వాన ప్రస్థం - సాయి బ్రహ్మానందం గొర్తి

    గేటు తలుపు తీద్దామనుకుని ఒక్కసారి ఆగిపోయి చుట్టూ చూసాను. ఆ ఇంటి గోడల మీద వెల్ల పెచ్చుల్లా ఊడి ఇటుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటి పైకప్పుమీద పెంకులు కొన్ని చోట్ల పగిలి పోయి కొత్త నేతకి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఇంటికీ వృద్ధాప్యం వచ్చిందన్న సంగతి చూడగానే తెలుస్తోంది. ఇంటి ముందు మెట్ల కటూ ఇటూ ముద్ద బంతి పూల మొక్కలున్నాయి. ఇంటి ముందు చిన్నగా ముగ్గేసుంది. ఎడం వైపు మామిడి చెట్టూ, కుడి వైపు జామి చెట్టూ ఇవన్నీ నన్ను గుర్తు పట్టాయనిపించేలా బాల్యం గుర్తుకొచ్చింది. చుట్టూ పూలమొక్కలూ, పచ్చని చెట్ల మధ్య ఆ పెంకుటిల్లు అందంగా కనిపించింది. ఒక్క క్షణంలో లెక్కలేనన్ని ఆలోచనలు. రిక్షా దిగి లోపలికి వెళ్ళకుండా అక్కడే నిలబడి పోడంతో రిక్షావాడు నాకేసి సంశయంగా చూసాడు. 

    "మూర్తిగారిల్లిదే బాబయ్యా...?" ఇంకా గేటు తీయకపోడంతో మరోసారన్నాడు.

    అవును తెలుసన్నట్లుగా తలూపి గేటు తీసాను. గేటు చిడతకి మువ్వలు కట్టి వుండడంతో ఘల్లన మ్రోగాయి. నా బ్యాగు తీసుకొని తిరిగి గేటు వేయబోతుండగా మరలా చప్పుడు చేసాయి.
 
    "ఎవరూ?.." అంటూ ఓ స్త్రీ గొంతు వినిపించింది. 

    ఆ గొంతుని గుర్తుపట్టాను. అలా అంటూనే ఆవిడ బయటకొచ్చింది. ఇప్పుడు మనిషినీ గుర్తుపట్టాను. ఆవిడే వర్ధనమ్మ. ముఖంలో ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జుట్టు ముగ్గుబుట్టలా అయిపోయింది. కళ్ళకిందన నల్లుపొచ్చింది. కళ్ళల్లో కాంతి ఉన్నా మొహంలో మునపటి నవకం లేదు. నుదుట అర్థరూపాయంత ఎర్రని బొట్టు ఆవిడ పెద్దరికాన్ని చెబుతోంది. ఆకుపచ్చ నేత  చీరలో ఆమె పండుముత్తయిదువులా అనిపించింది. చూసి దాదాపు పాతికేళ్ళు దాటింది. నేనావిణ్ణి గుర్తుపట్టాను కానీ, ఆవిడ నన్ను గుర్తుపట్టకపోయుండచ్చు. ఎవరీ కొత్త వ్యక్తన్నట్లుగా నా ముఖంలోకి చూసిందావిడ. 

    "నేనండీ.. రాంబాబుని.."

    "రాంబాబా?..అంటే...? " ఆవిడ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తోంది. 

    "అదేనండీ...అమలాపురం రాంబాబుని..మీ అబ్బాయి నందు స్నేహితుణ్ణి..." వర్ధనమ్మ కేసి చూస్తూ నవ్వుతూ అన్నాను.

    "ఓరి.. నువ్వట్రా...మరలా చెప్పు. చిన్నప్పుడెప్పుడో చూసాను. చాలా మారిపోయావు..." అంటూ నా చేతులు సంతోషంగా పట్టుకుంది. లోపలికి చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. ఆ కళ్ళ వెలుగులో ఆనందం కనిపించింది. 

    "ఏవండీ మన నందు స్నేహితుడు  రాంబాబొచ్చాడు..." అంటూ వాలు కుర్చీలో కునికి పాట్లు పడుతున్న మూర్తి గార్ని లేపింది. ఒక్కసారి ఉలిక్కిపడి, కళ్ళు నులుంకుంటూ లేచాడాయన.  

    "ఎవరే..వచ్చారు..?" అంటూ నాకేసి చూసాడు.

    " మీకు గుర్తుందా? మన నందు క్లాసుమేటు..అమలాపురం రాంబాబనీ..మనింటికి వచ్చేవాడు..." వర్ధనమ్మ గుర్తు చేయడానికి ప్రయత్నించింది. 

    "ఓర్నీ.. నువ్వట్రా రాంబాబూ...ఎన్నాళ్ళయిందో చూసి...ఎక్కడుంటున్నావు?..ఏం చేస్తున్నావు...?" ఆయన ప్రశ్నల వర్షం కురిపించాడు. 

    వర్ధనమ్మ లోపలికెళ్ళి మంచి నీళ్ళు తీసుకొచ్చింది. నేను అమెరికా వెళ్ళి పదిహేనేళ్ళయ్యిందని మూర్తిగారికి నా గురించి చెప్పాను. నేనూ నందూ పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నాం. నందూ వాళ్ళది గంగలకుర్రు అగ్రహారం. అమలాపురం జిల్లా పరిషత్ హైస్కూలు మంచిదని దగ్గర్లో స్కూలున్నా మూర్తి గారు నందూని అమలాపురంలోనే చదివించాడు. ఆ రకంగా నాకు నందూ ఎనిమిదో తరగతిలో పరిచయమయ్యాడు.

    “బావుందయ్యా మొత్తానికి నువ్వూ అమెరికాలో సెటిల్ అయ్యావన్నమాట. నువ్వు ఇంజనీరింగ్ కి వైజాగ్ వెళ్ళాక మళ్ళా చూళ్ళేదు. మీ నాన్నగారికీ కాకినాడ ట్రాన్స్ఫర్ అవ్వడంతో మొత్తానికి తెలీకుండా పోయింది. ఎప్పుడో చిన్నప్పటి పరిచయాన్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని కలవడానికి రావడం నిజంగా చాలా సంతోషంగా వుందయ్యా..." మూర్తి గారిలో అంత పెద్ద మార్పు లేదు. జుట్టు పల్చబడింది. కాస్త బట్ట తల పెరిగింది. ఖంగుమనే ఆ కంఠం మాత్రం అలాగే ఉంది. 

    "ఎలా మర్చిపోతామండీ?.. నేనూ, నందూ కంబైండ్ స్టడీ చేయడానికి మీ ఇంటికొచ్చిన రోజలన్నీ నాకెప్పటికీ గుర్తున్నాయి. మీరు మాకు లెక్కలు చెప్పడం కూడా గుర్తుంది..ఇంటరయ్యాకా నందూ నేనూ విడిపోయినా అప్పుడప్పుడు కలుస్తూనే ఉండేవాళ్ళం. అమెరికా వెళ్ళాక అస్సలు కలవడమే కుదర్లేదు. ఎవరో స్నేహితులు చెబితే తెలిసింది, మీ రాంబాబు ఢిల్లీ లో ఉంటున్నాడట కదా?..." నాకూ అన్నీ గుర్తున్నట్లుగా చెప్పాను. 

    రాంబాబు మిలటరీ లో ఆఫీసర్ గా పని చేస్తున్నాడని చెప్పారు. మూర్తి గారికి అయిదుగురు పిల్లలు. రాంబాబే ఆఖరి వాడు.  

    "ఏమిటిలా వచ్చావు? పనిమీదా?" మూర్తి గారే మళ్ళీ ప్రశ్నించారు.

    మాకు పాలగుమ్మిదగ్గర పదెకరాల పొలముంది. మానాన్న వున్నన్నాళ్ళూ తనే చూసుకునేవాడు. ఆయన పోయాక అమలాపురంలో వున్నా మా రెండో బావే చూసుకునేవాడు. గత నాలుగేళ్ళగా మా అక్క ఆరోగ్యం బాగోలేక కాకినాడ మకాం మార్చారు. అప్పటినుండి మా పొలం కౌలుకు తీసుకున్న రైతు పంట తాలూకు డబ్బు సరిగ్గా ఇవ్వడం లేదు. మా అక్కలూ, నేనూ కలసి ఈ పొలాలు అమ్మేద్దామని నిర్ణయించుకున్నాం. అనుకోకుండా ఆఫీసు పని మీద ఇండియా రావడంతో ఈ పొలం అమ్మకం చేసేద్దామని వచ్చాను. అసలు నాతో మా చిన్న బావ కూడా రావాల్సింది. అనుకోకుండా ఆయనకి జ్వరం వచ్చి, ప్రయాణం చేయలేక  ఆగిపోయాడు. ఇదే విషయం వాళ్ళిద్దరికీ చెప్పాను.

    "చెప్పు..మీ వాళ్ళెలా ఉన్నారు? ఎక్కడున్నారు?.. నువ్వు ఎన్నేళ్ళకోసారి వస్తావు..?" ఒకదాని తరువాత మరో ప్రశ్న. అమ్మా, నాన్నా పోయి పదేళ్ళు దాటినట్లుగా చెప్పాను. అలాగా అని బాధపడ్డారు. 

    "ఈ ముసలాయన కబుర్లేకేం కానీ..రా బాబూ.. భోజనం చేద్దువుగాని కాస్త కాళ్ళు కడుక్కో.." వర్ధనమ్మ అంది. 

    భోజనం చేసే వచ్చానని  చెప్పాను. 

    “అదేమిటయ్యా..మా ఇంటికొస్తూ భోజనం చేసేసి వస్తావా..?" వర్ధనమ్మ నిష్టూరంగా అంది.

    "పాతికేళ్ళు దాటినా నీ చేతి చలవ మన రాంబాబు మర్చిపోలేదన్నమాట..." ఆయన వ్యంగ్యంగా బాణం వేసాడు. వర్ధనమ్మ ఆయనకేసి చుర చురా చూసింది. ఆయనిదేం పట్టించుకున్నట్లుగా లేదు. వర్ధనమ్మ వంట మీద మరిన్ని వ్యంగ్యాలు గుమ్మరించాడు. 

    "ఇలా నా వంటకిన్ని పేర్లు పెడతారా...బయట కెళ్ళి తినమనండి చూద్దాం. ఎక్కడా నచ్చి చావదు. ఈసారి.. ఏమే వర్ధనం...నీలా ఎవరూ వండరే అని అనండి చెబుతాను. చూసావా రాంబాబూ.. వయసొచ్చినా ఈ పెద్ద మనిషి చులకన మాటలు..."

    "మీ వంటంటే నాకెప్పుడూ ఇష్టమేనండీ..మీరొండిన మావిడికాయ పప్పూ.. పనసపుట్టు కూరా..వంకాయ పులుసు పచ్చడీ...ఇంకా నాకు గుర్తుకున్నాయి..." నవ్వుతూ చెప్పాను.

    నా మాటలు వింటున్నారా అన్నట్లుగా వర్ధనమ్మ ముసలాయంకేసి చూసింది. 

    "పోనీలే..నీకు పకోడీలంటే ఇష్టం. వేస్తాను..ఒక్క క్షణముండు...." అంటూ ఆవిడ వంటింట్లోకి పరిగెత్తింది. 

    "ఆ చేత్తోనే ఓ రెండు మిరపకా బజ్జీలు కూడా వేయి.." అంటూ మూర్తి పురమాయించాడు.

    "చూడు..ఈ మనిషిది నాలుకా..తాటిపట్టా..ఇప్పుడేనా నా వంట చెత్త అన్నారు. ఒక్క సెకను తిరక్కుండా..మిరపకాయ బజ్జీలు కావాలంటూ...చచ్చినా వండను..ఏం చేసుకుంటారో చేసుకోండి...హు.." అంటూ ఆవిడ రుసరుసా లోపలికెళ్ళిపోయింది. ఇదంతామాకు మామూలే అన్నట్లుగా మూర్తి గారు నవ్వుతూ నాకేసి చూసారు. నేనూ నవ్వాను.

    వర్ధనమ్మ వంటింట్లోకి వెళ్ళాక, ఆ ఇల్లు పరికించి చుట్టూ చూసాను. ఆ ఇల్లు నాకు చిర పరిచయమే. పెద్ద మండువా ఇల్లది. ఒక పక్క పాత భోషాణం పెట్టుంది. మరో వైపు కొబ్బరి మట్టలూ, చిప్పలూ పోగుగా ఉన్నాయి. ఓ మూల అరటి గెల కనిపించింది. ఇంకో పక్క ఉయ్యాల బల్లుంది. దానికి దగ్గర్లోనే రావుగారి వాలు కుర్చీ వుంది. అక్కడే వున్న బల్లపై తెలుగూ, ఇంగ్లీషు వార్తా పత్రికలున్నాయి.  నేను ఊయల బల్లమీద కూర్చున్నాను. 

    మూర్తిగారే ప్రశ్నలడుగుతున్నారు.

    "మీ అక్కయ్య వాళ్ళూ అమలాపురంలోనే ఉండేవారు కదూ...? ఎక్కడున్నారిప్పుడు..?" 

    "వాళ్ళా కాకినాడలో ఉంటున్నారు. పిల్లలందరూ విదేశాల్లో సెటిల్ అయ్యారు..." 

    జవాబిచ్చి, ఉయ్యాల బల్ల మీదనుండి లేచి మేం చదువుకున్న గది వైపు చూద్దామన్నట్లుగా వెళ్ళాను. లంకంత కొంప. పది గదులుపైగా ఉంటాయి. ఎప్పుడో తాతల కాలం నాటి ఇల్లు. మూర్తి గారి  ఉద్యోగం అమలాపురంలోనేయినా వీళ్ళు ఇక్కడే ఉండేవారు. ఆయన రోజూ సైకిలుమీద కానీ, బస్సు మీద కానీ వెళ్ళొచ్చేవారు. పడక్కుర్చీలోంచి లేచి నా వెనకాలే ఆయనా వచ్చారు. ఇల్లంతా ఓ మారు కలయజూసాను. పెరట్లో మందార మొక్కలూ, కరివేర మొక్కలున్నాయి. నూతికి దగ్గర్లో నంది వర్ధనం చెట్టునిండా తెల్లని పూలు విరగపూసాయి. మొగుడూ పెళ్ళాలిద్దరూ ఎంతో శ్రద్ధగా మొక్కలు పెంచుతున్నారనిపించింది. 

    మేం పెరట్లో ఉండగా  "ఇక్కడున్నారా. రండి. టిఫిన్ రెడీ.." అంటూ వర్ధనమ్మ వచ్చింది. 

    ఆవిడ వెనకాలో మేమూ వెళ్ళాం. పళ్ళెంలో పకోడీలూ, మిరప కాయ బజ్జీలూ ఉన్నాయి. తినమని నా చేతికి ప్లేటిచ్చింది. మూర్తిగారికీ ఇచ్చింది. నాప్లేట్లో మిరపకాయ బజ్జీ చూసాక తలెత్తి మూర్తి గారికేసి చూసాను. ఆయన మిరపకాయ బజ్జీ తాదాత్మ్యంతో తింటూ కనిపించారు. ఆయనకేసి నవ్వుకుంటూ చూస్తోంది వర్ధనమ్మ.  

    “చూసావా రాంబాబూ.. ఎలా గుటకలేస్తూ తింటున్నారో..నా వంట చూసి పేర్లు పెడుతున్నారు." వర్ధనమ్మగారి మాటల్లో ఉడుకుమోత్తనం కనిపించింది.  ఆయనకివేం పట్టినట్లు లేదు. ఇద్దర్నీ చూస్తే నవ్వొచ్చింది. తినడం అయ్యాక ఆయనే అన్నారు.

    " వర్ధనం నీకు వీళ్ళక్క గుర్తుందా.. వాళ్ళు అమలాపురం నుండి మకాం మార్చేసారట. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నారట." 

    "అలాగా.. మరి వాళ్ళిల్లు..." అర్థంకానట్లుగా అంది.

    "లేదండీ. ఆ ఇల్లు అమ్మేసి ఆరేళ్ళు దాటింది. మా అక్కయ్య పిల్లలు తలొకరూ తలో చోటా సెటిల్ అయ్యారు. ఇక్కడే ఇద్దరూ ఉండ లేక కాకినాడలో ఉంటున్నారు.. మా అక్కకి కాస్త అనారోగ్యం. కాకినాడయితే కాస్త ఆస్పత్రి సౌకర్యాలుంటాయనీ.." నేనే వివరం చెప్పాను.

    "అవున్లే! ఇక్కడ కన్నా అక్కడే నయం.." అంటూ వర్ధనమ్మ మరో రెండు మిర్చిబజ్జీలు మూర్తి గారి ప్లేట్లో వేసింది. వేసి ఊరుకోలేదు. మరో బాణం విసిరింది. 

    "చూసావా..ఈ బజ్జీలెలా లాగిస్తున్నారో...నేనేమూ చెయ్యనట్లు చులకనగా మాట్లాడితే వొళ్ళు మండుతుంది.." గుర్రుగా అందావిడ. 

    "ఏదో..ఎలాగూ చేసావు కదా..నువ్వు బాధ పడతావని తింటున్నానంతే!" ఆయన ఏమాత్రం బెదరకుండా జవాబిచ్చాడు. ఆవిడ మరోసారి కళ్ళెర్రజేసింది. ఇద్దర్నీ చూస్తే నవ్వాగలేదు నాకు. నేనే కావాలని మాట మార్చాను. 

    "కాకినాడలో మీ అక్కా వాళ్ళూ ఎక్కడుంటారు..?"

    "హోం ఫర్ ది ఏజిడ్ లో ఉంటారు..."

    "అంటే.." తెలీనట్లు చూసిందావిడ. వృద్ధాశ్రమం అని చెప్పాడాయన. మా అక్కకి నలుగురు పిల్లలు. ఎవరూ వాళ్ళని పట్టించుకోరు. చేసుకునే ఓపిక లేక మా అక్కా, బావ హోం ఫర్ ది ఏజిడ్ లో జాయిన్ అయ్యారు. ఇదే విషయం చెప్పాను.  

    “మా అక్కయ్య పిల్లలందరూ తలో చోటా సెటిల్ అయ్యారు. అందరికీ మంచి సంబంధాలే వచ్చాయి. కొడుకు ఆస్ట్రేలియా లో ఉంటాడు. పెద్దమ్మాయి దుబాయిలోనూ, రెండోది ఫ్రాన్స్ లో ఉంటొంది. ఉన్న ఒక్క కొడుకూ అమెరికాలోనే ఉంటాడు. వాడదొక టైపు. వాడు వీళ్ళని పట్టించుకోడు. అంతెందుకు  అమెరికాలో మావయ్య నేనున్నా ఒక్క సారీ పలకరించడు. అప్పుడప్పుడు కూతుళ్ళ దగ్గరికి వెళ్ళొస్తుంది. కానీ అక్కడా ఉండలేదు. కొడుకు దగ్గరకెళ్ళి ఉండాలని మా అక్క తాపత్రయం. వాడా పిలవడు. దాంతో బెంగ పెట్టుకొని ఆరోగ్యం చెడగొట్టుకుంది”

    "పిల్లలు పట్టించుకోలేదని బెంగపెట్టుకొని ఆరోగ్యం చెడగొట్టుకోడం ఏమీ బాగోలేదయ్యా..?"

    "నేనూ అదే చెప్పానండీ. వినదు. మీకు తెలియనిదేముంది?. పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించారు మా అక్కా, బావా. మా బావకా సంపాదన అంతంత మాత్రంగా వుండేది. పిల్లలు బాగా చదువుకొని పైకి రావలని మా అక్క ఎంతో కష్టపడింది. వాళ్ళు తిన్న తినకపోయినా మంచి చదువులు చదివించారు. పిల్లలకి రెక్కలొచ్చాక వీళ్ళనంతగా పట్టించుకోవడం లేదన్నదే మా అక్క బాధ. అది తట్టుకోలేకే మానసికంగా క్షీణించి పోయింది.  ఈ సారి నన్ను అమెరికా తీసుకెళ్ళమని మా బావ అడిగాడు. కానీ నేను మా ఇంటికి తీసుకెళితే ఎక్కడ గొడవలవుతాయా అని ఆలోచిస్తున్నాను." లోపలున్న నా భయాన్ని  చెప్పాను. 

     "పోనీ తీసుకెళ్ళు. అమెరికా వెళితే ఆవిడ ఆరోగ్యం కుదుట పడుతుందేమో?" వర్ధనమ్మ అంది. 

    అవునన్నట్లు తలూపానంతే!

    ఈలోగా మాటలు మారి మా చిన్నప్పటి సంగతుల్లోకి వెళిపోయాం. నందూ, నేనూ ఎలా అల్లరి చేసేవాళ్ళమూ, కం బైండ్ స్టడీ చేసి ఎలా చదివే వాళ్ళమూ, ఇవన్ని విషయాలూ చెప్పుకున్నాం. కొంతసేపయ్యాక వర్ధనమ్మ చేతిలో కొబ్బరి బొండంతో వచ్చింది. 

    "తీసుకో రాంబాబూ..నీకిష్టమని ఎవరో పిల్లాడితో కబురంపించి దింపు తీసేవాణ్ణి రమ్మనమన్నాను. నీకూ నందూ కీ కొబ్బరి బొండమంటే ఎంత ఇష్టమో నాకింకా గుర్తుంది."

    ఆవిడ అభిమానానికి సంతోషించాను. పాతికేళ్ళు దాటినా ఇంకా గుర్తున్నాయన్నమాట. వాళ్ళతో మాట్లాడుతుంటే సమయం తెలీలేదు. ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నాం. మాటల్లో ఉండగా గేటు తీసినట్లు మువ్వల చప్పుడు వినిపించింది. ఓ పన్నేండేళ్ళ కుర్రాడొచ్చి గుమ్మం దగ్గరనిలబడ్డాడు. 

    "ఒరే సీనూ..ఈ రోజు క్లాసు లేదు. మా ఇంటికి గెస్టొచ్చారు. మిగతా వాళ్ళకి కూడా చెప్పు." వర్ధనమ్మే అంది. అలాగే అని తలూపి ఆ పిల్లాడు వెళిపోయాడు. 

    "ఏదో కాలక్షేపానికి పిల్లల్ని చేరదీసి సంగీతం నేర్పుతుంది. నేనూ పిల్లలకి లెక్కలు చెబుతాను..." మూర్తి గారే వివరణిచ్చారు. 

    "మీకు సంగీతం వచ్చా?.." అడిగాను.

    "అంత పెద్దగా రాదు. ఏదో చిన్నప్పుడు నేర్చుకున్నదే!" వర్ధనమ్మ చెప్పింది. 

    "ఏం చేస్తామయ్యా. ఉద్యోగమా సద్యోగమా...రిటరయ్యి ఇరవై ఏళ్ళు దాటింది. ఏదో కాస్త పెన్షన్ వస్తుంది. అది మాకు చాలు. కాలక్షేపానికి పిల్లల్ని చేరదీస్తాం. ఆ వచ్చినబ్బాయి కుమ్మరాళ్ళబ్బాయి. నా దగ్గరికి లెక్కలు నేర్చుకోడానికి వస్తాడు. ఈవిడ సంగీతం విని నేర్పమని అడిగాడు. భలే పాడతాడు తెలుసా?" 

    "మా దగ్గరకొచ్చే పిల్లలెవరో తెలుసా..రిక్షావాడి కొడుకూ, చాకలాడి పిల్లలూ..స్కూల్లో సరిగా చెప్పరు. వీళ్ళకా ట్యూషన్ పెట్టించుకునే స్తోమతుండదు. అందుకని మేం వీళ్ళందర్నీ చేరదీసి వూరికే చెబుతాం. శనాది వారాలు శలవు. లేకపోతే ఈ పాటికి ఇంటినిండా పిల్లలతో సరిపోయేది.." 

    వీళ్ళిద్దర్నీ చూస్తే ముచ్చటేసింది. ఈ వయసులో ఎంతో ఓపిగ్గా పిల్లలందరికీ చదువు చెబుతున్నందుకు.

    సాయంత్రం నాలుగయ్యాక నేను పాలగుమ్మి వెళ్ళి మా పొలం కొంటానన్న రావు గార్ని కలుద్దామని మూర్తిగార్ని తీసుకొని బయల్దేరాను. అక్కడ పొలం అమ్మకం మాటలు పూర్తి చేసుకొని మూర్తి గారూ, నేనూ వెనక్కి వచ్చాం.

    "ఏమండీ...వస్తాను. రాత్రికి కాకినాడ వెళిపోవాలి. ఇక్కడ రిక్షా ఏదైనా దొరుకుతుందా?" 

    వెళిపోతానంటే ఇద్దరూ నాకేసి "అప్పుడేనా?" అన్నట్లు చూసారు. కుర్చీలోంచి లేస్తుండగా వర్ధనమ్మ నా చేతులు పట్టుకుంది. 

    "ఎన్నో ఏళ్ళకొచ్చావు. నువ్వు రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ ఒక్క రాత్రికీ ఉండి రేప్పొద్దునే వెల్దువు గాని..నా కోసం..." బ్రతిమాలుతున్నట్లుగా వున్నాయామాటలు. మూర్తి గారి కళ్ళల్లోనూ అదే అభ్యర్థన. పెద్దవాళ్ళిదర్నీ కష్టపెట్టడం  ఇష్టం లేకపోయింది. నా బ్యాగ్ క్రింద పెట్టాను.

*  *  *

    నా కోసం ప్రత్యేకంగా వంకాయ పులుసు పచ్చడీ, గోంగూర పచ్చడీ, మావిడికాయ పప్పూ చేసిందావిడ. 

    "రాత్రి పూట మేం అన్నం తినడ మానేసాం నయనా. అరాయించుకునే వయసుకాదిది. నువ్వొచ్చావనీ సంతోషంతో నీతో కలిసి తింటున్నం.." భోజనాల దగ్గర వర్ధనమ్మే అంది. 

    "అయ్యో - నేనొచ్చి మీ ఆరోగ్యం చెడగొట్టానన్నమాట" నవ్వుతూ అన్నాను.

    "ఆ..అదేం లేదు. రెండు పూటలా చాలా అరుదుగా తింటాం. ఎప్పుడైనా నేనైనా తిండి విషయంలో కక్కూర్తి పడతానేమూ కానీ, మా ఆవిడలా కాదు. ఆరోగ్యం విషయంలో మిలట్రీ డిసిప్లిన్."

    "ఈ వయసులో ఆరోగ్యం చెడితే ఎవరు చేస్తారు చెప్పు? అందుకే కాస్త కడుపు కట్టుకుంటే ఆరోగ్యం అదే కుదుట పడుతుంది. వచ్చే వయసా - పోయే వయసా? నువ్వు నమ్మవు గత పదేళ్ళుగా మా ఇద్దరికీ ఒక్క సారి సుస్తీ చేయలేదంటే నమ్ము.." 

    "నిజం చెప్పద్దూ - మీరిద్దరూ డెబ్బై దాటిన వాళ్ళల్లా కనిపించరు. ఏదో నిన్ననే అరవయ్యో పడిలో వచ్చిన వాళ్ళల్లా ఉన్నారు. మా అక్కయ్యకి ఇంకా అరవై రాలేదు. ఎంతో ముసలితనం వచ్చేసింది. అస్సలోపిక లేదు. ఆరోగ్యం కూడా అంత మాత్రమే!..." మా అక్కయ్య విసయం చెప్పాను. 

    " అనారోగ్యం అంటున్నావు..ఏమైనా జబ్బు చేసిందా..?" మూర్తి గారే మరలా అడిగారు.  

    శారీరికంగా కంటే మానసికంగా మా అక్కయ్య క్షీణించిపోయింది. ఇంటి పనంతా మా అక్కే చేయాలి. మా బావ నుండి సహకారం అంతంత మాత్రమే! ఇక్కడి వస్తువక్కడ పెట్టడు.  కొడుకులెవరూ రారూ, రానేయరు. ఈ బెంగతోనే మా అక్కయ్యకి మానసిక రోగం మొదలయ్యింది. ఇదే విషయం చెప్పాను.

    "ఆయ్యో పాపం..అందుకేనా మీ అక్కయ్యా వాళ్ళూ వృద్ధాశ్రమంలో చేరేరన్నమాట. దేముడి దయ వల్ల మాకలాంటి గొడవలేదు. ఎంతైనా చెప్పద్దూ..ఈ ముసలాయన నాకెంతో చేదోడు వాదోడుగా వుంటాడు. అంట్లు తోమడం దగ్గర్నుండి..ఇల్లు వూడవడం వరకూ అన్నిట్లోనూ సహాయం చేస్తాడు.." వర్ధనమ్మ మూర్తిగార్ని పొగిడింది. 

    "నీకు తెలుసో లేదో - మా నందూ వచ్చి అయిదేళ్ళు దాటింది. ఎప్పుడైనా మా ఆడపిల్లలొచ్చి చూసి వెళతారు. మాకు ఓపికుందా వెళ్ళి చూసొస్తాం. లేదా ఇక్కడే కాలక్షేపం చేసేస్తాం. ఎప్పుడైనా ఎలా వున్నరంటూ ఫోన్ చేస్తారు.  ఏదో వాళ్ళ జీవితాలు వాళ్ళు సాగిస్తున్నారు. మేమూ అంతగా అడగం. మా జీవితాలు మావి..." మూర్తి గారు వేదాంత ధోరణి అన్నారు.   

    “మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోపోతే మీరెలా ఉండగలుగుతున్నారండీ? నందు వచ్చి అయిదేళ్ళయ్యిందా? ఆశ్చర్యంగా వుంది." మనసులో మాటలు పైకనేసాను. 

    “ పట్టించుకోలేదని నువ్వనుకుంటున్నావయ్యా? మేం కాదు. పిల్లల్ని పెంచి పెద్ద జేయడం తల్లితండ్రుల బాధ్యత. అందులో ప్రేముంది. మంచి చదువులు చెప్పించారని పెద్దయ్యాక వాళ్ళు చూడాలని ఆశించడం వ్యాపారం అవుతుంది. ప్రతిఫలాలు కోరే బంధాల్లో ప్రేముండదు. వ్యాపారముంటుంది. మొక్కకి నీళ్ళు పోసి పెంచడవరకే మన చేతిలో ఉంటుంది. పెరిగాక అది ఏ కాయ కాస్తుందో మనం చెప్పలేంకదా? నిజానికి మా పిల్లలు చూడలేదన్న ప్రశ్నే మా మధ్య రాదు. ఓపికున్నన్నాళ్ళూ మా బ్రతుకు మేం బ్రతుకుతాం. ఎప్పుడైనా వచ్చి చూసెళతారా, సంతోషిస్తాం. లేదా వాళ్ళు బిజీ గా ఉన్నారనుకుంటాం”

    మౌనంగా వింటున్నాను. ఓ క్షణం ఆగి ఆయనే మరలా అన్నారు.

    "మొదట్లో నేనూ మా అవిణ్ణి అంతగా పట్టించుకునేవాణ్ణి కాదు. పిల్లలందరూ దూరమయ్యాక మేం ఒక నిర్ణయానికొచ్చాం. వాళ్ళని తలచుకుంటూ ఏడవకూడదని. అంతకుముందు వరకూ దెబ్బలాడుకునే మేమిద్దరం అప్పుడే ఒకరికొకరయ్యాం. మేమిద్దరం సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఆ సంతోషం నిలుపుకోడం కోసం ప్రతీ క్షణమూ ఇద్దరం శ్రమిస్తాం. మొదట్లో కష్టమనిపించినా ఇప్పుడలవాటయిపోయింది.."

    మూర్తిగారు ఎంతో ఉద్వేగంగా చెబుతుంటే మధ్యలో వర్ధనమ్మ అంది.

    "నేనూ పెళ్ళయి ముఫ్ఫై ఏళ్ళు దాటినా ఆయన్ని మానసికంగా ప్రేమించలేదు. ఆయన వాళ్ళ వాళ్ళతో గడుపుతున్నారని ఎంతో అక్కసు చూపించేదాన్ని. దెప్పేదాన్ని. తిట్టేదాన్ని. ఒక్కోసారి రోజుల తరబడి మాట్లాడ్డం ఉండేది కాదు. ఆయన అలాగే ఉండేవారు. ఆయన నన్ను ప్రేమించరూ అనుకునే ముందు నేను ఆ ప్రేమనెంతిస్తున్నాననీ  ప్రశ్నించుకున్నాను. నేనెలా సంతోషం కోరుకుంటున్నానో ఆయన అంతే కదా అనిపించింది. పిల్లల్లకి పెళ్ళిళ్ళయ్య్యాకే మేమిద్దరం మానసికంగా మరింత దగ్గరయ్యాం. ఒక్క క్షణం కూడా ఖాళీ గా ఉండం. నాకు తెలుసున్న సంగీతం నేను నేర్పుతాను. ఆయనేమో పిల్లలకి పాఠాలు చెబుతారు. ఇహ అన్నీ మేమిద్దరమే కలిసి చేసుకుంటాం. వ్యాయామం అంటావా మా తోటపనిలో మాకు అది మాకు పుష్కలంగా  దొరుకుతుంది. నిజం చెప్పద్దూ, మీ మాష్టారినుండే ఎన్నో తెలుసుకున్నాను. ముఖ్యంగా సంతోషంగా ఉండడం."  

    ఆవిడ మాటల్లో నిజానిజాలెలా వున్నా ఎంతో ఆత్మ స్థైర్యం కనిపించింది. ఆవిడ మాటల్ని కలుపుతూ మూర్తిగారందుకున్నారు.

    "ఇందాకా నువ్వడిగావే - మా ఆరోగ్య రహస్యం ఏమిటని? ఇదే! మేం సంతోషంగా ఉంటాం. ఒకర్నొకరు తిట్టుకోం. తప్పులెన్నం. వీలయినంతా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అలాగే మా పిల్లల్నుండి మేం ఏమీ ఆశించం. ఇదే మా ఆనందానికి కారణం. మేం ఎవరినుండీ ఏదీ ఎక్స్పెక్ట్ చేయం. సింపుల్.ఈ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది చూడు. అది కేన్సర్ లాంటిది. నిన్నూ నీ చుట్టూ ఉన్న వాళ్ళనీ కనిపించకుండా దహించేస్తుంది..." 

    మూర్తిగారు చెబుతున్నంత సేపు రెప్పేయకుండా వింటున్నాను. మాటలు పెగల్లేదు. 

* * *

    కాకతాళీయంగా ఆ రోజు పౌర్ణమయ్యింది. ఆరుబయట వెన్నెల్లో పడుకోవాలనిపించింది. అదే చెప్పాను. ఇంకా శీతాకాలం పోలేదు. మంచు కురవచ్చుని లోపలే పక్క వేశ్తానంది వర్ధనమ్మ. నేను మరోసారి అడిగితే కాదనలేక మూర్తి గారూ బయటే పడుక్కుంటానన్నారు. ఆయనతో పాటు ఆవిడా వచ్చింది.  రాత్రి చాలా సేపటి వరకూ మెలకువగానే ఉన్నాం. మాటల్లో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. రాత్రంతా మా అక్కయ్య గురించే ఆలోచిస్తున్నాను. మా అక్కయ్య కోణంలో చూస్తే పిల్లలు రాక్షసుల్లా కనిపిస్తారు. ఎంతో కష్టపడి క్రమశిక్షణతో పెంచింది. పెద్దయ్యాక వాళ్ళు తననీ, తన మాటనీ అంతగా గౌరవించకపోతే తట్టుకోలేకపోతోంది. లేని పోని గొడవలు తెచ్చుకొని తన ఆరోగ్యాన్నే దెబ్బ తీసుకుంది. దీనికంతటికీ కారణం ఎక్స్పెట్టేషన్స్! పిల్లలు తమని చూడాలన్న ఆశ. చూసి తీరాలన్న బాధ్యత.  అక్కయ్య పిల్లల కోణంలోంచి ఆలోచిస్తే వేరొక విధంగా ఉంటుంది. తమకీ ఒక జీవితం ఏర్పడిందనీ, దానికీ కొన్ని అవసరాలూ, బాధ్యతలూ ఉంటాయని తల్లి తండ్రులు గుర్తించాలనుకుంటారు. మధ్య తరగతి కుటుంబాలకి మా అక్కయ్యొక ప్రతీక.   పిల్లలు తమని గౌరవించాలని ఆశించడంకన్నా ప్రేమించాలని తల్లితండ్రులు కోరుకోవాలనిపించింది.

    తెల్లారింది. లేచి చూస్తే తొమ్మిది దాటింది. ఎండ బాగానే వచ్చింది. నన్ను లేవగానే చూసి వర్ధనమ్మ వచ్చింది.

    "రాత్రంతా అలసిపోయినట్లున్నావని లేప లేదు. లేచి స్నానం చేయి. టిఫిన్ చేసాను." అంది.

    ఎవరో వచ్చినట్లున్నారు. మూర్తిగారు వీధి వరండా దగ్గర మాట్లాడుతూ కనబడ్డారు. మధ్యాన్నం భోజనం చేసి వెళితే కానీ కుదర్దనీ ఇద్దరూ బలవంత పెట్టారు. నాకోసం ప్రత్యేకంగా పనసపొట్టు కూర చేసిందావిడ. 

    "నువ్వొచ్చావనీ, రామనాధంగారి తోటలోంచి తెప్పించారు. పొద్దున్నే కూర్చుని పనస పొట్టు  కొట్టారు. తెలుసా?" వర్ధనమ్మ అంది.  నా కెందుకో ఆ ముసలాళ్ళనిబ్బంది పెడుతున్నానన్న గిల్టీ ఫీలింగ్ కలిగింది.

    "అయ్యో, ఎందుకండీ ఈ శ్రమంతా.."

    "శ్రమ కాదు నాయినా సంతోషం." 

    ఇంతలో సెల్ ఫోన్ మ్రోగింది. మా చిన్న బావ నుండి కాల్. 

    "రాంబాబూ..మీ అక్కయ్యకీ, నాకూ అమెరికా టిక్కట్లు నువ్వు బయల్దేరే రోజే దొరికాయి. ట్రావెల్ ఏజెంట్ ఓ పదివేలెక్కువవతుందన్నా సరేనన్నాను. నువ్వు ఈ సాయంత్రానికొస్తున్నావా?.." 

    బయల్దేరుతున్నట్లుగా చెప్పి ఫోన్ పెట్టేసాను. 

     "అక్కయ్య రావాల్సింది అమెరికా కాదు. ఈ గంగలకుర్రు అగ్రహారం..." నా మనసు గట్టిగా అరిచింది.   

    భోజనాలయ్యాక, ఇద్దరి కాళ్ళకీ దణ్ణం పెట్టి శలవు తీసుకున్నాను.

(ఆదివారం ఆంధ్రజ్యోతి 4-5-2009 సంచికలో ప్రచురితం) 
 
Comments