ఉపాధి - బుద్దా మురళి

    "ఎక్స్ క్యూజ్   మీ" 

    బస్సు కోసం ఎదురు చూస్తున్న నేను ఎవరా? అని చూశా - పక్కన ఓ 25   ఏళ్ళ కుర్రాడు నిలబడి ఉన్నాడు. 

    ఏంటి ? అన్నట్టు కళ్ళు పైకెత్తాను.

    "మీకు కష్టం కలిగిస్తున్నందుకు క్షమించండి. విజయవాడ నుండి, బస్సులో వస్తున్నాను. చిక్కడపల్లిలో మా బాబాయ్ వుంటాడు. రాత్రి పడుకున్నప్పుడు ఎవరో పర్సు కొట్టేశారు. మీరు ఏమి అనుకోక పొతే కాస్త సహాయం చేయగలరా?" 
 
    అతని స్థితిని  చూస్తే జాలేసింది.  శుభ్రమైన దుస్తులేసుకొని  కాలేజీ కెళ్ళే కుర్రాడిలా ఉన్నాడు. చక్కని భాషలో మొదట ఇంగ్లీష్ లో ప్రారంభించి తర్వాత తెలుగులో నమ్రతగా మాట్లాడే అతను చెప్పేవన్నీ నిజమే అని నమ్మక తప్పలేదు నాకు. ఈ మధ్య  దొంగ వెదవలేక్కువయ్యారు. అతని స్థానంలో  నేనున్నట్టుగా  ఒక్క క్షణం   ఉహించుకోగానే కాళ్ళు చేతులు వణికాయి. ఎవరూ తెలియని కొత్త ప్రదేశంలో జేబులో డబ్బు లేకపోతే ఇబ్బందే మరి. అతనడిగినట్టు  బస్సు చార్జీ ఇచ్చాను.

    మరో 15 రోజుల తర్వాత అదే బస్సు కోసం నిలబడితే అదే యువకుడు మళ్లీ వచ్చాడు.
 
    "ఎక్స్ క్యూజ్ మీ" 

    తను చెబుతున్నదేమీ నాకు వినిపించలేదు. ప్రతివారిని సులభంగా నమ్మించే అతన్ని చూసి ఆశ్చర్యం వేసింది. 

    తను నన్ను గుర్తించలేదు కాని నేనతన్ని గుర్తించాను. 

    "ఎంత  డబ్బు పోయింది"

    "వెయ్యి రూపాయలు , ఒక రిస్ట్ వాచీ."

    "చాలా పెద్ద మొత్తమే . నాకు ఇక్కడి పోలీసులు తెలుసు. పదండి వెళ్ళి రిపోర్టి ద్దాం. మీ సొమ్ము మీ కప్పగించే బాధ్యత నాదీ." అతడాశించని  సమాధానం రావడంతో కంగుతిని, "వద్దులెండి పోలీసులతో పనంటే కొరివితో తలగోక్కున్నట్టే" అంటూ వెళ్ళసాగాడు .

    అతని భుజం మీద చేయివేసి "పరవాలేదు నిన్ను ఇంతకు ముందు కూడా చూశాను అసలు విషయమేమిటో చెప్ప"మన్నాను  ఎదురుగా ఉన్న హోటల్ లోకి దారి తీస్తూ.

    "బి.కాం. వరకు చదివాను ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. మూడు వందలకంటే ఎక్కువివ్వలేమన్నారు  దుకాణపు సేట్లు.  ఓ రోజూ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్  వస్తుండగా నిజంగానే నా పర్సునేవరో  కొట్టేశారు. అప్పుడు నా పరిస్థితి అక్కడున్న కొంతమంది ఉద్యోగులకు ఇంగ్లీష్ లో వివరించగా ఆందరూ నాకు సహాయం చేశారు. బిక్షగాడికి  ఐదు పైసలు కూడా వేయని మహానుభావులు నాకింతగా ఎలా సహాయం చేశారో నాకర్థం కాలేదు. 'జాలి' అని మీరనుకోవచ్చు కానీ అదికాదు మనవాళ్ళలో జాలిపాళ్ళు చాలా తక్కువ. మన కళ్ళ ముందే ఓ వ్యక్తి ప్రాణం పోతున్నా మనవాళ్ళు పట్టించుకోరు. మరి  వీరు ప్రత్యేకంగా నా మీద జాలి చూపడానికి కారణం నాకర్ధమైంది. మీరు నమ్మకపోవచ్చు కానీ ఇదీ వాస్తవం. మనవాళ్ళకు మనభాషంటే హీనమైన అభిప్రాయం . ఇంగ్లీష్ భాషపై చాలా మక్కువ అందుకే ఐదు పైసలు దానం చేయని వారుకూడా నా భాషా ప్రతాపానికి 10 రూపాయలు సహాయం చేశారు . ఆ రోజే నాకో ఆలోచన వచ్చింది . అసలు దొరుకుతుందో లేదో తెలియని ఉద్యోగానికై ఆశపడేకంటే ఇదే మేలనుకొని రోజుకోచోట ఈ నాటకమడుతున్నాను . రోజుకు కనీసం వంద రూపాయలైనా   సంపాదించ గల్గుతున్నాను. నా విద్య నాకు ఉద్యోగం చూపక పోయినా భాషా ప్రావిణ్యం   నాకు మంచి ఉపాధి చూపుతుంది."

    "క్యా   హోనా" తెలుగువాడైన హోటల్ సర్వర్ ఉర్దూలో గర్జించే సరికి తేరుకున్నాను.
  
(ఆంధ్ర పత్రిక ఆదివారం అనుబంధం 6,నవంబరు 1988 సంచికలో ప్రచురితం)

Comments