తెల్లకాగితం-మల్లెపూలు - గొల్లపూడి మారుతీరావు

    
అభేరి మాధుర్యం కళామంటపాన్ని కస్తూరి పరిమళంలాగ చుట్టేసింది. త్యాగరాజు ప్రతీ హృదయంలోనూ ఊపిరి పోసుకుని మూర్తీభవించాడు. శ్రీరాముడు సారూప్యంగా వందలాది మంది సజల నయనాలముందు మూర్తి కట్టాడు. ప్రతీ హృదయం "ఖగరాజు గగనానికి యిలకు దూరంబని చనినాడో!" అని దేవుణ్ని పృచ్ఛిస్తోంది. అదొక తన్మయత్వం. మైకం. 

    పార్వతి ఆ రోజు సరస్వతి అయిపోయింది. అది ఆమెకు కొత్తకాదు. సభాసదుల్లో శంకరం ఉంటే స్వామిని సంగీతంలో సన్నిధిలో నిలుపుతుంది. ఆ తన్మయత్వం వ్యక్తిది. ఆ సంగీతం అతని కోసం. తన కళ అతని ముందు పాదాక్రాంతం చేస్తుంది. మరొక పక్క శేషయ్యగారు అర్థనిమీళితులయి ఆనందాశ్రువులు రాలుస్తూ కూతురి గానానికి పులకరించడం ఆమెకి సుపరిచితమయిన దృశ్యం.

    తన గొప్పతనం తనకి తెలుసు. తనని మెచ్చుకొనే అభిమానుల ముందు గర్వంగా తల పంకిస్తుంది పార్వతి. కాని శంకరం ముందు తన గర్వం, అహంకారం ఏమైపోతుందో తెలీదు. ఒక భక్తురాలయి పోతుంది. శంకరం పాడుతాడు. ఏ విధంగానూ ఆమె ప్రతిభకూ అతనికీ యోజనాల అంతరం. కాని అతని మెచ్చుకోలుకు అర్రులు జాస్తుంది పార్వతి. 

    "సింహేంద్ర మధ్యమం తానం చాలా బాగా పాడావు. కాని కల్యాణి స్వర కల్పన మరీ ఎక్కువైంది" అంటే సవినయంగా అతని సమీక్షను అంగీకరిస్తుంది. 

    "నిన్ను చూశాకే వాగధీశ్వరి ఎత్తుకున్నాను - నీకిష్టమని" అంటుంది ఆర్ద్రంగా.

    "శంకరాభరణం పై షడ్జమంలో స్వరం దెబ్బతింది" సిగ్గుపడదు. తన లోపాన్ని అతను కనిపెట్టగలిగినందుకు గర్వపడుతుంది. వాళ్ళిద్దరి మనస్సులూ మాట్లాడుకొనే భాష అది. ఆ భాష పార్వతికి అత్యంత ప్రీతిప్రదమయింది. బీచిలో ఒడిలో ఆమె తలపెట్టుకొని "ఏదీ నా కోసం - ఆ పాట -" అంటే పాడడానికి భయపడుతుంది. గొంతు బాగులేదని మొరాయిస్తుంది. చెక్కిళ్ళు రాసి తల నిమిరి - ఆ పల్చటి పెదాల దగ్గర తన చెవి ఆనించి - ఆప్యాయంగా, రహస్యంగా పాడించుకు వింటాడు శంకరం.

    శంకరాన్ని ఆనందపరచడానికి తనకి సంగీతం కలిసివచ్చినందుకే సంగీతాన్ని గౌరవిస్తుంది పార్వతి. లేకపోతే ఈ సంగీతం ఏం చేసుకోను? ఆ మాట వింటే శేషయ్యగారికి కోపం.

    ఆయన తన పేదరికాన్ని, జీవితంలో అపశృతుల్ని మేళవించి - సంగీతంలో ఒక ఆటవిడుపును ఎంచుకున్నారు. ఆయన గొంతులో మాధుర్యం తక్కువ. కాని పట్టుదల, స్థిరమైన ఏకాగ్రత, అహంకారం ఎక్కువ. సంగీతంమీదా, సాహిత్యంమీదా తిరగబడతారు శేషయ్యగారు. ఎప్పుడో చిన్నప్పుడు పార్వతి తల్లి చచ్చిపోతే - పార్వతి పొట్టి జడ అల్లి, పరికిణీకట్టి తన ఒడిలో కూర్చోబెట్టుకుని సరిగమలు నేర్పారు. విసుక్కునే ఆ పసిపిల్ల హృదయానికి రాబోయే జీవితంలో ఎదురయ్యే అపశృతుల్ని ఎదుర్కొనే కవచాన్ని అప్పుడే సిద్ధం చేశారు.

    "ఏమిటి నాన్నా ఈ గొడవ!" అంటే-

    "కాదమ్మా. సంగీతం కష్టాల్లో కన్నీరు తుడుస్తుందమ్మా. నేను పోయినా ఎవరు నీ మనస్సును గాయపరచినా అతుకు వేస్తుంది. నీకు మెత్తెని చేదోడు అవుతుంది. స్నేహితుడిలాగ సరసని నిలిచి భుజం తడుతుంది" అని బుజ్జగించి సరళస్వరాలు నేర్పారు. ఆమెది తల్లి గొంతు. తండ్రి కంఠంలోని పొగరూ, తల్లి స్వభావంలోని మాధుర్యం ఆమె గొంతును పలికించాయి. 

    ఇనేళ్ళ తర్వాత - తన కళకి అపురూపమయిన ప్రేక్షకుడు లభించినట్టు శంకరాన్ని చూశాక పార్వతి తలపోసింది. స్వభావంలో, మనో ధర్మంలో - అన్నిటా తనకంటే ఒక స్థాయి తక్కువ శంకరం. కాని - తన హృదయం మాట్లాడే భాష అతనికి తెలుసు. తనకి పొగడ్త కంటె విమర్శ కావాలని తెలుసు. సంగీతం పార్వతికి దాసోహం చేస్తే - ఆమె శంకరానికి దాసోహం అంటుంది. 

    వయస్సులోని ఆవేశం, నాన్న ప్రోత్సాహం పెట్టుబడులుగా ఒక మైకంలో యిదే కళామంటపంలో కచ్చేరీ చేస్తున్నప్పుడు, ఆమె పద్దెనిమిదో ఏట తారసపడ్డాడు శంకరం. ఆమె పాటకి సభాసదులంతా ముగ్ధులయి ఉర్రూతలూగి పోతుంటే - పరివారాన్ని క్షమించే మహారాజ్ఞిలాగ వారు మధ్యనుంచి నడిచి పోతున్న పార్వతి మొదటిసారిగా అతన్ని చూసింది. స్తంభాన్నానుకొని నిలబడి సిగరెట్టు కాలుస్తున్నాడు. అతని నిర్లక్ష్యం ఆమెని ఆశ్చర్యపరచింది. అతని ముందు క్షణ కాలం ఆగింది. ఒక సామ్రాజ్ఞాభినేత్రి ఒకానొక సామంతరాజుకి యిచ్చే అవకాశంలాంటిదది. శంకరం ఆమె వేపు తిరిగి - "పాట బాగుంది. కాని కంఠంలో గడుసుదనం లేదు. ఆవేశం ఉంది కాని తూకం లేదు" అన్నాడు. కాని పార్వతి జీవితంలో విన్న మొదటి విమర్శ అది. నిర్ఘాంతపోయింది. విమర్శకుడు విలక్షణంగా కనిపించాడు. ఆ విలక్షణాన్ని 'ప్రేమ' అని అతి త్వరలో గుర్తుపెట్టుకుంది పార్వతి.

    మరో కచ్చేరికి పనికట్టుకు ఆహ్వానించింది శంకరాన్ని. చిరునవ్వుతో, తనని మెప్పించాలనే ఆమె తాపత్రయాన్ని మెచ్చుకున్నాడు. కాని పాటని కాదు. ఆమె అహంకారం రగిలింది. తన చుట్టూ కట్టుకొన్న అందమయిన కోట ఆ అహంకారం. అది తండ్రి వారసత్వం. దాన్ని ఛేదించిన మొదటి వ్యక్తి శంకరం. ఆ తర్వాత సభాసదుల హర్షధ్వానాలు ఆమెని ఆకర్షించడం మానేశాయి. తండ్రి ఆనందం తృప్తినివ్వడం మానేసింది. శంకరం మెప్పుదల కావాలి. తన బ్రహ్మర్షిత్వాన్ని అంగీకరించాల్సిన విశ్వామిత్రుడు శంకరం.

    "ఎలా పాడాలో నువ్వు నేర్పవూ? రాగాలాపన అవీ చూపించవూ?" అని అతన్ని ప్రాధేయపడితే ఆమె అబలత్వానికి మురిసి పెదాల నిండుగా ముద్దుపెట్టుకొనేవాడు శంకరం. ఆమెలాగ గొప్పగా పాడటం శంకరానికేం తెలుసు?- ఆమెలో నాలుగోవంతు ప్రతిభ అయినా అతనికి లేదు. విమర్శకుడు కళాకారుడు కాదు. శేషయ్యగారు మహర్షి. అంతటి హిమవంతుడిని పక్కన పెట్టుకుని మంచు ముక్క కోసం అర్రులుజాచడం అభిరుచి దారిద్ర్యమని తెలుసుకునేంత పెరగలేదు పార్వతి.

    శేషయ్యగారికి ఈ ప్రేమ ఆలశ్యంగా తెలిసింది. కూతురి పాటలో ఏకాగ్రత దెబ్బతింటుందని గ్రహించి కలవరపడి పోయాడు మొదట - కారణం అర్థం కాలేదు. కాని సభలో తప్పనిసరిగా కనిపించే ఆ ప్రేక్షకుడి నుద్దేశించి - కచ్చేరీ సాగుతోందని గ్రహించి కాస్త ఆందోళన పడ్డాడు. కళలో అపశృతి జీవితంలో పలకకుండా జాగ్రత్తపడడం ఎలాగో తెలీక రహస్యంగా మథనపడ్డారు. అప్పటికే వాళ్ళ ప్రేమ శృతిమించింది.

    ఆవేశం, పొంగులువారే ఉద్రేకం కళ నేర్పింది పార్వతికి. దానికి ఆనకట్ట కట్టడం జీవితం నేర్పలేదు. తండ్రి అడగలేక అడగలేక అడిగితే శంకరాన్ని పెళ్ళిచేసుకోడానికి నిశ్చయించుకున్నానంది. తండ్రి నిర్ఘాంతపోయాడు. సంప్రదాయం మీద తిరగబడడం తన స్వభావమే కదా? - కాని హర్షించలేక పోయాడు. ఎందుకని?  శంకరం పార్వతికి తను ఊహించిన భర్త కాదు.

    జీవితం కళతో కలియబడింది. శంకరంతో గడిపే అవకాశం కోసం ఎన్నో కచ్చేరీలను అవలీలగా వదులుకుంది పార్వతి. అది త్యాగమని శంకరం భావించలేదు. భావించాలని ఆవిడ ఆశించలేదు. కాని శేషయ్యగారు ఏదో గొప్ప ఐశ్వర్యం చేతులు జారిపోతున్నట్టుగా చిత్రవథని అనుభవించారు. ఆయన కార్యవాది. పరిస్థితిని అరికట్టే అవకాశం లేదని గ్రహించాక యిక ఆలశ్యం చెయ్యలేదు. శంకరం పూర్వాపరాలను విచారించి యిద్దరికీ పెళ్ళి చెయ్యాలని నిశ్చయించారు. పార్వతి ఆనంద పడిపోయింది. ఈ విషయంలో శంకరాన్ని సంప్రదించవలసిన పనేలేదు. కనక, అతనికి చెప్పనైనా చెప్పకుండా అతని వూరుకి బయలుదేరారు శేషయ్యగారు. అంతే. అతనికి అక్కడే మొదటిసారిగా గుండెపోటు వచ్చింది. నిలువునా కూలిపోయారు. శంకరానికి పెళ్ళయి అయిదేళ్లయింది. ఇద్దరు పిల్లలు. స్ట్రెచర్‌లో ఇంటికితిరిగి వచ్చిన తండ్రిని చూశాక దానికి కారణం విన్నాక పార్వతికి కన్నీళ్ళు రాలేదు. ఆర్ద్రత కళది - స్వభావానిది కాదు. కళ్ళు నిప్పులు కక్కాయి. హఠాత్తుగా మనస్సును ఖాళీచేసుకోవడం ఎలాగో తెలియలేదు. కసిగా శంకరాన్ని ఆలోచనల్లోంచి బయటకి గెంటడానికి చిత్రవథని అనుభవించింది. అది ఆమెకి కష్టంకాదు. ఆమె వ్యక్తిత్వంలో 'నేను' అనే ఆలోచన గొప్పది. బలమైనది. కళ ఆమెకి సాధుత్వాన్ని యివ్వలేదు. క్రూరంగా తనమీద తనే ఆంక్షల్ని విధించుకొంది. తనని తనే శిక్షించుకొంది. ఆమెలో ప్రేమించే భాగాన్ని క్రమబద్ధంగా చంపడం ప్రారంభించింది. కసిగా కచ్చేరీలు చేసింది. ఈసారి గానంలో తన్మయత్వం లేదు. కేవలం 'పరారి' వుంది. పాట తనకి చెప్పలేని ఒక బాధ నుంచి పారిపోవడానికి ఆధారం. ఇదివరకులాగ ప్రేక్షకులు తన్మయులు కావడం లేదు. ఇదివరకటి కళాస్వరూపం వాళ్ళముందు సాక్షాత్కారించడం లేదు. ఇది కేవలం ఆవేశం. ఇందులో హృదయం లేదు. ఇది అలరించే గానం కాదు. రగిలే అగ్నిపర్వతం. ఆమె ప్రతిభకి ఆశ్చర్యపడ్డారు. కాని ఆనందపడలేకపోయారు. అయితే ఆవిడ లక్ష్యం ఎప్పుడూ వాళ్ళని ఆనంద పరచడం కాదు. ఇప్పుడు ఆ లక్ష్యం గురితప్పింది అంతే.

    ఒక సంవత్సరం గడిచింది. శేషయ్యగారు కోలుకొన్నారు. కూతురి గానంలో మార్పు ఆయనకి అర్థమయింది. కాని యిప్పుడు ఆయన చేయగల్గింది ఏమీలేదు. వేదికమీద కూర్చుని తనని దహించుకునే ఆ ప్రక్రియని నిస్సహాయంగా గమనించేవారు. రేకులు విచ్చి పువ్వులు పూసే అందమయిన వృక్షం యిప్పుడు ఒడిలి వాడిపోయే ప్రయత్నాన్ని ప్రయత్నపూర్వకంగా సాగిస్తోంది. ఆమెలో రాజసం కూడా తన స్వభావమే. అది గుర్తుపట్టారు. విషాదకరమయిన చిరునవ్వు నవ్వుకొన్నారు. గంభీరంగా అర్థంచేసుకుని పరిస్థితిని అంగీకరించారు. ఒక గొప్ప విద్వాంసురాలు వేదికమీద క్రమంగా జీర్ణమయే కార్యకలాపాన్ని గమనించడం అలవాటు చేసుకున్నారు. 

    ఈ సమయంలోనే ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. 

    ఇదివరకు వేదికమీద కూర్చున్నప్పుడు ఆమెకు ఒక్కరే - కాదు యిద్దరే కళ్ళముందు కదిలేవారు. ఒకరు శంకరం, రెండు తండ్రి. ఇప్పుడు మొదటిసారిగా ప్రేక్షకులు ఆమె దృష్టిలో పడడం ప్రారంభించారు. ఏకాగ్రత చెదరడానికి అది గుర్తు. కళామంటపంలో ఆమె కచ్చేరీలలో తరచు ఒక వ్యక్తి ఎక్కడో ఒక మూలని ద్వారం దగ్గరగా కూర్చుని కళ్ళు మూసుకుని కచ్చేరీ అంతా వినడం గమనించింది. మొదట అతన్ని అంతగా పట్టించుకోలేదు. అతను అతి సామాన్యమయిన మనిషి. పదిమందిలో ఒకడు. ఏ చైతన్యం లేకుండా నిర్లిప్తంగా కచ్చేరీ వినేవాడు. ఆమె పాటకి కనీసం చలించనయినా చలించినట్టు కనిపించేవాడు కాదు (దానికి కారణం అతని అజ్ఞానమని ఆలశ్యంగా గుర్తుపట్టింది పార్వతి. శంకరం నిశ్చలంగా ఉండడానికి తన అభిరుచి దాకా రాని అతని విద్వత్తు అయితే సూర్యారావు  నిశ్చలతకి కారణం ఆ రుచికి అర్థం తెలీకపోవడం) ఒకరోజు పనికట్టుకొని అతన్ని పలకరించింది. 

    "నా పాటంటే మీ కిష్టమా?"

    ఏదో తప్పుచేసినవాడిలాగ సిగ్గుపడుతూ నవ్వాడు.

    "నా ప్రతీ కచ్చేరీకి వస్తుంటారా?"

    తలూపాడు ఇక్కడా 'నా' ఉంది. సమాధానం ఆమెకు తృప్తినిచ్చింది. శంకరంలో ఉన్న తిరుగుబాటు అతనిలో లేకపోవడం అందంగా కనిపించింది. అతనికో వ్యక్తిత్వం అంటూ లేదు. ఎదుటి వ్యక్తిని కూడా ఒరుసుకొని, ముంచేసే వ్యక్తిత్వం ఆమెది. అతని ముందు తన వ్యక్తిత్వానిది పైచెయ్యి. తన అహంకారానికి రాణింపు ఉందిగా?- దానికి 'ప్రేమ' అని గుర్తు పెట్టుకుంది కాని ఈసారి శంకరం విషయంలో చేసిన పొరపాటు చెయ్యలేదు. రెండోసారి చేసిన దిద్దుకోలేని పొరపాటు అది. ఏమిటి? నిషిని అర్థం చేసుకోవటం? అదే పొరపాటని ఆమె గ్రహించేసరికి వేళ మించిపోయింది. సూర్యారావుని పెళ్ళిచేసుకొంటానని తండ్రితో చెప్పినప్పుడు శేషయ్యగారు మొదట నిర్ఘాంతపోయారు. సూర్యారావుని చూసి మరీ నిర్ఘాంతపోయారు. ఏ విధంగా చూసినా ఆమెకూ అతనికీ పోలిక లేదు. ఇద్దరి మధ్యా యోజనాల దూరం. ఆ విషయాన్ని అతను సుళువుగానే గ్రహించారు. కాని పార్వతి పాతగాయానికి చికిత్స కావాలి. శేషయ్యగారికి ఆమెకి కొత్తగాయం తగలకుండా రక్షణ కావాలి. 

    "నీకు పెళ్ళయిందా?" అర్థంలేని కొత్త ప్రశ్న వేశారు. ఫక్కున నవ్వాడు సూర్యారావు. లేదన్నాడు.

    పెళ్లి జరిగిపోయింది. ప్రేమకి - అందులోనూ పెళ్ళికి - ఇది సహజమయిన ప్రాతిపదిక కాదు. ఈ పెళ్ళి ఒక పరారి. దేనినుంచి? ఒక ప్రేమ వైఫల్యం నుంచి. విముక్తి - దేనినుంచి? మరొక ప్రేమ తాకిడి నుంచి. పెళ్ళి అతి సామాన్యంగా జరిగింది. పార్వతి వంటి కళాసరస్వతి వివాహం ఎంతో వైభవోపేతంగా జరగాలని శేషయ్యగారి కల. కాని ఈ పెళ్ళి ఒక రాజీ. అది అతనికీ తెలుసు. పార్వతికి ముందే తెలుసు. ఆమె ఎవరిమీదో కసి తీర్చుఓవాలి. కాని ఆమె కసి తీర్చుకొన్నదని గ్రహించే వ్యక్తి ఎప్పుడో ఆమె జీవితం నుంచి మాయమయాడు. ఇక యిప్పుడెందుకీ ప్రయత్నం? ఇది అర్థం లేని కసి - ఆ విషయాన్ని ఆమె అర్థంచేసుకోలేదు.

    కాని పెళ్ళయాక చాలా విషయాలు ఆమెకి అర్థమయాయి. అతను తన సంగీతాన్ని వినడానికి కళామంటపానికి రావడం లేదు. అతను కళా మంటపంలో గుమాస్తా. కచ్చేరీ అయేవరకు అక్కడ ఉండడం అతని విధి. అతని బాధ్యత. అతని లక్ష్యం కళ కాదు. పొట్టపోసుకోవడం. కళామంటపంలోకాక, రైల్వే షెడ్డులో ఉద్యోగం దొరికితే అక్కడే ఉద్యోగం చేసేవాడు. అంతవరకు అయితే ఫరవాలేదు. మొదటినుంచీ కళాకారులమధ్య ఉంటూ, వాళ్ళు తన ఉనికినే పట్టించుకోకుండా తనని ఒక పురుగులాగ పరిగణించడం చూశాడు. అందుకనే అతనికి పాటన్నా, ఆ మనుషులన్నా ఒక ఏహ్యత, కోపం ఏర్పడింది. మరి పార్వతిని ఎందుకు పెళ్ళి చేసుకున్నాడు. తనదంటూ ఒక అభిప్రాయంలేక, పెళ్లిచేసుకోవాలి కనక. తనంతట తనే చేసుకొంటానంది కనక.

    పార్వతికి పెళ్లయాక తగిలిన మొదటి షాక్ - సంగీతమంటే అతనికి ఏమాత్రం తెలియకపోగా, ఒక విధమయిన విరక్తి అనీ, చికాకు ఉన్నదనీ, ఆమె జీవితంలో ఒక అమూల్యమయిన వ్యక్తిత్వానికి పొంతన లేదనీ, శంకరానికీ తనకీ ఒద్దికగా కలిసివచ్చే 'భాష', వారిద్దరినీ దగ్గరచేసిన 'భాష' యిప్పుడు వ్యర్థమయింది. ఆ వ్యక్తిత్వం మూగపోయింది. కాగా ఆ వ్యక్తి తనకి బద్ధశత్రువు. దాని పోషకుడయాడు. 

    పార్వతి ఇంట్లో సాధనచేస్తే అతనికి తేళ్ళూ, జెర్రులూ పాకినట్టుండేది. విసుగూ, కోపం వచ్చేది. అక్కడ కళామంటపంలో విద్వాంసులు పాడడం వాళ్ళ హక్కు - ఇక్కడ ఈ విద్వాంసురాలి పాట ఆపగలగడం తనకి ఉన్న అధికారం. అతని మనస్సులోని కసినంతా ఆమె పాటని అసహ్యించుకోవడం  ద్వారా తీర్చుకోగలిగాడు. 

    "ఎందుకాపాట? నలుగురి ముందూ కూర్చుని పాడదం నాకు నచ్చదు. ఆ గాడిదలని ఆనందపరచడానికి నువ్వెందుకు శ్రమపడాలి" -

    "మరి ఆదాయం?"

    "నేను సంపాదిస్తాను."

    "గుమాస్తాగా పనిచేశా?"

    చెంప ఛెళ్లు మనేది. పార్వతి జీవితంలో అది సరిదిద్దలేని అపశృతి. ఇది ఎవరికీ - కేవలం శేషయ్యగారికీ చెప్పుకొనేది కాదు. కారణం - సంసార జీవితం గుంభనగా ఉండాలన్న తాపత్రయం కాదు. తన ఓటమిని ఎవరూ గుర్తుపట్టకూడదన్న అహంకారమే. జీవితంలో ప్రతీ దశలోనూ ఎదురయ్యే ప్రతీ కష్టానికీ, నష్టానికీ ఒక్క అహంకారమే కొత్త అన్వయాన్ని యివ్వగలదు. అది 'ఆత్మవంచన' అని అర్థం చేసుకోలేని తృప్తిని అదే యివ్వగలదు.

    భర్త చేతుల్లో జరిగే అవమానాలను ఎవరికీ చెప్పుకోకూడదు. అది భార్య ధర్మం. 'అహంకారం' అందించే కారణం. తన ఓటమి ఎవరికీ అర్థం కాకూడదు.

    భర్త ద్వారా గుర్తింపు లేకపోయినా భార్యగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి - 

    అది పాత్రివ్రత్యం కారణం. తను వీగిపోవడం తన అహంకారాన్నే దెబ్బ తీస్తుంది కనక.

    అతని అభిరుచి మేరకు అవసరమయితే సంగీతాన్నీ, పదిమందిలో కీర్తి ప్రతిష్టల్నీ అన్నిటినీ వదులుకోవాలి. అది భార్యల విచక్షణ. కాని కారణం నిస్సహాయమయిన ఒదుగుబాటు. ఆ ఒదుగుబాటుకి తను 'త్యాగం' అని గుర్తుపెట్టుకొంది.

    తనకి నచ్చని విషయాలమీదా, తను జీవితంలో అసహ్యించుకొనే విషయాలమీదా తిరగబడి సూర్యారావు తృప్తిపడితే, అతనికి యిష్టంలేని అరలన్నీ క్రమక్రమంగా మూసివేసి ఆమె తృప్తిపడింది. ఇద్దరు రెండు విధాలుగా ఒకరినొకరు నాశనం చేసుకోవటం ఇద్దరూ గుర్తుపట్టలేదు. అదీ వాళ్ళ అదృష్టం.

* * *   

    సూర్యారావు అనాథ శరణాలయంలో పెరిగాడు. తల్లి అతన్ని చిన్నతనంలోనే అక్కడ వదిలిపోయింది. ఎందుకో అతనికీ తెలీదు. ఎప్పుడు అతను తల్లిని చూడలేదు. అనాథ శరణాలయంలో అతనికి ప్రత్యేకమైన ఆదరణ ఏనాడూ లభించలేదు. ప్రతీరోజూ అతనికి రెండు పూటలా భోజనం కావాలంటే అక్కడ అధికారులు చెప్పిన మాటల్లా వినాలి. అణకువగా పని చెయ్యాలి. కోపం తెచ్చుకొనే హక్కులేదు ఉంటే రోజు గడవదు గనక. ఇప్ప్పుడు తన చెప్పుచేతల్లో ఉన్న వ్యక్తి దొరికింది. చిన్నతనం నుంచీ తనని సాధించే ప్రపంచం పట్ల కోపం తగ్గలేదు. తనకి వేళకి అన్నం పెట్టకుండా వాళ్ళు బాధ పెట్టిన సంద్రభాలు కోకొల్లలు. పెళ్లాంమీద కోపం వచ్చినప్పుడు, వేళకి అన్నం తినకుండా, ఆమెని తిననివ్వకుండా ఆపుజేయడంలో తనకొక తృప్తి. తను పడిన బాధ మరొకరు పడేట్టు చేసే అందమయిన అవకాశం పెళ్లి అని గుర్తుపట్టాడు సూర్యారావు. క్రమబద్ధంగా ఆ బాధను ఆమెకు పంచిపెట్టాడు.

    పార్వతికి మల్లెపూలంటే మహాప్రీతి. కచ్చేరీకి బయలుదేరే ముందు శేషయ్యగారు పనికట్టుకొని తలనిండా పెట్టుకోవడానికి పువ్వులు కొనితెచ్చి కూతురికిచ్చేవారు. పెళ్లయాక జీవితంలో భర్తని కోరిన మొదటి కోరిక

    "ఏమండీ - మల్లెపువ్వులు కొనుక్కొనేదా?"

    "వద్దు"

    "ఎందుకు?" - కారణం ఏం చెప్పాలో అతనికి మాత్రం ఏం తెలుసు? - వద్దు అనడం ఆమెని బాధ పెడ్తుందని తెలుసు. అది అతని విజయం.

    "పువ్వులు వాడిపోయి ఇంటినిండా పడతాయి. రాత్రి పక్కంతా ఖరాబవుతుంది" నవ్వుకొంది పార్వతి.

    "పాట పాడుకొనేదా?" 

    "వద్దు"

    "ఎందుకు?" ఒక గొప్ప విద్వాంసురాలి నోరు మూయించగలిగాను. రెండో విజయం.

    "పాట రోజుగడవని వాళ్ల వృత్తి. నీకేం అవసరం."

    కంటతడి పెట్టుకొంది పార్వతి.

    "సినిమాకి వెళ్దామా?"

    "వద్దు"

    "ఎందుకు?" - భార్య కోరింది గనక.

    "ఆ సినిమాలు నా కర్థంకావు. చికాకు."

    అర్థం చేసుకుంది పార్వతి. భర్త ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ని.

    భర్త కథలు రాస్తాడని ఒకరోజు అతని పెట్టె సర్దుతూండగా అర్థమయింది పార్వతికి. పొరపాటు. కథలు రాస్తాడని కాదు - కథ - ఒకే ఒకటి రాశాడని - ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక కథ వుంటుంది. సూర్యారావుకీ ఒకటి వుంది. తల్లి ఆదరణకి దూరమయి, ప్రేమ పంచలేని వ్యక్తుల దయాధర్మం మీద పదిహేను సంవత్సరాలు నికృష్టంగా గడిపిన కథ. తన చుట్టూ ఉన్న సమాజం క్రూరత్వం మీద తన కోపాన్ని, అసహ్యాన్ని ప్రకటించే కహ్త. అది విచక్షణతో రాసింది కాదు. తనకు జరిగిన అవమానాల తోరణం. కారణాలు శోధించి వ్రాసింది కాదు. ఆ రోజుల్లో తన కోపం వెళ్ళగక్కడానికి చేసిన ప్రయత్నం - ఆ కథ బహుశా ఎవరూ చదివి ఉండకపోవచ్చు, పార్వతి తప్ప. తెల్లకాగితాలు ఎరుపయి, వూసి, అంచులు చిరిగి ఉన్నాయి. ఆ కథ కాక తెల్లకాగితాలు గుచ్చిన అట్ట కూడా ఉంది. కాగితాలు ఎరుపెక్కాయి.

    "మీరు కథలు రాస్తారా?" అని పార్వతి అడిగితే, మొదట సూర్యారావే ఆశ్చర్యపోయాడు. తరువాత గుర్తుకొచ్చినప్పుడు "మళ్ళీ రాయలేదేం?" - కారణం ఏం చెప్పాలో సూర్యారావుకే తెలియలేదు, తరువాత గడిపిన జీవితంలో కథ లేదు గనుక.

    శరీరం వాంఛ కోరిక మీద పార్వతికి విచిత్రమయిన అభిప్రాయాలున్నాయి. అవి ఆలోచించడానికయినా అర్హత లేని అతి చిన్న విషయాలని ఈ అభిప్రాయం. గంభీరమయిన కళని సాధనచేసిన ఓ కళాజీవి బలహీనమయిన గొంతు ఆ కళ సత్త్వ ప్రధానం. కాని తండ్రినుంచి పుణికిపుచ్చుకొన్న అహంకారం రజోగుణం. బలహీనమయిన ఈ సత్యాన్ని బేధించిపోతే - ఏ మనిషిలోనయినా అతి సుళువుగా రెచ్చే పశుప్రవృత్తి ఆమెలో అతి సుళువుగా రగుల్కొంటుంది.

    ఆ ప్రవృత్తికి బంధువయిన 'అహంకారం' ఆమె కొంగుబంగారం కనక, సూర్యారావుకి ఆ ప్రయత్నమే అనవసరం. అతని కాంప్లెక్సుకి మరొక రూపమే పశుప్రవృత్తి. అందుకని - ఆమె గర్భవతి కావడానికి అట్టేకాలం పట్టలేదు. అప్పటికి ఒక గొప్ప గాయకురాలు పూర్తిగా సమాధి అయింది. ఒక అసమర్థుడి భార్యగా, కనిపంచని వ్యక్తిమీద కసి తీర్చుకున్న తృప్తి ఎదురయ్యే అనర్థాలను అంగీకరించని ఒక మొండితనంతో బతికే వ్యక్తిగా మాత్రమే మిగిలింది.

    శేషయ్యగారు జీవచ్ఛవం అయారు. కూతురులో కళాకారిణి భవిష్యత్తుకి ఏనాడో ఆశలు వదులుకున్నారు. తల్లి కాబోతోందని విని ఒక నిరాశాజనకమయిన జీవితానికి అది 'బోనస్' అనుకొని ఆనందించారు.

    పార్వతికి ఇది కొత్త పాత్ర. గడుస్తున్న జీవితంలో ఆనందం కనిపించక పోయేసరికి మొలకెత్తే జీవిపట్ల ఆశ పెరిగింది. తల్లి పాత్ర నిండుగా, నిలకడగా కనిపించింది.

    ఈ రోజుల్లోనే మళ్ళీ తారసపడ్డాడు శంకరం. ఇప్పుడు తను తన ఊళ్ళోనే ఉంటున్నాడు. పెళ్లాన్ని, పిల్లల్ని తీసుకుని పట్నం వచ్చాడు. రామక్రిష్ణా బీచిలో దూరంగా, ఒంటరిగా కూర్చున్న ఆమెని చూశాడు. దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అతన్ని చూసి తుళ్లిపడింది పార్వతి. తన జీవితానికి సజీవమయిన సమీక్షలాగ కనిపించాడు. ఇప్పుడు బాగా వొళ్లు చేశాడు. ఇదివరకటి కంటే నిండుగా సుఖంగా కనిపించాడు.

    ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు.

    "పెళ్ళి చేసుకొన్నావటగా?"

    "ఊఁ"

    "సుఖంగా ఉన్నావా?"

    ప్రశ్న వెక్కిరింతలాగ వినిపించింది పార్వతికి. అతను ఉద్దేశించని పరిహాసం ఆమెకి వినిపించింది. కోపం వచ్చింది. కోపానికి కారణం అతని ప్రశ్నకాదని - తనకి తెలిసిన నిజమని ఆమెకి అర్థం కాలేదు.

    "ఉండక? నీకోసం కలవరిస్తూ ఆత్మహత్య చేసుకుంటాననుకొన్నావా?- నేను తల్లి కాబోతున్నాను."

    తల్లికావడం సుఖానికి నిదర్శనం కానక్కరలేదు. సుఖానికి అది చాలా బలహీనమైన గుర్తు.

    "మరి నీతో మీ ఆయన రాలేదేం?"

    కొట్టొచ్చినట్టు తన ఆత్మవంచన దొరికిపోయింది.

    "ఆయనకి పని వుంది."

    "తల్లి కాబోతున్న భార్యతో ఒక సాయంకాలం బీచిలో గడపలేనంత గొప్ప పనా? - ఏం చేస్తారు మీ ఆయన?"

    చెప్పలేదు. చెప్పలేకపోయింది. దేశాన్ని ఊపి ఉర్రూతలూగించే గొప్ప కళాకారిణి భర్త ఏం చేయాలి? - గుమాస్తా ఉద్యోగం మాత్రం కాదు.

    "నాకు నచ్చినపాట ఒక్కసారి పాడుతావా?"

    పార్వతి అహంకారపు పొర పూర్తిగా అవిచ్చిన్నమయిపోయింది. కళ్లలో నీళ్లు ఉబికివచ్చాయి. ఈ కోరిక ఈ లాలనతో అడిగే మాట - ఒక్కసారి కూడా తన భర్త అనలేదు. శంకరానికి పెళ్లయితేనేం? పిల్లలుంటేనేం? ఈ 'భాష' ఏమయిపోయింది? - ఈ 'ప్లేన్'లో బతికి ఎన్నాళ్ళయింది?

    శంకరం ఆమెని అర్థంచేసుకోగలడు. "సారీ పార్వతీ. నువ్వు పాడలేవని తెలుసు. నిన్ను ఆ రోజుల్లో మోసం చెయ్యాలనుకోలేదని చెప్పే అవకాశం రాలేదు. సంసారం, పిల్లలూ - వీటిని మించిన ఆకర్షణ ఏదో మనల్ని ఆ రోజుల్లో కలిపింది. నీకు కావలసింది నేను యివ్వగలిగానన్న తృప్తి నన్ను అన్నీ మరిపించింది. నువ్వు ఆనందంగా లేవని నాకు తెలుసు. ఉండలేవనీ తెలుసు. కాని - అది నీ అంతట నువ్వు కోరుకున్న జీవితం. దాని నుంచి విముక్తి లేదు. వస్తా"

    వెళ్ళిపోయాడు. 

    మనసంతా కలిచివేసి నట్టయింది పార్వతికి. 'ఎవరో చెయ్యెత్తి తన పక్క వేలు చూపించి వెక్కిరించినట్టనిపించింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి?'

    శంకరం ఆమెని కలుసుకొన్న విషయం సూర్యారావుకి ఎవరోచెప్పారు. దూరంగా కూర్చున్న తల్లీ పిల్లలూ అతని సంసారమని ఆ చెప్పినవాళ్లు గుర్తుపట్టలేకపోయారు. బీచిలో మరొక గుంపు అది. శంకరం, పార్వతి మాట్లాడుకోవడమే చూశారు. ఆ రాత్రి మొదటిసారిగా సూర్యారావు పార్వతిని చావగొట్టాడు. 

    పార్వతికి ఏడుపు రాలేదు. కోపం వచ్చింది. అతని బనీను చింపింది. జుత్తు పీకింది. రక్కింది. 

    "నువ్వు పనికి మాలిన వాడివి. పిరికి వాడివి. నన్ను  ఓ ఆటబొమ్మని చేశావు. యూ ఫూల్! నేనేమయినా కావచ్చు. కనీసం నా శీలాన్ని నా అహంకారం కోసమయినా కాపాడుకొంటానని తెలీని మూర్ఖుడివి" అని కేకలు వేసింది. సూర్యారావుకి ఇది అర్థం కాని భాష. మరీ రెచ్చిపోయాడు. ఆ చిన్నగదిలో ఆమె శరీరంతో ఫుట్‌బాల్ ఆడాడు. కడుపులో జీవం ఆధారం తెగి విలవిల ఆడింది. క్రోధంతో, నిస్సహాయతతో కుంచుకపోయింది పార్వతి. ఆ దెబ్బలు ఆమెను ఓదారుస్తున్నట్టున్నాయి. "కొట్టు - కొట్టు. నాకేదో ఉపశమనం కావాలి. నన్ను నేను హింసించుకోవాలి. థాంక్యూ" అంటూ పకాలున నవ్వింది. అది ఆమె తిరుగుబాటుగా అర్థం చేసుకున్నాడు. కొట్టి కొట్టి అలిసిపోయి అటు తిరిగి పడుకొని నిద్రపోయాడు.

    పార్వతికి జ్వరం వచ్చింది. శేషయ్యగారు వచ్చి బిడ్డని యింటికి తీసుకెళ్లారు. ఒకప్పుడు కళకళలాడుతూ, నిత్యనూతనంగా ఉండే కూతురు యివాళ నీరసంగా, నిస్తేజంగా కనిపిస్తుంటే గుండె తరుక్కుపోయింది.

    "ఏమిటమ్మా యిది? - నేను చూసేది నా బిడ్డనేనా? నువ్వు నా పార్వతివేనా?" అన్న తండ్రి వొడిలో తలదూర్చి భోరుమంది పార్వతి. 

    "నన్ను నీ అంత విద్వాంసురాల్ని చేద్దామనుకొన్నావు. కాని నీ స్వభావం ఎందుకు అలవాటు చేశావు నాన్నా?" అంది. కాని అది చెప్తే వచ్చేదికాదు. జన్మత అబ్బింది. మార్పుకి ప్రయత్నం కావాలి. ఆ ప్రయత్నం చెయ్యలేదు. పార్వతి చేయడం అనవసరం అనుకొంది. తండ్రిలో మహనీయతనే చూసింది ఆమె. ఆయన వ్యక్తిత్వంలో ఉండే మూర్ఖత్వం కూడా ఆయన మహనీయతలో ఒక భాగం అనుకొంది. అంతే.

    ధూళిపట్టి మూలపడిన తంబూరాని చూసి ఆమెకి కళ్ళనీళ్లు తిరిగాయి. దులిపి శుభ్రంచేసి మీటబోయింది. తీగలు తెగాయి. శేషయ్యగారు సరిచేసియిచ్చారు. గొంతు పెగలలేదు. ఇదివరకటి మాధుర్యం ఏమయిందో! నిస్పృహగా పక్కన పెట్టేసింది. సంవత్సరాల తరబడి- ఆ తండ్రీకూతుళ్లిద్దరూ గొంతులు కలిపి పాడేవారు. ఇద్దరూ ఒకరి నొకరు క్షుణ్ణంగా అర్థంచేసుకునే భాష అది.

    "ఏం అమ్మా. పాడాలని వుందా?" అని లాలనగా అడిగారు శేషయ్యగారు. 

    "లేదు నాన్నా - " అంది.

    నెలలు నిండిన ఆ కూతురి తలను వొడిలో పెట్టుకు నిమురుతూ - 

    "గుర్తుందా అమ్మా. సంగీతం నీ నేస్తమవుతుందనే వాడిని. ఆ సందర్భం యిదే. రా నేను తంబూరా మీటుతాను. పాడు. ఏదీ అభేరి"

    "పై షడ్జమందాకా గొంతు పోదు నాన్నా"

    శేషయ్యగారికి కళ్ళనీళ్లు వచ్చాయి. "జగమేలే పరమాత్మా" అంటూంటే సభలో 'ముసిరి'ని మరిపించగల ఆ తొంతు ఏమయింది?

    "పరవాలేదు తల్లీ. ఎంతవరకు వెళ్తే అక్కడే ఆగుదువుగాని."

    పసిబిడ్డగా తండ్రి వొడిలో విప్పిన ఆ గొంతు మళ్ళీ సవరించబోయింది. కాని పసితనానికీ యిప్పటికీ మధ్య పది జీవితాల దుఃఖం వుంది. గొంతు పగిలింది. ఆ అపశృతి ఏమిటో యిద్దరికీ తెలుసు.

    అర్థరాత్రిదాకా అపశృతులు పరికించి అలసిపోయాక "యింక పడుకో తల్లీ" అన్నారు శేషయ్యగారు.

    ఆ రాత్రి గుండె పగిలేలాగ ఏడ్చింది పార్వతి.

    తెల్లవారుఝామున అర్థంతరంగా నొప్పులు ప్రారంభమయాయి. ఆసుపత్రికి ఆమెను మోసుకెళ్ళారు. తెల్లవారేసరికి ఈలోకంలోకి రావడానికి అవకాశం కోల్పోయిన ఓ మాంసపుముద్దని బయటకి తీశారు డాక్టర్లు. అది పార్వతి గుండెల మీద ఆఖరి గాయం.

    పార్వతి ఆసుపత్రినుంచి యింటికి రావడానికి పదిరోజులు పట్టింది. కాని పదోరోజునే రెండోసారి గుండెపోటు వచ్చింది శేషయ్యగారికి. ఆ గుండెపోటు ఆయనకి తెలుసు. గుండెకీ తెలుసు. ఆ రాత్రే శేషయ్యగారి జీవితం నిలిచిపోయింది.

    తనకి ఊతకర్రగా నిలిచిన ఒక ప్రాణమిత్రుడు తండ్రి దూరమయాడు. భవిష్యత్తులో తను ఊతకర్ర కావాలనుకొన్న బిడ్డని దూరం చేసుకొంది. భర్త దగ్గరికి వచ్చేటప్పటికి పార్వతికి మెదడులో ఏదో అర దెబ్బతింది.

* * *

    పార్వతి యిప్పుడేం చేస్తోంది.

    పిచ్చాసుపత్రిలో ఏకాంతమయిన గదిలో కూర్చుని కచ్చేరీ చేస్తుంది. గొంతూ పగులుతుంది. రాగం సంచారం పూర్తికాదు. లయ ఉండదు కాని అన్నిటికీ మించినది ఒకటిమాత్రం ఉంటుంది. స్వేచ్ఛ మనస్సులో అంపురూపమయిన మాధుర్యం ధ్వనిస్తుంది. ఆమె నిప్పుడు ఎవరూ కాదనరు. తను కోరుకున్న స్వర్గాన్ని నష్టపోయి, దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలన్న అతృతకీ వీద్యులు పెట్టిన అందమయిన పేరు పిచ్చి. తననిప్పుడు ఎవరూ ఆపరు. ఎవరూ వద్దనరు. నాన్న వేసే తంబూరా శృతి చెవులకి వినిపిస్తుంది. తన గొంతు తన మనస్సుకి మధురాతిమధురంగా వినిపిస్తుంది. ఆ సంగీతం తనకి మనశ్శాంతి నిస్తుంది.

    పిచ్చాసుపత్రిలో చేర్చిన రోజు రాత్రి పెట్టె తెరిచినప్పుడు తన తెల్లకాగితాల అట్ట చూసుకొన్నాడు సూర్యారావు. ఎరుపు వారిన తెల్లకాగితాల నిండా అక్షరాలు రాసింది పార్వతి "ఐ హేట్ యూ - ఐ హేట్ యూ - ఐ హేట్ యూ!"

    భర్త అప్పుడప్పుడు తనని చూసి పోవడానికి వస్తూంటాడు. వచ్చినప్పుడల్లా మల్లెపువ్వులు తెస్తాడు. పార్వతికి నవ్వొస్తుంది. "ఎంత ఆలస్యంగా తెచ్చారు మల్లెపువ్వులు. ఈ గదిలో మీరుండరు. వాడిపోయినా ఫరవాలేదు. ఈ పక్కమీద మీరు పడుకోరు. ఖరాబయినా యిబ్బందిలేదు."

    భర్తని చూసినప్పుడు కసిగా పాట పాడుతుంది, అతనికి వినిపించేలాగ, అతని గుండె పగిలే లాగ.

    "ఎలావుంది పాట" అంటుంది సవాలు చేసినట్టు.

    "నువ్వు చాలా బాగా పాడతావు పార్వతీ!" అంటాడు సూర్యారావు.

    "ఎంత ఆలస్యంగా చెప్పారా మాట" అంటూ పాట కొనసాగిస్తుంది పార్వతి.

    తలవొంచుకొని వెనక్కి తిరుగుతాడు సూర్యారావు. 

    అతని తెల్లకాగితాల మీద ఎట్టకేలకు మరో కొత్తకథ అవతరించింది "ఇ హేట్ యూ"

    ఆమె మల్లెపూలకి పిచ్చాసుపత్రి గదిలో మెత్తటి పరమార్థం లభించింది.

    అభేరి ఆమెకి ఇష్టమయిన రాగం.

    "ఖగరాజు గగనానికి యిలకు దూరం బనినాడో?"

(యువ మాసపత్రిక ఫిబ్రవరి1980 సంచికలో ప్రచురితం)    
Comments