తేలు - పుట్టగంటి గోపీకృష్ణ

    ఆఖరి ఫైలు డిస్సోజ్ చేసి లేస్తుంటే హడావుడిగా లోపలకు వచ్చాడు సెక్రటరీ. ప్రశ్నార్థకంగా అతని వైపు చూశాను.

    "మీతో మాట్లాడటానికి ఇండస్ట్రియల్ రిలేషన్స్ హెడ్ సాంబమూర్తి వచ్చాడు. అర్జంటు విషయం అంట.."

    నా మొహం మరింత చిరాగ్గా మారింది. సాధారణంగా సాయంత్రం ఎక్కువసే ప ఆఫీసులో ఉండటానికి నేను ఇష్టపడను. ఆ విషయం అందరికీ తెలుసు. సాంబమూర్తికి మరింత బాగా తెలుసు. అయినా వచ్చాడంటే నిజంగానే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. అందుకే, "సరే! లోపలకు రమ్మను.." అన్నాను.

    సాంబమూర్తి వచ్చాడు. ఎదురుగా ఉన్న సీటు చూపించడంతో కూర్చున్నాడు.

    "చెప్పండి." క్లుప్తంగా అన్నాను.

    "ఒక డిసిప్లినరీ మేటర్ అర్జంటుగా ఫైనలైజ్ చెయ్యాల్సిన అవసరం పడింది సార్! మీకు ఇష్టం ఉండదని తెలిసినా ఈ సమయంలో రాక తప్పలేదు."

    "రేపు చూడకూడదా? "

    "ఒక ఆఫీసర్ డిస్మిస్సల్ వ్యవహారం సార్! అతను ఇంకొక మూడు రోజుల్లో రిటైరవుతున్నాడు. ఇవాళ మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే, మిగిలిన పనులు పూర్తి చేయటానికి సమయం చాలదు"

    "అలాంటప్పుడు ఆఖరి నిమిషందాకా ఏం చేస్తున్నారు? ఇది మీ ఇనెఫీషియన్సీ కాదా? " కటువుగా వచ్చాయి నా నోట్లో నుండి మాటలు.

    "ఎంక్వయిరీ రిపోర్ట్ రావటం లేటయ్యింది సార్!" నసుగుతున్నట్లు అన్నాడతను.

    "సరే చెప్పండి"

    సాంబమూర్తి గొంతు సవరించుకున్నాడు. అతను చెప్పబోయే విషయాలేమిటో నాకు చూచాయగా తెలుసు. నేను ఈ ప్రభుత్వరంగ బ్యాంకుకు డిసిప్లినరీ అథారిటీని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఏదైనా అధికారి మీద ఆరోపణలు వస్తే, అతన్ని సస్పెండ్ చేసి ఎంక్వయిరీ కమిటీ వేస్తారు. ఎంక్వయిరీ కమిటీ ఒక కోర్టులా పనిచేస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి తన చర్యలను సమర్థించుకోవటానికి అవకాశం ఇస్తారు. అతను కానీ, అతని తరఫున వాగ్ధాటి ఉన్న మరో అధికారి కానీ సంస్థ ఆరోపణలను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తారు. సాధారణంగా యూనియన్ యాక్టివిస్టులు ఈ పనులు చేపడతారు. సంస్థ తరపున అనుభవజ్ఞలయిన ఆఫీసర్లు వాదిస్తారు. ఎంక్వయిరీ ఆఫీసర్ జడ్డిలా వ్యవహరించి రిపోర్టు తయారుచేస్తాడు. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి కొన్ని నెలలు, ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. ఆ రిపోర్ట్ మీద అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం నాకు మాత్రమే ఉంది.

    "మురళీమోహన్ అని ఒక ఆఫీసర్ మీద రిపోర్ట్ సార్." చెప్పబోతున్నాడు సాంబమూర్తి.

     ఉలిక్కిపడిన నేను విశ్రాంతిగా కూర్చున్నవాడినల్లా కుర్చీలో ముందుకు జరిగాను.

    "ఏం పేరు చెప్పావ్?"

    మళ్లీ పేరు చెప్పాడు సాంబమూర్తి.

    "అతని ఫొటో ఉందా? "

    "ఉంది సార్!..." అంటూ ఫైల్లో ఉన్న ఫోటో తీసి చూపించాడు సాంబమూర్తి.

    అది నేను ఊహించిన మురళీమోహనే! నాకు ఒక్కసారిగా కేసు మీద ఉత్సుకత పట్టుకు వచ్చింది. "చెప్పండి..." అన్నాను. ఈసారి నా మాటలో విసుగు లేదు.

    "మురళీమోహన్ 35 సంవత్సరాల క్రితం ఆఫీసరుగా ఈసంస్థలో చేరాడు. మొదటి నుండి అతనొక కాంట్రవర్షియల్ పర్సన్. సర్వీస్ చేసిన సమయానికంటే సస్పెన్షన్లలోనే ఎక్కువ కాలం ఉన్నాడు. అతను సస్పెండ్ అవటం ఇది మూడోసారి"

    చిన్న చిరునవ్వు నా మొహం మీద వెలిసింది. "సాంబమూర్తీ ఎక్కువ శ్రమ పడకు. అతనికి సంబంధించిన మొత్తం వివరాలు నీ దగ్గర ఉండి ఉండవు. కానీ ఏ ఫైలూ లేకుండానే అతని చరిత్ర అంతా నేను చెప్పగలను."

    "ఎలా సార్? " ఆశ్చర్యంగా అడిగాడు అతను.

    "నేను క్లర్కుగా ఉద్యోగంలో చేరిన బ్రాంచికి మురళీమోహన్ మేనేజర్. అది ఒక పల్లెటూరు బ్రాంచి. సాధారణంగా కొత్తగా చేరిన క్లర్కుకు రూలు, రెగ్యులేషనూ నేర్పటం మేనేజర్ బాధ్యత. కానీ అతను నాకు ఎప్పుడూ రూల్సు నేర్పలేదు. వాటిని ఎలా బ్రేక్ చెయ్యాలో నేర్పాడు. మధ్యాహ్నం రెండింటికి రూలు ప్రకారం క్యాష్ ట్రాన్సాక్షన్స్ సమయం అయిపోయినా ఆ రోజుల్లో కౌంటర్ మూయనిచ్చే వాడు కాదు. ఆదివారాల్లేవ్, సెలవు రోజుల్లేవ్... ఎవరన్నా అడిగిందే చాలు, బ్యాంకుకు వచ్చి డబ్చిమ్మనేవాడు. అప్పుడప్పుడూ దగ్గర్లోని టౌనుకు సినిమాకి వెళ్లేవాళ్లం. ఆ సమయంలో ఊర్లో వాళ్ల సౌకర్యానికి ఆటంకం కలుగుతుందేమో అని... ఇనప్పెట్టె రెండవ తాళం కూడా ఆయనకి ఇచ్చి వెళ్లమనేవాడు. అది రూలుకు విరుద్ధం అని చెస్తే వినేవాడు కాదు. ఆఖరికి ఒక రోజు అనుకున్నంతా అయింది. ఇనప్పెట్టెలో డబ్బు తగ్గింది"

    "అందుకేనా సార్ అతను అప్పుడు సస్పెండ్ అయింది?"

    "చెప్పేది వినే ఓపిక లేదా? " అని అతని మీద విసుక్కుని.. "తగ్గిన డబ్బు అతను వెంటనే కట్టాడు కాబట్టి అప్పుడు సస్పెండ్ కాలేదు"

    "కొంతమంది అలానే ఉంటారు సార్! జీతం ఇస్తున్న బ్యాంకు కంటే బయటి వ్యక్తుల మెప్పు సాధించటమే గొప్పనుకుంటారు. "

    "సాంబమూర్తీ! పప్పులో కాలెయ్యటమంటే ఇదే! మమ్మల్నందరినీ కాదనుకుని మురళీమోహన్ ఊరి వాళ్లకోసం చేసిన అంత సేవా చివరికి గాలికి ఎగిరిపోయింది. ఇంకో విషయంలో ఊరి వాళ్లే అతని మీద ఫిర్యాదు ఇచ్చారు"

    "అదెందుకు సార్? "

    "అప్పట్లో పేదవాళ్లకి సబ్సిడీ లోనులు ఇచ్చేవాళ్లు వాటిని బలహీన వర్గాల పేర్ల మీద ఉన్నత కులాల వాళ్లే తీసుకునేవాళ్లు. యథాప్రకారం మురళీమోహన్ ఆదర్శాలు అందుకు ఒప్పుకోలేదు. అలాంటి అన్యా యం జరగనియ్యనన్నాడు. అతను చేసిన సేవంతా మర్చిపోయిన ఊరివాళ్లు మేనేజర్ లంచం అడిగాడని ఫిర్యాదు ఇచ్చారు. బ్యాంకు వాళ్లు విచారణ చేశారు. అది నిజమని తేలింది. దానితో అతన్ని మొదటి సారి సస్పెండ్ చేశారు."

    "అతను నిజాయితీపరుడని మీరే చెప్తున్నారు కదా! మరి యాజమాన్యానికి అతనికి వ్యతిరేకంగా రుజువులు ఎలా దొరికాయో? " అన్యాపదేశంగా అన్నాడు సాంబమూర్తి.

    నేనేమీ మాట్లాడలేదు. ఆ రోజు ఊరి వాళ్ల తరపున అబద్ధపు సాక్ష్యం చెప్పింది నేనేనని ఇప్పుడు ఈ సాంబమూర్తికి తెలియవలసిన అవసరం ఏముంది?

    "అతనికి ఆ కేసు నుండి బయటపడటానికి అయిదేళ్లు పట్టిందనుకుంటా..." నా దగ్గర నుండి సమాధానం రాకపోవటంతో ఏదో ఒకటి మాట్లాడాలన్నట్లు అన్నాడు సాంబమూర్తి. అతనికి ఈ కేసులో నేను మురళీమోహన్ పక్షాన మాట్లాడతానో, వ్యతిరేకంగా మాట్లాడతానో ఇంకా అర్థం కావటం లేదు. అందుకే ఎటు మొగ్గాలో తేల్చుకోలేకపోతున్నాడు.

    "అవును. ఆ అయిదేళ్లలో నేను కూడా మేనేజర్ని అయ్యాను. ట్రాన్స్ఫర్ మీద దూరంగా వెళ్లిపోయాను. కొన్నాళ్ల తరు వాత మళ్లీ ఒకరోజు పేపర్లో మురళీమోహన్ని అరెస్ట్ చేసిన వార్త చూశాను. ఈసారి ఏం చేశాడా అని వివరాలు తెప్పించుకున్నాను."

    "ఆ విషయం కూడా నాకు తెలియదు సార్. ఈ ఫైల్లో కేవలం మూడో కేసు వివరాలే ఉన్నాయి..."

    "అందుకే వివరంగా చెప్తోంది.." అన్నాను. ఎప్పటి విషయాలో అయినా చెప్పకుంటుంటే ఉత్సాహంగా ఉంది. అందుకే ఆనందంగా కొనసాగించాను. "ఎలక్షన్ డ్యూటీలప్పుడు బ్యాంకు ఉద్యోగులకు కూడా డ్యూటీలు వేస్తారు. తెలుసుగా..."

    "తెలుస్సార్. నేను కూడా చాలాసార్లు వెళ్లాను. కానీ అదెప్పుడో పాతకాలం రోజుల్లో... ఇప్పుడు నన్ను ఆ డ్యూటీకి వెయ్యటంలేదు"

    "ఇప్పుడు నువ్వు పెద్ద ఆఫీసరువు కదా! ఎందుకు వేస్తారులే? అది సరే! నువ్వు వెళ్లినపుడు ఎప్పుడన్నా రిగ్గింగ్  జరిగిందా? "

    "ఆ రోజుల్లో అది కామన్ సార్ అప్పటికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ రాలేదు. ఎవరికి బలమున్న చోట వారు రిగ్గింగ్ చేసుకునే వారు"

    "మరి నువ్వేం చేసేవాడివి? "

    "ఏం చేస్తాం? వాళ్లు పెట్టిన పలావ్ తిని, వాళ్లిచ్చిన దక్షిణ తీసుకుని నోరు మూసుకుని వెనక్కి వచ్చెయ్యటమే!"

    "తెలివిగలవాడివి. నాకు కూడా తప్పలేదు. అంతే చేశాను. కానీ మన మురళీమోహన్ సంగతి తెలుసుగా. అన్యాయాన్ని సహించడు. అందుకే రిగ్గింగ్ జరగటానికి వీలులేదని పట్టుబట్టాడంట"

    "మరి ఊర్లో వాళ్లు ఊరుకున్నారా? "

    "ఎందుకు ఊరుకుంటారు? వాళ్లు అతనికంటే నాలుగాకులు ఎక్కువ చదివారు. అతను చెప్పినట్లు చెయ్యటానికి ఒప్పకున్నట్లు నాటకం ఆడారు. నలుగురు ఓటు వేసిన తరువాత ఒక కళ్లు కనపడని వ్యక్తి వచ్చాడు. రూలు ప్రకారం అతనికి అక్కడ ఉన్న ఆఫీసరే సహాయం చెయ్యాలి. బయటి వాళ్లు వేలు పెట్టకూడదు. తన ఓటు ఎక్స్ పార్టీకి వేసి పెట్టమని ఆ కళ్లు కనపడని వ్యక్తి అభ్యర్ధించాడు. మురళీమోహన్ అలానే ఎక్స్ పార్టీకి ఓటు వేసి బాక్సులో వెయ్యబోతున్న ఆఖరి క్షణంలో అతను గోల గోల చేసి "నేను వై పార్టీకి ఓటు వెయ్య మంటే ఇతను కావాలనే మార్చి ఓటు వేశాడు" అని ఆరోపించాడు. పెద్ద గోల అయింది. అప్పటి
ప్పుడు ఆర్డీఓ వచ్చాడు. ఊర్లో వాళ్లందరూ ఆ కళ్లు కనపడని వ్యక్తి వై పార్టీకి చెందిన వ్యక్తని చెప్పారు. కళ్లముందు మురళీమోహన్ ఎక్స్ పార్టీకి తయారుచేసిన ఓటు కనబడుతోంది. దాంతో ఎక్స్ పార్టీకి కొమ్ము కాస్తున్నందున మురళీమోహన్ని అరెస్టు చేశారు. బెయిల్ కూడా రాలేదు. ఆటోమేటిగ్గా సస్పెండ్ అయ్యాడు. ఆ కేసు తేలేసరికి పదేళ్లు పట్టింది. తిరిగి పదేళ్ల తరువాత పాత పోస్టులోనే కుదురుకున్నాడనుకో... అప్పటికల్లా నేను రీజినల్ మేనేజర్నిఅయ్యాను. అప్పట్నుండి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉండి ఉంటాడనుకున్నాను. మళ్లీ సస్పెండు అయ్యాడని మాత్రం తెలియదు..." అని సుదీర్ఘంగా నాకు తెలిసినదంతా చెప్పాను.

    "వాటితో పోల్చుకుంటే ఇది తీవ్రమయిన కేసు. కానీ పెద్ద కాంప్లికేటెడ్ కాదు. చేసిన తప్పంతా తనే ఒప్పుకుని స్వహస్తాలతో అంగీకార పత్రం రాసిచ్చాడు మురళీవెూహన్... "

    ఈ వార్త నేను నమ్మలేనిదే మురళీమోహన్ తప్ప చెయ్యటమే ఆశ్చర్యం అనుకుంటే పైగా దానిని ఒప్పుకోవటం కూడానా? అందుకే... "చెప్పు సాంబమూర్తీ అదెలా జరిగిందో చెప్పు..." అన్నాను ఆత్రుతగా.


    "మురళీమోహన్ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న ఊర్లో ఒక సంపన్న వృద్ధురాలు ఉండేది. ఆవిడ సంతానం ఆమెను పట్టించుకోవటం లేదంట. అంతా దూరదూరంగా ఎక్కడెక్కడో ఉంటున్నారు. దగ్గర్లో ఎవరూ లేరు. ఒక దూరపు బంధువుల పేద కుటుంబాన్ని తనకు సహాయం చేయటానికి ఆమె చేరదీసింది. వాళ్లు కూడా చాలా జాగ్రత్తగా ఆమె మంచి చెడ్డలు చూసేవారు. ముసలామె తనకున్న నగలను బ్యాంకు లాకర్లో పెట్టింది. తన తదనంతరం తనకు సహాయం చేస్తున్న వ్యక్తులకు ఇమ్మని నామినేషన్ ఇచ్చింది. కొన్నాళ్లకు ఆవిడ చనిపోయింది. హఠాతుగా ఆమె సంతానం ఊడిపడ్డారు. విలువయిన నగలు ఎవరికో ఇవ్వటానికి వారికి మనసొప్పలేదు. కోర్టుకెక్కారు. లిటిగేషన్ తేలేవరకూ ఆ లాకరు తెరవవద్దని కోర్టు నుండి ఆర్డర్ తెచ్చారు. ముసలమ్మని నమ్ముకున్న పేద కుటుంబం వీధిన పడింది. వారి దగ్గర లాకరు తాళం ఉంది. ఎప్పుడయినా నగలు తెచ్చుకోవచ్చని అందరూ చెప్పారు. ఇప్పుడు ఇలా అయింది. తమ బాధను మురళీమోహన్ దగ్గర చెప్పకున్నారు. అంతే! అతను సొంత నిర్ణయం తీసుకున్నాడు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వారి చేత లాకరు తెరిపించి ఆ నగలు ఇచ్చేశాడు..."

    "హార్నీ!" ఆశ్చర్యపోతూ "మరీ ఇంతకి తెగిస్తాడనుకోలేదే!" అన్నాను.

    "చేసిందేదో చేశాడు. మాట్లాడకుండా ఊరుకోవచ్చుగా ఈ విషయం తెలిసిన అసలు సంతానం ఫిర్యాదు ఇవ్వటంతో పోలీసులు వచ్చారు. వాళ్లకి పూసగుచ్చి నట్లు జరిగింది జరిగినట్లు చెప్పాడు.

    అతను చెప్పకపోతే ఆ విషయం ఎవరూ రుజువు చెయ్యలేరు. కానీ అతనే చెప్పటంతో ఇప్పుడు ఎవరూ మురళీమోహన్‌కి సాయం చెయ్యలేని పరిస్థితి"

    "మరి అతనికి ఎవరూ సలహా ఇవ్వలేదా? "

    "ఎందుకు ఇవ్వలేదూ? యూనియన్ వాళ్లు చెప్పారు. అసలే రిటైర్మెంట్ దగ్గరకొచ్చింది. రిస్కు తీసుకోవద్దని చెప్పారు. ఇలా చేస్తే నిన్ను ఎవరూ కాపాడలేరని చెప్పారు"

    "మరి మురళీమోహన్ ఏమన్నాడు? "

    "ఒక కథ చెప్పాడు"

    "కథా? "

    "అవును. ఆ కథ కూడా చెప్తాను వినండి. ఒక సన్యాసి ఉన్నాడు. ఒక ఏటిలో స్నానం చేస్తుంటే, కొట్టుకుపోతున్న తేలు కనిపించింది. దానిని రక్షించటానికని చేతితో పట్టుకుని ఒడ్డుకు తెస్తుంటే అది అతన్ని కుట్టింది. దాంతో బాధతో అతను దానిని జారవిడిచాడు. మళ్లీ అది నీటిలో కొట్టుకుపోతోంది. తిరిగి జాలివేసి, రక్షించటం కోసం చేతితో పట్టుకున్నాడు. మళ్లీ కుట్టింది. ఇదంతా చూస్తున్న ఎవరో, 'అన్నిసార్లు అదలా కుడుతుంటే ఎందుకు దాని జోలికి పోతున్నావని' అడిగారంట. అప్పుడతను ఏమి చెప్పాడంటే, 'కుట్టటం తేలు గుణం. ఎదుటి ప్రాణికి సాయం చెయ్యటం మనిషికి ఉండవలసిన సహజ గుణం. ప్రాణం పోబోతున్నా అది దాని గుణాన్ని వదులుకోనపుడు, నా సహజ గుణాన్ని నేనెందుకు వదులుకోవాలి..?' అని. అలాగే నేను కూడా."

    "కథ బాగుంది." అంటుంటే నా ఫోన్ మోగింది. నా భార్య గొంతు ఆందోళనగా వినిపించింది. ఆ గొంతు వింటేనే ఏదో అనుకోనిది జరిగినట్లు అనిపించింది. "ఏం జరిగింది? " అడిగాను.

    "అబ్బాయి కారు. యాక్సిడెంటు." వెక్కిళ్ల మధ్య ముక్కలు ముక్కలుగా చెప్తోంది.

    "వాడికేమన్నా అయ్యిందా? ఎక్కడున్నాడు?" నా గొంతులోకి కూడా అనుకో కుండా ఆదుర్దా ప్రవేశించింది.

    "వాడు బానే ఉన్నాడు. పోలీసులు అరెస్టు చేశారు."

    "హమ్మయ్య..." అనుకున్నాను. వాడికి ఏమీ కానందుకు. పైకి మాత్రం "వాడు ఏ పోలీసు స్టేషన్‌లోలో ఉన్నాడో తెలుసా? " అన్నాను.

    చెప్పింది.

    "వాడికేం కాదు. నేను ఇప్పుడే వెళ్తున్నాను" పరిగెడుతున్నట్లు బయటకు నడుస్తూ అన్నాను. చెప్పకుండానే సాంబమూర్తి నన్ను అనుసరించాడు. ఆ హడావుడిలో సాంబమూర్తి చేతిలోని ఫైలు ఎక్కడ పెట్టాలో అర్థంకాక తనతోనే తీసుకు వచ్చాడు.

    మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. రెండు వారాల సెలవులకని వచ్చాడు. రెండు రోజుల తరువాత తిరుగు ప్రయాణం. ఇప్పుడీ విపత్తు వచ్చింది. నేను కారు డ్రైవ్ చేస్తుంటే సాంబమూర్తి తెలిసిన పరిచయస్తులకు ఫోన్ చేస్తున్నాడు. నేను స్టేషన్ చేరేటప్పటికి నా పలుకుబడి వలన పై అధికారుల నుండి స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కి ఫోన్ వెళ్లింది. అందుకే అక్కడ మామూలుగా ఎదురయ్యే తీవ్ర తిరస్కారం ఎదుర్కోలేదు నేను.

    "మీ అబ్బాయి రాష్ డైవింగ్ వలన ఒక చిన్న పాప ప్రాణం కోల్పోయేది. ఎవరో తన ప్రాణాలు అడ్డుపెట్టబట్టి ఆ పాప ప్రాణాలతో బయటపడింది. కాపాడ బోయిన వ్యక్తి మాత్రం కాలు విరిగి హాస్పిటల్లో ఉన్నాడు. చెప్పండి నన్నేం చేయ మంటారో? " అడిగాడు
ఇన్‌స్పెక్టర్.

    "వాడు డ్రైవింగ్‌కి కొత్త కాదు. అమెరికాలో రెగ్యులర్‌గా డ్రైవ్ చేస్తాడు"

    "కానీ తాగి డైవ్ చెయ్యటం మొదటి సారి కావచ్చు. ఇది అమెరికా కానందుకు సంతోషించండి. ఇదే అక్కడ జరిగితే పర్యవసానాలు మీకు చెప్పనవసరం లేదు..."

    "
ఇన్‌స్పెక్టర్ గారూ! ఇన్ని మాటలు కాదు, వాడు రెండు మూడు రోజుల్లో అమెరికా వెళ్లాలి. ఎలా చేస్తారో, ఏమి చేస్తారో నాకు తెలీదు" అతని మీద పలుకుబడి ప్రయోగించిన ధైర్యంతో అన్నాను.

    అతను ఒకసారి సూటిగా నా వైపు చూశాడు. ఆ చూపులో ఉన్న భావం ఏహ్యత అని అర్ధం అయింది. అయితే అది ఏమీ చేయలేని అసహాయత్వంతో తన మీద తనకు కలిగిందో, ఎదురులేని నా చతురత చూసి నా మీద కలిగిందో మాత్రం తెలియలేదు.

    "మీ అబ్బాయి బయట పడాలంటే మీరు రెండు పనులు చెయ్యాలి..."

    "చెప్పండి" అంత త్వరగా విషయం కొలిక్కి వచ్చినందుకు ఆనందిస్తూ అన్నాను.

    "డాక్టర్ సర్టిఫికెట్ మార్పించాలి. ఆ ఇన్సిడెంట్ చూసిన స్టాఫ్‌ని మేనేజ్ చెయ్యాలి."

    "ఎంత కావాలో చెప్పండి? " నో నాన్సెన్స్ టోన్తో అన్నాను.

    ఒక ఫిగర్ చెప్పాడు. "కాసేపట్లో పంపి స్తాను" బేరం చెయ్యకుండా లేసూ చెప్పాను. బయటకు నడవబోతుంటే, "నేను చెప్పింది రెండు పనులు చేయాలని..." అన్నాడు ఆ
ఇన్‌స్పెక్టర్.

    "ఇంకోటి ఉందా? " అనుకుని, "చెప్పు..." అన్నాను. అతను నా ప్రపోజల్ ఒప్పుకున్న సెకన్లలో నా సంబోధన ఏకవచనంలోకి మారటం ఎవరన్నా గమనించారో నాకు తెలియదు.

    "హాస్పిటల్లో కాలు విరిగి ఉన్న వ్యక్తి చేత ఈ యాక్సిడెంట్ తన అజాగ్రత్త వల్ల జరిగిందనీ.. మీ అబ్బాయి తప్పేమీ లేదు' అనీ లెటరు రాయించుకు రండి." అన్నాడు.

    "ఇక్కడ పెట్టావా ఫిటింగ్." అనుకున్నాను. అయినా తప్పదు కాబట్టి సాంబమూర్తితో కలిసి హాస్పిటల్ కి బయలు దేరాం. సాంబమూర్తి రూము బయట నిలబడితే నేను ఒక్కడ్నే లోపలకు వెళ్లాను. అక్కడ బెడ్ మీద అనాథలా ఉన్న వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాను. అతను మురళీమోహన్. ఒక మనిషి స్థితి... అది మానసికం కానీ, శారీరకం కానీ.. అతని వర్ఛస్సులో తప్పక తెలుస్తుందంట. మురళీమోహన్ బలహీనంగా ఉన్నాడేమో తప్ప బాధల్లో ఉన్నట్లు లేడు. గడ్డం పెరిగి ఉందే తప్ప కళ్లలో మెరుపు తగ్గలేదు. అసలితను నా చేత పని చేయించుకోవటానికి కావాలనే మా అబ్బాయి కారు కింద పడ్డాడేమో అని కూడా అనిపిం చింది. కానీ తప్పదు కాబట్టి నవ్వుతూ పలకరించాను. "ఏంటి మురళీమోహన్? ఈ ఊరు ఎప్పుడు వచ్చావ్?" అన్నాను. కనీసం అతని వయసుకయినా గౌరవం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం నాకు కలగలేదు.

    ఒక క్షణం తరువాత నన్ను గుర్తుపట్టాడు. "ఏవీ రావుగారా! రండి రండి. మొదట్లో మిమ్మల్ని చూసి ఏమీ రావనుకున్నాను. కానీ బాగా వృద్ధిలోకి వచ్చావ్." అని "హెడ్డాఫీసులో నా పని ఒకటి ఉంటే కాసేపటి క్రితమే బస్సు దిగాను. అనుకోకుండా ఇలా జరిగింది. ఇంతకీ నువ్వేంటి ఇలా ఇక్కడికి వచ్చావ్. తెలిసిన వాళ్లు హాస్పిటల్లో ఉన్నారా? " అంటూ నన్ను పలుకరించాడు.

    ఏనాడో ముప్పై ఏళ్ల క్రిందటి పరిచయాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్న అతని అధిక ప్రసంగానికి ఒళ్లు మండినా అవసరం నాది కాబట్టి ఊరుకున్నాను. కాసేపు ఆ కబురూ ఈ కబురూ మాట్లాడిన తరువాత వచ్చిన పని చెప్పాను. "అయ్యో నా వలన మీ అబ్బాయికి ఇబ్బందొచ్చిందా? అయినా ఇప్పుడు నాకేమయిందని. కాలు విరిగింది. అంతే కదా! రెండు వారాల్లో సెట్ అవుతుంది. నా వలన మీ అబ్బాయికి ఏ ఇబ్బందీ రాకూడదు. నీకు కావలసిన విధంగా లెటర్ రాసిస్తాను..." అని హాస్పిటల్ రూములోని టేబుల్ మీద ఉన్న కాగితాల్లో ఒక కాగితం తీసుకుని నాకు కావలసిన విధంగా రాసి ఇచ్చాడు.

    తీసుకుని చదివాను. సరిగ్గా నాకు కావలసిన విధంగా ఉంది. "ఇలాంటి లెటర్లు రాసీ రాసీ బాగా అలవాటయినట్లుంది..." అనుకున్నాను.

    పనయింది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంది. అతనికి హెడ్డాఫీసులో ఉన్న పని ఏంటో తెలిసినా అతని నోటి నుండి వినటానికి గానూ, "ఇంతకీ నీకు హెడ్డాఫీసులో పనేంటో చెప్పలేదు? " అన్నాను.

    "ఒక అటెండర్ ఉన్నాడు. ఏదో చిన్నకారణం చేత సస్పెండయ్యాడు. ఇప్పుడతని తరఫున వాదించే వాళ్లేవరూ లేరు. ఆ పని నేను చేద్దామనుకున్నాను. రిటైరయ్యాక ఎలానూ కుదరదని ఆ లోపే ఎంక్వయిరీ పూర్తి చేయిద్దామనుకున్నాను. ఈ గాయం అందుకు అడ్డం వస్తుందేమో తెలియదు" అన్నాడు.

    ఛెళ్లున చెంప మీద ఎవరో కొట్టినట్లయింది. మురళీమోహన్ వచ్చింది అతని పని మీద కాదు. ఇప్పుడు కూడా ఎవరికో సహాయం చేయటానికి వచ్చాడు. అమాయకత్వం అనుకుందామా అంటే అదీ కాదు. అతనికి అన్నీ తెలుసు. అతని కేసు నేను తలచుకుంటే వీగిపోతుందని తెలుసు. మామూలుగా రిటైర్ అయితే వచ్చే లక్షలాది రూపాయల బెనిఫిట్లేమీ శిక్ష పడితే రావని తెలుసు. అయినా ఒక్క మాట కూడా నన్ను అడగలేదు. జీవితమంతా ఒకరి మేలు కోసం పోరాడాడు. నలుగురికీ నచ్చదని తెలిసినా వెరవలేదు. తను నమ్మిందే మాట్లాడాడు. కానీ ఏం సాధించాడు? ఒక సుఖం లేదు, సంతోషం లేదు. ఆఖరికి. సొసైటీలో స్టేటస్ కూడా లేదు. ఇంత జరుగుతున్నా నన్ను రిక్వెస్ట్ చేసుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేదు. నాకు అతని మీద జాలి వెయ్యలేదు. కోపం వచ్చింది. ఇక ఏమీ మాట్లాడకుండా చివుక్కున వెనుతిరిగాను. విసవిసా నడుస్తూ హాస్పిటల్ మెట్లు దిగి కారులో కూర్చున్నాను. పరిగెత్తుతున్నట్లు నడుస్తూ సాంబమూర్తి కూడానన్ను అనుసరించాడు. ఇంకా అతని చేతిలో ఫైలు అలానే ఉంది. దాని అట్ట మీద రాసి ఉన్న మురళీమోహన్ పేరు చూడగానే నా కోపం మరింత హెచ్చింది.

    "అదిటివ్వు..." అన్నాను.

    సాంబమూర్తి ఆ ఫైలు నాకు అందించాడు. అందులో ఆఖరి పేజీ తీసి నాలుగు వాక్యాలు కసిగా రాసి దాన్ని మూసి తిరిగి అతనికి ఇచ్చాను. ఆత్రుతగా ఫైలు తీసుకుని ఏమి రాశానో చూశాడు సాంబమూర్తి అతని మొహం ఆశ్చర్యంతో జేవురించింది. బహుశా అతనికి కూడా మురళీమోహన్ మీద జాలి ఉందనుకుంటా. అతననుకున్నట్లు నేను రాసింది లేకపోవటంతో తలెత్తి నావైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.

    "నా దారి కూడా మురళీమోహనే చూపించాడు. అతను చెప్పిన కథలో తేలు లాంటివాడిని నేను." అన్నాను పెద్దగానవ్వుతూ...

(విపుల మాసపత్రిక అక్టోబరు 2015 సంచికలో ప్రచురితం)
Comments