తాగుబోతు - వెల్లంపల్లి అవినాష్

    
పల్లీ పల్లీ పల్లీ పల్లీ, సార్ పల్లీల్ సార్!!

    గుట్కా సిగరేట్ గుట్కా సిగరేట్!!

    రకరకాల అరుపులతో లింగంపల్లి లోకల్ రైల్వేస్టేషన్ కోలాహలంగా ఉంది. కొనేవాళ్లూ, తినేవాళ్లూ, అమ్మేవాళ్లూ, ఉమ్మేవాళ్లూ, చెత్త వేసేవాళ్లూ, చెత్త ఊడ్చేవాళ్లూ అందరూ ఎవరి పనిలో వాళ్లు మునిగిపోయి ఉన్నారు.

    “ .... .... వెళ్లు లోకల్ రైలు మరికొద్ది నిమిషాల్లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం పైకి వచ్చును” 
చెవులకింపైన గొంతుతో వచ్చిన అనౌన్స్ మెంటు ఆ ప్లాట్ ఫారాన్ని ఒక్కసారిగా యుద్ధభూమిగా మార్చేసింది. యుద్ధ ఆరంభానికి సూచికగా చెవులు పగిలేలా “కూ!!” అంటూ రైలింజన్ కూత వెలువడింది.
ప్లాట్ ఫామ్ పై నిలబడున్న వాళ్లంతా ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. ఉన్మాదం పూనినవాళ్లలా ప్లాట్ ఫామ్ అంచుకు పరుగులు తీశారు. రైలు ఆగీఆగకముందే ఎక్కబోయేవాళ్లకూ, దిగబోయేవాళ్లకూ తోపులాట మొదలైంది. దేశాన్ని వల్లకాడు చేస్తున్న కులం, మతం, ప్రాంతం, భాష, యాస, స్త్రీ పురుష, ధనిక పేద, పార్టీ, సిద్ధాంత, వర్ణ, వర్గ మొదలైన లక్షాతొంబై భేదాలన్నీ ఆ ప్లాట్ ఫారంపై రెండు నిమిషాల పాటు మాయమైపోయాయి. పాసెంజర్లంతా సౌభ్రాతృత్వంతో “దిగే గుంపు”, “ఎక్కే గుంపు”లుగా ఏర్పడ్డారు. ఐకమత్యంతో తోపులాట పోరాటం సాగించి, ఎట్టకేలకు రైలు దిగాల్సినవాళ్లు దిగారు, ఎక్కాల్సిన వాళ్లు ఎక్కారు. గుంపు మళ్లీ వ్యక్తులుగా విడిపోయింది. అన్ని భేదాలనూ జయించి రెండు నిమిషాల పాటు ప్లాట్ ఫామ్ పై ఆవిష్కృతమైన విశ్వమానవ సౌభ్రాతృత్వం తోక ముడిచింది. యుద్ధం ముగిసినట్టు మరొక్కసారి సైరన్ మోత!! 

    రైలు నీరసంగా కదిలింది.

    “ఎక్కే గుంపు”కు ముందుండి నాయకత్వం వహించిన కౌశిక్ లోపల కూడా యుద్ధోత్సాహాన్ని కొనసాగించాడు. బ్యాగుతో సాటి పాసెంజర్లను ఎడాపెడా మోదేస్తూ, తోసేస్తూ ఒక మూలకు వెళ్లి నిలబడ్డాడు.
ఇంకో అరగంటలో విశాఖపట్నం బయల్దేరే గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టుకోవాలతను. ఎంత వేగంగా వెళ్ళినా ఇక్కణ్ణుంచి సికింద్రాబాదు స్టేషనుకు ఇరవై నిమిషాలు పడతాయి. అందుకే అతనికంత తొందర. 
సాయంత్రం కావడం వల్ల రైలంతా జనం నిండిపోయున్నారు. నిలబడ్డానికి కూడా చోటు వెతుక్కోవాల్సిన పరిస్థితి. “ఛీ!! ఎదవ బతుకు!!”, చిరాకుపడ్డాడు. 

    కౌశిక్ హైదరాబాదులో ఒక మల్టీనేషనల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. నెలకు యాబైవేల పైనే వస్తుంది. తన లవర్ పుట్టినరోజు సందర్భంగా సర్ ప్రైస్ ఇవ్వడం కోసం స్వయంగా బయల్దేరి వెళ్తున్నాడు. ఎప్పుడూ ఏసీ కార్లలో ప్రయాణాన్నే ప్రిఫర్ చేసే కౌశిక్ అనుకోని పరిస్థితుల వల్ల ఈసారి ఏసీ ట్రెయిన్లో వెళ్లాల్సి వచ్చింది. ఏదో అబద్ధం చెప్పి నాలుగురోజులు లీవ్ తీసుకున్నప్పటికీ, జిడ్డు మేనేజర్ అదీ ఇదీ వాగుతూ వదలకపోవడంతో బాగా లేటైపోయింది. 

    రైలు ఏదో స్టేషన్లో ఆగింది. పరుగెత్తుకెళ్లి దగ్గర్లో ఖాళీ అయిన సీట్లో కూర్చున్నాడు కౌశిక్. నల్లగా, బక్కపలచగా ఉన్న మనిషి ఒకడు వచ్చి కౌశిక్ పక్కనున్న సీట్లో కూర్చున్నాడు. ఇరవై ఏళ్లుండొచ్చు. బట్టలు బాగా మాసిపోయి ఉన్నాయి. ముంజేతుల మీద చర్మం ఊడిపోయి సోరియాసిస్ సోకిన వాడిలా కనబడుతున్నాడు. ముక్కుపుటాలదిరేలా తాగిన వాసనొస్తోంది. అసౌకర్యంగా పక్కకు జరిగాడు కౌశిక్. ఈ లేబర్ గాళ్లందరూ ఇంతే, రాత్రీపగలూ తేడా లేకుండా తాగుతూనే ఉంటారనుకున్నాడు చిరాగ్గా. 
కౌశిక్ వైపు తిరిగి ఆ మనిషి హిందీలో అడిగాడు, “ఎక్కడి దాక వెళ్తున్నారండీ??” మాట ముద్దముద్దగా ఉంది. 

    జవాబు చెప్పబుద్ధికాలేదు కౌశిక్ కి. ఈ తాగుబోతోడితో నాకెందుకని వినబడనట్టు నటించాడు. కానీ ఆ మనిషి వదల్లేదు. “ఎక్కడి దాక వెళ్తున్నారండీ??”, అన్నాడు కొంచెం గట్టిగా. 

    కౌశిక్ కి జవాబు చెప్పక తప్పలేదు. “సికింద్రాబాదు స్టేషనుకెళ్తున్నాను”, అన్నాడు. “మీరెక్కడి దాక??”, అలవాటులో పొరపాటుగా ఆటోమేటిగ్గా వచ్చేసింది నోటి వెంట. 

    “సార్!! నేను భోపాల్ వెళ్లాల్సార్!! ఎట్లా వెళ్లాలో మీకేమన్నా తెలుసా సార్??” అడిగాడతను ఆత్రంగా. 
అడిగిన ప్రశ్నకు జవాబు మట్టుకు చెప్పి నోరు మూసుకోకుండా, అనవసరంగా సంభాషణ కొనసాగడానికి అవకాశం ఇచ్చినందుకు తనను తానే నిందించుకుంటూ, “తెలుసు, కొంపదీసి భోపాల్ వెళ్తున్నావా ఏంటిప్పుడు ఈ అవతారంలో??”, అడిగాడు కౌశిక్ వెటకారంగా. సంభాషణంతా హిందీలో సాగుతున్నది.

    “అవున్సార్!! నాది భోపాలే సార్!!. ఇక్కడ ఒక వ్యాపారి పనిస్తానంటే నమ్మి వచ్చాను సార్. ఇప్పుడే వాణ్ని చావగొట్టి పారిపోయొస్తున్నాను. కష్టమనుకోకుండా కొంచెం సాయం చెయ్యండి సార్!! ప్లీజ్ సార్!!”, చిన్న గొంతుతో బతిమిలాడాడు. 

    ఎవరో లాగిపెట్టి చెంప మీద కొట్టినట్టు అద్దిరిపడ్డాడు కౌశిక్. “ఏంటి?? కొట్టి పారిపోయి వస్తున్నావా?? సోయిలో ఉండే మాట్లాడుతున్నావా??”, గట్టిగా అడిగాడు. ఆశ్చర్యాన్ని అదుపు చేసుకోలేకపోడం వల్ల తన ప్రశ్న తనకే అరుపులా వినిపించింది. 

    “నిజమే సార్!! పోలీసులు నాకోసం వెతికేలోపు హైదరాబాద్ దాటేస్తే తప్ప నేను తప్పించుకొనే అవకాశం లేదు. కొంచెం సాయం చెయ్యండి సార్!! ఏ రైలెక్కాలో కూడా తెలియదు సార్. ప్లీజ్ సార్!!”, అన్నాడతను. 
ఒంటి మీద స్పృహ లేకుండా తాగేసి వాగుతున్న సూచనలేం కనబళ్లేదు కౌశిక్ కి. నిజమే చెప్తున్నాడనిపించింది. 

    “సార్!! ప్లీజ్ సార్!!”, అన్నాడతను మళ్ళీ, మీరు తప్ప నాకు వేరే దిక్కే లేదన్నట్టు దీనంగా మొహం పెట్టి. 

    ఒప్పుకొనేదాకా వదలడేమో అనిపించింది కౌశిక్ కి. ఇట్లాంటి లేకిమనుషుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు తనకి. ఏవేవో కథలు చెప్పి డబ్బులడిగేవాళ్లు కొందరు ఉంటారని విన్నట్టు గుర్తు!! మాటసాయం వరకైతే సరే కానీ డబ్బులిచ్చే ప్రసక్తే లేదని డిసైడయ్యాడు కౌశిక్. 

    “నాకు డబ్బులేమొద్దు సార్, వాణ్ని కొట్టినప్పుడు వాడి దగ్గర లాక్కున్నాను. ఏ రైలెక్కాలో చూపెడితే చాలు సార్!! ప్లీజ్ సార్!!” అన్నాడతనే మళ్లీ.

    ఆలోచించాడు కౌశిక్. చూస్తుంటే వీడి వ్యవహారం నిజంలాగే ఉంది. పైగా డబ్బులేం అడగట్లేదు కదా. ఎలాగూ నేను కూడా రైల్వేస్టేషనుకే వెళ్తున్నాను, వీడి కోసం సెపరేటుగా చేసేదేమీ లేదనుకున్నాడు. “సరేలే!! నేను కూడా స్టేషనుకే వెళ్తున్నాను. నాతో పాటు వచ్చెయ్!! ఏ రైలెక్కాలో చూపిస్తాన్లే!!”

    “చాలా థాంక్స్ సార్!! ఇప్పటిదాక కనీసం ఇరవై మందిని అడిగి ఉంటా సార్!! సాయం చేస్తానన్నది మీరొక్కళ్లే సార్!!”, అన్నాడతను కృతజ్ఞత నిండిఉన్న కళ్ళతో. 

    “ఇంతకీ ఎందుకు పారిపోతున్నావ్ నువ్వు??”

    “మాది భోపాల్ దగ్గర చిన్న పల్లెటూరు సార్. ఆర్నెల్ల కిందట ఒక పురుగుల మందుల ఫ్యాక్టరీ యజమాని వచ్చి, నెలకు పదివేలొచ్చే ఉద్యోగాలిప్పిస్తానని చెప్తే, వాణ్ని నమ్మి యాభై మంది వరకు వచ్చాం సార్!! ఉండడానికి రూము ఇస్తానన్నాడు. రోజూ కంపెనీకి తీసుకెళ్లడానికి బస్సు ఉంటుందన్నాడు. తీరా చూస్తే చాలా కష్టమ్మీద రెండు మూడు వేలిస్తున్నాడు. రోజుకు పదహారు పదిహేడు గంటలపైనే పని చేయించుకునేవాడు. పైసలెప్పుడు ఇస్తారని అడిగితే ఏదో కథ చెప్పేవాడు ప్రతీసారీ. ఒకసారి అందరం కలిసి వాణ్ని నిలదీశాం. కంపెనీ నష్టాల్లో ఉంది, వచ్చే నెల గ్యారంటీగా ఇస్తామని నమ్మబలికి పంపాడు. కానీ మరుసటి రోజే దొంగతనం నేరం మోపి నాతోపాటు నలుగుర్ని జైల్లో తోయించి వారం రోజులు తన్నించాడు” చెప్పి కాసేపు ఆగాడతను, అలసిపోయినట్టు. 

    కౌశిక్ మొహంలో రంగులు మారిపోయాయి. “తరవాతేమైంది?? జైల్లోంచి బైటికెలా వచ్చావ్??”, అడిగాడు కౌశిక్ ఆశ్చర్యంతో. ఇట్లాంటివి జరుగుతాయని అప్పుడప్పుడు పేపర్లలో చదవడమే తప్ప చూడడం ఇదే మొదటిసారి. పైగా అతని నోటి వెంటే వినాల్సిరావడం అస్సలు ఊహించనిది.

    “ఏముంది సార్!! వారం తరవాత యజమానే వచ్చి విడిపించుకెళ్లి మళ్ళీ ఫ్యాక్టరీలోనే పడేశాడు. పోలీసులు కూడా వాడి మాటే వింటున్నారు. చేసేదేమీ లేక నోరు మూసుకున్నాం. మా పరిస్థితి చూసిన మిగతావాళ్లు పైసలడుగుదామంటేనే భయపడిపోతున్నారు. పరిస్థితి తెలిసి మా అమ్మ ఒకటే ఏడుపు, ఊరుగాని ఊర్లో ఈ కష్టాలేంటని!! అడుక్కుతినైనా బతుకుదాం వచ్చెయ్యమంటున్నది”

    “మీ అమ్మానాన్న ఏం చేస్తుంటారు??” తనకు తెలియకుండానే ఆ మనిషికి దగ్గరగా జరిగాడు కౌశిక్!!

    “నాన్న వ్యవసాయం చేసేవాడట. ఒక్క ఎకరం పొలముండేదట. నా చిన్నప్పుడే ఆత్మహత్య చేసుకున్నాడట. ఆ పొలం అప్పులవాళ్లు తీసేసుకున్నారు. నేనొక్కణ్ణే కొడుకుని. అమ్మ నాలుగైదిళ్లలో పాచిపని, వంటపని చేసేది. నేను కూలిపని, సిమెంటు పని రకరకాల పనులు చేసేవాణ్ణి. సంవత్సరం కిందట రోకలిబండ పడి అమ్మ కాలు విరిగిపోవడంతో పనికి పిలవడం మానేశారందరూ. దాంతో ఎక్కువ పైసలొస్తాయని ఈ లుచ్చాగాడి మాటలు నమ్మి ఇక్కడికొచ్చాను”
    
    కౌశిక్ నిరుత్తరుడై వింటున్నాడు. అతని పరిస్థితిలో తనని ఊహించుకోడానికే భయమేసింది. 
అతను కొనసాగించాడు. “అందుకే తెగించి ఈరోజు మళ్ళీ యజమాని దగ్గరకెళ్ళాను. నాతో ఎవ్వరూ రాలేదీసారి. మాటామాటా పెరిగి నామీద చెయ్యి చేసుకున్నాడు వాడు. న్యాయంగా ఇస్తానన్న పైసలే ఇవ్వకపోగా ఎదురు నన్నే కొడుతున్నాడని పిచ్చికోపం వచ్చింది. చేతికందిన ఏదో వస్తువుతో వాణ్ణి చితక్కొట్టాను. జేబులో ఉన్న డబ్బులు గుంజుకొని పారిపోయి వచ్చేశాను”, చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు గుండెల నిండా. 

    విస్మయంతో చూస్తూనే ఉండిపోయాడు కౌశిక్. గ్లోబలైజేషన్ లాభాలనందుకుని అందలమెక్కి సంబరపడుతున్న వర్గం, అభివృద్ధి ముసుగులో అది యథేచ్ఛగా సాగిస్తున్న జీవనవిధ్వంసాన్ని మొదటిసారి కళ్ళారా చూసినప్పుడు కలిగే విస్మయమది. తను చదువుకున్న ‘లాభాలు పెరగాలంటే ఖర్చులు తగ్గించాలనే’ ఎకనామిక్సు సూత్రం, పెట్టుబడిదారుల అత్యాశ వల్ల శ్రమదోపిడీకీ, ఉద్యోగుల జీతాలను తగ్గించడానికీ, వాళ్ళ హక్కులను హరించడానికీ కారణమవుతున్నదన్న నిజం కళ్ల ముందు ఆవిష్కృతమైనప్పుడు కలిగే విస్మయమది. 

    “పోలీసులు కూడా వాడి మనుషులే!! ఇప్పటికే నా గురించి వెతుకడం మొదలుపెట్టేసే ఉంటారు. దొరికితే ఈసారి నా పని ఖతమ్ చేసేస్తారు. దయచేసి నన్ను రైలెక్కించండి సార్, ప్లీజ్!!”, అన్నాడతను నిస్సహాయంగా చూస్తూ. 

    కౌశిక్ కళ్ల ముందు లవరూ, గోదావరి ఎక్స్ ప్రెస్సూ, అది మిస్సయితే బస్సుల్లో పడాల్సిన అవస్తలూ గిరగిరా తిరుగుతున్నాయి. మెల్లగా తల తిప్పి తాగుబోతువాడి కళ్ళలోకి చూశాడు. నిస్సహాయతా, నిరాశా, దుక్కమూ కలగలిసి కనిపిస్తున్నాయి అతని కళ్ళలో. 

    లోకల్ రైలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకొంది. అక్కడక్కడా పోలీసులతో ప్లాట్ ఫారం హడావిడిగా ఉంది. 
కౌశిక్ ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అతని ముఖం ప్రశాంతత సంతరించుకున్నది. “నీకేం భయం లేదు భాయ్!! ఎట్టి పరిస్థితుల్లోనైనా నిన్ను భోపాల్ రైలెక్కించే బాధ్యత నాది”, అన్నాడు ధృఢంగా. 

    దాదాపు జనమంతా దిగేశారు. కౌశిక్ కూడా దిగిపోయాడు, ఒక చేతిలో లగేజ్ బ్యాగు పట్టుకొని, మరో చేతిలో ఆ ‘తాగుబోతోడి’ చెయ్యి పట్టుకొని!! 

    ఎన్ని భేదాలున్నా ఎప్పటికైనా నేనే జయించి తీరుతానని సౌభ్రాతృత్వం గర్వంగా తలెగరేసింది. 

(సాక్షి ఫన్‌డే 10-02-2013 సంచికలో ప్రచురితం)
Comments