తెర తీయనా... - అన్వర్

    చాలాసేపటి నుంచి నిద్రపట్టకపోవడం వల్ల నిద్రకోసం ప్రయత్నాలు చేస్తుంటే అప్పుడు పడింది నా దృష్టి గోడ మీద - గోడమీది చీమమీద. చీమ తనకంటే చాలా బరువైన పంచదార గుళికను ఎదురుకాళ్లతో లాక్కెళుతుంది పైకి - తన జీవితకాలపు ప్రయాణంలా గమ్యంవైపు. జారుతూ మళ్ళీ పైకి పాకుతూ సాగుతోంది చీమ. మధ్యాహ్నం పడుకుంటే అన్రథమంటారు కానీ నాకైతే అర్థవంతమైన జ్ఞానం సంపాదించినట్టయింది - చీమ పెనుగులాట చూశాక.     నేను లేవకుండానే నాలో ఎన్నో ఆలోచనలు లేస్తూ స్వైరవిహారాలు చేస్తున్నాయి. మనసు తెరలు తొలుగుతూ - నడిచొచ్చిన దారులన్నీ స్పష్టంగా, వొదిలొచ్చిన మిత్రులంతా మొఖం దగ్గరే నిలబడ్డట్టు స్పష్టంగా...

    అందర్నీ పిలుస్తున్నను తెరమీదికి...తెరతీయనా!
    నేనీ జీవితాన్ని ఒక ఎత్తుకు తీసుకెళ్ళి ఇంకా ఎత్తుకు తీసుకెళ్లలేక నిలబెట్టాను. ఇప్పుడు ఈ జీవితం ఆ ఎత్తు నుంచి కిందికి జారుతూ జారుతూ...
    జీవితాన్ని ఎత్తుకు మోయడానికి పడ్డ శ్రమ కంటే జారుతున్న ఈ జీవితాన్ని నిలబెట్టడానికి పడుతున్న శ్రమ నిజంగా చెమటలు పట్టిస్తుంది. ఎత్తెక్కడానికి ఏ ఒక్కరి సాయం లేకపోయినా కొంతెత్తు పరుగెత్తానే కానీ జారుతున్న ఈ జీవితాన్ని కనీసం అక్కడే నిలబెట్టడానికై కొందరి సాయానికై చూస్తున్నా -

* * * * *

    కలలాంటి నిద్రలోంచి, నిద్రలాంటి కలలోంచి బయటికొచ్చి తలవాకిట కుదురుగా కూర్చుని నేనొక లేఖ రాస్తున్నాను - ధీర్ఘంగా, సుధీఘంగా. వీలు చూసుకొనో, వైలు చేసుకొనో రాస్తున్నది కాదు - వీలునామా లాంటి లేఖ. ఈ మాట బాలక్రిష్ణకు చెపితే, వీలునామా అయినా రాయి లేదా లేఖైనా రాయి. అంతే కనీ వీలునామా లాంటి లేఖ రాయకు - వుండదు అంటాడు తన 'లా' పరిజ్ఞాన్నంతా నా మీద కుమ్మరిస్తూ. రాత్రంతా లేని నిద్రతో ఒళ్ళంతా ఆవలింతలై కళ్ళింతగా చేస్తు ఈ వీలునామా లేఖ పోస్టుచేసేది కాదు కాబట్టి. కేవలం నా కోసమే నాకు నేను రాసుకుంటున్నది కాబట్టి.

    పిచ్చి ఎవరికైనా వేయి రకాలు కావచ్చు లేదా కోటి రకాలు కావచ్చు. ఇది నా పచ్చి పిచ్చి కాబట్టి కోటి లక్షల రకాలు కావచ్చు. మీకు తెలుసా - నేను నాలాంటి నాలాగే, నాల్కులాగే, నాకుమల్లే అసలు నేనే ఇంకో మనిషెవరిలోనైనా వుంటానా - కన్పిస్తానా అని కన్పిస్తున్న ప్రతివారిలో వెతుక్కుంటున్నాను. ఇదేమాటను బాలక్రిష్ణకు చెప్పామా? మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని బహుశా నువ్వు వెతుకుతున్నావేమో? కానీ, నీ రక్తాన్ని, నీ మాంసాన్ని, నీ ఆలోచనల్ని, నీ ఆవేశాల్ని పంచుకొని లేదా పెంచుకొని పుట్టిన నీ పిల్లల్లో కూడా నిన్ను నీవు వెతుక్కోలేవంటాడు.

    తలమీద గోక్కొన్నట్లు తలలోపల, మెదడులోపల గోక్కోవాలని మీకెవ్వరికైనా అంపించిందో లేదో కానీ నాకైతే చాలాసార్లు అంపిస్తది. ఉక్కపోత కేవలం శరీరానికే కాదు మనసుకు ఎన్నిసార్లు పట్టలేదు. బయటే, లోపలి అంగాల్ని, అంగాంగాల్ని చలి వణికిచ్చినట్లు ఎండేమి చేయగలిగింది - ఒళ్ళును కాల్చడం తప్ప. వానేం చేసింది - ఒంటిని తడపడం తప్ప. మనసును తడిపినిదా? దాహం తీరిందా? రంగు రుచి వాసనలేని ఈ దాహం ఎందుకు తీరలేదు - ఈ దాహం తీరనిదా? నిజ్జంగా!
    ఏడవ తరగతి అయిపోయాక, స్కూల్ వొదిలి వేరే స్కూల్లో చెరాల్సొచ్చినప్పుడు - ఈ స్కూల్లోనే చదువుతాను. వేరే స్కూలెల్లను ఎనిమిదవ తరగతి నాకొద్దు అని ఏడ్చేసినప్పుడు సాయిలు సర్ ఏమన్నడు - నువ్వు బాగా చదివి పైకి రావాలిరా - తప్పదు. ఇక్కడ ఎనిమిదవ తరగతి లేదు కాబట్టి వేరే స్కూల్‌కు వెళ్ళాల్సిందే. కొన్ని రోజులైతే నువ్వే మమ్మల్ని మరిచిపోతావు. వెళ్ళు. ఇక్కడిలాగే బాగా చదువు అని కన్నీళ్ళు తుడిచి పంపినపుడు వచ్చిన నేను మళ్ళీ ఇన్నేళ్లకు 610 జీ.వో. గురించి స్టడీ సర్టిఫికెట్ అవసరమై స్కూల్‌కెళ్ళాను. నా కలలు, నా జ్ఞాపకాలు ఆనాటి ప్రదేశాలు ఏమైనాయో? ఎంత దుర్మార్గుణ్ణి. అమ్మలాంటి చిన్నప్పటి పాత స్కూలు - ఇన్నేండ్లలో ఒక్కసారైనా వెళ్ళి మొఖం చూసో, నా మొఖాన్ని చూపెట్టో వచ్చానా? చెప్పానే జీవితాన్ని పైకెక్కించుకుంటూ పోయిపోయి ఇప్పుడు కిందికి దొర్లుతున్నానని. 

    అమ్మ అనేది - నీకు వేరే ఊర్లో ఉద్యోగమొస్తే చూడ్డానికి ఎప్పుడైనా వస్తావా రా? పుట్టు పూర్వోత్తరాలు మేనమామకు తెలిసినప్పుడు కన్నతల్లికి తెల్వదా? కోపంగా చూసేవాణ్ణి. నన్ను ఎగతాళి చేస్తుందనుకునేవాణ్ణి. వందలు, వేలు లక్షల మందిలో తల్లిని సరిగ్గా చూడని కొడుకుల లెక్కలో నన్నూ కలిపేస్తుందని తెగ ఇదయిపోయేవాణ్ణి. ఊర్లోనే ఉద్యోగం వచ్చిన కొత్తలోనే అమ్మ చనిపోయింది. ఆమె చనిపోయి బతికిపోయింది కాని బతికుంటే నిజంగా రోజుకొక్కసారో, నెలకొక్కసారో, సంవత్సరానికో అమ్మను అమ్మలాగే చూసేవాణ్ణేనా? నాకే తెలీదు. అమ్మగర్భంలాంటి ఇండ్లను, అమ్మ ఒడిలాంటి ఇండ్లను ఎన్నింటిని ఖాళీ చేయలేదు - ఎలాంటి పశ్చాత్తాపాలు లేకుండా. వుండొచ్చిన ఇండ్లల్ల కనీసం గోడలైనా వెళ్ళి తడిమానా?

    నేను ఇక్కడినుండి అక్కడికి, అక్కడి నుండి ఇంకోక కాడికి మారుతుంటే గౌసియా ఏమనింది? నువ్వు జీవితం నుంచి బతుక్కై పారిపోతున్నావని. 'కిత్‌నే ఖిలోనోంసే ఖేలాహై తూ - అఫ్‌సోస్ ఫిర్‌భీ అకేలా హై తూ' అప్పటికి, ఎప్పటికి ఇంకా ఇలాగే పాడుకుంటూనే వున్నాను.  

    చాలా సంవత్సరాల తర్వాత సంపత్ కలిసి అప్పటివి, ఇప్పటివి, ఎప్పటెప్పటివో విషయాలు చెప్తూ చెప్తూ 'నీకు గుర్తందా - మన చిన్నప్పటి ఫ్రెండ్ సుజాత చనిపోయింది& - వెళ్ళాను. చనిపోయినప్పుడు కూడా బతినప్పుడు వున్నట్టే వుంది ప్రశాంతంగా, స్నేహంగా' అన్నడు. అంటూనే ఆగకుండా క్రికెట్ గురించి, సినిమాలగురించి, పుస్తకాల గురించి, ఎల్.ఐ.సి.పాలసీల గురించిచెప్పుతూనే వున్నాడు నేను 'సుజాత చావు' దగ్గరే ఆగిపోయానని తెలీక.

    నాకు తెలీక అడుగుతా - నా ముఖంలో బాధ కంపించదా? నేనే చెప్పాలా? నాకు చాలా బాధయ్యిందని? కాస్సేపు ఏడ్వాలనిపిస్తుందై? ఒకసారి, నాలుగురోజులుగా ఒళ్ళంతా కాలే లేవలేని జరంతో పడుకొని వున్నపుడు కూడా 'నాకు జరమొచ్చింది. ఏమీ తినట్లేదని నేనే చెప్పుకోవాల్సి వచ్చిందే స్నేహితులకు, తెల్సిన వాళ్లకు...
    దుఃఖాన్ని దాచడమే సర్వోన్నత కళ అనుకున్నాను. కానీ దుఃఖాన్ని తెలుపడమే సర్వోత్కృష్ట కళ అయ్యింది. ఎన్నిసార్లు ఫెయిలయ్యాను, ఫీలింగ్స్ ఎదుటివారికి చెప్పక, తెలుపక. గాయాలను కన్నీళ్ళతో కడుక్కునే నాకు ఏడుపే రేఅదు అనే ఈ లోకానికి ఎన్ని నవ్వుల్ని పంచలేదు. ఎన్ని మాటల్ని చెప్పలేదు. ఎన్ని నవ్వులాటల్ని భరించలేదు.

    వాడల నీళ్ళ కోసం బోరేస్తున్నారు. ఆ సప్పుడు గుండెను కోసినట్టుంది. రోజంతా బోరేస్తరంట. కాబట్టి సాయంత్రం ఇంటికి రానని అమ్మతో చెప్పినప్పుడు అమ్మ ఏమనింది. రేపు పక్కింటివాళ్ళు, ఎల్లుండి రాంచందర్ అంకుల్‌వాళ్ళు, ఆ తర్వాత కోమటోళ్ళ అమ్మవాళ్ళు ఇట్ల నాలుగైదు రోజులు ఈ బోర్ మన వాడలోనే వేస్తూన వుంటరు. మరి అన్నిరోజులు ఎక్కడికెళ్తవ్ చెప్పు? ఏం చెప్పాను. సైకిలే కదా - అటు ఇటు, అక్కడికి ఇక్కడికి, రాత్రివరకు తిరిగి తిరిగి వద్దామనుకున్నవాణ్ణి. భూమి కోత మనిషి గుండె కోతకన్నా దారుణం. నీళ్ళకోసం భూమిని కోస్తే ఏంటీ? బండను పగలగొడ్తే ఏంటీ? పనెవరిది? బాధెవరిది? అసలు అమ్మను అడగనుంటిని - నువ్వైనా ఆ సప్పుడు రోజంతా వింటూ ఎట్లుంటవు అని. ఏమైనా చెప్పేదా? నవ్వేదా?

    సృష్టిలో తియ్యనిది స్నేహమే కదా! నాకు పద్దెనిమిది మంది మంచి స్నేహితుల అమ్మలున్నరు. నా సొంత అమ్మ పంతొమ్మిదో అమ్మ. కిరణ్ వాళ్ళ అమ్మ ఫస్ట్. గిరి వాళ్ళ అమ్మ సెకండ్. శ్యాం వాళ్ళ అమ్మ థర్డ్... ఇట్లా. ఐత బాలక్రిష్ణకు స్నేహం గురించి చెప్పామా - సృష్టిలో అన్నీ తీసినవే తీయనిది ఏదీ లేదు అని శ్రీశ్రీ ఎక్కడో చెప్పిన విషయాన్ని చెప్తడు. ఇంకా పద్దెనిమిది అమ్మల లిస్టు చెప్తమా? పద్దెనిమిది పర్వాల లాగా అనుభూతుల్ని వివరిస్తమా! నాకు నచ్చిన విషయం నాది. ఇతరులకు నచ్చిన విషయం మనది - అనుకుంటున్నానిప్పుడు.
    గుడ్డు కూడా తినని స్నేహితునితో గుడ్డైతే తినిపించాను - స్నేహం కోసం గుడ్డైతే తిన్నాడు కానీ వాని స్నేహాన్ని ఎప్పటికోసం నిలుపుకోలేకపోయాను నేను. దూరం కావడానికి ఎవరిదో తప్పో, ఒప్పో కాదు. ఐతే, దూరమయ్యాకా కూడా ఇంకా దగ్గరైనట్టు అంపిస్తే - అదే నరకం. ఏం తినలేం. పడుకోలేం. సరిగ్గా ఏడ్వనూలేం. నిజంగా మనసును తోడేసినట్టే వుంటది.

    నేను చాలామందిని దోచుకున్నానంట! నిజమే 'హృదయాల్ని దోచాను.' హృదయాల్ని దోచినవాడు ఇంకేం మిగుల్చుతడు. 'ఇంకేం చెయ్యాలె చాలదా!' అనుకుంటర్ నా గురించి. ఈ జనాలకు 'గాలిబ్ గీతాల్ని' తాగండి, తినండి అని. ఏమంటడు గాలిబ్...
    'ఆమె ముద్దివ్వడానికైనా వెనకాడదేమో     అడగడానికి నేను వెనుకాడాను!' (గాలిబ్ -దాశరథి)     'ఎంకి ఎవరని ఎవరైనా అడిగితే     ఎలుగు నీడలవైపు ఏలు చూపించు' అనుకునేంతటి భావకలోకమా ఈ లోకం. 'తెలుసులే నీ కథలు' అంటరు? అసలు కథంటే ఏంటో తెలువకుండానే.     'నువ్వు మనిషివిరా' అంటరు కొందరు. 'అసలు నువ్వు మనిషివే కావు' అనంటరు ఇంకొందరు. అసలు నేను కాకుండా 'కొంచెం మీరు, కొంచెం వారు'. ఇంతకీ నేనెక్కడ వున్నాను -     'నేనడిగింది నీ చిరునవ్వుని     నోరంతా తెరుస్తావెందుకు?     నేనడిగింది నీ హృదయాన్ని
    ఒళ్ళంతా చూపుతావెందుకు?(ఎవరిదో...) చాలామందికి చాలాసార్లే చెప్పాను. ఏమంటరు. మళ్ళీ మళ్ళీ చెప్పు అంటరు. వాళ్ళే 'రవి కానని చోట కవి కానున్' అంటరు. 'రవిక ఆనని చోట కవి కానున్' అంటే ఎగిరి గంతెయ్యరూ!

    జనాలు తెలుగును తెలివిగా పరిహాసమాడుతరు. 'పొద్దున్నే లేచిపోతాను' అంటే 'ఎవరితో' అంటారు. ఇంకా మొఖం కడగలేదంటే 'ఎవరిది' అంటరు.
    నాతో చాలా మంది - తాళం పక్కింట్లో ఇచ్చాను - తీసుకో అని. 'తాళం పక్కింట్లో ఇచ్చ్నప్పుడు మరి ఇంటికి గొళ్ళం పెట్టావా' అన్నామా 'అర్థం చేసుకోవు -ప్చ్' అంటరు. దిక్కున్న కాడికెళ్ళి చెప్పుకోవాలి దిగులైనా, తెలుగైనా.
    స్వార్థం ఎక్కడ వుంది అంటే 'ఎక్కడ లేదూ' అనేది కాదు జవాబు. ఎదుటివారిని చూపెట్టామా - మన స్వార్థాలన్నీ బయట పడ్తాయ్. నోరే కదా పారేయడానికి - చెత్త కావాలా? నోరు పారేసుకోవచ్చు ఎవరైనా, ఎవరిమీదైనా - కావాలంటే అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు చూడండి. నమ్మకం కుదరడానికి, మనకూ అలవాటు కావడానికి.

    రాగమైనా రోగమైనా ఊరికేరాదు, ఊరికేపోదూ అన్నామా - అర్థమై చావదు ఎవ్వరికి.
    అవసరం వుంటే అన్ని పనులు వొదులుకుంటరు ఎవరైనా. అదే, ఎవరి అవసరం లేదనుకోండి. పనున్నా రారు. జీవితమంటే తెలుసుకోవడమా? చూడడమా? అనుభవించడమా? జీవితమంటే చావడమే నాకు తెలిసిన విషయం. చావడమంటే జీవితం మాత్రం కాదు.     డొంకతిరుగుడు డొక్కలెండిన వారికి తెలుస్తదా?     నీ ఒక్కడికే చెప్తున్నా. పిచ్చివాడెవ్వడూ పిచ్చివాడు కాదు. మంచివాడెవ్వడూ మంచివాడుకాదు లాగా అన్నామా - 'మరి చెడ్డవాడెవ్వడూ చెడ్డవాడు కాదా' అడుగుతడు బాలక్రిష్ణ. ఏడురంగులు కలిస్తే తెలుపే. కానీ తెలుపే ఏడు రంగులు కాదు. అన్నామా 'లా' పుస్తకాలతో కొడ్తడు బాలక్రిష్ణ.     ఏం చదివామన్నది కాదు. కానీ ఎందుకు చదివామన్నది కావాలి అంటాను. అప్పుడు లేని ప్రశ్నలు, రాని జవాబులు కోకొల్లలు వేస్తరు ఈ జనాలు.     ఎవరికి తెలుసు గురువుకూడా మానసికంగా విద్యార్థిని హింసిస్తడని? ఎవరికి చెప్పుకోలేక ఎడ్చే వయస్సే కానీ నలుగురికి చెప్పి గురువైనా సరే నిలబెట్టి ప్రశ్నించే వయస్సు కాదాయె కాలేజీ చదువప్పుడు.     రవికి నా పరిచయంలో కొత్తలోకాన్ని సృష్టించిన వాణ్ణి. నా మాట, నా నడక, నా నడత, నా నవ్వు, నా చూపు, నా ఆట అన్నీ నేర్చిన రవి ఎన్నిసార్లు నిలదీయలేదు నన్ను. 'ఎవరినుంచైతే దొంగిలించామో వళ్ళని క్షమించడం కష్టం' అని కదా అన్నది చలం.
    ఇగేం చెప్పను కనీ... కొన్ని అనుమానాలు. కంటికి నొప్పైనా, పంటికి నొప్పైనా, కాలికి నొప్పైనా మందు మాత్రం నోట్లో వేసుకోవలసినదేనా? ఎక్కడ నొప్పైతే అక్కడే మందేసుకునేటట్టయితే మనకు ఇన్ని బాధలు ఉండకపోవు కదా! ఇన్ని రియాక్షన్‌లు అసలే ఉండకపోవు కదా -

    అవసరం వున్నా లేకపోయినా అన్ని చోట్లకీ దేహాన్ని పూర్తి అంగాలతో మోసుకు తిరుగుతున్నాం. కనీసం రెండ్రెండు అంగాలున్న వాటినన్నా ఒక్కొక్క అంగం దాచుకుని వెళ్ళేటట్లు రోజులు రావంటారా? అర్థం చేసుకోండంతే!
    అన్ని దేశాల్లో మన భాష నడుస్తున్నప్పుడు మన రుపాయి అన్ని దేశాల్లో ఎందుకు నడవదు? ప్చ్...     మనం మారినమంటే ఎవ్వరూ నమ్మట్లేదు. కానీ నీళ్లను కూడా కొంటున్నం కదా అంటే అందరూ నమ్ముతరు - నవ్వుతరు. మరి నేను గాలిని కూడా అమ్ముదామనుకుంటున్నాను. స్వచ్చమైన ఓజోనైజ్డ్ ఏర్ పాకెట్స్! కొనరా ఏంటీ?     ఇప్పుడు అమెరికా పాట్లు కాదు - గ్రహాంతర పాట్లు. నేలకోసం, నీళ్ళకోసం ఉద్యమాలు మాని ఉద్యమిద్దాం రండి - చంద్రమండలం మీద ప్లాట్ల కోసం, ఫ్లాట్ల కోసం.     చూస్దామంటే గోడమీద చీమలేదు. చెప్దామంటే నా మనసులో ఆవేదన లేదు. తెరలు తెరలుగా తెరతీశాకా... మళ్ళీ తరాల దుఃఖాన్ని మోయగలను. తలరాత...తలపోత...తలకట్టు, గుడి, దీర్ఘం, కొమ్ము, కొమ్ముదీర్ఘం... ఆగిపోతున్నాను సూదీర్ఘంగా. దరువులన్నీ ఆగిపోయాక తెరవేతున్నాను - తరతరాల నా తరానికి, ఆంతర్యానికి.

* * * * *
    అరరే, కిందికి జారుతున్న బతుకు ఆగిందే!     గెలిచిన చోట నిలబడాలంటే     నిలబడ్డ చోట గెలవాలె కదా! 

(తేజ తెలుగు వీక్లి ఏప్రిల్ 03 -2009 సంచికలో ప్రచురితం)
    

    
    
Comments