త్యాగం - వాణిశ్రీ

    
ఆ రోజు నగరమంతా హడావిడిగా వుంది. ఎక్కడ విన్నా ఎవరినోట విన్నా "ఈరోజు తీర్పు ఏమవుతుందీ?" అనే విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. న్యూస్‌పేపర్లోకూడా హెడ్‌లైన్స్ లో ఈ విషయమే వ్రాసివుంది. దానికి కారణం లేకపోలేదు.నగరంలో ఒక ప్రముఖవ్యక్తి, నగరంలో మంచి పేరుప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి హత్య గావించబడ్డాడు. హత్య చేసింది ఒక్కరే కాని 'నేనంటే నేను చేశానని' ఇద్దరు లొంగిపోయారు.

    కోర్టు అంతా నిశ్శబ్దంగా వుంది. న్యాయ మూర్తి లోనికి ప్రవేశించి తన సీటులో ఆశీనులయ్యారు. ఒకవైపు బోనులో ప్రకాష్ అనే 23 సంవత్సరాల యువకుడు, మరోవైపు బోనులో శిరీష అనే 18 సంవత్సరాల యువతి ఉన్నారు. ఇద్దరి ముఖాలు గంభీరంగానే వున్నాయి. 

    శిరీష తరఫునా లాయర్ రాజేశ్వరీదేవి వాదిస్తున్నది. ఆమె శిరీష తోడబుట్టినది. ప్రకాష్ తరఫున లాయర్ సతీష్ కుమార్ వాదిస్తున్నాడు. సతీష్, ప్రకాష్ చిన్ననాటి స్నేహితులు. లాయర్ రాజేశ్వరీదేవి వాదన ప్రారంభించింది. ఆమె ప్రకాష్ వైపు వెళ్ళి -

    "మీ పేరు?"

    "ప్రకాష్"

    "శ్రీకాంత్‌ని మీరే హత్య చేశారా?"

    "అవును"

    "మరి ఈ హత్య శిరీష చేశానంటుంది.

    "లేదు. అతనిని నేనే హత్య చేశాను. ఆమె నిర్దోషి"

    "నో! ఈ హత్య నేనే చేశాను" అని బిగ్గరగా అరిచింది శిరీష.

    ప్రకాష్‌ని ప్రశ్నించడానికి ఇక ప్రశ్నలు లేక ఆమె సీటులో ఆశీనురాలైంది. కాని సతీష్ కుమార్ లేచి శిరీషని ప్రశ్నించినా ఫలితం వుండదనే భావంతోనే అందుకు సిద్ధపడలేదు. 

    న్యాయమూర్తికి అంతా అయోమయంగా వుంది. హత్యచేసింది ఒక్కరే. నిర్దోషిని రక్షించడం న్యాయస్థానం ధర్మం కాని ఇద్దరూ దోషులమనే ఒప్పుకుంటున్నారు. తన తోబుట్టువును రక్షించుకోవడానికి లాయర్ రాజేశ్వరీదేవి, ఎన్ని కష్టాలు పడినా తన చిన్ననాటి స్నేహితుడిని రక్షించోవడానికి లాయర్ సతీష్ కుమార్‌లు ఎంతో తాపత్రయ పడుతున్నారు. మరుసటి రోజుకు కేసును వాయిదా వేశారు. ఇద్దరినీ బెయిల్‌మీద విడుదల చేశారు.

    ఆరోజు సాయంత్రం ప్రకాష్‌ద్వారా ఏమైనా విషయాలు రాబట్టుకోవచ్చనే వుద్దేశ్యంతో సతీష్ ప్రకాష్ వద్దకు వెళ్ళాడు. ప్రకాష్ ఇంటిలోనే వుండి ఏదో ఆలోచిస్తున్నాడు.

    "ఒరే ప్రకాష్! ఈ హత్య నీవు చేయకుండా నీవే చేసినట్లు ఎందుకు ఒప్పుకుంటున్నావురా? ఈ హత్య నీవు చేయలేదని నాకు తెలుసు. చిన్ననాటి స్నేహితుడయిన నన్ను లెక్కచేయకుండా శ్రీకాంత్‌తో స్నేహం పెంచుకున్నావు. అటువంటి అతన్ని నీవే హత్యచేశావంటే నేను నమ్మను"

    "లేదురా సతీష్, ఈ హత్య నేనే చేశాను. శ్రీకాంత్ ఎంతో మంచివాడనే నేను నమ్మాను. కాని వాడు పరమ దుర్మార్గుడు. నీవు నన్ను ప్రయత్నిస్తున్నావు. అందుకు చాలా థాంక్స్. నిన్ను ఆ శ్రీకాంత్‌తో కలిసి దూరంచేసుకున్న నాపై ఇంకా అభిమానం వున్నందుకు ఎంతో సంతోష పడ్తున్నాను. కాని నన్ను తప్పించి ఒక నిర్దోషిని చట్టానికి అప్పగించకు. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను."

    "లేదురా ప్రకాష్, ఈ హత్య నీవు చేయలేదని నేను నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తప్పని పరిస్థితుల వలన నీవు ఒప్పుకుంటున్నావు కాని అలా జరగకూడదు. నిన్ను రక్షించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను" అంటూ తిరుగుముఖం పట్టాడు సతీష్.

    సతీష్ వెళ్ళిపోయిన తరువాత ప్రకాష్ గతం గురించి ఆలోచిస్తున్నాడు. తనకు తెలియకుండానే ప్రకాష్ గతంలోనికి తొంగిచూశాడు.

*  *  *

    బహుశా ప్రకాష్ ఎం.బి.బి.యస్ రెండవ సంవత్సరం పూర్తిచేసి సెలవుల్లో వున్న రోజులవి. ప్రకాష్ మంచి ఆటగాడు. ఆటల్లో శ్రద్ధ ఎక్కువ. ఆ సెలవుల్లోనే విద్యార్థులకీ, ఉద్యోగులకీ క్రికెట్‌మ్యాచ్ వేసుకున్నారు. విద్యార్థుల బృందం వైపు ప్రకాష్ నాయకత్వం వహిస్తున్నాడు. ఉద్యోగస్తుల బృందం వైపు శ్రీకాంత్ నాయకత్వం వహిస్తున్నాడు. అదే వారిద్దరి మొదటి కలయిక. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు జట్లలోనూ నాయకులుగా వున్నందుకు ప్రకాష్, శ్రీకాంత్‌లు తమ పేరును నిలబెట్టుకున్నారు. చాలా బాగా ఆడారు. అప్పటినుండి ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరికీ అన్ని ఆటల్లోనూ శ్రద్ధ ఎక్కువ అని తెలుసుకున్నారు. ఇద్దరూ ఒకరిని మించిన వారొకరు.

    శ్రీకాంత్ ఆ వూఅర్లోనే జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆటల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నాడు. ఒకరోజు శ్రీకాంత్ ఇంటికి ప్రకాష్ వచ్చాడు. ఇద్దరూ కలిస్తే చాలు ఆటల గురించే సంభాషణ ప్రారంభిస్తారు. వారి సంభాషణ అలా కొనసాగుతుండగా ఓ 12,13 సంవత్సరాల పాప "అంకుల్" అంటూ వచ్చింది.

    "ఏమ్మా?"

    "ఈ రోజు డాడీ సినిమాకి వెళదామన్నారు"

    "అలాగే"

    "ఇతను వేరు అంకుల్?"

    "నా కొత్త స్నేహితుడు ప్రకాష్. మిష్టర్ ప్రకాష్, ఈ పాప రెండు సంవత్సరాల క్రితం పరిచయమయింది. మంచి ఇంటలిజెంట్ గర్ల్. 7వ తరగతి చదువుతుంది. నా దగ్గర మంచి చనువు. పేరు శిరీష" అని ఇద్దర్నీ పరిచయం చేశాడు శ్రీకాంత్.   

    ప్రకాష్ తరువాత ఎవరూ లేకపోవడం వలన శిరీషలాంటి చెల్లి ఒకరు వుంటే బాగుణ్ను అనిపించింది. అందుకే శిరీషను చెల్లిగా భావించుకున్నాడు. అలా వారి స్నేహం కొనసాగుతోంది. ఏ రక్తసంబంధంకూడా అలా కలిసి తిరగరు. ముగ్గురూ ఏ ఒక్కరూ ఒకర్ని ఒకరు చూసుకోకపోతే వుండలేరు. స్నేహంలో పడి తన చిన్ననాటి స్నేహితుడైన సతీష్‌ని మరచిపోయాడు ప్రకాష్. అయినా ఏదో ఒకరోజు కలుస్తూనే వున్నాడు. ఇద్దరూ అన్ని ఆటల్లోనూ ప్రావీణ్యం సంపాదించారు. నగరంలో మంచిపేరు ప్రతిష్టలు సంపాదించారు. 

    అలా కాలచక్రం నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది. నగరంలో వీరిరువురి పేర్లు మార్మోగిపోతున్నాయి. ఇద్దరు కలిసి ఏ ఆటలో వుంటే పైచేయి వీళ్ళిద్దరిదే. ఈ నాలుగు సంవత్సరాల్లోనే ప్రకాష్ ఎం.బి.బి.ఎస్.డిగ్రీ పొందడం శిరీష యవ్వనంలో అడుగుపెట్టడం, ప్రమాదవశాత్తు ఆమె తల్లిదండ్రులు మరణించడం, ఆమె తన అక్క రాజేశ్వరీదేవి వద్ద పెరగడం జరిగింది. శిరీషది మొదలే పాలుకారే శరీరం కనుక యవ్వనంలో ఆమె అందచందాల్ని వర్ణించడానికి నేను కవిని కాను. నాకంత అనుభవం లేదు. ఆమె యవ్వనంలో అడుగుపెట్టినా ప్రకాష్, శ్రీకాంత్‌లతో స్నేహం విడిపోలేదు. శిరీష ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాయడం జరిగింది. శిరీష చిలిపిచేష్టలు (వీరిద్దరి దగ్గర మాత్రమే) ఏమీ మారలేదు.

    ఒకరోజు సాయంత్రం ప్రకాష్‌ని అర్జెంటుగా రమ్మనమని శ్రీకాంత్ కబురుచేశాడు. శ్రీకాంత్ పిలవడమే ఆలస్యం. వెంటనే బయల్దేరి వెళ్ళాడు ప్రకాష్. ప్రకాష్ వెళ్ళేసరికి శ్రీకాంత్ ఏదో ఆలోచిస్తున్నాడు. ప్రకాష్ రాకను గమనించి కూర్చోమన్నాడు.

    "ఒరే ప్రకాష్ నేనో చిన్న కోరిక కోరుతాను తీర్చుతావా?" (ఇన్ని సంవత్సరాలుగా వారి స్నేహం ఏకవచనంతో పిలుచుకునేంతవరకు అయింది)

    "తీర్చగలిగిన కోరికయితే తప్పక తీరుస్తానురా!"

    "నీవు తలుచుకుంటే తీర్చగలవు"

    "అయితే చెప్పు"

    "నీవు... నీవు... శిరీషని పెళ్ళి చేసుకోవాలి"

    అంతే ప్రకాష్ గుండె స్తంభించి పోయింది. కారణం మాత్రం అడగలేదు. జవాబు చెప్పలేక "ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాను" అని చెప్పేసి ఇంటికి చేరుకున్నాడు.

    ఇంటికి చేరుకున్న తరువాత ఎవరితోను మాట్లాడలేదు. తన గదిలోకి పోయి మన్స్సులో ఆలోచించుకొంటున్నాడు.

    "శ్రీకాంత్ ఎందుకు అలాంటి కోరిక కోరాడు. అయినా నేను శిరీషను తోడబుట్టిన చెల్లెలుగా చూసుకొంటున్నానని తెలుసు. శిరీషకీ, శ్రీకాంత్‌కి ఏదో గొడవ జరిగే వుంటుంది. వెళ్ళి రహస్యంగా తెలుసుకోవచ్చును' అనుకొని తిరిగి బయటకు వెళ్ళిపోయాడు.

    ఈలోపు ప్రకాష్‌కి తెలివి వచ్చింది. వాచీ చూసేసరికి 9గంటలయిపోయింది. భోజనం ముగించి నిద్రకుపక్రమించాడు.

*  *  * 

    మరుసటిరోజు కోర్టు జనంతో కిక్కిరిసి వుంది. రాజేశ్వరీదేవిగారు వాదన ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలోనే శిరీష తడిలేని గొంతుతో -

    "రాజేశ్వరీదేవిగారు ఇలా వస్తారా?"

    సొంత అక్కనే పేరు పెట్టి పిలిచేసరికి అందరూ ఆశ్చర్య పోయారు. ఆమె రాజేశ్వరీదేవిని చూస్తూ హీనమైన స్వరంతో "అక్కా! నిన్ను అలా పేరుపెట్టి పిలిచానని ఏమీ అనుకోకు. ఇది కోర్టు అని అలా పిలిచాను. నీవు ప్రకాష్‌ని ప్రశ్నించనవసరం లేదు. ఈ హత్య నేనే చేశాను. ప్రకాష్ నిర్దోషి. అన్ని విషయాలు ఇందులో వ్రాశాను. ఇంక నేను ఎంతోసేపు బ్రతకను" అని బోనులోనే పడిపోయింది శిరీష.

    శిరీషని చూసి రాజేశ్వరి గట్టిగా అరిచింది. ప్రకాష్ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. ఏడుస్తున్నాడు. ఇరువురిని ఊరుకోబెట్టి వుత్తరం చదవమని ఆదేశిచ్మారు జడ్జి. కోర్టు అంతా నిశ్శాబ్దంగా వుంది. ఉత్తరం చదవటం ప్రారంభమైంది. అందులో -

    "న్యాయమూర్తి గారికి,

    శ్రీకాంత్‌ని నేనే హత్య చేశాను. ప్రకాష్ నిర్దోషి. దానికి కారణం కూడా వ్రాస్తున్నాను.

    నేను నా చిన్ననాటి వయస్సులో శ్రీకాంత్‌కి పరిచయమయ్యాను. 'అంకుల్' 'అంకుల్' అని అతని దగ్గర మంచి చనువైంది. మరి రెండు సంవత్సరాలకి ప్రకాష్ పరిచయమయ్యాడు. ప్రకాష్‌ని అన్నయ్య అని పిలవక పోయినా అన్నయ్యలా భావించుకొనేదాన్ని.

    నేను యుక్తవయస్కురాలైన తరువాత మా తల్లిదండ్రులు మరణించడం ఆ తరువాత అక్కడేవున్న మా అక్క, బావ దగ్గర పెరిగాను. నన్ను అట్టే తిరగవద్దని మా అక్క, బావ చెప్పారు. కాని నేను లెక్కచెయ్యలేదు. వాళ్ళతో మాట్లాడటం మానలేదు. 

    ఒకరోజు నేను శ్రీకాంత్ ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి పడుకొని వున్నాడు. 'అంకుల్' అని పిలిచాను. పలకలేదు. దగ్గరకి వెళ్ళాను అంతే, నన్ను తన పైకి లాక్కున్నాడు. ఈ హఠాత్సంఘటనకి నానోట మాటరాలేదు. నేను వాడి నుండి విడిపించుకోవటానికి ప్రయాత్నించాను. అయినా అతను తన దాహం తీర్చేసుకున్నాడు. నేను ఎంతో కుమిలి కుమిలి ఏడ్చాను. ఆ తరువాత బాధ పడ్డాడు. జరిగినదానికి క్షమించమన్నాడు. పెళ్ళిచేసుకుంటానని ఒప్పుకున్నాడు. నిజమేనని నమ్మి ధైర్యంగా తిరగసాగాను. అక్క, బావకి కూడా అనుమానం రాకుండా తిరిగాను. అలా రెండు రోజులు గడిచిపోయింది.  

    ఒక రోజు సాయంత్రం ప్రకాష్ ఇంటికి రావడం చూశాను. ఎందుకో వారి సంభాషణ వినాలనిపించింది. శ్రీకాంత్ ఇంటికి వెళ్ళి చాటుగా వుండి అంతా విన్నాను. శ్రీకాంత్ ప్రకాష్‌ని నన్ను పెళ్ళిచేసుకోమని కోరుతున్నాడు. ఆమాట విని నేను గజగజ వణికిపోయాను. శ్రీకాంత్‌మీద కసి పగ చెలరేగింది. అలాంటి దుర్మార్గుడు బ్రతికివుండకూడదనుకున్నాను. ప్రకాష్ బయటికి వెళ్ళిపోయినా వెంటనే ప్రక్కనే వున్న క్రికెట్ బ్యాటుతో తలపై కొట్టాను. ఇంకా పగ తీరలేదు. ప్రక్కనే వున్న పండ్లకత్తితో పొడిచాను. తిరిగి ఆ సమయానికి ప్రకాష్ అక్కడికి వచ్చాడు. నన్ను కాపాడుదామని తనే హత్య చేసినట్లు పోలీసు రిపోర్టు ఇచ్చాడు. కాని మీకు కావలసింది నిజం. ప్రకాష్ నిర్దోషి. నేను బ్రతికివుండి మరొక మగాడ్ని అన్యాయం చేయలేను. అందుకే నా జీవితాన్ని ముగిస్తున్నాను. ఈ వుత్తరం మీరు చదివేసరికి నేను ఈ లోకంలో వుండను. ప్రకాష్ మాత్రం నిర్దోషి.

- శిరీష"                

    ఉత్తరం చదివి అందరికళ్ళు కన్నీటితో నిండిపోయివున్నాయి. ఉత్తరం సాక్ష్యంబట్టి ప్రకాష్‌ని నిర్దోషిగా భావించి విడుదల చేశారు. సతీష్, ప్రకాష్ ఇంటికి చేరుకున్నారు. తలుపు తీసేసరికి ఎదుర్గా వుత్తరం పడివుంది. ఆ వూర్లోనే పోస్ట్ చేయబడి వుంది. చింపి చూశాడు ప్రకాష్. అది శిరీష వ్రాసింది!  

    "డియర్ ప్రకాష్

    ఆ దుర్మార్గుడ్ని నీవు చంపినా నేనే చంపినట్లు ఒప్పుకున్నాను. ఎందుకో తెలుసా? నా జీవితం ఎలాగూ పాడైపోయింది. నీవు హంతకుడివని రూఢీ అయితే నీ జీవితం పాడైపోతుంది. నేను బ్రతికివున్నా తలెత్తి తిరుగలేను. నన్ను రక్షిద్దామని ఎంత ప్రయత్నించావు. నాపై ఆమాత్రం ప్రేమ చూపినందుకు కృతజ్ఞురాల్ని. కాని నేను బ్రతికివుంటే మీ అందరి పరువు పోతుందే తప్ప మరేం ప్రయోజనం లేదు. అందుకే నేనే ఈ హత్య చేశానని ఒప్పుకున్నాను. నీ జీవితం పూలబాటలా సాగిపోవాలి. అదే నా కోరిక. శ్రీకాంత్‌లాంటి స్నేహితుడితో మాత్రం స్నేహం చేయకు. వచ్చే జన్మలోనైనా నీలాంటి అన్నయ్యకు చెల్లెలిగా పుట్టాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను.

నీ చెల్లెలు                 

శిరీష"                 

    ఈ ఉత్తరం చూసి సతీష్

    "ఒరే ప్రకాష్! ఇది నిజమేనా?"

    "అవునురా సతీష్"

    "ఒరే! శిరీష చాలా త్యాగం చేసిందిరా! మీ ఇద్దరికీ రక్తసంబంధం లేకపోయినా నీ భవిష్యత్తు బాగుండాలని ఒక త్యాగం చేసిన త్యాగదేవత. నేను ఒక లాయర్‌గా మా స్నేహితుడ్ని కాపాడుకుందామనుకున్నాను. కానీ ఒక అమాయకురాలిని నిందితురాలిగా ఊహించాను. అలా భావించిన నేను మూర్ఖుణ్ణిరా!" అని సతీష్ కన్నీటి బొట్లు రాల్చేశాడు.  

(యువ మాసపత్రిక 1985 డిసెంబర్ సంచికలో ప్రచురితం) 
Comments