రా వెంకీ!!' సుభద్రమ్మ పళ్లు పటపటలాడించింది.

    వెంకటాచలం రుద్రుడయ్యాడు. 'ఈ మధ్య రాగిణికి తలబిరుసెక్కువైంది. షికార్లు తిరుగుతోంది. ఇంత సేపా కూరలు తేవడం?'
    సుభద్రమ్మ తెచ్చిన మంచినీళ్లు గటగటా తాగాడు. అటూ, ఇటూ రెండుసార్లు పచార్లు చేశాడు.

    కూరల సంచితో గబగబా నడుచుకుంటూ రాగిణి గుమ్మంలో అడుగు పెట్టింది.
    'ఇంత సేపేం చేస్తున్నావ్? వాడికి రాగానే కాఫీ కలిపివ్వాలని తెలిసే షికార్లు కొడుతున్నావ్?' సుభద్రమ్మ నోట్లోంచి నిప్పులు రాలాయి.     రాగిణి, కూరల సంచి కింద పెట్టింది. ఇంతలో వెంకటాచలం పిడికిళ్లు బలం చూపాయి. రాగిణి తూలి ముందుకు పడింది. సుభద్రమ్మ కళ్లు చల్లబడ్డాయి.     రాగిణి నెమ్మదిగా లేచి, తాను కూరలకి వెళ్తూ దార్లో అమ్మవారికి పూజ చేయించిన సంగతీ, ఎందుకు చేయించిందీ చెప్పాలనుకుంది కానీ సుభద్రమ్మ, వెంకటాచలం అప్పుడు ఏం చెప్పబోయినా వెంటనే నోరు నొక్కి చెంపలు వాయిస్తారు. అందుచేత తనే గుడి సంగతి ఎత్తలేదు. ఆనందంతో పొంగే గుండె పూజ కారణం చెప్పమంటోంది. కాని రాతి హృదయం వున్నవారికిది చెప్పే సమయం కాదని మనస్సు హెచ్చరిస్తోంది. నడుం సవరించుకుంటూ రాగిణి వంటింటి వైపు నడిచింది.     వెంకటాచలం బట్టలు మార్చుకుని, కాళ్లూ, చేతులూ కడుక్కొచ్చి కూర్చున్నాడు. సుభద్రమ్మ కొడుకు వంక మెచ్చుకోలుగా చూసింది. రాగిణి రెండు కప్పులతో కాఫీ తెచ్చి వాళ్లకిచ్చింది.
    కాఫీ తాగుతూ వెంకటాచలం, 'ఈ దిక్కుమాలినదాని మొహం చూడగానే అసలు సంగతి నీకు చెప్పడం మరిచిపొయానమ్మా!' అన్నాడు.
    'ఏవిట్రా నాయనా వెంకీ?' సుభద్రమ్మ గొంతులో ఆతురత పెల్లుబికింది.     'చెల్లి సరోజ నిన్ను చూడాలని అంటోందట. నిన్నొకసారి పంపమని అత్తగారు మరీ మరీ చెప్పారట. బావగారు బతిమాలుతూ నిన్నొకసారి వెంటనే పంపమని ఫోను చేశారే అమ్మా.'     'నా చిట్టితల్లి ఎంత బెంగటిల్లుతోందో! రేపే వెళ్తా రా. డీలక్స్ బస్సెక్కించు, రైలు టికెట్టు దొరకకపోతే.'     'అలాగేనమ్మా!'     రాగిణి ఈ సంభాషణ వింది వంటింట్లోంచి. వంట త్వరత్వరగా పూర్తి చేసింది.     అలవాటు ప్రకారం తల్లీకొడుకులు ముందు భోజనం చేశారు. తరువాత సరోజ గురించిన ముచ్చట్లలో మునిగిపోయారు. నడుం నొప్పితో, పైకి మూలగలేక బాధ ఓర్చుకుంటూ, ఇష్టం లేకపోయినా నాలుగు మెతుకులు తిని, వంటిల్లు సర్ది, అత్తగారికి అన్నీ అమర్చి రాగిణి నడుం వాల్చింది. ఆలోచనలు ముసురుకున్నాయి. శక్తి కొద్దీ కట్నం యిచ్చి తండ్రి తన పెళ్లి చేశాడు. ఇద్దరన్నలూ చిన్నచిన్న ఉద్యోగాల్లో ఎక్కడో ఉన్నారు. తల్లి లేదు. తండ్రి పాత పెంకుటింట్లోనే పల్లెటూళ్లో కొడుకులు పంపే కొద్దిపాటి పైకంతో బతుకు సాగిస్తున్నాడు. తాను చాలా సుఖంగా వున్నాననే నమ్మకం తండ్రికి కలిగిస్తూ, కష్టాల మధ్య కుమిలిపోతోంది. అత్తగారికి తన పైన అంత కసి ఎందుకో రాగిణికి అర్థం కావడం లేదు. అమ్మను మెప్పించడమే వెంకటాచలం ధ్యేయం. అందుకు భార్యను నిత్యం హింసించడం పనిగా పెట్టుకున్నాడు. రాగిణికి ఈ దుర్భర పరిస్థితి నుంచి బయట పడే మార్గం కనిపించలేదు. అలసి పోయిన మనస్సు రాగిణిని నిద్ర పుచ్చింది. తాను అమ్మవారికి ఎందుకు పూజ చేయించిందీ కలలో తండ్రికి చెప్పినప్పుడు, ఆయన పడిన ఆనందం, నిద్రలో తన బాధలన్నింటినీ మరిపించింది.

    అత్తగారి ప్రయాణానికి అన్నీ సిద్ధం చేయడం కోసం, రాగిణి రోజూ కంటె ముందే లేచి, పనులన్నీ చక్కబెట్టింది. బయలుదేరే ముందు సుభద్రమ్మ 'కొంప జాగ్రత్త!' అని అరుస్తూ ఆటో ఎక్కింది. బస్సు డిపో వరకు వెంట వెళ్తున్న వెంకటాచలం చూపులూ అదే మాట హెచ్చరించాయి.

    ఎదురింటి కౌసల్య వచ్చి, 'పొద్దుటే మీ అత్త వూరు ప్రయాణం పెట్టుకుందే!' అని పలకరించింది.
    'అవును పిన్నిగారూ! మా ఆడపడుచు దగ్గరికి' రాగిణి జవాబిచ్చింది.     'ఆవిడ వాలకం ఏమైనా మారిందా అమ్మాయ్?'     'పోనీ లెండి పిన్నిగారూ! నా అదృష్టం ఇంతే అనుకుంటున్నా. మొన్నొకసారి అభిమానంతో వచ్చి నా మీద అరుపులు ఆపబోయారు. మీ మీద విరుచుకు పడింది. నా మూలంగా అనవసరంగా మీకు అవమానం కలిగింది.'     'పిచ్చి పిల్లా! అవమానం నాకు కాదమ్మా. ఆడ జాతికే అవమానం. ఇలాటి గయ్యాళిగంప మూలంగానే, అమ్మకు మంచి పేరైన అత్తంటే రాక్షసి గుర్తుకొస్తోంది.'     'ఇప్పుడవన్నీ ఎందుకు లెండి పిన్నిగారూ?'     'వస్తానమ్మా! నీ పతిదేవుడొచ్చేటప్పటికి చేయ వలసిన పనులెన్నొ ఉన్నాయి గదా! మీ అత్త ఉండగా, ఈ వీధిలో మరో ఆడపురుగు మీ గుమ్మం ఎక్కే ధైర్యం చేయదు. దేవుడు నీ కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో!'     కౌసల్య తిరిగి వెళ్లింది. రాగిణి తన పనుల్లో మునిగిపోయింది.

* * * * *
    సరోజ భర్త చంద్రశేఖరం, సుభద్రమ్మను బస్సు డిపో నుంచి కారులో ఇంటికి తీసుకెళ్లాడు. న్యాయవాదిగా నాలుగేళ్లోనే మంచి పేరు తెచ్చుకొన్నాడు. సంపాదన ఇబ్బడిముబ్బడైంది. కుటుంబ కలహాలు, దాంపత్య సమస్యల కేసుల్లో ఆ పట్నంలో మొదటి పేరు చంద్రశేఖరానిదే.

    సుభద్రమ్మ కూతుర్ని అక్కున చేర్చుకుని, 'ఎలా వున్నావే చిట్టి తల్లీ?' అని మురిపాలు కురిపించింది. రాగిణికి పురమాయించి చేయించిన మినపసున్ని వుండలు, జంతికలు సరోజ కిచ్చింది.
    వియ్యపురాల్ని మర్యాదగా పలకరించి, ఆవిడ చేతిలో ఆపిలు పళ్లు పెట్టింది.     'అన్నా, వదినా, ఎలా వున్నారమ్మా?' సరోజ కుశలప్రశ్నలు వేసింది.     'వెంకి ఉద్యోగంతో సతమతమవుతున్నాడే తల్లీ!' అని వూరుకుంది. రాగిణి పేరెత్తడం ఆవిడకిష్టం లేదు.     రాగిణి గురించి వియ్యపురాలడిగినా, బస్సు ప్రయాణం గురించి చెప్పి వూరుకుంది.     సుభద్రమ్మ స్నానం చెసి, భోజనాలయ్యాక కాసేపు కునుకు తీసింది.

    ఆమె లేచాక 'అమ్మా! ఈ మధ్యనే కారు కొన్నాం, ఎలా వుందే? నిన్ను చూడాలనిపించింది. ఇంటి ముందు భాగంలో రెండు గదులు వేశాం. అత్తయ్య పట్టుబట్టి ఈ పని చేయించారు. కేసుల వాళ్లు ఎక్కువయ్యారు. వాళ్లు కూర్చోవడానికి వీలుగా వుంటుందీ సరోజ చెప్పింది.

    'నాదేముంది? అంతా సరోజే చెప్పి చేయించింది వదినగారూ! ఇంటి వ్యవహారాలు నాకేమైనా తెలుసా? నా మీద అభిమానంతో కోడలు అలా అంటోందీ వియ్యపురాలు సరోజపై ప్రేమ కురిపించింది.

    సరోజ అదృష్టానికి సుభద్రమ్మ పొంగిపోయింది.
    సాయంకాలం చంద్రశేఖరం కోర్టునుంచి వచ్చాడు. కాఫీ తాగి, ముందు గదిలోకి వెళ్లాడు. మరో పది నిమిషాలకి ఒక పెద్దయనా, ఆయన కూతురూ పళ్లూ, మిఠాయిలూ పట్టుకొచ్చి చంద్రశేఖరానికిచ్చారు. ఆ అమ్మాయి లోపలకొచ్చి కొన్ని పళ్లు సరోజ చేతిలో పెట్టింది. రెండేసి పళ్లు సరోజ అత్తకూ, తల్లికీ ఇచ్చి పాదాలకి నమస్కరించింది.
    'చంద్రికగారూ! ఈవిడ మా అమ్మ' అని పరిచయం చేసింది.

    ఇంతలో పెద్దాయన 'తల్లీ! ఇలా రా, లాయరుగారు ఏవో సంతకాలు చేయాలంటున్నారు' అని పిలిచాడు. చంద్రిక వెళ్లింది. ఆమెకు పాతికేళ్లుంటాయి. అందగత్తె కూడా.
    సుభద్రమ్మకి ఆ అమ్మాయి ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. 'అమ్మాయ్! ఈ పిల్లకి అప్పుడే కోర్టుతో ఏం పనే?' ఉత్సుకతతో ప్రశ్నించింది.     'అదో పెద్ద కథలే అమ్మా! నిన్ననే మీ అల్లుడు వివరాలన్నీ చెప్పారు. ఇప్పుడు కేసు గెలిచారు. ఆ సంతోషంతో ఇవి తెచ్చారు.'     సుభద్రమ్మకు ఆసక్తి మరింత పెరిగింది. 'నిక్షేపంలా కాపురం చేసుకుంటున్న పిల్లకి కేసేమిటి?'     'చంద్రిక బాగా చదువుకున్న అమ్మాయే. తల్లి లేదు. పెద్ద కట్నం యిచ్చి తండ్రి వైభవంగా పెళ్లి చేశాడు.'     'మరింకేం రోగం?'     'రోగం చంద్రికకు కాదు, ఆ అమ్మాయి అత్తకూ, భర్తకూ. ఇద్దరూ యిద్దరే. అత్త రాకాసి, భర్త చవట సన్నాసి. తల్లి మాట శిలాక్షరం. ఇంగితం లేని బడుద్ధాయి. ఇంకా డబ్బు ఆశతో చంద్రికను నానా హింస పెట్టేవారు. మనస్సు కుళ్లబొడిచేవారు. చంద్రిక మనస్సు చంపుకున్నా, దెబ్బలు భరించలేక పోయింది. సుఖంగా వున్నట్లు, తండ్రిని మభ్య పెడుతూ వచ్చింది.'

    సుభద్రమ్మ ఉత్కంఠ ఇంకా పెరిగింది. 'అబ్బా! ఈ సోదెందుకు? అసలు సంగతి చెప్పు' తొందర పెట్టింది కూతుర్ని.
    'ఎలాగో కూతురి కష్టాలు తండ్రికి తెలిశాయి. కొందరి సలహా మేరకు మహిళారక్షణ సమితి సహాయం కోరాడు'.     'మధ్యలో వీళ్లెవరే? అసలేమైందో చెప్పక, ఈ డొంక తిరుగుడు కబుర్లెందుకు తల్లీ?'     సుభద్రమ్మ వైనం చూసి వియ్యపురాలు ఆశ్చర్యపోయింది. ఆమె ఎందుకంత గాభరాగా అడుగుతోందో అర్థం కాలేదు. 'మా సరోజ లాయరు భార్య గదా! కొన్ని లా పాయింట్లు చెప్పిగాని అసలు విషయం బయట పెట్టదు' నవ్వుతూ అంది.

    సుభద్రమ్మకిది నచ్చలేదు. అయినా బలవంతంగా పెదాలపై ఒక క్షణం చిరునవ్వు అతికించుకుంది.
    సరోజ చెప్పసాగింది. 'అమ్మా అత్తగారన్నట్లు నువ్వు పాయింట్లు విను. తొందరపడితే నీకు కేసు అర్థం కాదు. నవ్వడిగావే మధ్యలో వాళ్లెవరని. ఆడపిల్లని అత్త భర్త ఆడపడుచూ, ఇంకా కొందరు రాక్షసులు కష్టాల పాలు చేస్తే, వాళ్లని కోర్టుకీడ్చి తిక్క కుదిరించే సంస్థ. అన్ని చోట్లా ఈ సంస్థ పని చేస్తోంది. మన పట్నంలో కూడా ఉందిలే.'

    'వాళ్లేం చేశారు?'
    'చంద్రికనీ, వాళ్ల నాన్ననీ మీ అల్లుడి దగ్గరకు తీసుకువచ్చి అంతా వివరించారు. ఇరుగుపొరుగు వారు రాతపూర్వకంగా సాక్ష్యం ఇచ్చారు. కేసు నడిచింది. అత్తకీ, భర్తకీ జైలు శిక్ష పడింది. వాళ్లిద్దరూ ఊచలు లెక్కపెడుతున్నారూ సరోజ పెద్దగా నవ్వింది.     వియ్యపురాలు జత కలిపింది. 'ఆ దుర్మార్గులకి అంతేకావాలి!' ఆమె మనస్సులోని మాటలను బయటపెట్టింది. నవ్వు మాదిరి ఆమె మనస్సు కూడా స్వచ్ఛం.     సుభద్రమ్మకి గుండె గుభేలుమంది. ఈ మాటలు నెత్తిమీద పిడుగుల వర్షం కురిపించాయి. గ్లాసుడు మంచినీళ్లు తాగింది. నోట మాట రాలేదు.     తల్లి అలా కంగారు పడడమెందుకో సరోజకు బోధ పడలేదు. 'అమ్మా! వాళ్లు జైలుకెళితే నువ్వెందుకే అలా హైరానా పడతావ్? ఈ సంగతి వదిలేద్దాం. కాఫీ కలుపుకొస్తా' అని వంటింట్లోకి వెళ్లింది.     వియ్యపురాలు కబుర్లలోకి దింపినా, సుభద్రమ్మ అన్యమనస్కంగానే మాట కలిపింది. ఆమె ఆలోచనలు పరిపరివిధాల పరుగులెత్తాయి. ఆ రాత్రి సరిగా భోజనం చేయలేదు. నిద్ర సరిగా లేదు. అంతా కలత నిద్ర. కాసేపు నిద్రలోకి జారినప్పుడు తానూ, వెంకటాచలం జైల్లో వున్నట్లూ, చిప్ప కూడు తింటూ, సత్తు గ్లాసులో నీళ్లు తాగుతున్నట్లూ, జైల్లో బండచాకిరీ చేస్తున్నట్లూ, కాసేపు విశ్రమిస్తే జైలరు లాఠీతో బాదుతున్నట్లూ పీడ కల...గభేలుమని లేచి కూర్చొంది. కళ్లు నులుముకుంది. మంచి నీళ్లు తాగి, తెప్పరిల్లి చుట్టూ చూసింది. కాసేపు పక్క మీద అటూ, ఇటూ దొర్లింది. ఒక గంట తర్వాత ఎలాగో కొంచెం నిద్ర పట్టింది. మహిళారక్షణ సమితి వాళ్లు స్టేషనుకు లాక్కుపోతున్నట్లూ, కౌసల్యా మరో పది మంది ఆ వీధిలోని ఆడవాళ్లు సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్లూ, మరో కల! అంతే సుభద్రమ్మ ఆ రాత్రి మళ్లీ నిద్రపోలేదు.

     మర్నాడు తల్లి పరిస్థితి గమనించి, 'ఏం అమ్మా! ఒంట్లో బాగాలేదా, అలా వున్నావ్? బస్సు ప్రయాణం పడలేదేమో!' సరోజ ఆరా తీసింది.
    'అబ్బే, అలాంటిదేమీ లేదే!'సుభద్రమ్మ పొడిపొడిగా జవాబిచ్చింది.     మధ్యాహ్నం భోజనాలయ్యాక, సుభద్రమ్మ, 'నువ్వు రమ్మని కబురు చేశావ్. వదినగారు కూడా రమ్మన్నారు, వచ్చాను. మిమ్మల్ని చూశాను. చాలా సంతోషం. రేపు పొద్దున్నే వెళ్తానమ్మా' అని సరోజతో చెప్పింది.     'అదేమిటమ్మా? ఒక వారం రోజులైనా వుండకుండా అప్పుడే తిరుగు ప్రయాణమా?' సరోజ అడిగింది.     'నిజమే వదినగారూ! ఇది కూడా మీ ఇల్లే. ఒక వారం వుండి వెళ్లండీ వియ్యపురాలు కూడా కోరింది.     'నా మాట వినండి ఈ సారికి. రెపే వెళ్లక తప్పదు. అడ్డం చెప్పొద్దూ సుభద్రమ్మ నిశ్చయం తెలియజేసింది.

* * * * *  

    గేటు దగ్గర ఆటో ఆగిన చప్పుడు విని, రాగిణి తలుపు తీసి చూసింది. వచ్చింది అత్తగారు. గబగబా వెళ్లి సంచి అందుకుని, 'రండి అత్తయ్యా' వినయంగా పలకరించింది.
    సుభద్రమ్మ మొహంలో మునుపటి చిటపటలు లేకపోవడం గమనించి, రాగిణి వింతగా చూసింది.     లోపలికి వస్తూ, 'అమ్మాయ్! వెంకి ఆఫీసుకు వెళ్లాడా?' సుభద్రమ్మ అడిగింది. రాగిణి కాపురానికి వచ్చిన తరువాత, అత్తగారి నోటి వెంట 'అమ్మాయ్' అని వినడం అదే ప్రథమం. రాగిణి తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. సుభద్రమ్మ కంఠంలో ఎప్పుడూ గూడు కట్టుకుని వుండే కర్కశత్వం లేదు.     'వెళ్లారత్తయ్యా!' రాగిణి భయపడుతూ చెప్పింది.     కాళ్లూ,చేతులూ కడుక్కొచ్చి సుభద్రమ్మ సంచిలోంచి మిఠాయీ, పూలూ తీసి రాగిణి చేతిలో పెట్టి, 'తీసుకో తల్లీ!' అంది ఆప్యాయంగా.     తన తల్లి బతికి వచ్చి, పిలిచినట్లయింది రాగిణికి. సుభద్రమ్మ కళ్లు ప్రసన్నంగా ఉన్నాయి. గొంతు మార్దవంగా వుంది.     రాగిణి చలించి పోయింది. వంగి అత్తగారి పాదాలకు నమస్కరించింది.     సుభద్రమ్మ కోడల్ని రెండు చేతుల్తో లేవనెత్తి గుండెలకు హత్తుకుంది.     రాగిణి అత్తగార్ని కౌగలించుకొని 'అత్తయ్యా!' అని తెలియని ఆనందంతో రోదించింది.     సుభద్రమ్మకూ కళ్లు చెమర్చాయి. కాసేపటికి ఇద్దరూ తేరుకున్నారు.     'అత్తయ్యా! మొన్న కూరలకెళ్లినప్పుడు అమ్మవారి గుళ్లో పూజ చేయించాను. మీకో శుభవార్త చెప్పలనుకున్నాను. కాని భయపడ్డాను' రాగిణి మెల్లగా అంది.     'వెంటనే చెప్పు తల్లీ!' సుభద్రమ్మ అడిగింది.     'మీరు బామ్మ కాబోతున్నారు.' రాగిణి సిగ్గుతో అత్తగారి గుండెల్లో తలదాచుకుంది.     'నాతల్లే! ఎంత చక్కటి మాట చెప్పావ్! ఇప్పుడు వెంకికి ఫోను చేసి చెప్పాలి.' సుభద్రమ్మ కళ్లలో నుంచి ఆనందభష్పాలు రాలాయి.
(ఆదివారం ఆంధ్రప్రభ 06 జూలై 2008 సంచికలో ప్రచురితం)

    
Comments