ట్రంప్ కార్డు - రాచపూటి రమేష్

    "ఏం చేస్తామయ్యా, నెలరోజులకన్నా ఎక్కువ టైం లేదు. ఈ లోగానే ఏర్పాట్లన్నీ జరిగిపోవాలి. పెళ్లి తిరుపతిలోనే జరిపించాలని పెళ్లికొడుకు అమ్మగారు పట్టుపట్టారు. మా బెజవాడలోనైతే నా తిప్పలు నేను పడుతుండేవాణ్ణి" విచారంగా అన్నారు కనకరత్నంగారు.     "సార్, అమెరికా సంబంధమన్నారు. అబ్బాయి సాఫ్టువేర్ ఇంజనీరన్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ మరీ నెల రోజుల వ్యవధిలో మంచి మేరేజీ హాలు దొరకడం, మిగతా ఏర్పాట్లు పూర్తవడం అంత ఈజీ కాదు. కావలిస్తే ఏ కాంట్రాక్టరుకో పెళ్లి పనులు పురమాయించవచ్చు" అన్నాను నేను నసుగుతూ మా ఆఫీసరు కనకరత్నంగారితో.

    "ఆహా, ఆ ముచ్చట కూడా అయ్యింది. వాడెవడో పళనిస్వామిట. మేరేజ్ కాంట్రాక్టులు చేస్తుంటాడట. ఎంతసేపు 'మేర్‌కాళంబూ, తైర్‌సాదం' అని అరవ వంటకాల లిస్టు చదువుతున్నాడు. దోసకాయ, పనస పొట్టు కూర అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు. పైగా వాడి దగ్గరున్న బేండుమేళం వాళ్లకి సినిమా పాటలే తప్ప త్యాగరాజకృతులేవీ రావట. అసరే మా వియ్యంకుడు కర్ణాటక సంగీతమంటే చెవికోసుకుంటాడు" అని ధుమధుమలాడారు కనకరత్నం.

    "సార్, మిగతా ఏర్పాట్లకేవో తిప్పలు పడవచ్చు. కానీ కల్యాణ మండపం మంచిది దొరకాలంటే ఈ తిరుపతిలో కనీసం మూడు నెలల ముందే బుక్ చేయాలి. లోకల్ వాళ్లతో బాటూ, ఎక్కడెక్కడి వాళ్లో వచ్చి, హాల్స్ బుక్ చేసి ఇక్కడే పెళ్లిళ్లు జరిపిస్తుంటారు గదా" అన్నాన్నేను.
    "సరే నాలుగింటికి బయల్దేరి టిటిడి వాళ్ల మేరేజి హాల్స్, తిరుచానూరులో కల్యాణమండపాలు చూసొద్దాం" అన్నారు రత్నంగారు. 

    అన్నట్లుగానే ఆయన కార్లో వెళ్లి వాకబు చేసొచ్చాం. ఎక్కడా ఖాళీలులేవు. ఆఖరికి స్టార్ హోటల్సులోని కళ్యాణ మండపాలు కూడా మరో మూడు నెలల పాటు బుకు ఐపోయి ఉన్నాయి.
    "ఏం చేద్దాం సార్. పెళ్లి మరో రెండు మూడు నెలలు పోస్టుపోన్ చేసుకోండి. లేదా మరో వూర్లో జరిపించండి" విచారంగా చెప్పాను. 

    "చాల్చాల్లేవయ్యా. భలే చెప్పొచ్చావు. సాయంత్రం టౌన్లో గాలించి ఏవైనా ప్రయివేటు కళ్యాణ మండపాలు దొరుకుతాయేమో చూడాలి. అలాగే మంచి పురోహితుణ్ణి, వంటల్ వాళ్లను, మేళగాళ్లను వెతికిపెట్టు. నీకు మంచి కాలక్షేపం" నాకేదో బొత్తిగా టైంపాస్ కానట్లుగా చూస్తూ చెప్పారు కనకరత్నం.
    ఎంతాఫీసరైనా నాకా క్షణంలో ఆయన్ను కడిగి పారేయాలనిపించింది. కాసేపు తమాయించుకుని చెప్పాను.
    "సార్, మా అమ్మాయికి రేపట్నుండీ టెంత్‌క్లాస్ ఎక్జామ్స్ స్టార్ట్ ఔతున్నాయి. మరో వారం రోజుల్లో మా అబ్బాయికి కౌన్సిలింగ్ వుంది. మీకు టైం స్పేర్ చేయలేను. కావాలంటే ఆ ధర్మారావును మీకు సహాయంగా వాడుకోండి నెలరోజులు."

    నా ఆఖరి మాటలు వినగానే అగ్గిమీద గుగ్గిలమైయ్యారు కనకరత్నం.
    "ధర్మారావా? వాడ్డూయూ మీన్? ఆ పనికి మాలిన వెధవ న్యూసెన్సు మళ్ళీ తగిలించుకోమంటావా? ఆఫీసు పనికి బొత్తిగా పనికిరాడని వాణ్ణి ఇంటికి పంపించి పది రోజులు కూడా కాలేదు. మళ్ళీ ఏరికోరి ఆ లంపటాన్ని చేరదీయాలా? నథింగ్ డూయింగ్" అంటూ నాపై చిందులు తొక్కారు.     మరుసటి రోజు ఆఫీసులో మరో ఇద్దరు, ముగ్గుర్ని కదిపి చూశారు కనకరత్నం. ఎవరికి వారే తాము బిజీగా వున్నామని తప్పించుకున్నారు. లంచవర్ అవుతుండగా నాకు కబురు పెట్టారు.     "ఏం చేస్తామయ్యా! ఎవరికి వారు వాళ్ల స్వంత పనుల్లో బిజీగా వున్నట్లున్నారు. తలా ఓ చెయ్యివేసి శుభకార్యాన్ని సజావుగా జరిపించాలన్న ఇంగితం ఒక్కరికీ లేదు. ఇంకేం చేద్దాం. ఆ ధర్మారావు సెల్ నెంబరెంతన్నావు?" అన్నారు విచారంగా.     "అలా రా దారికి" అని మనసులోనే అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మా బాస్‌కు ధర్మారావు సెల్ నెంబరిచ్చాను. ఆఫీసు ఫోన్ నుండి ధర్మారావుకి ఫోన్ చేశారు కనకరత్నంగారు.

* * * * *
నెల్లూరు నుండి తిరుపతిలోని మా ఆఫీసుకు ధర్మారావు ట్రాన్స్ఫరై రెండేళ్లయింది. అసలు ధర్మారావు కాలేజీ చదువంతా తిరుపతిలోనే గడిచిందట. బాగా కలివిడి మనిషి అవడం చేత క్లబ్బుల్లో, స్వచ్చంద సంస్థల్లో మెంబరుగానో, సెక్రటరీగానో వున్నట్లున్నాడు ధర్మారావు. అతని భార్య కూడా ఏదో మంచి డిపార్టుమెంట్‌లో పెద్ద పోస్టులోనే వున్నట్లుంది.
    ధర్మారావు వచ్చిన రెండు నెలల్లోనే అతని వాలకం అందరికీ అర్థమైపోయింది. ఫైల్లో పెన్ను పెట్టి ఏమీ రాయడు. రాసినా 'బ్రహ్మ రాత'లా వుండే అతని దస్తూరీ ఎవరికీ అర్థం కాదు. పట్టుమని అరగంట కూడా సీట్లో కూర్చోడు. 'అక్కడ పని, ఇక్కడ పని' అని బండేసుకుని బయటకు చెక్కేస్తూ వుంటాడు. 

    కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి. బయట పనులేవైనా చక్కబెట్టుకు రావాలంటే మాత్రం ధర్మారావుకున్న చాతుర్యం అనితర సాధ్యం. ఏ బ్యాంకు నుండో పర్సనల్ లోన్ కావాలన్నా, యూనివర్సిటీలో సర్టిఫికెటో, మరో పనో కావాలన్నా అందరం ధర్మారావునే ఆశ్రయించేవాళ్లం.
    తిరుపతి లోని అన్ని ఆఫీసులకు వచ్చినట్లే మా ఆఫీసుక్కూడా వారానికో సారి వచ్చే ఫోన్ కాల్సు కొన్నున్నాయి. కొండ మీద దర్శనాలు ఏర్పాటు చేయించాలనో, ఏ పడికో, ఏకాంత సేవకో ఆర్జిత సేవా టికెట్ కావాలనో, తిరుమల్లో కాటేజీలో, గెస్ట్ హౌస్ బుక్ చేయించాలనో, వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో లడ్లు కావలనో వచ్చే ఫోన్లవి. అలాంటి ఫోన్ వచ్చిన ప్రతిసారి మేము ధర్మారావునే ఆశ్రయించాల్సి వచ్చేది. వచ్చే ఆఫీస్ర్ను ఏ తెల్లవారుజామునో రైల్వే స్టేషన్‌లో రిసీవ్ చేయించడం దగ్గర నుండి వెహికల్ అరెంజ్ చేయించడం, దగ్గ్రుండి దర్శనాలు వగైరా ఏర్పాట్లు చేయించడం, ప్రసాదాలతో బాటు సెండాఫ్ చేయించడం వరకూ సర్వాంతర్యామిలా తానే గమనిచుకునేవాడతను. అలాగే ఆఫీసు తరఫున ఏ మీటింగులో, ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయాలన్నా, అరేంజిమెంట్సన్నీ ఒకరు చెప్పక్కరలేకుండానే చక్కబెట్టుకొని వచ్చేవాడు.
    కాకపోతే కనకరత్నంగారు మిగిలిన ఆఫీసర్ల లాంటివాడు కాదు. ఎవరి తాహతెంతైనా, బ్యాక్‌గ్రౌండ్ బలంగా ఉన్నా సీట్లో కూర్చుని ఖచ్చితంగా తమకలాట్ చేసిన వర్కు పూర్తి చేయాలన్నది ఆయన పాలసీ. అందుకే ధర్మారావు ధోరణి ఆయనకు బొత్తిగా గిట్టలేదు.

* * * * *

    ధర్మారావు రంగంలోకి దిగాడు. 'ఐనా ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేయగలరు? ఈ ధర్మారావు మాత్రం ఏం పొడుస్తాడులే' అనుకున్నాను నేను.
    "ఈ పదివేలు నీ దగ్గరుంచు. కావాలంటే నా కారు తీసుకెళ్లు" అన్న రత్నంగారి మాటల్ని పట్టించుకోకుండా విషయం తెలుసుకోగానే తన బండిలోనే రైయ్యిమని దూసుకుపోయాడు. అలా వెళ్లిన మనిషి మధ్యాహ్నానికి ముఖం వేలాడేసుకు వచ్చాడు. అతని వాలకం చూడగానే పెళ్లికి సరైన వేదిక ఏదీ దొరకలేదని నాకర్థమైపోయింది.     భోంచేసిన తరువాత మళ్లీ ఇంకో రౌండుకు బయల్దేరి వెళ్లాడు. అతనితో తోడు వెళ్లడానికి మేమెవ్వరం సుముఖంగా లేము. ఎవరి పనుల్లో బిజీగా వారున్నారు. ఆఫీసు మూసే సమయానికి 'మతాబులా' వెలిగే ముఖంతో తిరిగొచ్చాడు ధర్మారావు.     "సార్, పెళ్లికి వెన్యూ సిద్ధమైపోయింది. వెడ్డింగ్ కార్డులు కొట్టించడమే తరువాయి" అన్నాడు ఆనందంగా.     "ఏ షాదీఖానానో, కమ్యూనిటీ హాలో దొరికుంటుంది కాబోలు" అన్నారెవరో ఎకసెక్క్కంగా.     "చంద్రగిరికి వెళ్లే రోడ్లో ఐదు మైళ్లు దాటాక పోలినాయుడుగారి మామిడితోట పదిహేనెకరాలది ఒకటుంది. మధ్యలో ప్లేగ్రౌండులా ఖాళీ స్థలమూ, గెస్టుహౌసు వున్నాయందులో. నాయుడుగారితో మాట్లాడి మన పెళ్లికి ఆ స్థలాన్నిచేలా నేనొప్పించాను. షామియానాలు వేసేస్తే సమ్మర్‌లో దానికి మించిన ప్లేస్ దొరకదు. పైగా బోలెడంత పార్కింగ్ కూడా వుంది" అన్నాడు ధర్మయ్య.

    ఆ తోటను చూసొచ్చిన తరువాత ధర్మారావు మాట కాదనలేక పోయారు కనకరత్నంగారు.
    ఇక ఆరోజు నుండి ఆల్‌రౌండర్లా విజృంభించాడు ధర్మారావు. పురోహితులెవ్వరూ ముహూర్తం రోజుకి ఖాళీగా లేరు. వేద పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా రిటైరైన సంగమేశ్వర శాస్త్రికి తన ఫ్రెండైన డిప్యుటీ ఈవోతో చెప్పించి పెళ్లిలో మంత్రాలు చదివేలా ఒప్పించాడు.     అలాగే మ్యూజికల్ కాలేజీలో మృదంగం హెడ్డు మురుగేశన్‌తో మాట్లాడి పెళ్లిలో భాజాభజంత్రీల సెక్షన్ ఇన్‌చార్జిగా ఉండడానికి ఎలాగో ఒప్పించాడు. మురుగేశన్ తన శిష్యులు పదిమందిని ఆ రోజుకి పెళ్లిలో సన్నాయి వాయించడానికి పంపుతానన్నాడు. త్యాగరాజకృతులు, అందునా పంచరత్నాలు వాయించడానికి వారికి సాటి మరెవ్వరూ లేరట.     పెళ్లికి అట్టే వ్యవధి లేదు. మంచి వంటవాళ్లెవరూ ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అసలే మాంచి ముహూర్తం సీజనాయే.     తన కొడుక్కి మా ఆఫీసులో ఏ టెంపరరీ వుద్యోగమో వేయించమని గోపాలస్వామి అనే వంట మాస్టారు ఓసారి మా ఆఫీసుకొచ్చాడు. ఖాళీల్లేకపోవడంతో అప్పుడా వుద్యోగం ఆ అబ్బాయికివ్వలేదు.     ధర్మారావు ఆ గోపాలస్వామి ఇల్లు ఎలాగో వెతికి పట్టుకోగలిగాడు.     'అరే, సంపూర్ణ ఉత్తర దేశ యాత్రలకు వెళ్తున్నా, నెలరోజులు వూర్లో వుండనే, ఆ రోజే వూరిడిచి వెళ్తున్నాను నేను' అన్నాడట గోపాలస్వామి.
    "స్వామీ మీకిదే అవకాశం. ఇప్పుడూ మాకు పలికారంటే, రేపు మీవాడికి మా ఆఫీసులో కాంట్రాక్టు పోస్టు గేరంటీ" అని నచ్చచెప్పి గోపాలస్వామి యాత్రలను పోస్టుపోన్ చేయించాడు ధర్మారావు.

   ప్రశస్తమైన కోనసీమ వంటకాలను అద్భుతంగా వండగల గోపాలస్వామి మాస్టారు వంటపనికి కుదరడంతో వుప్పొంగిపోయారు కనకరత్నం.
    పెళ్లికి ఏర్పాట్లు ధర్మారావు ఆధ్వర్యంలో చకచకా జరిగిపోతున్నాయి. పెళ్లి పత్రికల ప్రింటింగు, పంపిణీ పూర్తయింది. చూస్తుండగానే నెలరోజులు ఇట్టే గడిచిపోయాయి.     ఆఫీసులో పని ఒత్తిడితో బాటు తనకున్న బీపి, షుగర్‌ల వల్ల కనకరత్నంగారు చురుగ్గ పెళ్లి పనులు సూవ్పర్‌వైజ్ చేయలేకపోతున్నారు. పైగా ఆయనకు వూరు, మనుషులు బాగా కొత్త.

    పెళ్లికొచ్చే ముఖ్యమైన అతిథులకు గెస్టుహౌసుల్లోనూ, మిగిలిన వారికి హోటళ్లలోనూ రూమ్స్ బుక్ చేయించాడు ధర్మారావు. స్టేషన్‌కు, బస్టాండుకు వెహికల్సును పంపి అతిథులను రిసీవ్ చేసుకుంటున్నాడు. పెళ్లికి ముందే తిరుమలకు వెళ్లి వచ్చేయాలనుకునే వారికి తన మనుషులను తోడిచ్చి పంపి దర్శనాలు, ప్రసాదాలు అరేంజ్ చేయిస్తున్నాడు.     పెళ్లి రోజు రానే వచ్చింది. కనకరత్నంగారి టెన్షన్‌కు అంతులేదు.     'అసలే మా వియ్యంకురాలు పట్టింపు మనిషి. ఏర్పాట్లలో పెళ్లి పద్ధతులలో, భోజనాలలో ఏ లోటు వచ్చినా వూరుకోదు. చచ్చేంత రభస చేస్తుందట. ఈ రోజులెలాగో ఒడ్డున పడితే చాలు' అంటున్నాడు.     ధర్మారావు నిశ్చింతగా ఏర్పాట్లలో మునిగితేలుతున్నాడు. వంటవాడు గోపాలస్వామి మాటిమాటికి ధర్మారావును వంటింట్లోకి పిలిపించి సలహాలు తీసుకుంటున్నాడు. కాఫీ డికాషన్ సరిగ్గా కుదరలేదనో, క్యాబేజీ కూరలో కొబ్బరి వేయలేదనో ధర్మారావు వంటవాళ్లపై విరుచుకుపడి మరీ అన్నీ సరి చుసుకుంటున్నాడు.     విడిదిలోకే కాఫీలు, టిఫిన్లూ సరఫరా అయ్యాయి. పెళ్లి బృఅందం లొట్టలు వెసుకుంటూ ఫలహారాలు పూర్తి చేసింది.

    మృదంగం మురుగేశన్‌కు సందర్భానికి తగినట్లు కృతులు పురమాయించి మరీ వినిపించేలా చేస్తున్నాడు ధర్మారావు. ఇప్పుడు 'ఎందరో మహానుభావులు...'మొదలెట్టండి. ఆలస్యం దేనికి 'రఘు వంశ సుధాంబుధి' అందుకోండి. పెళ్లికొడుకు వచ్చేస్తున్నాడు,'సామజవర గమన'వాయించండి అని జాగ్రత్తలు చెప్తున్నాడు.
    పురోహితుడు సంగమేశ్వర శాస్త్రికి కావలసిన సరుకు, సచ్చెర ఆఘమేఘాల మీద తెప్పిస్తున్నాడు.     డైనింగ్ టేబుళ్ల మీద పరచే పేపర్ నుండి తాంబూలాల వరకూ ఎక్కడ లోటుపాట్లు జరగకుండా ప్లాను ప్రకారం కథ నడిపించాడు. షడ్రసోపేతంగా భోజనాలు ముగించి అతిథులు షామియానాల కింద, మామిడి చెట్ల నీడల్లో వేసిన ఛెయిర్లలో సేదదీరి, భుక్తాయాసంతో వక్కపొడులు నములుతూ కబుర్లలో మునిగి తేలసాగారు. తోపులాటలు, బఫే సిస్టమ్‌లతో విసిగిపోయిన చాలామందికి చల్లని మామిడి తోపులో జరిగిన పెళ్లి వూరటనిచ్చింది.
    లోకల్ టెంపుల్సు చూడాలనుకునేవారికి, చంద్రగిరి కోటకో, తలకోనకో వెళ్లిరావాలనుకునే వారికి వెహికల్స్ అరేంజ్ చేసి, ఎస్కార్టులతో బాటు పంపాడు ధర్మారావు. సాయంత్రం ఏర్పాటు చేసిన 'సంగీత విభావరి','మిమిక్రీ ప్రోగ్రాం'లు కూడా ఆహూతులను అమితంగా ఆకట్టుకుంది. 'పెళ్లంటే ఇలాగే ఉండాలి' అని చాలామంది ఆ సరికే ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.

    ఏ ఆటంకం లేకుండా అనుకున్న ప్రకారం పెళ్లి ముగిసేసరికి కనకరత్నంగారి ఆనందానికి అవధులు లేవు. 'థాంక్స్ చెప్దామనుకున్నా, పనుల్లో వుండిపోయిన ధర్మారావు ఆయనకు దొరకడం లేదు.
    "వ్యవధి తక్కువగా వున్నా, ఏర్పాట్లన్నీ చక్కగా చేశారు అన్నయ్యగారూ" అన్న వియ్యపురాలి మాటలతో పొంగిపోయాడాయన.     "ఆటీన్ మూడు ఎందుకు కొరగాకుండా వుంది, దీన్ని పారేసి మరో ముక్క అందుకోనా?" సలహా అడిగాడు నన్ను మార్కాండేయులు.     మధాహ్నం ఆఫీసులోనే భోజనాలు ముగించి లంచ్‌టైంలో తీరిగ్గా పేకాడుతున్నారు మావాళ్లు.     "ఎందుకూ పనికిరాదనుకునే ముక్కే ఒకోసారి ట్రంప్‌కార్డు అయి కూర్చుంటుది మన ధర్మారావులాగే. ఐదు నిమిషాలాగు" అన్నాన్నేను. నా సలహా నచ్చకపోయినా, పేకాటలో నా ఎక్స్‌పీరియన్స్ మీద నమ్మకంతో ముక్క జారవిడచలేదు మార్కాండేయులు.     రెండు రౌండ్లు పూర్తికాగానే ఆటిన్ ముక్కతోనే ఆట కుదిరింది.     ఆనందంతో షో చూపించాడు మార్కాండేయులు.
    "చెప్పానా, ఆఫీసుకిప్పుడు ట్రంప్‌కార్డు ధర్మారావు. అతనికిప్పట్లో తిరుగులేదు" పేకముక్కలు కత్తేర వేస్తూ నవ్వుతూ చెప్పాను నేను.

(నవ్య వీక్లీ నవంబరు 12, 2008 సంచికలో ప్రచురితం)
Comments