ఊరుబావి - భైరవభట్ల విజయాదిత్య

 
    “ ఏండీ! ఇక్కడా.. శీనయ్యగోరి ఇల్లెక్కడ ?” నీరాళ్ళగొంది పొలిమేరలో రైతుని అడిగాడో బాటసారి. “ఇలా తిన్నగెల్తే ఊరుబావి వస్తాది. ఊరుబావి నుండి ఎడంపక్క నాలుగో ఈదిలో రెండో ఇల్లు” చెప్పాడా రైతుకూలి. ఊరుబావి నీరాళ్ళగొంది అనే పల్లెటూరికి ఓ వైపు ఉన్న పెద్ద బావి. అది ఆ ఊరి చిరునామా. ఆ గ్రామంలో ఏ ఇంటికి దారైనా ఊరుబావి నుండే చెబుతారు. ఆ ఊరికి అది జీవధార. ఆ బావి ఎప్పటి నుండీ ఉందో ... ఎన్నో రకాల గాథలు చెబుతుంటారు. మత్స్యావతారంలో విష్ణుమూర్తి పుట్టిన నీళ్ళతొట్టె అది. కామేశ్వరమ్మ జలకాలాడిన కొలనుకూడా అదే. ప్రస్తుతం మాత్రం ఆ గ్రామానికి నీరందించే గంగమ్మ తల్లి... ఆ ఊరు బావి.

    “ ఓరి సిట్టిగా ! బేగె బావికాడకెల్లి ఓ బిందె నీళ్ళు పట్టుక్రా.. లగెత్తు.” చెప్పిందో తల్లి.  “ అదేటే! ఆ పసి గుడ్డుని అలా పంపేశావ్. ఆడు తోడ గలడా? అసలే లోతుబావి..వత్తన్నప్పుడు చూసినా. నాకే కళ్ళు తిరిగినై. ఏ కాలో జారితే” ఆదుర్దా గా అడిగింది చుట్టపుచూపుగా వచ్చినమ్మ. “గంగమ్మ తల్లుండగా మరేటి కాదు. ఆడికలవాటే. అయినా బావి కాడ ఎవరో ఒకరుంటార్లే. ఈణ్ణి చూసి ఆళ్ళే తోడి పోస్తారు. బావికేసున్నోళ్ళు మంచోళ్ళు. చూసుకుంటారు.” అలా చాలా ఏళ్ళు ఆ బావి ఊరి అవసరాలు తీర్చింది. చుట్టుప్రక్కల ఎంత కరువున్నా, చెరువులు ఎండిపోయినా ఆ బావిలో నీరు మాత్రం సరిపోయేంత గా ఉండేది. ఆ ప్రాంతంలో పెద్దకరువు వచ్చినప్పుడు చుట్టుప్రక్కల గ్రామాలవాళ్ళందరూ ఈ బావి నీళ్ళు తీసుకు వెళ్ళేవారని, ఈ ఊరి మంచితనాన్ని, ఆ బావి గొప్పతనాన్ని చెప్పుకుంటుంటారు.

    “ నువ్వెంతకన్న తోడతావ్ గానీ .. ఇలా ఇయ్యత్తా నే తోడతాగా”  సూరమ్మ ఒక చేద తోడేసరికి, అప్పటిదాకా దాపున చెట్టు దగ్గర సేదతీరుతున్న సింగడు వస్తూ చనువుగా తాడు తీసుకున్నాడు. “ వోరివోరివోరి సింగా! నీకింత బుద్దెప్పుడు పుట్టేసినాది”  చెట్టుదగ్గర గురవయ్య పరాచకాలు.  “అదేందలాగంటావ్! ఆడంగులు కట్టపడుతుంటే సూత్తూ ఎలా ఉంటాం” “ఆ( ! నువ్వో పెద్దమొగోడివి వచ్చినావ్! నాలుగు బిందెలయ్యేసరికి  నీ పనైపోద్దీ” “నాలుగు కాదు నాలుగొందలైనా ఏం కాదు ..కావస్తే పందెం ఏస్కో” “ సరే కాస్కో  ! పందెం. నువ్వు నాలుగొందల బిందెలు ఆపకుండా తోడాలా. సెయ్యలేదో మనోళ్ళందరికీ కోడికూరతో విందు సెయ్యాల..” “ తోడితే?” “ నేనూ విందిచ్చుకుంటా” “ విందొద్దుగానీ, దొరగారికి సెప్పి తోటలో పని ఇప్పియ్యాల” పందెం మొదలయ్యింది. ఎవరు గెలిచారో.?! వీడు విందూ చేశాడు. వాడు పనీ ఇప్పించాడు. సరదాలకీ, సరసాలకీ, గిల్లికజ్జాలకీ, పండగలకీ ఆ బావి గట్టు వేదిక. ఇలాంటి చిరుజ్ఞాపకాలు ఆ బావి సొంతం.

    కాలం గడుస్తున్న కొద్దీ బావి చుట్టూ ఎన్నో జరిగాయి. బావి వైపువాళ్ళు బావికి గట్టు కట్టి, గోడ కట్టి  బాగుచేయించిన కాలమూ ఉంది. తమ గుత్తగా బావిదగ్గరకు రావడానికి నియమాలు పెట్టి కట్టడి చేసిన రోజులూ ఉన్నాయి. తరాల అంతరాలకు ఆ బావి ప్రత్యక్ష సాక్షి. కాలంతో ఆ గొడవలూ కొట్లాటలూ వస్తూనే ఉన్నాయి సర్దుకుంటూనే ఉన్నాయి. మనుషుల మనస్థత్వాల వల్ల ఈ హెచ్చుతగ్గులస్థాయి మారుతున్నా ఒక విషయం అందరిలో బలంగా ఉండేది. ఆ బావి ఆ ఊరి అవసరం. దానిని కాపాడుకోవాలి. అందరికీ అందాలి. ఆపై చేసే ఆలోచనలదగ్గరే అనేకమైన తేడాలు వచ్చాయి. హక్కులు, బాధ్యతలు, కట్టుబాట్లు ఏనాటికీ అందరికీ నచ్చేవిగా ఉండలేవు. ఊళ్ళోవాళ్ళో,  పొరుగూరివారో, బాటసారులో… బావి దగ్గర నీళ్ళు త్రాగినవారూ ఉన్నారు. బావిలో చెత్తా చెదారం పడేసిన ప్రబుద్ధులూ ఉన్నారు. ఎప్పటి కప్పుడు క్రొత్త నీరు ఊరే బావి అది. అప్పుడప్పుడు బాగుచేసుకుంటుండాలి అంతే.     

    “ ఏమాటకామాట సెప్పుకోవాల ! మాసారాకొట్టు ఈరయ్య దేముడు! ఉట్టికాలకి సుక్కపోసిండు. .. జగ్గమే మాయా..”  తూలుతు వెళ్ళిపోయాడు అప్పన్న. “ అదేట్రా ఉట్టినే వదిలేశావ్?” అడిగాడొకడు వీరయ్యని. “ఆడెక్కడికి పోతాడు. ఆడిది నీరాళ్ళగొంది. మత్తు దిగిన మీద ఆడే ఇస్తాడు. ఇవ్వకపోతే ఈ పాలి మత్తు లో ఏలుముద్రేయించేస్తాను.” నవ్వుతూ చెప్పాడు వీరయ్య. ఆ సారా కొట్టు నీరాళ్ళగొందికి మూడు మైళ్ళ దూరంలో ఉంది. కొత్తగా వచ్చింది. కొన్ని ఎంత ఎక్కువైతే అంత మంచిది. కొన్ని తక్కువగా ఉంటే ఫరవాలేదు. మంచి చేసినా చెయ్యకపోయినా చెడు మాత్రం చెయ్యవు. కొన్ని అలాకాదు. చిన్నదైనా ఉండకూడనిది. మనసులో భావాలు కావచ్చు, మనిషి అలవాట్లు కావచ్చు, సామాజిక రుగ్మతలు కావచ్చు.  మంచినీళ్ళు, అప్పుడప్పుడు కల్లు త్రాగే ఆ ఊరికి అంతకు మించిన మత్తు పరిచయమయ్యిన కాలం అది. బావి దగ్గరకు వచ్చేవాళ్ళను చూసి, ప్రశాంతత చెడగొడుతున్నారని, ఆ వైపు వాళ్ళు చిరాకు పడే కాలం అది. తమ ఇంటికి బావి అంత దూరంలో ఎందుకుంది అని ఇటువైపువాళ్ళు విసుక్కుంటున్న కాలం. మెల్లగా మైకం ఊరిని క్రమ్ముతున్న కాలం అది.

    “ఏటా ఊరుబావి గొప్పా అంటా. .. నువ్వు మరీ ఉత్తమొద్దులా ఉన్నావే. పట్నంలో ఇంటికో బావుంటుంది తెలుసా.” సారా దుకాణంలో వాదనలకు మొదలు ఉండదు. ఎవడి నోటి నుండి ఏది ఎందుకు వస్తుందో.  నీరాళ్ళగొంది కున్న మంచిపేరుకు కుళ్ళుకున్న ఏదో ఊరువాడు తన అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. ఈ విషయం మరో ఊరి మునసబుకు తెలిసింది. నెల తిరగకుండానే మునసబుగారింటి వెనుక తోటలో నుయ్యి వేయించారు. ఆ ప్రాంతానికి పెద్ద పెద్ద మిషన్లు రావడం క్రొత్త. జనాలంతా ఆ వింత చూడాడానికి తీర్థంలా  వెళ్ళారు. మెల్లగా పెద్ద మెషిన్లు అడపా దడపా కనిపిస్తున్నాయి. పట్నంతో పరిచయం పెరుగుతోంది.
నీరాళ్ళగొంది లో మొదటిసారిగా డ్రిల్లింగ్ మెషీను పెదనారయ్యగారి తోటలో పనిచేసింది. పెదనారయ్య గారి అబ్బాయి పెళ్ళికే అది తయారయ్యింది. తనకూతురు బావిదగ్గరకెళ్ళి కష్టపడకూడదని పిల్లనిచ్చిన భూస్వామి రామచంద్రయ్య ఇచ్చిన కానుక అది. ఆ ఊరి పెద్దింటి పిల్లల మనసుల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి రెపరెపలాడింది. కాలంతో పాటు ఊరిలో మార్పులు వస్తున్నాయి. ఊరు విస్తరిస్తోంది. సారాకొట్టు వైపుగా వ్యాపిస్తోంది. ఊరుబావికీ సారాకొట్టుకీ అసలు సంబంధం ఏమిటి? దేని పరిణామక్రమం దానిదే. అయితే యాదృచ్చికమో, సహజమో తెలియదు ఆ ఊరిలో మాత్రం ఒకటి క్షీణించిపోతోంది. మరొకటి అంతకంతకూ బలపడుతోంది. చాలా విషయాలు ప్రత్యక్షంగా ఏ సంబంధం లేకపోయినా పరోక్షంగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి.     

    ఉన్నవాళ్ళు అవసరం లేకపోయినా అలవాటుగా బావి బాగోగులు కొన్నాళ్ళు చూస్తూనే ఉండేవారు. ఆపై ఊరిలో పేరుకోసం ఆ పని చేసే వారు. అది అంత లాభసాటి వ్యవహారం కాదని వదిలేశారు. కొన్ని విషయాలు ఇంతే. జరుగుతున్నంతసేపూ దాని గురించి ఎవరూ పట్టించుకోరు. జరగనప్పుడే దృష్టి అటు వెళ్తుంది. పంటకొరకు రైతు పడే కష్టం ఎవరికీ అఖ్ఖరలేదు. దిగుబడి తగ్గితే మాత్రం వేలెత్తి చూపడానికి ఒకరు కావాలి. బావి బాగోగుల విషయమై వాదోపవాదాలు జరుగుతున్నాయ్. బావి ఉపయోగంలో ఉన్నా శిధిలమౌతోంది. పిల్లల్ని బావి దగ్గరకు పంపడానికి భయ పడుతున్నారు. కాచుకోవడానికి అక్కడ ఎవరైనా ఉంటారా? ఉన్నా పట్టించుకుంటారా? దాన్ని బాగుచెయ్యాలని కొందరు చందాలు వేసుకున్నారు. కొందరిచ్చారు కొందరివ్వలేదు.. ఇవ్వని వాళ్ళు బావి వాడకూడదని ఒకరి వాదం. ఎలా ఆపుతామని ఒకరి సందేహం. ఎలాగైనా ఆపాలని ఇంకోడి బీరాలు. సారాకొట్టు పెద్దగా మారిన సందర్భంగా ఉచితమద్యం ప్రభావంలో జనాల సందడి. సరదాలు, సరసాలు సారాకొట్టుకు మారినాయి. పందాలూ మారినాయి. ఏం పందాలు వేశారో చెప్పడానికి సభ్యత అడ్డొస్తుంది. ఎవరు నెగ్గినా, పందానికి కట్టుబడినా, కట్టుబడకున్నా ...జీవితంలో ఇద్దరూ పతనమయ్యేవారే.   .

    ఈసారి బావిని బాగుచెయ్యాలని ఎవరూ అనుకోలేదు. తమ ఇళ్ళల్లోని బావి నీళ్ళిచ్చి తమ పరపతిని పెంచుకుంటున్నారు, పనులను చేయించుకుంటున్నారు. మంచిపని సామాజిక బాధ్యత నుండి వ్యక్తిగత ఆర్భాటంగా మారింది. అది పసిగట్టలేని ఆ ఊరి పాత ప్రెసిడెంటు ఆ సారి ఎలక్షన్లలో బావిని తానే బాగుచేస్తాననే హామీతో ముందుకొచ్చాడు. అతనికి వ్యతిరేకంగా నిలుచున్న వీరయ్య వీధికో బోరింగు నినాదంతో దూసుకుపోయాడు. బావి దగ్గరలోనే రెండు బోరింగు పంపులు పడ్డాయి. సారాకొట్టు దగ్గర్లో రెండు పడ్డాయి. బావికి దూరంగా ఉన్న ఇళ్ళ దగ్గరకు ఇంకో సారాకొట్టు మాత్రం వచ్చింది. బావిపై అధికారం వీరయ్యకొచ్చింది.
కాలం గడుస్తోంది. బోరింగుకి తాళాలు వచ్చాయి. బావి పాడుబడుతోంది. బావిలో చెత్త పేరుకుపోతోంది. ఆ నీరు కలుషితమమవుతోంది. తప్పక ఉపయోగిస్తున్నవారు మంచాన పడుతున్నారు. బావికి దూరంగా ఉన్నవాళ్ళల్లో అసహనం పెరుగుతోంది. అది సారామత్తులో కొట్టుకుపోతోంది. ఎలా జరిగిపోతున్నాయి ఇవన్నీ. సహజంగానా? అసహజంగానా? మనిషి ప్రకృతిలో భాగం అనుకుంటే మనిషి చేసే పనులన్నీ ప్రాకృతికంగా జరిగే మార్పులే. సహజమే! బహుశా ఇందులో మనిషి పాత్ర ఏముండదేమో. అతను ఆలోచనలకు, భావాలకూ బందీ. అవే అతణ్ణి నడిపిస్తాయి. నిరంతరంగా జరుగుతున్న పోరాటం ... మనుషుల మధ్య కాదు. ఆలోచనలమధ్య. భావాల మధ్య. ఊరుబావి గురించి అప్పుడప్పుడు మాటలు వస్తున్నాయ్. కొందరు గొప్పగా చెప్తారు. కొందరు అనుమానంగా చూస్తారు. కొందరు అనాగరికంగా భావిస్తారు.
మెల్లగా అన్ని చోట్లా బోరింగు పంపులు వచ్చాయి. ఒక వీధివాళ్ళు ఇంకో వీధి బోరింగు వాడరాదు. కొన్ని బోరింగుల్లో నీళ్ళు పడడం మానేశాయి. ఊరుబావి సంగతి ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రక్క వీధి బోరింగు గురించే ఆలోచన. అప్పటికే కొందరి ఇంటిలో పంపులు ఉన్నాయి. వారు నీళ్ళు పట్టుకోనిచ్చేవారు. అయితే బిందెకి ఇంత అని డబ్బులు తీసుకుని. ఇప్పుడు వ్యాపారవస్తువు కానిది ఏదీ లేదు.  బావిలో నీరు ఇంకిపోయింది. గోడ పడిపోయింది. చూసుకోక ఒక గొర్రెపిల్ల పడిపోయింది. దానితో బావికి మూతపడిపోయింది. ఊరుబావి గురించి ఎవరైనా మాట్లాడితే వాడిని వెర్రివాడిగా చూస్తున్నారు. కొందరు కోప్పడుతున్నారు. కొందరు వెలివేస్తున్నారు.

    బోరింగు కోసం డ్రిల్ చేసే లోతు పెరుగుతూ పోతోంది. ఎన్ని పొరలు దాటి, ఎన్నిలోతులు త్రవ్వి తీయాలో! ఎన్ని కరువులు చూసినా ఆ నేల ఇంకలేదు. ఇప్పుడు పెనుతుఫాను ఆగిన రెండవరోజుకే తడారిపోతోంది. సారాప్యాకెట్లు విరివిగా దొరుకుతున్నాయి. దానితో పాటే నీళ్ళ ప్యాకెట్లు కూడా దొరకడం మొదలయ్యాయి. అవసరాలు, విలాసాలు కలగాపులగం అయిపోయాయి.  బాటిల్లో, కేన్లలో రకరకాల కంపెనీల నీళ్ళు అందుబాటులోకి వచ్చాయి. నీటికీ , సారాకీ హద్దులు చెరిపేస్తూ రకరకాల పానీయాలు. ఊరి చిరునామా సారాకొట్టు కు మారింది. అది కొందరికి అసూయ కలిగించింది. వాళ్ళు ఆలోచనచేశారు. మత్తుని మత్తుతోనే కొట్టాలి. గుర్తొచ్చింది. ఊరుబావి గోడకట్టినప్పుడు ఒకవైపు గంగమ్మతల్లి బొమ్మని చెక్కించిపెట్టారు. గోడశకలాలమధ్యనుండి దానిని వెలికితీశారు. బావి బాగుపడలేదు. అందులో నీరులేదు. ఆ గట్టు పై గంగమ్మ తల్లి గుడి మాత్రం  వెలసింది.   మత్తు మత్తుకు విరుగుడు కాదు. అది మరింత పెంచుతుంది. సారాకొట్లూ పెరిగాయి. గంగమ్మతల్లి ఆలయమూ పెద్దదయ్యింది. చాలా ఇళ్ళల్లో  మోటర్లు వచ్చేశాయి. ప్రతీవీధికీ పంపులు ఎలానూ ఉన్నాయి. ఇప్పుడు బావి గురించి మాట్లాడాలంటే ఒక బెరుకు. ఎవరేమంటారో? ఏమనుకుంటారో? నాకెందుకొచ్చినగొడవ. ఏదోలా నా పని అయిపోతోందిగా. అయినా ఇది ప్రభుత్వం పని. నీరాళ్ళగొందిలో సగటు మనిషి ఆలోచన.  ఊళ్ళో కాలవలు వచ్చాయి. మురికినీరు పెరిగింది. నీళ్ళ మోటరు వేసి టీవీ సీరియలు చూస్తూ మరచిన ఒకరి ఇంటి బయట తారురోడ్డుపై నీటి వెల్లువ. ఇంట్లో పెద్దాయన తిట్లు. నీళ్ళు పోయినందుకుకాదు. కరెంటు బిల్లు పెరుగుతుందని! దేన్నైనా డబ్బు తో కొలిచే తత్వం సహజమయ్యింది.   శీనయ్యగారి ఇంటి ముందు ఒక పెద్ద ఫౌంటెన్. ప్రతీ మేడలోనూ ఏ.సీ గదులు తప్పనిసరి.   

    ఏదైనా పాడైనా, నీళ్ళు రాకున్నా, ప్రభుత్వం కొరకు ఎదురుచూపులు. అందాకా ఎలాగో నెట్టుకురావడం. నీళ్ళట్యాంకు దగ్గర కొట్టుకోవడం. గంగమ్మతల్లికి మొక్కుకోవడం. మందుత్రాగి సోలిపోవడం. ఇది లేనివాళ్ళ గతి. ప్రభుత్వాన్ని తిట్టుకోవడం. లంచాలిచ్చి లోతుకు తవ్వించుకోవడం. నీళ్ళతొట్టెల్లో జలకాలాడడం. త్రాగడానికి.. అది నీరైనా మందైనా, పట్నంనుండి తెప్పించుకోవడం. ఇది ఉన్నవాళ్ళ స్థితి.  

    ఈ కాలానికొచ్చేసరికి  ఊరుబావి కథ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యింది. నిజానికి ఊరుబావి గాథలో ఎన్నో  అగాధాలు, లోపాలు. అదంతా అతుకుల బొంత అని కొందరి వాదన. కాదు కుక్కలు చింపిన విస్తరయ్యిందని వేరొకరి భావన. ఏదైనా ఇప్పుడు ఊరుబావి గురించి సరిగా చెప్పగలిగే వారు ఆ ఉరిలో కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ ఊరికి ఒక గుర్తు లేదు. ఒక గుర్తింపులేదు. అది అభివృద్ధి చెందిన నీరాళ్ళగొంది.

    ఆనందం, సంతోషం సమష్టి స్థాయి నుండి వ్యక్తిగతసుఖంగా రూపాంతరం చెందింది. సుఖం దాహాన్ని పెంచుతుంది .. తీర్చలేదు. అహంకారపు మత్తులో స్వశక్తి ఆర్చుకుపోతున్న కాలం ఇది. ఇంద్రియాలు మనిషినీ, విలాసాలు సమాజాన్ని, అనైతికం జాతివ్యక్తిత్వాన్ని, అయోమయం జ్ఞానాన్ని, వ్యామోహాలు మనసుని, అశక్తత బుద్ధిని కబళిస్తున్న కాలం ఇది. ప్రేమకు కనిష్ట రూపమైన స్వార్థం విశృంఖలంగా పెరిగిపోతున్న కాలం.  మంచినైనా చెడునైనా పట్నం నుంచి దిగుమతి తెచ్చుకునే నీరాళ్ళగొంది యిది. దీనికి మౌనసాక్ష్యం ఊరుబావి. ఇంకిపోయి, పూడుకుపోయిన ఊరుబావి.   పేరుకే మిగిలింది.  అనవసరపు మాటలలో, అయోమయపు కవితలలో, అర్థంకాని కథల్లో..! 

(ఆశ మాసపత్రికలో ప్రచురితం) 
Comments