తోడొకరుండిన అదే భాగ్యము - కలువకొలను సదానంద

    
"మనసున మనసై
    బ్రతుకున బ్రతుకై
    తోడొకరుండిన అదే భాగ్యమూ... అదే స్వర్గమూ!"

    అరవయ్యో ఏడు ఇంకా పూర్తి కాని బాబయ్య ముది పెదాల మీద దొంగ చాటుగా చిందులేస్తున్న పాట ఇది.

    కొత్త రిపేర్లతో మలి ముస్తాబులు చేసుకున్న పాతకాలపు డాబా ఇల్లు. డాబా వెనక విశాలమైన దొడ్డి. అందులో ఓ వార చేదబావి. పక్కన చిన్న ఔట్ హౌస్. మరో వైపు చిన్న పూలతోట. వీటి చుట్టూ ప్రహరీ గోడ. ముందువైపు ఇనపగేటు. రిటైర్డ్ ఆఫీసర్ బాబయ్యగారి ఇల్లు అది.

    పగలు అనే మగాడు వెలుగు అనే ఆడదాన్ని తోడు చేసుకుని పడమటి కొండల చాటుకు వెళ్ళిపోతున్న మలిసంజవేళ - టీపాయ్ మీదికి కాళ్ళు పారజాపి పూల తోటలో వాలు కుర్చీలో కూర్చొన్నాడు బాబయ్య.

    "కాఫీ తీసుకురానా మామయ్యా" అన్న పలకరింపుతో అతని కూనిరాగం టక్కున ఆగిపోయింది.

    ఇంట్లోంచి కాఫీ కప్పుతో దొడ్లోకి నడిచి వచ్చింది సుమన - కారుణ్యం ఆడపుట్ట కెత్తినట్లు! కాఫీ టీపాయ్ మీద పెట్టి, పక్కన నుంచుని చెక్కిళ్ళు నిక్కించి ఓ చిరునవ్వు నవ్వింది. లాలిపాట వింటూ ఉయ్యాల్లో పడుకున్న పాపాయిలా కుకుకు రాగం తీసిం దతని హృదయం. గుండెను చేరి చేరకముందే శరీరంలోని సిరలన్నీ ధమను లైపోయాయి. అది చిర్నవ్వు కాదు. మల్లెపూల జల్లు! వెన్నెల తుళ్ళింత! జలపాతపు తుంపర!

    తాను పెంచిన పూలమొక్కల్ని కాసేపు లాలిస్తూ తిరుగుతున్న సుమన వైపు చూస్తూ కాఫీ తాగాడు బాబయ్య. చామనచాయతో, చెంపకు చారెడేసి కళ్ళతో అందంగా ఉంది సన్నగా, పొడుగ్గా ఉన్న ఈరవై ఏడేళ్ళ సుమన.

    గుండ్రటి పిరుదులమీద పొడుగాటి జడ పాములా ఎగిరెగిరి కాటు వేస్తుంటే, కప్పుతో ఇంట్లోకి నడిచి వెళ్ళిందామె. 

    చీకట్లు ముసురుకుంటుంటుంటే, వాలు కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు బాబాయ్య. ఆరడుగుల ఎత్తున్నాడతను. దృఢమైన శరీరం, ఎర్రటి మేని చాయ. చిక్కగా ఉన్న నల్లటి క్రాపులో అటూ ఇటూ చెవుల దగ్గర మాత్రమే తెల్లటి చారలు కొత్త అందాన్నిస్తూ! అరవై ఏళ్ళొచ్చినా అతని అందం తరగలేదు. నోట్లో ఇకటి రెండు దవడపళ్ళు రాలిపోయాయి తప్ప జవసత్వాలు సడలిపోలేదు. నిక్షేపం లాంటి ఆరోగ్యం!


    ఇంట్లోకి వెళ్ళాడు బాబయ్య. వంట గదిలో పని చేసుకుంటోన్న సుమన లేచి వచ్చి ఇంట్లో లైట్లన్నీ వేసి వెళ్ళింది.


    పడక గదిలోకి నడిచి బీరువా ఎదుట నిలబడ్డాడతను. వంటగది వైపు ఓ దొంగ చూపు విసిరి, చప్పుడు కాకుండా బీరువా తలుపు తెరిచాడు. సుమన కంట బడకుండా అందులో దాచిన పట్టుచీరను చేతిలో తీసుకున్నాడు.


    "కనకాంబరం రంగు జరీచీర. ఈ చీరలో ఎంత చక్కగా ఉంటుందో సుమన! " అనుకుని పులకించిపోయాడు. అతని పెదాలపైన పాట లాస్యం చేసింది.


    " చీకటి ముసిరిన ఏకాంతంలో తోడొకరుండిన …"


    ఎన్ని లేవు పాటలు? ఈ ఒక్క పాట మాత్రమే మూడు నెలలుగా వెన్నాడుతోందతన్ని!


    చీకటి ముసిరిన ఏకాంతంలో పదిహేనేళ్ళు ఎలా దొర్లించాడో తలుచుకుంటే తనకే ఆశ్చర్యంగా ఉందిప్పుడు. పదిహేనేళ్ళ క్రితం భార్య పోయింది. మళ్ళీ పెళ్ళి చేసుకోలేదతను. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్త్రీ స్పర్శకు దూరమైపోయాడు. పిల్లల్ని హాస్టల్స్ లో  ఉంచి ఒంటరిగా బతికాడు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఎన్నో ఊళ్ళు తిరిగాడు. ఒంటరిగా బతికాడు.  'ఒంటరితనపు' దెయ్యాన్ని దరిచేరనివ్వకుండా, ఉద్యోగ బాధ్యతలమీద మనసు కేంద్రీకరించారు.  ఏ అటెండరో, జీపు డ్రైవరో తెచ్చి పెట్టిన భోజనం తిని, రాత్రివేళల్లో అలసటతో నిద్రపోయేవాడు. సొంత ఊరివైపు వచ్చే అవసరంగానీ, ఇక్కడున్న ఈ తాతల నాటి ఇంటి బాగోగుల్ని గురించి ఆలోచించే అవకాశం గానీ లేక పోయిందతనికి.   

    

    అలాంటి పరిస్థిలుల్లో - ఎక్కడో ఏదో ఊళ్ళో ఉంటున్నప్పుడు ఏడెనిమిదేళ్ళ క్రితం ఓ రోజు అతన్ని వెతుక్కుంటూ వచ్చింది రమణమ్మ. అతని చుట్టమే ఆమె. వరసకు చెల్లెలవుతుంది. ఆమెకు ఓ కొడుకూ, ఓ కూతురూ. కొడుకు ఓ జులాయి. తానూ, తన పెళ్ళాం పిల్లలే తప్ప, తల్లి గురించీ, చెల్లి గురించి పట్టించుకునే ఔదార్యం లేదతనికి. నాలుగిళ్ళలో పాచిపని చేసుకుంటూ పొట్ట పోసుకుంటోంది రమణమ్మ.


    "అన్నా! అంత పెద్ద ఇల్లు ఉపయోగం లేకుండా పాడుకొట్టుకుపోతున్నదే కదా? నువ్వేమో అటుకేసి చూడటం కూడా మానేశావు. నిలవ నీడలేని దాన్ని! పైగా సుమన కూడా వచ్చేసింది. నువ్వు దయతలిచి సరేనంటే, నీ పేరు చెప్పుకుని అందులో ఓ మూల పడి ఉంటాము" అంది ఆమె. 


    తాళం చెవులు తీసి ఆమె చేతికిచ్చాడతను.


    పదవీ విరమణ చేసిన తరువాత, స్వగ్రామానికే రాక తప్పలేదతనికి. కొడుకూ, కూతురూ జీవితాలలో స్థిరపడిపోయారు. కూతురు స్టేట్స్‌లో ఉంది డాక్టర్‌గా! అక్కడే మతాంతర వివాహం చేసుకుంది. కొడుకు హర్యానాలో ఇంజనీరుగా ఉన్నాడు. ఓ పంజాబీ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అల్లుడెలా ఉన్నాడో, కోడలెలా ఉంటుందో తెలియదు తనకు. 


    అతను సొంతగూటికి చేరుకునేటప్పటికి, కూతురు సుమనతో ఆ ఇంట్లో ఉంటోంది రమణమ్మ. కుట్టు మిషన్ ఒకటి ఇంట్లో పెట్టుకుని ఆడవాళ్ళ జాకెట్లూ, అవీ కుట్టి నాలుగు పైసలు సంపాదించుకుంటోంది సుమన.


    బీటలు వారిపోయిన ఆ ఇంటికి మరమ్మత్తులు చేయించటానికి చాలా ఖర్చయింది బాబయ్యకు. అతనికి ఆ ఇల్లు విడిచిపెట్టి, దొడ్డివేపున ఉన్న చిన్న ఇంట్లోకి మారారు తల్లీ, కూతుళ్ళు.


    నెల నెలా పెన్షన్ పుచ్చుకోవడం తప్పితే, మరే పని లేదు బాబయ్యకు. దుర్భరమైన ఏకాంతం! అతని అవసరాలు పరిమితమే కావచ్చు. కానీ దిక్కెవరున్నారతనికి? వేళకింత వండిపెట్టడం, స్నానానికి నీళ్ళు తోడి ఇవ్వడం, ఇల్లు శుభ్రం చేయటం మొదలైన అవసరాలన్నీ ఆ తల్లీ కూతుళ్ళే చూసుకునేవాళ్ళు.


    మొదట్లో "సార్, సార్!" అంటూ సంబోధిస్తుండేది సుమన బాబయ్యని. పరిచయం పాతబడ్డ తరువాత 'మామయ్యా' అని పిలవటం అలవాటు చేసుకుంది.


    ఏడాది కిందట రమణమ్మ మాంచాన పడి చనిపోయింది. తన చివరి రోజుల్లో "నా కూతుర్ని ఓ కంట చూసుకో అన్నయ్యా!" అంటూ కంట నీరు పెట్టుకుందామె. ఊళ్ళోనే ఉంటున్న ఆమె కొడుకొచ్చి తల కొరివి పెట్టి వెళ్ళాడు.


    "ఎవరున్నారు నాకింక? ఎవరికోసం బతకాలి నేను?" అంటూ ఏడ్చింది సుమన. 


    ఆమెను ఓదార్చటం సాధ్యం కాలేదు బాబయ్యకు. "ఏడవకే సుమనా! నేను లేనా నీకు? మీ అమ్మ కోసం బతికినట్లే నా కోసం బతకలేవా?" అన్నాడతను.


    ఆ మాట విన్న సుమన అతని ముఖంలోకి దీక్షగా చూసింది. అతని ఒడిలో తల పెట్టుకుని కాసేపటికి ఏడుపు మానింది. 


    రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ మధ్య చనువు పెరిగింది. మనసులు మరింత చేరువైనాయి. కుట్టుపని మీద ఆసక్తి తగ్గింది సుమనకు. అతని అవసరాల పట్ల శ్రద్ధ చూపడం ఎక్కువైంది. అతనికి కూతురూ, కోడలూ అన్నీ తానే అయింది ఆమె. తన వయసుల్ని గురించి మరిచిపోయి, ఇంకా బడి ఈడైనా రాని పసిపిల్లలైపోయారు వాళ్ళు. జీవితం బుడి బుడి నడకల పరుగుగా మారింది వాళ్ళ విషయంలో!


    తోడూ నీడా లేని నిస్సహాయ స్థితి, ఒకరి పట్ల ఒకరికి జాలి బలపడటానికి కారణమైంది. ఆ జాలే వాళ్ళ సాన్నిహిత్యానికీ, సాహచర్యానికీ ఊపిరైంది.


    తలుచుకుంటే ఎన్నో మధుర స్మృతులు బాబయ్యకు.


    ఓసారి అతను స్నానం చేస్తుంటే, సుమన వీపు రుద్దుతూ కిసుక్కున నవ్వింది. 


    "ఎందుకే ఆ నవ్వు?" అన్నాడు బాబయ్య.


    "ఎంత పెద్ద వీపు మామయ్యా నీది! ఈ వీపంటే నాకెంత ఇష్టమో?" అందామె.


    "ఇష్టమా? ఎందుకూ?"


    "అంతెత్తు కొండ చరియపై నుంచి నన్ను భద్రంగా కిందికి మోసుకొచ్చి దించిన వీపు కదా ఇది!"


    "నిన్ను నేను మోశానా? ఎప్పుడదీ?"


    "నీకెందుకు గుర్తుంటుందిలే? నీవు పెద్ద ఆఫీసర్‌వి కదా! అప్పుడు నాకు పన్నెండేళ్ళు. ఎనిమిదో క్లాస్ చదువుకుంటున్నాను. ఎందుకో ఈ ఊరొచ్చారు మీరు. ఫ్యామిలీతో సహా జీపులో తలకోనకు వెళుతూ, ఆ పనికి ఈ పనికీ చేదోడుగా ఉంటానని నన్ను కూడా మీతో తీసుకుపోయారు. అక్కడ జలపాతం దగ్గరకి ఎలాగో అలా ఎక్కి వెళ్ళిపోయాం. తిరిగి కిందకి దిగేటప్పుడే చిక్కొచ్చిపడింది నాకు. మీ అబ్బాయీ, అమ్మాయీ, అత్తయ్యా అందరూ ముందుగా దిగి వెళ్ళి్పోయారు. వెనుక మిగిలింది మనమిద్దరమే! దిగుతుంటే కళ్ళు తిరుగుతున్నట్లైంది నాకు. కాళ్ళు గజగజా వణికాయి. ఏడుపందుకున్నాను. అప్పుడు నువ్వు నా భుజం తట్టి ధైర్యం చెప్పి నన్ను వీపునెక్కించుకున్నావు. కొండచరియ దిగాక నన్ను కిందికి దించావు. అప్పుడు నా జాకెట్ హుక్ తగులుకుని నీ చొక్కా పర్రున చిరిగిపోయింది. నీకు కోపం రాలేదు. పైగా నవ్వుతూ 'నిన్ను కిందికి మోసుకొచ్చాను గదా, నాకేమిస్తావే?' అని అడిగావు. 'ఇంటికెళ్ళాక మీ చొక్కా కుట్టించేస్తాన్లెండి సార్!' అన్నాను నే భయంగా. 'వద్దులే, నాకో చిన్న ముద్దివ్వు చాలు' అన్నావు నువ్వు. నేను బిక్కరించి చూస్తుంటే నువ్వే వంగి ముద్దెట్టుకున్నావు నా నుదిటిమీద. అంత పెద్ద ఆఫీసరూ నన్ను వీపు నేసుకుని మోశాడని ఎంత గర్వపడిపోయానో తెలుసా?"


    ఇద్దరూ గలగలా నవ్వుకున్నారు.


    "ఔనవును గుర్తుకొచ్చింది" అన్నాడతను ఒకింత పారవశ్యంతో.


    ఓ సారి బాత్‌రూమ్‌లో కాలు జారిపడ్డాడు బాబయ్య. కుడిచేతి మణికట్టు బెణికింది. బాధతో విలవిలలాడి పోయాడతను. చేయి బాగా వాచిపోయింది. అది బాగవటానికి ఇరవై రోజులు పట్టింది. చేయి అతనిది. బాధ సుమనది! కోడిగుడ్డు సొన, మినపపిండి,ఎర్రమట్టి కలిపి రంగరించి ఆమె చేతికి పట్టు వేసింది. కంచంలో అన్నం కలిపి అతనికి స్పూనుతో తినిపించింది.


    ఇటుక రాయి పెట్టి బాత్‌రూమ్‌లో పాచిని గోకేస్తుంటే "అదలా ఉండనీలే సుమనా! నువ్వు నాకిలా సేవలు చేస్తుండాలే గానీ ఎన్నిసార్లయినా జారి పడటానికి ఏ అభ్యంతరమూ లేదు నాకు!" అన్నాడు బాబయ్య కొంటెగా.


    సుమన నవ్వింది. "నువ్వు జారిపడితే నేన్నీకు చెయ్యగలను కానీ, నేను జారిపడితే నువ్వు నాకు చేయలేవు కదా మామయ్యా? అందుకే శుభ్రంగా గోకేస్తున్నా!"


    ఆ మాటకు బాబయ్య ముఖం చిన్నబోయింది. "అదేమిటే సుమనా! అలా అంటావు? నీ కోసం  నేనేమీ చెయ్యలేనా? నా ప్రాణమైనా ఇస్తాను గదా?"


    "బాబూ! నేను  కాదనలేదు. మగవాళ్ళకి ఆడంగులకి మల్లే ఇంటి చాకిరీ చేయటం కంటే ప్రాణమివ్వటమే తేలిక అంటున్నానంతే!"


    మూడు నెలల క్రితం ఊళ్ళో కొందరు కలిసి వారం రొజుల టూర్‌కు పథకం సిద్ధం చేశారు. "నువ్వూ వెళ్ళి రారాదా సుమనా?" అన్నాడు బాబయ్య. 


    "నే వెళ్తే నీకెలా ఇక్కడ?" అందామె.


    "అయితే ఇద్దరం వెళ్దాం."


    "సరే!"


    ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు బస్సులో. ఒకరిని విడిచి ఒకరుండలేదు. ఎగుడు దిగుళ్ళన్నీ ఎక్కి దిగారు జంటగా. అహోబిలం, శ్రీశైలశిఖరం, గోల్కొండ, బిర్లామందిర్, యాదగిరి గుట్ట, భద్రాచలం, ఇంద్రకీలాద్రి, మంగళగిరి పానకాలస్వామి కొండ... అయాసపడుతూ, ఆగుతూ, అలసట తీర్చుకుంటూ, ఎక్కుతూ, దిగుతూ, ఆడ మనిషన్న జాలితో అతనూ, ముసలివాడన్న జాలితో ఆవిడా, చేయీ చేయీ కలిపి వారం రోజుల విహార యాత్ర!


    అది లోకాతీత వ్యవహారం! జరా మరణాలు లేని ఓ మధుర స్వప్నం.


    లోకం ఇంత అందంగా, ఇంత ఉల్లాసజనకంగా మునుపెన్నడూ కనిపించలేదతనికి. ఎండి మోడు వారి శిలాజంగా మారిపోయిన అతని గుండె విచిత్రంగా మళ్ళీ చివుళ్ళు తొడగడం ప్రారంభించింది. కాలం పరవళ్ళతో గతి తప్పి ఏ సుదూరపు చీకటి కోణంలోనో చిక్కడిపోయిన వసంతం మళ్ళీ వచ్చి అతని ఊహల ఉయ్యాలెక్కి కూర్చుంది.


    ఇంకెన్నాళ్ళు బతుకుతాడు తాను? మరొక్కరోజు బతికినా చాలు, బతికినంత కాలం ఆ మధుర స్వప్నాన్ని శాశ్వతం చేసుకోగలిగిత!


    "...అదే భాగ్యమూ... అదే స్వర్గమూ..."


    సునను తప్ప మరి దేన్నీ స్మరించనని మనసూ, ఆమెను తప్ప మరేమీ చూడనని కళ్ళూ, ఆమె కంఠస్వరం తప్ప మరి ఏ సవ్వడీ విననని చెవులూ మొండికేస్తున్నాయి. అమూల్యమైన ఆమె సామీప్యాన్ని క్షణకాలమైనా వదులుకోవడం ఇష్టం లేని బాబయ్య వ్యాహ్యాళికి వెళ్ళడం కూడా తగ్గించాడీమధ్య. సుమనను చూస్తున్నప్పుడూ కంటికి రెప్పపాటెందు కిచ్చాడో దేవుడు అనిపిస్తుంది. ఆ మాత్రపు వ్యవధి కూడా వృథా కావడం అతనికి ఇష్టంలేదు.


* * *


    తన మనసులోని మాట సుమనకెలా చెప్పాలో తోచడం లేదు. ఏదో జంకు! అలాంటి సందర్భానికి అనుగుణంగా మనసు సంసిద్ధం కావటం లేదింకా. పది రోజులైంది ఈ పట్టుచీర కొనుక్కొచ్చి. అనగుడై తనలో దాగిన దొంగకు ఈ పట్టుచీరగా ఓ బాహ్యరూపమిచ్చాడు తాను. సుమన ఈ దొంగను గుర్తించగలదా?


    గాజుల గలగల గది గుమ్మం వైపు చిలిపి పిల్లలా కదిలి వస్తుంటే గబుక్కున చీర బీరువాలో పెట్టి తలుపులు మూశాడు బాబయ్య.


    "భోజనం రెడీ మావయ్యా! చల్లారిపోతోంది రా!"


    డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్ళి కూర్చున్నాడతను. సుమన ఎదురుగా కూర్చుని వడ్డిస్తుంటే, కొత్తగా సిగ్గు పుట్టుకొస్తోందతనికి. ఆమెకూ అంతే!


    గోడ గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. 


    బయట రిక్షా మువ్వల మోత. గేటు తీసిన చప్పుడు. సుమన లేచి దొడ్లోకి వెళ్ళింది. అర నిముషం తరువాత మళ్ళీ వచ్చి కూర్చుంది.


    "రెడ్డి కుమారేనా?"


    "ఊఁ!" 


    పండగనాటి టపాసుల్లా విసుగూ విరామం లేకుండా వాగుతూ ఉండే ఆ ఇద్దరూ వారం పది రోజులుగా మౌనంగా ముభావంగా ఉంటున్నారు. ముక్తసరి పలుకూ, పరాకు నవ్వులే వారికి సంభాషణలైనాయి. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు వివశూలైపోతున్నట్లున్నారు. 


    నూతి దగ్గర నీళ్ళు తోడి నెత్తిన పోసుకుంటున్నాడు రెడ్డి కుమార్. దొడ్లో ఉన్న చిన్న ఇంట్లో అయిదు నెలల నుంచి అద్దెకుంటున్నాడతను. అతనికి తోడు ఆ రిక్షా!


    రెడ్డి కుమార్‌తో వాళ్ళ పరిచయం చాలా విచిత్రంగా మొదలైంది. 


    ఆరు నెలల క్రితం ఓ నాటి మధ్యాహ్నం భఒజనాలైన తరువాత - "నేనలా వెళ్ళి నీకో చక్కటి ఈజీ చైర్ కొనుక్కొస్తాను మామయ్యా!" అంటూ వీధి తలుపు దగ్గరకు వేసి బజారుకు వెళ్ళింది సుమన.


    భుక్తాయాసంతో గదిలో మమచం మీద పడుకున్నాడు బాబయ్య. కాసేపటికి ఓ మూష్టివాడు ఇంటి ముందు నిలబడి కేక పెట్టసాగాడు. 


    బాబయ్య లేచి కిటికీ దగ్గరికెళ్ళి "వెళ్ళవయ్యా!" అని కేకేసి మళ్ళీ వచ్చి పడుకున్నాడు.


    అయితే ముష్టివాడు వెళ్ళలేదు. మొండికేస్తూ నుంచున్నాడు. అరిచి అరిచీ  వాడే వెళ్తాడులే అనుకున్న బాబయ్య ఆఖరికి విసిగిపోయి మళ్ళీ కిటికీ దగ్గరకు లేచి వెళ్ళాడు. "ఇంట్లో ఎవరూ లేరు, వెళ్ళమంటున్నాను కదా?" అని గదమాయించాడు.


    వాడు కదల్లేదు.


    "నీ ఇష్టం" అనుకుంటూ వచ్చి గదిలో పడుకున్నాడు బాబయ్య.


    వాడి కేక మళ్ళీ వినిపించలేదు. ఒక నిముషం తరువాత దిగ్గున లేచి కూర్చున్నాడు బాబయ్య. ఆశ్చర్యంతో బాటు కోపం కూడా వచ్చిందతనికి.


    వీధి తలుపు లోపల గొళ్ళెం పెట్టి, ముష్టివాడు గదిలోకి వచ్చేశాడు. వాడి చేతిలో పదునైన చాకు ఉంది. "అరవకు. చంపేస్తాను!" అంటూ బెదిరించాడు. వాడు బలంగా లేడు కూడా. బక్కపలచగా ఉన్నాడు. వాడి మెడలు విరచటం పెద్ద కష్టమేమీ కాదు బాబయ్యకు. అయితే వాడు తేలుకొండిలా బహు చురుగ్గా ఉన్నాడు. అంతకంటే చురుగ్గా ఉంది వాడి చేతిలోని కత్తి. వాణ్ణి ప్రతిఘటిస్తే పొడిచేటట్లే ఉన్నాడు.


    "బీరువా తెరు! ఏన్ముందందులో?" అన్నాడు వాడు.


    లోగడ ఓ స్నేహితుడికి పదివేలు అప్పిచ్చాడు బాబయ్య. ఆ స్నేహితుడు ఉదయం వచ్చి బాకీ తీర్చి వెళ్ళాడు. ఆ డబ్బు బీరువాలో ఉంది. 


    ఆ వంద రూపాయల నోట్ల కట్ట అందుకుని జోలెలో వేసుకున్నాడు ముష్టివాడు. "అక్కడే ఉండు! కదలకు! అరిచావో పొడిచేస్తా!" అంటూ వీధి తలుపు దగ్గరికెళ్ళి గొళ్ళెం తీశాడు.


    బజారులో ఈజీ చైర్ కొనుక్కున్న సుమన ఓ కూలీవాణ్ణి పిలిచి, దాన్ని తనవెంట మోసుకు రమ్మంది. ఊరికి కొత్తవాడిలా కనిపిస్తున్నాడు ఆ కూలివాడు. ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. లోపల జరుగుతున్న తతంగం అర్థమైపోయింది వాళ్ళకు. నిశ్శబదంగా వాకిట్లో నుంచున్నారు. 


    ముష్టివాడు బయట కాలు మోపడం ఆలస్యం, ఎగిరి వాణ్ణి వాటేసుకున్నాడు కూలివాడు. వాణ్ణి కొట్టి కింద పడేశాడు. ఆ పెనుగులాటలో భుజం మీదా, వీపు మీదా రెండుచోట్ల అతనికి కత్తి గాయాలైనాయి. 


    అలా పరిచయమైన కూలివాడే రెడ్డి కుమార్.


    నల్లగా పొడుగ్గా ఉండి, మొరటుగా కనిపిస్తాడతను. వయసు ముప్పై ఏళ్ళుంటుంది. ఆ రోజు నుంచి అప్పుడప్పుడూ బాబయ్య దగ్గరికి వచ్చిపోతుండేవాడు. 


    "ఏ వూరు మీది?" అని అడిగాడు బాబయ్య.


    "చాలా దూరం. ఓ పల్లెటూరు."


    "ఈ ఊరెందుకొచ్చావ్?"


    "బతకటానికి! నా అనే వాళ్ళెవ్వరూ లేరు. మా ముసిల్దాని కోసం ఊరొదిలిపెట్టడం కుదర్లేదు. ఆమెను కాటి కంపేసి ఇప్పుడిలా లోకం మీద పడ్డాను."


    "ఏమైనా చదువుకున్నావా?"


    "పదో తరగతి దాకా చదువుకున్నాను గానీ, లాభం లేదండీ బాబూ! కాయకష్టం తప్పితే ఇంకేం తెలియదు నాకు!"


    సుమనతో సంప్రదించి ఆతనికొక సైకిల్‌రిక్షా కొనిచ్చాడు బాబయ్య. "రాత్రులు పడుకోడానికి ఇబ్బందిగాఉందండీ నాకు. ఊరకుక్కలూ, నేనూ ఒకటేనా? ఎక్కడైనా చిన్న ఇల్లో, పాకో దొరికితే బాగుణ్ణు" అన్నాడు రెడ్డి కూమార్.


    "మన దొడ్లో ఉన్న ఇల్లే ఇస్తే సరిపోదూ? ఎలాగూ మనం వాడుకోవటం లేదు. మంచితనం, మొరటుతనం రెండూ ఉన్నవాడు. మనకూ సేఫ్టీ ఉన్నట్టవుతుంది" అంది సుమన బాబయ్యతో.


    అలా వచ్చి ఆ ఇంట్లో చేరాడు రెడ్డి కుమార్.తన సంపాదనలోంచి రోజూ కొంత రిక్షా బాకీకి చెల్లు వేస్తూ, మిగిలినది సుమన దగ్గర దాచుకుంటున్నాడు.


    బాబయ్య భోజనం ముగించి చెయ్యి కడుక్కుంటుంటే, పెరటి వసారాలో నుంచుని, "బాబుగారూ!" అని పిలిచాడు రెడ్డి కుమార్.


    "ఆఁ వస్తున్నా!" అంటూ లేచి వెళ్ళింది సుమన. "ఈ వేళ్టితో రిక్షా బాకీ పూర్తిగా చెల్లు! ఈ క్షణం నుంచి నీకు పూర్తి స్వాతంత్ర్యం ప్రకటించేస్తున్నాను పో!" అంటూ కిలారున నవ్వుతోంది.


    బాబయ్య లేచి అభినందన పూర్వకంగా చిరునావు నవ్వుతూ బయటకు వెళ్ళాడు. రెడ్డి కుమార ప్రయోజకత్వానికి చిహ్నంగా కాంపౌండు లోపల అతని రిక్షా నిలబడి ఉంది. 


    "అయిదు నెలలకే రిక్షాను స్వంతం చేసుకోగలిగావన్న మాట! పరవాలేదు. పెళ్ళాం పిల్లల్ని సుఖపెట్టగలవురా నువ్వు!"


    "అంతా మీదయే బాబూ!" అన్నాడు రెడ్డి కుమార్ కృతజ్ఞతాపూర్వకంగా.


    దొడ్లో కాసేపు పచార్లు తిరిగి ఇంట్లోకి వెళ్ళాడు బాబయ్య. అన్యమనస్కంగా ఇంగ్లీషు వారపత్రిక తిరిగేశాడు. రేడియో ఆన్ చేసి ఇంగ్లీషు వార్తలు విన్నాడు. ఒక్కసారి ఆవలించి, రేడియో ఆపి, లేచి వెళ్ళి గదిలో మంచం మీద పడుకున్నాడు. భ్రుకుటి మధ్యాన్ని వేళ్ళతో నలుపుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.


    కాసేపటికి మల్లెపూల మత్తు వాసన గుప్పుమంటూ గది లోకి దండెత్తి వచ్చింది. 


    కళ్ళు తెరిచాడు బాబయ్య. వంట గది సర్దేసి పాల గ్లాసుతో వచ్చింది సుమన. చీర మార్చుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని ఉందామె.


    "పాలు తీసుకో మావయ్యా!" అంది.


    బాబయ్య పాలు తాగి ఖాళీ గ్లాసు స్టూలు మీద పెట్టాడు. ఆమె కళ్ళల్లో సూటిగా చూసి "కూర్చో సుమనా!" అన్నాడు.


    ఆమె మంచం చివర కూర్చుని "ఏం మావయ్య? నిద్ర రావటం లేదా:" అంటూ అతని కాళ్ళందుకుంది ఒత్తటానికి.


    అతను మీదికి వెల్లకిలా వాలి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. 


    మాటలు పెగలటంలేదతనికి. గుండె గొంతులోకి తన్నుకొస్తోంది.


    "సుమనా!"


    "ఏమిటి మావయ్యా?"


    రథం నుంచి దూకేసే ఉత్తర కుమారుడిలా, చెప్పాలకున్నవన్నీ మళ్ళీ గొంతులోకి జారిపోతున్నాయి.


    "నీకు పట్టు చీర కొనాల్సొస్స్తుందనుకో! ఏం రంగంటే ఇష్టం నీకు?"


    "పో మామయ్యా!" అంటూ సిగ్గుతో కిలకిలా నవ్విందామె.


    "చెప్పవే!"


    "కనకాంబరం రంగంటే చాలా ఇష్టం నాకు"


    అతని గుండె దడదడలాడింది. కొంపదీసి, చూసేసిందా ఏమిటీ? "ఒసే సుమనా! నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోరాదుటే!" గబుక్కున అనేశాడు.


    ఆమె కాసేపు మాట్లాడకుండా ఉండిపోయింది. కళ్ళు తెరిచి చూశాడతను. చూపులు కలవలేక తల దించుకుందామె.


    "ఏమిటే పలకవు?"


    "మావయ్యా!"


    "ఆఁ!"


    "నేను మళ్ళీ పెళ్ళి చేసుకుంటే లోకం తప్పు పడుస్తుందంటావా?"


    "ఇందులో తప్పేముంది? తోడూ నీడా లేకుండా మోడుగా ఉండిపోవటం తప్పు కాదేమిటీ?"


    కాళ్ళు ఒత్తుతూ ఉండిపోయింది సూమన. 


    మళ్ళీ ఏం మాట్లాడాలో స్ఫురించలేదతనికి. కళ్ళు మూసుకుని పులకింతలో ఉండిపోయాడు. 


    సుమన పైకి లేచింది. వంగి, అతి సున్నితంగా అతని అరికాలిని ముద్దెట్టుకుని, గది వదిలింది.


    తపస్సు ఫలించినంత సంతోషంతో అతని రొమ్ములు ఎగిసిపడ్డాయి."నిన్ను నిన్నుగా ప్రేమించుటక్కు, నీ కోసమే కన్నీరు నింపుటకు, నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే..." 


    చల్లగా పాడుతోంది ఫాను. సార్వజనీనమూ, సార్వకాలికమూ అయిన నిత్య సత్యాన్ని ఎంత సిద్ధి పొందితే అంత తేటగా చెప్పగలిగాడో మాహకవి?... హాయిగా నిద్రపట్టింది బాబయ్యకు.


    రాత్రి రెండు గంటలకు మెలకువ వచ్చిందతనికి. లేచి లైటు వేశాడు. దాహం వేస్తోంది.


    స్టూలు మీద నీళ్ళు పెట్టలేదు సుమన.


    హాల్లో జీరో వోల్టు బల్బు బెలుగ్తోంది. హాల్లోకి వెళ్ళాడు. లైటు వేశాడు. వంట గదిలోకి వెళ్ళాడు. లైటు వేశాడు. వాటర్ ఫిల్టర్‌లోంచి నీళ్ళు పట్టుకుని తాగాడు.


    సుమన ఏమైంది? ఇంట్లో ఎక్కడా లేదామె. హాల్లో లేదు, ముందర వరండాలో లేదు. వెనక వరండాలోకి వచ్చాడు. అక్కడా లేదు. దొడ్డి వైపు చూసిన బాబయ్య స్తబ్దుడై నిలబడిపోయాడు.


    మసక మసకగా వెన్నెల! పెరటి గుమ్మం దగ్గర నుంచీ రెడ్డి కుమార్ ఇంటి గుమ్మం దాకా వెన్నెల్లో సన్నటి మల్లెల బాట! ఆ పువ్వులన్నిటినీ కుప్ప వేస్తే గంపెడవుతుందేమో!


    ఆ మల్లెల బాట వెంట నడిచి వెళ్ళిందా సుమన? ఎంత హృదయవిదారకమైన ఊహ ఇది! కానీ ఇది జరిగిందంతే! ఆ ఇంటి తలుపు సందులోంచీ, కిటికీ రెక్కల సందుల్లోంచీ సన్నగా కరెంటు వెలుతురు బయటి కొచ్చి పడి ముసి ముసిగా నవ్వుకుంటోంది.సన్నగా నవ్వులూ, గుస గుసలూ, ఊ కొట్టడాలూ వినిపిస్తున్నాయి.


    ఔను! సుమన గొంతే అది! అమలిన భావాంతో తాను పూజించుకుంటున్న ఇలువేలుపు మైలపడిపోయిందా?


    గుండెలో కవిలి ముల్లు దిగినట్లైంది బాబయ్యకు. గిరుక్కున వెనక్కి తిరిగాడు. అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి నడిచాడు. గుండె నిమురుకుంటూ మంచం పైకి తూలాడు. తాను కలనైనా ఊహించని మలుపు ఇది. ఆశాఫలం కోసమే గానీ, ఆశా భంగాన్ని చవిచూడటానికి కాదు గదా తాను వేచి కూచున్నది? తన భాగ్యం భగ్నమైపోయింది. తన స్వర్గం చెదిరిపోయింది. ఆశా భంగానికి తట్టుకోగల పాషాణ హృదయం లేనివాడు పేరాసలకు పోరాదేమో?


    తెల్లవారింది. బాబయ్య ఎంతకూ లేకపోయేసరికి, దగ్గిర కొచ్చి ఒంటి పైన చేసి వేసింది సుమన.


    ఒళ్ళు చుర్రున కాలిపోతోంది. అసలు స్పృహలోనే లేడతను. గాబరా పడింది సుమన. డాక్టరు కోసం కబురు చేద్దామంటే రెడ్డి కుమార్ లేడు. అప్పటికే వెళ్ళిపోయాడు రిక్షా వేసుకుని. తానే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. 


    మూడు రోజులు కంటి మీద కునుకు లేకుండా అతని సేవలోనే గడిపిందామె. బాబయ్యకు జ్వరం పోయింది గానీ, మనిషి బాగా చిక్కిపోయాడు. నీరసించి పోయాడు. ఆ మూడు రోజులూ అతను ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మూడోనాటి ఉదయం "సాయంకాలం రిక్షా తీసుకురావోయ్! కాస్త పనుంది" అన్నాడు రెడ్డి కుమార్‌తో.


    సాయంకాలం రిక్షా ఎక్కి కూర్చున్న బాబయ్యతో "ఎక్కడి కెళ్ళాలండీ?" అన్నాడు రెడ్డి కుమార్.


    "అలా ఊరి బయటకు పోనివ్వు!"


    ఊరి బయట ఓ రాతి బండ మీద కూర్చున్నారిద్దరూ.


    "ఒరే! ఎన్నాళ్ళుగా సాగుతోంది మీ వ్యవహారం!" అని అడిగాడు బాబాయ్య. అతని ముఖంలో అసూయ. అవమానపు ముసురు.


    "ఏ వ్యవహారమండీ?" 


    "నాకేం తెలీదనుకోకు. సుమన గురించి నేనడిగేది!"


    తలొంచుకున్నాడు రెడ్డి కుమార్. "ఆమెను ప్రేమిస్తున్నాను బాబుగారూ! పెళ్ళికూడా చేసుకోవాలనుకుంటున్నాను."


    "ప్రేమ సరేనోయ్! రాత్రిళ్ళు మీరు కలుసుకోవడం ఎప్పటి నుంచి?"


    "అబ్బే! ఎక్కడండీ? ఆ ఒక్క రోజే!"


    వాడి పైన రెండు బాంబులు పేల్చాలన్నంత కసిగా ఉంది బాబయ్యకు. "పెళ్ళి చేసుకుంటావా? ఆవిడకిదివరకే పెళ్ళయింది తెలుసా? మొగుడింకా బతికే ఉన్నాడు."


    "ఉంటే ఉండనివ్వండి! వాళ్ళకెప్పుడో తెగతెంపులైపోయిందటగా?"


    "అదన్నమాట నీ ధీమా? అయితే ఇంకో సంగతి విను..." అంటూ మరో పెద్ద బాంబు తీశాడు బాబయ్య. 


    "ఏమిటో చెప్పండి"


    "ఆవిడకి... ఆవిడకి... లెప్రసీ ఉంది తెలుసా?"


    రెడ్డి కుమార్ అదరలేదు. బెదరలేదు. "ఇప్పుడు లేదుగా? ఎప్పుడో ఉండేదేమో? ప్రారంభ దశలోనే నయం చేసుకుంది కదా? అసలిదంతా నేను పట్టించుకోవటం లేదండి బాబుగారూ! చెప్పాలంటే మా అమ్మకు కూడా ఈ జబ్బే! అలాగని నేనామెను వదిలేయలేదు కదా? కొడుకంటే అలా ఉండాలి అని మా ఊళ్ళో అందరూ అసూయపడే విధంగా ఆమె కట్టె కడతేరిపోయింది. మనసులు కలిశాక నరకమైనా స్వర్గమే బాబూ! నాకూ నా వాళ్ళు లేరు, ఆమెకూ తనవాళ్ళు లేరు. మేమెవరికీ సమస్య కావటం లేదు కదా?"


    నిరుత్తరుడైపోయాడు బాబయ్య. ఇంటికి తిరిగి వెళ్ళేసరికి చీకటి పడింది. 


    తాజాగా మరో బాంబు ఊపిరి పోసుకుని పేలటానికి సిద్ధంగా ఉందని ఆ ఇద్దరికీ తెలీయదు.


    గేటు బయటే నిలబడి ఉన్నాడు వాసు - సుమన అన్న! వాడితో బాటు దగ్గుతూ, ఆయాసపడుతూ రోగపీడితుడిలా ఉన్న మరో వ్యక్తి!


    బాబయ్య రిక్షా దిగుతుండగా - "రా మామయ్యా! నీకోసమే ఎదురు చూస్తున్నాం!" అన్నాడు వాసు.


    "ఏమిటీ?"


    "లోపలికి పోదాం పద! అది మాతో మాట్లాడకుండా తలుపేసుకుంది"


    రెడ్డి కుమార్ దొడ్డి వైపు నడిచాడు.


    "ఈయన మా బావ - కొండ్రాయుడు!" అంటూ మూడో వ్యక్తిని పరిచయం చేశాడు వాసు.


    ముగ్గురూ హాల్లో సమావేశమయ్యారు.


    వాళ్ళ మాటలకు చెవులప్పగించి వంటగదిలోనే ఉండిపోయింది సూమన.


    అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కొండ్రాయుడి ఊరు. సుమనతో అతని వివాహ బంధం తెగిపోయిన తరువాత వెంటనే మరో పెళ్ళి చేసుకున్నాడతను. ఆ రెండో భార్య ఈ ఏడేళ్ళలో ముగ్గురు పిల్లల్ని కన్నది. నాలుగో కాన్పులో తల్లీ, పిల్లా ఇద్దరూ పోయారు. చాలినంత ఆస్తిపాస్తులున్నా ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందిప్పుడు. నయంకాని దగ్గూ, ఉబ్బసం పట్టుకుని, నలభై ఏళ్ళ కొండ్రాయుడు అరవై ఏళ్ళ వగ్గు కట్టెలా తయారయ్యాడు. సంసారం చక్కబెట్టుకోటానికీ, పసిబిడ్డల ఆలనా పాలనా చూసుకోటానికీ ఇంట్లో ఆడదిక్కు లేదు. గతమంతా మరిచిపోయి పెద్ద మనసుతో ఇప్పుడు సుమన ఇంటికి రావాలి. ఇదీ పరిస్థితి!


    "సుమనా! వింటున్నావా? ఇలా రారాదూ?" అని కేకేశాడు బాబయ్య. 


    "నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? చచ్చినా వెళ్ళను. నన్ను బలవంత పెట్టే హక్కు, శాసించే అధికారం ఎవరికీ లేదు. అందాకా వస్తే ఉరేసుకోవటమో, బావిలో దూకటమో చేతకాదా ఏమిటీ?" అంటూ వంట గదిలోంచే తెగేసి చెప్పేసింది సుమన. 


    ఆమె ఎంతకూ సుముఖత చూపకపోవటంతో అరికాలి మంట నెత్తికెక్కింది వాసుకు. పటపటా పండ్లు గీటుతూ - "నీ ఇంటికెళ్ళి లక్షణంగా కాపురం చేసుకోవే అంటే, ఇక్కడ అడుక్కు తింటా నంటావా? నీ పొగరణచడం నాకు తెలుసు! నువ్వు రా బావా! ఎలా రాదో చూస్తాను. సరిగ్గా వారం రోజుల్లోపల దీని కాళ్ళూ, చేతులూ కట్టి తెచ్చి నీ ఇంట్లో పడేసే పూచీ నాది!" అన్నాడు.


    ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు.


    అన్నంత పనీ చేయగల సమర్థుడు వాసు. ఇంత పెద్ద ఊళ్ళో వాడి కెదురే లేదు. రెండుసార్లు జైలు క్కూడా వెళ్ళొచ్చాడు - ఖూనీ కేసులో ఓసారి, దొమ్మీ కేసులో ఓసారి. సారా దుకాణాలూ, బ్రాందీ షాపులూ, క్లబ్బులూ, హోటళ్ళూ వాడికి మామూళ్ళిస్తుంటాయి. వాడి అఘాయిత్యాన్ని వారించే సాహసం పురజనులకు కాదు కదా పోలీసులకు కూడా లేదు. 


    కదలకుండా కూర్చుండి పోయాడు బాబయ్య. 


    కాస్సేపటికి హాల్లోకి వచ్చింది సుమన. గోడ కానుకుని ఒకటి రెండు క్షణాలు నిశ్శబ్దంగా నుంచుంది. "నీకిది న్యాయంగా వుందా మావయ్యా?" అంది.


    "అక్కడ నేనా మనిషితో సంసారం చేసింది ఒక్క సంవత్సరం మాత్రమే! ఆ మూణ్ణాళ్ళ ముచ్చటకే ఎన్ని నరక యాతనలు! ఒంటి మీద ఒకటి రెండు మచ్చలు పుట్టుకొచ్చినందుకే నా బతుకు బుగ్గిపాలు చేశాడు ఆ మగధీరుడు! ఏడ్చాను. కాళ్ళు పట్టుకున్నాను. కనికరించాడా? కాగితాల మీద సంతకం పెట్టమటూ ఇనుప చువ్వల్ని కాల్చి ఎలా వాతలు పెట్టాడో చూడు..." అంటూ చాటు కోసం కొంగు ముంపంట కరచిపట్టుకుని జాకెట్టు విప్పి గోడవైపుకు తిరిగింది వీపు కనిపించేలా.


    బాబయ్య గుండె గుభేలు మంది. ఆమె వీపు మీద అడ్డద్డ్డంగా వాతలు తీసినట్లున్న నాలుగైదు పొడగాటి గుర్తులు నల్లగా! అతను లేచి దగ్గరకు వెళ్ళాడు. వణుకుతున్న చేత్తో ఆమె వీపు మీద గుర్తుల్ని తడుముతూ నుంచున్నాడు.


    ఆమె అలాగే నుంచుని చెప్పుకుపోతోంది. "ఆడదాన్ని, అబలని! సంతకాలు పెట్టక చేసేదేముంది? పెట్టేశాను. అంతటితో ఊరుకున్నాడా? పుస్తెలు తెంపుకుని ఇంట్లోంచి గెంటేశాడు. దిక్కులేని దాన్నయ్యాను. జాలి చూపిన వాళ్ళెవరు? చేరదీసిన వాళ్ళెవరు? ఎన్ని బాధలు పడ్డానో, రోగమెలా నయం చేసుకున్నానో ఎవరి కెరుక? మా అమ్మే లేకపోతే నేనేమై పోయేదాన్నో?" 


    తుఫానులో కొట్టుకుపోతున్న మనిషి చెట్టును గట్టిగా పట్టుకున్నట్లు ఆఎం బాబయ్యను వాటేసుకుని భోరున ఏడ్చింది.


    తల్లి పోయిన తరువాత ఆమె ఏడవటం ఇప్పుడే చూస్తున్నాడతను. 


    దిక్సూచి లేకుండా నడి సముద్రంలో, ముసురులో నిలబడిపోయిన నావలా ఉంది ఆ ఇల్లు. తీరం ఎటువైపు ఉందో, ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితి!


    మరునాటి మధ్యాహ్నం రెడ్డి కుమార్ చావు దెబ్బలు తిన్న తరువాత, బాబయ్య గుండె మారుమూలల్లోని ఈర్ష్యా ద్వేషాలు కొంత ఉపశమించాయి. 


    ఇద్దరు మనుషులు రెడ్డి కుమార్‌ను చెరొకవైపు పట్టుకుని మెల్లగా నడిపించుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టి వెళ్ళిపోయారు. రిక్షా లేదు. అతని ఒళ్ళంతా హూనమైపోయి ఉంది. 


    సుమన మౌనంగా ఏడుస్తూ అతనికి కాపడం పెట్టే సన్నాహంలో పడిపోయింది.


    బాబయ్య వెళ్ళి "ఏమైందిరా?" అన్నాడు.


    "వాసూ దగ్గరి కెళ్ళాను..."


    "వెళ్ళి?"


    "సుమన నిచ్చి పెళ్ళి చేయమని అడిగాను..."


    "చేశాడన్నమాట పెళ్ళి! రిక్షా ఏదీ?" 


    "తుక్కు తుక్కయిపోయింది. పనికి రాదింక!"


    "ఇంతకీ ఏమన్నాడు వాడు?"


    "... ఊళ్ళో నా ముఖం కనిపించ కూడదన్నాడండీ!"


    "ఇప్పుడేం చేస్తావ్?"


    "... అదే ఆలోచిస్తున్నా"


    ఆ రాత్రి భోజనాల దగ్గర "శ్రుతి మించి రాగాన పడుతోందన్నమాట" అంటూ చిన్నగా బుసకొట్టాడు బాబయ్య.


    కిమ్మన లేదు సుమన.


    "పెళ్ళీ పెళ్ళీ అంటూ పిచ్చెక్కి పోతున్నాడేమిటే వాడు?"


    ఆమె మాట్లాడలేదు. 


    అతనికి కోపంగా ఉంది. "పోయి పోయి ఇలాంటివాణ్ణి తగులుకున్నావేమిటే? వీడి కంటే తగిన వాడింకెవడూ దొరకలేదా నీకు?"


    'తగులు కోవటం' అన్న మాటకు ఆమె కాస్త నొచ్చుకుంది. అయినా నల్లబడ్డ తన ముఖాన్ని చిరునవ్వుతో వెలిగించుకుంటూ - "ఇంతకంటే తగినవాడింకెవడు దొరుకుతాడు మామయ్యా? ఉంటే చెప్పు, తప్పకుండా చేసుకుంటాను. నా గురించి ఆలోచించేవాడివి నువ్వొక్కడివే కదా? నీ మాటే వింటాను" అంది నిబ్బరంగా.


    మారు మాట్లాడకుండా భోజనం ముగించి చేయి కడుక్కున్నాడతను. "వాడి తిండి తిప్పలేమైనా చూశావా లేదా" అంటూ పైకి లేచాడు.


    అతడి కళ్ళల్లోకి కృతజ్ఞతా సూచకంగా చూసిందామె. "తీసుకెళ్తాను" అంది డగుత్తికతో.


    ఆ రాత్రంతా ఆలోచించాడు బాబయ్య. ఇంతకంటే తగినవాడెవడున్నాడు? ఎవడున్నాడెవడున్నాడు? ఎవడున్నాడెవడున్నాడెవడున్నాడు? అన్ని కోణాల్లోకీ వెళ్ళి వెతికాడు. అతనిలోని అనంగుడు సిగ్గుపడి అంతరాత్మ ముందు తల వంచుకున్నాడు.


    రెడ్డి కుమార్ కోలుకోవటానికి రెండు రోజులు పట్టింది.


    ఆ రాత్రి తన పాలిటి కాళరాత్రి. తెల్లవారితే ఉరితీతకు సిద్ధం కమ్మని చెప్పటాని కొచ్చిన జైలు వార్డెన్‌లా ముందుకొచ్చి చేతులు కట్టుకుని నుంచున్నాడు రెడ్డి కుమార్.


    "మూడు గంటల రైలుకు మేం వెళ్ళిపోతున్నాం బాబుగారూ!"


    బాబాయ నెత్తిన పిడుగు పడ్డట్లయింది. "ఎక్కడికి?"


    "ఎక్కడికో మాకే తెలియదు. ఏ ఊరో వెళ్ళిపోయి ఏ గుళ్ళోనో పెళ్ళి చేసుకుంటాం. ఎక్కడో ఓ చోట తల దాచుకుని మా బతుకు సాగించుకుంటాం"


    హృదయవేదనను మోయలేక గుండె దడ మొదలైందతనికి.


    "ఔనా సుమనా?" అంటూ ఆమెవైపు చూశాడు పరితాపంతో. 


    పలుకు కాదది. బలిపీఠంపైన ముసలి గొడ్లు అరాచిన అరుపు! తనిన్ వదిలిపెట్టి తల్లి పాలిండ్లు ముడేసుకుని ఎవడితోనో లేచిపోతుంటే చంటిపాప పిలిచే జాలి పిలుపు!


    ఔనా నా ప్రాణమా? ఔనా నా దీపమా? ఔనా నా అపురూప నేస్తమా?


    సుమన వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగింది.


    ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. "మనం ఇలా విడిపోతామని ఏనాడూ అనుకోలేదు మావయ్యా నేను! ఇక్కడే ఉండిపోతా ననుకున్నాను. ఇక్కడే చనిపోతా ననుకున్నాను. ఇలాంటి పరిస్థితులొస్తాయని ఎవరికి తెలుసు? నేను లేకుండా నువ్వెలా ఉండగలఓ తలచుకుంటే గుండె చెరువైపోతోంది మావయ్యా!" అంటూ ముక్కు చీదుకుంటూ కుక్కలా అతని కాళ్ళ దగ్గరే పడి ఉందామె.


    మూడు గంటలకు రైలు.


    అరగంట ముందే బయలు దేరారు వాళ్ళిద్దరూ.


    సూట్‌కేస్ రెడ్డి కుమార్‌కు అందించి - "వెళ్ళొస్తాం మావయ్యా!" అంటూ అతని కాళ్ళను చుట్టేసింది సుమన.


    ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయాడు బాబయ్య.


    వాళ్ళు వెళ్ళిన కాస్సేపటికి అతనిలో చలనం వచ్చింది. కర్తవ్యం గుర్తుకొచ్చింది. గబగబా బీరువా దగ్గరికెళ్ళాడు. పట్టుచీర చేతికి తీసుకున్నాడు. వీళ్ళిలా హఠాత్తుగా వెళ్ళిపోతారని ముందే తెలిసి ఉంటే బాంకు నుంచి డబ్బు తెచ్చి ఉండొచ్చు. బీరువా అంతా గాలిస్తే వెయ్యి రూపాయలు దొరికాయి. 


    ఇంటికి తాళం వేసి సుడిగాలిలా రైల్వే స్టేషన్‌కు నడిచాడు బాబయ్య. పొడుగ్గా ఉన్న ప్లాట్‌ఫారం పై రెండు రైళ్ళు నిలిచ్ ఉన్నాయి చెరో చివరా! 


    దక్షిణాది వెళ్ళే రైలు దగ్గరకు చేరుకుని ప్రతి బోగీలోకి తొంగి చూశాడు. వాళ్ళు లేరు. ఉత్తరాది వెళ్ళే రైలు దగ్గరికి పరుగు తీశాడు. పోర్టరు గంట కొడుతున్నాడు. వగరుస్తూ రైలు దగ్గరి కొచ్చేశాడు బాబయ్య.  


    "మావయ్యా!" అంటూ కేకేసింది సుమన ఓ బోగీ లోంచి.


    అతను ఆ బోగీ దగ్గరికి చేరుకునే సరికి వాళ్ళిద్దరూ లేచి ప్రవేశ ద్వారం దగ్గర నుంచున్నారు. ఫుట్ బోర్డు ఎక్కి లోపలికి వెళ్ళాడు బాబయ్య. 


    అతను స్టేషన్ కొచ్చినందుకు సుమన ముఖం సంతోషంతో వెలిగిపోతోంది.


    "సుమనా! ఇందా ఇది తీసుకో!" అంటూ వగరుస్తూ పట్టు చీర ఆమె చేత పెట్టాడు. డబ్బిచ్చాడు.


    "డబ్బులున్నాయిలే మావయ్యా!"


    "ఉండనీ ఇది కూడా!" అంటూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నుదురు ముద్దాడాడు.


    "అప్పుడప్పుడూ ఉత్తరాలు రాస్తుండు. ఎందుకైనా మంచిది ఉత్తరాలు రిజిస్టర్ చేస్తుండు."


    ఆమె చెంపలు కన్నీటితో తడిసిపోతున్నాయి.


    "నాయనా రెడ్డి కుమార్! అవసరానికి ఆదుకునేవాణ్ణి నేనొకణ్ణి ఉన్నానని మరిచిపోకు. ముందే చెపుతున్నా నొరేయ్! నీ మూలంగా నా సుమనకేదైనా కష్టం కలిగితే నేను దుర్మార్గుణ్ణయిపోతాను జాగ్రత్త!"


    అతను ఈ మాట అంటూ ఉంటే సుమనకు వెక్కిళ్ళు పుట్టుకొచ్చాయి.


    రైలు కూత వేసింది. కిందికి దిగాడు బాబయ్య. రైలు కదిలింది. ఆమె పెట్టెలోంచి బయటికి తొంగి చూస్తూ ఉంటే దూరం వాళ్ళిద్దరి మధ్య చీకటి తెరల్ని దించేసింది.


    ప్లాట్‌ఫారం నిర్మానుష్యమైపోయింది. నలిగిన గుండెతో నిస్సత్తువగా ఓ సిమెంటు బెంచీ మీద కూర్చుండిపోయాడతను. ఆమెను గురించిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నంతలోనే తూరుపు ఎరుపెక్కసాగింది.


    లేచి ఇంటికి నడిచాడు. తాళం తీసి లోపలికి వెళ్ళిన మరు నిముషం ఇంటి ముందు ఓ టాక్సీ వచ్చి ఆగింది. అందులోంచి వాసు దిగాడు మరో ఇద్దరు కిరాయి మనుషులతో. 


    "మామయ్యా! సుమనని తీసుకుపోవటాని కొచ్చాను. ఎక్కడుందది?" అంటూ హడావుడిగా లోపలి కొచ్చాడు.


    "ఇంకా ఎక్కడుందిరా సుమన? వచ్చేవాడివి ఓ మూడు గంటలు ముందుగా రాలేకపోయావా? వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు."


    "వెళ్ళిపోయారా? ఎక్కడి కెళ్ళారో తెలుసా?" అంటూ పులిలా గాండ్రించాడు వాసు. 


    "మద్రాసు వెళ్ళే రైలెక్కారు" చిన్న అబద్ధంతో సుమనకు మహోపకారం చేశాడతను. 


    మరుక్షణం టాక్సీ ధుమధుమలాడుతూ మద్రాసు రోడ్డు వైపు పరుగు తీసింది.


    లంకంత ఇల్లు ఇన్శ్శబ్దంగా ఉంది. భయంకరమైన ఒంటరి తనమే మిగిలింది బాబయ్యకు. 


    "చెలిమియె కరువై, వలపే అరుదై... చెదిరిన హృదయమె శిలయైపోగా, నీ వ్యథ తెలిసీ నీడగ నిలిచే తోడొకరుండిన ..." 


    ఎవరు? ఎవరున్నారు తోడు? కొడుకున్నాడు తనకు తోడు - హర్యానాలో! కూతురుంది తనకు తోడు - అలబామాలో! ప్రాణ సఖి ఉంది తనకు తోడు పరలోకంలో!


    బీరువా అంతా గాలించాడు బాబయ్య. తనకు కావలసింది కనిపించలేదందులో! రెండు సూట్‌కేసుల్లోనూ వెతికాడు లేదు! ఆఖరికి పెద్ద ట్రంకు పెట్టె అడుగున కనిపించిందది - ఫోటో ఆల్బమ్!


    ఆల్బమ్ తిరిగేస్తూ వాలు కుర్చీలో కూర్చున్నాడు. పెళ్ళి ముస్తాబుతో తనొక్కతే ఉన్న భార్య ఫోటోలకి రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. 


    మనసు కోరుకునే మందహాసంలా, మల్లెపూల జల్లులా, వెన్నెల తుళ్ళింతలా, జలపాతపు తుంపరలా - ప్రశాంత సుందరంగా, సమ్మోహనకరంగా ఉందామె.


    ఆ రోజు - పన్నెండేళ్ళ సుమనతో తలకోనకు వెళ్ళి తిరిగి వచ్చిన రోజు ఆ దంపతుల మధ్య జరిగిన సంభాషణ, కొంటెగా గింగురు మంటోంది అతని చెవిలో.


    "అది చిన్న పిల్ల కాబట్టి నుదురు ముద్దెట్టుకున్నారు. ఇంకో నాలుగేళ్ళు పోతే..."


    "ఊఁ ఆగావేం? చెప్పు!"


    "...పెదాలు ముద్దెట్టుకుంటారు"


    "చిన్న పిల్లను ముద్దెట్టుకున్నదుకే ఇంత అసూయా? నా పెళ్ళాం పెదాలు ఇంత తియ్యగా ఉంటే, ఇక వేరే పెదాలెందుకు నాకు?"


    ఆ ఫోటోలోని భార్య పెదాల్ని గట్టిగా ముద్దెట్టుకుని, వాలు కూర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు బాబయ్య. 


    మాటల కందని హృదయావేదనకు ప్రతిరూపంగా అతని కనుకొనల్లో నుంచి రెండు కన్నీటి బొట్లు జారాయి.


(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 15-8-1990 సంచికలో ప్రచురితం)  

Comments