తండ్రి పాదాలు - జి.సురేష్‌బాబు

    మధ్యాహ్నం ఒంటి గంట. సూర్యుడి ఒళ్లు ఎర్రబారి వేడెక్కినట్టే నర్సింహ కడుపు కూడా భగభగమని కాలుతోంది ఆకలితో. స్నానం చేసుకోడాన్కి వాగుకు బయల్దేరిన పన్నెండేళ్ల నర్సింహ, కంపముల్లు కాలికి గుచ్చుకోడంతో వేపచెట్టు కింద కాసేపు నిలబడ్డాడు. చెప్పుల్లేని కాళ్లకి భూమి వేసే వేడి దరువుతో నడక కథాకళే అయ్యి అలసట తెప్పిస్తోంది. కాలిముల్లు పీకి, కారే రక్తం మీద సన్నటి ఇసుక రుద్ది వుమ్మేసి లేచి నిలబడ్డాడు. ముల్లును దూరంగా విసిరి వాగొంక వెళ్లడాన్కి అడుగేయబోయిన అతనికి కొంచెం దూరంలో రేగు చెట్టు కనిపించింది.

    చెట్టునిండా నిగనిగలాడే రేగుపళ్లు. ఒక్క దూకుతో పరిగెత్తాడు నర్సిగాడు.

    "ఒరేయ్ నర్సిగా ... కాయలు తెంపమాకు. పండ్లే తిను'' సూచించింది దూరంగా పొలంలో పని చేసుకుంటున్న అవ్వ. ఆబగా రేగుపళ్లు తింటున్న నర్సివైపే వస్తూ అవ్వ మళ్లీ అరిచింది "రేయ్ బక్కోడా, లే ... ఆ బండ మీంచి లెగురా...''. ఆ అవ్వ వెంకట్రెడ్డి వాళ్ల నానమ్మ.

    "లెగురా సన్నాసోడా ...'' కొంచెం గట్టిగా అరిచిందీసారి.

    "ఏందే అవ్వా? బండమీద కూసుంటే తప్పా?'' లేస్తూ అడిగాడు నర్సి - రేగుపండును చప్పరిస్తూ.

    "అది వుత్త బండనుకున్నావ్రా? యెదవా ... ఓసారి సూడ్ర. ఏం కన్పడ్డయి?''

    విత్తును వుమ్మేసి బండ కేసి పరీక్షగా చూశాడు నర్సింహ.

    "రాములోరి పాదాలు రా అవ్వి ... పాపం తగులుద్ది'' అందావిడ బిత్తరపోయి చూస్తున్న నర్సింహను చూసి నవ్వుతూ. "అవ్వా , బండమీద విగ్రహం చెక్కుతారు గానీ, ఈ పాదాలు చెక్కడమేందే? మనం వీటికెందుకు మొక్కాల్నే? ఐనా, రాముని పాదాలని ఎవరు చెప్పా ...'' అడుగుతుండగానే అవ్వ నర్సిగాడి నోర్మూసింది.

    "అవ్వ! అపచారం! మనూరి నుండే రాముడు వనవాసం బొయ్యాడని మా నాయనమ్మ జెప్పేది. ఇయ్యి అవే అచ్చులు'' అంది రేగుచెట్టు నీడలో నేలమీద కూర్చుంటూ.

    " ... జనాల కోసం తల్లితండ్రిని, పెండ్లాన్ని, పిల్లల్ని కాదనుకుని రామరాజ్యం నడిపిన రాజాయన. ధర్మం, న్యాయం ఈ రోజున ఇంకా బతికున్నయ్యంటే గాయన పుణ్యమే నర్సిగా ...'' అంది వివరిస్తూ అవ్వ.

    నర్సి శ్రద్ధగా వింటుండగా మళ్లీ ఆవిడే "రాములోరు జీవితాంతం నడుస్తూనే ఉండాడు. మనం గూడ గట్లా నడవాలని, ఎక్కడ ఏం కష్టమొచ్చిన ఆగిపోవద్దని మనకి గుర్తు జేస్తయిరా ఈ పాదాలు'' అని, తెచ్చుకున్న సద్దిమూట విప్పి తినడంలో నిమగ్నమయ్యింది. ఆ క్షణం నుండీ .... రాములోరి పాదాల్ని విడువలేదు నర్సిగాడు.

* * *

    పుట్టినప్పుడే తల్లిని, తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని కోల్పోయాడు నర్సింహ.

    ఐదుగురన్నలు - తాను ఆరోవాడు. అందరూ తలా ఓ ఇంట్లో తలదాచుకుని కులవృత్తిలో స్థిరపడిపోతుంటే, నర్సి మాత్రం అన్ని కులాల వాళ్లిళ్లల్లో అన్ని పనుల్లో ఆరితేరుతున్నాడు. కానీ, కడుపునిండా తిండి మాత్రం ఏనాడూ దొరికేది కాదు. నిన్న సాలోళ్ల పెద్దమ్మ 'నెయ్యి అన్నం పెడతా'నంటే పొద్దంతా లేవకుండా మగ్గం మీదే కూర్చున్నాడు నర్సింహ. రాత్రయ్యే సరికి ఉత్త అన్నమే పెట్టింది పెద్దమ్మ - కారమేసి. "నెయ్యి ఏది పెద్దమ్మా?'' అని ఏడ్పు మొహంతో అడిగితే 'నేస్తే, అన్నం పెడతా'నన్నానని నవ్విందావిడ. బిక్కమొహమేసుకుని అలగబోయాడు నర్సి. ఎవరిమీద అలుగుతాడు! అయ్యా, అమ్మా, ఎవడురా నిన్ను భుజం మీదేసుకుని బుజ్జగించేది? తల్లిపాల రుచెరుగడు, తండ్రి జోల మత్తెరగడు. చిరిగిన నిక్కరులోంచి పిర్రల్ని కుట్టే ఎర్ర చీమల్ని రుద్దుకుంటూ మట్టినేల మీద అలికిన పేడను పీలుస్తూ పెరిగి పెద్దయ్యాడు నర్సింహ.

    వాగులో జలకాలాడి, తిరుగుబాటలో రాముని పాదాల బండ దగ్గరికి చేరుకుని, ఆ పాదాల వంక ప్రేమగా, జాలిగా, దీనంగా చూశాడు కాసేపు. రెండు చేతులూ రెండు పాదాల మీద ఆనించి "రామయ్యా... రెండ్రోజుల కోసారైనా తృప్తిగా భోజనం ఇప్పించవయ్యా'' అని వేడుకుంటూ తలను ఆ బండకానించి మొక్కాడు. రేగు చెట్టు తన నీడను అప్పటికే ఉపసంహరించుకోవడంతో బండ వేడెక్కి, నుదురు సుర్రుమని కాలింది.

* * *

     వారానికోసారే బడి మొహం చూసేవాడు నర్సింహ. బళ్లో పంతులు పాఠాలు నేర్పడమే కాక ఇంటికి తీస్కెళ్లి పప్పుతో భోజనం పెట్టేవాడు. "నర్సిగా, నువ్వు బాగా చదువుకోవాల్రా... చదువుకుంటే కలెక్టరాఫీసులో వుద్యోగం దొరుకుద్ది. నీ కష్టాలు గట్టెక్కుతై ...'' అని ఆశ కూడా కల్పించేవాడు పంతులు.

    "తిండికే దిక్కులేదు సారూ. పరీక్షలకు ఫీజులు, పుస్తకాలు, బట్టలు ఎవరిస్తారు? వాళ్లిండ్లల్లో పని చేస్తేనే ఇంత అన్నం దొరుకుతుంది. ఇంక చదువుకోవాలంటే కష్టం కదా సారూ'' నిరాశ పడేవాడు నర్సింహ.

    "నర్సీ ... నువ్వు తెలివైనోడివిరా. చదువు విడవకు. గవర్నమెంటు హాస్టల్లో చేర్పించి - పబ్లిక్ పరీక్ష ఇప్పిస్తా నీతోని'' మళ్లీ ఆశ పెట్టేవాడు పంతులు. వామ్మో! ఈ వూరినొదిలి టౌనుకెళ్లి హాస్టల్లో వుండి ... అంత 'పని' సాధ్యమేనా? రామయ్యా ... ఏమయ్యా?

    ఎలాగో హెచ్చెల్సీ పూర్తి చేయగలిగాడు పంతుళ్ల దయాదాక్షిణ్యాల పుణ్యాన. రాముని పాదాలు విడువకుండా ప్రతి నిత్యం స్మరించుకునేవాడు. గవర్మెంటుద్యోగం దొరికితే ఆ పాదాలకు గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడు. అడిగినదే తడవుగా అన్నీ జరిగినై. పెళ్లికూడానూ... సైకిలు, నవ్వారు మంచం కట్నం ఇచ్చి మరీ!

    "బాబూ, నర్సింహులు ఏదో గుడి ... క ... ట్టి ... స్తా ... న ...''

    రఘురాముడు తన విల్లును ఎక్కుపెట్టి ఎటువైపు గురి చూస్తున్నాడో అర్థం కాక చప్పున మెలకువొచ్చింది నర్సింహకు. పిల్లలు లవకుమార్, కుశకుమార్లను ముద్దాడి, తన మీద వున్న భార్య కాలును పక్కకు తీసి నిద్ర లేచాడు నర్సి.

    "పిల్లలు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్లే కట్టిస్తార్లెండి గుడిని'' సలహా ఇచ్చింది అర్ధాంగి.

    'దేవుడా ... నన్నాదుకున్నట్టే నా పిల్లల్ని కూడా ఉన్నత స్థితికి ...' మళ్లీ మొక్కాడు పాదాలకు మనసులో.

* * *

    "అరె! నిన్నకాక మొన్ననే కదా వాళ్ల పెళ్లిళ్ళైనై. కొంచెం గాలి పీల్చనీ వాళ్లను. కట్టకుండా సావ ము'' నిష్ఠూరమాడింది నడివయసు పెండ్లాం.

    "ఏంటి డాడీ! గుడి కట్టడమంటే ఈ రోజుల్లో మాటలా? ఆ పల్లెటూళ్లో ... అన్ని రోజులు అక్కడుండాలంటే ఎవరికంత టైముంది? ఐనా, ఇప్పుడా బండ వుందో, దాన్ని పీకి అవతల పారేశారో కనుక్కున్నావా?'' కొడుకుల నిరాసక్తత.

    "వెంకట్రెడ్డిగాడు నా క్లాస్మేట్. వాడి పొలంలోనే వుందా పాదాల బండ. వాడు ఆ మధ్యన మా ఆఫీసు కొచ్చినపుడు నా మొక్కు విని ఆనందపడ్డాడు'' అని చెప్పినా ఏం లాభం లేకపోయింది. తుడిచేవాడు లేడని తెలిసినా దుఃఖం మాత్రం రావడం మానుకోలేదెందుకో! క్లర్కుద్యోగం రిటైరయ్యాక వచ్చిన ఆరు లక్షల రూపాయల్ని పెద్దోడి కొడుకు గుండె ఆపరేషన్ కోసం, చిన్నోడి సంతాన సాఫల్యత కోసం సమర్పించుకున్నాడు నర్సింహ.

    'గుడి కడితే మీకీ సమస్యలు వచ్చేవి కావురా' అని కొడుకుల్ని నిలదీస్తే ... "సిల్లీగా వాదించొద్దు డాడీ! దేవుడేమైనా శాడిస్టా? ఇలా మన కుటుంబం మీద కక్ష పెంచుకుంటాడా? అలాంటి వాడు భగవంతుడెలా ఔతాడు? మన ఖర్మ ఇలా తగలబడ్డది. మా సంపాదనంతా ఎటు పోతుందో ఏమైపోతుందో. తిన్నది లేదు - తాగింది లేదు!'' అంటారు పిల్లలు.

    ఇంక సమయం వృధా చేయకుండా ఓ లక్ష రూపాయల దాకా పోగేసుకుని బ్యాగు సర్దుకొని భార్యతో సహా స్వగ్రామం బయల్దేరాడు నర్సింహ.

* * * 

     గుడి కట్టే విషయం ఊళ్లో చర్చనీయాంశమైంది. సర్పంచు తన పూర్తి సహకారమందించాడు. వెంకట్రెడ్డి తన వంతు డబ్బు సేకరించాడు. దొరవారు, పటేలు అందరూ తలా పదివేలిచ్చారు. ఇసుక, సిమెంటు, ఇటుకలు, సున్నం లాంటివి పుణ్య కార్యం పేరున తక్కువ ధరలో మాట్లాడి వచ్చాడు నర్సింహులు. పాత చుట్టాలింట్లో ఓ గది నివాసమేర్పరచుకున్నాడు. చిన్న స్టవ్వు. పాత నులకమంచం, గిన్నెలు ... అమరినై.

    ఆ ఊరి సిద్ధాంతితో ముహూర్తం పెట్టించి, పునాదులు తవ్వి పూజలు జరిపించాడు నర్సింహ. లవకుశలు హాజరవ్వనందుకు దంపతులిద్దరూ విచారపడ్డారు. "చవట సన్నాసులు! ఏ కష్టం తెలియకుండా పెంచి పెద్ద చేస్తే ఎక్కడ తెలుస్తాయి విలువలు?'' అంటూ వాపోయాడు నర్సింహ.

    రాముని పాదాలు ఊరికి కొంచెం దూరంగా పొలం మధ్య ఉండటంతో అక్కడే చిన్న పూరిపాక వేయించి అందులోనే సిమెంటు బస్తాలు, ఇసుక సంచీలు పెట్టించాడు. గ్రామ పంచాయితీ వాళ్లు ఊరి దారి నుండి పొలంలో కట్టే గుడివైపు కంకర పోయించారు తారు రోడు ్డకోసమని. గత వందేళ్లుగా పెద్దమార్పు చేర్పులకు గురవ్వని గ్రామమవ్వడం మూలాన అందరి దృష్టీ కొత్తగా కట్టే గుడిమీద పడింది. నర్సింహను అందలమెక్కించారు. ఎంతో కష్టపడి చదువుకుని గ్రామానికి సేవ చేయడాన్కి తిరిగొచ్చాడని పొగిడి పారేశారు. తలా ఐదూ పది రూపాయలు చందా వేసుకుని వేయి దాకా పోగేశారు.

    కానీ ఇంకా కావాలి ధన, మానవ సహాయం. ధ్వజ స్తంభం, రథం, ఉత్సవ విగ్రహాలు కూడా గుడి ప్రారంభోత్సవం వరకు తయారు చేస్తే బాగుంటుందని సర్పంచు ప్రతిపాదించడంతో నర్సింహ గుండెలో రాయిపడింది. "చూడు నర్సింహా ... జనాలు గుడికొచ్చి పాదాలున్న బండకు మొక్కి వెళ్తే కొత్తదనం ఏముంది? ఇన్నాళ్లూ అందరం అదేగా చేస్తున్నాం. అందుకే గుడికందం తేవాలని నిశ్చయించాం. నువ్వేం భయపడకు. పొరుగూళ్ల నుండి కూడా చందాలు సేకరిద్దాం'' సర్పంచు పార్టీ కార్యకర్తలు పట్టు వీడలేదు. అందరినీ కూడిపి కార్యాన్ని గట్టెక్కిద్దామంటే గట్టు ఎత్తు పెరిగినట్టయింది.

* * *

    మరుసటి రోజు తెల తెలవారుతుండగానే .. నర్సింహ భార్యకు కడుపులో నెప్పి మొదలయ్యింది. అప్పుడప్పుడూ వచ్చిపోయే నెప్పి - ఈసారి ఎక్కువెక్కువవడంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కారుమేఘాలు సూర్యోదయాన్ని తెలియనివ్వట్లేదు. ఊళ్లోని ఇద్దరు వైద్యులిచ్చిన సూది మాత్రలు తగ్గించినట్టే తగ్గించి హెచ్చింపజేసాయి నెప్పిని. వెంకటరెడ్డి కార్లో టౌనుకు ప్రయాణమయ్యారు - ఆవిడ గావు కేకల్ని తట్టుకోలేక. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో గ్రామం దద్దరిల్లింది. చూస్తుండగానే వాగు పొంగింది. రాముని పాదాలకు దరిదాపుల్లో వేపచెట్టు కింద కారును ఆపాల్సి వచ్చింది. రేగు చెట్టు విరిగి కుప్పకూలింది. కన్నీరు మున్నీరై వాన నీరులో కలిసిపోతావుండగా ...

    "యావండీ. ఇది రామయ్య పనే. గుడి కాలస్యమైతున్నందుకే! నేను ఆపకుండా వుండాల్సుండె. ఇంక తాత్సారం చేయ ... నా సొమ్ములు గూడ ...'' ఆమె మాటలు పూర్తి కాకుండానే కొంగుముడి కరిగిపోయింది.

* * *

    సరైన సమయానికి సరైన వైద్యం అందజేయలేకపోయినందుకే అమ్మ చనిపోయిందనే విషయం కుమారుల చూపుల్లో అర్థమవుతుండగా-నెల మాసికం పెట్టేసి ... ఊరికి తిరుగు ప్రయాణమవ్వబోయాడు నర్సిం హ. సంవత్సరీకం పూర్తయ్యాకే గుడి పనులు చూడాలని, కాదంటే అపచారమని ఊరంతా ఏకమై వారించింది. దాంతో ఊరి ప్రజలతోనే కాలక్షేపం చేయాల్సొచ్చింది. కొన్ని నెలలపాటు వాగు స్నానాలు, గౌండ్లాయిన ఆతిధ్యాలు, పట్టు మగ్గాలతో కుస్తీలు ...

* * *

    పాము - నిచ్చెన ఆటలాగా గుడి వ్యవహారం మళ్లా మొదట్నుంచి చూడాల్సొచ్చింది. తెచ్చిపెట్టిన సిమెంటు వర్షాలకు గడ్డకట్టి, ఇసుక చెల్లాచెదరై వరదల్లో కలిసి బురదైపోగా - కట్టిన పునాదులు విచ్చుకున్నై. జరిగిన నష్టం పూడ్చటం మామూలు విషయమేం కాదు. ఐనా - సన్నిహితుల సహకారంతో పైసా పైసా సేకరించి మళ్లీ ముహూర్తం పెట్టించి గోడలు, సింహద్వారం వరకు చేయించగలిగాడు నర్సింహ-పవిత్ర కార్యాన్ని ప్రజామోదంతోనే కానియ్యాలనే పట్టుదలతో.

    "ఒంటి చేత్తో ఎంతకని ఈదగలవు?'' వెంకటరెడ్డి ఇక నిస్సహాయత వ్యక్తపరిచాడు.

    సర్పంచి వచ్చే ఎలక్షన్ల కోసం పనుల్లో పడిపోయాడు. జనాలలో ఇప్పుడు చర్చనీయాంశం గుడి కాదు - రాబోయే జనరల్ ఎలక్షన్లు, లవుడు, కుశుడు ముక్తసరిగా, అసహనంగా ఉండటంతో ఇక వాళ్లని కదిలించే ప్రయత్నం మానుకున్నాడు. జీవితంలో సఫలమైనా - మొక్కు తీర్చడంలో కృతకృత్యుడు కాలేకపోయాడు. తనకి అడుగేయడం ఆపొద్దని స్ఫూర్తినిచ్చిన ఆ పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. రేగు చెట్టు అచ్ఛాదన కూడా కోల్పోయి, ఎండకు వేడెక్కిన బండ నుదురును సుర్రుమని కాల్చింది.

* * *

    ఓ అపజయమా! నువ్వేమంత గొప్పదానివి కావు. ఐనా ఇప్పుడు నిన్ను పంచుకుని తుంచేవాళ్లు లేకపోబట్టి ఒప్పుకున్నా, గొప్పదానివే! జయాపజయులను సమంగా జూచెడి ఓ యమపాశమా! దా! నా భవబంధాల్ని వదిలించు - నీయమ్మ - దావే! 999వ రామ శబ్దం రాస్తుండగా ... మృత్యుకోటి అప్పటికే పూర్తవడంతో రాక తప్పలేదు మృత్యువుకు - నర్సింహ తిట్లకు తట్టుకోలేక.

* * *

    అచేతనుడై - వీరస్వర్గం చేరిన ఆ మాసిన గెడ్డపు మహాయోధున్ని ఆయన కుమారులు హత్తుకున్నారు. గదిలో కుప్పలు కుప్పలుగా పడివున్న కాగితాలేంటా అని చూస్తే- చేతి రాతతో తయారుచేసిన చందా రశీదులు! చూసి హతాశులై విలపించారు ఆ ఇద్దరు. పెట్టెలో అమ్మవి మంగళసూత్రాలు, మెట్టెలు, చేతి గడియారం, పర్సులో నూటిరవై రూపాయలు, పసుపు గుడ్డలో మూటకట్టిన రూపాయి, అర్థరూపాయి బిళ్లలు. నాలుగొందల కన్న ఖరీదు చేయని బ్యాలెన్స్ లేని సెల్ ఫోన్, రెండ్రోజులుగా వెలగని పొయ్యి ... ఇవన్నీ చూస్తున్న వూరి జనం నర్సింహ చిన్నప్పట్నుంచి పడ్డ కష్టాలన్నీ పునఃశ్చరణం చేస్తుండగా, లవకుశులు - అపరాధ భావనాతప్తులై, శోకసముద్రులై ... తమ గుండెలోని కన్నీళ్లు పూర్తిగా యింకిపోకముందే ... వెంకట్రెడ్డి అంకుల్కి నిర్వహణ బాధ్యత అప్పజెప్పి ... గుడి పూర్తిగా కట్టించి, తృప్తిగా బండమీది పాదాలకు మొక్కారు. "నాయనా - చల్లబడు ఇంకనైనా .. రామయ్యా నువ్వైనా - చెప్పవయ్యా!''

    వాళ్ల నుదుళ్లకు - చల్లగా తాకింది బండ.

(ఆదివారం ఆంధ్రజ్యోతి జూన్ 19, 2011 సంచికలో ప్రచురితం)
Comments