తలుపుతట్టని అదృష్టం - అంపశయ్య నవీన్

    
"శాతవాహన ఎక్స్‌ప్రెస్ సాధారణంగా లేటవదు. ఒక్కొక్కసారి ఐదు నిమిషాలు ముందుగానే వచ్చేస్తుంది. నువ్వు త్వరగా తయారవ్వాలి" అంది అపర్ణ వాళ్ళమ్మ అన్నపూర్ణమ్మతో.

    "నేను తయారవుతున్నాను లేవే... నువ్వు మరీ తొందర పెట్టకు... ఇంకా గంట టైముంది కదా..." అంది అన్నపూర్ణమ్మ సూట్‌కేసులో చీరలు సర్దుకుంటూ.

    అన్నపూర్ణమ్మ వాళ్ల చెల్లెలు పెళ్ళికని వాళ్ళు ఖమ్మం వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. 

    ఆరోజు ఉదయమే వాళ్ళు ఖమ్మం వెళ్దామనుకున్నారు. కానీ అపర్ణ "పెళ్ళి రాత్రికి కదా... ఒక రోజు లీవ్ వేస్ట్ చెయ్యడమెందుకు? నేను ఆఫీసుకెళ్ళొచ్చాక హాయిగా శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో వెళ్దాం" అని వాళ్ళమ్మతో చెప్పేసి తను పని చేస్తున్న బ్యాంకుకు వెళ్ళిపోయింది.

    "మీరిలాగే సర్దుతూ కూర్చుంటే ట్రెయిన్ కాస్తా వెళ్ళిపోతుంది. త్వరగా తెమలండి" అన్నాడు రామచంద్రయ్య - అపర్ణ వాళ్ళ నాన్న.

    "మీరు కూడా తొందరపెట్టడం మొదలెట్టారా? మీరెక్కడికీ రారు. ఇంట్లో కూర్చొని మమ్మల్నిలా తొందరపెడ్తుంటారు" అంది అన్నపూర్ణమ్మ.

    "అందరూ వెళ్తే ఇంటి కావలెవరుంటారు? ఇంటికి తాళం వేసిపోతే దొంగలు పడి దోచుకుపోవడం చూస్తూనే ఉన్నాం కదా!" అన్నాడు రామచంద్రయ్య.

    "మీకదో నెపం... ఒక్క రాత్రికేం కాదు... మీకెక్కడికీ రాబుద్ధి కాదులెండి... పదవే అపర్ణ... నేను రెడీ" అంది అన్నపూర్ణమ్మ్మ సూట్‌కేసు చేతిలో పట్టుకొని. హ్యాండ్‌బ్యాగ్‌తో అపర్ణ కూడా రెడీ అయ్యింది.

    "ఇల్లు జాగ్రత్త... పడుకునేముందు తలుపులన్నీ సరిగ్గా మూసేసి పడుకొండి... మేం వెళ్ళొస్తాం" అంది అన్నపూర్ణమ్మ.

    "సరె... సరె" అన్నాడు రామచంద్రయ్య. 

    వాళ్ళిద్దరు రోడ్డుమీదకు రాగానే ఓ ఖాళీ ఆటో కనిపించింది. దాంట్లో ఎక్కేసి ట్రెయిన్ రావటానికి 15 నిమిషాలు ముందుగానే వాళ్ళు కాజీపేట స్టేషన్ చేరుకున్నారు.

    టికెట్స్ తీసుకొని ఫ్లాట్‌ఫాం మీదకు రాగానే "శాతవాహన ఎక్స్‌ప్రెస్ మరికాసేపట్లో ఒకటవ నెంబరు ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చును" అన్న ప్రకటన మైకులో వినిపించింది.

    ట్రెయిన్ ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చి ఆగగానే వాళ్ళు కాస్త ఖాళీగా కనిపించిన కంపార్ట్‌మెంట్‌లోకి చేరిపోయారు. వాళ్ళకు సీట్లు కూడా దొరికాయి.

    "థాంగ్గాడ్...సీట్లు దొరుకుతాయో లేదోనని భయపడ్డాను" అంటూ అపర్ణ కంపార్ట్‌మెంట్ మధ్యలో కిటికీ పక్కనే ఉన్న సీట్లో కూర్చుంటూ అన్నపూర్ణమ్మను తన పక్కనే ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోపెట్టుకొంది.

    కాస్సేపట్లోనే ట్రెయిన్ కదిలి స్పీడందుకుంది. అపర్ణకు తన ముందున్న సీట్లో కూర్చున్న యువదంపతుల మీదకు దృష్టి మళ్ళింది.

    అతడు లాప్‌టాప్ ముందు పెట్టుకొని కీబోర్డు మీద వేళ్ళను కదిలిస్తూ మానిటర్ గమనిస్తున్నాడు. ఆమె యేదో తెలుగు మ్యాగజైన్ పేజీలు తిప్పేస్తోంది.

    కాస్సేపటి వరకు అపర్ణ ఆ దంపతులను పట్టించుకోలేదు. ఒక విషయం మాత్రం ఆమెను ఆశ్చర్యపరచింది. అతడేమో చాలా అందగాడిలా... ముట్టుకుంటే మాసిపోతాడేమోనన్నంత సున్నితంగా కనిపించాడు. ఆమేమో అతి మామూలుగా కనిపించింది. అంత హ్యాండ్సమ్‌గైకి ఇంత ఆర్డినరీ ఉమన్ భార్య కావడమేమిటి? అని అపర్ణ ఒక్క క్షణం ఆశ్చర్యపడింది. తర్వాత తనూ తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న ఓ మేగజైన్ తీసి పేజీలు తిరిగెయ్యసాగింది. కానీ ఆమె చూపులు ఆ మేగజైన్ మీద నిలువలేదు. అతడ్ని మరోసారి చూడాలనిపించింది.

    ఈసారతన్ని కొంచెం ఎక్కువసేపే చూసింది. అలా చూస్తోంటే ఇతన్నిదివరెకెక్కడొ చూశానన్న భావం కల్గిందామెకు. అతన్ని చూస్తున్న కొద్దీ ఆమెలో ఈ భావం ఇంకా బలపడింది.

    అతన్నిదివరకు ఎక్కడచూసిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. కొంతసేపు ఆమె తన జ్ఞాపకాల దొంతరల్ని మధించాక అతన్నెక్కడ చూసిందో గుర్తొచ్చింది. చూడటమే కాదు... అతనితో మాట్లాడింది కూడా.

    మూడేళ్ళ క్రితం జరిగిన పెళ్ళిచూపులు గుర్తొచ్చాయి.

    అతడు తనని చూడటానికొచ్చాడు.

    ఇంటర్నెట్ ద్వారా తన వివరాలన్నీ తెలుసుకున్నాననీ, తన ఫోటో కూడా చూశానని చెప్పాడు.

    అతన్ని చూడగానే తన తరఫు వాళ్ళందరికీ అతని మీద చాలామంచి అభిప్రాయం కల్గింది.

    "అతడూ అందగాడే... నువ్వూ అందగత్తెవే - మీరిద్దరికీ కుదిరితే మీ జోడీ జగదేకసుందరి - అతిలోక సుందరుడు...భలే కలిశారనుకుంటారందరూ" అన్నారందరూ.

    అతడి వెంట వాళ్ళ నాన్నగారొక్కరే వచ్చారు. "అంతా వాడిష్టం... నాదేమీ లేదు" అన్నాడా పెద్దాయన.

    ఫలహారాలు, కాఫీలు సేవించడం అయిపోయాక "మీరిద్దరూ ఆ పక్క రూంలో కెళ్ళి మాట్లాడుకోండి" అన్నాడు అపర్ణవాళ్ళ నాన్నగారు.

    "మీరు నాకు నచ్చారు" అన్నాడతడు తనతో ఏకాంతం లభించగానే.

    అతడన్న ఆ మాట తనను ఆశ్చర్యపరచలేదు. తను నిశ్శబ్దంగా ఉండి పోయింది.

    "నేను మీకు నచ్చానో లేదో చెప్పడి" అతడు తనకేసి చిరునవ్వుతో చూస్తూ.

    అప్పుడు కూడా తనేమీ మాట్లాడలేదు.

    "మౌనం అంగీకారం అనుకోవచ్చా?" అన్నాడతడు.

    "అనుకోవచ్చు" అన్నట్టుగా నవ్వింది. 

    "చెప్పండి. మీ కండీషన్స్?"

    "మొదలు మీ కండీషన్స్ యేమన్నా ఉంటే చెప్పండి"

    "ఉన్నాయి... నా గురించి మీకు ఆల్‌రెడీ చాలా వివరాలు తెలిసినా మరోసారి చెబుతాను. అభ్యంతరమేమీ లేదు కదా?"

    "లేదు.చెప్పండి"

    "నా పేరు కొత్తపల్లి మహేందర్... ఐఐటి ఢిల్లీలో ఎం.టెక్ చేసి ప్రస్తుతం విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. నా మంత్లీ శాలరీ 80వేలు. స్టేట్స్‌కు రండని నాకు చాలా ఆఫర్సే వచ్చాయి. అయినా నేను వెళ్ళలేదు. మా అమ్మా నాన్నలకు నేనొక్కడినే కొడుకును. ఓ అక్క కూడా ఉంది. మా అక్కబావలు స్టేట్స్‌లోనే సెటిలయ్యారు. నేను కూడా స్టేట్స్‌కు వెళ్తే మా అమ్మా నాన్నల్ని చూసుకునే వాళ్ళెవరూ ఉండరు. మా నాన్న హార్ట్ పేషెంట్... మా అమ్మకేమో పెరాలసిస్ వచ్చి బెడ్‌కే పరిమితమై పోయింది. వాళ్ళిద్దర్నీ చూసుకోవడం కోసమే నేను స్టేట్స్‌కు వెళ్ళలేదు. వెళ్తే ఈపాటికి కోట్లు సంపాదించేవాడిని. మా అమ్మా నాన్నల కారణంగా ఆ అవకాశాన్ని వదులు కోవలసి వచ్చింది" అన్నాడతడు వాళ్ళ అమ్మానాన్నలు అతనికేదో అపకారం చేశారన్నట్టుగా. 
  
    ఇతనిలో భేషజం దండిగానే ఉన్నట్టుంది అనుకుంది తను.

    "ఆ మ్యాటర్ అలా ఉండనీయండి. మీరేదో బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారనుకుంటాను?"

    "అవును... ఆంధ్రా బ్యాంకులో అసిస్టేంట్‌గా పనిచేస్తున్నాను" అంది.

    "మీరు ఎం.ఎస్.సీ కెమిస్ట్రీ కాదూ?"

    "అవును..." 

    "మీరు చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధమేమన్నా ఉందా? ఎం.ఎస్సీ కెమిస్ట్రీ ఫస్ట్‌క్లాస్ అయ్యుండి బ్యాంక్‌లో అసిస్టెంట్‌గా చెయ్యడమేమిటి? యేదన్నా యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేస్తే డిగ్నిఫైడ్‌గా ఉండేది" అన్నాడతడు.

    "ఆఫ్‌కోర్స్" అని నవ్వింది అపర్ణ.

    "మీరు టీచింగ్ జాబ్‌కెందుకెళ్ళలేదు?"

    "నాకు టీచింగ్ మీద ఇంటరెస్ట్ లేదు"

    "ఎం.ఎస్‌సీ చదివి టీచింగ్ మీద ఇంటరెస్ట్ లేదనటం...ప్చ్... ఇంటరెస్టింగ్!" అన్నాడతడు చాలా స్టైలిష్‌గా భుజాలెగరేస్తూ... నువ్వు చాలా తెలివితక్కువదానివి అన్నట్టుగా నవ్వుతూ.

    తను నవ్వలేదు. అతడు చాలా 'వోవర్ స్మార్ట్' అనిపించిందామెకు.

    "మీరు చాలా సీరియస్ టైపులా ఉన్నారు.అస్సలు నవ్వడం లేదు" అన్నాడతడు తన కళ్ళళ్ళోకి చూస్తూ.

    తను ఓ చిరునవ్వు నవ్వింది.

    "మీ నవ్వు మోనాలిసా నవ్వులా చాలా మిస్టీరియస్‌గా ఉంది. ఎనీవే. నా ఫస్ట్ కండిషన్ యేమిటంటే; మనం పెళ్ళి చేసుకోవాలంటే మీరు చేస్తున్న ఈ బ్యాంక్ ఉద్యోగం మానెయ్యాలి. అలా అంటున్నందుకు నన్ను మీరు "మేల్ చౌవనిస్టు" అనుకోవచ్చు... కానీ నేనీ కండిషన్ ఎందుకు పెడ్తున్నానో కూడా మీకు చెబుతాను. నేనే కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నాను. నేను రోజూ కనీసం 12 గంటలు పని చెయ్యాలి. సో, నాకు మా అమ్మానాన్నల్ని చూసుకునేంత తీరిక ఉండదు. నాకు కాబోయే భార్య కూడా ఉద్యోగస్తురాలే అయితే... అదీ బ్యాంకు ఉద్యోగమైంతే... చాలా కష్టం. యే యూనివర్శిటీలోనో లెక్చరర్ ఉద్యోగమైంతే బోల్డు తీరిక దొరికేది. మీకు చెప్పాగా మా నాన్న హార్ట్‌పేషెంట్... రెండుసార్లు స్ట్రోకొచ్చిందాయనకు... అమ్మేమో... ఓ కాలు పడిపోయి బెడ్‌లోని కదల లేదు. వాళ్ళను కంటిరెప్పలా చూసుకునే కోడల్ని తీసుకురాక పోతే వాళ్ళకు నేను చాలా అన్యాయం చేసినవాడినౌతాను... సో... మీరు ఉద్యోగం మానేస్తానంటే మనం హాయిగా పెళ్ళి చేసుకోవచ్చు... మీరు నాకు చాలా నచ్చారు... మీతో నా జీవితాన్ని పంచుకోవటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు... మన కాపురం హాయిగా సాగుతుందన్న నమ్మకం నాకుంది" అన్నాడతడు. ఆమెనెలాగైనా ఒప్పించాలన్న పట్టుదల అతనిలో కనిపించింది.

    తను కాస్సేపు ఆలోచించింది.

    "సారీ... నేను ఉద్యోగం చెయ్యడం మానుకోలేను. నేను మీకు అందుక్కారణమేమిటో చెప్పాలి. మా నాన్నకు ఇద్దరమే కూతుళ్ళం. నేనే పెద్దదాన్ని... మా నాన్న రిటైర్డ్ టీచర్... కొంచెం పెన్షన్ తప్ప ఆయనకు వేరే సంపాదన యేమీలేదు. నేను ఉద్యోగం చెయ్యడం వల్లనే మేము ఈ స్థాయిలో బతక గల్గుతున్నాం. మా చెల్లెల్ని డొనేషన్ కట్టి ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంజినీరింగ్ చదివిస్తున్నాము. అదింకా మూడు సంవత్సరాలు చదివితే గానీ బి.టెక్ డిగ్రీ దాని చేతికి రాదు. దాన్ని చదివించాల్సిన బాధ్యత నాదే..."

    "మీ బాధ్యతను నేను తీసుకుంటాను... మనిద్దరి కుటుంబాలకు సరి పోయేంత సంపాదన నాకుంది... మీ చెల్లెల్ని చదివించే బాధ్యత నాకొదిలేయండి."

    "అలా వీలుకాదులెండి... అయితే ఒకమాట...నేను ఉద్యోగం చేస్తూ కూడా మీ అమ్మానాన్నల్ని చూసుకోగలను. యేదన్నా ఎమర్జెన్సీ వస్తే లీవ్ పెడ్తాను..." అంది తను.

    "రోజూ ఇంట్లో ఉండి వాళ్ళను చూసుకోవాలండి... ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నేను కూడా లీవ్ పెడ్తాను..."

    ఆ తర్వాత ఇద్దరూ కాస్సేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు.

    "అయితే పెళ్ళి తర్వాత కూడా ఉద్యోగం చెయ్యాలన్న మీ నిర్ణయం మారదన్నమాట..." అన్నాడతడు.  

    "మారదండి" అంది తను.

    "అయితే మనకు కుదరదులెండి" అంటూ అతడు హాల్లోకొచ్చి వాళ్ళ నాన్నగారితో "మనం వెళ్దాం పదండి నాన్న!" అన్నాడు.

    వాళ్ళ నాన్న మెల్లగా లేచి నిల్చొని నాన్నతో "వెళ్ళొస్తామ"ని చెప్పేసి మహేందర్‌తో కలిసి వెళ్ళిపోయాడు.

    వాళ్ళు వెళ్ళిపోగానే తన అమ్మ, నాన్న, చిన్నమ్మలు, పెద్దమ్మలు... అందరూ ఒకేసారి "యేమైంది?" అని అడిగారు.

    "యేమీ కాలేదు... నేను ఉద్యోగం మానెయ్యాలన్న కండిషన్ పెట్టాడు" అంది తను.

    "నువ్వేమన్నావు?" అన్నారు వాళ్ళు.

    "ఉద్యోగం మానెయ్యలేను. సారీ! అని చెప్పాను" అంది తను.

    "అయ్యో...అలా ఎందుకు చెప్పావే... అతడు బోల్డు సంపాదిస్తున్నాడు కదా..." అంది అమ్మ.

    "ఇద్దరికీ సరిపోయేంత అతడొక్కడే సంపాదిస్తున్నాడు కదే. నువ్వు హాయిగా ఇంట్లో ఉంది వాళ్ళ అమ్మానాన్నల్ని చూసుకుంటే సరిపోయేది కదా!" అన్నాడు నాన్న.

    "అతన్ని, నిన్నూ పక్కపక్కన చూస్తోంటే మేమెంత సంతోషించామో... ఒకర్ని మించి ఒకరు... మీరు పెళ్ళి చేసుకుంటే మీదెంత పర్‌ఫెక్ట్ జోడయ్యేదో..." అంది చిన్నమ్మ.

    "నేను పెళ్ళి చేసుకొని, ఉద్యోగం మానుకొని వెళ్ళిపోతే మన అనిలనెవరు చదివిస్తారు? మీ పెన్షన్‌తో ఈ కుటుంబాన్ని ఈ స్థాయిలో పోషించగలరా?" కోపంగా అంది తను.

    "దాన్ని మేమే ఎలాగో చదివించుకునే వాళ్ళం. దాని చదువుకోసం నువ్వు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతావా? యేదో ఒక స్థాయిలో మేం బతకలేక పోయే వాళ్ళమా? నువ్వు ఇంత మంచి సంబంధాన్ని వదులుకోవడం యేమీ బాగాలేదే అపర్ణా!" అన్నాడు నాన్న.

    "ఉద్యోగం చెయ్యడమనేది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం నాన్నా! అతడెంత సంపాదించినా ఆర్థికంగా నేను నా కాళ్ళమీద నిలబడగల్గాలన్నది నా లక్షయం. దాన్ని నేను ఎవరికోసమూ వదులుకోదల్చుకోలేదు" అంది తను.

    "మనం యేమనుకుంటే యేం లాభం! యేదైనా రాసిపెట్టినట్టు జరుగుతుంది. వాళ్ళిద్దరికి ఆ భగవంతుడు రాసిపెట్టలేదు" అంది పెద్దమ్మ.

    "అందుకే మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అన్నారు" అంది లెక్చెరర్‌గా పనిచెస్తున్న చిన్నమ్మ.

    "కాస్త ఆలోచించి చెబుతానని చెప్పొద్దా... ఎందుకంత తొందరపడ్డావే... ఎంత చక్కటి సంబంధం...ఎంత పుణ్యం చేసుకుంటే అలాంటి అబ్బాయి దొరకాలి" అంది అమ్మ.

    "మీరేమన్నా అనుకోండి. ఉద్యోగం విషయంలో మాత్రం నో కాంప్రమైజ్...అతడెంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా... నేను ఇంట్లో కూర్చుంటే అతడెప్పుడో అప్పుడు యదన్న అభిప్రాయ బేధమొచ్చినప్పుడు 'నేను నిన్ను పోషిస్తున్నాను. నా మాట వినవా?' అంటాడు..." అంది అపర్ణ.

    "అంటే మాత్రం తప్పేముంది. భర్త భార్యను పోషించడం తరతరాలుగా వస్తున్న నీతే కదా! భరించేవాడు భర్త అన్నారు" అంది అమ్మ.

    "పుక్కిటి పురాణాలు నాకు చెప్పొద్దమ్మా" అంది తను. ఆ చర్చ అంతటితో ముగిసింది.

    ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటనకు సంబంధించిన ఈ దృశ్యాలన్నీ అప్రణ కళ్ళముందు కదలాడాయి.

    ఇతన్ని ఈ జీవితంలో మళ్ళీ ఇలా చూస్తానని ఆమె అనుకోలేదు.

    "ఇతన్నెక్కడో చూసినట్టుందే అపర్ణా!" అంది గుసగుసగా అన్నపూర్ణమ్మ కూతురు చెవిలో.

    "అవును... నాకు గుర్తొచ్చింది... ఈయనొకసారి నన్ను చూడటాని కొచ్చాడు" అంది అపర్ణ.

    అపర్ణ అన్న ఆ మాట అతనికి వినిపించింది.

    ల్యాప్‌టాప్‌లోంచి తలెత్తి అతడామెను కాస్సేపు ఆశ్చర్యంతో నిండిన కళ్ళతో చూశాడు.

    "మీపేరు అపర్ణ... మీరు ఆంధ్రాబ్యాంకులో పని చేస్తారు. రైట్?" అన్నాడతడు అదో మాదిరిగా...ఆఫ్టరాల్ నువ్వో బ్యాంకు ఉద్యోగివే అన్నట్టుగా.

    "యూ ఆర్ రైట్!" అంది అపర్ణ.

    ఇతనిలోని "వోవర్ స్మార్ట్‌నెస్" యేమీ తగ్గలేదు అనుకుంది.

    "మీరింకా ఆ బ్యాంకు ఉద్యోగమే చేస్తున్నారా?" అన్నాడతడు కొంచెం వ్యంగ్యంగా.

    "అవును... మీరింకా ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గానే పనిచేస్తున్నారా?..." అంది అపర్ణ అంతే వ్యంగ్యంగా.

    "లేదు నేనిప్పుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాను. నేనిప్పుడెంత సంపాదిస్తున్నానో మీరూహించలేరు" అన్నాడతడు చాలా గర్వంగా.

    "కొన్ని కోట్లా?" అంది అపర్ణ.

    "కాదు... కొన్ని లక్షలు"

    "కంగ్రాట్స్..."

    కాస్సేపు నిశ్శబ్దం.

    "ఈమె సువర్ణ... మై వైఫ్... ఈమె తెలుగు ఎం.ఏ. కానీ ఉద్యోగం చెయ్యడం లేదు... షీ ఈజ్ జస్ట్ ఎ హౌజ్‌వైఫ్...అండ్ వియ్యార్ హాపీ..." అన్నాడతడు.

    "నైస్ మీటింగ్‌యూ" అంది అపర్ణ సువర్ణకేసి చూస్తూ.

    "ఈమె అపర్ణ... ఎం.ఎస్‌సీ కెమిస్ట్రీ ఫస్ట్ క్లాస్. బ్యాంకు క్లర్క్‌గా ఉద్యోగం చేస్తోంది. మనవాళ్ళే... దూరపు బంధుత్వం కూడా ఉంది" అన్నాడు మహేందర్ అపర్ణను సువర్ణకు పరిచయం చేస్తూ.

    "మిమ్మల్నిలా కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నానండి" అంది సువర్ణ.

    "మీ తల్లిగారి ఊరు యేదమ్మ" అంటూ అన్నపూర్ణమ్మ సువర్ణతో మాట కలిపింది.

    ఫలానా ఊరని సువర్ణ చెప్పగానే ఆ ఊర్లో ఫలానా వాళ్ళు మీకు తెలుసా అని అన్నపూర్ణమ్మ అనడం, వాళ్ళు మా బాబాయి వాళ్ళేనని సువర్ణ బదులివ్వడం... ఇలా వాళ్ళు ముగ్గురు...అపర్ణ, సువర్ణ, అన్నపూర్ణమ్మ కబుర్లు చెప్పుకుంటోంటే మహేందర్ మళ్ళీ తన ల్యాప్‌టాప్‌లోకెళ్ళి పోయాడు.

    "మహబూబాబాద్‌లో జరుగుతున్న మా బంధువులమ్మాయి పెళ్ళి కెళ్తున్నామండి" అని సువర్ణ చెప్పింది. మహబూబాబాద్ స్టేషన్ రాగానే వాళ్ళు ట్రెయిన్ దిగి వెళ్ళిపోయారు. అపర్ణకు సువర్ణలోని సింప్లిసిటీ, కలుపుగోలుతనం నచ్చింది. అతనిలా ఆమె ఫోజు కొట్టడం లేదనుకుంది.

    "అతనితో నీ పెళ్ళి జరిగి ఉంటే ఎంత బావుండేదో... ఆ పిల్ల చూడు... చూడటానికి పెద్ద అందగత్తె కాదు... కానీ ఎంత అదృష్టవంతురాలో... అంత అందగాడూ, సంపన్నుడూ అయిన భర్త దొరికాడు" అంది అన్నపూర్ణమ్మ.

    "ఎందుకలా అంటున్నావు. ఇప్పుడు నాకేమయ్యిందని" విసుగ్గా అంది అపర్ణ.

    "యేమయిందేమిటి? నిన్ను చేసుకున్నవాడోచోట... నువ్వోచోట ఉద్యోగాలు వెలగబెడ్తున్నారు. నెలకో రెన్నెల్లకో కలుసుకుంటారు. ఓ అచ్చటాలేదు... ముచ్చటా లేదు... మిమ్మల్నిద్దర్నీ చూసిన వాళ్ళు అంత అనాకారివాడిని అంత అందమైన అమ్మాయి ఎలా చేసుకుందని కామెంట్స్ చేస్తుంటారు. నువ్వేమన్నా అను... నువ్వు చాలా పొరపాటు చేశావు...ఇంటిదాకా వచ్చిన అదృష్టాన్ని చేజేతులా..."

    "అమ్మా... ఇక ఆపుతావా నీ సోది" కోపంగా అంది అప్రణ. అన్నపూర్ణమ్మ నోరు మూసింది. అపర్ణ భర్త విశాఖపట్నంలో పని చేస్తాడు. అపర్నేమో వరంగల్‌లో... అందుకే అన్నపూర్ణమ్మకు తన కూతురి కాపురం విషయంలో తీవ్రమైన అసంతృప్తి యేర్పడింది. 

* * *

    ఇది జరిగిన రెండేళ్ళ తర్వాత ఓ పెళ్ళిలో అపర్ణకు మహేందర్ భార్య సువర్ణ కనిపించి

    "బావున్నావా అపర్ణా?" అంటూ పలకరించింది.

    అపర్ణ పక్కనే వాళ్ళమ్మ అన్నపూర్ణమ్మ కూడా ఉంది.

    "బావున్నామండి. మీరెలా ఉన్నారు?" అంది అపర్ణ.

    "ఫరవాలేదండి. యేదో రోజులు గడిచిపోతున్నాయి" అంది సువర్ణ.

    "మీవారెలా ఉన్నారు... ఈ పెళ్ళికి రాలేదా?" అంది అపర్ణ.

    సువర్ణ ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది.

    "మా వారు పోయారు!" అంది సువర్ణ.

    అపర్ణకు వెంటనే ఆమె యేమందో అర్థం కాలేదు.

    "వ్హాట్!మీవారు పోయారా?" అపర్ణ షాకైపోయి.

    "అవును... ఆర్నెల్లయ్యింది. సడెన్‌గా హార్ట్ఎటాక్‌తో పోయారు... హాస్పిటల్‌కు తీసికెళ్ళేంత టైమ్ కూడా లేకపోయింది" అంది సువర్ణ.

    "అయామ్ వెరీ సారీ!" అంది అపర్ణ చాలా బాధ పడిపోతూ.

    "మీ ఆయన పోయారా? మాకెవరూ చెప్పలేదే!" అంది అన్నపూర్ణమ్మ ఆశ్చర్యంగా.

    "మా మామగారు, మా చిన్నమామగారు కూడా హార్ట్ ఎటాక్‌తోటే పోయారు... వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది హార్ట్ ఎటాక్‌తోటే పోయారట?" అంది సువర్ణ.

    "మీకేమైనా పిల్లలా?" అంది అన్నపూర్ణమ్మ.

    "ఒక పాపండి" అంది సువర్ణ తన పక్కనే ఉన్న రెండేళ్ళ పాపను చూపిస్తూ.

    "పాప అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉంది" అనుకుంది అపర్ణ.

    ఆమెకు తెలియకుండానే అపర్ణ కళ్ళు చెమ్మగిల్లాయి.

    "అయాం రియల్లీ సారీ సువర్ణా..." అంది అపర్ణ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ.

    సువర్ణ కళ్ళళ్ళోకి కూడా నీళ్ళొచ్చాయి.

    "మన చేతుల్లో యేముంది... మనం కేవలం నిమిత్త మాత్రులం" అంది అన్నపూర్ణమ్మ.

    "మిమ్మల్ని రమ్మంటున్నారని" సువర్ణ కోసం ఎవరో వచ్చారు.

    సువర్ణ, పాప అక్కణ్ణించి కళ్యాణ మంటపం దిశగా వెళ్ళిపోయారు.

    "అందుకే మన పెద్దవాళ్ళన్నారు. పెళ్ళిళ్ళు చేసేటపుడు అటు యేడు తరాలు... ఇటు యేడు తరాలు- ఫ్యామిలీ హిస్టరీలు చూడాలని... యేమో అనుకున్నాను గానీ నువ్వే అదృష్టవంతురాలివే అపర్ణా!" అంది అన్నపూర్ణమ్మ.

    అపర్ణ ఆ మాట విని తనలో తను నవ్వుకుంది.

(నవ్య వీక్లీ సెప్టెంబరు 1, 2010 సంచికలో ప్రచురితం) 

  
Comments