తెరతీయగ రాదా... - కోడూరి శ్రీరామమూర్తి

    రైలు కదులుతుండగా సిగరెట్ ముట్టించి - పొగ వదులుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాను.     మరో పది నిముషాలలో రామాపురం వచ్చేస్తుంది.     కాని, - నాకు పది నిముషాలు పది గంటల్లా కనబడుతున్నాయి.     రామాపురం - ఇందిర -శ్రీనివాసరావుగారు - శేఖరం - ఎన్నెన్నో పేర్లు నా మస్తిష్కంలో తిరుగాడుతున్నాయి.     ఎంత అందంగా ఉండేది ఇందిర!     తల్లో నిండుగా పువ్వులు పెట్టుకుని అచ్చు మల్లెపూవులా నవ్వేది.     అందమైన ఇందిరను చూచి - మరింత అందమైన ఆ అమ్మాయి నవ్వు చూచి శేఖరం పిచ్చెక్కిపోయేవాడు. "బ్రదర్ - ఈ జీవితంలో నాకు పెళ్ళంటూ జరిగితే అది ఇందిరతోనే జరుగుతుంది -" అనేవాడు. శేఖరం మాటలు నిజం కావాలనీ వాడి ఆశలు చిగురించి పుష్పించాలనీ కోరుకునేవాణ్ని నేను. కాని జరిగిందేమిటి? విధి శేఖరానికి దాచిన అదృష్టమేమిటి? - భారంగా నిట్టూర్చాను.     శేఖరం చాలా తెలివైన వాడు. ఇందిర అనే అమ్మాయి కాలేజీలో చేరకుండా వున్నట్టయితే - శేఖరం ఈపాటికి ఏ ఐ.ఏ.యస్. ఆఫీసరో అయి ఉండేవాడు. అదృష్టం అంచు మీద కూర్చొని - సామాన్యులందరికీ చేయి అందిస్తూ ధైర్యం చెప్పాల్సిన శేఖరం - నలుగురి చేత 'అయ్యో పాపం' అనిపించుకున్నాడు. దురదృష్టపు అగాధాల్లోకి జారిపోయి సామాన్యులు కుడా క్రిందకు చూడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు.     అతడిని చూచి అసూయపడాల్సిన ప్రపంచం - అతణ్ని చూచి జాలిపడింది.

    చాటుమాటున హేళనకూడా చేసింది. మనుష్యుల జీవితాలు ఎంత చిత్రంగా మారిపోతాయి?
    అప్రయత్నగా నా మస్తిష్కంలో జ్ఞాపకాల పుటలు వెనుతిరిగాయి.
* * * * * *
    ఇందిరను కాలేజీ జీవితం తర్వాత - నేను తొలిసారిగా చూసింది మద్రాస్‌లోని ఉడ్‌ల్యాండ్స్ హోటల్లో.     ప్రక్క కాటేజీ దగ్గర కారులోంచి దిగుతున్న యువతిని చూడగానే ఒక్కసారిగా గుండెలు ఆగినట్టయింది. మెదడు పనిచేయడం మానేసింది. మనస్సు గబగబా అయిదేళ్ళు వెనక్కు పోయింది. 'ఇందిర' అనే పేరు నా గుండెల్లో ప్రతిధ్వనించింది. బి.ఏ.చదువును మధ్యలోనే ఆపేసిన ఇందిర...వెనుక చెప్పుకోదగ్గ ఆస్థిపాస్తులు లేని ఇందిర...ఇలాంటి హోటల్లో...ఇంత ఖరీదయిన జీవితంలో... నమ్మలేక పోయాను. 'నువ్వు పొరబడుతున్నావు. ఆ అమ్మాయి ఇందిర కాదు - కాలేదు' మనసులోని మరో వ్యక్తి గోలపెట్టాడు.     వెంటనే రిసెప్షన్ రూముకు వెళ్ళి కాటేజ్ నెంబర్ టెన్ పేర వ్రాసి ఉన్న నేమ్‌కార్డును చూశాను. "జి.శ్రీనివాసరావు, జమీందార్, రామాపూర్" అని వ్రాసి ఉంది. ఒక్కసారి గుండెలు వేగంగా స్పందించాయి. శ్రీనివాసరావు గారి పేరు నాకు సుపరిచితం. సంగీత సాహిత్య కళాపోషకుడు...గొప్ప శ్రీమంతుడు...దానకర్ణుడు...అలాంటి శ్రీనివాసరావు గారితో ఇందిర - మనసులో ఏదో అనుమానం మూలిగింది. చివరకు ఇలా దిగజారిందా ఇందిర? - గుండెల్లో ఏదో బాధ, కోపం పులుముకున్నాయి. కాని,- నిజం కాదేమో - ఆమె ఇందిర కాదేమోనన్న అనుమానం గుండెల్లో ఏదో మూల కలుక్కుమంటూనే వుంది.     ఆలోచనలతో కాటేజ్ చేరుకున్నాను నేను. ఇంతలోనే టెలిఫోన్ మ్రోగింది. మానేజింగ్ డైరెక్టర్ కేంప్ నించి రాలేదు కదా అనుకుంటూ ఆతృతగా ఫోన్ రిసీవ్ చేసుకున్నాను.     ఏదో స్త్రీ కంఠం - నాకు అతి పరిచయమైంది - నేను మరిచిపోలేనిది - నన్ను పలుకరించింది.     "హలో - మాట్లాడేది రామనాథంగారేనా?"     "అవును...మీరు..."     తియ్యగా నవ్వింది అవతలి కంఠం -     "ఇందిరని జ్ఞాపకం వున్నానా?"     గుండెల్లోంచి ఏదో ఆవేదన - ఆశ్చర్యం - చెప్పలేని అనుభూతి.     "నువ్వు..."     "అవును - ఇక్కడే ఈ హోటల్లోనే. మీ పక్క కాటేజీలోనే వుంటున్నాను. ఇవాళ పొద్దున నువ్వు వరండాలో వుండగా చూశాను. ముందు ఓ క్షణం తటపటాయించాను గానీ ఆ తర్వాత గుర్తుపట్టాగలిగాను. మనిషివి బాగా లావెక్కావు. పైగా కమాండర్‌లా మీసాలు పెంచావు కూడాను - " గలగలా నవ్వుతోంది ఇందిర.

    అదే ఇందిర - అయిదేళ్ళ క్రిందటి ఇందిర. అదే నవ్వు! అయిదేళ్ళ క్రిందటి నవ్వు. తను ఏనాటికీ మరిచిపోలేని నవ్వు - మనిషిలోని పురుషత్వాన్ని బుసలు కొట్టి లేపుతూ పిచ్చెక్కించే నవ్వు. గుండెల్లో కెలికినట్టయింది. మాటలు ఓ క్షణం వరకూ పెగల్లేదు. ఎంత నిర్భయంగా హాయిగా తేలిగ్గా నవ్వగలుగుతోంది ఇందిర?     "ఊ! ఏం చేస్తున్నావిప్పుడు? కొంపదీసి సినిమాల్లో విలన్ వేషాలు వేయటం లేదుకదా!... వాటం చూస్తే అలానే వుంది మరి..."     మళ్ళీ నవ్వు.     "విలన్‌గా ప్రవర్తించటం కొందరికే అలవాటవుతుంది ఇందిరా! ఇంకా నా కలాంటి మనస్తత్వం రాలేదు..." కసిగానే అన్నాను.     "డోంట్ వర్రీ. అదేమంత కష్టమైన విద్యకాదు. పోనీ అంతగా కావాలంటే నా దగ్గర నేర్చుకుందువుగాని. అది సరేగాని - మిష్టర్ నాథ్ ఏళ్ళు మారినా ఇంకా నువ్వు మారలేదోయ్. చెప్పదలచుకున్నది సూటిగా చెప్పడం ఇంకా నీకు అలవాటు కాలేదు. నీ వాటం చూచి బాగా మారావనుకున్నాను. అది సరేలే ఏమిటి ఇవ్వాళ ప్రోగ్రాం? ఆదివారం కదా - ఖాళీయేనా - ఎంగేజిమెంటు ఏదయినా వుందా?"     నిజానికి నాకు ఇందిరని కలుసుకోవాలనే వుంది. ఆవిడను చూశాక మాటలు విన్నాక ఇక ఉండబట్టలేకపోయాను. నా ఆవేశాన్ని, ఉద్రేకాన్నీ మాటల రూపంలోకి తెచ్చుకోవాలి. ఆ మాటల్ని ఇందిర ముందు కుమ్మరించాలి. నా ఆవేదన చల్లార్చుకోవాలి.     "...ఎంగేజ్‌మెంట్ ప్రస్తుతానికి ఏమీలేదు. మా మేనేజింగ్ డైరెక్టర్ రాకకోసం ఎదురుచూస్తున్నాను. ఆయన కేంప్‌నించి వచ్చేంతవరకూ నాకూ పనిలేనట్టే..."     "అయిత ఇంకేం? మధ్యాహ్నం భోజనం మా కాటేజీలోనే చేద్దువుగాని. తోడు ఎవరూ లేరుగా - కాటేజ్‌కు తాళం వేసి బుద్ధిగా ఇక్కడి కొచ్చేసెయ్యి. మావారు - అదే శ్రీనివాసరావుగారు ఇక్కడే ఉన్నారు. ఆయన్ని నీకు పరిచయం చేస్తాను -"
    మరో 'షాక్' తిన్నట్టనిపించింది. అందగాడు, తెలివైనవాడు అయిన శేఖరం జీవితాన్ని నడిసంద్రంలో వదిలేసిన ఇందిర - ఈ రోజున నడివయస్కుడయిన శ్రీనివాసరావుకు - అర్థాంగి అయిందా? నమ్మలేని నిజం చెవుల్లో ఘోష పెట్టింది. ఛి, ఛీ; ఎంతకు తెగించింది ఇందిర? శ్రీనివాసరావుగారి మీద నాకు పరోక్షంగా ఉన్న గౌరవం, ఇందిర మీద ప్రత్యక్షంగా ఉన్న అసహ్యమూ - పోటీలు పడి ప్రజ్వలించాయి. అప్రయత్నంగా నా కళ్లెందుకో ఆర్ద్రమయ్యాయి.

    "చూడు శేఖర్. ఇదీ నీ ఆరాధ్యదైవం. ఈ పిశాచి పాలబడి పండంటి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావ్ - ఈ పిశాచానికి కావలసింది డబ్బు నీక్కావలసింది మమతల మధురిమ. గడ్డిపూవులో మకరందాన్ని ఎందుకు ఆశించావు శేఖర్?" అస్పష్టంగా నాలో నేను గొణుక్కున్నాను.
    "ఏం మాట్లాడవు? ఒప్పుకొన్నట్లేనా?" బలవంతం చేస్తోంది అవతలి కంఠం.     "ఓ యస్. మరో అరగంటలో వస్తున్నాను -"
    "థేంక్స్ -" టెలిఫోన్ డిస్‌కనెక్ట్ అయింది.  

* * * * * *

    ప్రక్క కాటేజ్‌లోకి వెళ్ళేసరికి దంపతులిద్దరూ నాకోసం ఎదురు చూస్తున్నారు.
    నేను బెల్ నొక్కగానే తలుపుతీస్తూ -     "రా..." అంటూ నవ్వుతూ ఆహ్వానించింది ఇందిర.     మనిషి చెక్కు చెదరలేదు. చివరిసారిగా ఆమెను చూసిన తర్వాత ఆమె వయస్సు మరో అయిదేళ్ళు ముందుకు పోయినా - ఆమెలోని యౌవనం మాత్రం మరో అయిదేళ్ళు వెనక్కు పోయినట్టే అనిపించింది. మంచి అంగ సౌష్టవం, మనుషులను మత్తెక్కించే ఒంపులు, ఆకర్షణ - ఉన్న ఇందిరను చూచినవాళ్ళు మనస్థైర్యాన్ని నిలుపుకోవడం ఒకింత కష్టమే. అందుకే ఆమెకు మొగవాళ్ళంటే ఒక ఆట అయింది.     "ఈయనే - మిష్టర్ రామనాథం - బి.ఏ.లో నా క్లాస్‌మేట్. ప్రస్తుతం..." అంటూ ఆగిపోయింది ఇందిర.     "నియోలైట్ ట్రేడర్స్ ఎక్కౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాను" అన్నాను ఇందిర అర్థోక్తిని అందుకుంటూ.     "ఓహో! నియోలైట్ ట్రేడర్సా? శంకరన్ పిళ్లె కదూ!" అన్నారు శ్రీనివాసరావుగారు నన్ను కూర్చోమని చెబుతూ.     "అవును. ఆయనే మా మేనేజింగ్ డైరెక్టర్ - బహుశా వారు మీకు తెలుసుననుకుంటాను -"     కొద్దిగా నవ్వుతూ అన్నారు శ్రీనివాసరావు గారు -     "అతను తెలియక పోవడమేమిటి? - పది సంవత్సరాల క్రితం అప్పు కావాలంటూ నన్ను తెగ ప్రాధేయపడేవాడు. పదిహేనేళ్ళ క్రితం అయితే అతనికి మద్రాసులో కేరాఫ్ యెడ్రసే లేదు - యిప్పుడు బాగా వృద్ధిలోకి వచ్చాడని విన్నాను -"     "అవును మంచి టర్న్ ఒవర్‌లో నడుస్తోంది కంపెనీ - " అన్నాను. అంతలో హోటల్ బోయ్ కాఫీ ట్రే పట్టుకొచ్చాడు.     కాఫీ కలుపుతూ అంది ఇందిర - 

    "యిక్కడ కూడా మనీ మేటర్సేనా? మీకు తెలీదేమో! నాథ్ చాలా బాగా పాడతాడు. కర్నాటిక్ మ్యూజిక్ అయితే మరీనూ - అయితే, పాపం కాలేజీ స్టేజి మీద మాత్రం అతగాడిని యెప్పుడూ అది పాడనిచ్చేవారు కాదు. ఇంతా విద్యా నేర్చుకుని లొల్లాయి పాటలు పాడేవాడు. మంచి మెలోడియస్ వాయిస్-"
    "ఈజిట్ సో? - అయితే ఇవాళ మాకు మంచి కాలక్షేపం" అన్నారు శ్రీనివాసరావుగారు మీసాన్ని దువ్వుకుంటూ.
    
    "ఇందిర అభిమానంతో అంటోంది. నాకొచ్చిన విద్య చాలా తక్కువ. అందులోనూ మీలాంటి వాళ్ళ దగ్గర పాడటం - అసలు మీతో మాట్లాడాలంటేనే నాకేదో జంకుగా వుంది. మీ పేరు నాకు కాలేజీలో చదువుకునే రోజులనించీ సుపరిచితం. మీపేరనున్న కాలేజీలు, ధర్మ సమ్ష్తలు, మీరు అచ్చువేయించిన సాహిత్య గ్రంథాలూ, నిఘంటువులూ, విజ్ఞాన సర్వస్వాలు, ఎన్నెన్నో నాకు తెలుసు. మీవంటి పెద్దలతో మాట్లాడటమే ఒక అదృష్టం. ఇక విద్యా ప్రదర్శన కూడానా?" అన్నాను.
    నా మాటలకు శ్రీనివాసరావు గారు భళ్ళున నవ్వారు.     "చూడండి మిష్టర్ నాథ్ - మీరు మాట్లాడుతున్నది నాగురించి కాదు. లేట్ శ్రీనివాసరావు గురించి. ఆయన చచ్చిపోయాడు. యు బిలీవ్ మీ - ఆయన చచ్చిపోయాడు!"

    అర్థం కానట్టు - అయోమయంగా చూశాను.     మళ్ళీ శ్రీనివాసరావుగారే మాట్లాడారు -     "నిజం - జమీందార్ శ్రీనివాసరావు ఎప్పుడో చనిపోయాడు. యింకా చనిపోకపోతే - హి మస్ట్ డై. జమీందారీలు ఏనాడు పోయాయో ఆనాడే ఆ శ్రీనివాసరావు చచ్చిపోయాడు. ఇక చేసిన దాన ధర్మాలంటారా వాటిని లోకం ఎప్పుడో మరిచిపోయింది. పైగా కాలం మారిపోయింది. ఇదివరలో యెంతగా దానాలిస్తే అంత గొప్పవాడనేది ప్రపంచం. యిప్పుడలాకాదు - ప్రజల డబ్బు ఎంత పోగేయగలిగితే అంతటి ఘనుడంటోంది ప్రపంచం. అలాంటి వాళ్ళకు లోకం భయపడుతుంది. వాళ్ళని ప్రజానాయకుల్ని చేసి మకుటాభిషేకం చేస్తోంది. మారోజులు మారిపోయాయయ్యా. యింకా వాటి గొప్పలెందుకు? యుమస్ట్ ఆల్సో ఛేంజ్ విత్ టైమ్స్. మమ్మల్ని మరచిపోవాలి నువ్వు..."
    ఆయన మాటల్లోని వ్యంగ్యం, బాధ చిత్రంగా ధ్వనించాయి.     మారిపోయిన ప్రపంచాన్ని చూచి ఆయన అసూయపడుతున్నాడో, బాధపడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఈ మాటలు అన్నప్పుడు ఆయన గొంతు వణకడం స్పష్టంగా విన్నాను.     మాటల మధ్యలో అంది ఇందిర -     "నాథ్! ఈ మాటలన్నీ ఎందుకు? నువ్వు పాడి తీరాల్సిందే - ఏదో ఒక మంచి త్యాగరాజ కీర్తన - నీకిష్టమైంది ఏదయినా సరే..."

    అభేరి రాగంలో "నగుమోము కనలేని" పాడాను.
    పాడుతున్నంత సేపూ లయబద్ధంగా శ్రీనివాసరావుగారు తాళం వేస్తున్నారు. ఆ తర్వాత అన్నారాయన.     "చాలా మంచి కీర్తన పాడేవయ్యా. నాకీ కీర్తన అంటే యెంతో ఇష్టం. నిజానికి - ఇందులో ఉన్న సాహిత్యపు విలువ ఏ కొద్ది కావ్యాలలోనో దొరుకుతుందేమో - చూడు - 'ఖగరాజు నీయానతి విని వేగ చనలేదో - గగనంబు కిలకూ బహుదూరం బనినాడో -' ఎంత నమ్మకమయ్యా, ఆయనకి శ్రీరామచంద్రుడి మీద. పొరబాటేదో ఆ పక్షివల్లే జరిగివుంటుంది. నువ్వు ఎప్పుడూ యింత ఆలస్యం చెయ్యవు. అదీ ఆయన విశ్వాసం. ఈ భావన నిజంగా కవులకు రావలసిందె. ఇక వరాళి రాగంలోని పంచర్త్నంలో శ్రీరాముడిని యెంత శృంగారంగా చూసాడో చూడు - 'కలకలమను ముఖకళగల సీతను ఓర కన్నుల చూచే నిను కన రుచిరా...' శృంగారం, భక్తీ యెంతబాగా కుదిరాయయ్యా ఇక్కడ? అందుకే నాకు త్యాగరాజు ఒక గొప్ప వాగ్గేయకారుడిగానే కాక - కవిగా కూడా కనబడతాడు -"     వింటూ వుండిపోయాను నేను.

* * * * * *
    ఆరోజు రాత్రి ఎనిమిది గంటల వేళ టెలిఫోన్ మ్రోగింది.     "నేను - ఇందిరని మాట్లాడుతున్నాను - నాథ్ నువ్వేన?"     'ఊ'కొట్టాను నేను.     "చూడు నాథ్. నీతో ఏకాంతంగా మాట్లాడాలి - శ్రీనివాసరావు గారు బెంగుళూరు వెళ్ళారు. రెండు రోజులదాకా రారు. ఈ రాత్రి నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. తొమ్మిది గంటలకు మా కాటేజ్‌కిరా"     "నాతోనా? ఏకాంతంగానా? తొమ్మిదికా?" గొంతు యెందుకో వణికింది.     "ప్లీజ్. తప్పకుండా రావాలి. బి ఏ గుడ్ బోయ్" ఫోన్ పెట్టేసింది ఇందిర.     నా గుండెల్లో అగ్నిగోళాలు బ్రద్ధలయ్యాయి. మస్తిష్కంలో ఆవేదన పెనుతుఫానులాగా చెలరేగింది. నిజం - ఈ అవకాశాన్ని నేను జారవిడుచుకోకూడదు. శేఖర్‌కు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పమని అడుగుతాను. ఇందిర గుండెల్లోని క్రూరత్వాన్ని బయటకు పెకిలించి హేళన చేస్తాను. నా కక్షను చల్లార్చుకుంటాను - భారంగా నిట్టూర్చాను నేను.     తలుపు తట్టగానే నవ్వుతూ పలకరించింది ఇందిర.     "వెరీ పంక్చ్యువల్"     లేని నవ్వు మొఖం మీద తెచ్చిపెట్టుకుంటూ అన్నాను నేను -     "నన్ను పిలిచిన కారణం..."

    "వెరీ సిల్లీక్వశ్చన్. అయిదేళ్ళ తర్వాత కలుసుకున్న మనుషులు మాట్లాడుకోడానికి కారణాలంటూ ఉంటాయా? యెందుకు నీకింత భయం, సంకోచమూను. పెద్ద ఆఫీసరువు నువ్వు. కానీ బుద్ధులు మాత్రం ఏమీ మారలేదు. ఊళ్ళో బాంబులు పడుతున్నా పుస్తకాలు భట్టీయం వేయడం మానని వెనుకటి రామనాథమే జ్ఞాపకం వస్తున్నాడు నాకు..."     సిగరెట్ ముట్టిస్తూ అన్నాను-     "నా సంగతి వదిలేసెయ్ - నేనెప్పుడూ అలాంటి వాణ్ణే. కాని, నీ భావాలకు తగ్గవాడనుకొని కొన్నాళ్ళు నువ్వ్ ఆరాధించిన శేఖర్ గురించి కొంచెం తెలుసుకోవాలి నువ్వు - అతడిప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? కనీసం తెలుసుకోవాలని కుతూహలమైనా వుందా నీకు?"     స్థాణువులా కూర్చొని వింటోంది ఇందిర.     సిగరెట్ నుసిని ఏష్‌ట్రేలో పారేస్తూ భారంగా నిట్టూరుస్తూ అన్నాను నేను -     "శేఖర్ చచ్చిపోయాడు."     "అవును తెలుసు" నూతిలోంచి వచ్చినట్టుగా వుంది ఇందిర గొంతు.     షాక్ తిన్నట్టయింది.     "తెలుసా? ఎలా? ఎవరు చెప్పారు?" తడబడే గొంతుకతో అన్నాను.     "ఎవరూ చెప్పలేదు. నిజానికి చెప్పవలసిన అవసరం లేకుండా చచ్చిపోయేముందు శేఖరం మా యింటి ఎడ్రస్‌కు ఉత్తరం రాశాడు. అది రామాపురానికి రీడైరెక్ట్ అయి వచ్చింది. బహుశా నాకా ఉత్తరం అందేనాటికే శేఖరం చచ్చిపోయి వుంటాడు" గాద్గదికమైంది ఆమె గొంతు.     "ఎందుకు చచ్చిపోయాడు శేఖర్? ఎవరు చంపేసారతన్ని?" కోపంతో వణుకుతోంది నా గొంతు.     "బలహీనుడు కాబట్టి చచ్చిపోయాడు. పిరికితనం అతణ్ని చంపేసింది"     హేళన ధ్వనించింది ఇందిర గొంతులో.     "నువ్వు రాక్షసివి - నీకు హృదయం లేదు" పళ్ళు కసిగా కొరుకుతూ అన్నా.     "నీ చేత ఆ మాటలనిపించుకోవాలనే ఇవాళ నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. నన్ను కసిదీరా తిట్టు నాథ్. నా జీవితం నాశనమైపోవాలని శపించు. నా అందం వల్లకాట్లో నుసైపోవాలని శపించు - ఆపావేం? కానియ్యి" ఉద్రేకంతో ఇందిర గొంతు వణికింది.     ఆ ఇందిర మాటలు వింటూంటే నాకేదో సంచలనం కలిగింది. హఠాత్తుగా నా వాక్ప్రవాహానికి ఎవరో ఆనకట్ట కట్టినట్లనిపించింది. ఓ క్షణం మాటలు పెగలలేదు.     మళ్ళీ ఇందిరే మాట్లాడింది.     "నీకు శేఖరం మిత్రుడు, రూమ్‌మేట్ మాత్రమే. కాని, నాకు అతడు ప్రాణంలో ప్రాణం. ఆరాధ్యదైవం. ఆ మాట మాత్రం మరచిపోకు - నువ్వన్నట్లు నేనతణ్ని చంపానే అనుకో. కానీ నువ్వు ఊహించినట్టు నేనతడి హృదయంతో ఆడుకోలేదు. అతడి ఆవేదన చూచి ఆనందించలేదు."

    "అదే నిజమైతే ఆనాడే నువ్వు శేఖరాన్ని ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? అతణ్ణెందుకు నిరాకరించావు?"
    "ఈ ప్రశ్నకు సమాధానాన్ని నన్నెంతో అర్థం చేసుకున్న శేఖరే అర్థం చేసుకోలేక పోయాడు. ఈ ఇందిర నీకంత తేలిగ్గా అర్థమౌతుందనుకోకు - నీ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెబుతాను. కాని - యిప్పుడు కాదు. నువ్వు నన్ను సానుభూతిగా అర్థం చేసుకోగలిగినప్పుడు - దానికి మరింత కాలం పట్టక తప్పదు."     "మరింత కాలం కావల్సింది నాకు విచక్షణ జ్ఞానం పెరిగేందుకు కాదు. పిరికిదనం నుంచి నువ్వు బయట పడేందుకు. నీ పాపాన్ని నువ్వు ధైర్యంగా ఒప్పుకునేందుకు -" ఉద్రేకంగా అన్నాను నేను.     విచిత్రంగా నవ్వింది ఇందిర.     "నువ్వు ఏమన్నా అనుకోవచ్చని ముందే చెప్పాను. ఇక గతాన్ని గురించి ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదు. తెలిసో తెలియకో నేను, శేఖర్ ఇద్దరమూ జీవితంలో దెబ్బతిన్నాం. శేఖర్ తన గాయానికి ఉపశమనం కలిగించుకున్నాడు. నేను బాధ మరచిపోలేక అవస్థపడుతున్నాను. అంతే తేడా. పోనీలె. అదంతా ఎందుకిప్పుడు? బయట వర్షం పడుతోంది. గుండెల్లో చలి పెరుగుతోంది. వేడిదేమయినా పడాలిప్పుడు. ఒక్క నిముషం వుండు - ఇప్పుడే వస్తాను."     బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి ఇందిర కాసేపట్లో 'ఓల్డుస్మగ్లర్' విస్కీ బాటిల్‌నూ జీడిపప్పునూ పట్టుకొచ్చింది.     ఆ దృశ్యాన్ని చూచి అంత త్వరగా ఆశ్చర్యాన్నించి తేరుకోలేక - అచేతనంగా వున్న నా వైపు చూచి నవ్వుతూ -          విస్కీని రెండు గ్లాసుల్లో పోస్తూ - ఒకటి నా ముందుకు తోస్తూ అంది -     "శేఖర్ ఆత్మ శాంతి కోసం..."     ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్న నన్ను చూచి తేలిగ్గా నవ్వుతూ అంది ఇందిర -     "నువ్విప్పుడు మీ వేమవరప్పాడు దాటి చాలా దూరం వచ్చేసావు. సిటిలో వున్నావు. హైసొసైటీ మనిషివి నువ్వు. బిహేవ్ లైక్ ఏ జెంటిల్ మేన్"     సీరియస్‌గా అన్నాను నేను -     "నాకీ హైసొసైటీ జీవితం అలవాటయి చాలా రోజులయింది. ఇదేమీ నాకిప్పుడు కొత్త గాదు..."

    "మరి?" అంది ఇందిర అమృతాన్ని నోట్లో పోసుకుంటూ.     "నీ మాటలకే నేను ఆశ్చర్య పోతున్నాను. నువ్వు కోరుకున్న జీవితం నీకు లభించింది. శేఖర్ గుండెల మీద నుండి నడిచి ఐశ్వర్యపు అందలాల్ని అందుకున్నావు. అమాయకంగా నిన్ను నమ్మే ముసలి మొగుణ్ని సంపాదించావు. గొప్ప ఆస్థికి వారసురాలివై జమీందారిణిగా ముద్రవేసుకున్నావు. ఇంకా విచారం దేనికి? నీకింకా జీవితంలో ఎదురుదెబ్బలేమిటి?" కసితో కంపించే గొంతుతో అన్నాను.     గ్లాసులో విస్కీ పోసుకుంటూ అంది ఇందిర-     "నిజం - నేను జమీందారిణిని. శ్రీనివాసరావుగారికివాళ పెద్ద కాడిలాక్ కారుంది. పెద్ద పేలస్ ఉంది. వాటికన్నిటికీ నేను అధికారిణినే. లోకం దృష్టిలో నేను శ్రీమంతురాలినే - కాని, ఆ శ్రీమంతురాలికి హృదయం లేదు. ఉన్నా అందులో మాధుర్యం లేదు. నాథ్! నేనొక పిచ్చిదాన్ని. నన్ను లోకంలో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నేందుకు ఏడుస్తానో నాకే తెలియదు. కాని - బ్రతుకంతా ఏడుస్తూనే వుంటాను. ప్లీజ్ నన్ను ప్రశ్నలతో వేధించకు. నా గుండెల్లో ఇంకా మంటరేపకు -" బాధగా కళ్ళు మూసుకుంది ఇందిర.     ఇందిర కళ్ళమ్మట ధారాపాతంగా వర్షించిన కన్నీటిని క్షణకాలం చకితుణ్ణయ్యాను.

    మొండిగా, పెంకిగా వుండే ఆ అమ్మాయి కంట తడిపెట్టగలదనీ, ఆమెలో అంతటి బేలస్వభావం వుందనీ - అవ్వాళ్టివరకూ ఊహించలేకపోయాను. అయితే ఇందిర కన్నీరు మొదటిలో నన్ను కదిలించలేకపోయింది.
    భయంకరంగా హత్యచేసిన హంతకుడు జైలుకి వెళ్ళేముందు కంట తడిపెట్టినప్పుడు చూచేవాళ్ళకు కలిగిన అనుభూతి లాటిదే నాకు కలిగింది ఆ క్షణంలో. కాని నాలోని మనిషి విజృంభించాడు. ఇందిర మనో వ్యధను అర్థం చేసుకోమని గోల చేపెట్టాడు. హృదయాన్ని స్పందించి ఆవేదన కలిగించాడు.
    నిజం. ఇందిర తెలిసో తెలియకో శేఖర్‌కు అన్యాయం చేసింది. అయితే తను అనుకున్నట్టుగా ఆమె శేఖర్‌ని మరచిపోలేదు. శేఖర్ ఆశల్ని తెంచి - తాను గులాబీల పాన్పుమీద పడుకోలేదు. ఆ పాన్పులో ఆమెకు గులాబీరేకుల మెత్తదనంకన్నా ములుకుల బాధే అధికంగా కనపడుతున్నది కాబోలు. అయితే ఆమె ఆవేదనను అర్థం చేసుకోగల అవకాశం నాకులేదు. ఆమె మాటల వెనుక దాగి వున్న విషాదపు అగాథాల లోతులు నాకు తెలియవు. అయితేనేం - ఆమె ఆవేదన అనుభవిస్తోందన్న మాట మాత్రం సత్యం. అది పశ్చాత్తాపం ఎందుకు కాకూడదు. అదే నిజమైతే ఇందిర తను చేసిన పాపంకన్నా ఎక్కువ శిక్ష అనుభవిస్తోంది. గుండె ఓ క్షణం తేలిక పడి - మరింత బాధతో నిండిపోయింది.
    పిచ్చిగా తనలో తను గొణుక్కుంటున్న ఇందిరను చూచి భారంగా నిట్టూర్చాను నేను.

* * * * * *

    ప్రక్కరోజు మా శంకరన్ పిళ్ళేగారు రావడంతో - ఇందిరనీ, శ్రీనివాసరావు గారినీ, తీరుబడిగా కలిసేందుకు అవకాశం చిక్కలేదు.

    ఆ తర్వాత ఇందిర నాకు ఒకటి రెండు ఉత్తరాలు వ్రాసింది. ఆ ఉత్తరాల్లో నాకు ఏదో చెప్పలేని ఆవేదనా - వ్యధా స్పష్టంగా కనబడేవి. కాని ఇందిర మనసులోని బాధ ఏమిటో ఇదమిద్ధంగా తెలుసుకోగల అవకాశం నాకు లేకపోయింది. అయినప్పటికీ ఇందిర విషయంలో ఏదో తెలియని సానుభూతి క్రమక్రంగా నా గుండెల్లో చోటు చేసుకుంది. అందుకు కారణం ఇందిరలోని మహత్యమో, నాలోని బలహీనతొ తేల్చి చెప్పలేను.
    కాలచక్రం కదులుతూండడంతో క్రమక్రమంగా ఇందిర నా స్మృతిపథం లోంచి జారిపోయింది. కాలగమనంలో ఇందిర గురించీ, శేఖర్ గురించీ చాలా వరకూ మరచిపోయాను నేను. ఆ తర్వాత పదేళ్ళకు కాబోలు రామాపురంలో మా కంపెనీ కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీ ఎకవుంట్లు తనిఖీ చేసేందుకు హెడ్డాఫీసు నుంచి పంపించారు నన్ను. రామాపురం అనే పేరు వినగానే నా మస్తిష్కంలోనూ, హృదయంలోనూ బూజుపట్టిపోయిన ఎన్నో భావాలు ఒక్కసారిగా పైకెగసి వచ్చాయి. రామాపురం ప్రయాణానికి ముందు గతాన్నంతా తలుచుకుని మరోసారి వేడి నిట్టూర్పు విడిచాను నేను.     పదేళ్ళ తర్వాత - ఇందిరనూ, శ్రీనివాసరావుగారినీ చూడబోతున్నాననే భావన ఒకవైపూ - శేఖర్ జ్ఞాపకాలు మరోవైపూ బాధించాయి నన్ను.

    * * * * * * 

   స్టేషన్‌లో దిగగానే కమెపెనీ కారులో గెస్టు హౌస్‌కి వెళ్ళిపోయాను. సాయంత్రము ఆఫీసు పని అయిన తర్వాత జమీందారుగారి "లక్ష్మీమహల్" చేరుకున్నాను. చాలా విశాలమైన భవనం, వెల్ల అదీ వేయించి బహుశా పది పదిహేనేళ్ళయి వుంటుందో ఏమో - గోడలన్నీ నల్లగా - పాకుడు కట్టినట్టుగా వున్నాయి. భవంతికి సరియైన పోషణ వున్నట్టు నాకు అనిపించలేదు.
    పోర్టికోలో కారు ఆగిన తర్వాత - డ్రయివర్ అయిదారుసార్లు కారు హారన్ వాయించాడు. ఎవరన్నా వస్తారేమోనని - ఎవరూ రాలేదు. అంతా నిశ్శబ్దం. లోపల మనుషులున్న జాడ కూడా లేదు. కారులోంచి దిగి భవనంలోకి ప్రవేశించాను. లోపల విశాలమైన హాలు వుంది. బహుశా - అథితులు కూర్చోవడానికి కాబోలు. కాని అందులో కుర్చీలు ఎవీ లేవు. మూలగా కాలు విరిగిపోయిన కర్ర కుర్చీ ఒకటి కునికిపాట్లు పడుతోంది. కొంచెం లోపలికి ప్రవేశించి మరోసారి గట్టిగా పిలిచాను. ఈ సారి సమాధానం రాలేదు. కొంపదీసి ఈ భవనంలో ఎవరూ వుండటంలేదేమో! నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా వున్న అంత పెద్ద భవంతిని చూస్తోంటే ఒక విధంగా చెప్పాలంటే భయం కూడా వేస్తోంది నాకు.     కొంచెం దూరంగా వెడితే కర్రమెట్లు కనపడుతున్నాయి. బహుశా మేడమీద వుంటున్నారేమో - అయినా అనుమతి లేకుండా వెళ్ళేందుకు సభ్యత అడ్డు వచ్చింది.     ఇంకో సారి గట్టిగా పిలిచాను. నా పిలుపు నిశ్శబ్దంగా వున్న గదంతా ప్రతిధ్వనించింది.     ఇంతలో ఎవరో కర్రమెట్ల మీద నుంచి దిగుతున్న చప్పుడయింది.     "ఎవరది?" కొంచెం విసుగ్గా అంటోంది ఆ కంఠం.     యాభై ఏళ్ళు పైబడిన ఆ ముసలి వ్యక్తిని చూస్తూంటే నాకు భూతగృహాల్లో వుండే మాంత్రికుడు జ్ఞాపకం వచ్చాడు.     "నాపేరు రామనాథం. జమీందారిణి గారిని చూడ్డానికి వచ్చాను" కొంచెం వినయంగానే చెప్పాను.     "జమీందారిణి గారినా?" అని నావైపు ఓసారి చూచి - భృకుటి ముడిచి - "ఎందుకు?" అన్నాడు.     "వారితో మాట్లాడాలి. మీ స్నేహితుడు రామనాథం వచ్చాడని వారికి తెలియజెయ్యండి"     ఓ క్షణం తటపటాయించి ఆ తర్వాత అన్నాడా ఆగంతకుడు -     "సరే నాతో రండి."     మౌనంగా అతడిని అనుసరించాను నేను.     పెద్ద విశాలమైన గదులూ హాల్స్ దాటుకుపోతున్నాం. గదుల్లో చాలా చోట్ల బూజు పట్టేసింది దట్టంగా. ఇక మేడ మీది వరండాలో ఒకటి రెండు చోట్ల గోడలకు చెట్లు మొలిచి వుండటం కూడా చూశాను. భవంతి అంతటా ఎలెక్ట్రిసిటీ వున్నట్టు లేదు - వున్నా అది వాడుతున్నట్టు లేదు. చాలా చోట్ల లాంతర్లు వేలాడగట్టి వున్నాయి. ఇక్కడికి రాకముందు నేను శ్రీనివాసరావుగారి భవంతి గురించి గొప్పగా వూహిచుకున్నాను. ఎంతో మంది దర్వాన్‌లు - కార్యదర్శులు - ఎన్నెన్నో ప్లిమత్ కార్లు - బ్రహ్మాండమైన గార్డెన్ - నా ఊహలకు ఎన్నెన్నో అందమైన రంగులు వేసుకున్నాను. కాని నాకు దర్శనమిచ్చింది పాడుపడటానికి అతి చేరువలో నున్న ఈ భవంతి - అరణ్యంలా చుట్టూ వున్న తోట. ఊహలతో వాస్తవాన్ని సరిపెట్టుకోలేక ఇబ్బంది పడుతున్న నాతో అన్నాడు అతగాడు -     "ఈ కుర్చీలో కూర్చోండి. అమ్మగారితో చెబుతాను."     కర్ర కుర్చీలో కూర్చొన్న నేను గదినంతా ఓసారి పరిశీలించాను. మిగతా వాటితో సరిపోల్చి చూస్తూ. ఈ గది కాస్త పరిశుభ్రంగా వుందనే చెప్పాలి. గోడలకు వ్రేలాడుతున్న తైలవర్ణ చిత్రాలూ - క్రింద వున్న పాడైపోయిన కాశ్మీర్ తివాచీ - ఆ గది ఇదివరకు ఎంత అందంగా వుండేదో చెప్పక చెబుతోంది.

    ఎంత వెదికినా నాకు ఈ భవనంలో ఐశ్వర్య చిహ్నాలు కనబడటంలేదు. సామ్రాజ్యం పోయిన ప్రభువులా - పదవి పోయిన మంత్రిలా - డిపాజిట్ పోగొట్టుకున్న మాజీ ఎం.ఎల్.ఏ.లా - వెలవెలబోతుందా భవనం. నా మస్తిష్కంలో ఎన్నెన్నో ప్రశ్నలు అపరిష్కృతంగా మెదలుతున్నాయి. శ్రీనివాసరావుగారి రాజభవనం చూడటం ఇదే ప్రథమమైనప్పటికీ - సంస్థాన వైభవం గురించి చాలా సార్లు విన్నాను. చాలాకాలం క్రితం మా మేనమామ రామాపురంలో పోస్టుమాస్టర్‌గా పనిచేసే వాడు. నా చిన్నతనంలో అతగాడు మావూరు వచ్చినప్పుడల్లా చెబుతుండేవాడు దేవిడీలో జరిగే నృత్యగాన విలాసాల గురించీ, వైభవాల గురించీను. పెద్దయిన తరువాత రామాపురం జమీందారు దాతృత్వం గురించీ - సాహిత్య కళాపోషణ గురించీ ఎందరెందరి దగ్గిరో విన్నాను. ఎన్నెన్నో పత్రికల్లో చదివాను. ఆ రామాపురం జమీందార్ భవనమేనా ఇది? అభినవ శ్రీకృష్ణదేవరాయలని ఆంధ్రదేశమంతటా పేరుగాంచిన రామాపురం జమీందార్ శ్రీనివాసరావుగారుంటున్నది ఈ శిథిలాలయంలోనా? ఎంత ప్రయత్నించినా సమాధాన పడలేకపోతోంది మనస్సు.

    యింతలో గాజుల చప్పుడయ్యింది.     ఇందిర!     నల్ల అంచు తెల్ల శిల్కు చీర కట్టుకుంది. బర్మాముడి వేసుకుని తల్లో మల్లెపూలు పెట్టుకుంది. నుదుట అందంగా కుంకుమ తీర్చి దిద్దుకుంది.     "బాగున్నావా నాథ్" అంది ఎదుటి కుర్చీలో కూర్చుంటూ. ఇందిరలో నాకెప్పుడూ కనబడని గంభిరత్వం నిండుతనం కనబడ్డాయి. ఆమె కళ్ళల్లో నేనెప్పుడూ చూడని వెలుగు కనబడింది. ఈ మార్పుకు నా మనస్సెందుకో ఒప్పుకోలేకపోతోంది. సరిగ్గా చూడమని కళ్ళను హృదయం బూకరిస్తోంది.

    "పెళ్ళికి ఇన్విటేషను పంపావుగానీ, రాలేకపోయాను. పిల్లలెంతమంది?" మళ్ళీ తనే మాట్లాడింది ఇందిర. కుశలప్రశ్నలూ - సమాధానాలూ అయిన తర్వాత అన్నాను.
    "నువ్వు చాలా మారిపోయావు ఇందిరా!"     నా మాటలకు ఇందిర గలగలా నవ్వుతూ - "వయస్సులోనా? భావాల్లోనా? రూపంలోనా? యెందులో?" అంది.     ఇదివరకటి రోజుల్లోని నవ్వులా ఆ నవ్వు విహంగంలా రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగిరే నవ్వుకాదు. పురివిప్పిన నెమలిలా నృత్యం చేసే నవ్వుకాదు. ఎవేవో అవ్యక్తపు భావాల లోతులు ఆ నవ్వులో స్పష్టంగా కనబడుతున్నాయి. ఇందిర ఏదో దాస్తోంది. ఏదో చెప్పకూడదని తాపత్రయపడుతోంది.
    "వయస్సుతో మనుషులు మారిపోక తప్పదు నాథ్. మొగవాడివి అందులోనూ జీవ్తపథంలో వంకర టింకర్లనూ లోతుపాతుల్ని చూడని వాడివి. ఇప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకోలేవు. అన్నట్టు శ్రీనివాసరావుగారిని చూడలేదుగా - చూద్దువుగాని రా" అంటూ లేచింది.

   ఇందిర ఇంకా పూర్తిగా మారలేదు. అదే నిర్లక్ష్యం. అదే మొండితనం - యింకా మిగిలి ఉన్నాయి అనిపించింది నాకా క్షణంలో. నన్నెందుకో వదిలించుకోవాలని చూస్తోంది. ఇందిరను అడగాల్సిన విషయాలూ ఇంకా చాలా వుండగా అలా హఠాత్తుగా సంభాషణ తెంచివేసి లేచిపోవడం నాకెందుకో బాధనిపించింది. అయినా - శ్రీనివాసరావుగారితో చాలా కాలం తర్వాత మాట్లాడే అవకాశం లభించబోతూండటం - ఆ నిరాశను అంతలోనే కప్పిపుచ్చింది.
    లోపలిగదిలో శ్రీనివాసరావుగారు 'చక్రాల కుర్చీలో' చుట్టతాగుతూ కనబడ్డారు.     వారికి నన్ను చూపిస్తూ అంది ఇందిర.     "పదేళ్ళ క్రితం అనుకుంటాను - మెడ్రాస్‌లో మిమ్మల్ని కలిసారు - రామనాథరావుగారని - మా క్లాస్ మేట్ - మీకు జ్ఞాపకముందో లేదో - ఆయనే ఈయన - ఇక్కడి కంపెనీ ఆడిట్‌కు వచ్చి మిమ్మల్ని కలుసుకునేందుకు వచ్చారు"     నా నమస్కృతిని స్వీకరిస్తూ నా వైపు ఓ క్షణం నిశితంగా చూచి అన్నారాయన -     "...వుడ్ లాండ్స్ హోటల్‌లో కదూ! బహుశా క్రిస్ట్మస్‌కు ముందనుకుంటాను. ఆ రోజు నువ్వు ఒక మంచి త్యాగరాయకీర్తన పాడావనుకుంటాను అవునా?"     ఆయన జ్ఞాపక శక్తి నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది.     పదేళ్ళ కాలంలో ఒక సామాన్యుడి పాట జ్ఞాపకముంచుకోవడం యెంత కష్టతరం?     అయితే - నాకు అంతకన్నా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం మరొకటున్నది - అది చక్రాల కుర్చీ!     నా కళ్ళల్లోని ఆశ్చర్యాన్ని చూస్తూ అన్నారాయన-     "మిస్టర్ నాథ్. మనుషుల జీవితాలు మారడానికి - విధి వ్రాతలు తలక్రిందలు కావడానికి - రోజుల వ్యవధి చాలనుకుంటాను. అలాంటిది మనం కలుసుకుని దశాబ్దం అయింది. మరి మార్పులు తప్పవు!"     అడగని నా ప్రశ్నకు శ్రీనివాసరావుగారి సమాధానం నన్ను కలవరపెట్టింది. అయినా నా కలవరాన్ని అణచుకుంటూ -     "నేను ఆశ్చర్య పడుతున్నది కాలం తెచ్చిన మార్పులకోసం కాదు. కాలగమనంలో కూడా మరుగుపడని మీ జ్ఞాపకశక్తికి నేను ఆశ్చర్యపడుతున్నాను."     పేలవంగా నవ్వారాయన -     "నిజం నువ్వన్నట్టు నాకు జ్ఞాపక శక్తి ఎక్కువే. అదే ఈరోజున నా పాలిట శాపమైంది. గతాన్ని ఎదుట వుంచుటూ వరతమానాన్ని వెక్కిరిస్తోంది. అది సరే. నువ్వు ఈపాటికి ఉద్యోగపు హోదాతో బాటుగా సంగీతంలో కూడా యెదిగే వుంటావు. ఏదీ ఓ మంచి కీర్తన - " అంటూ ఆయన కళ్ళు మూసుకున్నారు.

    ఇంతలో ఇందిర గబగబా తంబురా తీసుకువచ్చి నా ముందు వుంచుతూ " ఆయన్ని డిసపాయెంట్ చేయకు - రిక్వెస్ట్ చేస్తున్నాను - ప్లీజ్" అంది.
    ఇందిర మాటలు నాకు చిత్రంగా ధ్వనించాయి.     చాలాకాలం క్రితం వదిలేసిన విద్యని మననం చేసుకుంటూ - ధైర్యం చేసి పాడాను.     "వినాయకుని వలెను నను బ్రోవవే నిను వినా వేల్పులెవరమ్మా..." అని.     "భక్తియోగం కళాయోగానికి పరాకాష్ట. ఏన్ ఆర్టిస్ట్ మస్ట్ డై అంద్ రీబొర్న్ ఏజ్ ఏ యోగీ అన్నాడు అరవిందుడు. త్యాగరాజు యోగే కాదు భగవంతుడికి అత్యంత ఆత్మీయుడు కూడా. ఆ హిమగిరి తనయను అందరూ విద్యలిమ్మనో ధనమిమ్మనో ప్రార్థిస్తారు. కాని - త్యాగరాజు - నీకొడుకులా చూసుకో - వినాయకుణ్ణి కాపాడినట్టు కాపాడు - అని అడిగాడు. అంతకన్న ఏం అడుగుతాం అమ్మను మనం? నిజానికి పరమాత్మ స్వరూపంతో ఇంతటి ఆత్మీయతను ఏర్పరచుకున్న వాగ్గేయకారులు నాకు మరెవరూ కనిపించలేదు. నిజానికి దీక్షితార్, శ్యామశాస్త్రి కూడా మహా భక్తులే. దీక్షితార్ నీలాంబరి రాగంలో అంబనీలాయతాక్షీ, కరుణ కటాక్షీ, అఖిలలోక సాక్షీ, అని ప్రస్తుతిస్తే, శ్యామశాస్త్రి సావేరి రాగంలో శంకరి శంకరు చంద్రముఖీ, అఖిలాండేశ్వరి శాంభవి అంటూ స్తోత్రించాడు. అయితే వాళ్ళల్లో ఈ ఆత్మీయత కనబడదు. వాళ్లు భగవంతుని పాదాల దగ్గర నిలబడి సంగీత నామాలతో అర్చిస్తే త్యాగరాజు భగవంతుడికి ముద్దు బిడ్డడై వొడితో చోటు చేసుకున్నాడు."     మంత్రముగ్ధుణ్ణయి వింటున్నాను ఆయన మాటల్ని నేను. ఇన్నాళ్ళూ గుడ్డిగా సంగీత సాధన చేయడమే కాని ఇంతలోతుగా పరమార్థాల గురించి ఆలోచించలేదు నేను.

    "ఇంటర్ ఫేలయిన రోజుల్లో కాలక్షేపానికి సంగీతం ప్రారంభించినప్పుడు నా విద్యకు యింతటి గౌరవం లభిస్తుందనుకోలేదు. అభినవ శ్రీకృష్ణదేవరాయలని ఆంధ్రదేశమంతటా పేరుగాంచిన మీ దగ్గిర రెండుసార్లు పాడే అవకాశం నాకు లభించింది. నిజంగా నేను అదృష్టవంతుణ్ణి."
    నా మాటలు ఇంకా పూర్తిగాకుండానే ఆయన భళ్ళున నవ్వడం ప్రారంభించారు నేనేదో కానిమాటో హాస్యోక్తో ఆడినట్టుగా.     "యు ఆర్ రియల్లీ అ టిపికల్ మేన్. నేను శ్రీకృష్ణదేవరాయల్నా? నువ్వు ఏదో పాత ఎడిషన్ పుస్తకాల్లో చూచివుంటావు. ఈ మధ్య ప్రింటయిన పుస్తకాల్లో కొత్త వాటిల్లోనే కాదు కొత్త ఎడిషన్లో కూడా నా పేరు కనపడదు. కనబడినా నువ్వన్న బిరుదుతో కనబడదు. చిరిగిపోయిన చొక్కాలు ఎంతకాలమని వేసుకుంటారు ప్రజలు? కొత్తరక్తం, కొత్త ప్రపంచమూను. నేనొకటి చెబుతాను విను. శ్రీకృష్ణదేవరాయలు ప్రభువుగా చచ్చిపోయాడు కాబట్టి అదృష్టవంతుడు. అదే సామ్రాజ్య విహీనుడిగా చచ్చిపోతే - పెద్దన్నా, సూరన్నా వీళ్ళందరూ అతగాడిని చూడనట్టుగా పక్క సందులోకి వెళ్ళిపోయేవారు తెలుసా? - బిలీవ్‌మీ - దటీజ్ ది హ్యూమన్ మెంటాలిటీ. కృతఘ్నత అనేది ప్రతిమనిషికీ వుంటుంది. వుండాలి కూడాను. లేకపోతే నిన్ను వెర్రివాడివంటుంది ప్రపంచం. బిలీవ్ మీ - నేను నిజం చెబుతున్నాను." 

    ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఏదో చెప్పలేని ఉద్వేగం, ఆవేదన కనబడ్డాయి. అయితే వాటిని ఆయన సరి అయిన మాటల రూపంలో పెట్టలేకపోయారేమో అనిపించింది. మాతకూ, మాటకూ మధ్య అంత పొందిక లేదనిపించింది. ఎందుకో గుండెలు వేగంగా స్పందించాయి. ఆశ్చర్యంగా ఆయన మాటలు వింటున్నాను నేను.
    ఇంతలో ఇందిర గబగబాలేచి "మీరు మందు పుచ్చుకునే వేళయింది" అంటూ చక్రాల కుర్చీని కదిలించబోయింది.     శ్రీనివాసరావుగారు వాచీ చూసుకుంటూ " ఈయనతో ముప్పావుగంట సేపు మాట్లాడాను. ఇచ్చిన ఇంటర్వ్యూ అరగంట సేపు మాత్రమే. ముందే ఎందుకు జ్ఞాపకం చెయ్యలేదు?" అంటూ ఆయన తీఖణంగా ఇందిర వైపు చూశాడు.     ఇందిర బాధగా తలదించుకుంది.     ఆ తర్వాత నా వైపు చూస్తూ -     "పొద్దుపోయింది నువ్విక రెసిడెన్సుకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజు మా ఎస్టేట్ అథితివి" అన్నారు.     ఏమీ మాట్లాడలేక మౌనంగా పెదవులు ఆడించాను నేను. ఆ క్షణంలో నిజానికి ఏమీ మాట్లాడే స్థితిలో లేను నేను.
    ఇంతలో చక్రాల కుర్చీ కదిలిపోయింది.

* * * * * *

    బయట వర్షం జోరుగా పడుతోంది. ఉరుములు - మెరుపులు.
    గాలికి ఎలెక్ట్రిక్ దీపం అటూ ఇటూ ఊగుతోంది. కిటికీ తలుపులు గాలికి కొట్టుకుంటున్నాయి. కిటికీ తలుపులు వేస్తూ నాలో నేను గొణుక్కున్నాను. ఈ వర్షంలో రాత్రిపూట ఎందుకు నాకీ బందీఖానా? శ్రీనివాసరావుగారి మాటకు ఎదురు చెప్పలేక ఉండిపోవాల్సి వచ్చింది. సరే కాని - ఈ యింట్లో అతిథి ఒకడున్నాడని అతడి యోగక్షేమాలు చూడాలని ఎవరికీ వున్నట్టు లేదు ఈ కొంపలో. పోదామంటే బయట వర్షం. పంజరంలో చిక్కిన పక్షిలా వుంది నా పని. ఇందిరన్నా కనబడితే బాగుండును. మనిషెక్కడుందో దర్శనమే లేదు - విసుగ్గా గొణుక్కున్నాను.

    ఏది ఏమైనా ఇందిర బాగా మారిపోయింది. ఇదివరకటిలాగా చలాకీతనం, కొంటె తనం ఆమెలో కనబడటం లేదు. ఎందుకో లేని పెద్దరికాన్ని పైన వేసుకొంటోంది. నిజానికి ఇందిర అందమంతా ఆ ఏక్టివ్ స్పిరిట్లోనే వుంది. అదే ఆమెకు పెద్ద ఆకర్షణలాగా వుండేది. ఆ ఆకర్షణలో పడే శేఖరం గిలగిలా తన్నుకుపోయేవాడు. అప్రయత్నంగా శేఖర్ జ్ఞాపకం వచ్చాడు. ఈ మధ్య కాలంలో శేఖర్ గురించి ఇంత తీరిగ్గా ఆలోచించడం ఇదే మొదలు. మనస్సు బలంగా నన్ను పదిహేనేళ్ళ వెనక్కు తీసుకుపోయింది. బాధగా కళ్ళు మూసుకున్నాను నేను.
    ఇంతలో గుమ్మం దగ్గర చప్పుడైంది. ఇందాక కనబడిన ముసలి వ్యక్తి. అతగాడి పేరు సోములట.     "బాబూ తమకి కేరియర్ తీసుకొచ్చాను" అన్నాడు సోములు. ఆ మాటలు వినగానే నాకు ఒళ్ళు మండింది.     ఇంట్లో వున్న అతిథికి ఇదా మర్యాద?     తమతో బాటు భోజనం పెట్టేదిపోయి కేరియర్ అదీ నౌకరు చేత పంపించడమా? గుండెల్లో కారం జల్లినట్లయింది. ఈ మర్యాద తెలియని మనుషుల దగ్గర ఆతిథ్యం స్వీకరించడం తనదే తప్పు.     కోపాన్ని బలంగా అణచుకుంటూ అన్నాను.     "ఆ కేరియర్ అక్కడ పెట్టి వెళ్ళు."     సోములు కేరియర్ బల్లమీద పెట్టి, పళ్ళాలు పక్కన పెట్టాడు.
    
    "వడ్డించమంటే వడ్డిస్తాను."
    "అక్కర్లేదు."     ఇంకా కదల్లేదు సోములు.     "తమ భోజనం అయిందాకా వుండమని జమీందారు ఆజ్ఞ."     "ఊ!" అని ఓసారి మూలిగి - ఆ మాటలు నాగురించి కాదన్నటుగా - సిగరెట్ ముట్టించి కిటికీలోంచి ధారాపాతంగా పడుతున్న వర్షాన్ని చూడసాగాను.     మధ్యలో సోములు అన్నాడు.     "ఇందిరమ్మగారు తమకి చాలా కాలంగా తెలుసుననుకుంటాను."     ఉలిక్కిపడ్డాను ఈ ప్రశ్నకు.     "అవును. ఆవిడా నేనూ కాలేజీలో క్లాస్‌మేట్సం" అన్నాను ముక్తసరిగా.     "చాలా మంచి వారండీ బాబూ ఆమె. ఈ కాలంలో వుండాల్సిన మనిషి కాదామె. ఎంత వినయం - ఎంత ఓపిక - ఆడవాళ్ళలోనే చెప్పుకోదగ్గ మనిషండీ ఆవిడ" సోములు మాటలు చిత్రంగా ధ్వనించాయి.
    మళ్ళీ సోములే మాట్లాడాడు.

    "అవును బాబూ నాకు జీవితానుభవంతో తలపండిపోయింది. ఎందరెందరో ఆడవాళ్ళ గురించి విన్నాను. ప్రత్యక్షంగా చూశాను. కాని నాకెక్కడా ఇందిరమ్మగారిలాంటి ఉత్తమురాలు కనిపించలేదు బాబూ, ఆయమ్మను కన్న తండ్రి ధన్యుడు."
    సోములు మాటలు నమ్మలేక పోతున్నాను నేను. సిగరెట్ పడేసి, కొంచెం ఆశ్చర్యంగా సోములు వేపు తిరుగుతూ, "ఏమిటి నువ్వనేది?" అన్నాను.     "అవును బాబు ఆయమ్మే లేకుంటే జమీందారుబాబు బ్రతుకేమయ్యేది? జమీందారు బాబు అవకాశమున్నన్నాళ్ళూ ఎన్నెన్నో దానధర్మాలు చేశారు. ఎందరెందరికో బ్రతుకులిచ్చారు. అవన్నీ ఆయనను కాపాడలేదు. చివరికి ఓ మంచి ఇల్లాలిని కట్టుకున్న అదృష్టమే ఆయన్నిప్పుడు కాపాడుతున్నది బాబూ!"     ఆశ్చర్యంగా విన్నాను నేను.     "సాటి జమీందార్లెవరికీ శ్రీనివాసరావు బాబుగారికున్నంత పేరు ప్రఖ్యాతులు లేవు. ఆయన యావదాస్తినీ కవి గాయకులకు ధర్మకార్యాలకూ ఇచ్చారు. ఇరవై ఏళ్ళ క్రితం తెలుగుదేశంలో రామాపురం జమీందారుగారి పేరు తెలియనివారు లేరు. అలాంటిది ఈ రోజున ఆయన సంగతి పట్టించుకొనేవారు లేరు. ఆయన ఎక్కడున్నారన్న విషయం ఆలోచించేవారు లేరు. దేముడుగా మారదామని ప్రయత్నించిన మనిషిని బలహీనుడిగా జమకట్టి - లోకం గుండెల మీద నించి నడిచివెళ్ళిపోయింది బాబూ!" బావురుమన్నాడు సోములు.     సోములు మాటలు నాకెంతో కుతూహలాన్ని కలిగిస్తున్నాయి.     "ఏమైంది జమీందారు బాబుకి?" అంటూ ఆత్రంగా ప్రశ్నించాను .     "ఇంకేం కావాలి బాబూ? ఇందాక ఆయన్ని మీరు చూశారుగా? ఆయన ఆరోగ్యం ఇప్పుడెలా వుందో మీకు అర్థమయ్యే వుంటుంది. పడిలేచే ఎన్నో సంస్థలకు చేయూతనిచ్చి నడిపించిన శ్రీనివాసరావుగారికి నేడు కాళ్ళు లేవు. పక్షవాతమొచ్చి పడిపోయాయి. నృత్య, గాన విలాసాలతో మహా వైభవంగా వుండాల్సిన ఈ రాజభవనం గబ్బిలాల గూడై పోయింది. ఎందరో బీదల కన్నీళ్లు తుడిచిన జమీందారుగారికీనాడు కన్నీళ్ళే జీవితమైపోయింది. ఈనాడీ 'లక్ష్మీ మహల్'లో వినబడుతున్నవి ఇనప గజ్జెల చప్పుళ్ళు బాబూ!"     ఇక్కడికి అడుగు పెట్టిన మరుక్షణంలోనే నాకు శ్రీనివాసరావుగారి ఆర్థిక పరిస్థితి చూచాయగా అర్థమైంది. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని ఊహించుకోలేకపోయాను.
    మళ్ళీ సోములే మాట్లాడాడు. 

    "లక్ష్మి చంచలమైందంటారు. పోనివ్వండి. దాని గురించి నాకు బాధలేదు. నాబాధల్లా ఈ మనుషుల గురించే బాబూ. జమీందారుగారికి ఎస్టేటు, ఆస్థిపాస్థులు ఉండే రోజుల్లో ఎందరెందరో కవులూ, గాయకులూ ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. ఆయన్ను కలుసుకోవడానికి తహతహలాడిపోయేవారు. సంజె వేళ పడిందంటే దేవిడీలో సంగీత కచేరీయో మరేదో ప్రారంభమయ్యేది. మీసాన్ని నిండుగా దువ్వుకుంటూ జమీందారు బావు వాటిని సాంతం విని వారికి ధన సహాయం చేసి పంపించేవారు. అలాంటిది ఈ రోజున ఆ విద్వాంసులీ వూరు వచ్చినప్పుడు ఏ మునిసిపల్ ఛెయిర్మన్‌నో జిల్లా పరిషత్ ఛెయిర్మన్‌నో చూచిపోతున్నారే కాని కనీసం మర్యాదకయినా జమీందారుగారిని చూడ్డానికి రావడం లేదు. ఇది అన్యాయం కాదా బాబూ? మనిషి స్వార్థానికి ప్రాకులాడటం మంచిదే కాని కృతజ్ఞత అనేది కొంచెమయినా గుండెల్లో మిగిలి వుండొద్దా బాబూ?"
    సోములు మాటలు నా మనసులో కల్లోలాన్ని రేపాయి. మనుషుల మీద, ప్రపంచం మీద ఒక్కసారిగా అసహ్యం ప్రబలింది. బాధగా గుండెలు అదుముకుంటూ, నిస్పృహగా నవ్వాను నేను -     "మనిషి గుండెల్లో కృతజ్ఞత, మానవత ఆరిపోయి చాలాకాలమైంది. అది తెలుసుకోని వాళ్ళను లోకం శిక్షించక తప్పదు. యంత్రంలో మమతలు వెదుక్కున్నవాళ్ళదే తప్పవుతుంది సోములూ."     కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు సోములు.     "అంతే బాబూ, అంతే." 

    వర్షం జోరుగా కురుస్తోంది. మెరుపుల వెలుగ్ గాజుకింటికీ తలుపులోంచి కనబడుతోంది. సిగరెట్ పొగవదులుతూ భారంగా నిట్టూర్చాను నేను. సోములు మాటలు విన్న తర్వాత నా మనస్సంతా ఆవేదనతో నిండిపోయింది. కాని రెండు కన్నీటిబొట్లు విడవడం మినహా నేనేం చేయగలను?
    అప్రయత్నంగా అడిగాను నేను.     "శ్రీనివాసరావు గారు మొన్నటివరకూ ఎందుకు వివాహం చేసుకోలేదు."     నా మాటలకు సోములు తేలికగా నవ్వాడు.     "అదేమిటి బాబూ? అలా అంటారు? వారికి ఇది ఆరో పెళ్ళి. ఇందిరమ్మగారు రాకపూర్వం ఆరుగురు స్త్రీలు జమీందారిణులుగా ఈ భవనంలో అడుగుపెట్టారు. వారి బొమ్మలన్నీ మేడమీద దర్బార్ హాల్లో వున్నాయి. రండి చూద్దురు గాని" అంటూ నన్ను తీసుకెళ్ళాడు.     లాంతరు తీసుకుని ముందుకు నడుస్తున్న సోములును చూచి నేనేదో అడిగే లోపున అన్నాడతడు.
    "దర్బార్ హాల్లో ఎలక్ట్రిసిటీ అయితే వుంది గాని, లోపల బల్బులు లేవు. ఇప్పుడెవరూ దాన్ని వాడటం లేఅదు. అందుచేత్ లాంతరు తీసుకువస్తున్నాను. జాగ్రత్తగా నా వెంట రండి" అంటూ మేడ మెట్లమీదకు దారి తీశాడు సోములు.

    దర్బార్ హాల్ చాలా విశాలంగా ఉంది. నిర్మానుష్యంగా ఉన్న ఆ దర్బార్ హాల్‌ను లాంతలు వెలుగులో చూస్తున్న నాతో అన్నాడు సోములు.
    "ఈ హాల్‌లోనే బాబూ - పెద్ద పెద్ద విద్వాంసులు కచేరీలు చేసేవారు. రామాపురం దర్బారు గురించి తెల్లదొరలు గొప్పగా తమ పుస్తకాల్లో రాసుకునేవారు బాబూ"     నిర్లిప్తంగా వింటున్నాను నేను. ఇంతలో సోములు దర్బార్ హాల్ కుడి వైపుకు వచ్చాడు. "చూడండి - ఈ వరసన ఉన్న బొమ్మలన్నీ జమీందారిణులవే" అంటూ లాంతర్ని ఓ తైలవర్ణచిత్రం ముందు వుంచాడు.     నిండైన దరహాసంతో గంభీరంగా వుందొక యువతి.     "ఈమె - జయప్రదాదేవిగారు. కృష్నాపురం జమీందారుగారి ఏకైక కుమార్తె. జమీందారిణి అన్నందుకు అలాగే వుండేవారు. ఆ ఠీవి - దర్జా - మరెవరికీ రావండి. నిండా పాతికేళ్ళయినా రాకుండానే మృత్యువు ఆమెను పొట్టన పెట్టుకుంది. ఆయమ్మ తోటే ఈ ఎస్టేట్‌కి సగం వెలుగు వెళ్ళిపోయింది.     ఊపిరి బిగపట్టుకుని వింటున్నాను -     "ఈవిడ - నాగవరప్పాడు రాజాగారి కుమార్తె ప్రియంవదాదేవి. మెరుపుతీగలా వుండేవారు. కాని - ఏం లాభం? ఎప్పుడు త్రాగుడు, గుర్రప్పందాలూ తప్పించి ఆవిడకు మరోప్రపంచం వుండేదికాదు. ఏడాదిలో సగభాగం బొంబాయిలో వుండేవారు. చివరకు విసుగెత్తి జమీందారుగారు ఆవిడతో తెగదెంపులు చేసుకున్నారు. ఇప్పుడీవిడ ఉత్తరాదిన ఉంటున్నారని అనుకునేవారు ఆ మధ్యన"     లాంతరు ముందుకు కదిలి పోయింది.     లాంతరు ముందున్న ఆ తైలవర్ణచిత్రాన్ని చూడగానే క్షణకాలం నా కళ్ళు చెదిరిపోయాయి. చూడగానే ఆకట్టుకునే కళ్ళు, గులాబి రేకుల్లాంటి బుగ్గలూ, ఎంత అందమైన యువతి?     "ఈవిడ స్వర్ణమయీ దేవి. అసలు పేరేమిటో, ఏవూరి మనిషో, యెవ్వరికీ తెలియదు. కాని - వూళ్ళో రకరకాలుగా చెప్పుకునేవారు. ఏది ఏమైతేనేం. ఈ ఎస్టేటుకు కొన్నాళ్ళు జమీందారిణి అయ్యింది. వళ్ళంతా బంగారంతో, వజ్రాలతో నింపుకుంది. జమీందారుగారిని గుప్పెట్లో పెట్టుకుని ఆడించింది. చివరకు ఆయనకు దగా చేసి పది లక్షల రూపాయల జహ్వారీతో మాయమైంది. ఆ రోజే జమీందారిణి కారు డ్రయివర్ యూసుఫ్ మాయమయ్యాడు."     ఆశ్చర్యంగా వింటున్నాను నేను. సోములు రకరకాల కథలు చెబుతున్నాడు.
    ఎన్నెన్నో జమీందారీ కుటుంబాల కథలు త్రవ్వుతున్నాడు. చివరకు ఓ బొమ్మ దగ్గర సోములు లాంతరు నిశ్చలంగా నిలచింది.     "మరి మీ ఆరో జమీందారిణికి తైలవర్ణ చిత్రం చేయించలేదేం?" అన్నాను ఇందిర ఫోటో చూస్తూ.     "అప్పటికే రోజులు మారిపోయాయి బాబూ, జమీందారుబాబులో ఉత్సాహమూ చల్లారిపోయింది" అన్నాడు సోములు నిట్టూరుస్తూ.     ఇందిర ఫోటోను పరీక్షగా చూశాను నేను. కాలేజీ చదువుకునే రోజుల నాటి ఫోటో అది. ఆ ఫోటోయే శేఖరం దగ్గిరా వుండేది. తన గుండెల్లో వాడు ఈ ఫోటోనే దాచుకుని ప్రేమదేవతలా ఆరాధించేవాడు.     కసిగా ఇందిర ఫోటో చూస్తూ అనుకున్నాను నేను.

    "ఇందిరా! అందని ఎండమావుల్ని వెదుక్కుంటూ శేఖరం ఆశల్నీ, జీవితాన్ని నేలపాలు చేశావు. చివరకు నీకు దక్కింది ఈ గబ్బిలాల గూడు. అనుభవించు. ఈ ఆనందాన్ని శాశ్వతంగా అనుభవించు."
    దూరంగా ఉరుము పడింది. బయట బాగా వర్షం పడుతున్న శబ్దం అయింది.     "ఈ రాత్రి ఈ వర్షం తగ్గట్టు లేదు బాబూ! ఇంత పెద్ద వర్షం ఈ మద్యలో ఎప్పుడూ రాలేదు. ప్రకృతికి ఏదొచ్చినా ఇంతే, చివరకు తుఫానుగా పట్టుకుంటుందో ఏమో" అన్నాడు సోములు క్రిందకు దారి తీస్తూ.     ఇంతలో దూరంగా పెద్ద కేకలు, భయంకరమైన అరుపులు వినబడ్డాయి.     అవి విని నేనేదో అనేలోపున సోములు అన్నాడు.     "జమీందారు బాబు గారు ఈ భవనంలో మిగిలిన ఏకైక నౌకరు మీద కేకలు వేస్తున్నారు. శ్రీనివాసరావు గారి కోపం దాతృత్వంతో సరిసమానంగా పేరుపొందింది. ఇవాళ ఆయన దానాలిచ్చేందుకు ధన ధాన్యాలేవీ లేవు. కాని కోపం చూపించేందుకు మాత్రం ఒకే ఒక వ్యక్తి మిగిలింది. ఆవిడే ఇందిరమ్మగారు" నిట్టూరుస్తూ అన్నాడు సోములు.     ఆశ్చర్యంతో నేనో క్షణం వరకూ మాట్లాడలేక పోయాను.

    "అవును బాబూ... ఈ ఎస్టేట్ పూర్వపు జమీందారిణిలు వజ్ర వీడూర్యాలు అనుభవిస్తే ఈనాటి జమీందారిణికి తిట్లూ, కొరడా దెబ్బలు మిగిలాయి. తను కోరిన సారా ఇవ్వలేదనో, తనక్కావల్సిన తిండి పెట్టలేదనో, తనను వేసవికి నీలగిరికి తీసుకెళ్ళలేదనో, ఏదో కారణంతో ఆయన ఇందిరమ్మను తిడుతూనే వుంటారు. ఆయమ్మ మాత్రం ఏం చేయగలదు? ఈయన విలాసాలకు డబ్బు ఎక్కణ్ణించి తేగలదు? ఆయమ్మ పేర ఈ వూరి శివారులో అయిదెకరాల మాగాణీ వుంది. అది అమ్మడానికి ఆవిడ ఒప్పుకోవడం లేదు. ఆ భూమి కూడా అమ్మితే ఈ యింటికి ఈ మాత్రం ఆధారం కూడా వుండదు. దాన్ని కూడా డబ్బుగా మార్చి డబ్బును సారాబుడ్లుగా మార్చాలని శ్రీనివాసరావు బాబు కోరిక. అందుకు అడ్డుపడుత్న్నదని ఆయనకు ఇందిరమ్మ మీద కోపం. చెప్పరాని తిట్లను ఆయన ఇందిరమ్మను తిడుతుండగా విన్నాను నేను. ఆవిడ రాకతోనే తన ఎస్టేట్‌కు దరిద్రం పట్టుకుందిట. ఆవిడవల్లే 'లక్ష్మీ మహల్' శని నిలయమైపొయిందట. మీరే చెప్పండి బాబూ? ఈ దరిద్రానికి ఆవిడా బాధ్యురాలు?"
    ఏదో మాట్లాడదామనుకున్నాను కానీ, డగ్గుత్తికపడి మాట పెగల్లేదు నాకు.

    సోములే మళ్ళీ మాట్లాడాడు -     "...శ్రీనివాసరావు బాబు మహా ఐశ్వర్యంలో పుట్టి పెరిగారు. రూపాయలను మంచినీళ్ళలాగా ఖర్చు చేయడం అలవాటు పడిన ఆయన ఈ దారిద్ర్యాన్ని భరించలేక పోతున్నారు నిజమే. లోకం ఆయనపై కృతజ్ఞత చూపించుకోలేదన్నది కూడా నిజమే. అయితే ఆ బాధను - ఆ కక్షను తన్నను ఈ లోకంలో నిండు హృదయంతో ప్రేమించగల ఇల్లాలిమీద తీర్చుకోవడం న్యాయమా బాబూ? శ్రీనివాసరావు గారికి ఆరు పెళ్ళిళ్ళు జరిగినా, తనను మనస్ఫూర్తిగా ప్రేమించగలిగిన ఇల్లాలిని మొదటిసారిగా ఇందిరమ్మ రూపంలో పొందగలిగారు. కాని వారికి ఈనాడు ఇందిరమ్మ క్రూరాత్మురాలిగా తనను వరించి వచ్చిన దారిద్ర్యంలా కనబడుతోంది. ఆ మహా ఇల్లాలి ఓర్పు, త్యాగం ఆయన్ను కదిలించలేక పోతున్నాయి. కాళ్ళు లేని రోగిష్టి భర్తకు ఆ యిల్లాలు అహోరాత్రులు నిద్రాహారాలు లేకుండా సేవ చేస్తోంది. తనను కొట్టడానికి తన దగ్గరకు రాలేని భర్త పిచ్చికోపం చల్లార్చడానికి తనే చేత్తో కొరడా అందిస్తోంది. తన పాతకాలపు జీవితం జ్ఞాపకం వచ్చి వెర్రెక్కినవాడిలా - లోకాన్ని, దేవుణ్ణి, ఇల్లాలినీ బండబూతులు తిడుతూ కేకలేస్తోంటే, భయపడక మందులు పట్టిస్తూ ఏనాటికీ బాగుపడని ఆయన ఆరోగ్యం కోసం దేముణ్ణి ప్రార్థిస్తోంది. బాబూ పురాణాల్లో పతివ్రతల కథలు చదివాను. కాని ఇలాంటి దేవతను ఎక్కడా చూడలేదు బావు. ఇంతటి కష్టాన్ని దిగమింగుకొని, చిరునవ్వుతో బాధల్ని ఎదుర్కోగల ఇందిరమ్మకు నమస్కారం పెట్టే అర్హత కూడా లేదు బాబూ నాకు" సోములు గొంతు వణుకుతోంది.     సోములు మాటలు నాలో చెప్పలేని సంచలనాన్ని కలిగించాయి. గుండెల్లో కల్లోలం ప్రారంభమైంది. మనస్సు కన్నా డబ్బు ముఖ్యమనుకొని, అనురాగం కన్నా ఆస్థిపాస్తులు గొప్పవనీ భావించి శేఖరం జీవితాన్ని నిప్పుల్లో పడేసి నిశ్చింతగా కదిలిపోయిన ఇందిరలో త్యాగశీలమా? అమాయకంగా తనని ఆరాధించి, పగిలిన హృదయంతో, విరిగిన ఆశలతో, జీవించలేక ఆత్మహత్య చేసుకోబోతున్నానని శేఖరం రాసినప్పుడు 'అయ్యోపాపం' అని కూడా అనుకోలేని ఈ అమానుష మూర్తిలో సహనశీలమూ సేవాసక్తీనా? ఎంతప్రయత్నించినా నమ్మలేకపోయాను. అలా అని సోములు చెబుతున్న మాటలను అసత్యాలుగా కొట్టి పారేయగల శక్తీ నాకు లేకపోయింది.
    అప్రయత్నంగా అన్నాను నేను -     "జమీందరుగారి సేవ చెయ్యడానికి ఇందిర ఒక్కరేనా? మరి నువ్వు చెయ్యవా?"     నా మాటలకు నిస్పృహగా నవ్వాడు సోములు.     "నేను ప్రస్తుతం ఇక్క పనిచెయ్యడం లేదు బాబూ"     షాక్ తిన్నట్టయింది నాకు.     "మరి?"     "ఎస్టేట్‌ను ప్రభుత్వం తీసుకోగానే జమీందారుగారు చాలా మంది నౌకర్లను తీసేశారు. రెండు మూడేళ్ళ క్రితం వరకూ జీతం ఏమీ లేకపోయినా ఈ యింటి ఉప్పుతిన్న విశ్వాసం కొద్దీ నేనొక్కణ్ణే పనిచేస్తూండేవాణ్ణి. చివర్కు కుటుంబం గడవక వేరే చోట పనిచూసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను మున్సిపల్ ఆఫీసులో బంట్రోతుగా పనిచేస్తున్నాను. అప్పుడప్పుడు దేవిడీకి వచ్చి బాబుగారి యోగక్షేమాలు కనుక్కు పోతుంటాను. ఇవాళ కూడా అలాగే వచ్చాను. అంతలోనే మీరు వచ్చారు.     నేను చేసింది నౌఖరు పనే అయినా ఈ దివాణంలో నాకు అంతకు మించిన స్థానముండేది. జమీందారు బాబుగారు దర్బారు తీర్చినప్పుడల్లా ఆయన వెనుక ఎప్పుడూ నేనే వుండేవాణ్ణి. అందువల్లే నా చెవుల్లోకి నాలుగు మంచి ముక్కలు వెళ్ళాయి. పైగా కొద్దోగొప్పో చదువుకున్నాను కూడా. జమీందారు బాబు బిటీషు ప్రభువును చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయనతో బాటు నన్ను కూడా ఇంగ్లాండ్ తీసుకువెళ్ళారు. అంతటి వైభవం అనుభవించాను నేను ఈ కొలువులో. కాని ఈ రోజున ఆయన సేవ చేసేందుకు నాకు అవకాశం లేకపోయింది. ఇలా చెప్పుకోవడానికి ఇంకా బ్రతికున్నాను బాబూ!" గాద్గదికమైన స్వరంతో చెబుతున్నాడు సోములు.

    సోములు చెప్పేఅ మాటలు నాకు వినబడటం లేదు. నా మస్తిష్కంలో ఏవేవో ఆలోచనలు పరిగెడుతున్నాయి.
    రామాపురం ఎస్టేట్ వల్ల కవులు, గాయకులు, ఉద్యోగులు, ఎందరెందరో బాగుపడ్డారు. ఎందరో అమ్మాయిలు వంటినిండా నగలు చేసుకుని పలాయనం చిత్తగించారు. వారెవరికీ ఇప్పుడు జమీందారుతో పనిలేదు. అతడి గురించి ఆలోచించరు. అలోచిద్దామన్నా అశక్తో, ఆధిక్యతో, స్వార్థమో ఎవేవో అడ్డువస్తాయి. కాని ఈ ఎస్టేట్ వల్ల బాగుపడే అవకాశం లేదని తెలిసి కూడా ఇంకా ఆ పురాతన భవనాన్ని కూలిన గోడలా వున్న జమీందారునూ పట్టుకుని వేలాడుతూ, అందుకు ప్రతిఫలంగా తిట్లనీ, దెబ్బల్నీ స్వీకరిస్తున్న ఇందిరను తలచుకుంటే జాలి, బాధ రెండూ కలిగాయి నాకు. ఈ మధ్య కాలంలో ఇందిర ఎప్పుడూ నా గుండెల్లో ఇంతటి ఆర్ద్రతను దోచుకోలేక పోయింది. ఇన్నాళ్ళుగా శ్రీనివాసరావు గారిపై నాకున్న గౌరవ ఘావమూ ఇవాళ కొత్తగా ఏర్పడిన జాలీ అప్రయత్నంగా నా మనసులోంచి జారిపోయాయి. 

    మల్లెపూవులాంటి ఇందిరను ముట్టుకుంటే చాలు కందిపోతుందని బెంగపడేవాడు శేఖరం. అలాంటిది ఆ సౌందర్య కుసుమాన్ని కాలరాస్తున్నారనే వూహనే భరించలేకపోయింది మనస్సు. ఇందిర గులాబీ చెక్కిళ్ళు, దెబ్బలతో తట్లు తేరతాయన్న భావనను భరించలేనన్నది నాలోని సున్నిత హృదయం.     వాతావరణంతో బాటుగా విచిత్రమైన భావ సంచలనంతో నా మస్తిష్కంలో పెను తుఫానులు చెలరేగుతున్నాయి. అర్థం చేసుకోలేని ప్రశ్నల మధ్య ఊగిసలాడుతోంది మనస్సు. బాధగా కణతలు పట్టుకున్నాను. 

* * * * * *

    ఉదయం కాఫీల వేళ అంది ఇందిర నాతోటి -
    "రాత్రి నువ్వు భోజనం చెయ్యలేదనీ, ఒట్టిపాలు మాత్రమే తీసుకున్నావనీ సోములు చెప్పాడు."     నేను ఏదో కుంటిసాకు చెప్పే లోపల అంది ఇందిర -     "రాత్రి శ్రీనివాసరావుగారి అనారోగ్యం బాగా తిరగబెట్టింది. అందుచేత అందరం కలిసి భోజనం చేసే అవకాశం లేకపోయింది. కనీసం రాత్రి నీతో మాట్లాడేందుకు కూడా నాకు తీరికలేకపోయింది. రాకరాక వచ్చిన నీకు సరి అయిన మర్యాద చెయ్యలేకపోయాను - అందుకే బాధగా వుంది."     "అతిథులకు ఆనందం యిచ్చేది - యింటివారి మనస్సు. ఆ మనస్సులోని అమృతమే ఆతిథ్యాన్ని మరువనివ్వకుండా చేస్తుంది."     చిత్రంగా నావైపు చూసి పేలవంగా నవ్వింది ఇందిర -     "క్రొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇందిర హృదయం నువ్వు ఎరుగంది కాదు. అన్నట్టు నిన్న రాత్రి అసలే భోరున వర్షం పడింది. అందులోనూ కొత్త ప్రదేశం, నిద్ర పట్టిందా?" అంది ఇందిర డికాక్షన్లో పాలు కలుపుతూ.     "ఎప్పుడూ కేంప్‌లే జీవితమైన నాకు కొత్తవూరనీ, వర్షమనీ నిద్ర పోగొట్టుకునేట్టయితే మనుగడే మిగలదు. అది సరే కాని, ఆలోచించి చూస్తే మనిషి కన్నా ప్రకృతే అదృష్టవంతురాలనిపిస్తుంది. బరువెక్కిన మేఘాలు హోరున వర్షించి ఇప్పుడెంత తేలిగ్గా వున్నాయో చూడు - మనిషికి ఆ అవకాశం లేదనిపిస్తుంది. గుండెలు బరువెక్కినా కన్నీళ్ళు రాకూడదు - సభ్యత కోసం అవునా?" అన్నాను సూటిగా ఇందిర కళ్ళల్లోకి చూస్తూ.     తేలిగ్గా నవ్వింది ఇందిర.     "ఇన్నాళ్ళూ గాయకుడవే అనుకున్నాను. యిప్పుడు కవిత్వం కూడా పట్టుకుందన్న మాట. ఆ జబ్బు నాకు లేదు బాబూ! శ్రీనివాసరావు గారు లేచినట్టున్నారు. ఆయనతో శృతి కలుపుదువు కానీలే, తాపీగా... ముందీ కాఫీ తీసుకో." అంటూ కాఫీ కప్పున నా ముందుకు తోసి లోపలకు వెళ్ళిపోయింది.     వెళ్ళిపోతున్న ఇందిరను చూస్తూ భారంగా నిట్టూర్చాను నేను.     ఏమిటీ విచిత్రమైన వ్యక్తి? ఇంతటి బాధను, ఆవేదననూ నవ్వులో ఎలా దాచిపుచ్చగలుగుతుంది? ఐశ్వర్యంలో ఆనందాన్ని వెదుకుదామనుకున్న వ్యక్తి త్యాగంలో సంతృప్తిని ఎలా పొందగలుగుతోంది? డబ్బుతో మనుషుల విలువలను అంచనా కట్టే మనిషి మానవత్వపు శిఖరాలను ఎలా అందుకో గలిగింది? - అర్థంకాని ప్రశ్నలతో సతమతమవుతూ బాధగా తలపట్టుకున్నాను.

* * * * * *

    రామాపురం ఆఫీసు వ్యవహారాలు పూర్తి చేసుకుని వెళ్ళిపోతూ శ్రీనివాసరావు దంపతులను కలిశాను. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళాక ఇందిరకు ఉత్తరం రాశాను. దానికి సమాధానం రాలేదు.
    కాలచక్రంలో రోఅజులు దొర్లి పోతున్నాయి. ఇందిర విషాదగాధ నా గుండెల్లో చెసిన గాయం - చెలరేపిన ఆందోళన - క్రమక్రంగా కాలగమనంలో మాని మాసిపోయాయి. ఊపిరి సలపని ఆఫీసు పనుల్లో తాత్కాలికంగా ఇందిరని మరిచిపోక తప్పలేదు.     ఆ తరవాత - ఏడాది పోయిన తర్వాత - పేపర్లో చివరిపేజీ చివరి కాలమ్‌లో మరణాల శీర్షికలో రామాపురం జమీందార్ గారి పేరు చూశాను. ఒక్కసారి గుండె ఆగినట్టయింది. ఒక గొప్ప కళాపోషకుడు - విద్యాధికుడు పోయాడన్న బాధ ఒకవైపు, అతడి మరణంపై ప్రపంచం చూపిన ఉదాసీనత మరొకవైపు నన్ను బాధించాయి. అదే పేపర్‌లో ఒక మంత్రివర్యుడి పుట్టినరోజు ఘనంగా ముద్రించారు. ఆ మంత్రివర్యుడు జగన్మోహనరావు గురించి నాకు బాగా తెలుసు. మంత్రి పదవిలోకి రాకపూర్వం అతగాడి మీద వున్న క్రిమినల్ కేసుకు కూడా నేనెరుగుదును.     అప్రయత్నంగా నాకు చాలాకాలం క్రితం జమీందారుగారు అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి.     "ఇదివరలో ప్రజలకు ఎంత డబ్బు దానం చేస్తే అంత గొప్ప. ఇప్పుడలా కాదు, ప్రజల దగ్గర్నించి ఎంత డబ్బు గుంజుకోగలిగితే అంత మహితాత్ముడని అర్థం"     ప్రజలెంతకి దిగిపోయారు? జగన్మోహనరావు లాంటి వారు పుట్టినందుకు గర్వపడుతున్న లోకం శ్రీనివాసరావుగారి లాంటి సాహిత్య పోషకుడు పరమపదించినందుకు బాధపడటం లేదు. పదవినీ, అధికారాన్నీ గౌరవించే ప్రపంచం, మంచినీ త్యాగాన్నీ గౌరవించడం మరచిపోయింది. శ్రీనివాసరావు శ్రినివాసుడిగా బ్రతికి వున్నన్నాళ్ళూ ఆయనపై కవిత్వాలల్లిన కవులూ, ఆయనకు గ్రంథాలు అంకితమిచ్చిన గ్రంథకర్తలు ఆయన చనిపోయాడన్న విషయమే పట్టించుకోలేదు. మంత్రివర్యుడి సేవాతత్పరత మీద పెద్ద పెద్ద వ్యాసాలు రాసిన రచయితలకి శ్రీనివాసరావనే సాహిత్యపోషకుడు మరణించాడన్న విషయమే జ్ఞాపకమున్నట్టు లేదు. బాధతో గుండెలు కెలికినట్టయ్యింది.     మరణవార్త తెలిసిన వెంటనే రామాపురం వెళ్ళాలనిపించింది. కాని కంపెనీ ఆడిట్ జరుగుతున్నందున కదిలేందుకు అవకాశం లేకపోయింది. నా సానుభూతిని విచారాన్ని వ్యక్తం చేస్తూ ఇందిర పేర ఉత్తరం రాశాను. కనీ దానికీ నాకు సమాధానం రాలేదు.     జమీందారుగారు పోయారని తెలిసినప్పటినించీ నాకు ఇందిరపై ఆందోళన అధీమైంది. ఆమె ఏమైందో, ఎక్కడుందో అని మనస్సు పదే పదే పరితపించింది.     మరో ఇరవై రోజులకు కాబోలు నాపేర హైదరాబాద్‌కు వచ్చిన ఉత్తరం రిడైరెక్ట్ అయి బొంబాయి కేంప్‌కు వచ్చింది.

    ఇందిర రాసింది!
    ఆత్రంగా ఉత్తరం విప్పాను.     "మైడియర్ నాథ్ -     నీకు నేను ఉత్తరం రాయడం ఇదే మొదటిసారి అనుకుంటాను ఈ మధ్య అయిదారేళ్ళలో. కాని, ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను. ఇదే చివరిసారి - నీకు ఈ ఉత్తరం అందేటప్పటికి భూమికి భారంగా వున్న ఇందిర దూరమై వుంటుంది.     నేను జీవితంలో ఒకే ఒక పొరబాటు చేశాను. కాని, ఆ ఒక్క దోషమే నా పాలిట దురదృష్టమై చివరి వరకూ కాలరాస్తూనే వుంది. నిజానికి మనిషికి అందమైన ఆశలుండటం ఆ ఆశలు అందుకోవాలని ఆరాటపడటం నేరమేమీకాదు. చిన్ననాటి నుంచీ దైవఓపహతురాల్ని నేను. చిన్నాన్న ఇంట్లో అతిహీనంగా పెరిగిన నేను - విధిరాతను ఒప్పుకోకుండా భవిష్యత్తులో కాడిలాక్ కార్లలో తిరగాలని కలలు కన్నాను. నా కలలకు ఓ రూపం కల్పించి నన్నొక శ్రీమంతురాలిగా తీర్చిదిద్దగల భర్తను వెదుక్కోవాలని ఉబలాటపడ్డాను. ఆనాటి ప్రయత్నంలో తొలిసారిగా చిక్కుకున్నది శేఖర్. శేఖర్ చాలా అందంగా ఉండేవాడు. సన్నగా, పొడుగ్గా,నాజూగ్గా, అందానికి పరమార్థంగా ఉండేవాడు. సిల్కు చొక్కాలతోనూ, గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లతోనూ తరచూ దర్శనమిస్తుండే శేఖరాన్ని చూచి అపార్థం చేసుకున్నాను. అంటే - మనిషి వ్యక్తిత్వంలోనూ, మనస్సులోనూ కాదు ఆస్థిపాస్థుల విషయంలో. నేనలా అపార్థం చేసుకునేందుకు శేఖర్ చాలా వరకు బాధ్యుడు. ఎన్నోసార్లు అతగాడు నా దగ్గర లేని గొప్పల్ని చెప్ప్పుకునేవాడు. శేఖర్ నిజంగా శ్రీమంతుడని భ్రమించి అతడిని పెళ్ళాడితే నా బంగారు కలలు నిజమౌతాయని విశ్వసించాను. అయితే, నా ప్రేమలో నటనగానీ, కాలుష్యం గానీ లేవు. నేను శేఖరాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఎన్నోసార్లు అతడిని నేను ఏ గుళ్ళోనో వెళ్ళి పెళ్ళి చేసుకుందామని తొందర పెట్టాను కూడా. భయస్థుడు, బుద్ధిహీనుడు అయిన శేఖరం కాలయాపన చేస్తూ వచ్చాడు. ఆ రోజుల్లో అతడు నా మాట విని వుంటే ఈ ఇందిర జీవితం మరోలా మారిపోయి వుండేది. ఈ ఇందిర బ్రతుకులో ఇంతటి అంధకారం, ఆవేదనా మిగిలి వుండేవి కావు. చివరకు, శేఖరం వివాహానికి అంగీకరించేనాటికి, అతడి అసలు స్వరూపం బయట పడింది. సిల్కు చొక్కాల మాటున వున్న అతగాడి బీదరికం బహిరంగమైంది. 

    నా ఆశలన్నీ ఒక్కసారిగా చెల్లా చదరైనట్టనిపించింది. గుండెల్లో ఆరని మంట చెలరేగింది. నన్ను మోసం చేసిన శేఖరాన్ని అంత త్వరగా క్షమించలేక పోయాను. వళ్ళు తెలియని కోపంలో పశువులా ప్రవర్తించాను నేను. శేఖరాన్ని అనరాని మాటలన్నాను. అతడి హృదయాన్ని గాయపరచాను. నా గుండెల్లోంచి అతడిని బలంగా తోసెయ్యాలని ప్రయత్నించాను. అమాయకుడైన శేఖర్ ఈ విపత్పరిమాణానికి తట్టుకోలేక పోయాడు. చివరకు తన నిండు జీవితాన్నే బలిచేసుకున్నాడు. మరణించిన శేఖర్‌కు ఈ ఇందిరలోని క్రూరత్వమే తెలుసుకానీ ఆమె పడిన ఆవేదనా, బాధా అర్థం కావు.
    మృత్యుకుహరంలోకి ప్రవేశించబోతున్న నాకు అబద్ధాలాడాల్సిన అవసరం లేదు. శేఖర్ని దూరంగా తొలగి పొమ్మన్నప్పుడు నేనెంత బాధ పడ్డానో ఆ భగవంతుణికే తెలుసు. ఆ తర్వాత అతడులేని కొరతను జీవితంలో ఎంత అనుభవించానో నా హృదయానికి తెలుసు. శ్రీనివాసరావుతో నా పరిచయం ఎలా ఐందీ నేనీ వుత్తరంలో వివరించదలుచుకోలెదు. ఎందుక్నటే ఇందులో ఆయన వ్యక్తిగత జీవితపు ప్రసక్తి కూడా వుంది కాబట్టి. ఎలాగైతేనేం రామాపురం కోటలో జమీందారిణిగా ప్రవేశించాను. అయితే అప్పటికే రామాపురం జమీందారు పని దివాళాకు వచ్చిందనీ ఆయన ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందనీ నాకు తెలియదు. శ్రీనివాసరావుగారు నన్ను పెళ్ళాడతాననగానే జమీందారిణినీ, కోటీశ్వరురాలినీ కాబోతున్నానని మురిసిపోయాను గానీ, దిగబోయేది ఊబిలోనికన్న విషయాన్ని గ్రహించలేక పోయాను. రామాపురానికి వచ్చిన కొన్నాళ్ళకు గానీ శ్రీనివాసరావుగారికున్న వ్యసనాలూ, దిగజారిపోతున్న ఐశ్వర్యమూ నాకు తెలిశాయి కావు. అయినా అప్పుడు నేనంతగా బాధపడలేదు. ఇక చేసేదేమీ లేదన్న వేదాంతమూ, విద్యావేత్తగా, విద్యాపోషకుడిగా శ్రీనివాసరావుగారి మీద వున్న గౌరవమూ అందుకు కారణాలు కావచ్చు. ఏది ఏమైనా నేను విధివంచితురాలినన్న విషయం మరోసారి స్పష్టమైపోయింది.
    ఆ రోజుల్లోనే నువ్వు మెడ్రాస్ వచ్చావు. అనుకోకుండా మాకు తారసిల్లావు. అప్పుడు శ్రీనివాసరావుగారు మెడ్రాస్ వచ్చింది ఎందుకో తెలుసా? - రెండు లక్షల రూపాయల్ జహ్వారీని అమ్మేసేందుకు. కాని ఆనాటి మా పరిస్థితి నీకు తెలియదు. నిన్ను చూడగానే ఎన్నో మాటలు హృదయం విప్పి చెప్పుకోవాలనిపించింది నాకు. కాని నువ్వు వినిపించుకునే స్థితిలో లేవు. అందుకే ఏమీ చెప్పలేకపోయాను.
నా కళ్ళెదురుగా కూలిపోతున్న ఐస్వర్యాన్ని చూస్తూ పిచ్చిగా నవ్వుకునే దాన్ని నేను. అయితే, రాబోయే దినాల ఊహ నన్నెప్పుడూ కలవరపెట్టలేదు. నానాటికీ నా గుండెల్లో పెరిగిపోతున్న మొండితనం నన్ను భావాలకు అతీతం చేసింది. అదే నా పాలిట కోకెయిన్‌లా పనిచేసి గతాన్నుంచి నన్ను దూరంగా తీసుకుపోయేది. ఆశలు పూర్తిగా కూలిపోయి, శిథిలాలు మిగిలినప్పుడు, ఆ శిథిలాల్లో నన్ను వెదుక్కుంటూ చూడ్డానికి వచ్చావు నువ్వు రామాపురానికి. అప్పటికి ఇందిర పూర్తిగా బండబారి పోయింది. కష్టాలను సునాయాసంగా జీర్ణించుకోగల నేర్పు సంపాదించుకుంది.     ఐతే నువ్వో ప్రశ్న అడగొచ్చు. కష్టాలను దిగమ్రింగుకోవాల్సిన అవసరం నీకేముంది? నీ యౌవ్వనాన్ని సాయం తీసుకుని దూరంగా పారిపోకూడదూ అని?     వెర్రినాథ్! నీకు ఇందిర అర్థం కాదు. అర్థం చేసుకోలేవు నువ్వు. ఇందిరకు ఆనాడు కావల్సింది కష్టాలనుండీ పారిపోయే అవకాశం కాదు. అదే కావాలనుకుంటే సునాయాసంగా లభించేది నాకు. ఇందిర కోరుకున్నది తన పాపానికి పరిహారం.     అందుకే నేను కొరడా దెబ్బల్ని మన్మథ బాణాలుగా భావించి భరించాను. శ్రీనివాసరావుగారు అనుక్షణం తిట్టే తిట్లలో ప్రియవచనాల్ని చూసుకున్నాను. శేఖరం నిండు జీవితాన్ని బలికొన్నాననే ఆవేదన, నా గుండెల్ని అనుక్షణం కోస్తూ భయపెడుతుంటే ఈ బాధల మాటున నేనా భయాన్ని దాచుకున్నాను. నిజానికి శ్రీనివాసరావుగారి కఠీన ప్రవర్తన నాకేమీ బాధ కలిగించలేదు. ఇంకా చెప్పాలంటే, వారింకా కఠినంగా వుండాలనీ, ఆయన నన్నింకా బాధించాలనీ, కోరుకునే దాన్ని నేను. నేను చేసిన పాపానికి ప్రతిఫలం ఈలోకంలోనే అనుభవించాలనే తాపత్రయం, స్వార్థం అందుకు కారణాలు.     మరణించే ముందు తను చెసిన మంచి పని ఒక్కటయినా మిగలడం మనిషికి అదృష్టమంటారు. ఆ దృష్ట్యా నాను అదృష్టవంతురాలినే. శ్రీనివాసరావుగారు తుది శ్వాస విడిచేవరకూ ఆయనకు నేను సేవ చేశాను. భార్యగా విద్యుక్త ధర్మం నెరవేర్చుకున్నాను. సిరిసంపదలు, దాసదాసీజనాన్ని పోగొట్టుకున్న శ్రీనివాసరావుగారి కాలోటు సాధ్యమైనంత వరకూ పోగొట్టాను. ఇదే నాకు జీవితంలో మిగిలిన సంతృప్తు. ఆ సంతృప్తితోనే నేనీ లోకాన్ని సంతోషంగా విడిచిపెడుతున్నాను.     ఈ లోకంలో నన్నింత వరకూ అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. చిన్న నాడు పెంచిన చిన్నాన్న దగ్గర నుండి, తాళి కట్టిన భర్తవరకూ అందరూ ఏదో నెపంతో నన్ను నిందించారు. పుట్టగానే తల్లిదండ్రులను పోగొట్టుకున్న నన్ను శనిదేవత ప్రతిరూపమని చిన్నాన్న అన్నాడు. ఆ మాటే మరోసారి రెట్టించారు - పాతికేళ్ళ తరువాత మా శ్రీవారు.     చదువుకునే రోజుల్లో మొగపిల్లలతో తిరిగే షోకిల్లాపిల్ల అని కాలేజీ విద్యార్థులు గేలిచేశారు. నీచురాలివంటూ శేఖర్ శపించాడు.     కాని, ఇంత వరకూ నా మనసును, ఆవేదనను, సానుభూతిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కరూ లేరు. కనీసం నువ్వు ఒక్కడివైనా నన్ను అర్థం చేసుకుంటావనే వెర్రి ఆశతో - పిచ్చి నమ్మకంతో - ఈ ఉత్తరం రాస్తున్నాను. వీలైతే నన్ను క్షమించు. నా జీవితంలో మిగిలిన చివరి కోరిక అదొక్కటే"                                                                      నీమిత్రురాలు                                                                     - "ఇందిర"     ఉత్తరం చదివి కన్నీళ్ళు తుడుచుకుంటూ అస్పష్టంగా గొణుక్కున్నాను.     "ఇందూ! నిన్ను నేను కాదు, శేఖరం బ్రతికివున్నా క్షమించేవాడు. అందని ఆశలకు పరుగెత్తి, నిండైన జీవితాన్ని బలిచేసుకున్నావు నువ్వు. మధురిమలతో చిగురించాల్సిన జీవితాన్ని అగాధాల పాలు చేసుకున్నావు. తుదకు నిన్ను నీవే శిక్షించుకున్నావు. అందంతో ఐస్వర్యాన్ని కొందామనుకున్నావు నీవు. ఐస్వర్యంతో శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదిద్దామనుకున్నారు శ్రీనివాసరావుగారు. చివరకు ఇద్దరూ పరాజయాన్ని పొందారు."     సన్నగా ట్రాన్సిస్టర్ లోంచి త్యాగరాజు కీర్తన వినబడుతోంది.     "తెరతీయగరాదా - తిరుపతి వెంకట రమణ     పరమ పురుష ధర్మాది మోక్షముల పారద్రోలుచున్న     నాలోని మత్సరమను తెరతీయగరాదా..."     మత్సరమే కాదు మనిషి గుండెల్లో గూడుకట్టుకున్న తెరలు మరెన్నో ఉన్నాయి. మనిషి ఆ తెరని తీయనూ లేడు. వాటి సంగతి మరచి ప్రశాంతంగా వుండనూ లేడు. ఇందిర ప్రథమంలో ఆ తెరల్ని గట్టిగా పట్టుకుని గుండెల మీద పదిలంగా పరచుకుంది. చివరకు ఆతెరల్ని చేదించి బయటకు రాగలిగింది కాని, ఆ సరికే ఆమెకు జీవన సంధ్య వచ్చింది.     ఇక శ్రీనివాసరావుగా మొదటి నుంచీ ఆ తెరల్లోనే జీవించి, చివరకు మరో పది తెరల్ని గుండెలమీద పరుచుకుని అందులోనే శాశ్వతంగా నిద్రపోయారు.     ఇందిర జీవితంలో శ్రీనివాసరావుగారు ప్రవేశించి అనుకోకుండానే ఆమెను ఓ మెట్టు ఎక్కించారు. అయితే చివరకు తాను పది మెట్లు దిగిపోయారు. బాధగా కళ్ళు మూసుకున్నాను.

(జయశ్రీ మాసపత్రిక నవంబరు 1969 సంచికలో ప్రచురితం)
Comments