తొలిమజిలీ - ఆదివిష్ణు

        ఇప్పుడు నా వ్యక్తిత్వమ్మీద నాకు నమ్మకం ఏర్పడింది!

ఈనాడు నేను ఉద్యోగిని. అందరూ నన్నిప్పుడు గౌరవిస్తారు. నాకో స్థాన మిస్తారు. నన్ను చూచి అమ్మ గర్విస్తుంది. తమ్ముడి చదువు నిర్విఘ్నంగా సాగగలదు.

ఈ రెండేళ్లనుంచీ నన్ను వెంబడించిన సమస్యకు స్వస్తి పలికాను. ఈ శుభసమయం కోసమే రెండేళ్లనుంచి ఆశతో ఎదురుచూచాను. నాతోపాటు అమ్మా, తమ్ముడూ కూడా నిరీక్షించారు యీ ఘట్టంకోసం.

మాకు భయం దూరమయ్యింది. అందరిలోనూ అవుననిపించుకుంటాము.

నా చదువూ, నేనూ - మన్ననల నందుకుంటాం. ఇంతకంటె నాలాటి మనిషి కోరుకునే దేమున్నది గనుక?

నేను వస్తుంటే అమ్మ అన్నది - బరువు దించుకున్నారా శంకరం! మీనాన్న కిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఈ యింటికి రెండు కళ్లులా నువ్వూ, తమ్ముడూ పెరిగారు. తమ్ముడి భవిష్యత్తు, యికనుంచి నీమీదనూ ఆధారపడి ఉంటుంది. మరిచిపోబోకు.

ఆ మాటలు వింటూ గర్వించాను. నా శక్తిమీద అమ్మకి గురి ఏర్పడినందుకు ఆనందించాను.

ఆమె నన్ను ఆశీర్వదించి సాగనంపింది - కొత్త చోటుకి, సరికొత్త జీవితానికి.

బి. కాం పాసయ్యి రెండేళ్లపాటు యింటిపట్టున గోళ్లు గిల్లుకుంటూ గడిపాను. ఉద్యోగంకోసం నా శాయశక్తులా ప్రయత్నించాను. ఏరోజుకారోజు ఎదురుచూచాను. రోజులు గడుస్తున్నకొద్దీ భయంగా ఉండేది. దీనికి తగ్గట్టు సూదుల్లాటి మాట లొకటి - నా ప్రాణాన్ని కొరుక్కుతినేవి.

ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ గనక నాకు ధైర్యం చెప్పకపోతే, నే నేనాడో పిచ్చివాణ్ణయి రోడ్లవెంట తిరిగేవాణ్ణి. అనుక్షణం నన్ను కంటికి రెప్పలా చూచింది. దిగు లెందుకురా శంకరం! కాస్త ఆలస్యమైతే కావచ్చును కాని - డిగ్రీ చేతిలో పెట్టుకున్న నీకు ఉద్యోగం దొరక్కమానదు.అని నన్ను వూరడించేది. నిజంగా అమ్మ దేవత.

నాకు రెక్క లిచ్చావు. నా కర్తవ్యం నాకు తెలుసు - అయినా అవకాశంలేక ఏం చేతకానివాడిలా తయారయ్యాను. రోజురోజుకి అసహనం పెరిగిపోతోంది. చివరికి నే నేమవుతానో నాకు తెలీకుండా ఉందిఅని నే నంటూంటే ఆమె చిన్నగా మందలించేది. నాలాటివాళ్లు యింకా చాలామంది ఉన్నారని, వాళ్లందరు నాలా పిచ్చిగా తయారవడంలేదని హెచ్చరించేది. నిజంగా అమ్మ ధైర్యాన్ని అభినందించవలసిందే.

నా అదృష్టవశాత్తూ యీనాటికి కాకినాడలో ఉద్యోగం దొరికింది!- ఇప్పు డనిపిస్తున్నది - అమ్మ నన్ను వూరడించకపోతే, ఆశ కర్పకపోతే - ఈ ఉద్యోగం కళ్లారా చూచే భాగ్యం కరువయ్యేదనీ, ఏదో అఘాయిత్యాన్ని తలపెట్టేవాడిననీను.

ఉద్యోగంలేనినాడు నన్ను యీసడింపుగా చూచిన మనుషులు చాలామంది, నాకు ఉద్యోగం దొరికిందన్న మరుక్షణాన్నే అభినందించారు. వాళ్లందరిలోనూ మావయ్య ముఖ్యుడు.

నాన్న బ్రతికున్నరోజుల్లో, ఆయనా, మావయ్య యిద్దరూ కలిసి మెలిసే ఉండేవారు. వారిమధ్య చుట్టరికమే కాకుండా మంచి స్నేహం ఉండేది. ముఖ్యంగా వాళ్లు యీ స్నేహాన్నే ప్రదర్శించేవాళ్లు.

రాధ మావయ్యకూతురు. మా చిన్నతనంలోనే అనుకున్నారు రాధ నాకోసమే పుట్టిన నా భార్యఅని. నేను చదువుకుంటూన్న రోజుల్లో గూడా - వీలు దొరికినప్పుడల్లా మా యిద్దర్ని అదే వరుసలో పిలుస్తూ ఆనందిస్తూండేవాళ్లు.

శంకరం వట్టి అమాయకుడోయ్ బావా! రాధ వాడికి పెళ్లాంగా, వాడ్నేమి చక్కబరుస్తుందో ఏమోగాని - మా అమ్మకున్న తెలివి, మీ వాడిలో కాగడాపెట్టి వెతికినా కనిపించదేమోయ్ మరీను.అని మావయ్య అంటూంటే నాన్న పకాలున నవ్వి అనేవారు నిజం సుమా!అని.

అలాంటిది నా యసల్సీ రోజుల్లో నాన్న పోయిన తర్వాత ఆ మాట కాస్తా మరిచిపోవటానికి ప్రయత్నించాడు మావయ్య. నాతో చనువుగా తిరుగుతూన్న రాధను గదమాయించడం గూడా నేర్చుకున్నాడు.

దీనిక్కొంత కారణం- నాన్న పోయినతర్వాత మా కుటుంబం ఆర్థికంగా కాస్త వెనకబడటమేను.

తాను చేస్తూన్న గుమాస్తా గిరికి పెద్ద ఫాయిదాలోనే సంసారాన్ని ఉంచారు నాన్న. ఆయనకు ప్రతి చిన్న పనినీ హంగామాగానూ, హడావిడిగానూ చెయ్యడం ఒక అలవాటు. ఒక్కోసారి స్థితికి మించిన పనులు ఆలోచించకుండానే చేస్తూండేవారు. దీనికి చక్కటి నిదర్శనం - అక్కయ్య పెళ్లి. ఆ పెళ్లి యింకా నా కళ్లకు కట్టినట్టుంటుంది.

అప్పట్లో శేఖరంబావ బి.ఇ. చదువుతూండేవాడు. అతను నాన్న కంటికి రత్నంగా కనుపించాడు. ఈ సమ్మంధంతో నువ్వు తూగలేవని ఎవరెన్ని చెప్పినా ఆయన వినలేదు. అతనికి అక్కయ్యనిచ్చి పెళ్లిచేసి తనమాట నిలబెట్టుకున్నారు. అతని చివరి రెండేళ్ల చదువూ నాన్నే చెప్పించారు. దీంతో మా ఆర్థికస్థితి కాస్త కుంటుపడింది. ఆ తర్వాత నాన్న పోవడం, మిగిలున్న కాస్త ఆస్తితోపాటు అమ్మ నగలుకూడా అమ్మి నన్ను చదివించడం మొదలైనవన్నీ జరిగాయి.

మా కుటుంబపరిస్థితులు ఎప్పటికప్పుడు వెయ్యి కళ్లతో కనిపెడ్తూన్న మావయ్య జాగ్రత్త తీసుకున్నాడు.

కాలేజీ చదువుకోసం బందరు వెళ్లాను. అసలు నాకు పై చదువులు చదవా లనిపించలేదు. యసల్సీతో ఆపి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసుకుందామనే నా సంకల్పానికి అమ్మ అడ్డుపడింది. నాన్న ఆత్మశాంతికోసమైనా నన్ను చదవమని బలవంతపెట్టింది. చదవక తప్పిందికాదు.

ఈ మధ్యకాలంలో అమ్మ రెండు మూడుసారులు రాధ పెళ్లి గురించి అడిగిందిట. మావయ్య ఆమెకేమీ జవాబు చెప్పలేదుట. నే నప్పుడే అనుకున్నాను - మావయ్యని యిది చెయ్యి, అది చెయ్యి అని శాసించి చెప్పటానికీ, తన స్నేహంతో ఆయన్ను తనవైపు తిప్పుకోటానికీ నాన్న లేనప్పుడు, నాకు రాధతో పెళ్లి జరగడం కల్ల అని. అది నిజమయ్యింది.

ఫైనలియరు పరీక్షలు రాసి యింటికొచ్చాను. ముహూర్తం పెట్టించమని అమ్మ మావయ్యని అడిగింది. వాడు పరీక్ష పాసవ్వనీ చూద్దాంలే అన్నాడు. రిజల్ట్స్ తెలిశాయి. పాసయ్యాను. అమ్మ నా పెళ్లి విషయం మళ్లీ అడిగింది. ఉద్యోగం గూడా రానివ్వమన్నాడు. సంవత్సరం గడిచింది. ఉద్యోగం లేదు. కాళ్లరిగేలా తిరిగాను. ఎందర్నో ఆశ్రయించాను. లాభం లేకపోయింది.

చివరికి తప్పదన్నట్టు, అభిమానం చంపుకుని అక్కయ్య వాళ్లింటిగ్గూడా వెళ్లాను. బావగారు పేరూ ప్రతిష్టలున్న ఇంజనీరు. ఆయన నాకో ఉద్యోగం చూచిపెట్టలేరా అని నా ఆశ.

కాని శేఖరం నాన్న ఉన్న రోజుల్లో నాటి మనిషికాడు. పూర్తిగా మారిపోయాడు. అధికారం, అంతస్థూ పెరిగింది. వాటికి లోకువైపోయాడు. అతని కంటికి నలుసులా కనిపించాను. ఆ యింటో రెండురోజు లుండలేకపోయాను. అక్కయ్యతో అతనన్న మాటలు నా కిప్పటికీ గుర్తే!-

ఇంకెన్నా ళ్లుంటాట్ట మీ తమ్ముడూ? అయినా యిక్కడ ఉద్యోగాలు జేబుల్లో పెట్టుకు కూర్చున్నామా ఏవిటి? నాకు మరోళ్లని నోరు విప్పుకుని అడగటం చాతకాదు. ఈనాడు నేను ఎదుటివాళ్లని ఆశ్రయిస్తే - వాళ్లు రేపు నా ప్రాణమ్మీద కూర్చుని, నాకు యిష్టం లేకపోయినా, నాచాత పనులు చేయించుకుంటారు. ఇదిమాత్రం నావల్ల కాదు.

ఈ మాటలు వింటూనే నా మనస్సు చివుక్కుమన్నది. అతను చాలా మారిపోయాడు. ఇంతవాడిగా తయారవ్వటానికి కొంత కారణం నాన్న అన్న కృతజ్ఞత సైతం మరిచిపోయాడు.

ఆ తెల్లవారుఝామునే ఆ యింటినుంచి వచ్చేశాను. ఏం జరిగిందని అమ్మ అడిగింది. దాచకుండా అంతా చెప్పాను. ఆమె నిట్టూర్చింది.

అంతే -

మళ్లీ నా పెళ్లి విషయం ప్రస్తావించలేదు అమ్మ. ఆ తర్వాతనే రాధపెళ్లి రాజారావుతో జరిగిపోయింది! - అతను రాజమండ్రిలో కలపవ్యాపారం చేస్తుంటాడు. లక్షలు సంపాయించాడని వినికిడి.

ఆ పెళ్లి చాలా ఆడంబరంగా జరిగింది. ఎవరో కొందరు మావయ్య నడిగారు ఇలా చేసావేమిటీఅని.

మరింకెలా చెయ్యమంటారూ? నా కూతుర్ని తాడూ బొంగరం లేనివాడికిచ్చి, అది అవస్థ పడ్తూంటే కళ్ల నీళ్లు పెట్టుకుని చూస్తూ ఉండమని సలహా చెప్పటానికి వచ్చారుటయ్యాఅని మావయ్య వాళ్లకి జవాబు చెప్పాడు.

నాకూ తాడూ బొంగరం లేదు, నే నెందుకూ పనికిరాని చవటని - నే చేస్తూన్న ఉద్యోగ ప్రయత్నాల్లో అప్పుడప్పుడూ యీ భావన కలుగుతూండేది. అప్పుడు భయం పుట్టుకొచ్చేది.

ముందు నా గతేమిటి? జీవితాంతం నేనిలా ఉద్యోగం లేకుండా తిని తిరగడమేనా?-

సరిగ్గా యిలాంటి పరిస్థితుల్లో అమ్మనుంచి నాకు ఉపశమనం కలుగుతూండేది. నా పిచ్చి ఆలోచనలను ఆమె దూరం చేసేది. ధైర్యం చెప్తూండేది.

మొన్న మొన్నటివరకూ మావయ్య సరిగ్గా మా యింటి కొస్తుండేవాడు కాదు. నాకు ఉద్యోగం దొరికిందన్న వార్త విని - ఎందుకోమరి ఆయన గూడా సంతోషించాడు. స్టేషన్ వరకూ వచ్చి నన్ను రైలెక్కించాడు.

నేను వస్తూన్నప్పుడు ఆమ్మతోపాటు, ఆయనకూ కళ్లల్లో నీళ్లు తిరిగడం లీలగా గమనించాను. ఎంతైనా - అనుబంధాల్ని తెంచుకోడం కష్టమంటారు, యిదే కాబోలు.

రాధని పెళ్లిచేసుకోలేకపోయానని నాకై నే నెప్పుడూ బాధపడలేదు. పైగా నాలాటి నిర్భాగ్యుడ్ని పెళ్ళిచేసుకుని ఆమెమాత్రం సుఖపడే దేమున్నది? రాధ అదృష్టం కొద్దీ లక్షాధికారుల యింటో స్థానం చేసుకుంది. అంతేచాలు.

- సిగరెట్టు ముట్టించాను.

కాకినాడ వెళ్లే రైలు మరో గంటగ్గాని ప్లాటుఫారమ్మీదికి రాదుట.

ఒక రైలు దిగాను - మరో రైలుకోసం ఎదురు చూస్తున్నాను. కాలేజి దాటాను -

జీవితంలోకి ప్రవేశించబోతున్నాను.

ఏమిటీ కవిత్వం?

నవ్వు పుట్టుకొచ్చింది. అంతలోనే మూర్తి గుర్తుకొచ్చాడు. కవిత్వమన్నా, కథలన్నా వెంటనే మూర్తి గుర్తుకు రావడం రివాజైపోయింది. అతను నాకు యింటర్లో కలిశాడు. అతనిది సైన్సు గ్రూపు, నాది కామర్సూనూ. అయినా యిద్దరము ఒకటే క్లాసు, ఒకటే బెంచి అన్నట్టు ప్రతిరోజూ కలిసి తిరుగుతూండేవాళ్లం.

ఇంటర్లో అతనికి క్లాసు వచ్చింది. ఆనర్సు చదువుకుందికి విశాఖ వెళ్లాడు. అతను నాకు దూరంగా విశాఖ పట్టణంలో వున్నా - ఉత్తరాలుద్వారా మాత్రం చాలా దగ్గర్లో ఉన్నట్టనిపించేది.

అతని దురదృష్టవశాత్తూ ఆనర్సు పోయింది. మావాళ్లందరికీ ఆశ్చర్యం కలిగించింది - ఆనర్సేమిటీ పోవడమేమిటీ అని. దానికి కారణాలు మాత్రం చాలా పుట్టుకొచ్చాయి. తలోవిధంగా చెప్తూండేవాళ్లు. చివరికి ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో కూడా తెలిసేది కాదు. నే నతన్ని అడుగుతే నవ్వుతూ-

చూడు శంకరం! మనిషి ఒక్కడే అయినా, వాడు తలోవిధంగా కనుపిస్తూంటాడు. ఇలా జరగడం కొత్తేమీ గాదు. నా గురించి నువ్వు అనుకుంటున్నదీ, మరో దానయ్య అనుకుంటున్నదీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కటికాదు. ఇంతకీ నా పరీక్ష ఎందుకు పోయిందో మాత్రం నేనూ సరిగ్గా చెప్పలేను. వాళ్లందరూ అనుకుంటున్న కారణాలు ముఖ్యమా కావా అని అడక్కు - ముఖ్యమైన కారణం నా అశ్రద్ధఅనేవాడు.

అతనిప్పుడు బందర్లో గుమాస్తా గిరి వెలిగిస్తున్నాడు. అతను చక్కటి కథలు రాస్తూంటాడు. అతని కథలూ అతని మాటల్లాగానే చక్కగా ఉంటాయి. ప్రతి కథలోనూ అతను కనిపిస్తూంటాడు. అయితే కథ చదివి అతను యిదిఅని చెప్పడం కష్టం.

మొన్నమొన్నటివరకూ అతను చేస్తున్న ఉద్యోగం గురించి యిలా అంటూండేవాడు. ఉద్యోగం, ఉద్యోగం అని ఇలా ఎగపడుతున్నామ్‍గాని - అది దొరికిన తర్వాత యిప్పుడున్న స్వేచ్ఛ కాస్తా హారతి కర్పూరమే. ఏదో ఒక సంస్థకి అమ్ముడు పోవటమే ఉద్యోగ మంటె. ఈ అమ్ముడుపోటాల్లో రెండురకా లున్నాయి. జీవితాంతం ఎదుగూబొదుగూ లేని రకం మొదటిదీ నికృష్టమైనదీను. జీవితములో ఎప్పుడో ఒకప్పుడు ఓ స్థితికి అందుకోగలం అనే ధైర్యం చెప్పేది రెండోది ఆశించదగ్గదీను. ఇంక మన మాటకొస్తే - మొదటి రకానికే చెందుతాం. జ్యోతిషం చెప్తున్నా ననుకోవద్దు. ఎందుకో మరి మనల్ని చూస్తోంటే అలా అనిపిస్తుంది. సంవత్సరాలు గడిచినా స్థితిమాత్రం మారదు; సాంధించిందేమీ లేకపోయిందనే ఓ గట్టి నిట్టూర్పు తప్ప. పోతే - యీ రెండో రకమున్నది చూడూ - అదిమాత్రం కొందరు అదృష్టవంతులకే! వాళ్ల జీవితం వడ్డించిన విస్తరి. రికమెండేషన్లూ, అంతస్థులూ గట్రా వెనక హంగుగా నిలబడి ఉండాలి. ఇది వేరే విషయం. ఇంతకీ నే చెప్పొచ్చిం దేమిటంటే - ఉద్యోగం దొరికిన మరుక్షణాన్నే సమస్యలన్నీ పటాపంచలై జీవితం బ్రహ్మండంగా సాగుతుందని అనుకుంటే మాత్రం పొరపాటే. సాక్ష్యం కావాలిస్తే నేను! రేప్పొద్దున పెళ్లయి - పెళ్లాం పిల్లలూ, మేమంటూ నా వెనుక నిలబడితే - అప్పుడు తెలిసొస్తుంది - యీ ఉద్యోగం సంపాయించిపెట్టిన అదృష్టంయొక్క విలువ. అందుకే అంటాను - పుడితే రాజభోగా లనుభవించే రాజులింట్లోనూ లేకపోతే పేవ్‍మెంట్లమీదనూ అని. అంతేగాని స్టెయిన్‍లెస్‍స్టీల్ గ్లాసులో అంబలి పోసుకుని వూరుకుతాగే జీవితం మనకొద్దు.

అతని అభిప్రాయాలు చాలా చిత్రంగా ఉంటాయి. నాకు నచ్చడం, నచ్చకపోవడం వేరే విషయం. అతను అనుకుంటున్నది మాత్రం కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు.

ఏది ఏమైనా - నే నొస్తూండగా అతను అన్న యీ కొద్ది మాటలూ జీవితపర్యంతం మరిచిపోలేను.

ఇదో సరిహద్దు శంకరంఇప్పటివరకూ నాకు కేవలం కాలేజీ నాలుగ్గోడలూ, యిల్లూ, అమ్మా, తమ్ముడూ - వీళ్ళే తెలుసు. ఇప్పుడు నువ్వు తెల్సుకోవాల్సిందీ, నీ అనుభవంలోకి తెచ్చుకోవలసినదీ చాలా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన నా అభిప్రాయాలూ, అనుభవాలూ మరిచిపో. నీకై నువ్వే తెలుసుకో - విష యూ బెస్టాఫ్ లక్!

- చేతిలో సిగరెట్టు చివరంటా కాలిపోయింది. చేయి చుర్రుమన్నది. సిగరెట్టు అవతలగా విసిరి పారేశాను. హోల్డాలు మీద చతికిలబడ్డాను. చుట్టూ కలియజూచాను.

నాకు కాస్త దూరంలో నవ్వుకుంటూ ఓ యువకుడూ, యువతీ వస్తూన్నారు. నావైపుగానే వస్తున్నారు. చెట్టాపట్టా లేసుకుని కులాసాగా నడుస్తున్నారు. ఆ యువకుడ్ని కాస్త పరీక్షగా చూశాను. శివం గుర్తుకొచ్చాడు.

అతను శివం!... అతనే శివం! .... సందేహంలేదు.

వాళ్లిద్దరూ సెకండ్‍క్లాసు వెయిటింగ్ రూమువైపు వెడుతున్నారు. శివం సూటుతో అందంగా కనిపించాడు. చేతిలో కాల్తూన్న సిగరెట్టు ముచ్చటగా ఉన్నది. అతను హుందాగా నడుస్తున్నాడు.

ఆమె అతని భార్యయై ఉండవచ్చును. మొన్న వేసవిలోనే పెళ్లయిందని తెలిసింది. ఎత్తుకి తగ్గ లావూను. రెండు జడలూ ఆమె భుజాలమీద ఆడుకుంటున్నాయి అందంగా. పచ్చగా దబ్బపండు ఛాయలో ఆమె మెరిసిపోతోంది.

ఆ యిద్దర్నీ చూస్తూంటే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది!

శివానికి దర్పం ఎక్కువని చాలామంది అనుకునేవారు. అతను నీటుగా, ట్రిమ్మ్‌గా కాలేజీకి వచ్చేవాడు. చివరి బెంచీల్లో కూర్చుని పాఠాలు వినకుండా గోల చేస్తూండేవాడు. ఈ వరస చూసి లెక్చరర్సు మందలిస్తే అతను తల బిరుసుగా సమాధానం చెప్పేవాడు. ఒకటి రెండుసార్లు యిలా జరిగినమీదట లెక్చరర్లూ ఏం చెప్పలేక వూరుకున్నారు.

అతను డి.యం.ఓ. గా రబ్బాయి. కాలేజీకి కారుమీద వచ్చేవాడు. ఆ కార్లో యిద్దరు ముగ్గురు ఆత్మీయుల్లాటి స్నేహితు లుండేవారు అంటిపెట్టుకున్నట్టు. కాలేజీకి వచ్చే అమ్మాయిల వెనుక కావాలని కారు నడిపి హారను వాయించేవాళ్లు. వాళ్లు కాస్త బెదిరిపోతే కిసుక్కున అందరూ ఒక్కసారే నవ్వేవారు. ఇలా రోజూ జరుగుతుండేది. ఒక విధంగా యిది వాళ్లకి హాబీ అయిపోయింది.

చదువు విషయంలో అతను బద్ధకం చూపించినా, మిగతా విషయాల్లో మాత్రం చాలా ఏక్టివ్‍గా ఉండేవాడు. బి. కాం. మొదటి ఛాన్సులోనే పాసయ్యాడు. యం. కాం. చదవడానికి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత శివంగురించి నాకు ఎక్కువగా తెలిసింది కాదు - మొన్నీ మధ్యనే అతని పెళ్లిగురించి తప్ప.

కాసేపటికి అతను ఫ్లాస్కు ఒకటి తీసుకుని సెకండు క్లాసు వెయిటింగు రూమునుంచి బయటకు వచ్చాడు. నే నతన్ని చూచాను. రెండడుగులు అతని వైపు వేశాను గూడా. అతను నాకు దగ్గరయిం తర్వాత - చిన్నగా నవ్వాను. అతనసలు నావైపు చూచినట్టే లేదు. పేరుపెట్టి పిలిచాను. వినిపించుకోనట్టు, విసురుగా వెళ్లిపోయాడు. ఆశ్చర్యపోయాను, పిలిచినా పలకడేమిటాని. కాలేజీలో ఉన్న దర్పాన్ని యింకా వదులుకోలేదు కాబోలు...

కాని చాలామంది మారిపోతూంటారు. మా క్లాసులో ఎవర్తోనూ మాట్లాడేవాడు కాదు మా ఆంజనేయులు. వాడికి సిగ్గు ఎక్కువ ఆడపిల్లలా. ఇప్పుడు వాడు కలెక్టరేటులో పనిచేస్తున్నాడు. ఎప్పుడైనా వెళ్లి వాడ్ని పలుకరిస్తే చాలు - మనల్నలా నిలనెట్టి టకటకా చెప్పుకుపోతాడు గంటలకొద్దీ మధ్యమధ్య విట్లూ గట్రా వాడుతూ. వాడలా మాటాడ్తుంటే యింకా వినాలనిపిస్తుంది - అప్పు డప్పుడనుకుంటాను - ఏవిటీ బుద్ధావతారం యిన్ని మాటలు నేర్చిందీ అని. అలాగే చాలామంది చదువుకున్న రోజుల్లో ఉన్న అలావాట్లు మానుకుని కొత్తవి కొన్ని నేర్చుకొన్నారు. కాని శివంలాంటి బహు కొద్దిమందిమాత్రం అప్పటికి డిటోల్లానే బ్రతుకుతున్నారు.

ఓ పావుగంటలో శివం మళ్లీ నావైపునుంచే వెళ్లాడు. ఈ మాటు గూడా అతను నన్ను కన్నెత్తి చూచిన పాపాన పోలేదు. అతను డాక్టరుగా రబ్బాయి, యం. కాం. చదివాడు, పరపతి పెంచుకున్నాడు, అంతస్థు ఎప్పట్నుంచో ఉండనే ఉన్నది - అయితే మాత్రం - యీ కారణాలు ఆధారంగా తీసుకుని ఓ క్లాసుమేటుని పలుకరించటానికే సిగ్గుపడుతున్నాడంటే అతన్నేమనాలి? ఇదేనా సభ్యత?

మనసుకి కష్టం కలిగింది గాని అంతలోనే తుడిచి పెట్టుకున్నాను.

మరో పావుగంటకల్లా రైలు ప్లాటుఫారమ్మీది కొచ్చింది.

బెజవాడనుండి సాయింత్రం బయల్దేరే యీ రైలుని చాలామంది దయ్యాలబండిఅని అనడం కద్దు. ప్రతి స్టేషన్లోనూ ఆగుతుంది. అవసరం ఉన్నా, లేకపోయినా అయిదూ, పది నిముషాలు (మామూలుకంటె) ఎక్కువ సేపు ప్రతిస్టేషన్లోనూ ఆగుతుందని ప్రతీతి. అందుచేతనే చాలామందికి యీ బండి అంటే విసుగు, చిరాకూను.

ఖాళీగావున్న ఓ కంపార్టుమెంటును చూచి సామాను సర్దించాను. తర్వాత డోరుదగ్గర నిలబడి మళ్లీ ఓమారు ప్లాటుఫారమ్ వైపు నా చూపును మరల్చాను. శివం వాళ్లు సెకండ్‍క్లాసు కంపార్టుమెంటులో ఎక్కుతూ, అతను నావైపు అదోవిధంగా చూశాడు. అతని ప్రవర్తనకి జాలితోపాటు కోపం గూడా కలిగింది.

కాసేపటికి రైలు కదిలింది.

నా సీట్లోకొచ్చి కూర్చున్నాను. రైలువేగం పెంచుకుంటున్నది. తాళానికి వరస తప్పనట్లు శబ్దం చేసుకుంటూ పరుగెడుతోంది.

సిగరెట్టు ముట్టించి రంగనాధం రాసిన ఉత్తరం తీసి చదివాను మరొకసారి.

శంకరం!

నీకు యీవోళ్లో ఉద్యోగం దొరికిందనీ మరో నాలుగు రోజుల్లో వస్తూన్నాననీ రాశావు... చాలా సంతోషం. నువ్వూ కాకినాడ చేరుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఆదివారం ఉదయం నేను స్టేషనుకొస్తాను, నిన్ను రిసీవు చేసుకునేందుకు. అన్నట్టు మరిచాను - నువ్వు మా యింటోనే మకాం ఏర్పాటుచేసుకోవాలి. తర్వాత కుదరదని అంటే మాత్రం వల్లకాదు.

కాకినాడతో పాటు, మా యిల్లూ నీకు కొత్తవడం మూలంగా నేను స్టేషనుకు రావడం జరుగుతున్నది. ఒకవేళ అయిదూ పది నిముషాలూ లేటయినా, నాకోసం వెయిట్ చేస్తూండు. అంతేగాని ఖంగారుపడకు.

సోమవారంనాటికి నువ్వు జాయినవ్వాలని రాశావు. నువ్వు చేరపోయే ఆఫీసూ వగైరా ఆదివారం సాయంత్రమే చూపిస్తాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే - యీ కాకినాడలో నీకే యిబ్బందీ కలక్కుండా చూచే బాధ్యత నాది. సరేనా -

నీ రాకకోసం ఎదురుచూస్తూ,

రంగనాధం.

ప్రాణంపెట్టే మిత్రులు నాకేం తక్కువ కాదు. నా కోసం, నా శ్రేయస్సుకోసం, వాళ్ళెంత శ్రమైనా తీసుకుంటారు. ఇలాంటి మిత్రుల్ని సంపాయించుకున్నందుకు గర్విస్తూంటాను.

రంగనాధం చదువులో నాకన్న రెండేళ్లు సీనియరు. వాళ్ల చిన్నాన్నగారింటి పక్కనే ఓ రూము తీసుకుని చదువుకుంటూండేవాణ్ని. రంగనాధం చిన్నాన్న ప్లీడరు గుమాస్తాగా పనిచేస్తూండేవారు.

రంగనాధం వాళ్లచిన్నాన్న దగ్గరే పెరిగాడు. అతనికి తల్లితండ్రులు బాగా చిన్నతనంలోనే పోయారుట. అప్పట్నుంచీ అతన్ని పెంచే భారం వాళ్ల చిన్నాన్న భుజాలపైన పడ్డది.

అప్పట్లో నాకూ, ఎకనామిక్సు సబ్జెక్టుకీ ఏమాత్రం పడేదికాదు. పైగా - పాఠాలన్నీ యింగ్లీషులో చెప్తూండటం చూస్తూంటే ఖంగారుగా ఉండేది. ఈ ఎకనామిక్సు మరీను. ఎన్నిసార్లు చదివినా వంట పట్టేదికాదు. బట్టీయంవేద్దామంటే - అలవాటు లేదు.

అతను చదువులో ఆరితేరిన ఘటం. పాఠాలు చెప్పడంలో అందెవేసిన చెయ్యి. అతను నాకు ఎకనామిక్సు బోధించడం మొదలుపెట్టిన రెండు, మూడు నెలల్లోనే - ఆ సబ్జక్టుమీదున్న భయం కాస్తా దూరమయ్యింది.

అతను చెప్పినది విని, అర్థం చేసుకున్న తరువాత అనిపించింది - ఓసింతేనా ఎకనామిక్సంటే’- అని. ఇప్పటికీ ఆ సబ్జక్టు నాకు గుర్తున్నదంటే ఓ విధంగా రంగనాధమే కారణ మవుతాడు.

అతను నేనంటే ప్రాణాలు పెట్టేవాడు. నన్ను ఓ తమ్ముడిగా చూచుకునేవాడు. అప్పుడప్పుడూ అనేవాడు -

నాకు తోబుట్టువులంటూ ఎవ్వరూ లేరు. ఊహ తెలిసిం దగ్గర్నుంచీ బాబాయి దగ్గరే పెరిగాను. చిన్నాన్న పిల్లలకి నామీద సదభిప్రాయం బొత్తిగా లేదు. అందరూ నాకు దూరంగా తిరుగుతూంటారు. నేనేదో అన్యాయంగా వాళ్లనాన్న సంపాదన అనుభవిస్తున్నానని వాళ్ల అభిప్రాయం. వాళ్లందరికీ నేనంటే నిర్లక్ష్యం. అలాంటివారి దగ్గర్నుంచి నేను కోరుకుంటున్న ఆత్మీయత నాకు లభించడం లేదు. - నిన్ను చూస్తూంటే మాత్రం, నాకు తమ్ముడున్నా డనిపిస్తుంది. ఈ భావాన్ని దూరం చేసుకోలేను శంకరం!

నిజంగా రంగనాధం చాలాచిత్రమైన వాతావరణంలో పెరిగాడు. ఆ యింటో అతనికి సుఖం లేదు. వాళ్ల చిన్నాన్న అతన్ని ప్రేమగా చూచినంతమాత్రాన సరిపోయిందా? ఆయన భార్యా పిల్లలూ చాలు రంగనాధం మనసు పాడు చెయ్యటానికి. వాళ్ల చిన్నాన్న యింటో ఉన్నంతసేపూ ఎవరూ మాటాడేవారు కాదు - ఆయన కనుమరుగయితే చాలు ఒకటే సాధింపులు. రంగనాధం అనుభవిస్తూన్న క్షోభని, అతను నాకు అప్పుడప్పుడూ చెప్తూండేవాడు కన్నీళ్లు పెట్టుకుని.

ఎవరెన్ని చెప్తున్నా లెక్కచెయ్యకుండా తనని బి.ఏ - చదివిస్తున్నాడని, అటు వాళ్ల చిన్నాన్నపైనా, యిటు రంగనాధంపైన ఆయింటో వాళ్లందరికీ అక్కసు.

రంగనాధం బి. ఏ. పాసయింతర్వాత, వాళ్ల చిన్నాన్న ఓ తెలివైనపని చేశాడు. ఆయనకి రంగనాధాన్నింకా చదివించాలని ఉన్నది గానీ - యింట్లో పోరుపడలేక ఆ ప్రయత్నాన్ని విరమిమ్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయనకు పరంధామయ్య గుర్తుకొచ్చారు.

పరంధామయ్య కాకినాడలో పేరూ, ప్రతిష్టలున్న పెద్ద క్రిమినల్ లాయరు. ఆయన తనకి దూరబ్బంధువు. రంగనాధాన్ని వాళ్లమ్మాయి కిచ్చి పెళ్లిచేశాడు. దాన్లో ఆయన ముందుచూపు ఎంతైనా ఉన్నది.

ఈ పెళ్లి కాస్తా జరిగిందనిపించుకుంటే - రంగనాధాన్ని బి. ఎల్. చదివించి, పేరొందిన వకీలుగా తయారు చేయించే భారం, వాళ్ల మామగారే తీసుకుంటారనీ, - యీ విధంగా రంగనాధం అదృష్టవంతు డవుతాడనీ ఆయన పథకం.

అదే నిజమయిం దిప్పుడు.ఆయన తర్ఫీదులోనే అభివృద్ధికి మెట్లు వేసుకుంటున్నా డిప్పుడు.

రంగనాధం అదృష్టం పండింది!

వాళ్ల చిన్నాన్న కనిన కలలు నిజమయ్యాయి!

-రంగనాధం రాసిన ఉత్తరం మరోమాటు చదువుకుని, మడిచి జేబులో పెట్టుకున్నాను.

అప్పటికి మా రైలు ఏలూరు స్టేషన్లో ఆగిఉన్నది. నిద్ర వస్తానంటుంది. బెర్తుమీద హోల్డాలు సర్దాను. నడుం వాల్చాను. పది నిముషాల్లో నిద్ర ఆవరించింది నన్ను.

*  *  *      

మెలకువ వచ్చేసరికి రైలు రాజమండ్రి స్టేషన్లో ఆగి ఉన్నది. టీ తాగా లనిపించింది. కంపార్టుమెంటు దిగి ప్లాటు ఫారమ్మీద కాలు పెట్టాను.

సన్నగా వర్షపుజల్లు - ఈదురుగాలి - చలి.

వెచ్చదనం కోసం సిగరెట్టు ముట్టించి గట్టిగా రెండు దమ్ములు పీల్చాను.అలా ప్లాటుఫారమ్ మీద కాసేపు తిరిగి టీ తాగి,కంపార్టుమెంటులోకి వెళ్లబోయాను.

శంకరంఎవరో పిలిచారు.

ఉలిక్కిపడ్డాను.అలాగే ప్లాటుఫారమ్మీద నిలబడి పోయాను.

చుట్టూ కలియజూశాను. నాకు తెలిసిన వ్యక్తు లెవరూ కనుపించకపోవడంతో, నన్ను కాదనుకున్నాను. కంపార్టుమెంటులోకి వెళ్లబోయాను.

వరే .... శంకరం ....ఈమాటు కాస్త బిగ్గరగా పిలిచారు.

ఆగి - ఆ పిలుపు వచ్చినవైపు చూపు విసిరాను. నాకు ఓ యిరవై అడుగుల దూరంలో ఓ స్థంభాన్ని ఆనుకుని నిలబడ్డ యువకుడు - చేతితో సంజ్ఞ చేస్తూన్నాడు రమ్మన్నట్టు.

అతని వైపు నడిచాను.

తెల్లగా పొడుగా ఉన్న ఆ వ్యక్తి అందాన్ని - సిల్కు లాల్చీ, పైజమా, రిమ్‍లెస్ కళ్లజోడూ, ఆకు చెప్పులూ, యివన్నీ రెట్టింపు జేస్తున్నాయి.

వాడు మా చలపతి!

చలపతికి ఒక ప్రత్యేకత ఉన్నది. వాడు నవ్వుతాడు, ఎదటివాళ్లని నవ్విస్తాడు. సీరియస్‍గా మాట్లాడటం చేత కాదు. ఇప్పుడూ వాడి ముఖంలో నవ్వు మిడిసిపడ్తూనే ఉన్నది.

గబగబా నడిచి వాడ్ని చేరుకున్నాను.

పది నిముషాలనుంచీ నిన్ను గమనిస్తున్నా. నిన్నెప్పుడో పోల్చుకున్నాను. నన్ను చూస్తే - నువ్వే పలకరిస్తా వనుకుని మవునం వహించాను. అబ్బే - బొత్తిగా నా విషయం పట్టించుకున్నట్టు లేదు.అన్నాడు నా భుజం తట్టుతూ.

వాడివాలకం మారిపోయింది. మునుపటిలా ఖంగున మాట్లాడలేక పోతున్నాడు. బాగా నీరసించిపోయాడు.

మళ్లీ ఎన్నాళ్లికి కలిశాంరా!అన్నాను.

పేద్ద... మనం కలుసుకుని యుగాలైనట్టు మాటలూ వీడూను. సరిగ్గా లెక్క కడితే రెండు సంవత్సరాలు కాలేదు.ఎంతో సరదాగా మాట్లాడదామనే వాడి ప్రయత్నం కాస్తా ఆయాసంవల్ల చెడిపోతోంది. మధ్యమధ్య దగ్గుకూడాను.

నీ ఆరోగ్యం ఎలావుందిరా చలపతీ?”

వాడు పేలవంగా నవ్వాడు.

ఇంకా బ్రతికే వున్నా నిలా! - నువ్వెక్కడికి బయల్దేరావో చెప్పావుకావు?”

అంతా చెప్పాను.

ఉద్యోగస్థుడి వయ్యావన్నమాట... గూడ్.

అదిసరే... నీ సంగతి?”

చూస్తున్నావుగా... ఇంకా నేను చావలేదు. ఇంతలో చావను. ఊళ్లు తిరగాలనే సరదాకొద్దీను యిష్టంవచ్చినట్టు తిరుగుతున్నాను. ఎప్పుడో ఎక్కడో ఆగిపోతాను. ఈ కాస్త ప్రాణం-ఏదో చెప్పబోయాడు కాని, విపరీతమైన దగ్గు రావడం వల్ల మానుకున్నాడు. కొన్ని క్షణాలకికాని దగ్గు కుదుట పడలేదు.

ఈ వెధవ జబ్బు నా ప్రాణాల్ని  కొరుక్కు తింటోందిరా శంకరం! ఎందరో డాక్టర్లు మారారు - ఎన్నో మందులు మార్చారు. ఊఁహు.... ఫలితం లేదు. అయినా ఎవడికెంత రాసిపెట్టివుందో అంతే జరుగుతుంది. కదూ!

మొదలెట్టావ్ పెసిమిజమ్’. పెద్ద పెద్ద జబ్బులెన్నో-

ఆగు. నన్ను నిరాశావాదన్న వాడికి బుర్రలేదు. నిజంగా నేను అలాంటివాణ్ణే అవుతే యీ సరికే ఢాంమ్మనేవాడ్ని. ఈ వెధవ క్షయ రాయల్ డిసీజ్అని తెలిసిగూడా కేరేపిన్అని తోసిపారేసి బ్రతుకుతున్నా కులాసాగా. కానీ... యీ రోగం నా మీద కత్తిగట్టిందో ఏమోగాని- ఎక్కడికక్కడికి నన్ను తొక్కి పారేయాలని చూస్తోంది.

ఎందాకా నీ ప్రయాణం?”

ఈ వూళ్ళో రెండు రోజుల పాటుంటాను. ఆ తర్వాత ఒరిస్సా టూర్. ముందస్తుగా పూరీజగన్నాధం దర్శించాలని సంకల్పం-మళ్ళీ దగ్గాడు.

పోనీ ఏదైనా శానిటోరియమ్‍లో చేరక పోయావుట్రా?”

ఏడిశావ్‍లే. శానిటోరియమ్‍లో కూలబడి చూడవలసినవీ, అనుభవించవలసినవీ అన్నింటికీ వాయిదా వేసుకొమ్మని సలహా చెప్తావుట్రా. అన్నీ ముగిసాయన్నమీదటనే శానిటోరియమూ, అక్కడ దిక్కుమాలిన చావూను.

దారుణంగా మాట్లాడేస్తున్నావ్.

మనిషి చివర్నేమవుతాడు అని మా నాలుగో తరగతి మాష్టారు - ఆయన ఓ పెద్ద వేదాంతిలే - ప్రశ్నవేసి జవాబు గూడా తనే చెప్పేవాడు, మట్టి అవుతాడూ అని. ఆ చిన్న వయస్సులో అదేదో కొత్త పాఠమనుకునేవాడినే గాని నిజమనిపించేదిగాదు. ఇప్పుడు...

సర్లే. నిన్నీ వేదాంతం ఎప్పుడూ చెప్పమని  అడగటం లేదుగాని కాస్త నీ అడ్రస్సూ అదీ-

చలపతి నవ్వుతూ అన్నాడు.

వూళ్లు తిరిగే సన్నాసిని. నాకో అడ్రస్సేవిటిరా నా తలకాయ్! నువ్వే యివ్వు మీ ఆఫీసు అడ్రస్సు. నేనే రాస్తాను రాయాలనిపిస్తే. అదీగాక నే పోయేముందు మిమ్మల్నందర్నీ పేరుపేరునా కలుసుకుని ఒక్కోళ్లతో నాలుగైదు రోజులు గడిపిపోదామని వుంది.

ఈ మాట విన్న తర్వాత నా మనసు - చివుక్కుమంది.

ఛ... అవేం మాటల్రా చలపతీ మరీను.

వీడింకా మునుపటి చలపతి కాడోయ్ భగవాన్లూ!అన్నాడు ఉద్వేగంగా.

సరేలే, నీ ట్రైనుకి టైమవుతున్నది కాబోలు. కాస్త నీ అడ్రసు యీ డైరీలో చెక్కు.అంటూ వాడి డైరీ నాకిచ్చాడు. నేనేం మాటాడలేక పోతున్నాను.

ఇదేం ఆటోగ్రాఫ్పుస్తకం కాదులే శంకరం! ఆ అలవాటులన్నీ ఎప్పుడో పాయాయి. రాయి త్వరగా నీ అడ్రసు.అన్నాడు.

నా ఆఫీసు అడ్రసు రాశాను.

వెళ్ళింకఅన్నాడు డైరీ తీసుకుంటూ.

నాకు అక్కడ్నుంచి కదలబుద్ధి పుట్టటంలేదు. వాడి తీరు చూస్తుంటే నాకళ్లల్లో నీళ్లు తిరిగాయి. దాని వాడెల్లా పసిగట్టాడో ఏమోగాని-

ఛ... ఆడపిల్లలా అలా కన్నీరెందుకురా? ముందిక్కడ్నుంచి కదులు బాబూ... పోనీలే... నేనే వెడతాను. జీవితంలో ఓనాడు నీయింటితలుపు తట్టుతాను. సరేనా - అచ్ఛా.... టా... టా....అంటూ చెయ్యూపుతూ వెళ్ళిపోయాడు చలపతి.

రైలు దాని సొమ్మేమిటో పోయినట్టు గట్టిగా కూత పెట్టింది.

గబగబా వచ్చి కంపార్టుమెంటులో చేరాను. రైలు కదిలింది. నా సీట్లోకొచ్చి కూర్చున్నాను.

చలపతిని చూస్తుంటే భయంగా ఉన్నది. వాడు బ్రతకాలి. వాడు మళ్లీ నవ్వుకుంటూ మా మధ్య తిరగాలి.

చలపతీ, నేనూ క్లాసుమేట్సుమీ, రూంమేట్సుమీ గూడాను. వాడు వస్తుథా బలహీనుడు. దానికి తోడు నిద్ర మేలుకొని బాగా చెరిసగం రాత్రిదాకా చదివేవాడు. సరిగ్గా పరీక్షలముందు రోజుల్లో వాడికి పెద్ద జబ్బు చేసింది.

ఇలా సుస్తీ చెయ్యడం, మా నాలుగేళ్ల చదువుల్లో వాడికి రివాజే కానీ ఆ ఏడాది మాత్రం కాస్త ఉధృతంగా వచ్చింది. కొన్నాళ్లపాటు ఉపేక్షించాడు. అదే పోతుంది లెమ్మన్నట్టు. అది కాస్త ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీసింది. ఈ సంగతి తెలిసి వాళ్లన్నయ్య చలపతిని యింటికి తీసుకువెళ్లిపోయాడు.

ఆ ఏడాది మాతోపాటు చలపతి పరీక్షలు రాయలేదు. తర్వాత నాకు తెలిసింది - చలపతికి క్షయఅని.

చలపతికి ఆత్మబంధువంటూ వాళ్లన్నయ్య ఒక్కడే. ఆస్థివిషయంలో, పెద్దవాళ్లు బాగా సంపాయించిపెట్టి వెళ్లారు. చలపతివాళ్ల ఆస్తి వ్యవహారాలు, వాళ్లన్నయ్యే చూస్తుండేవాడు యింటిపట్టున ఉండి. చలపతి చదువు నిమిత్తం డబ్బూ దస్కం పంపుతూండేవాడు.

చలపతి అన్నయ్యకు గంపెడు సంసారం. అతని గురించి చాలామంది అనుకునేవారిలా - ఆస్థిలో చాలామట్టుకు తమ్ముడికి తెలియకుండానే, తన స్వంతానికి ఉపయోగిస్తున్నాడని. చలపతి యీ మాటలు విని అనేవాడు:

నాకు కావలసింది అన్నయ్య - ఆస్థి కాదు. నాకు చదువు చెప్పిస్తూన్నాడు. నా ఒక్కడి పొట్టనీ పోషించుకోగల సత్తా నాకు ఉన్నది. అలాంటప్పుడు ఆ ఆస్థితో నాకు పనేమిటి. వాడు ఖర్చు చేస్తున్నాడంటే అర్థముంది. వాడికి పిల్లలెక్కువ. సంసారం పెద్దది మరి.

చలపతికి కొన్ని ఆదర్శా లున్నాయి. అవుతే నాకీ ఆదర్శాలున్నాయి. నేను అంతటివాణ్ణీ, యింతటివాణ్ణీఅని పదిమందిలో చెప్పుకోడంగాని - లేదా - పదిమందిచేత అనిపించుకోడం గాని అతనికి యిష్టం లేదు. ఎప్పుడైనా అలాంటి ప్రసక్తి వచ్చిందంటే, వాడు అక్కడ్నుంచి చివాలున లేచి వెళ్ళిపోయేవాడు.

వాడికి క్షయ ఉన్నదని నిర్ధారణ అయిన తర్వాత కూడా వాడికి పెళ్లిచేసి, ఆ పెళ్లిద్వారా కొంత రాబట్టాలని వాళ్లన్నయ్య నిశ్చయం. ఈ జబ్బుమాట మభ్యపరచి ఉచ్చులు పన్నాడు. ఈ వలలో ఇరుక్కున్నది రజని కుటుంబం!

రజని మాకు జూనియరు. చలపతిలానే ఆమె కూడా చక్కగా పాడేది. కాలేజీలో జరిగే ప్రతి చిన్న ఫంక్షనికీ వాళ్ల పాటకచ్చేరి ఓ ప్రత్యేకత. చాలామంది వీళ్ల పాటల్ని వినటానికే హాజరయ్యేవారు. ఇటు శాస్త్రీయమూ, అటు లలిత సంగీతాల్లో కూడా యిద్దరూ ఆరితేరినవాళ్లు. వాళ్ల పాటని అభినందించని వాళ్లు అసలు లేనేలేరు.

కమ్మగా పాడేవారు - వాళ్లు పాడుతూంటే సర్వాన్నీ మరిచిపోయి వినడం ప్రేక్షకుల వంతు.

వాళ్లకున్న యీ ప్రావీణ్యత కేవలం కాలేజీవరకే కాకుండా బయటకు కూడా వ్యాపించింది. స్థానికంగా జరుపుకునే ఉత్సవాలకి వీ రిద్దరూ ప్రత్యేక ఆహ్వానితులు. వీళ్లు పాడే పాటలు వింటూ పురజనులు అలా మై మరిచేవారు.

చలపతికీ, రజనికీ పరిచయం యీ రీత్యా ప్రారంభమయింది. కొన్నాళ్లకి యిద్దరూ దగ్గరయ్యారు. మనసులు కలిశాయి. మేము థర్డ్ యియర్ చదువుతూండగానే యీ విషయాలు యింటిదగ్గర వరకూ వెళ్లాయి. పెద్దవాళ్లకి తెలిశాయి. వీళ్లిద్దరి పెళ్లి విషయమూ సంప్రదించుకోలేదుగాని - మనస్సుల్లో పెట్టుకుని మవునంగా ఉండేవాళ్లు పెద్దవాళ్లు.

ఫైనలియర్ రోజుల్లో చలపతికి క్షయదాపరించింది. వాళ్లన్నయ్య అతని భుజం తట్టాడు. లౌక్యంగా మాటాడాడు. ఇటు చలపతికి ధైర్యం చెప్తున్నట్టు నటిస్తూ - అటు రజని పెద్దవాళ్లని పెళ్లికి వప్పించాడు.

ఈ విషయం చలపతి వరకూ వచ్చింది. నాకున్న జబ్బుని కనిపెట్టి వాళ్లని మోసం చెయ్యటం తగదనివాళ్లన్నయ్యకు చెప్పాడు. నువ్వాపిల్లని ప్రేమించలేదా?” అని ప్రశ్నించాడాయన. ప్రేమించాను కాబట్టి చెప్తున్నా. నాలాటి దురదృష్టవంతుడికి ఆమె అంకితమై జీవితం దుఃఖమయం చేసుకోడం నేను సహించను.అని జవాబిచ్చాడు చలపతి.

వాళ్లన్నయ్య రుద్రుడయ్యాడు.ఎన్నో ఎత్తులు వేశాడు. ఒక్కటీ పారలేదు. చివరికి విసిగిపోయి అన్నాడు, “ఈ పెళ్లి ఎలా జరగదో నేనూ చూస్తానుఅని.

చలపతే స్వయంగా రజనివాళ్లింటికి వెళ్లాడు. తన పరిస్థితిని చెప్పుకున్నాడు. ఇంతవరకూ వాళ్లని మభ్యపరచిన అన్నయ్యని క్షిమించమని అన్నాడు.

చలపతికి క్షయ అని తెలిసి రజని ఆశ్చర్యపోయింది.

రజని తండ్రి చలపతి వ్యక్తిత్వానికి చేతులు జోడించారు.

మనుషుల్లో దేవుడున్నాడని ఋజువు చేశావు నాయనాఅని ఆయన చలపతిని అభినందించారు.

అంతే-

ఆ పెళ్లి ఆగిపోయింది. దాంతో అన్నా తమ్ముళ్ల మధ్య సంబంధం కాస్త తెగిపోయింది. ఆస్తి, పంపకం జరిగింది. నీ ముఖం చూడనూఅని ఒట్టు వేసుకున్నాట్ట చలపతి వాళ్ల అన్నయ్య.

చలపతి యీ విషయాలని పెద్దగా పట్టించుకోలేదు. ఆస్తి పంపకం అయినతర్వాతనుంచీ యిలా వూళ్లు తిరగడం నేర్చుకున్నాడు.

నేటికి - అనుకోకుండా - ఓ అర్ధరాత్రి - రైల్వే ప్లాటుఫారంమ్మీద మళ్లీ కనుపించాడు చలపతి. చలపతిలాంటి మనుషుల్ని మరిచిపోడం అంత తేలికేంకాదు.

-రైలు పోతూంది వడిగా. చుట్టుపక్కల పరిసరాలన్నీ చీకట్లో కలిసిపోయాయి. అంతా ఏదో ఒక చీకటి ముద్దలా ఉన్నది.

పుట్టి పెరిగిన యిన్నేళ్లకి మావూరువిడిచి యింత దూరం రావడం జరుగుతోంది. కొత్త వూరు - కొత్త మనుషులు - కొత్త జీవితం!-

నిద్ర తేలిపోయింది.. కళ్లుమాత్రం మంటగా ఉన్నాయి. కంపార్టుమెంటంతా నిశ్శబ్దంగా ఉన్నది. ఉన్న కొద్దిమందీ నిద్రపోతున్నారు. ఫాన్చేస్తూన్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది.

రంగనాధం, వాళ్ల మామయ్యగారింటో ఉండవచ్చని రాశాడు. కాబట్టి యిల్లు వెదుక్కోడంలాటి ఒక పెద్ద సమస్య తీరిపోయింది. రెండోది భోజనం - హైస్కూల్ చదువు వరకూ అమ్మ చేతివంట బ్రహ్మాండంగా ఉండేది. కాలేజీలో మాత్రం యిరవైమంది కలిసి మెస్సుపెట్టుకున్నాం. ఓ ముసలావిడ మా అందరికీ వంట చేసిపెట్టేది. అమ్మ చేసిన వంటలా లేకపోయినా పర్వాలే దనిపించింది. ఆ నాలుగేళ్లూ భోజనం గురించి పెద్ద యిబ్బంది పడలేదు. ఆ నాలుగేళ్లూ భోజనంగురించి పెద్ద యిబ్బందిపడలేదు.

ఇప్పుడిహ హోటలు భోజనం తప్పదులా ఉన్నది. ఈ అనుభవం లేదు నాకు. కాని మూర్తి చెప్తూండగా విన్నాను. కాస్త భయంకరంగానే ఉంటుందని.

మొదట్లో పర్వాలేదనిపిస్తుంది. ఆ తర్వాత మాత్రం - వాడు పెట్టే భోజనం మానుకుని ఎటైనా పారిపోవాలనిపిస్తుంది. వంటలో రుచీ గట్రా అవతల పెట్టు - శుచీ శుభ్రతా మచ్చుకైనా కనుపించవు... మనం భోంచేసే ప్రాంతానికి సరిగ్గా ఓ పది అడుగుల దూరంలో పాసింజేర్లు’ (ఇది హోటలువాళ్ల వాడుకభాషట - అంటే అక్కడికి భోంచేయడానికి వచ్చిన ఆసాములు అని అర్థంట) కాళ్లు కడుగుకోవటాలూ,కాండ్రించి ఉమ్ము వూయటాలూ మొదలైనవన్నీ జరుగుతాయి. సిగరెట్లు కాల్చిన చేత్తోనే వడ్డన ప్రారంభిస్తాడు సర్వారావు. హోటలుగేటు దగ్గరే టిక్కట్టు పుచ్చుకుని సినిమా సినిమా హాల్లోకి జనాన్ని తోసినట్టు తోస్తారు లోపలికి. తింటే తినూ లేకపోతే చావూ అనే పద్ధతి బాగా వంట పట్టింది. నీ రుచీ పచీ ఎవడికీ అక్కర్లేదు. వాడు వండింది గప్‍చిప్‍గా తినేసి రావడమే నీవంతు. అన్నం పెట్టడం గూడా వ్యాపారపద్ధతిలోకి దిగుతే యిలా అఘోరించక మరేమవుతుందీ” - అంటాడు మూర్తి. పాపం! - ఇంత చెప్తూ ఎలా తింటున్నాడో ఏమో మరి.

తప్పదు మరి... పరాయిచోటుకి వెళ్లినప్పుడు యిలాంటివి పట్టించుకునీ పట్టించుకోనట్టుంచాలి మరి.

ఇల్లూ, అమ్మా, తమ్ముడూ గుర్తుకొచ్చారు. ఈపాటికి అమ్మా, తమ్ముడు మంచినిద్రలో ఉండి ఉంటారు. నిశ్చింతగా నిద్రపోవడం యిప్పట్నుంచే ప్రారంభమవుతుంది.

ఆలోచనలు రకరకాలుగా వస్తున్నాయి. ఇప్పు డొకటి ఆలోచిస్తే మరో క్షణంలో ఆ ఆలోచన మారి మరో ఆలోచన చోటు చేసుకుంటున్నది. ఊరికే కూర్చుంటే యింతే మరి. అందరూ గుర్తుకొస్తున్నారు.

పోనీ ఏదైనా చదువుకుంటూ గడుపుదామంటే - బుద్ధి పుట్టడం లేదు. నిద్రైనా వస్తుందా అంటె అదీలేదు.

ఇంకా యిలా ఎంతసేపు కూర్చోవాలో ఏమో?...

నాముందు నిశ్చింతగా నిద్రపోతున్న వ్యక్తుల్ని చూస్తూంటే యీర్ష్య పుట్టుకొస్తుంది. వాళ్ల కసలు ఏ ఆలోచనలూ రావా? ఎవరూ గుర్తుకు రారా?

వాళ్లలా నే నెందుకుండలేక పోతున్నాను?

పోనీ యీ పాడు రైలు వెంటనే నన్ను కాకినాడలో దింపకూడదూ?

చిరాకు - విసుగు - కోపం. మళ్లీ మొదటి స్థితి. ఆలోచనలు, జ్ఞాపకాలూ.

వూరు దగ్గరవుతున్నకొద్దీ - అసహనం ఎక్కువవుతోంది. ఇదో విచిత్రమైన సెంటిమెంటు’. ఇంతదూరం వచ్చినవాడ్ని - కాస్సేపు ఓపిక పడితే పోదూ!

 

2

తెలతెలవారుతోందగా రైలు సామర్లకోట స్టేషన్ను చేరుకొన్నది!

అబ్బ!- ఎలాగైతేనేం చేరుకున్నాను మొత్తానికి.

ప్లాటుఫారమ్ మీదికి సామాను దించుకున్నాను. సిగరెట్టు ముట్టించి చుట్టూ ఒకసారి చూచాను. ఇంకా బద్ధకంగానే ఉన్నది. వళ్లంతా పోట్లు పుడుతున్నది. కళ్లు మంట లెత్తుతున్నాయి.

మళ్లీ శివం కనిపించాడు!

అతని పక్కన యిప్పుడామె లేదు. ఎవరో రైల్వే ఉద్యోగి అతనివెంట నడుస్తున్నాడు. ఇద్దరూ కలిసి స్టేషను మాష్టరు గదివైపు విసురుగా వెళ్లారు.

ఇదంతా చూస్తూంటే నాకేదో విడ్డూర మనిపించింది. దీనికి తగ్గట్టు శివం ఎక్కిన కంపార్టుమెంటు దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. ఏమిటో తెలుసుకుందామని అక్కడికి వెళ్లాను.

ఆ పెట్టంతా గాలించి చూచినా ఆ యువతి కనిపించలేదు. ఇది మరీ విడ్డూర మనిపించింది. అదే పెట్టెలో మరో యువకుడు ఎవర్తోనో అంటున్నాడు.

అనవసరంగా నన్ను నిలదీసి అడిగినట్టు మీ జేబులు తనిఖి చెయ్యాలనిఅడగటానికి అత నెవరు? అసలు వీళ్లిద్దర్నీ బెజవాడనుంచి గమనిస్తున్నా. మొదట్లోనే అనుమానం వేసింది. కాని - అతనికి సమ్మంధించిన అమ్మాయేమోనని సరిపెట్టుకున్నాను. ఆమె ఎక్కడ దిగిపోయిందో నాకూ తెలీదు. ఇక్కడి కొచ్చింతర్వాత నా పర్సు పోయిందనిఅతను గోలచేశాడు. ఆ అమ్మాయిమీద నాకు అనుమానం దృఢపడింది. ఆమె యీ కంపార్టుమెంటులో పత్తా లేకుండా పోయింది. - ఏదో సామెత చెప్పినట్టు పర్సు కొట్టేసి పరారయిన ఆ అమ్మడ్ని ఏమీ అనలేడు గాని నవ్వినందుకు నామీద అగ్గిరాము డవుతున్నాడు. ఇదేమైనా బావుందా? మీరే చెప్పండి?”

అస లింతకీ ఆ పిల్లెవ్వరండీ?” ఎవరో కలుగజేసుకున్నారు.

నాకు తెలుస్తేగదా మీకు చెప్పటానికీ? - ఇలా జరుగుతుందని ఊహిస్తే ముందే హెచ్చరించి ఉండేవాణ్ణి. పూర్ ఫెలో...అన్నాడా యువకుడు.

అప్పటిగ్గాని కథ నాకు అర్థంకాలేదు. శివం, తన అలవాటుకొద్దీ ఎవరో ఓ అమ్మడ్ని బెజవాడ ప్లాట్‍ఫారమ్ మీద హడావిడిగా, అర్జంటుగా ప్రేమించేసి ఉంటాడు. నే పిలిచినా పలక్కపోటాని కిదే కారణం కాబోసు. ఆ అమ్మాయి కాస్తా యిలా ఢోకా యిచ్చేసరికి బెంబేలు పడిపోయి - గేలిచేస్తూన్న యీ యువకుడిమీద విరుచుకు పడిపోయి ఉంటాడు.

ఓ పక్కన నవ్వుగా ఉన్నా - మరోపక్క జాలిగా ఉంది.

మరో పావుగంటలో శివం ఆ కంపార్టుమెంటు దగ్గరికి వచ్చాడు దిగులుగా. నన్ను చూడగానే తల దించుకున్నాడు సిగ్గుతో. నేనే పలుకరించాను.

ఎందాకా?” అని.

విశాఖపట్టణంఅన్నాడు దైన్యంగా.

టిక్కెట్టు కూడా పోయిందా?”

లేదు. అది వేరే జేబులో పెట్టుకున్నాను.

అతన్ని చాటుగా పిలిచి - అతని చేతిలో అయిదు రూపాయల కాగితం పెడ్తూ అన్నాను -

ఇది వాడుకో - దారి ఖర్చులకి.

అతని అభిమానం దెబ్బతిన్నది కాబోలు - తీసుకోనా వద్దా అని సంశయించాడు. కానీ నా బలవంతంమీద  తీసుకోక తప్పింది కాదు.

పెళ్లి చేసుకున్నావుగదా! యింకా యీ పసితనం పోకపోతే ఎల్లా శివం?”

అతను తలదించుకున్నాడు.

సరే ... ఇంక నేనుంటా. ఒకమాట - అంత తొరగా మమ్మల్ని మరిచిపోవటానికి ప్రయత్నించకు.అని చెప్పి నా పెట్టే బేడా కూలిచేతి కిచ్చి, ఓవరుబ్రిడ్జి దాటి కాకినాడ ప్లాటుఫారమ్మీద కొచ్చాను.

కాకినాడకు పోయే డూప్లికేటులో నా సామాను సర్దాడు కూలి. అతనికి డబ్బులిచ్చి పంపాను.

అప్పుడే కేంటిన్ తలుపులు తెరిచారు. వేడివేడిగా యిడ్లీలు తయారయ్యాయి. ముఖం కడుక్కున్నాను. ఇడ్లీలు తిని కాఫీ తాగాను.

ఇప్పుడు ప్రాణానికి సుఖంగా ఉన్నట్టనిపించింది.

సిగరెట్టు ముట్టించి ప్లాటుఫారమంతా ఒకసారి అటునుంచి యిటు తిరిగాను. స్టేషనుకంటూ వెడితే, ప్లాటుఫారమంతా ఓసారి సర్వే చెయ్యడం నాకు బాగా అలవాటయ్యింది. శోభనాద్రి యిప్పటిగ్గూడా అంటాడు - ఏంరా - ఆ అలవాటు యింకా ఉందా పోయిందాఅని. రైలు వచ్చీ రాంగానే, సీటు సంపాయించుకుని తిష్ఠ వేయడం వాడి పద్ధతి.

మరో అరగంటకి డూప్లికేటుకాకినాడు బయల్దేరింది.

సూర్యోదయం - సరిగ్గా ఆవేళ్లకే కాకినాడ టౌను స్టేషన్లో కాలు పెట్టాను. రంగనాధంకోసం ప్లాటుఫారమంతా వెదికాను. కనిపించలేదు.

స్టేషను బయటనిలబడి రోడ్డువైపు చూశాను. ఒకరిద్దరు రిక్షావాళ్లు అడిగారు - ఎక్కడికి వెళ్లాలి బాబూ అని. ఏమని చెప్పను. రంగనాధం వచ్చేంతవరకూ నన్నిక్కడే ఉండమన్నాడాయె.

నేను చూస్తుండగానే నాముందు ఓ కారు వచ్చి ఆగింది. చేతిలో సైగజేశారు రమ్మన్నట్టు. కారులోకి తొంగిచూశాను.

రంగనాధం!

అతను బాగా మారిపోయాడు. కాస్త లావైయ్యాడు గూడాను. రంగులోగూడా మార్పు కొట్టొచ్చినట్టుంది. అలాగే అతనివంక నేనూ, నావంక అతనూ చూస్తూ ఉన్నాము. చివరికి అతనే అన్నాడు కారునించి దిగి.

నేనే ఆలస్యంగా వచ్చాను. రైళ్లు ఇంత టంచన్‍గా నడుస్తాయని తెలుస్తే యింకాస్త పెందరాళే వచ్చేవాడ్ని.

మొత్తానికి వచ్చావ్. అది చాలు.అన్నాను నవ్వుతూ.

కూలీ నా సామాను కారులో పెట్టాడు. కారులో కూర్చున్నాను. కదిలింది.

రామకృష్ణారావుపేటలో ఉంటున్నాం. ఇక్కడి కది కాస్త దూరం. ఈ కారు మావగారిది. ఇక్కడికి వచ్చింతర్వాతనే డ్రైవింగు నేర్చుకున్నానుఅన్నాడు రంగనాధం, మలుపు తిప్పుతూ.

ఇంట్లో వాళ్లందరికీ నిన్ను గురించి చెప్పాను. వాళ్లంతా నిన్ను చూడాలని ఆత్రంగా ఉన్నారు

అతను చాలా విషయాలు నా ప్రమేయం లేకుండానే చెప్పుకుపోతున్నాడు. నా మనస్సు అతనిమీద లగ్నమయింది. నాకు తెలిసినంతవరకూ అతను వాళ్ల చిన్నాన్నగారింటో చాలా నికృష్టంగానే బ్రతికాడు. ఇక్కడ అతను అనుభవిస్తోన్న హోదా చూస్తూ ఆశ్చర్యపోతున్నాను. సూటూ - కారు - మాట తీరు, మనిషిలో హుందాతనం తళుక్కుమంటోంది.

దార్లో అతని ప్రాక్టీసు గురించి అడిగాను.

మావయ్య కీవూళ్లో పెద్ద పేరున్నది. ఆయన దగ్గర ఎప్రంటిస్చెయ్యడమే మహద్భాగ్య మనుకుంటారు చాలామంది. ఈవిధంగా అదృష్టంనాకు దగ్గర పడింది. భవిష్యత్తులో పేరు సంపాయించుకోగలననీ, మావయ్యంత పలుకుబడికి నోచుకోలేకపోయినా - పేరొందిన లాయర్లలో నేనూ ఒహడ్నని అనిపించుకోగలననే నమ్మకముంది. - అది సరేగాని రైల్లో నిద్ర పట్టిందాఅని అడిగాడు.

అవన్నీ నింపాదిగా చెప్తాను. ముందు యింటికి పద త్వరగా

రైలుస్టేషనుకి దూరంగా ఉన్నది రామకృష్ణారావుపేట. ఆపేట చివర్లోనే లాయరు పరంధామయ్యగారి బంగళా ఉన్నది. అధునాతనంగా, అందంగా ఉంటుంది. కారు ఆవరణలోకి తీసుకొచ్చి ఆపాడు.

ఆవరణలో చక్కటి క్రోటన్సు, ఆ బంగళా అందాన్ని మరింత యినుమడింప జేస్తున్నాయి. కారు హారను వినగానే ఓ స్త్రీ గబగబా బయటకొచ్చి వరండాలో నిలబడింది.

ఆవిడ అలంకరణ నాగరికంగా ఒక్కమాటలో స్టెయిల్గా ఉన్నది. పెదిమెలకు లిప్‍స్టిక్, షిఫాను చీర, కళ్లకు జోడు, చేతిలో హాండ్‍బేగ్, కుడిచేతికి మూడు బంగారు గాజులూ, ఎడంచేతికి ఓ రిస్టువాచీ.

మమ్మల్ని చూస్తూ నవ్వుతూ అడిగింది -

వీరేనా శంకరం?”

అని వేరే చెప్పాలా? ఈవిడ నా మిసెస్ కుసుమ!

నమస్కారం చేశాను. ఆవిడ అందంగా ప్రతి నమస్కారం చేస్తో -

బాగా టైరైపోయి ఉంటారు. ఈ రైళ్ల పోకడ ప్రాణాలు తీస్తుంది. పైగా థర్డ్‌క్లాసు ట్రావెల్ ఏమో - మరీ రెష్‍గా తగలడి ఉంటుంది. లోపలికి వెళ్లండి. స్నానం ముగించి కాస్త రెస్టు తీసుకోండి. నాకో చిన్న ఎంగేజ్మెంటున్నది. విష్ యూ మీటెగైన్...అని నా సమాధానం కోసమైనా ఆగకుండా, చకచకా కారు దగ్గరికి వెళ్లింది కుసుమ. కారు కదిలింది.

ఆమె మాటాడిన యీ కాసేపటిలోనూ, ఆమెలో దర్పంలాంటి గుణం కనుపించింది నాకు. నే నలాగే చూస్తూ నిలబడిపోయాను.

ఈవిడగారు యిక్కడున్న ఓ మహిళా సమాజానికి సెక్రటరీ! లేనిపోని పనులన్నీ నెత్తి వేసుకుని తిరగడం ఆమెకో హాబీ... కమాన్... లోపలికి పోదాం. నర్సయ్యా... ఓ నర్సయ్యా...అని పిలిచాడు ఎవర్నో.

దాదాపు ఓ నలభై ఏళ్ల నల్లటి వ్యక్తి మా దగ్గరి కొచ్చాడు. రంగనాధం అతనితో అన్నాడు.

ఈ సామాను దక్షిణపుగదిలో సద్దించు. ఆ గది శుభ్రం చేయించు. ఆ తర్వాత అయ్యగారికి వేన్నీళ్లు పెట్టమని చెప్పు. వెళ్లు.

తర్వాత నా భుజంమీద చేయివేసి లోనికి తీసుకెళ్లాడు. సోఫాలో తాను కూర్చుంటూ నన్నూ కూర్చోమన్నాడు. కూర్చున్నాను.

ఈయిల్లు ఎలా ఉంది?”

బ్రహ్మాండంగా ఉంది.

మావయ్య ప్రస్తుతం యీవూళ్లో లేరు. రేపు వస్తారేమో. పోతే - నీకు పరిచయం కావలసింది మిస్ పద్మాకుమారి. పద్మా.... ఓ పద్మా....అని పిలిచాడు.

ఓయ్, వస్తూన్నా. ఏవిటా గావుకేకలూ...అంటూ చేత్తో పుస్తకాలు పెట్టుకుని, పమిట సర్దుకుంటూ ఓ పద్దెనిమిదేళ్ల యువతి హాల్లోకి వచ్చింది.

ఆమె చేతిలో పుస్తకాలు చూచి అడిగాడు రంగనాధం.

ఇవ్వాళ ఆదివారమని మరచిపోయారులా ఉంది రాణివారు. కాలేజీకి బయల్దేరారు.

అయ్యో ఖర్మం! రాత్రేకదుటండీ చెప్పింది.ఇవ్వాళ ఎనిమిదిగంటలకి ప్రైవేటు క్లాసున్నదని లాయరుగారూ! అప్పుడే యింత మతిమరుపా?” అన్నది సమాధానంగా.

భేష్ .... నాకు తగిన మరదలు పిల్లవు... వాడు నా మిత్రుడు శంకరం. ఈ పిల్ల ... ఆఁ ... యింతవరకూ మాకు జరిగిన సంభాషణ విన్నావుగా,యింకా వేరే పరిచయం చెయ్యడ మెందుకూ?” అన్నాడు నవ్వుతో.

మీ గురించి బావ చాలా చెప్తూంటాడు. తీరుబడి దొరికినప్పుడల్లా మీ విషయమే తీసుకొస్తాడు. మిమ్మల్ని చూచినందుకు సంతోషం. మధ్యాహ్నం తీరుబడిగా మాటాడుకోవచ్చు. ఇప్పుడు నాకు క్లాసున్నది. వస్తానండీఅంటూ ఆపిల్ల కూడా వెళ్లిపోయింది.

నేనలా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాను. నా వాలకం గమనించి నవ్వుతూ అన్నాడు రంగనాధం -

ఈ యింటో ఉన్న వ్యక్తు లందరూ చాలా తమాషాగా ఉంటారు. ఒకరి విషయం ఒకరు చస్తే పట్టించుకోరు. ఎవరి పనులు వాళ్లు చకచకా మెకానికల్‍గా చేసుకుపోవడం రివాజు. ఉదాహరణకి నేనివ్వాళ భోంచెయ్యలే దనుకో... ఆ సంగతేమిటో వంటావిడ చూసుకోవాల్సిందేగాని కుసుమ కాదు. ఆమె భోంచెయ్యకపోయినా అంతే! ఈ పనులు నీవి, ఆ పనులు నావి అని కేటాయించుకోడం జరిగింది. వాటిని తూ. చ. తప్పకుండా పాటిస్తూంటాం. లాయరు పరంధామయ్యగారు చాలా డిసిప్లిన్డ్. ఆయన పద్ధతుల కనుగుణంగానే పెరిగారు యీ యిద్దరూను.

ఈ విషయా లన్నీ చాలా చిత్రంగా ఉన్నాయి.

ఇంక లే ... స్నానం చేద్దువుగాని. తర్వాత భోజనం. ఆ తర్వాత నిద్ర. మళ్లీ మధ్యాహ్నం - ఆ ప్రోగ్రామంతా అప్పుడు చూచుకోవచ్చు. ముందు స్నానానికి లే...అని తొందర చేశాడు.

స్నానం ముగించాను. నాకు కేటాయించిన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకున్నాను. ఆ తర్వాత చాలాసేపు, రంగనాధం ప్రాక్టీసుగురించీ, పరంధామయ్యగారి పరపతిగురించీ చివరికి కాకినాడలో ఆడుతున్న సినిమాల గురించీ - మాటాడుకున్నాం. వంటయిందనీ, భోజనానికి లేవచ్చుననీ పిలుపు వచ్చింది. భోజనానికి లేచాం.

భోజనాలైన తర్వాత

ఇంక తృప్తిగా నిద్రపో... వెళ్లుఅన్నాడు రంగనాధం.

నా గదిలోకి వెళ్లాను. హోల్డాలు పరిచి నిద్రపోటానికి నడుం వాల్చాను. రంగనాధం, కుసుమ, పద్మల గురించీ వాళ్లపైన నా అభిప్రాయాల గురించీ ఆలోచించడం మొదలు పెట్టాను.

అయినా నా పిచ్చికాకపోతే పరిచయమైన గంటన్నరలోనూ వాళ్లగురించి ఏం తెలుసుకున్నాననీ? నవ్వుకున్నాను.

అలాగే కళ్లుమూసుకు నిద్రపోయాను. కాసేపటికి గమ్మత్తుగా నిద్ర పట్టేసింది.

*  *  * 

మెలుకువ వచ్చేసరికి నా గదిలో రంగనాధం కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్నాడు. టైం చూశాను. మూడయ్యింది.

నువ్వెంతసేపయింది వచ్చిఅని అడిగాను.

అరగంట గడిచింది. నిన్ను లేపుదామనే వచ్చాను గాని, మళ్లీ నీ నిద్ర పాడుచెయ్యడ మెందుకులేమని వూరుకున్నాను. పాపం! బాగా అలిసిపోయావేమో మంచి నిద్ర పట్టినట్టుంది.

అవునన్నట్టు తలూపాను.

రా... అలా బాత్‍రూంలోకి వెళ్లి ముఖం కడుక్కుని వచ్చేయి. టీ తాగుదాం.

ముఖం కడుక్కుని బయట కొచ్చేసరికి హాల్లో సోఫాలో అందరూ కూర్చుని ఉన్నారు.

ప్లేట్లలో బిస్కట్లూ వగైరా ఉన్నాయి. తీసుకోఅన్నాడు రంగనాధం.

అందరితోపాటూ నేనూ మవునంగా బిస్కట్లు తింటున్నాను. ఉన్నట్టుండి కుసుమ మధ్యలో అడిగింది నన్ను, నిశ్శబ్దాన్ని భంగపరుస్తో -

బి. ఏ. తోనే ఆపారెందుకూ?”

అమ్మ పట్టుదలతో ఆమాత్రమైనా చదవగలిగాను. బి. ఏ. చదవాలని కూడా ఉండేదికాదు.

ఎందుకనిట.

నేనోసారి రంగనాధంవైపు చూచి అన్నాను.

ఆర్థికంగా మేము ఏమంత ఉన్నవాళ్లం కాము.

మా మాటల్లో రంగనాధం కలుగజేసుకున్నాడు.

ఈ సోదితో పనేమిటిగాని .... సాయంత్రం ప్రోగ్రాం ఆలోచించండి.

ఇవ్వాళ మా సమాజం తరఫున ఓ చిన్న ఫంక్షనుంది. నే నక్కడికి ఎటెండ్ కావాలిఅన్నది కుసుమ.

మరి నీ విషయం?” అని పద్మ నడిగాడు.

సారీ బావా! ఇవ్వాళ ఓ ఫ్రండుతో సినిమాకి వస్తా నన్నాను

బాగానే ఉంది. ఇక పోతే - నువ్వు, నేనే మిగిలింది. పోనీలే .... యివ్వాళ హాయిగా వూరంతా తిరుగుదాం.

నడిచే-అన్నది పద్మ.

కారుందిగాఅన్నాడు రంగనాధం.

అదేం కుదరదట బావోయ్! నే నిందాకే అడిగాను అక్కయ్యని కారుకోసం. ససేమిరా యివ్వనంది. కాబట్టి...

ఏం కుసుమా! నీకు కారుతో అవసరముందా?”

ఉన్నదనేగా పద్మతో చెప్పాను.

రంగనాధం - కేటిల్‍లో ఉన్న టీని కప్పుల్లో పోసి, తాను టీ తాగుతూ -

సరే కానివ్వండి. ఈరోజు కాకపోతే మరోరోజు వూరు చూడొచ్చు. ఇవ్వాళ్టికి మాత్రం మీ ఆఫీసు చూపిస్తాను. సాయంత్రం ఆఫీసు చూచిన తర్వాత పార్కులో సరదాగా కూర్చుని మాటాడుకుందాం. ఏమంటావ్?” అని నన్నడిగాడు.

తలూపాను సరేఅన్నట్టు.

మరో పదినిమిషాల్లో టీ తాగింతర్వాత - అక్కా చెల్లె ళ్లిద్దరూ, తమ తమ గదుల్లోకి వెళ్లిపోయారు మాటా మంచీ లేకుండానే.

రంగనాధం లేస్తూ అన్నాడు.

నువ్వు త్వరగా బట్టలు మార్చుకునిరా! వెడదాం.

-రిక్షామీద ఆఫీసుకు వెళ్లాం. గాంధీనగరంలో ఓ మూలగా, కొత్తగా కట్టారు మా ఆఫీసు. ఆఫీసు చూచింతర్వాత యిద్దరమూ అక్కడికి దగ్గర్లో ఉన్న పార్కులోకి వెళ్లి కూర్చున్నాం.

ఏమి టాలోచిస్తున్నావ్?” అన్నాడు రంగనాధం నా పరధ్యానాన్ని గమనించి.

అబ్బే! ఏం లేదు.

కాదు. ఏదో దాస్తున్నావ్. చెప్పు. లాభంలేదుఅన్నాడు.

చివరికి చెప్పక తప్పిందికాదు.

చక్కటి గది ఏదైనా ఆఫీసుకు దగ్గర్లో తీసుకోవాలని ఉన్నది.

అదేమిటోయ్! మధ్య గదీ గిదీ అని అంటున్నావ్? ఏం - మా బంగళా నచ్చలేదా ఏమిటి?”

బ్రహ్మాండంగా ఉన్నది.

మరి!

కాసేపు ఆలోచించి అన్నాను.

ఆఫీసుకు దూరం. అదే కారణం.

దూరమేమిటి దూరం. సరిగ్గ నడుస్తే ఓ పావుగంట పట్టదు. భోజన మంటావా? - నీ యిష్ట మొచ్చిన హోటల్లో చూచుకో. నువ్వు మాత్రం నాతోపాటు ఆ యింటో ఉండాల్సిందంతే... కాదనకు. రేపు నాకు పనుంది. కాబట్టి నువ్వు కాస్త పెందరాళే ఆఫీసుకు వెళ్లు.అని అన్నాడు.

దాదాపు అయిదున్నర గంటలక్కాబోలు-

వెంకటేశ్వరాలో కొత్త సినిమా ఆడుతోంది. పద-అని సినిమాహాలుకి రిక్షాని బేరమాడాడు. వెళ్లక తప్పింది కాదు.

 

3

ఉదయం పదిగంట లయింది.

ఆఫీసులో అడుగుపెట్టాను. ఎవరో కొద్దిమంది మాత్రం సీట్లలో కూర్చున్నారు. చాలాసీట్లు ఖాళీగా ఉన్నాయి. చివరంటా కూర్చున్న ఓ గుమాస్తా దగ్గరకు వెళ్లి, నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నేను వచ్చినపని చెప్పాను.

అతను నాకోవ్యక్తిని చూపిస్తూ అన్నాడు-

ఆయన హెడ్‍క్లార్కు. ఇంకాస్సేపటిలో ఆఫీస రొస్తారు. హెడ్‍క్లార్కుతో మీరొచ్చినపని చెప్పండి. మీరేం చెయ్యాలో ఆయనే చెప్తారు.అన్నాడు.

హెడ్‍క్లార్కు వయస్సుమళ్లిన వ్యక్తి. బట్టతల. కళ్లజోడులోంచి కాగితంలోకి తీక్షణంగా చూస్తున్నారు. ఆయన దగ్గరకు వెళ్లి నిలబడి నమస్కారంఅన్నాను.

ఆయన కూడా నమస్కారమని, తలెత్తకుండానే పని చేసుకుపోతున్నారు.

నా పేరు శంకరం!

అవుతే!అన్నారాయన రాసుకుంటూనే.

నేనేం మాటాడలేదు మళ్లీ.

మీ పేరు శంకరం .... అవుతే ....అని మళ్లీ అడిగారాయన.

నా ఎప్పాయింట్‍మెంట్ ఆర్డరూ, సర్టిఫికెట్లూ ఆయన ముందుంచాను. ఆయన అవన్నీ చూశారు. తలెత్తి నావైపు ఒకసారి చూచారు. బాగా యింత ముక్కుపొడుం ముక్కుల్లోకి దట్టించి చేతులు దులుపుకుంటూ అన్నారు-

కొత్త కేండిడేటు మీరేనా?”

తలూపాను.

అలా కూర్చోండి. కాసేపట్లో ఆఫీస రొస్తారు. ఇదుగో మిస్టర్ గుర్నాధం - యీయన కొత్త కాండిడేటు. కాస్త యీ డిటెయిల్స్ నోటు చేసుకోండి రిజిష్టర్లో. ఆఫీసరు రాగానే పుటప్ చెయ్యండిఅని తనక్కాస్త దగ్గర్లో కూర్చున్న గుమాస్తాని పిలిచి, నా సర్టిఫికెట్లూ - అప్పాయింట్‍మెంట్ ఆర్డరు యిచ్చారు. అతను నావైపు అదొకవిధంగా చూచి, సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లిపోయాడు.

దాదాపు పదకొండు గంటలకి ఆఫీస రొచ్చారు. ఆయన వచ్చీ రాగానే యిద్దరు గుమాస్తాలని పిలిచారు. గంటా, గంటన్నరపాటు వాళ్లతో ఏవో మాటాడారు.

తర్వాత నా యింటర్వ్యూ - అది అరగంట సేపు జరిగింది. నా సీటూ, నే చేయవలసినపనీ అన్నీను హెడ్‍క్లార్కు గారిని అడిగి తెలుసుకోమన్నారు. అలాగేనంటూ బయటకొచ్చాను.

ఈ కాసేపట్లోనూ ఆఫీసరుపైన నాకు కలిగిన అభిప్రాయం యిది : ఆయన వయస్సులో యువకుడే యింకా. ఎదుటివాడి మాటలన్నీ శ్రద్ధగా వింటారు. ఆయన నాతో జరిపిన అరగంట యింటర్వ్యూలోనూ మూడు సిగరెట్లు కాల్చిపారేశారు. ఓ పక్కన గోల్డ్‌ఫ్లాక్ టిన్నూ, మరోప్రక్క చార్మినార్ సిగరెట్టుపెట్టే ఉంటాయి. ముందస్తుగా గోల్డ్‌ఫ్లాక్, తర్వాత చార్మినార్ కాలుస్తుంటారు. ఇది నాకు విడ్డూర మనిపించినవిషయాల్లో ముఖ్యమైనది.

ఒక్క ముక్కలో ఆయనగురించి చెప్పాల్సొస్తే యిది చాలు - ఆయన చాలా ఏక్టివ్‍గా ఉంటారని.

హెడ్‍క్లార్కు నా సీటుగురించిన వివరాలు చెప్పారు. తర్వాత జాయినింగ్ రిపోర్టు నాచేత రాయించారు.

ఉద్యోగానికి ఆక్షణంలో శ్రీకారం చుట్టాను.

కాసేపటికి లం చవరన్నారు. అందరం కలిసి కేంటిన్ వైపు నడిచాం.

ఆఫీసు దగ్గర్లో - కేవలం మా ఆఫీసు బృందం కొరకే పెట్టినట్టు ఓ చిన్న కేంటి నుంది. లంచ్‍కి కేటాయించిన అరగంటా కేకల్తో, నవ్వుల్తో గడిచిపోయింది.

చాలామంది నాదగ్గరకొచ్చి నా వివరాలు కనుక్కున్నారు. కాని - నేనీ ఆఫీసులో అడుగుపెట్టి, నే నెవర్ని కలుసుకోవాలో చెప్పమని కనుక్కున్న గుమాస్తా మాత్రం, వాళ్లందర్లో కనుపించలేదు.

గుర్నాధం - ఎస్టాబ్లిష్‍మెంటు సెక్షన్లో అందెవేసిన చెయ్యిట. అతను చాలా విషయాలు గమ్మత్తుగా మాట్లాడ్తున్నాడు. లంచ్‍కి కేటాయించిన అరగంటలోనూ మా అందరికీ అతను ఓ పెద్దవక్త - మేమందరం శ్రోతలమూను. అతను మాటాడే విషయాలు నిమిషాని కొకటి చొప్పున మారినట్టు, చకచకా మార్చేస్తూంటాడు. ఇప్పుడు రాజకీయాలు, క్షణంలో సినిమాలు, తర్వాత ఆఫీసుపని ఆపైన స్వంతవిషయాలు. ఇలా అనర్గళంగా మాటాడ్డం అతనికి హాబీయేమో ననిపించింది.

కాఫీలు తాగింతర్వాత ఖాతాలు రాశారు. నెలంతా యిలా ఖాతా పుస్తకంలో రాసి, నెలాఖరుకు డబ్బులిచ్చుకోవడం వీళ్లందరికీ రివాజుట.

ఆఫీసుకొచ్చాం! ఇంకా అతనుఅలా కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. ఆఫీసులో అడుగుపెడ్తూనే అన్నాడు గుర్నాధం-

ప్రేయసికి ఉత్తరాలు రాస్తున్నాడ్రోయ్!... అయినా యివ్వాళ యింత దిగులుగా ముప్ఫైతారీఖు ఫోజు వేసుకుని ఉన్నాడేమిటీ?” అతని వెంట నున్న నలుగురైదుగురు గుమాస్తాలూ పక్కున నవ్వారు.

ఈ నవ్వు విని అతను తలెత్తి చూచాడు. మళ్లీ అంతలోనే తల దించుకున్నాడు.

నా సీట్లో కూర్చుంటూ అతనివైపు చూశాను. ఎందుకనో అతనిగురించి తెలుసుకోవాలనిపిస్తున్నది. అతను వీళ్లందరికీ దూరంగా తిరగటానికి కారణమేదో ఉంటుంది?

అందరూ నన్ను పలుకరించారు. నా వివరాలు అడిగారు. కాని అతను మాత్రం తనకేవీ పట్టనట్టు చాలా నిర్లిప్తంగా ఉన్నాడు. ఎందుకని?- ఏమైనా సరే, అతని గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను.

హెడ్‍క్లార్కు నా సీటు దగ్గరికి వచ్చి చెప్పారు.

వారం రోజుల్లో మిమ్మల్ని తయారుచేసే బాధ్యత నా కప్పగించారు ఆఫీసరు. కాబట్టి సాధ్యమైనంతవరకూ పనంతా నేర్చుకోండి. ఏదైనా అర్థంకాపోతే నన్నడగండి!అంటూ ముక్కు తుడుచుకుంటూ వెళ్లారాయన.

దాదాపు నాలుగ్గంటలక్కాబోలు ఆఫీసరు బయటికి వచ్చారు. ఆయన గౌరవార్థం అందరం లేచి నిలబడ్డాం. ఆయన హెడ్‍క్లార్కు నుద్దేసిస్తూ అన్నారు.

యస్. మిష్టర్ రాఘవయ్య! ఐ యామ్ గోయింగ్‍టు క్లబ్ - అర్జంటు కాగితాలుంటే అక్కడికి పంపించండి. రాజన్నా...జవాన్ను పిలిచారు.

ఆయ.

నువ్వు యింటికి వెళ్లు. కాస్త లేటుగా యింటి కొస్తానని చెప్పుఅని సిగరెట్టు కాల్చుకుంటూ ఆఫీసరు వెళ్లిపోయారు.

ఆయనలా వెళ్లారో లేదో ఆఫీసులో కలవరం బయల్దేరింది. నవ్వులూ, కేరింతాలు మొదలయ్యాయి. ఒక్కో సీటుదగ్గర యిద్దరూ, ముగ్గురూ చొప్పున నిలబడి బాతాఖానీ వేస్తున్నారు. ఇది ఆటవిడుపు కాబోలు. ఆఫీస రున్నంతసేపూ బుద్ధిమంతుల్లా నటించి, ఆయనటు వెళ్లంగానే హడావిడి చేసేస్తున్నారు. చాలామంది సిగరెట్లు ముట్టించారు.

ఇక్కడి యీ పద్ధతి చిత్రంగా ఉంది. ఇంత గోల జరుగుతూన్నా యిదేమిటని హెడ్‍క్లార్కు అడగటంలేదు. పైగా- తనూ బాతాఖానీలోకి దిగారు.

అతను మాత్రం - తనకేమీ పట్టనట్టు పనిచేస్తూనే ఉన్నాడు. నే నతని వైపు అలానే చూస్తూన్నాను. అప్రయత్నంగా అతనూ తలెత్తి నావైపు చూశాడు. చిన్నగా నవ్వాను పలుకరింపు చిహ్నంగా. అతనూ నవ్వాడు.

అయిదయింతర్వాత బయట కొచ్చేశాం. గుర్నాధం సైకిలు తొక్కుతూ నా పక్కనే వస్తూ అడిగాడు -

ఎక్కడుంటున్నారు?”

చెప్పాను.

భోజనం కూడా అక్కడేనా?”

లేదు. హోటల్లో భోంచెయ్యాలని ఉన్నది.

అవుతే - వసంతవిహార్‍లో తీసుకోండి. అక్కడ బావుంటుంది.

రెండు క్షణాలు గడిచాయి మవునంగా.

మీ రెక్కడ ఉంటున్నారు?” అని అడిగాను.

రామారావుపేటలో.

స్వంతవూరు-

పుట్టిందీ, పెరిగిందీ, చదివిందీ - ఆఖరికి ఉద్యోగం చేస్తున్నది కూడా యీ వూళ్లోనే.

ఆ తర్వాత మా ఆఫీసులో అతనిగురించి కావాలని అడిగాను.

అతని పేరు సుందరం. టెంపరరీగా ఎపాయింటయ్యాడు. టెక్కు ఎక్కువ. ఎవరితోనూ కలిసీ మెలిసీ తిరగడు. ఎంత యిదైనా మరీ అంత రిజర్వ్‍నెస్ తగదులెండి. కాస్సేపు కులాసాగా అందర్తోనూ మాటాడితే అతని సొమ్మేం పోయింది గనుక. పలుకే బంగార మయితే ఎలాగండి మరీను. అందుచేతనే మన ఆఫీసులో ఎవరికీ పడదుఅన్నాడు గుర్నాధం.

నాతోపాటు, ఆఫీసు విషయాలు మాటాడుతూ కొంతదూరం వచ్చాడు. అంతలో అతని మిత్రు డెవ్వరో కనిపించాడు. అతనితోపాటు కలిసి వెళ్లిపోయాడు గుర్నాధం.

కాఫీతాగి యింటికి బయల్దేరాను.

నే నింటికి వెళ్లేసరికి రంగనాధం తనపక్కనున్న వ్యక్తితో అన్నాడు.

ఇతనే మా ఫ్రండు శంకరం. వీరు మావయ్య

అని మా యిరువురికీ పరిచయం చేశాడు.

రంగనాధం మును పెప్పుడో చెప్పాడు మీ గురించి.

అతని ద్వారానే మీరూ యిదివరకే తెలిశారు.అన్నాను నవ్వుతూ.

గూడ్ .... చూడండి .... మా రంగనాధంగురించి చెప్పుకోకూడదు గాని - అతను అందర్లోనూ తలలో నాలికలా మెసుల్తుంటాడు. రోజులు కలిసిరావాలేగాని - నన్ను మించిన లాయరవుతాడు. ఈమాట నే నంటున్నది కాదనుకోండి - తోటి లాయర్లు అంటూంటారు రంగనాధం విషయం వచ్చినప్పుడల్లాను. ఆ ... అది సరేగాని నాయినా .... ఆ మీసాలాసామి వచ్చాడా?” అని అడిగారు రంగనాధాన్ని.

రాలేదు.

ఎప్పుడు వస్తాట్ట.

అది తెలీదు.

సరే .... కనుపిస్తే మాత్రం చెప్పు .... ఆ బకాయి పడ్డ పైకం ఎంత త్వరలో యిస్తే అంత మంచిదని. సరే .... నేనలా కామేశం యింటి దగ్గరికి వెళ్లి వస్తాను. మిత్రు లిద్దరూ మాట్లాడ్తూ ఉండండి.అంటూ ఆయన వెళ్లిపోయారు.

ఆయన వెళ్లిన కాసేపటికి రంగనాధం ఆయన గురించిలా చెప్పాడు -

మావయ్య వట్టి భోళామనిషి. ఏదీ దాచుకుని మాట్లాడేరకం కాదు. ఆవేశం వచ్చినా, ఆనందం కలిగినా పట్టలేరు. క్షణంక్రితం కోపంతో ధూమ్‍ధామ్‍లాడే మనిషి మరోక్షణం తర్వాత నవ్వుతూ పలుకరిస్తారు. ఈ మనిషిలో ఏది ఎప్పుడు ఎంతపని చేస్తుందో చెప్పడం కష్టం.”-

పరంధామయ్యగారి వాలకం చూచిన తర్వాత, రంగనాధం వెలిబుచ్చిన అభిప్రాయం నిజ మనిపించింది అక్షరాలా.

భోజనాలవేళకి కూడా ఆ యింటికి ఎవరూ తిరిగి రాలేదు. ఇంట్లో మిగిలున్న నేనూ, రంగనాధం మాత్రమే భోంచేశాం. తర్వాత కాస్సేపు మా అఫీసు విషయాలు మాటాడుకుని ఎవళ్ల గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయాము.

నిద్రపోయేముందు, ఇంతవరకూ జరిగిన విషయాలన్నీ అమ్మకీ, మూర్తికీ ఉత్తరాల్లో రాశాను.

ఎప్పుడో పదకొండు గంటల క్కాబోలు హాల్లో నవ్వులు వినిపించాయి. కుసుమా, పద్మా, పరంధామయ్యగారు మరో కొత్త కంఠం - నవ్వుతూ ఏవో విషయాలు మాటాడుకుంటున్నారు.

వీళ్లందరూ యిప్పుడే వచ్చారు కాబో లనుకున్నాను.

*  *  * 

రోజులు గడుస్తున్నాయి.

మా ఆఫీసులో అందరూ అర్థమవుతున్నారు. ఒకరిమీద మరొకరికి సదభిప్రాయం లేనేలేదు. అవుతే - అందరూ కలిసి ఉన్నప్పుడు మాత్రం ఎక్కడలేని అభిమానాలూ ఒలకపోస్తూంటారు.

ఆఫీసులో అంతా ఒకటి సుందర మొకటీనూ. సుందరం అభిమానంగల మనిషి. అతన్తో కావాలని స్నేహం చేశాను. ఈ స్నేహంవల్ల నేనంటే ఆఫీసులో చాలామందికి మంటగా ఉంటుంది. దీన్ని నే నెప్పుడూ పెద్దగా పట్టించుకోనేలేదు.

సుందరానిది రామచంద్రపురంట. బి. ఏ. పాసయ్యాడు. నాలాగే కొన్నాళ్లు నిరుద్యోగం - తర్వాత యీ టెంపరరీ గుమాస్తాగిరి. ఈ ఉద్యోగం ఏక్షణాన వూడపెరికి పారేస్తారో తెలీదు. దానికి తగ్గట్టు ఆఫీసు వాతావరణం అతని మనసుని కలవరపెడ్తోంది.

అవతలివ్యక్తి మనస్సుకు నచ్చినవాడైతే కలిసీ మెలిసీ తిరగొచ్చును కానీ యిలా అవకతవక బుద్ధుల్తో కిందా మీదా పడేవాళ్లంటే నాకు పడదని స్పష్టంగా చెప్పాడు సుందరం.

ఈ కారణాన్ని ఆసరాగా తీసుకుని, అతన్ని గేలి చేస్తూ, అతనిపైన స్కేండల్స్ప్రచారం చేస్తున్నారు ఆఫీసుబృందం.

నా భోజనం హోటల్లో ఏర్పాటు చేసుకున్నాను. కాపురం మాత్రం పరంధామయ్యగా రింట్లోనే. అయితే - యింకా ఆయింట్లో ఉండ బుద్ధిపుట్టడంలేదు. ఆ యింట్లో పద్ధతి నాకు రుచించలేదు. అక్కడున్నంతసేపూ ఏదో ముళ్లమీద కూర్చున్న ట్టనిపిస్తోంది. ఒక్క రంగనాధం మినహా ఆ యింట్లో మరెవ్వరూ నాతో మాటాడరు.

నాకోగది అద్దెకు తీసుకోవాలని ఉన్నదని రంగనాధంతో ఎప్పడికప్పుడు చెప్పాలనుకుంటాను - మళ్లీ యీ మాటతో అతని మనస్సెక్కడ నొప్పి పుడ్తుందోనని వూరకుంటున్నాను.

రంగనాధం - నే నూహించినంత అదృష్టవంతుడేమీ కాదు. అతనికి ఆ యింటి నాలుగ్గోడల మధ్యా స్వేచ్ఛ కరువయ్యింది. ఎవరూ అతన్ని లక్ష్యపెట్టరు. కట్టుకున్న భార్యకి - సమాజాలూ, వాటి సభలూ, వేడుకలూ - యివేగాని, ఒక్కనాడు గూడా అతన్తోపాటు నవ్వుతూ కబుర్లాడటం నేనింతవరకూ చూడనేలేదు.

ఇంక పద్మ విషయం చెప్పక్కర్లేదు. ఆ అమ్మాయెప్పుడూ బిజీగా ఉంటుంది. పిక్నిక్‍లూ, ప్రైవేటుక్లాసులూ ఆమెనోక్షణంగూడా తీరుబడిగా ఉండనివ్వవు. అధవా ఏదైనా రోజు యింటిపట్టున కూర్చున్నదంటే, ఆ యింటికి నలుగు రైదుగురు రావడం - గొంతులు చించుకుని మాటాడ్డం, పొట్టలు చెక్కలయ్యేట్టు పకపకా నవ్వడమూను. అప్పుడప్పుడు మోహన్రావనే కుర్రాడు (ఇతను పద్మ క్లాసుమేటుట) పద్మకోసం వస్తాడు. అతను కథలవీ రాస్తూంటాడట - స్థానికంగా అచ్చవుతూన్న పత్రికల్లో. అతను వచ్చిన లగాయితూ, తన కథలూ, వాటి థీములూ ట్రీట్‍మెంట్లూవగైరాలను అనర్గళంగా మాటాడేస్తాడు. పద్మకి అతని కథలంటే యిష్టం కాబోలు, చెవు లప్పగించి శ్రద్ధగా వింటుంది - అతను చెప్పే ప్రతి చిన్నవిషయమూను.

పరంధామయ్యగా రున్నారంటే - ఆయనకు కోర్టు గొడవలూ, రావలసిన ఫీజులూ, వేసిన వాయిదాలు వగైరాలతోనే సరిపోతుంది. ఇంటి విషయాలను అసలు బొత్తిగా పట్టించుకోరు.

చూస్తూన్న నాకే యిలా ఉంటే యింక రంగనాధం విషయం చెప్పనక్కరలేదు. అతను వాళ్ల చిన్నాన్నగారింటో ఎలా బ్రతికాడో యిక్కడా అలాగే బ్రతుకుతున్నాడు - కాకపోతే - అంతస్థు మారిందంతే.

ఓ రాత్రి కుసుమకీ రంగనాధానికీ చిన్న వాగ్వివాదం జరిగింది. ఆమె యింటికి లేటుగా రావడమే దీనిక్కారణం. రంగనాధం ఆమెను మందలించాడు కాబోలు - ఆమె బిగ్గరగా యిలా అన్నది.

అయినా మీరెవ్వరు నాకు చెప్పటానికి? నాకూ స్వేచ్ఛ ఉంది. ఆ విషయం మరిచిపోకండి. మీరు మీ ఫ్రండ్సుతో సినిమాకు వెళ్లినట్టే, నేనూ నా ఫ్రండ్సుతో వెడతాను. అయినా యిలా శాసించడం ఎప్పట్నుంచి నేర్చుకున్నా రేమిటి? ఎందుకిలా మారిపోతున్నారు?”

ఇంక తర్వాత రంగనాధం మాట నాకు వినిపించనేలేదు. ఓ గంటసేపటి వరకూ అటు తెలుగులోనూ, యిటు ఇంగ్లీషులోనూ కుసుమ రంగనాధాన్ని దెప్పిపొడుస్తూనే ఉన్నది. వింటున్న నాకే బాధ కలిగింది - రంగనాధ మెంత బాధ పడ్డాడో ఏమో?

ఆ యింటోనుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని నిశ్చయించుకున్నాను. ఆఫీసయింతర్వాత, గాంధినగరంలోనే అద్దెగది కోసం వెతికాను. నా అదృష్టం బావుండి పోయింది. ఎవరో ఒకాయన నాకో యిల్లు చూపిస్తూ అన్నాడు దాన్లో ఓ పోర్షను ఖాళీగా ఉన్నదని వెళ్లి వాకబు చెయ్యమని.

ఆ యింటిముందు నిలబడి ఏమండీఅని పిలిచాను.

దాదాపు నలభై యేళ్ల వయస్సుగలాయన తలుపు తీశాడు. ఎవరు కావాలంటూఅడిగాడు. నే నొచ్చినపని చెప్పాను. ఆయన బాధపడుతూ అన్నారు.

అయ్యో పాపం! మేము మూడు రోజుల క్రితమే యీ పోర్షన్‍లో దిగామండీ. బహుశా యీ పోర్షనింకా ఖాళీగా ఉంటుం దనుకుని ఆయన మీతో చెప్పివుంటారు.

నా మనస్సు చివుక్కుమంది - యీమాట వినడంతోనే.

ఆయన చెప్పగానే గది దొరికినంత సంతోషపడ్డానుఅన్నాను.

ఆయన నొచ్చుకున్నారో ఏమో .....

మీరంతగా యిబ్బందిపడ్తూంటే రేపో మాపో యిటు రండి. ఈలోగా యిక్క డెక్కడైనా గదులు దొరుకుతాయేమో.... కనుక్కుని చెప్తానుఅన్నాడు. థాంక్స్ చెప్పి కదలబోయాను.

ఒక్క క్షణం - మిమ్మల్నెక్కడో చూచినట్టు బాగా జ్ఞాపకం.అన్నారాయన. కొద్దిసేపు ఆగి అన్నట్టు - మీ పేరుఅని అడిగారు.

చెప్పాను.

ఎక్కడ పనిచేస్తున్నారు?”

అదీ చెప్పాను.

అరె... నా మతిమరుపు మండిపోనూ .... మిమ్మల్నింకా వీధిలోనే నుంచోబెట్టి మాటాడుతున్నాను. దయచేసి యిలా లోపలికి రండిఅని ఆహ్వానించారు.

ఇంట్లో కూచున్న తర్వాత -

అచ్చం మీలాగే ఉంటాడు - మా కృష్ణమూర్తి కొడుకు. వాళ్లది పాలకొల్లు. మిమ్మల్ని చూడగానే అతను గుర్తుకొచ్చాడు.

నేనేం మాట్లాడలేదు.

ఇదే కాకినాడలో పదేళ్లక్రితం యిళ్లు చాలా సులువుగా దొరికేవి. అద్దె కూడా చాలా తక్కువగూడాను. ఇప్పుడు చూస్తూంటే - అద్దె విషయం అలా పెట్టండి - ముందసలు యిళ్లు దొరకడమే కష్టమైపోతోంది. ఓ మిత్రుడి ద్వారా యీ పోర్షను అతి కష్టంమ్మీద దొరికిందిఅన్నారాయన నవ్వుతూ. తరువాత వంట గదివైపు చూస్తో-

అమ్మా సరోజా! వారిక్కాస్త కాఫీ కలుపుకు రామ్మాఅని అన్నారు.

అబ్బే ... నే నిప్పుడే కాఫీతాగి వస్తూన్నానండి. ఇప్పుడేం అఖ్కర్లేదు.

ఫర్వాలేదు. కాఫీయేగా. ఎన్నిసార్లయినా తాగొచ్చు. త్వరగా తీసుకురా తల్లీ.

రెండు క్షణాలు గడిచిం తర్వాత అడిగాను.

నా వివరాలు అడిగారు గాని - మీగురించి చెప్పనేలేదు.

ఆయన పేరు సీతారామయ్యగారుట. దగ్గర్లో ఉన్న ఓ పెల్లెటూరు స్వగ్రామంట. వాళ్ల పెద్దమ్మాయి నాలుగైదు నెలల్నుంచీ కడుపునొప్పితో బాధపడ్తూంటే - యిక్కడి హాస్పిటలుకి తీసుకొచ్చారుట. ఆపరేషను చెయ్యాలని అన్నారుట. కేవలం యీ పనిమీదనే తమ రెండోకూతురు సరోజతోపాటు యిక్కడి కొచ్చారు.

అంతలో ఆమె కాఫీ తీసుకొచ్చి మా కిచ్చింది. సీతారామయ్యగారు కాఫీ తీసుకొంటూ అన్నారు.

ఈ పిల్లే మా రెండో అమ్మాయి సరోజ. దీని చిన్నతనంలోనే తల్లి పోయింది. ఇక్క డెలాగో రెండు మూడు నెల లుండవలసి వస్తుందని, వంటా వార్పుకి యీ పిల్లనుగూడా తీసుకొచ్చేశాను. యసల్సీ చదువుతోంది. ఈ పని గురించి, చదువుక్కూడా స్వస్తి చెప్పించాను.

సరోజ మాకు దూరంగా, సిగ్గుతో నిలబడి వాళ్ల నాన్నగారు చెప్పుతున్నదంతా వింటోంది. దాదాపు అరగంటపాటు సీతారామయ్యగారు, వారి కుటుంబ పరిస్థితులగురించి మాటాడారు.

ఎందుకో చెప్పలేనుగాని - యీ కాస్త పరిచయంతోనూ, ఆయన నాకో బంధువులా మారిపోయారు.

ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని బయటకు వచ్చాను. సరే.... రేపో మాటిలా వస్తే ఏ సంగతీ చెప్తాను.అన్నారాయన.

అటునుంచి హోటలుకి వెళ్లి భోజనం ముగించి, పరంధామయ్యగారింటివైపు నడక ప్రారంభించాను. మళ్లీ ఆ యింటికి వెడుతున్నానని గుర్తుకి రాగానే కాస్త చిరాకు కలిగిన మాట వాస్తవం.

నేను యింటోకి అడుగు పెడ్తుండగా - క్రోటన్సు పక్కనుంచి సన్నగా మాటలు వినిపించాయి. నా పేరుగూడా ఆ మాటల్లో వినిపించడంచేత అటువైపు నడిచాను.

పద్మా మోహన్రావులు గడ్డిలో కూర్చుని మాటాడుకుంటున్నారు. పద్మ నా విషయం అతనితో చెప్తోంది-

అతను మా యింట్లో అడుగుపెట్టిన లగాయితూ మా బావ మారిపోయారు. మరితను బావ కేం నూరిపోశాడో ఏమోగాని, ఆయనగారు అక్కయ్యను సాధించడం మొదలెట్టారు. రాత్రి పెద్ద రభస జరిగిందికూడాను. ఎంత యిదైతే మాత్రం, ఇల్లరికం అల్లుడ్నని మరిచిపోయాడు కాబోలు. హు...అని యింకా ఏదో చెప్తోంది.

అక్కడ ఓ క్షణంకూడా వుండకుండా గబగబా నా గదిలోకి వచ్చేశాను.

రేపెలాగైనా యిక్కడ్నుంచి తప్పుకోడం మంచిది. అంతకీ యిల్లు దొరక్కపోతే - ఎలాగోలా సీతారామయ్యగార్ని వప్పించి, యిల్లు దొరికేంతవరకూ వాళ్ల పంచనే వుండటానికి నిశ్చయించాను.

ఆ రాత్రి నేను నిద్రపోయింది బహుకొద్ది గంటలు. తెల్లవర్తూనే గబగబా స్నానం గట్రా ముగించి, బట్టలు మార్చుకుని సీతారామయ్యగారింటివైపు బయల్దేరబోయాను.

ఇంతలో వరండాలో నవ్వులు వినిపించాయి. చూచాను. అంతే.... ఉలిక్కి పడ్డాను.

శారద. మరో ఆమెతో కుసుమను కలుసుకుంటాని క్కాబోలు వచ్చింది. శారదని పోల్చుకోడం ఏమంత కష్టం కాదు. కాలేజీ రోజుల్లో ఎల్లా వున్నదో యిప్పుడూ అల్లానే వున్నది.

ఆమెకు కనిపించడం నా కిష్టంలేదు. అందుచేతనే మళ్లీ నాగదిలోకి వచ్చి తలుపులు వేసుకున్నాను. హాల్లోంచి, వాళ్లు కుసుమ గదిలోకి వెళ్లేంతవరకూ వుండి, వెళ్లిపోయినట్టు గ్రహించి, గబగబా గదినుండి బయటకు వచ్చాను.

రోడ్డు ఎక్కింతర్వాత వేగంగా నడవడం ప్రారంభించాను. మరో పదినిముషాల్లో నా వెనుకనుంచి కుసుమ వాళ్లకారు ముందికి దూసుకు పోయింది. వెనకసీట్లో శారద స్పష్టంగా కనిపించింది.

శారద!....

కాలేజీరోజులు నా కళ్లముందు సినిమారోలులా తిరుగుతున్నాయి. జ్ఞాపకాలు, అనుభవాలూ - ఒక్కటొక్కటిగా నా ముందునుంచి కదుల్తున్నాయి....

శారద నా క్లాసుమేటు. ఆమెకు ఆవేశం ఎక్కువ. ఏ విషయాన్ని తరచిచూచే అలవాటు బొత్తిగా లేదు. నేను థర్డ్ యియర్ చదువుతుండగా శారద మాక్లాసులో చేరింది. ఆడపిల్లలు బి. కాం. చదవడమనేది బహు అరుదైన విషయం. ఎక్కడో నూటికీ, కోటికీ ఒక్కరన్నట్టు - ఎవరో చదువుతుంటారు. అలాంటి వాళ్లల్లో శారద ఒక్కర్తె.

వాళ్ల నాన్నగారు ట్రాన్స్ఫర్‍మీద యీ వూరు వచ్చార్ట.... వాళ్ల యిల్లు మాకు దగ్గర్లో వుండేది. కాలేజికి వెళ్లేప్పుడూ వచ్చేప్పుడూ ఆమె దార్లో కలుస్తూండేది.

ఓ రోజున ఆమె నా జాగ్రఫీ నోట్సు అడిగింది. ఇలా ఓ ఆడపిల్ల నన్ను నోట్సు యివ్వమని అడగడం ఓ విధంగా ఆశ్చర్యమయ్యింది. ఆమె నోట్సివ్వమని అడగటంలో కారణం లేక పోలేదు. క్లాసంతటిలోనూ నా రాత బావుంటుందని, అన్ని నోట్సులూ ఓపిగ్గా, నీటుగా రాస్తానని నాకు ప్రతీతి. నా నోట్సు యిచ్చాను. ఆమె రాసుకున్న తర్వాత తిరిగి యిచ్చింది.

ఇలా నాలుగైదుసార్లు జరిగింది. ఆమెకూ నాకూ పరిచయం వృద్ధి అయ్యింది. వాళ్లింటిక్కూడా ఆహ్వానించేది అప్పుడప్పుడూ. వాళ్ల నాన్నగారికి నన్ను పరిచయం చేసింది. ఆయన వయస్సులో పెద్దవారైనా, యిప్పటి యువకుల్లా మాటాడ్డం ఆయనకో హాబీ. ఈ హాబీకి నేను సరైన అవకాశ మయ్యాను.

సినిమాలూ, నవలలూ, - వీటిగురించి ఆయన ఎక్కువగా మాటాడేవారు. తన చిన్నతనపు రోజుల్లో స్నేహాలు - గురించి చెప్పేవారు. ఆయన చెప్పేవి వినడానికి బావున్నా - ఎందుకనో మరి కాస్త బిడియ పడ్తుండేవాడ్ని ఆయన ముందు.

ఒకనాడు స్వయంగా ఆయనే అడిగారిలా....

నువ్వు బాగా చదువుతావని మా శారద చెప్పింది. అదా మట్టిబుర్ర. నీకేం అభ్యంతరం లేకపోతే, వీలుదొరికి నప్పుడల్లా - దానికి అర్థంగాని పాఠాలు చెప్పరాదుటోయ్అని.

శారద నా గురించి ఆయనకు కాస్త ఎక్కువగా చెప్పి వుంటుంది. లేకపోతే.... ఏదో ఏవరేజిగా చదువుకుపోయే నాలాటివాడి గురించి అంత గొప్పగా చెప్పడమేమిటి?

అయితే నాకో ధైర్యమున్నది - శారద చదువులో ఎంత వరకున్నదో నాకు బాగా తెలిసింది - ఆమె మార్కులూ అవీ చూచిన తర్వాత. ఓ విధంగా ఆమెకంటె నేనే మెరుగు.

అప్పుడప్పుడూ చదువుకోడానికి శారద వాళ్ల యింటికి వెళ్లేవాడ్ని. నాకు తెలిసింది ఆమెకి చెప్పేవాడ్ని. ఒక్కోసారి పొరపాటున తప్పు చెప్పడం జరిగినా - అది తప్పేఅని గ్రహించ గలిగేది కాదు. మళ్లీ ఆ తప్పును నేనే దిద్దుకునేవాణ్ణి.

నేనేం చెప్పినా వినటం వరకే ఆమె వంతు. అంతేగాని ఫలానాది చెప్పండీఅనిగాని నాకా పాఠం అర్థం కాలేదనిగాని అడిగేది కాదు.

నేనిలా ఆ యింటితో సమ్మంధం పెట్టుకొనడంవల్ల శారద నాన్నగారికీ కాలక్షేపంగా వున్నది. బహుకొద్ది రోజుల్లోనే నేనూ ఆ యింట్లో సభ్యుడుగా తయారయ్యాను.

అప్పటికీ, యిప్పటికీ, ఎప్పటికీ కూడా శారదమీద నా కెలాంటి అభిప్రాయమూ లేదు.

కాని - శారద తొందరపడింది. ఆమెనా విధంగా అంతకు ముందు వూహించలేకపోయాను.

ఓనాడు-

ఆమె ఉద్రేకం కట్టలు తెంచుకున్నది. అంతా మరిచిపోయింది. తప్పటడుగు వేయబోయింది. మచ్చ తెచ్చుకో పోయింది.......

కూడదని హెచ్చరించాను. మందలించాను గూడా.

ఇంత జరుగబోతోందని తెలుస్తే యీ యింటి గడప తొక్కేవాణ్ణే కాదు. ఇలాంటి పిచ్చిపని మరోసారి తలపెట్టకు. సెలవు....

నేను వచ్చేముందు ఆమె కోపంతో వణికిపోతూ అన్నది.

దీనికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తావ్!

ఆ మాట విని నవ్వాను.

ప్రతిఫలం మాట అలా వుంచు - ఓ అర్భకురాలిని నైతికంగా రక్షించాననే గర్వం నా కెప్పుడూ ఉంటుంది శారదా!అని చెప్పి వచ్చేశాను.

ఆ తర్వాత పరీక్షలు - రిజల్ట్సు - అన్నీ జరిగాయి. శారద పరీక్షలో తప్పింది. మరి జీవితంలో?...

ఎన్నళ్టికో - అనుకోకుండా - ఆమెను చూచాను. పాత గాథ గుర్తుకు వచ్చింది. శారదమీద నా కిప్పటివరకూ కోపంగానే ఉన్నది. ఆమెను పలుకరించడమే కాదు కనీసం ముఖాన్నైనా చూడ బుద్ధి పుట్టడం లేదు.

సీతారామయ్యగారిల్లు చూడగానే నా ఆలోచనలకు బ్రేకు పడింది. ఆశగా ఆ యింటిముందు నిలబడి తలుపు తట్టాను. సరోజ తలుపు తీసింది. నాన్నగారు హాస్పిటలుకు వెళ్లి చాలాసేపయింది. కాస్సేపట్లో వచ్చేస్తారు. మీరూ అంతవరకూ కూర్చోమని చెప్పారు. రండి లోపలికిఅని నన్ను ఆహ్వానించింది.

లోపలికి వెళ్లి కూర్చున్నాను. నేను కూర్చున్న అయిదు నిమిషాలకి కాఫీ తీసుకొచ్చింది సరోజ.

ఏమిటండీ యీ కాఫీలు?”

పర్వాలేదు తీసుకోండి.

ఇలాగైతే నేను మీ యింటికి రావడం మానుకోవలసి వస్తుంది.

నాన్న వూరుకోరని తెలుసుగాఅన్నది అసలే పెద్దవైన కళ్లని మరింత పెద్దవి చేసి, నావైపు చూస్తో.

తీసుకోక తప్పింది కాదు. కాఫీ తాగుతూ అడిగాను.

నా అద్దె గది సంగతేమైనా తెలిసిందాండీ?”

నిన్న మీరలా వెళ్లగానే, నాన్న వాకబు చేశారు. ఈ వీధి చివర్లోనే ఓ పోర్షను ఖాళీగా ఉన్నదట. పాతిక రూపాయలు అద్దెట.

ఎగిరి గంతెయ్యా లనిపించింది.

చాలా సాయం చేశారు. అదీగాక - మీకు దగ్గర్లోనే యిల్లు కుదిర్చిపెట్టారు.

మీరు యీ ప్రాంతాల్లోనే ఉండాలని నాన్న ఉద్దేశ్యం.

ఎందుకనో నేనంటే ఆయనకంత శ్రద్ధ?”

నాకు తెలీదు.

అన్నానని కాదుగాని - నే నెవర్నో ముక్కూ మొగం తెలీనివాడ్ని. పరిచయమైన క్షణంనుంచీ గమనిస్తున్నాను. ఆయనకు నామీదున్న అభిమానాన్ని. కొందరు కలుపుగోలుతనంగా ఉంటారు. ఎదటివాడు మనసుకి నచ్చితే, ప్రాణాల్నైనా యివ్వటానికి సంసిద్ధు లవుతారు. దానికి పూర్వాపరాలు అనవసరం. ఇలాంటి కోవకి చెందుతరు సీతారామయ్య. నాకోసం శ్రమ తీసుకుని - చిటికెలో అద్దెగది ఏర్పాటు చేశారంటే ఆయన్నేమనాలి మరి?

ఓ పావుగంటలో సీతారామయ్యగారు వచ్చారు. వచ్చీ రావడంతోనే అన్నారు ఆనందంగా.

మీ అదృష్టం బావుండిపోయింది శంకరంగారూ! ఇక్కడికి చాలా దగ్గర్లోనే ఓ పోర్షను కుదిరింది. ఇంటివారు చాలా మంచివారు. భార్యాభర్తలు - ఇద్దరే ప్రస్తుతం ఆ యింటో కాపుర ముంటున్నారు.  ఆయనేమొ రిటైర్డు బడిపంతులుట. ఒకరి జోలి పట్టించుకునే తత్త్వం కాదు. మీ రెప్పుడు చేరతారో చెప్పేస్తే యింక నా బాధ్యత తీరిపోతుంది.

చాలా థాంక్సండీ. నా గురించి యింత శ్రమ -

దాన్లో శ్రమ ఏమున్నదండీ... ఆ... ఒకసారి ఆ యిల్లు గూడే చూస్తే సరిపోతుంది.అన్నారు.

ఆయనతోపాటు ఆ యింటివైపు వెళ్లాను. ఆ వీధికి చివరిగా ఉన్నది. పెంకుటిల్లు. చుట్టూ ప్రహరి. అయిదారు కొబ్బరిచెట్లు, మరింకా పాదులూ, పూలమొక్కలూ - ఆ పరిసరం చూస్తేనే చాలు మనసుకి హాయిగా ఉన్నది.

జానకిరామయ్యగారూ!అని సీతారామయ్యగారు పిలిచారు. పిలుపు విన్నంతనే ఓ ఏభై ఏళ్ల వ్యక్తి బయటికొచ్చారు.

వీరికోసమే నిన్న వచ్చాను. కాస్త ఆ భాగం చూపిస్తే వీరుగూడా చూస్తారు.

జానకిరామయ్య నన్ను చూస్తూనే కొయ్యబారి పోయాడు. ఏం మాట్లాడకుండా, అలాగే నావైపు చూస్తూ నిలబడిపోయారు. కళ్లజోడు తీసి, కళ్లు తుడుచుకుని మళ్లీ అలాగే చూస్తూన్నారు. ఈ పద్ధతి గమనించిన సీతారామయ్యగారు ఆయన్ను అడిగారు.

ముందు ఆ పోర్ష నొకసారి చూపించండి.

అప్పటిగ్గాని ఆయన తన చూపుని మళ్లించుకోలేదు.

మమ్మల్ని వెంటబెట్టుకుని లోనికి తీసుకెళ్లారు.

అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉన్నాయి. ఆ పోర్షను చిన్నదైనా నా ఒక్కడికీ చాలు. అయినా - యిలాంటి పరిస్థితుల్లో ఆ యిల్లు ఎలా ఉన్నా, అద్దె ఎంతైనా చేరిపోక తప్పదు.

చూశారుగా .... మీ యిష్టం కూడా చెప్పండి.అని అడిగారు నన్ను సీతారామయ్య.

సాయంత్రం పెట్టేబేడాతో వచ్చేస్తాను.

విన్నారుగా జానకిరామయ్యగారూ! అబ్బాయి సాయంత్రము వస్తారట. ఈలోగా పనిమనిషితో యింటిని కాస్త శుభ్రం చేయించండి.

అలాగేఅన్నారాయన పరధ్యానంగా.

మేము ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని రాబోతుండగా -

ఒక్కక్షణం ఆగుతారూ .... ఇదిగో .... ఏమేవ్ .... ఇలా ఒకసారి వస్తావూఅని ఆయన భార్యని పిలిచారు.

ఆవిడ వచ్చింతర్వాత -

చూడు యీ అబ్బాయి అచ్చం మన రఘు లా లేడూఅని అడిగారు.

ఆమె కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. ఆశ్చర్యపోయాను.

రఘూఆవిడ మెల్లిగా గొణుక్కుంది లోలోన.

నేనీ విచిత్ర సన్నివేశానికి తల్లడిల్లిపోయాను. ఇదేమిటి?... నిన్న సీతారామయ్యగారూ, యీవేళ వీళ్లూ - నన్ను ఎవర్తోనో పోలిక చేస్తున్నారు.

ఆవిడ కళ్లల్లో నీళ్లు చూచింతర్వాత నా మనసుండబట్టలేక అడిగేశాను.

రఘూ ఎవరండి?”

జానకిరామయ్యగారు నిట్టూర్చారు.

మాకో అబ్బాయి ఉండేవాడు. వాడు అచ్చం నీలాగే ఉండేవాడు. చదువుకుంటున్న రోజుల్లో ఎక్స్‍కర్షన్‍కంటూ రాజమండ్రి వెళ్లారు. గోదావరిలో స్నానం చేస్తూండగా - ఆ తల్లి .... మావాడ్ని కడుపున పెట్టుకుందిట....చివర్ని ఆయన కంఠం గాద్గదిక మయ్యింది.

నా మనస్సు చివుక్కుమంది.

పాపం....అన్నారు సీతారామయ్య.

జానకిరామయ్యగారి భార్యచూపు యింకా నా మీదనే ఉన్నది. ఆమె ముఖంలో దైన్యం స్పష్టంగా కనుపిస్తోంది కనుపిస్తోంది.

ఆ ... ఇక పదండి. సాయంత్రం తప్పకుండా వచ్చేయండి.అన్నారు సీతారామయ్య.

మీ కింతకుముందు అద్దె ఇరవై అయిదు రూపాయలని చెప్పాను. అంతివ్వక్కర్లేదు. ఓ యిరవై యివ్వు చాలుఅన్నారు జానకిరామయ్య.

ఇది విడ్డూరంగా తోచింది నాకు.

తను పోగొట్టుకున్న ఆత్మీయతను, ఆయన నాలో చూచివుంటారు. ఇది ఎంతపనైనా చేయించగల దనటానికి సాక్ష్యం ఆయ నిప్పుడు చెప్పిన అద్దె!...

వస్తానంటూ ఆ దంపతులకు చేతులు జోడించాను. ఆ యింటినుంచి బాగా దూరమైన తర్వాత వెనక్కు తిరిగి చూశాను.

వీధి వాకిట్లో నిలబడి ఆ యిద్దరూ మావైపు ఇంకా చూస్తూనే ఉన్నారు.

నిజంగా ... స్వర్గం సంపాయించుకున్నారు శంకరం గారూ.సీతారామయ్య, యిప్పటివరకూ జరిగినదాన్నిబట్టి యిలా అన్నారు.

నిజమే అనిపించింది.

ఆరోజు ఆఫీసులో కూడా సరదాగా గడిచింది.

*  *  * 

నేను ఆ యింటినుంచి వస్తూండగా రంగనాధ మన్నాడు.

వెళ్లు. నన్ను క్షమించి మాత్రం వెళ్లు శంకరం! జీవితంలో చాతగానివాణ్ణిగా తయారవుతున్నాను

అతని మాటల్లో బాధ స్పష్టంగా కనిపించింది.

ఛా .... అవేం మాటలూ?”

అతను పేలవంగా నవ్వాడు.

ఇంటో ఎవ్వరూ లేనట్టున్నారు?” అడిగాను.

ఎందుకూ? వెడుతున్నానని చెప్పటానికా? పిచ్చి శంకరం - నీ రాకపోకల్తో యిక్కడివాళ్ల కెవ్వరికీ సమ్మంధం లేదు. పైగా - నువ్విక్కడ్నుంచి ఎంత త్వరగా నిష్క్రమిస్తే అంత మంచిదనుకుంటున్నారు - నన్ను చూచిన తొలిక్షణం నా గురించి ఏదేదో తలచి ఉంటావు. ఇప్పుడు నే చెప్పకుండానే అంతా గ్రహించగలిగావు కదూ - ఒక సాలెగూడు నుంచి తప్పుకున్నా ననుకుంటే, వచ్చి మరో సాలెగూడులో చేరాను. అదృష్టం అందరిసొత్తూ కాదు. .... ఇంక వెళ్లు. వెధవ సోదితో నిన్ను విసిగిస్తున్నా కాబోలు!

రంగనాధాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. అతని దగ్గర సెలవు పుచ్చుకుని జానకిరామయ్యగారింటికి బయల్దేరాను పెట్టే బేడా రిక్షాలో వేయించి.

- ఆయన నన్ను రోడ్డుమీద చూస్తూనే అన్నారు.

ఇదిగో త్వరగా రా .... అబ్బాయి వచ్చేశాడు. నిన్నే త్వరగా రమ్మనడంలే.

ఆయన పద్ధతి చూస్తుంటే ఇప్పటివరకూ నా గురించి ఎదురుచూస్తున్నట్టుంది. నవ్వుకున్నాను.

రిక్షావాడు సామాను గదిలో పెట్టేడు. డబ్బులిచ్చి వాణ్ని పంపేశాను. ఏ దేవుడు పంపించాడో గాని - మళ్లీ యీ యింటో ఆనందం నింపటానికి వచ్చావ్ నాయనా.అన్నదావిడ.

ఆ దంపతుల ఆదరం చూస్తుంటే నాకు మతి పోతోంది. నిజంగా నేను వాళ్లబ్బాయినేమో ననిపించింది.

స్నానం చెయ్యమన్నారు. చేశాను. ఫలహారం, కాఫీ నాముందుంచి తీసుకోమన్నారు. తీసుకున్నాను.

ఆరోజు హోటలు భోజనానికి స్వస్తి చెప్పమన్నారు. ఆమె చేసిన అమృతంలాటి వంటతో కడుపారా భోంచేశాను. ఆవిడ పేరు అన్నపూర్ణమ్మ. పేరుకు తగ్గ మనిషి. అమ్మలాటి అమ్మ.

వాళ్లు చూపించిన వాత్సల్యానికి ముగ్ధుడ్నయ్యాను. నా యీ అదృష్టానికి గర్వించాను.

ఆరోజు రాత్రి సుఖంగా నిద్రపట్టింది.

 

4

మూడు నెలలు గడిచాయి.

జానకిరామయ్య దంపతులు నా పేరెప్పుడో మరచిపోయారు. నన్ను రఘూఅనే పిలుస్తున్నారు. నెల రోజుల్లో ఓ వారం రోజులు తప్పనిసరిగా ఆ యింట్లోనే చెయ్యి కడుక్కోవలసి వస్తున్నది.

అసలీ హోటలు భోజనం మానివెయ్యమని అన్నారు. నే నందుకు సుతరాము వప్పుకోలేదు. ఈ యింట్లో యింకా నే నుండా లనిపిస్తే - యీ విషయంలో నన్ను బలవంతం చెయ్యవద్దని చెప్పాను. అంతే - ఆనాటినుంచి నన్నీ విషయంలో వత్తిడి చెయ్యడం మానుకున్నారు.

అద్దె విషయం నేనే జాగ్రతా తీసుకునేవాడ్ని. అంతేగాని వాళ్లు అడిగేవారే కాదు. అప్పుడప్పుడూ నే నింటికి ఆలస్యంగా వస్తే చిన్నగా మందలించేవాళ్లు. నే నొచ్చేవరకూ వాళ్లు మేలుకుని ఉండేవారు. అక్కడికే రెండు మూడు సార్లు చెప్పిచూశాను కాని వాళ్లు వినలేదు.

మొదట్లో అన్నపూర్ణమ్మగారిని ఏమండిఅని పిలిచేవాణ్ణి. అలా పిలుస్తే పలకననీ పైగా సహించనని కూడా అన్నది. అమ్మాఅని పిలవమని కోరుకున్నది. నాలుగు రోజుల పాటు కొత్తయినా యిప్పుడా పదం అలవాటై పోయింది నాకు.

ఇక్కడ నాకు మరో అమ్మ దొరికింది!

ఆమెకు గుండెజబ్బు. రఘు పోయినప్పట్నుంచి ఆమె మానసికంగా కుమిలిపోతోంది. ఎన్నో మందులు వాడారు. వాడుతున్నారు. అయినా ఒక్కోసారి - ఆ గుండెజబ్బు ఉధృతంగా వస్తోంది.

ఆ దంపతులకూ - నాకూ ఉన్న అనుబంధాన్నితెంచుకోలేను. పగలంతా ఆఫీసు వాతావరణం చిరాకు కలిగిస్తుంది. ఆ చిరాకుని అన్నపూర్ణమ్మగారితో మాటాడుతూ మరిచి పోతూంటాను.

ఇక్కడి యీ విషయాలన్నీ మూర్తికి ఉత్తరంలో రాశాను. అతను జవాబులో యిలా అన్నాడు.

నువ్వనుభవిస్తూన్న తీపిని చెపుతూ నన్ను వూరిస్తున్నావు. అదృష్టమంటే నీది. ఈ లోకంలో యింతటి అనుబంధానికి మించిందేమీ లేదు. ఏనాడు చేసుకున్నావో పుణ్యం. ఈ విషయంలో నిన్ను చూస్తూంటే ఈర్ష్యగా ఉన్నది నాకు.

పగలూ, కక్షలూ, కుట్రలూ మధ్య నలిగిపోతూన్న మనకి అలాంటి ఆదరణ నిజంగా ఓ వరం! ధన్యుడివి నువ్వు.

అమ్మ కూడా సరిగ్గా యిలాగే రాసింది.

కన్నబిడ్డ దూరంలో ఉన్నాడనే దిగులుని మరపింపజేసే ఆ తల్లి దేవత నాయనా! ఇంక నీ బాగోగుల విషయంలో నాకే దిగులూ లేదు. ఆ తల్లికి నా వందనాలు అందజేయి.

ఈ విషయంలో నేను అమితంగా గర్వించాను. నా జీవితంలో - అమ్మ తర్వాత యీ జానకిరామయ్య దంపతులకే విలువ యిస్తాను.

ఇంక సరోజ వాళ్ల సంగతి :

మాటా మంచీ చెప్పుకోవడానికి సరైన నేస్తం సరోజ. క్షేమ సమాచారములు అనుక్షణం కనుక్కుంటూ, చేతనైన సాయం చెయ్యడంలో సీతారామయ్యగారు వెనకంజ వెయ్యరు. ఆ యిద్దరూ నన్ను గౌరవిస్తారు. వాళ్ల కీవూళ్లో బాగా పరిచయమున్న వ్యక్తుల్లో నేనే ముఖ్యుడ్ననిపించుకుంటాను.

సరోజకీ, నాకూ ఉన్న పరిచయాన్ని చూచిన యిద్దరు ముగ్గురు పరిచయస్థులు ఏవో చెవాకులు ప్రేలడం జరిగింది. అయినా యిది పట్టించుకునే తత్త్వం, నాకూ సరోజకూ కూడా లేదు. ఒక్కోనాడు సరోజను ప్రేమిస్తున్నానేమోనని కూడా అనిపిస్తుంది. అయినా యిదేం పెద్ద తప్పయిన విషయం కాదుగదా!

ఈ మధ్యనే సరోజ అక్కయ్యకు ఆపరేషను జరిగిందిట. మరో పదిహేను, ఇరవైరోజులు విశ్రాంతి అవసరమని ఆ తర్వాత డిస్చార్జి చేస్తారనీ సీతారామయ్యగారు చెప్పారు. అప్పటివరకూ యిక్కడే ఉంటారు. ఆ తర్వాత వాళ్ల స్వగృహం వెడతారట.

అప్పుడప్పుడూ అనుకుంటాను - సరోజ వాళ్ల వూరు వెళ్లిపోతే నాకేం తోస్తుందని? ... ఇదీ ఒక రకమైన బంధమేమరి.

ఆఫీసు గురించి చెప్పాల్సొస్తే - యీమధ్య మరీ దారుణంగా తయారవుతోంది వాతావరణం. ఒక రూలంటూ ఏదీలేదు. ఆఫీసరు పదకొండు తర్వాత వస్తారు. మళ్లీ నాలుగు తర్వాత వెళ్లిపోతారు. ఆయనొచ్చేముందూ, వెళ్లింతర్వాతా - అక్కడి గందరగోళం మహాభయంకరంగా ఉంటుంది. అడ్డమైన మాటలన్నీ వినాలి. నిందలు ప్రచారం చెయ్యటంలో సిద్ధహస్తులు చాలామంది ఉన్నారు. రోజూ ఏదో కీచులాట జరగాల్సిందే!

ఆఫీసంతటిలోనూ సుందరంపైన నాకు ఓ సదభిప్రాయం ఉన్నది. అతని గురించి చాలా తెలుసుకున్నాను. మా మధ్య పరిచయం వృద్ధి పొందింది. ఈ పరిచయాన్ని ఆఫీసు బృందం ఆమోదించలేదు. వృధా కారణంగా మాపైన కినుక వహించారు. సుందరంతోపాటు నేనూ ఓ విధంగా వెలివేయ పడ్డానేమో అనిపిస్తుంది వాళ్ల పద్ధతి చూస్తుంటే.

- ఆరోజు ఆఫీసులో ఓ దారుణమైన వార్త వినాల్సివచ్చింది. సుందరాన్ని ఊస్టుచెయ్యబోతున్నారట. నా మనసు చివుక్కుమంది. నిజమేనాఅని అడిగాను. నవ్వుతూ నిజమన్నట్టు తలూపాడు సుందరం.

ఆ సాయంత్రం అతన్తోపాటు అతని రూముకు వెళ్లాను.

ఓ మంచి స్నేహితుడు నాకు దూరమవుతున్నాడుఅన్నాను.

సుందరం నా భుజాన్ని నొక్కాడు.

అందరం ఒకేచోట ఉంటామనుకోడం పొరపాటు శంకరం గారూ! ఇలాగే రైలు ప్రయాణీకుల్లా - ఒకర్నొకరం ఎక్కడో ఎప్పుడో కలుసుకుంటాం. మళ్లీ విడిపోతాం. అవుతే - ఈ యాత్రలో కొన్ని జ్ఞాపకాలు మాత్రం - నిలిచిపోతాయి. నే నెక్కడున్నా మీరు గుర్తుంటారుఅన్నాడు సుందరం.

ఏమిటో చిత్రంగా ఉంటుంది అంతాను.

మనం కాలేజీలో చదువుకున్నాం.మన చుట్టూ స్నేహితులుండేవాళ్లు. జీవితంలో ఏదో సాధించాలనీ, ఏవో లక్ష్యాల్తో బ్రతకాలనీ కంకణం కట్టుకున్నాం. ఇప్పు డవన్నీ సింహావలోకనం చేస్తే తెలుస్తుంది - ఎవడు గెలిచాడో .... ఎవడు ఓడిపోయాడో. నువ్వే నేనన్నకొందరు ఇప్పుడు పలుకరించ రసలు. మరికొందరు అదృష్టవశాత్తూ లభించిన అంతస్థుకి దాసులై, ముఖం చాటుచేసుకోవటం - మూతి విరుచుకోడంలాటి పిచ్చిపనులు చేస్తున్నారు. కాలేజి వదిలింతర్వాత ఇలాంటి వెన్నో అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం.

అతను చెప్తున్నది సత్యానికి దగ్గరగా వున్నట్టు కనుపించింది. ఈనాడు ఆఫీసులో చాలామంది నన్ను అగౌరవ పరిచారు. ఓ చీడపురుగుని చూచినట్టు చూశారు. ఇది నా దౌర్భాగ్యమే శంకరంగారూ.... ఇలాంటి గుమాస్తా పని చేయాల్సివస్తుందని నే నేనాడూ గ్రహించలేదు. ఆ మాటకొస్తే ఈ ఉద్యోగం నా కిష్టంలేదు అప్పట్లో..... కాని అదృష్టం కలిసిరాలేదు. దౌర్భాగ్యం నన్ను నేలంటా తొక్కి పారేసింది.

అతను చెప్తున్నది వింటూన్నానంతే. మరికొన్ని క్షణాలు గడిచింతర్వాత అతనే అన్నాడు.

అదృష్టం ఒకరి సొత్తు కాదు. నే కట్టుకున్న గాలిమేడలు కూలిపోయాయి. ఎమ్మే చదివి లెక్చరర్ ఉద్యోగం చెయ్యాలని నా ఆశ. ఎందుకనోమరి అలాంటి పదవంటె నాకు విపరీతమైన మోజు. కానీ- బి. ఎ. పూర్తి చేసింతర్వాత ఆర్థిక ఇబ్బందులు నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఇక్కడ మీకో చక్కటి కథ చెప్పదలచుకున్నాను.

చెప్పండి. వింటాను.

ఇది కథ కాదు. కథలాటి ఒక అదృష్టవంతుని జాతకం. రామేశమని నాకో క్లాసుమేటు ఉండేవాడు. వాడు ఓ పోస్టుమాన్ కొడుకు. వాళ్లనాన్న కాలేజి కుర్రాళ్లకి ఉత్తరాలిస్తూ అనుకున్నాట్ట. మా అబ్బాయిని కూడా ఇలా కాలేజీ చదివిస్తే ఎంత బావుంటుందీఅని. అలా తలవడం ఆలస్యం - తన అభిప్రాయానికి నాంది వేసుకున్నాడు. తను సంపాయిస్తున్న దాన్లోనే కొంత మిగిల్చి కొడుక్కి జీతాలు కడ్తున్నాడు. వాడు చదివి, ప్రయోజకుడై, తనని ఉద్ధరిస్తాడనీ - పదిమందిలోను తన కృషికి విలువ తెస్తాడనీ ఆ తండ్రి ఆశ.

కాని..... వాడు వట్టి అల్లరివాడు. క్లాసుకి వచ్చేవాడు కాదు. వచ్చినా పాఠాలు వినేవాడు కాదు. నాటకాలంటె మోజు. దానికోసం ఎంత ఖర్చైనా చేస్తాడు. ఒక్కోసారి తన జీతం డబ్బులు కస్తా, నాటకాలకే పెట్టేవాడు. అది చాలదన్నట్టు ఇంట్లోనుంచి దొంగతనంగా డబ్బు తెచ్చేవాడు. సమాజాలంటూ, పరిషత్తులంటూ, పోటీలంటూ - చాలా బిజీగా తిరిగేవాడు.

వీడి ధోరణి చూచి ఆ తండ్రి ఆశ గుప్పుమని ఆరిపోయింది. ఆయన ఎందరికో చెప్పిచూశాడు వీడిని మంచిదారిన పెట్టమని. ఎవరివల్లా కాకపోయింది. పైగా- చదువుతూన్న మాలాంటివాళ్లని రామేశం గేలి చేస్తుండేవాడు. పుస్తకాల పురుగులూఅవటాని.

వాడు భ్రష్ఠుడయ్యాడని అందరం అనుకున్నాం. పరీక్షలు రాశాం. మేము పాసయ్యాము. వాడు తప్పాడు. ఇంటర్‍తోనే వాడి చదువు ఆగిపోయింది.

తర్వాత మేము బి. ఎ. చదవడం, ఇలాంటి ఉద్యోగాల్లో కాలుపెట్టడమూ మొదలైనవన్నీ జరిగాయి. ఇప్పుడు ఆ రామేశం గురించి ఆలోచిస్తూంటే మాకందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది.

ఎందుకనిట.

సుందరం నవ్వాడు.

వాడిప్పుడు రాంబాబు అనే పేరుతొ పెద్ద సినిమా నటుడైపోయాదు. లక్షలుకొద్దీ సంపాయిస్తున్నాడు. వాడు తన దర్వానుకిచ్చే జీతం - మేం సంపాయించలేకపోతూన్నాం. భ్రష్ఠుడైయ్యా డనుకున్నవాడు లక్షలు ఆర్జిస్తున్నాడు - చదివి ఏదో సాధిద్దామనుకున్నవాళ్లం ఇలా అనుక్షణం యాతన అనుభవిస్తూన్నాం. ఇప్పుడు చెప్పండి - అదృష్టం ఎవరిది?”

రాంబాబు కథ వినగానే చిత్రమనిపించింది. ఇలాంటివి ఇంకా ఎన్ని జరుగుతున్నాయో మరి?

సుందరం - తన కాలేజీ రోజుల గురించి ఆనాడు చాలా చెప్పాడు. ఇప్పుడు తనకు జరుగుతున్నదాన్ని ఆనాటితో పోల్చి, భేదాన్ని వివరించి చెప్పాడు.

సుందరం మాటలు వింటూంటే, మూర్తి గుర్తుకొచ్చాడు. అతన్తోపాటు ఆనర్సు చదివినవాళ్లలో కొందరిప్పుడు ఫారెన్ కూడా వెళ్లార్ట పెద్ద చదువుల గురించి. వాళ్లందరూ గుర్తుకొస్తుంటె ఇంత సైనేడు తిని ఈ పాడు బ్రతుక్కి స్వస్తి చెప్పాలని వుంది!అంటాడు మూర్తి, తన దురదృష్టానికి చింతిస్తో.

ఆ తర్వాత సుందరంతో కాసేపు మాటాడి, ఇంటికి వచ్చేశాను.

స్నానం ముగించి - జానకిరామయ్య దంపతులతో లోకాభిరామాయణం తిరగవేశాను. మా ఆఫీసు విషయాలు చెప్పాను. సుందరం గురించి నే చెప్పినదంతా విని అన్నపూర్ణమ్మగారు చింతించారు.

భోజనానికి వచ్చేముందు రంగనాధం వచ్చాడు. అతనితో పాటు హోటలుకి బయల్దేరాను. సరోజా ఇంటిమీదుగా వెళ్లాము. ఆ ఇంటికి తాళం వేసివున్నది. ఇలా నాలుగైదుసార్లు చూశాను, సరిగ్గా ఈ వేళప్పుడే. హాస్పిటల్‍కి వెళ్లేమని చెప్పారు. ఇవ్వాళ గూడా అక్కడికే వెళ్ళివుంటారనుకున్నాను.

దార్లో - సరోజ గురించి నన్ను అడిగాడు రామనాధం. చెప్పాను. అతను అంతా విన్న తర్వాత ఇలా అన్నాడు.

ఇంతెందుకూ ఆ పిల్లను ప్రేమిస్తున్నానని చెప్పరాదూ?”

కావచ్చు.

నాక్కావలసిన సమాధానం ఇదే. అయితే - నువ్వు ప్రేమించేముందు, వాళ్ల గురించి గూడా తెలుసుకోవాలిగా మరి?”

ఆ అవసరం నాకు లేదు.

అంటే?”

ఆమె కూడా నన్ను ప్రేమిస్తూ - పెళ్ళి చేసుకుంటానని అడుగుతే నిరభ్యంతరంగా వప్పుకుంటాను. లేదా - కేవలం స్నేహంగా ఉంటానన్నా సరేనంటాను.

చిత్రంగా మాట్లాడుతున్నావ్. ఆమె ని ప్రేమను తిరస్కరించి, స్నేహమే కావాలి అని అడుగుతే కృంగిపోవూ?”

అవన్నీ కథల్లో - అయినా ఇప్పడవన్నీ ఎందు కసలు?”

మనం ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి - మనల్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుంది?”

అసలంతవరకూ ఎందుకు రావాలి?”

పరిస్థితుల ప్రోద్బలం వల్ల

ఖర్మని దులుపుకుపోతే సరిపోయె.

అది నాచేత నవుతుందా?”

అసలింతకీ ఇదంతా ఎందుకు అడుగుతున్నావో చెప్పరాదూ?”

రంగనాధం రెండు క్షణాలు మవునంగా వుండి, తర్వాత అన్నాడు.

స్వార్థంకానీ లేదా కేవలం నా సుఖంకోసరంగానీ - చిన్నాన్న నా పెళ్లి కుసుమతో జరిపాడు. పెళ్లయిన కొత్తలో ఆమెను చూస్తూ నా అదృష్టానికి పొంగిపోయాను. కాని- ఈమధ్య నాకు ఆమెవల్ల సుఖం లేకపోతోంది. నా మాటని ఆ ఇంట్లో ఎవ్వరూ ఖాతరుచెయ్యరు. పైగా, వాళ్ల చెప్పుచేతల్లో బ్రతకాల్సి వస్తోంది.

సంసారం అన్నతర్వాత అనేకం జరుగుతుంటాయి. అవన్నీ పట్టించుక్కూర్చుంటె ఎల్లా.,.. సర్దుకుపోవాలిగాని.

ఈరోజు నేనో ఫూల్ నయ్యాను శంకరం.

ఏమిటన్నట్టు చూశాను.

పద్మ మోహన్రావ్‍ని ప్రేమించిందట. అతన్ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. కుసుమా, మావయ్యా ఇద్దరూ అంగీకరించారు. మోహన్రావ్ గురించి నాకు బాగా తెలుసు. అతను వట్టి చపలచిత్తుడు. ఈ మాటనే అన్నాను. దాంతో వాళ్లందరూ నా మీద విరుచుకుపడ్డారు. మా విషయాల్లో కలుగజేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలిఅని విసుక్కున్నారు. చెప్పద్దూ - యీమాట పడిత తర్వాత ఇంకా ఆ యింట్లో వుండా లనిపించడంలేదు. ఎక్కడికైనా పారిపోదామనిపిస్తున్నది.

ఛా..... ఏం మాట లివి!

చిన్నప్పట్నుంచీ నా చేతకానితనం నన్ను అడుగడుక్కీ కృంగతీస్తోంది. అసమర్థుడ్నిగా తయారు చేసింది.

పోనీలే.... అన్నీ మరిచిపో. మా హోటల్లో భోంచేసి, సినిమాకి వెడదాం పదఅని, అతన్ని బలవంతంపెట్టి ఆరోజు సినిమాకు తీసుకెళ్లాను.

ఇంటర్వెల్లులో రంగనాధం ఇక ఇంటికి పోదామని లేచాడు. అదేమిటని అడిగాను. వద్దు - ఈ సినిమా చూడలేనుఅన్నాడు. అప్పటిగ్గాని అర్థం కాలేదు నాకు - ఈ సినిమా కథకీ, రంగనాధం జీవితానికీ పోలికలున్నాయని.

మేము వచ్చేస్తూండగా - శారద కనిపించింది మరో ఇద్దరు స్త్రీలతో డ్రింకులు తాగుతూ. ఆమెను చూడగానే ముఖం తప్పించి, గబగబా రిక్షాలో ఎక్కేశాను రంగనాధంతో పాటు.

రిక్షా కదిలిన తర్వాత అనుకున్నాను శారదంటె భయపడుతున్నానా?’ అని.

* * *

మూడుత్తరా లొచ్చాయి.

ఒకటి అమ్మ దగ్గర్నుంచి - తమ్ముడు పరీక్షలకోసం బాగా చదువుతున్నాడని.

రెండు మూర్తి దగ్గర్నుంచి - బందరు విషయాలతో.

మూడు బావ దగ్గర్నుంచి! ఈ ఉత్తరం చూడగానే అదిరిపడ్డాను. ఏదో విశేషముంటుందని ఆత్రంగా చింపి చదివాను. దాన్లోవున్న విశేషాన్నిచదువుతూంటె నవ్వు పుట్టుకొచ్చింది.

వాళ్ల బాబాయి కూతురు సుశీల పి. యూ. సి. చదివి మానుకున్నదట. ఆమెకు పెళ్ళి చేయ్యాలని వాళ్ల ఉద్దేశ్యంటం. తగిన వరుడు - నేనని బావ నా పేరెఉ సజెష్ట్ చేశారుట. కాబట్టి వెంటనే పెళ్ళిచూపులకి రమ్మని రాశాడు.

ఒకనాడు, నన్నూ నా స్థితినీ యీసడించాడు బావ. ఈనాడు నాకో విలువ ఇచ్చాడు. నేను ఉద్యోగిని, నాలుగురాళ్లు సంపాయిస్తున్నవాడ్ని. ఇంతకంటె కావలసిన క్వాలిఫికేషన్లింకేం కావాలి?

మొత్తానికి బావ లౌక్యుడు! ఎవర్నెప్పుడు ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు.

వెంటనే ఆయనకు జాబు రాశాను - ఇంతలో పెళ్ళి చేసుకోవాలనే వాంఛలేదని, అలా ఏనాటికైనా కలుగుతే - నా పెళ్లి క్కావలసిన సంప్రదింపులు చెయ్యటానికి మా అమ్మ బ్రతికే ఉంటుందనీను.

అప్పటిగ్గాని నా మనసు స్థిమితపడింది కాదు.

ఆ సాయంత్రం ఈ విషయం సరోజతో అన్నాను పార్కులో. ఆమె అంతా విని అడిగింది....

అయితే మీరీ పెళ్లికి వప్పుకుంటారా?”

నువ్వు చెప్పరాదూ - ఒప్పుకోమంటావా?”

ఇది మీ స్వంత విషయం.

ఇంకా మనమధ్య స్వంత విషయాలేమిటీ?”

ఆమె తల వంచుకున్నది. ఏమీ మాట్లాడలేదు.

ఆ... అన్నట్టు మీ అక్కయ్య ఆరోగ్యం ఎలా ఉందిఅని అడిగాను.

మంచి మనుషులు బహు అరుదు. వాళ్లలో మీరొకరు.

ఈరకం జవాబుతో బలే ఆశ్చర్యపోయాను.

నే నడుగుతున్నదేమిటీ? నువ్వు చెప్పేదేమిటి?”

నిజం శంకరంగారూ! మీ స్నేహం నాకు చాలా నేర్పింది. బ్రతికున్నంతకాలం మీరు నాకు గుర్తుంటారు.

అబ్బా.... ఇవ్వాళ చాలా పెద్దమాట లంటున్నావ్. కారణం?”

ఏమీలేదు. ఎందుకనో ఈ రెండు ముక్కలూ చెప్పాలనుకున్నాను. చెప్పాను. మీరు త్వరగా పెళ్ళి చేసుకుంటె సంతోషిస్తాను.

ఎవర్ని?”

ఎవర్నో ఒకర్ని. మీ కిష్టమైనవార్ని.

చేసుకోమంటావా?”

వూ....

నన్ను పెళ్లి చేసుకోమని సలహా చెప్తూన్నావ్ గానీ.... మరి నీ పెళ్లో?”

నాకు పెళ్లా?”

అవును. ఏం?”

సరోజ పేలవంగా నవ్వేసింది.

ఏం? ఇంతలో చేసుకోవాలనిలేదా?”

అదిగాదు....ఆమె ఆగిపోయింది.

మరి?”

అబ్బే... ఏంలేదు.

ఏమిటి సరోజా.... ఇవ్వాళ అదోలా వున్నావ్అని నిగ్గదీసి అడిగాను.

ఆమె ఫక్కున నవ్వేసింది.

భలేవారేనే.... నేనదోలా వుండట మేమిటండీ.... ఇంక పదండి. చాలా పొద్దుపోయింది. నాన్న నాకోసం ఎదురు చూస్తుంటారుఅన్నది.

ఏం మాటాడుకోకుండానే నడుస్తున్నాం. సరోజలో కలిగిన ఈ మార్పుకి కారణం నా పెళ్ళి విషయమే కావచ్చు. అంటె - ఆమె నన్ను ప్రేమిస్తూనే వున్నదనటానికి ఈ నిదర్శనం చాలు....

ఇది జరిగిన రెండు రోజులూ తిరిగి సరోజ నాకు కనిపించనేలేదు. హాస్పిటల్‍కి వెళ్ళిందని సీతారామయ్యగారు చెప్పారు. ఈ రెండు రోజుల్లోనూ ఆయన్లో కూడా మార్పు కొట్టొచ్చినట్టు కనుపిస్తున్నది.

కారణాలు అనేక విధాలుగా ఊహించుకోడం మాత్రమే నావల్లనైనది; చేతయిందీను.

-సుందరం ఊస్ట్ అయ్యాడు.

ఆ సాయంత్రం స్టేషనువరకూ సాగనంపి వచ్చాను. దార్లో సరోజ వాళ్ల ఇంటిదగ్గర ఆగిపోయాను. సీతారామయ్య గారొక్కరూ ఆనాటి దినపత్రిక తిరగవేస్తూన్నారు. నా రాక గమనించి లోనికి ఆహ్వానించారు. వెళ్లాను.

సరోజ ఇంట్లో లేదాండి.

లేదు నాయనా, హాస్పిటలుకు వెళ్లింది. ఇంకాస్సేపట్లో నేనూ వెళ్లాలి.

ఆమె ఆరోగ్య మెలా వుంది?”

ఆయన నిట్టూర్చాడు.

ఇంకా దురదృష్టం మమ్మల్ని వెంటాడుతూనే వున్నది నాయనా. కోలుకుంటున్న రోగం కాస్తా ఇప్పుడు తిరగపెట్టింది. మళ్లీ వెనకటిస్థితికి తీసుకొచ్చింది. ఏం జరుగుతుందోనని భయంగా వుందిఅన్నా రాయన.

అరె... మరీ విషయం మాట వరసకైనా నాతో చెప్పనేలేదే?”

ఆయన నాకే జవాబూ ఇవ్వలేదు. అప్పుడనిపించింది. ఈ మూడురూజుల్నుంచీ తండ్రీ కూతుళ్లు ఎందుకు ముభావంగా ఉంటున్నారో... ఆమె అనారోగ్యం వీళ్ల మనసులు కలవర పెట్టింది కాబోలు....

ఆయన గొంతు నా ఆలోచనల మధ్య అడ్డుపడింది.

ఏమీ అనుకోపోతే నిన్నొకటి అడగాలని వుంది నాయనా

అడగండి. ఇంకా సందేహించట మెందుకూ?”

అహ... మరేమీ లేదు. ఇంకా ఇంటిదగ్గర్నుంచి డబ్బు రాలేదు. మొన్న తెచ్చిన పైకం కాస్తా ఇట్టే ఖర్చయిపోయింది. ఇప్పుడేమో అమ్మాయి మందుమాకులకి డబ్బు అర్జంటుగా కావలసి వచ్చింది.... అందుచేత....ఆయన చివరిమాటలు నాన్చి అన్నారు.

ఎంత కావాలిట?”

ప్రస్తుతానికి ఓ యాభై చాలు. మళ్లీ ఓ వారం రోజుల్లో సర్దుతాను. నీ దగ్గరుంటేనే ఇవ్వుసుమా. లేకపోతే మరోచోట ఎక్కడైనా చూచుకోవచ్చు......

అదేంకాదులెండి. నిన్ననే జీతాలిచ్చారు. తీసుకోండి. మళ్లీ మీ చేతిలో డబ్బున్నప్పుడు ఇవ్వచ్చు. ఇందఅని యాభై రూపాయలూ ఇచ్చాను.

ఏదో మాలో ఒకడివిగా తిరుగుతున్నావ్ కాబట్టి- చనువు బాగా వున్నది కాబట్టి అడిగాను కానీ- లేకపోతే అసలు అడిగేవాడ్నేకాను. లేదనకుండా అడగ్గానే ఇచ్చావ్.... అదే చాలుఅంటూ, పైకం తీసుకున్నారు సీతారామయ్య.

మరికొంతసేపు మాటాడి, ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని, ఇంటికొచ్చాను. నేను గుమ్మంలో అడుగుపెడ్తుండగా అన్నపూర్ణమ్మగారు అన్నారు-

నీకోసం ఎవ్వరో వచ్చారు నాయనా. నీ గదిలో వున్నారు వెళ్లు.

ఎవరా అనుకుంటూ, ఆత్రంగా గదిలోకి వెళ్లాను. చలపతి!.... హోల్డాలుమీద చతికిలపడి, సిగరెట్టు కాలుస్తూ, ఏదో చదువుకుంటూన్నాడు.

నువ్వా!అన్నాను ఆనందంగా.

వచ్చి చాల సేపయింది!

ఈ ఇల్లెలా కనుక్కున్నావ్!

మీ ఆఫీసు జవాను చూపించాడు. ఎక్కడున్నావ్ ఇంత సేపట్నుంచీ?”

ఓ ఫ్రెండుని రైలెక్కించి వచ్చాను.... లే... త్వరగా స్నానం చెయ్యి. భోజనానికి వెడదాం.

అట్నుంచి సినిమాగ్గూడా!

అలాగే.... ముందు స్నానం కానియ్యి.

స్నానాలు ముగించి, బట్టలు మార్చుకుని బజారువైపు బయల్దేరాము. హోటల్లో భోజనంచేసి సినిమాకు వెళ్లాము. సినిమా నడుస్తున్నదన్న మాటేగాని, మేము కబుర్లలో పడ్డాము. చలపతి వాడి యాత్రానుభవాలు గురించి చెప్పాడు. ఆ తర్వాత అన్నాడు.

ఇంటికి బయల్దేరాను తృప్తితో. ఇంక నాకు ఒకటి మిగిలింది.

ఏమిటది?”

చావు.

ఛా..... ఎవడ్రా వీడూ....

ఏ..... ఉన్నమాటన్నాను. క్షయరోగి చిరంజీవిట్రా నీ పిచ్చిగాని. ఇంతకుముందు నీవు సలహా ఇచ్చినట్టు ఏ శానిటోరియంలోనైనా చేరి, దిక్కుమాలిన చావు చస్తాను. బహుశా నీ కీ వార్త కూడా తెలీదనుకుంటాను. ఇదే కడసారి దర్శనం-

వాడి మాటలు వింటూంటే భయం కలిగింది. సినిమా అయింతర్వాత ఇంటికి వస్తూ గూడా, వాడు చావు గురించే చెప్పడం మొదలెట్టాడు. నాకు కోపం వచ్చింది. ఇలాంటి పిచ్చి మాటలంటే నేను సహించేది లేదని గట్టిగా చెప్పాను. అప్పటికీ వాడు వినలేదు.

నేను నీ దగ్గర మూడురోజులు మాత్రమే ఉంటాను. అప్పుడే ఒకరాత్రి గడిచిపోతోంది. ఇంకా రెండు రాత్రిళ్లుంటాయి. కనీసం ఈ రెండురోజులైనా నన్ను నా ఇష్టం వచ్చినట్టు మాటాడుకోనివ్వు. నీకు గుర్తుందో లేదోగాని - మనం చదువుకుంటూన్న రోజుల్లో నువ్వెప్పుడూ నా మాట కెదురుచెప్పేవాడివి కావు. పైగా నామాటే వేదవాక్కుగా భావించేవాడివి. ఇప్పుడూ నీనుంచి అదే కోరుకుంటున్నాఅన్నాడు చలపతి బాధగా.

వాడింత కష్టంగా మాటాడటం విడ్డూర మనిపించింది. అసలు నే నేమన్నానని వాడికింత కష్టం కలగటానికి?

ఇంటికొచ్చిన తర్వాత మా ఇద్దరికీ పక్కలు వేశాను. నిద్రపోవటానికి నడుం వాల్చాను. అయిదు నిమిషాలు జరిగాయో లేదో చలపతికి విపరీతమైన దగ్గు పుట్టుకొచ్చింది. ఆ తర్వాత రొప్పు.....

కూజాలో నీళ్లు గ్లాసులో పోసి తాగమని ఇచ్చాను. తాగాడు. గోడ కానుకుని కూర్చున్నాడు. నేనూ వాడిముందు కూర్చుని సిగరెట్టు ముట్టించాను.

ఈ దగ్గుతో రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. యమ యాతన అనుభవిస్తున్నా ననుకో.... సరే... పట్టని నిద్ర ఎల్లాగో పట్టదుగాని, ఏవైనా విషయాలుంటె చెప్పుదూ.

నా దగ్గరేమున్నాయిరా చెప్పటానికి. చెపితే నువ్వే చెప్పాలి.

సరిగ్గా ఇలాగే అనేవాడవు చదువుకుంటున్న రోజుల్లోఅని పేలవంగా నవ్వాడు చలపతి.

ఆ రోజులు గుర్తు చెయ్యగానే - చలపతి పాట అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది నాకు.

పోనీ.... పాట పాడగూడదూఅన్నాను.

నేనా?”

అవును.

చలపతి నవ్వి అన్నాడు.

పాటలు మానుకుని చాలా నాళ్లయింది.

ఇప్పుడు నా గురించైనా పాడు.

వాడేం మాట్లాడకుండా తలెత్తి పైకి చూస్తూ కూర్చున్నాడు.

ప్లీజ్.... ఒక్కపాట.

బ్రతిమాలించుకోడం నా కిష్టంలేదు. సరే.... ఏం పాట పాడనో గూడా నువ్వే చెప్పు.

చల్లగాలిలో యమునాతటిపై-

ఇది వినగానే వాడు నవ్వాడు. నా భుజం తట్టుతూ అన్నాడు. మంచి పాటనే కోరుకున్నావ్.... అదే నా కిష్టమైన పాటని గూడా తెలుసు నీకుఅని పాడటం మొదలుపెట్టాడు-

చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళీ....

ఉల్లము కొల్లగానే మధుగీతాలు

మెల్ల మెల్ల చెవి సోకునవే..... చల్ల

తరువు తరువు కడ డాగి డాగి

నన్నలయు కన్నుగవా మురుపులవే.... చల్ల

మురిసి మురిసి నా వెనుక దరిసి

కనుమూయు చివురు కెంగేళులివే.... చల్ల

తియ్యగా సాగుతోంది పాట. వాడి గొంతులో పెద్ద మార్పు కనిపించడం లేదు. వాడలా పాడుతోంటె- మా కాలేజీ ఆడిటోరియమూ - ఆ స్టేజీమీద చలపతి, అతని పక్కన రజనీ- అతని పాటను మెచ్చుకుంటూన్న ప్రేక్షకులూ- అన్నీ గుర్తు కొచ్చాయి.

అప్పటి వాడి స్థితిని, ఇప్పటిదాన్తో పోల్చుకు చూశాను. అప్రయత్నంగా నా కళ్లు చెమర్చాయి.

పాట అయిన తర్వాత చలపతి కళ్లు విప్పి నావైపు చూశాడు.

ఎందుకురా ఆ కన్నీరు?” అని అడిగాడు.

అబ్బే ఏం లేదుఅన్నాను కళ్లు తుడుచుకుంటూ.

దాచకు శంకరం. నాకు తెలుసు నీ మనసు. ఈ అభిమానాలూ, అనురాగాలూ మనిషిని లోబర్చుకుంటాయి. ఎంత తప్పించుకు తిరుగుదామన్నా సాధ్యంకాని పని, పోనీలే.... ఇక నిద్రపో.... నాకోసం నీ నిద్ర పాడుచేసుకోకుఅన్నాడు వాడు నడుం వాల్చుతూ.

నేనింకా అలాగే కూర్చుండిపోయాను.

లైటు వెలుగుతూంటె నాకు నిద్ర పట్టదని తెలిసి గూడా ఇంకా వుంచావేరా? ఆర్పెయ్యిఅన్నాడు.

లైటు ఆఫ్‍చేసి నిద్రపోవటానికి కళ్లు మూశాను. ఎలా పట్టిందోగాని, గాఢనిద్ర నన్నావరించింది ఆ రాత్రి. తెల్లవార్తూనే నా పక్కన చలపతివైపు చూశాను.

చలపతి లేడు!.....

ఆశ్చర్యపోయాను. అన్నపూర్ణమ్మగార్ని పిలిచి వాడి గురించి చెప్పాను. ఆవిడ మరీ ఆశ్చర్యపోయింది. గది అంతా గాలించి చూశాను. నా తలవైపున ఓ చిన్న కాగితం మడతపెట్టి వున్నది. విప్పి చదివాను.

నా ప్రాణంకెంటె ఎక్కువయిన శంకరం-

గాలికి కదిలే గడ్డిపరకలా తయారయ్యాను ఈమధ్య. మూడు రోజులపాటు నీ దగ్గర వుంటానని చెప్పి, ఓ రాత్రికి రాత్రి పారిపోతున్నాను. కారణం అడగవద్దు.

క్షయరోగిని. నన్నెవరూ తాకరాదు. అలాంటిది నన్ను ఆదరించావ్- నీ నా మధ్య గడిచిన ఈ కొద్ది గంటలూ చాలు- మన స్నేహాన్ని నిరూపించటానికి.

ఇదే స్నేహం- నీనుంచి వచ్చే జన్మలో గూడా ఆశిస్తూ-

చలపతి.

ఆ ఉత్తరం చదివి కుప్పలా కూలిపోయాను. కుమిలి కుమిలి ఏడిచాను. భగవాన్.... చలపతిని బ్రతికించు!

అన్నపూర్ణమ్మగారు నా భుజం తట్టింది!

భగవాన్.... చలపతిని బ్రతికించు!

అన్నపూర్ణమ్మగారు నా భుజం తట్టింది!

దిగులుపడకు నాయనా- దైవం అనుకూలిస్తే మళ్లీ అతను కోలుకోవచ్చు. కాని.... మనిషిలో ఎంత దాచుకుందామని ప్రయత్నిస్తూన్నా, భయం కనిపిస్తూనే వున్నది. ఏదీ నిర్ణయించుకోలేని స్థితిలో వున్నాడు. అందుకే ఒక రాత్రికి రాత్రి ఇలా వెళ్ళిపోయాడు....అన్నదామె. చలపతి వాలకం ఇప్పటివరకూ గమనించి.

నిజమని తోచింది నాకు.

 

5

మావయ్య ఉత్తరం రాశాడు.

ఆ ఉత్తరంలో రాధ అత్తవారింట్లో ఎంత బాధపడ్తున్నదీ, ఎన్ని సాధింపులకి గురి అవుతున్నదీ వివరించి రాశాడు.

రాధ సుఖాన్ని ఆశించి- గొప్పింటి కోడల్ని చేశాను గాని యిలా దాని సంసారం అఘోరిస్తుందనుకోలేదు. దూరపు కొండలు నునుపన్నమాట నిజం. దానికా యింటో సుఖంలేదు. చూచినవాళ్లు చాలామంది చెప్పారు- నరకం అనుభవిస్తోందని.

నువ్వొకసారి ఆ ఇంటికి వెళ్ళి, రాధను చూచిరా. దాన్నెలాటి పరిస్థితుల్లో చూశావో నాకు రాయి. రాజమండ్రిలో వాళ్ల అడ్రసుని ఈ క్రింద రాస్తున్నాను. జాప్యం చేయవద్దు. వెంటనే రాజమండ్రి వెళ్లి, అక్కడ సంగతులతో నాకు జాబు రాయి.

ఆశీస్సులతో

మీ మావయ్య.

ఆ ఉత్తరం చదివిన తర్వాత నేను చాలా నొచ్చుకున్నాను. నాలాటి దౌర్భాగ్యుడ్ని పెళ్లి చేసుకోకపోవటమే ఆమె అదృష్టమని నేనూ అనుకున్నాను. చివరికి రాధ సంసారం ఇలాటి పరిణామము తెస్తుందని తలచలేదు.

రాధను చూచి ఎన్నాళ్లో అయింది. ఇప్పుడెలా వుందో చూచి రావాలి. పైగా- మావయ్య గూడా ఉత్తరం రాశాడాయె ఓసారి వెళ్లిరమ్మని.

రెండురోజులు సెలవుకోసం ఆఫీసర్ను అడిగాను. ఆయన ఏ మూడ్‍లో వున్నారోగాని, అడిగిందే తడవుగా సెలవు మంజూరు చేశారు. అన్నపూర్ణమ్మగారితో చెప్పి, రైలెక్కాను.

రాజమండ్రిలో దిగే వేళకి బాగా సాయంత్రమయింది. మావయ్య ఇచ్చిన అడ్రస్సు నొకసారి చూచుకున్నాను. అక్కడికి రిక్షా మాటాడుకుని వెళ్లాను.

ఆ ఇంటిముందు రిక్షా దిగి, ఆవరణలోకి అడుగు పెట్టాను. ఓ పదేళ్ల కుర్రాడు బొంగరాలాడుతున్నాడు. అతన్ని పిలిచి అడిగాను.

ఇది రాజారావుగారిల్లేనా?”

అవునంటూ వాడు తలూపాడు.

ఇంట్లో వున్నారా?”

లేడువాడు బొంగరానికి తాడు చుడుతూ అన్నాడు.

ఎక్కడికి వెళ్లారు?”

నా మాటలు వినిపించుకునే ఓపికా, తీరుబడి వాడికి లేవేమో మరి- జవాబు చెప్పకుండానే, బొంగరాన్ని నేలమీదికి వదిలాడు. అది గిర్రున తిరుగుతూంటె దానివంక కన్నార్పకుండా చూస్తున్నాడు.

రాజారావు నీ కేమవుతారు.

ఈ ప్రశ్నలు వాడికి చిరాకు కలిగించాయేమో మావయ్య-అన్నాడు విసుగ్గా.

మరి.... మీ రాధత్తయ్య వున్నదా?”

సరిగ్గా ఆ సమయానికే బొంగరం హఠాత్తుగా ఆగిపోయింది. దాంతో వాడికోపం కట్టలు తెంచుకుంది.

ఏమోనండీ.... అవన్నీ లోపలికెళ్లి కనుక్కోండిఅన్నాడు.

మా ఇద్దరికీ జరుగుతూన్న సంభాషణ వినిపించిందేమో, ఇంట్లోంచి రాధ గబగబా వీధి గుమ్మం దగ్గరకొచ్చి నిలబడింది. నన్ను చూడగానే అలా బొమ్మలా నించుండిపోయింది. నేను రెండడుగులు ముందుకు వేశాను.

నువ్వా.... క్షేమమా?” అని అడిగింది.

తలూపాను నవ్వుతూ.

రా.... లోపలికొచ్చి కూర్చో....అంటూ నన్ను ఆహ్వానించింది. గోడకానించివున్న పడక్కుర్చీ వేసి, కూర్చోమన్నది.

ఏమిటిలా ఉత్తరం పత్తరమైనా లేకుండా వూడిపడ్డావ్?”

మరే........

రాధ నావైపు పరీక్షగా చూచి అడిగింది. హోటలు భోజనం కాబోలు- బాగా చిక్కిపోయావు.

అవును.

ఒక్కక్షణం! కాళ్లకు నీళ్లు తీసుకొస్తానుండుఅంటూ గబగబా పెరటివైపు వెళ్ళింది.

రాధ!- చేతులనిండా మసి, మాసిపోయిన చీర, లోతుకు పోయిన కళ్లు, తైలసంస్కారం లేక చిందరవందరైన జుత్తు. పాపం.... ఎంత ఆస్తి వుంటేమాత్రం ఏం లాభం, సుఖమన్నది దూరమైన తర్వాత.

లే.... కాళ్లు కడుక్కోఅని నీళ్లచెంబు గుమ్మం దగ్గర పెట్టింది.

కాళ్లు కడుక్కోడానికి లేచాను. సరిగ్గా ఈ సమయంలోనే ఓ లావుపాటి స్త్రీ, కళ్లజోడు సవరించుకుంటూ నావైపు విచిత్రంగా చూస్తో అడిగింది.

ఎవరే?”

మా బావఅన్నది రాధ.

మీ బావ.... ఓహో.... మీ అత్తయ్య కొడుక్కాబోలు. ఎప్పుడొచ్చాడేవిటే?”

ఇప్పుడే!

అహ.... అలాగా....అంటూ ఆమె ఇంటో కెళ్లిపోయింది.

ఆమె వెళ్లింతర్వాత, నాకు తువాలిస్తూ అన్నది రాధ- మా అత్తయ్య. పేరు శాంతమ్మ.

ఆ ఇంట్లో జనాభా మొత్తం ఆరుగురుట. రాధ, రాజారావు, రాధ మావయ్య, అత్తయ్య, ఇందాక బొంగరాలాడుకుంటూన్న కుర్రాడు, వాడి అమ్మాను. ఆమె (రాధ ఆడబడుచు) ఈ మధ్యనే మొగుడితో పోట్లాడి పుట్టింటికి వచ్చిందిట పిల్లాడితో సహా.

ఎంతసేపు కూర్చున్నా- రాధ ఒక్కర్తె నాతో మాటాడుతుంది. అంతేగాని, ఆ యింటోవున్న మరెవ్వరూ కనీసం ఎప్పుడొచ్చావూఅని అడగనైనా లేదు.

అక్కడ కూర్చుని వుంటె ఏదో ముళ్లమీద కూర్చున్నట్టనిపించింది. అందుచేత అలా బజారు వెళ్లొద్దామని లేచాను.

ఎక్కడికి.... వున్నట్టుండి లేచావూ?”

అలా బజారు వెళ్లొద్దామని....

ఒక్కక్షణం- కాఫీ కాచి తెస్తాను.

వద్దు.... బజార్లోనే తాగుతాను. అది సరేగాని, రాజారావు యింట్లో లేడా?”

పనిమీద ఏలూరు వెళ్లారు. కాసేపట్లో వచ్చేస్తారు.

ఊహు.... అలాగా.... సరే.... మరోగంటలో తిరిగొస్తాను.

అని రాధకి చెప్పి, బజారువైపు నడక సాగించాను. రాధలో కనుపిస్తూన్న కళే చాలు- ఆమె ఎంత నికృష్ఠంగా ఇక్కడ బ్రతుకుతుందో చెప్పటానికి.

తెలీని వూళ్లో, తెలిసినట్టు తిరగడం నాకో సరదా... రాజమండ్రిరోడ్లు బాగా పరిచయ మున్నవాడిలా నడుస్తూన్నాను దిక్కులు గట్రా చూడకుండా.

ఒరేయ్ శంకరంఅని పిలిచారు.

ఆగిపోయి చుట్టూ చూశాను- ఈవూళ్లో నన్ను తెలిసిన వాళ్లెవరా అని. ఓ పదిహేను గజాల దూరంలో నాలుగిళ్లవతల ఓ యింటి గుమ్మంముందు పిల్లాడ్నెత్తుకుని నిలబడ్డాడు ముకుందం!....

వాడిని చూడగానే గబగబా వెనక్కువచ్చి అన్నాను.

నువ్వట్రా ముకుందం.

ఎన్నాళ్టికి చూశారా నిన్ను.... మొదట్లో నువ్వో కాదో అని సంశయించానుగాని, తీరా నీ నడక గమనించిన తర్వాత నువ్వే అనుకున్నాను. ఆ.... కులాసా?”

చాలా మారిపోయావురా ముకుందం. అప్పట్లో పూచిక పుల్లలా సన్నగా వుండేవాడివి. ఇప్పుడేమొ-

ఏనుగుగున్నలా లావయానంటావ్.... రా.... రా.... లోపల కూర్చుని మాటాడుకుందాం.

మేము కూర్చున్న గది చిన్నదైనా, నీటుగా అలంకరించబడి వున్నది. రేడియో వాల్యూమ్తగ్గించాడు.

కాకినాడలో ఉద్యోగం చేస్తున్నావటగా.... తెలిసింది

అవును.

ఏమిటిలా దయచేశావ్?”

చుట్టంచూపుకి వచ్చానుగాని- వీడు నీ సుపుత్రుడా?” అనడిగాను, వాడి వడిలో పిల్లాడ్ని చూస్తూ,

అవున్రా. వంశోద్ధారకుడు. వీడి పేరు అరవసినిమా డైలాగులా ఎంత పెద్దదో తెలుసా.... వీరవేంకట శివసత్యపూర్ణ వరప్రసాదశర్మ.... మా అమ్మా, నాన్న, మా అత్తయ్యా, మావయ్యా, నేనూ, మా ఆవిడా- ఇంతమందిమి కూర్చుని కూడ బలుక్కుని వీడిపేరు తయారుచేశాం. సంవత్సరం మొన్న డిశంబరులో పూర్తయింది. కాని శంకరం- వీడంత గడుగ్గాయి మా అక్కయ్య పిల్లల్లో కూడా లేరనుకో. ఏడుపు మొదలెట్టినా, కేరింతాలు ప్రారంభించినా ఇంక ఆపడమంటూ వుండదు. అరే నాన్నా! మీ మావొచ్చాడు గానీ- ఏదీ నీ ప్రతాపం చూపించు....అంటూ వాడి లేతబుగ్గలమీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ పిలాడేమో ముకుందం సన్నటి మీసాలవంక దీక్షగా చూస్తున్నాడు.

ముకుందం ఓ బిడ్డ తండ్రయ్యాడు! ఆ పసివాడి గురించి అడక్కపోయినా, పనిగట్టుకుని గడగడా వాగేశాడు! నా భార్యా, నా పిల్లలూఅని చెప్పుకోడంలో గూడా అనిర్వచనీయమైన ఆనందం ఉంటుందని ముకుందం నిరూపించాడు.

నాలుగేళ్ల క్రితం ఈ ముకుందం ఫస్టుక్లాసు గడుగ్గాయి స్టూడెంటు. ఆడపిల్లలకి మారుపేర్లు తగిలించడంలో సిద్ధహస్తుడు. ప్రభావతికి సింగిల్‍రోజ్అని నామకరణం చేసింది వీడే. ఆమె రెండు జడలు వేసుకుని, ఒక జడలో మాత్రమే గులాబిపువ్వుపెట్టుకుని కాలీజీకి వచ్చేది. ప్రభావతి అంటె ముకుందానికి వల్లమాలిన అభిమానం. సర్వవేళలా ఆమె నీడలా అంటిపెట్టుకుని వెంబడించడం ఒక హాబీ. ఓనాడు ఆ అమ్మాయి వీడి ఆగడం చూచి చెంపపెట్టు పెట్టబోయి, కోపాన్ని సంహరించుకుని, ఛీకొట్టి పంపింది. అంతే- ఆనాటినుంచి మళ్లీ ప్రభావతి పేరెత్తేవాడు కాడు. అంతమాత్రానికే అమ్మాయిల జోలికి పోకుండా బుద్ధిగా వున్నాడా అంటే అదీ కాదు. తర్వాత ఉషారాణిమీద కవిత్వం ప్రారంభించాడు.

అల్లాంటి ముకుందం ఈనాడు గృహస్థు.

ఏమిట్రా ఆలోచిస్తూన్నావ్... మాటా మంచీ లేకుండానుఅన్నాడు ముకుందం.

ప్రభావతీ - ఉషారాణి గుర్తుకొస్తేనూ!

ఉష్! గట్టిగా అరవకురా బాబూ! ఇంటిది విన్నదంటే నా ప్రాణాలు తోడేయగలదు. అన్నట్టు మా ఆవిడ్ని పరిచయం చేయలేదుగదూ... ఇదిగో... జానకీ....అని పిలిచాడు లోపల గదివైపు చూస్తో.

వస్తూన్నాఅని అంటూ, ఆమె మా గదిలోకి వచ్చింది.

ఈవిడేరా నా శ్రీమతి. వీడు శంకరమని నా క్లాసుమేటు. ప్రస్తుతం కాకినాడలో అఘోరిస్తున్నాడు. చూడూ... రాకరాక మనింటికి వచ్చాడు- ఇప్పుడు మా యిద్దరికీ చాలా అందమైన కాఫీ తయారు చెయ్యాలి మరి. వెళ్లుఅన్నాడు.

ఆమె వంటగదిలోకి నడిచింది.

నీపేరు చెప్పుకునైనా రెండోమారు తాగుతూన్నా కాఫీ. లేకపోతే సరిగ్గా అయిదు గంటలకన్నట్టు ఒకసారే కాఫీ ఇస్తుంది. ఆ తర్వాత చచ్చి గీపెట్టినా కాఫీమాట ఎత్తకూడదు. కాఫీ తయారు చెయ్యడంలో మా ఆవిడని అభినందించాల్సిందే. ఇంకా కాసేపట్లో తాగుతావ్‍గా. తాగింతర్వాత నువ్వే అంటావ్ బ్రహ్మాండమని.

వాడు ఏం మాటాడినా, ఎంతసేపు మాటాడినా కేవలం సంసారం గురించేలా కనుపిస్తోంది. వాడి భార్యా, ఆవిడ తయారు చేసే కాఫీ- వాడి పిల్లాడూ, వాడు చేసే అల్లరీ.... పెళ్లయింతర్వాత ఎవరైనా యిలాగే మారిపోతారు కాబోలు.

అన్నట్టు ఇక్కడ ఎవరో చుట్టాలింటికి వచ్చానని చెప్పావుకదూ.

అవును. ఈ పక్క వీధిలోనే రాజారావు అని....

అతని పేరు వినగానే ముకుందం కుర్చీలోంచి కాస్త ముందుకు జరిగి అడిగాడు-

రాజారావా? అంటే ఆ కలప వ్యాపారం చేసే అతను.

వూ.... అతనే. అతనికి మా మామయ్య కూతుర్నిచ్చాం

అలాగా.

నీకు అతను తెలుసా?”

బాగాను. నా కొక్కడికే అన్నమాటేవిటి? ఈ పేటంతటికీ తెలుసు. పాపం! ఆవిడ ఎంత దురదృష్టాన్ని నోచుకుందోగాని యమకూపంలాంటి ఇంట్లో అడుగుపెట్టిందిరా శంకరం!

అంటే!

ఆ యింటివాళ్లు ఆమె నెంత సాధించుకుతింటారో భగవంతుడికే తెలియాలి. రాజారావు తల్లి మాటకు ఎదురుచెప్పడు. అతనొక్కడే కాదు ఆ యింటిల్లపాదీ ఆమె చెప్పుచేతల్లో ఉండాల్సిందే. ఆమె పిసినారితనం ఇంతా అంతా కాదు. చీటికి మాటికి దేవతలాంటి ఆ పిల్లను సాధించడం ఆమెకు బాగా అలవాటు. పైగా- దానికి తగ్గట్టు ఆ రాజారావు వట్టి అనుమానం మనిషి. ఈమధ్య ఆ ఇంట్లో ఓ గది కాలేజీ కుర్రాళ్లకి అద్దె కిచ్చారుట. పాపం- ఏమీ తెలీని ఆమెను అనుమానించాట్ట రాజారావు. దీనికి వంతపాడింది ఆ తల్లి. దాంతో పెద్ద రభస. వెంటనే ఆ కుర్రాళ్లని ఆ గది ఖాళీ చేయించారు. ఈ వార్త కాస్తా అందరి నోళ్లల్లో పడింది. సీతాదేవిలాటి ఆమె తన దుఃఖాన్ని దిగమింగుకుని బ్రతుకుతోంది. ఏనాడూ ఆ ఇంటి గుమ్మందాటి బైట ముఖం చూడని ఆ ఉత్తమ ఇల్లాలుమీద నింద మోపటానికి అతని మనసు ఎలా వప్పుకుందోగాని, దారుణంరా భాయ్. ఓ నెల రోజుల క్రితం రాజారావు అక్కయ్య పుట్టింటికి వచ్చిందట. అత్త సాధింపుతో పాటు, ఆడబిడ్డ ఆరడిగూడా ఎక్కువయ్యిందని మా ఆవిడ చెప్పింది. మొత్తానికి ఆ అమ్మాయి అనుక్షణం కుమిలి పోతోందనుకో....అన్నాడు ముకుందం.

వీడి మాటలన్నీ విన్న తర్వాత ఆ ఇంటివారందరి పీకలూ నులిమి పారేద్దామన్నంత కోపం వచ్చింది. ఇంత జరుగుతూన్నా, ఒక్కనాడుగూడా ఈ విషయాలు ఇంటికి రాయలేదంటే- రాధ మంచితనాని క్కావలసిన నిదర్శనం ఇంతకంటె ఇంకేముంది?

ఇంతట్లో ముకుందం భార్య కాఫీ కాచి తెచ్చింది. పిల్లాడ్ని ఆమెకిచ్చి, కాఫీ తాగుతూ, రాధ సంసారం గురించి తనకు తెలిసినదంతా చెప్పాడు ముకుందం.

కాఫీలు ముగిసింతర్వాత ముకుందంతోపాటు అలా బజారు వెళ్లాను. రాత్రి తొమ్మిదిక్కాబోలు ఇళ్లకు వచ్చేశాం.

నేను ఆ ఇంట్లో అడుగుపెట్టేసరికి రాజారావు అంటున్నాడు కాస్త బిగ్గరగా. మీ బావ వచ్చాట్ట? ఎందుకొచ్చినట్టో? నీమీద బెంగ పుట్టుకొచ్చిందేమొ?- చిన్నప్పుడే అనుకున్నార్టగా మీ ఇద్దరికీ పెళ్ళి చెయ్యాలని.

అతనొచ్చిందగ్గర్నుంచీ చూస్తూన్నాగా. ఇద్దరూ గదిలో కూచుని ఏమిటో గుసగుసలూ. మళ్లీ అతను బయటకు కదిలేంత వరకూ ఇది అక్కడ్నుంచి వస్తే వట్టురా అబ్బీ!అని తల్లి మాట అందించింది.

ఎవరికైనా తెలీనివా ఈ వేషాలు! బొందలో పడ్డాం. అనుభవించక తప్పుతుందా మరి?”

రాధ సంసారం ఎంత చక్కగా వున్నదో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూన్నాను. మీ రసలు మనుషులు కారు. రాధ గొంతుక కోశాడు మామయ్య. మీరేదో ఉద్ధరిస్తారనీ, తన పిల్ల సుఖ పడ్తుందనీ ఈ పెళ్లి చేశాడు. మీ మర్యాదకో నమస్కారం. వస్తానుఅంటూ రెండడుగులు వేశానో లేదో రాధ తన ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడుస్తోంది. ఆగాను.

నిన్ను చూస్తూంటె నా గుండె తరుక్కుపోతోంది. ఎప్పటికైనా మంచిరోజు లొస్తాయని సరిపెట్టుకో రాధా! ఇంతకంటె నువ్వు చెయ్యకలిగిందీ, నేను చెప్పవలసిందీ ఏమీలేదు. వస్తానింకఅని గబగబా ఆ యింటినుంచి బయట కొచ్చేశాను.

చిత్రమేమిటంటే- నేనింత ఆవేశంగా మాటాడినా, ఆ తల్లీ, కొడుకులూ నోరు మెదిపితే వట్టు. అలా బొమ్మల్లా నిలబడి చూడటం మినహా. అవును మరి- తప్పు చేసేవాడు ఎప్పుడూ తల దించుకునే వుంటాడు!

ఆ రాత్రికి రాత్రే రైలెక్కి కాకినాడ వచ్చేశాను.

 

6

సరోజవాళ్లు ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయారని తెలిసింది!

ఆశ్చర్యపోయాను! కనీసం వెడుతున్నామని గూడా చెప్పకుండా పోయారేవిటాని ఆశ్చర్యపోయాను. అయినా ఇంత హఠాత్తుగా వెళ్ళిపోవటానికి కారణమేమిటి?

ఆమె ఆరోగ్యం ఎలా వున్నది? ఇన్నాళ్లూ నన్ను చూడని సరోజ- చివరిసారిగానైనా కనుపించి వెడుతున్నామని చెప్పకపోటానికి కారణమేమిటి? ఏదీ అంతపట్టడంలేదు. మనసంతా గందరగోళంగా వున్నది.

ఆఫీసులో పనిచెయ్య బుద్ధిపుట్టడం లేదు. రెండు మూడుసార్లు నా పరాకుని చూచి హెడ్‍క్లార్కు మందలించారు గూడాను.

గుర్నాధం నా సీటు దగ్గరకొచ్చి అన్నాడు, “రేపు ఆఫీసరు పుట్టిన రోజుట.

అలాగా!

మన స్టాఫంతా కలిసి ఆయనకో చిన్న పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం.

మంచి ఆలోచన.

తలొ రెండు రూపాయలు వేసుకుంటున్నాం.

తప్పకుండాను. నావంతు ఇప్పుడే తీసుకోండిఅని రెండు రూపాయలు అతని కిచ్చాను.

థాంక్సు.... రేపు ఆఫీసవర్సయింతర్వాత- అంటే అయిదున్నరకి పార్టీ ఏర్పాటు చేస్తున్నాం.

అలాగే....

అతను వెళ్ళిపోయాడు. మళ్లీ సరోజ వాళ్ల గురించి ఆలోచనలు ప్రారంభమయ్యాయి.

మొత్తానికి ఆ రోజంతా వాళ్ల గురించే ఆలోచనలు. ఎన్నో ప్రశ్నలు. ఒక్కదానికీ సమాధానం లేదు. మళ్లీ విసుగు, చిరాకు.

ఇంటిదగ్గర అన్నపూర్ణమ్మగారికి సుస్తీగా వున్నది. ఈ రెండు రోజుల్లోనూ ఆమె నొక్కసారిగూడా పలుకరించలేదు. ఎంత నొచ్చుకుంటున్నదో ఏమో.... గబగబా ఆవిడ గదిలోకి వెళ్లేను. ఆమె మంచంమ్మీద పడుకుని వున్నది. నన్ను చూస్తూ నవ్వుతూ అన్నది. రా.... నాయనా!

ఎలా ఉందమ్మా!

గుండెల్లో బరువుగా ఉంటుంది. ఆయాసం....

మంచి డాక్టర్ని....

ఎందరో అయ్యారు. నయం చేయలేకపోయారు. ఈ గుండె జబ్బుతో నేననుభవిస్తూన్న బాధ పరాయివాళ్ళక్కూడా వద్దు నాయనా.... ఏ పనీ చెయ్యనివ్వదు. ఒక్కడుగు కదలనివ్వదు. పోనీలే.... ఈ రోగం గురించేం మాటాడుతాను గానీ.... రాజమండ్రి కబుర్లు చెప్పు రఘూ

అక్కడ జరిగిన అన్ని విషయాలూ తూ.చ. తప్పకుండా చెప్పాను. ఆమె అంతా విని నిట్టూరుస్తూ అన్నది-

మనుషుల్లోగూడా రాక్షసులుంటారు బాబూఅని.

* * * 

-ఆ సాయంత్రం పార్టీకి కావలసిన సదుపాయాలు సేకరించడంలో తలనిండుగా మునిగిపోయారు గుర్నాధం, హెడ్‍క్లార్కూనూ. శివానందం రెండు మూడుసార్లు బయటికీ, లోపలికీ కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. అతను అఫీసరుకోసం ఎదురు చూస్తూన్నాడు.

ఆఫీసుని చక్కగా అలంకరించారు. అన్నీ చక్కగా అమర్చారు. మరో అరగంటకి ఆఫీసరు కారు ఆవరణలోకి అడుగుపెట్టింది-

ఆఫీసర్తోపాటు ఆయన శ్రీమతిగారు కూడా వచ్చార్రోయ్అని ఎలుగెత్తి అందరికీ చెప్పాడు శివానందం.

ఆఫీసరూ, ఆయన సతీమణి లోనికి అడుగుపెట్టారు. ఆమెను చూచిన మరుక్షణంలోనే అదిరిపడ్డాను.

శారద ఆఫీసరు భార్య!

ఆ క్షణంలో ఎందుకో కీడు శంకించాను. ఇన్నాళ్లూ ఆమెకి దూరంగా ముఖం చాటు చేసుకుని తిరిగాను. ఇంక ఆమె ఎదుట పడక తప్పదు కాబోలు-

అదే జరిగింది.

ఆఫీసరు ఆవిడకు పేరు పేరునా అందర్నీ పరిచయం చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చి ఆగారు-

మిష్టర్ శంకరం బి. కాం. నాలుగు నెలల క్రితం ఈ ఆఫీసుకొచ్చారు

చేతులు జోడించాను. ఆమె నన్నూ చూడగానే నిశ్చేష్ఠురాలయింది. ప్రతి నమస్కారం చెయ్యాలన్న ధ్యాసలేకుండా నావైపు చూస్తూ, అలా నిలబడిపోయి వున్నది. ఈ చిత్రాన్ని ఆఫీసులో అందరూ కళ్లప్పగించి శ్రద్ధగా చూస్తున్నారు.

నాకు శంకరం తెలుసు! నా క్లాసుమేటుచివరికెప్పుడో ఆఫీసార్తో అన్నది ఇంగ్లీషులో.

ఈ ఆఫీసులో పని చేస్తూన్నావని ఇప్పటివరకూ తెలీనందుకు చింతిస్తున్నాను. ఇప్పుడు కలుసుకున్నందుకు మాత్రం సంతోషంగా వున్నది.అని నాతో అన్నది (ఇంగ్లీషులోనే). నేను తలొంచుకున్నాను.

ఆ తర్వాత ఆఫీసరు ఆమెకు మరో గుమాస్తాని పరిచయం చేశారు.

నేను మవునంగా కుర్చీలో కూర్చున్నాను. ఆ కాసేపూ ప్రతివాడూ నన్నో వింతజంతువుని చూచినట్టు చూశారు.

పార్టీ ఘనంగా జరిగింది. చాలామంది ఆఫీసరు గురించి మాటాడారు. శుభాకాంక్షలు తెలియజేశారు. దాదాపు ఎనిమిది గంటలక్కాబోలు పార్టీ ముగిసింది.

దార్లో శివానందం, గుర్నాధం కలిశారు.

అదృష్టమంటే నీదే గురూఅన్నాడు శివానందం అదోలా పోజు పెట్టి.

కోటలో పాగా వేశారుగుర్నాధం వెకిలిగా నవ్వుతూ అన్నాడు.

ఇక చూసుకో- అటు అంతఃపురంనుంచి వచ్చే అనుగ్రహంవల్ల, ఆఫీసరు నిన్ను ఆకాశాని కెత్తేస్తాడు. జాతక పురుషుడివి. శివానందం కోరుకునేది ఆఫీసరు గుడ్‍లుక్సూగట్రాను. దానికోసం అవసరమైతే వెధవ కాకాలూను.

వీడికున్న ప్రపంచమంతా ఇదేను.

శివానందం.... ఇంక ఈ మేటర్సుకి ఫుల్‍స్టాప్ పెట్టమని మనవిఅన్నాను.

ఇదేమిటండీ మీకు పట్టిన అదృష్టం-గుర్నాధం ఏదో అనబోయాడు.

ప్లీజ్... మీక్కూడా ఆమాటే చెప్పుకుంటాను. నన్ను విసిగించకండి.

నేనిలా అనగానే వాళ్లిద్దరూ ఒకళ్ల మొహాలొకళ్లు చూచుకున్నారు. ఏమనుకున్నారో ఏమోగాని వెంటనే సైకిళ్లెక్కి వెళ్ళిపోయారు.

-నేనింటో అడుగుపెట్టగానే జానకిరామయ్యగారు ఆదుర్దాగా ఉన్నారు. ఏమిటని అడిగాను.

మీ అమ్మకి ఫిట్టు వచ్చింది నాయనా! పావుగంటనుంచీ మాటా మంచీ లేదు. నా కాళ్లాడటం లేదు. డాక్టర్ని పిల్చుకొస్తాను. నువ్వు కాస్త కనిపెట్టుకు కూర్చో బాబూఅని ఆయన వెళ్ళిపోయారు.

అన్నపూర్ణమ్మగారి దగ్గర కెళ్లాను. ఆమెకు స్పృహరాలేదింకా. తలవైపు, బల్లమీద మందుసీసాలూ, గ్లూకోజూ, నారింజ రసం వగైరా వున్నాయి.

మెల్లిగా వెళ్లి ఆమె తలవైపు కూర్చున్నాను.

అమ్మా-పిలిచాను. ఆమె పలుకలేదు.

పది నిమిషాలు గడిచినా, ఆమెకు స్పృహ రాలేదు. ఆమె స్థితిని చూస్తూంటె నాకు భయంగా ఉన్నది. వెయ్యి దేవుళ్లకి మొక్కుకున్నాను.

ఆమెకు స్పృహ వచ్చింది కాబోలు- పెదిమలు కదిపింది ఏదో మాటాడుదామనే ఉద్దేశ్యంతో. నా ఆనందానికి అవధుల్లేవు.

కొద్దిగా మంచినీళ్లు ఇవ్వనామ్మా!అడిగాను.

నా పిలుపు వినగానే కళ్లు విప్పింది. నన్ను చూచింది. అలా చూస్తూనే కన్నీరు పెట్టుకుంది. నా రెండు చేతులూ ఆమె చెక్కిళ్లమీదకు తీసుకుంది. నెమ్మదిగా అన్నది.

నాకు.... చావాలని.... లేదు రఘూ!

మంచినీళ్లు ఇవ్వనా....

ఇవ్వు నాయనా.... నువ్వు యిచ్చేది అమృతంరా.... త్వరగా ఇవ్వు.

గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చాను. ఆమె నింపాదిగా తాగి, తిరిగి గ్లాసు ఇచ్చేస్తూ అన్నది.

నేనంటె.... ఎందుకు నాయనా... ఇంత ప్రేమ?”

“................”

నువ్వు నా దగ్గర కూర్చుంటే- నాకే భయమూ వుండదు. అరే.... నువ్వెందుకు కన్నీరు పెట్టుకుంటావ్ రఘూ

నే నెవర్ని? ఆమె ఎవరు? మామధ్య ఎందుకీ అమూల్య బాంధవ్యం?

ఇంతకుమునుపు నేను చచ్చిపోయాననుకున్నాను.... ఎందుకో మరి...... కళ్లు తెరిచాను.... నువ్వు కనిపించావ్.... పోతూన్న ప్రాణాన్ని తిరిగి తెచ్చుకున్నాను....

అంతలో డాక్టరు రానే వచ్చాడు. ఏదో ఇంజక్షన్ ఇచ్చి, రేపు మామూలు స్థితికి వస్తారని జానకిరామయ్యగారికి చెప్పి వెళ్ళిపోయాడు. జానకిరామయ్యగారు గదిలో మూల నిలబడి వున్నారు.

చూడండి.... అబ్బాయి వచ్చి.... నన్ను బ్రతికించాడు. నేను చెప్పానుగదూ వీడు మన రఘూ అని.... లేకపోతే.... నేనంటే ప్రాణాలెందుకు పెడ్తాడూ.... ఏవంటారు....

అవునుఅన్నారాయన కన్నీరు తుడుచుకుంటూ.

చెరిసగం రాత్రివరకూ ఆమె ఇలాగే మాటాడ్తూ గడిపింది. ఆ తర్వాత నిద్రపోయింది.  ఆ రోజుకి నేనూ, ఆవిడ గదిలోనే పడుక్కున్నాను.

తెల్లవారిన తర్వాత జానకిరామయ్యగారు అన్నారు. పాపం! రాత్రి భోజనం, నిద్రా లేకుండా గడిపావు

నేను నవ్వు వూరుకున్నాను. ఆ ఉదయానిక్కూడా ఆమె కోలుకోలేదు. నా కా రోజు ఆఫీసుకు వెళ్లబుద్ధి పుట్టలేదు. సెలవు చీటీ పక్కింటి కుర్రాడితో ఆఫీసుకు పంపాను. ఇంతమాత్రానికే సెలవెందుకు నాయనాఅని జానకిరామయ్యగారు అన్నారుగాని, నేను వినిపించుకోలేదు.

తర్వాత డాక్టర్ను వెంటబెట్టుకుని తీసుకొచ్చాను. ఆయన అన్నపూర్ణమ్మగార్ని పరీక్షించి, ఇంజక్షను ఇచ్చి వెళ్లారు. ఇంక పర్వాలేదని గూడా జెప్పారు.

ఆయన రాసిచ్చిన మందుకు కొనుక్కుని తీసుకొచ్చాను. ఆరోజు ఆ మందు వాడాము.

మర్నాటికి ఆమె మామూలు మనిషయ్యింది. గండం గడిచినట్టయింది.జానకిరామయ్యగారు గాలి పీల్చుకున్నారు.

ఆఫీసుకు వెళ్లాను. పరిస్థితులు విడ్డూరంగా తయారయ్యాయి. అందరూ నన్ను చిత్రంగా చూట్టం మొదలు పెట్టారు. హెడ్‍క్లార్క్ నన్ను తన సీటు దగ్గరికి పిలిపించుకుని, ఏదో రహస్యం అడుగుతున్నట్టు, మెల్లిగా అడిగారు-

మీరు ఆమెకు చదువు చెప్పేవారటగా!

ఈ విషయం ఆఫీసులో ఎలా తెలిసిందో నాకు ఓ పట్టాన అర్థం కాలేదు. అయినా నేనామెకు చదువు చెప్పిందీ లేనిదీ ఈయనకు ఎందుకు?

ఆయనకేం జవాబు చెప్పకుండా వచ్చి, నా సీట్లో కూర్చున్నాను.

ఆఫీసరు తన గదిలోకి వెడుతూ, నావైపు అదోవిధంగా చూశారు. ఆయనలా వెళ్ళి అయిదు నిమిషాలైనా జరక్కమునుపే నన్ను పిలిచారు. ఈ పిలుపు ఆఫీసు బృందాన్ని కలవరపెట్టింది. వాళ్లనే కాదూ- ఒకవిధంగా నన్నూను.

ఆయన గదిలోకి వెళ్ళి నిలబడ్డాను.

మీ పద్ధతేం బాగుండలేదు మిష్టర్ శంకరం.

ఉలిక్కిపడ్డాను ఈ మాటతో.

మీ ఇష్టం వచ్చినట్టు సెలవు వాడేస్తూన్నారు.

నిన్న మా ఇంట్లో-

ఐ యామ్ నాట్ ఆస్కింగ్ యువర్ సిల్లీ కాజెస్- ఇలా సెలవలు పెట్టడం నాకిష్టం లేదని అంటున్నాను.

ఆయన అనవసరంగా మండిపడ్తున్నట్టు గ్రహించాను.

ఇంకా మీరు కన్ఫరమ్ కాలేదు. ఇది మాత్రం గుర్తు చేసుకోండి.

ఇంత చిన్న విషయానికే ఈయన ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తూన్నట్టు? నే నిప్పుడేం మాటాడినా నేరమే అవుతుంది. అందుకనే మవునంగా ఉండిపోయాను.

మీ ప్రోగ్రెస్ ఏమంత బాగాలేదు. నో.... ఐ కాంట్ స్పేర్ దిస్ కైండాఫ్ నెగ్లిజెన్స్.... అండర్‍స్టాండ్....

యస్సార్.

ఊ... యూ కెన్గో.

ఆ గది నుంచి బయటకు వచ్చాను. అంతవరకూ ఆ గది తలుపుల దగ్గర నిలబడి ఉన్నాడేమో, శివానందం- నా రాకను చూచి గబగబా తన సీటు దగ్గరికి పరుగెత్తాడు. ఆఫీసరు నన్నేమన్నాడో విందామని శ్రమపడ్డాడు కాబోలు.

ఈ వింత మనస్తత్త్వాలమీద నాకు రోత కలిగింది.

నా సీట్లో కూర్చుంటుండగా, టేబిల్ మీద ఉన్న కవరు నా చూపుని ఆకర్షించింది. నాకు పరిచయం లేని అక్షరాలతో నా చిరునామాను రాశారు. ఎవరాని ఆత్రంగా కవరు చించి చదివాను.

శ్రీ శంకరం గార్కి,

కొందరు మంచి మనుషులుంటారు. వాళ్లని మోసగించడం తలకు మించిన పని. అంతరాత్మ సుతరామూ ఒప్పుకోదు. మీరు నాకు ఏ క్షణంలో కనిపించారో గాని- ఇన్నాళ్లూ మంచీ చెడుల మధ్య యిటా అటా అని వూగిసలాడాను.

ఈ పోరాటంలో చివరికి మంచే గెలిచింది.

నేను వేశ్యను. సీతారామయ్య నా తండ్రి కాడు. నాకు అక్కయ్య అనబడే వ్యక్తి యీ లోకంలో ఎవ్వరూ లేరు. ఇవన్నీ మా వ్యాపారం నిరాటంకంగా సాగటానికి, మీలాటి అమాయకుల్ని మోసగించటానికి కల్పించుకున్న సాకులు.

జన్మలో ఒక మంచిపని చేయగలిగినందుకు నే నెప్పటికీ గర్విస్తూంటాను.

నాలుగు రోజుల క్రితం- సీతారామయ్యకీ నాకూ రగడ జరిగింది. అతను మిమ్మల్ని మోసం చెయ్యమంటాడు- నేను చెయ్యనన్నాను. చివరికి, నేనే ఆధారమయిన అతను నా మాట వినక తప్పింది కాదు.

ఈ జన్మలో మీకు కనిపించకూడదనే నిశ్చయంతో- దూరంగా పోతున్నాను. మకాం మార్చాను.

ఇన్నాళ్లూ మీతో చెలగాటం ఆడినందుకు మన్నించమని కోరుకుంటూ-

సరోజ.

నా మతి పోయినట్టయింది. నాలాటివాళ్లనే వలలో వేసుకోవడం వృత్తిగా పెట్టుకున్న సరోజ నాపట్ల యిలా ఎందుకు చేసింది. ఇది జవాబు లేని ప్రశ్న.

ఎంత నీచంగా బ్రతుకుతున్నవారైనా- ఒక్కోసారి- ఒక మంచివాడు సైతం చేయలేని మంచిపని చేయగలరని సరోజ నిరూపించింది.

ఆరోజు నా మనసంతా పాడయింది. అటు ఆఫీసరు ప్రవర్తనా- యిటు సరోజ రాసిన ఉత్తరం- యీ రెండూ నన్ను కలవరపెట్టాయి.

ఇంటి దగ్గర అన్నపూర్ణమ్మగారు నాలో కనుపిస్తూన్న కొత్తదనాన్ని గమనించారు. గుచ్చి గుచ్చి కారణం అడిగారు. నేను సమాధానం చెప్పనేలేదు.

ఒక్కోరోజు, ఒక్కోవింత పరిమాణాన్ని వెంటబెట్టుకొస్తున్నది. ఆఫీసులో పరిస్ధితులు ప్రతికూలించాయి. కేవలం నన్ను వత్తిడి చెయ్యాలనే సంకల్పంకొద్దీ ఆఫీసరు నన్ను ప్రతి చిన్న విషయంలోనూ మందలిస్తున్నారు. అప్పుడప్పుడూ విపరీతమైన కోపాన్ని గూడా ప్రదర్శించడం కద్దు.

ఇది సహించడం నాకు చాతకావడంలేదు.

-ఆఫీసరిలా మారిపోటానికి శారద కారణం కావచ్చు. ఆనాడు నాపైన కత్తిగట్టినట్టు సాధిస్తానని పెచ్చరించింది. ఈనాడు ఆ పగ తీర్చుకుంటోంది కాబోలు.

ఏమో మరి!-ఆడది తెగిస్తే ఎంతటి పనైనా చేస్తుందని వాడుక. ఆమె నా గురించి ఆఫీసరుకు ఏమైనా చెప్పి ఉండవచ్చు. ఆడదానిమాట నమ్మడం సుళువు.

ఆఫీసులో అందరూ సరిగ్గా వేళకి యింటికి వెళ్లిపోయే వారు. నా విషయంలో యిలా జరగడంలేదు. అంతటి ఆఫీసులోనూ బిక్కుబిక్కుమంటూ నే నొక్కడ్నీ, నాకు కేటాయించిన పనితో రాత్రింబవళ్లూ కూర్చోవలసి వస్తున్నది. ఇంతపనిలో ఏ చిన్న పొరపాటు దొర్లినా ఆఫీసరు సహించేవారు కాదు. పిలిపించి, నన్నూ-నా చదువునీ హేళన చేసేవారు. ఈ వింత పరిణామానికి నేను చింతించని రోజు లేదు. ఒక్కోసారి- యీ ఉద్యోగం విడిచిపెట్టి ఎక్కడికైనా పారిపోదా మనిపించేది.

ఓరోజు- రాజన్న నాకో కొత్తరకమైన కబురు తెచ్చాడు. చాటుగా పిలిచి రహస్యం చెబుతున్నట్టు చెప్పాడు.

మిమ్మల్నివాళ అమ్మగారు రమ్మన్నారు?”

ఆ ఆహ్వానం నాకు వెగటు కలిగించింది.

రాలేను. ఆఫీసులో పని వత్తిడిగా ఉన్నదని ఆమెతో చెప్పు.

అదే బాబూ! ఆ విషయం అడగటానికే రమ్మన్నారు.

అంటే?”

రాజన్న వెకిలిగా నవ్వినట్టు అనిపించింది నాకు.

మీ రిన్నాళ్లూ ఆఫీసులో పడ్తూన్న యిబ్బందంతా అమ్మగారికి చెప్తూన్నా రోజూను.

అసలు నా విషయాలు ఆమెతో చెప్పటానికి నీకేం పని?”

అయ్యోరామ! నామీద కోపం చూపిస్తారేటండీ! అమ్మగారు రోజూ మిమ్మల్ని గురించి అడుగుతుంటారు. నాకు తెలిసిందంతా నేను చెప్తాను.

ఆశ్చర్యం కలిగింది. శారద నన్ను గురించి తెలుసుకోవాలని ఎందు కనుకుంటోంది?

ఇవ్వాళ మీతో అన్ని విషయాలూ మాటాడతారట. ఆఫీసయిపోంగానే రమ్మని మరి మరీ చెప్పారు.

సరే. ప్రయత్నిస్తానని చెప్పుఅన్నాను.

రాజన్న వెళ్లిపోయాడు.

శారద నన్ను పిలిపించడంలో అర్థమేమిటి? నామీద పగ తీర్చుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తూన్న ఆమె- నన్ను పరామర్శించాలని ఉన్నదనడంలో ఉద్దేశ్యమేమిటి? నన్నూ, నా అసమర్థతనీ అవమానిస్తుందా? లేక- ఈ జరుగుతున్న దారుణానికి సానుభూతి చూపుతుందా?

ఎన్నో ప్రశ్నలు- అనుమానాలు.

చివరికి ఆ యింటికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాను. ఆరోజు మిగిలున్న పనికి వాయిదా వేసి- కాస్త పెందరాళే అందరితోపాటు బయట కొచ్చేశాను.

-నా కోసమే ఎదురుచూస్తున్నది కాబోలు- నన్ను లోనికి సాదరంగా ఆహ్వానించింది శారద.

రావనుకున్నాను.... అలా కూర్చోఅన్నది సోఫా చూపిస్తూ.

మవునంగా కూర్చున్నాను.

శ్రీవారు నీమీద కత్తిగట్టారుట నిజమేనా?”

“.... .... .... ....”

ఛీ.... వారింత అల్పబుద్ధివా రనుకోలేదుఅన్నదామె.

ఉలిక్కిపడ్డాను.

అనుమానం మనిషి నెంతటివాడినైనా తనిష్ట మొచ్చినట్టు ఆడిస్తుంది శంకరం! నువ్వు నా క్లాసుమేటువి, ఇద్దరం కలిసి మెలిసీ తిరిగాం. ఈ రెండూ చాలు ఆయన అనుమానానికి ఆయుధాలు. ఇంత చదువుకున్నా, హోదా పెంచుకున్నా- ఆ మనిషిలో క్రుకెడ్నెస్యింకా దూరం కాలేదు. పాపం! అన్యాయంగా నీమీద విరుచుకు పడుతున్నారు.

నన్నెందుకు పిలిపించావో...

ఎందుకేమిటి?- నీ గురించి రాజన్న చెప్తున్నది వింటూంటే ఓసారి స్వయంగా అన్ని విషయాలూ మాటాడాలని....

నే నొకటి అడగా లనుకుంటున్నాను.

నిరభ్యంతరంగా.

ఆఫీసరిలా మారిపోవటానికి కారణం?”

చెప్పానుగా ఆయన అనుమానమని!

అంతేనా?”

అంతే!

దాన్లో నువ్వేం కలగజేసుకోలేదా?”

అంటే?”

నీకు గుర్తు లేకపోవచ్చు. కాలేజీ రోజుల్లో- ఓనాటి నీ ఉద్రేకాన్ని కూడదని హెచ్చరించాను. మందలించాను కూడా. ఆనాడు నువ్వన్నావ్ దానికి తగ్గ ప్రతిఫల మనుభవిస్తావని. అప్పట్లో ఆ మాటని నేను పట్టించుకోలేదు. మళ్లీ యీనాడు మనిద్దరం కలుసుకున్నాం. నీ పగ తీర్చుకునేందుకు చక్కటి అవకాశం దొరికింది. నీమాట నెరవేర్చుకుంటున్నావ్. ఇది కాదంటావా?”

ఇంతా విని ఆమె పకపకా నవ్వేసింది!

ఓయ్ పిచ్చి శంకరం! నాకు పగేమిటయ్యా మహానుభావా?- అవి తెలిసీ తెలీని కాలేజీ రోజులు- ఇది జీవితం. ఈ రెంటికీ తేడా చాలా ఉంటుంది. ఒకరిమీద పగ తీర్చుకోటానిక్కాదు జీవితం!- ఏమో ఆనాడు నిన్ను అలా అన్నానేమో. అయినా అప్పటిమాట యింకా గుర్తుంచుకున్నావన్న మాట. గూడ్....

ఆమె అలా అనేసరికి నాకు సిగ్గేసింది. తల కొట్టేసినంత పని జరిగింది.

ఒక విధంగా- నీకు జరుగుతున్న యీ అన్యాయానికి నేనుకూడా ఒక కారణమేమో

ఏమి టన్నట్టు ఆమెవైపు చూశాను.

ఆరోజు పార్టీలో నువ్వు నాకు తెలిసినట్టుగా చెప్పాను. పైగా- అప్పుడప్పుడూ మన చనువు గురించీ, నీ గురించీ, నీ చదువు గురించీ ఆయనకు చెప్తూండేదాన్ని. ఇవన్నీ ఆయన మనసుని పాడుచేస్తాయని మాత్రం ఊహించలేదు. ఆయన అల్పత్వం యిప్పటిగ్గాని తెలుసుకోలేకపోయాను.

సరిగ్గా శారద యీమాట అంటూండగానే ఆఫీసరు గుమ్మందగ్గర నిలబడ్డారు. మా యిద్దర్నీ ఓ క్షణంపాటు చూచి, నన్ను అడిగారు.

ఏ.... ఇలా వచ్చారు?”

నేనే పిలిచానుఅన్నాను శారద.

షటప్.

నేను లేచి నిలబడ్డాను.

గెటవ్‍ట్. మళ్లీ యీ పరిసరాల్లో కనుపించకుఅన్నా రాయన నావైపు గుడ్లురిమి చూస్తూ-

ఆగు.... నిన్ను శాసించటానికి ఆయనెవరు? అవన్నీ ఆఫీసులో. ఇది ఇల్లని, నువ్వు వచ్చింది ఓ మిత్రురాల్ని పలుకరించటానికని జవాబు చెప్పు....అన్నది రోషంగా శారద.

నేనేం మాటాడలేకపోయాను.

భయమెందుకు శంకరం?- అలా చెప్పు.

ముందు నువ్వు లోపలికెళ్లు.ఆయన శారదని గద్దించారు.

అంత అవసరం రాలేదు.

శారదా!

చాలు. నేను మీ పరిచారికను గాను, మీ కేకలూ, మీ ధాంధూంలూ విని భయపడిపోటానికి- అలా నించుండి పోయావే శంకరం.... కూర్చో....

అనవసరంగా నువ్వు జోక్యం కల్పించుకుంటున్నావ్ శారదా!

నా ఎదుటనే నా ఫ్రండుని మీరు అవమానపరుస్తున్నారు.అన్నది శారద.

యూ....గట్టిగా అరిచారు ఆఫీసరు.

ఆవేశం అక్కర్లేదు.తొణక్కుండా అన్నది శారద.

నేను యిరకాటంలో పడ్డాను. ఈ వాగ్వివాదం ఏ దారుణమైన సంఘటనకి దారి తీస్తుందోనని భయపడ్డాను. తలొంచుకుని బయటకు రాబోయాను.

ఆగు శంకరం! నేనూ వస్తూన్నాను-

మరింత భయం వేసింది. ఏం చెయ్యాలో తోచలేదు.

ఈ దిక్కుమాలిన కొంపలో శాంతిలేదు. మనిషికి విలువ యివ్వడం చాతకాదు యిక్కడివారికి. ఛీ....ఆమె లేచి నిలబడింది.

శారదా!

ఏం, ఎందుకా గావుకేకలు. చాలిక. మీ బుద్ధి తెలుసుకున్నాను. అమా, నాన్నా యింకా బ్రతికే ఉన్నారు. నే నక్కడకు వెడితే తలమీద పెట్టుకు పోషిస్తారు.

దట్సాల్‍రైట్.... వెళ్లు

తప్పకుండాఅంటూ ఆమె వేగంగా మేడ మెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్లింది.

ఆ యింటినుంచి వెంటనే బయటకు వచ్చాను. కొంత దూరం వేగంగా నడిచాను. కొంతదూరం పరుగెత్తాను.

శారద నిప్పుడు అర్థం చేసుకున్నాను. ఆమె కేవలం స్త్రీయే కాదు. అభ్యుదయానికి ఓ మచ్చుతునక. ఆమె వ్యక్తిత్వానికి చేతులు జోడించాను.

-ఆ రాత్రి భోజనం చేయలేదు. అన్నపూర్ణమ్మగారు కారణం అడిగారు. ఇన్నాళ్లూ నేను అనుభవిస్తోన్న వేదన చెప్పి తీరవలసిందని పట్టుపట్టారు.

ఆమె వడిలో తల పెట్టుకు గావురుమని ఏడిచాను.

ఆమె గాబరాపడింది. నా తల నిమురుతూ అడిగింది.

చెప్పు రఘూ! నా బాబువి కదూ! నువ్వు చెప్పకపోతే నే చచ్చిపోయినంత వట్టు

అమ్మా!

ఆమె కళ్లల్లో నీళ్లు నిలిచాయి.

ఇప్పటివరకూ జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించి చెప్పాను. ఆమె నిట్టూరుస్తూ అన్నది.

వీ టన్నింటినీ మనసులో పెట్టుకుని, మనసు పాడు చేసూకోడం తగదు నాయనా! పసివాడి వింకా... లోకం తెలీదు నీకు.

*  *  * 

నిజమే మరి-

నాకు లోకం తెలీదు. మనిషి మనసు తెలీదు. అంతటి అనుభవం యిప్పటివరకూ లేదు.

అందుకనే- ఇప్పటివరకూ జరిగినదంతా ఒక చక్కటి పాఠం- జీవితం నేర్పిన పాఠాల్లో ముఖ్యమైనదీ, మరిచిపోనిదీ గూడాను.

శారద ఆ రాత్రే పుట్టింటికి వెళ్లిపోయిందని రాజన్న ద్వారా ఆఫీసంతటికీ తెలిసింది.

ఆరోజు ఆఫీసరు ఆఫీసుకు లేటుగా వచ్చారు. వచ్చీ రావడంతోనే నన్ను పిలిపించారు. ఆనాటి పిలుపుకి నేను భయపడలేదు. సరిగదా, ఏదో పిచ్చిధైర్యం నన్నావరించింది.

ఆయన గదిలో అడుగుపెట్టాను.

నిన్ను వూస్ట్ చెయ్యాలనుకుంటున్నాను.అన్నారాయన ఇంగ్లీషులో.

కానీ, ఆ అవసరం రాకముందే రాజీనామా యిద్దామని నేనూ అనుకుంటున్నాను.ఇంగ్లీషులోనే సమాధానం చెప్పాను.

ఆయన గతుక్కుమన్నారు. అర్థంగానట్టు నా ముఖం లోకి చూశారు.

ఇలాంటి మనుషులదగ్గర ఉద్యోగం చెయ్యడం నాకు చాతకాదుఅన్నాను.

అంతవరకూ వచ్చావన్నమాట.

అన్నీ నిశ్చయించుకోడం గూడా జరిగింది. నే వెళ్లేముందు ఒక్కమాట- అంతస్థూ, అధికారమూ, యివిగావు మనిషి విలువను కొలిచే కొలతబద్దలు. సంస్కారం ముఖ్యం.

షటప్.... ఐ విల్ రిపోర్ట్ దిస్ టూ-

గట్టిగా నవ్వాను. ఆయన మాట మధ్యలోనే ఆగిపోయారు.

ఎవరికో ఎందుకు? ముందు మీ మనసుకి చెప్పుకోండి. సెలవ్.

ఆ గదినుంచి గబగబా బయటకు వచ్చాను. అప్పటి కప్పుడే నా రెజిగ్నేషన్ రాసి హెడ్‍క్లార్కుకి యిచ్చాను.

*  *  * 

ఇంతపని జరుగుతుం దనుకోలేదుఅన్నాడు రంగనాధం.

అన్నపూర్ణమ్మగారి కళ్లల్లో నీరు తిరిగడం తప్ప, ఆమెనుంచి ఒక్కమాటైనా లేదు. జానకిరామయ్యగారు దూరంగా నించుని ఉన్నారు.

గట్టిగా కూతపెట్టి కదిలింది రైలు....

ఆ ముగ్గురూ నాకు కనుమరుగయ్యేంత వరకూ నేను చెయ్యూపుతూనే ఉన్నాను. రైలు ప్లాటుఫారం దాటుతుందనగా- అన్నపూర్ణమ్మగారు యింకా నిలువలేక రంగనాధం భుజాలమీద పడిపోయింది.

సీట్లోకి వచ్చి కూర్చున్నాను.

సరిహద్దు దాటావ్. జీవితంలోకి అడుగు పెడుతున్నావ్. నీకై నువ్వు తెలుసుకోవలసినవీ, నీ అనుభవంలోకి తెచ్చుకోవలసినవీ చాలా ఉన్నాయ్అన్న మూర్తి మాటలు గుర్తుకొచ్చాయి.

రైలు వేగం పెంచుకుంటోంది.

(భారతి మాసపత్రిక జూన్ 1962 సంచికలో ప్రచురితం)

Comments