సూర్యచంద్రులు - ఎల్.ఆర్.స్వామి

    బస్సు దిగి అటూఇటూ చూశాను. ఆటోగానీ, రిక్షాగానీ కనబడలేదు.     ఆరురోజులు వరసగా రాత్రి డ్యూటీ చేసి అలసిపోయిన కార్మికునిలా, సాయంత్రమైనా ఆదమరచి నిద్రపోతోంది ఊరు. రోడ్డుమీద అలికిడి లేదు. మనుషులు అసలే లేరు.     రెండు కిలోమీటర్లు వెళితే గానీ శర్మ ఇల్లు చేరుకోలేను. ఒక గంట అయినా అక్కడ గడపవలసి వస్తుందో ఏమో! మళ్లీ రాత్రి చివరి బస్సైనా అందుకోలేకపోతే...     స్కూటర్ మీద రానందుకు నన్ను నేనే తిట్టుకుంటూ గబగబా నడిచాను.     ఆకాశమనే కర్మాగారంలో కాల్చిన లోహపుగోళంలా, ఎర్రగా వెలుగుతున్నాడు సూర్యుడు. కాల్చిన లోహగోళాన్ని చల్లపరచుటకు పశ్చిమార్ద్వములోకి, తోసే చేతులతో ఉన్న పొడుగుపాటి కాడలవంటి ఎర్రమబ్బు సూర్యుని చుట్టూ ఉంది.

    దారి గుర్తు చేసుకుంటూ నడిచాను. సుమారు ఆరునెలల క్రితం గృహప్రవేశానికి వచ్చాను. స్నేహితులు, సహోద్యోగులు కలిసి రావటంవల్ల దూరం అస్సలు తెలియలేదు. పైగా అప్పుడు మమ్మల్ని పలకరించడానికి మా శర్మ చిరునవ్వుతో, ఇంటి వద్ద ఉంటాడన్న నమ్మకము కూడా ఉండేది. కానీ ఇప్పుడు...
    మనస్సు బాధలో మూలిగింది. గట్టిగా నిట్టూర్చాను.     శర్మ ఇంటికి వెళ్ళి భర్త పోయి రోదిస్తున్న అతని శ్రీమతి చేత కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకోవాలి.     శర్మ భార్య గుర్తుకురాగానే నాగుండె తరుక్కుపోయింది. పాపం! ఎలా ఉందో ఆమె! రూపురేఖలు పోల్చుకోలేని విధంగా మాడి, మసి అయిపోయిన భర్త కళేబరాన్ని చుట్టుకుని ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయిన ఆమె గుర్తుకు రాగానే కళ్లు నిండాయి.
    కర్చీఫ్ తీసి కళ్లు ఒత్తుకుని శర్మ ఇంటికి చేరే మలుపు తిరిగాను. అనుకోని మలుపులు తిరగటమే కదా జీవిత శకటం యొక్క ప్రత్యేకత!

    నేను కర్మాగారములో చేరినప్పుడు శర్మ మా సెక్షన్‌లో పనిచేసేవాడు కాదు. వందలకొద్దీ కార్మికులున్న కర్మాగారములో అందరినీ కలుసుకోవడం కష్టం. తను చేరి ఆరునెలలు పోయాక శర్మతో పరిచయం చేసుకునే అవకాశం కలిగింది.
    కార్తీక మాసం తనతో తెచ్చుకున్న చల్లటిగాలి, కార్మికులలో పిక్నిక్ గాలిని రేపింది. కుర్రవాడనీ, ఉత్సాహవంతుడనీ పిక్నిక్‌కు అవసరమైన పనులు చెయ్యమని నాకు అప్పగించారు. డ్యూటీలో లేనివారందరూ పిక్నిక్ అంగీకరించారు ఒక్క శర్మ తప్ప.
    "వాడిని వదిలేయరా" మా సహద్యోగి అన్నాడు "వాడు రాడు".

    "ఎందుకని?"
    "ఎందుకంటే ఏమి చెప్పను. వాడు ఉత్తి 'వర్కుహాలిక్'రా. ఏ సరదా లేదు. ఓ.టీ. ఇవ్వకపోయినా రెండుగంటలు అదనంగా పని చేస్తాడేమోగానీ ఇలాంటివి శర్మకు గిట్టవురా"     "వాడుత్తి పిసినారిరా. వాడెందుకు వస్తాడు" మరో సహోద్యోగి అన్నాడు.     "అలా అంటే ఎలాగండీ. నేను వదలను. ఎందుకు రారో తేల్చుకుంటాను".     మరునాడు క్యాంటీన్‌లో కనబడ్డాడు శర్మ. నేనే అతను కూర్చున్న చోటుకు వెళ్ళాను. నన్ను పరిచయం చేసుకున్నాను.     "పిక్నిక్ లిస్టులో మీ పేరు కనబడలేదే?"     "పేరు ఇవ్వందే ఎలా కనబడుతుంది" అదురు ప్రశ్న వేశాడు అతను.     "నిజమేనండీ. కనీ ఎందుకు పేరు ఇవ్వలేదా అని"
    అతను నా మాటలు పట్టించుకోలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న కేరియర్ మూత తీశాడు.

    "చూడండి శర్మగారూ! సంవత్సరాలుగా కర్మాగారాలలో తిరిగే యంత్రాలతో పాటు, రాత్రిపగలు డ్యూటీ చేసే మనం కూడా యంత్రాలుగా మారిపోతున్నాం కదండీ. అందుకే మధ్యన కాస్త ఆటవిడుపులాంటిది ఈ పిక్నిక్. కొంత సరదా..." అన్నాను.
    "సరదాల కేముంది లెండి. పిక్నిక్‌కి వెళ్లడం మీ సరదా అయితే నా బాధ్యతలను నిర్వర్తించడం నా సరదా" తన కేరియర్‌లో నుంచి అన్నం తింటూ అన్నాడు అతను. "అయినా రెండువందలు ఏమైనా తక్కువ డబ్బా... మా అమ్మాయికి ఓ నెల ఫీజు"     "అందరికీ అంతే కదండీ"     "మిగతావాళ్ల సంగతి నాకు తెలీదు. అనవసరం కూడా"     శర్మ పిసినారి అని కొందరు అనే మాటలు నిజమేమోననిపించింది నాకు. అయినా విడిచిపెట్టలేదు.     "రెండు వందలు ఎక్కువే కావచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు మీ సంతోషం గురించి, సరదాల గురించి ఖర్చు పెట్టుకోరండీ?"     "నాకు ఇలాంటి సరదాలు, సంతోషాలు వద్దు" శర్మ కోపంగా అన్నాడు. "మీరు అనవసరంగా మాటలు పెంచవద్దు. మా ఇంటివాళ్ల సరదా తీర్చడమే నాకు సరదా. వాళ్లు సంతోషంగా ఉంటే అదే నా సంతోషం."

    మరో మూడు నెలలకు నన్ను శర్మ సెక్షన్‌కు బదిలీ చేశారు. అతనితో కలిసి పనిచేయటం వలన అతనిపై నాకు ఆరాధనా భావం ఏర్పడింది.
    నిర్విరామంగా పనిచేసే రసాయన కర్మాగారాలలో ఏ సంస్యా లేనప్పుడూ మాలాంటి ఆపరేటర్లకు ఎక్కువ పని ఉండదు. యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా అని గమనించడమే మా పని గనుక కొంత ఖాళీగా ఉంటుంది. అప్పుడు పిచ్చాపాటి మాట్లాడుకోవడం పరిపాటి. అలా మాట్లాడుకోవడం వల్లే శర్మ గురించి, కుటుంబ బాధ్యత గురించి, తను బాధపడినా, ఇబ్బంది పడినా, తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే అతని తపన గురించి తెలుసుకున్నాను. పనిలో అంకిత భావం, జీవితంలో ఏదైనా సాధించాలనే అతని తపనే నన్ను అతని వైపు ఆకర్షించాయి.     "ఇల్లు కట్టాలని అనుకుంటున్నానురా" ఓ రోజు శర్మ అన్నాడు. అదుపు తప్పుతున్న ఆవిరి ఒత్తిడిని అదుపులోనికి తేవడానికి ప్రయత్నిస్తున్న నేను ఏమీ అనలేదు.     "ఇక్కడ అద్దెలు ఇచ్చుకోలేకపోతున్నానురా" మళ్లీ అన్నాడు శర్మ. "అందుకే ఒక సైట్ చూశాను."     "ఎక్కడ?"     సైట్ ఎక్కడుందో చెప్పాడు అతను. మా కర్మాగారం నుంచి పదిహేను కిలోమీటర్లు అవతల ఉంది ఆ సైట్.     "అక్కడ నుంచి డ్యూటీకి రావడం కష్టం కదా?"     "కష్టమే. కానీ నావద్ద ఉన్న డబ్బుకి అక్కడే దొరికింది."     "మరికొంత డబ్బు కూడబెట్టుకుని, ఓ రెండేళ్లు ఆగి కొనవచ్చుకదా?" అని అడిగాను. "అయినా ఇప్పుడేమిటి అంత తొందర ఇల్లు కట్టడానికి?"     "అద్దెలు భరించలేక పోతున్నానని చెప్పాను కదా? పైగా రసాయన కర్మాగారాల్లో పనిచేసే వాళ్లం. మన జీవితాలకు గ్యారెంటీ ఏమిటి? ఏదైనా అయిపోతే..." శర్మ ఓ నిమిషం ఆగి అన్నాడు, "తల దాచుకోవడానికి ఓ కొంప అయినా అంటూ ఉంటే పెళ్ళాం పిల్లలకి ఓ ఆధారం ఉంటుంది కదాని"     అతని ఆలోచన నా కర్థమైంది. తోలుబొమ్మలాటలోని బొమ్మల కాళ్లకు కట్టిన తాళ్ల కేంద్ర బిందువు ఆడించేవాడి చేతిలో ఉన్నట్లే శర్మని ఆడించేవాళ్ల కేంద్ర బిందువు తన కుటుంబ సంక్షేమం గురించిన ఆలోచనయేయని నాకు తెలుసు.
    ఇల్లు మొదలు పెట్టాడు శర్మ. అయినా డ్యూటీ మానలేదు. ఎప్పటిలాగే ఓ.టీ.డ్యూటీ చేసుకునేవాడు.     చాలా నీరసించి పోయాడు అతను. పని ఒత్తిడి అతని ఒంటిమీద కొట్టొచ్చినట్టు కనబడింది. కళ్లు లోతుకుపోయాయి. కంటి చుట్టూ నల్లని చారలు చేరాయి. శరీరం సన్నబడింది.     "చాలా పాడైపోయారండీ" ఒక రోజు శర్మతో అన్నాను నేను.     "తెలుసు. అయినా ఇంకా ఎన్నాళ్లు మరో రెండు నెలల్లో ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశం చేస్తే అంతా విశ్రాంతియే కదా!"     టీ తీసుకుని వచ్చాడు. టీ తీసుకుని శర్మకి అందించాను.     "ఒద్దురా" శర్మ అన్నాడు. "టీ తాగడం మానేశాను."     "మానేశారా? షిఫ్టుకి అయిదు, ఆరు కప్పులు తాగే వారు"     "అది ఒకప్పుడు. అయిదారు కప్పుల టీ డబ్బులు ఓ నెల ఆదా చేస్తే ఒక సిమెంట్ బస్తా వస్తుంది."

    రోడ్డు ఒక ఇంటిముందు వరకూ వచ్చి ఆగింది. అక్కఆ నుంచీ పక్కకు తిరిగి రెండడుగులు వేస్తే శర్మ ఇల్లే.
    ఓ సిగరెట్టు వెలిగించాను.     ఆకాశమనే కర్మాగారంలో, తారాదీపతోరణాలు వెలిగాయి. ఇలాంటి సమయంలోనే జరిగింది ఆ ప్రమాదము. చీకటి చిక్కబడుతోంది. రాబోయే తుఫానుకు హెచ్చరికగా గట్టిగా వీస్తోంది గాలి. పని చెయ్యని పంపుని పరిశీలిస్తున్నాము నేను, శర్మ.     "ఇల్లు కట్టుకున్నారు. ఓ సమస్య తీరిపోయింది. ఇకనైనా..."     "ఓ సమస్య తీరిపోతే మరో నాలుగు సమస్యలు వస్తాయి. ఇంటికి వచ్చిన వాళ్లని కూర్చోబెట్టడానికి ఓ ప్లాస్టిక్ కుర్చీ కూడా లేదు. సోఫా సెట్టు, కలర్ టి.వి.కావాలని అంటోంది మా ఆవిడ. మా అమ్మాయి అయితే ఒక సైకిల్..."     హఠాత్తుగా ఏదో పేలుడు వినబడింది. వెయ్యి సూర్యులు ఒకేసారి ఉదయించినంత వెలుగు, వేడి వాతావరణములో వ్యాపించింది.     పరిగెత్తాడు శర్మ. పేలుడు జరిగింది విధినిర్వహణలో, అతని పరిధిలో ఉన్న టాంకులోనే!     అగ్నిమాపక దళం వారు వచ్చారు. వాళ్లతో పాటు శర్మ, ఇతర ఆపరేటర్లూ అగ్నిని అదుపులో పెట్టడానికి ప్రయత్నించారు. మంటతో పాటు వచ్చిన పొగ, మనుష్యులనీ, కర్మాగారాన్నీ కప్పేసింది. ఆ పొగలో మునిగిపోయిన మేము వాచీ చూస్తే గానీ తెలియలేదు, తెల్లవారినట్లు.     చివరకు మంట ఆగింది. బుసలు కొట్టిన నాగుపాము తన విషమంతా కక్కిన తర్వాత పడగ ముడుచుకుంటున్నట్లు మెల్లమెల్లగా ఆరింది మంట. అయినా మాష్టారి చేతిలోని బెత్తం దెబ్బలకు గురైన పిల్లవాడు ఏడుపు ఆపినా అప్పుడప్పుడు నిట్టూరుస్తున్నట్టు అగ్నిస్ఫులింగాలు రేగాయి.     నల్లగా మాడి మసి అయిపొయిన శర్నబు మరో ఇద్దరిని మోసుకుని హాస్పిటల్ చేరింది అంబులెన్సు. ఆ వెనుక వచ్చింది శర్మ శ్రీమతిని తీసుకొచ్చిన కారు. రాబోయే సీను ఊహించుకోగలిగిన నేను అక్కడ నిలబడలేకపోయాను.     "అంకుల్ మీరా!" నా వెనుక వచ్చిన శర్మ కూతురు, నన్ను పోల్చింది. "మమ్మీ అంకుల్ వచ్చారు" తుర్రుమని సైకిల్ మీద వెళ్ళిపోయి అంది ఆ పాప.
    ఇంటి ముందు దీపం వెలిగింది.     "రండి అన్నయ్యగారు" సాదరంగా ఆహ్వానించింది శర్మ శ్రీమతి.     సోఫా మీద కూర్చున్నాను. గది బాగా అలంకరించి ఉంది. అందమైన సోఫా సెట్టు, కలర్ టి.వి. గదిలో ఉన్నాయి.     "మంచి నీళ్లు తీసుకోండి"     చల్లటి నీరు అందుకుని ఆమెను గమనించాను. రెండు నెలల క్రితం భర్త పోయిన స్త్రీలా కనబడలేదు ఆమె. అందంగా అలంకరించుకున్న ఆమె నుదుటిమీద తిలకం కూడా దిద్దుకుంది.     "మనవాళ్లందరూ ఎలా ఉన్నారండీ?" ఆమె అడిగింది.     "బాగానే ఉన్నారు" నేను ముభావంగా అన్నాను. "పెన్షన్ కాగితాలపై సంతకాలు కావాలట. అందుకోసం వచ్చాను" కాగితాలు ఆమెకు ఇచ్చాను.     "చాలా సంతోషం" కాగితాలపై సంతకాలు చేస్తూ అంది ఆమె. "కిందటి వారం పి.ఎఫ్.డబ్బులు, ఎల్.ఐ.సి. డబ్బులు వచ్చాయండీ. ప్రమాదంలో చనిపోయారు కనుక రావాల్సిన డబ్బు కూడా మొన్ననే వచ్చింది."     నాకు చాలా ఆనందం కలిగింది. వచ్చిన డబ్బుతో వాళ్లు హాయిగా బతకవచ్చు. శర్మ ఆశించింది కూడా అదే కదా!     "మీరు నాకు ఓ సహాయం చెయ్యాలండీ!" ఆమె అంది. "డబ్బు ఎంతైనా ఫర్వాలేదు. టౌనులో ఓ మంచి అపార్టుమెంట్ చూడండీ."     "ఎవరికండీ?"     "మాకే. మేము టౌన్‌కి మారిపోతామండి. ఈ పల్లెటూరిలో నాకు కాలక్షేపమేముంటుంది?"     "మరి ఈ ఇల్లు?"     "అమ్మేస్తామండి. అయినా టౌన్లో ఇళ్లతో పోలిస్తే ఇదో ఇల్లా"     నాకు బుర్ర తిరిగిపోయింది. తన భార్యాబిడ్డలు, నిలువ నీడ లేకుండా ఇబ్బంది పడకూడదని రూపాయి, రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టాడు శర్మ!     తన కుటుంబం సభ్యుల బ్రతుకులకు ఒకదారి పరచడానికి తన సరదాలనీ, అవసరాలనీ, బ్రతుకునీ త్యాగం చేసిన శర్మ పిచ్చివాడని అనిపించింది నాకు. బయటికి వచ్చాను.     సూర్యుడు అందించిన వెలుగుని పూర్తిగా సొంతం చేసుకొని ఆకాశవీధిలో హాయిగా, నవ్వుతూ తిరుగుతున్నాడు స్వంత వెలుగులేని చంద్రుడు.
(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 16ఫిబ్రవరి 2002 సంచికలో ప్రచురితం)
Comments