వానప్రస్థం - గన్నవరపు నరసింహమూర్తి

    
ఆ రోజు నేను ఆఫీసులో ఉండగా నా పేరి ఒక ఉత్తరం వచ్చింది. అది మా స్వంత ఊరు నుంచి చిన్నాన్న వ్రాసినది. కవరు లోంచి  దాన్ని తీసి చదవడం మొదలు పెట్టాను. 

    రఘుకి,
    
    మీ చిన్నాన్న వామనమూర్తి ఆశీర్వదించి వ్రాయునది. ఉభయకుశలోపరి. మీ అమ్మ, నువ్వు మన ఊరు వచ్చి చాలా సంవత్సరాలైంది. బహుశా నీ చదువు పూర్తయి నీకు ఉద్యోగం రాగానే ఊరిని, మమ్మల్ని మరిచిపోయినట్లున్నారు. ఇక అసలు విషయానికొస్తే మీ నాన్నగారి రెండవ భార్య పోయిన సంగతి మీకు తెలుసనుకుంటాను. అప్పుడు నేనే నీకు ఉత్తరం వ్రాసాను. అయినా మీరు రాలేదు. ఆవిడ చనిపోయి అప్పుడే సంవత్సరం దాటుతోంది. ఆవిడ చనిపోయినప్ప్ట్నుండి మీ నాన్న మంచం పట్టేసాడు. తరచూ ఒంట్లో బాగుండటం లేదు. ఎందరి డాక్టర్లకు చూపించినా ఫలితం ఉండటం లేదు. బహుశా తనకు ఇక చేసేవాళ్ళు చూసేవాళ్ళు లేరనుకుని బెంగపెట్టుకున్నాడను కుంటాను... ఏదో మేము సాయం చేస్తున్నా వాడు కోలుకోవటం లేదు.
    
    ఒరేయ్ రఘూ, వాడు ఎంతైనా నీకు తండ్రి. ఏదో సంసారంలో వచ్చిన కలతల వల్ల మీ అమ్మనాన్నలు విడిపోయారు. అంతమాత్రాన అతను నీకు తండ్రి కాకపోడు. మీ అమ్మకి విడాకులిచ్చిన తరువాత విధిలేక రెండో వివాహాన్ని చేసుకున్నాడు కానీ నిజానికి వాడికది ఇష్టం లేదు. జీవితాంతం ఒంటరిగా ఉండటం కష్టం అనీ మేమందరం చెబితే ఒప్పుకున్నాడు. అయినా దురదృష్ట వశాత్తు ఆవిడ వీడి దినం తీరకుండానే కన్ను మూసింది. కాబట్టి ఈ ఉత్తరం అందిన తక్షణం మీ అమ్మని ఎలాగైనా ఒప్పించి నువ్వొకసారి ఇక్కడికొచ్చి నీ తండ్రిని చూడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. నిన్ను చూసిన తరువాతైనా వాడి ఆరోగ్యం బాగుపడుతుందేమో? కాబట్టి తప్పక బయలుదేరి రావలెను. మీ అమ్మకి ఇష్టం లేకపోతే నువ్వైనా రావలెను.

    మిగతా విషయాలు ఇక్కడికొచ్చిన తరువాత మాట్లాడుకుందాము. మీ అమ్మకి నా నమస్కారములు చెప్పు.

ఉంటాను,

మీ చిన్నాన్న

వామన మూర్తి

    ఆ ఉత్తరాన్ని చదివిన తరువాత నాకు చాలా బాధవేసింది. నేను ఆరవ తరగతిలో ఉండగానే మా అమ్మానాన్నలు కుటుంబ తగాదాల వల్ల విడిపోయారు. దానికి కారణం ముమ్మాటికీ మా నాన్న  గారే నని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ముక్కోపి. ఎవర్నీ ప్రశాంతంగా ఉండనివ్వడు. అతను మా ఊరి హైస్కూల్లోనే టీచర్‌గా పనిచేసేవాడు.  మా అమ్మది మా ప్రక్క ఊరు. రెండు ఊళ్ళకి మధ్యన ఏరు ఉండేది. మా అమ్మకూడా చదువుకున్నదే. ఆవిడకూడా మా ప్రక్క ఊరి స్కూల్లో టీచరుగా పనిచేస్తుండేది. మా అమ్మ మంచి సాంప్రదాయం గల కుటుంబం నుంచి రావడం వల్ల మా నాన్నని చాలా వరకూ అర్థం చేసుకొని సర్దుకుపోతుండేది. నేను పుట్టిన తరువాత అతని కోపం ఇంకా పెరిగిందని మా అమ్మ చెబుతుండేది. ఒక ప్రక్క ఉద్యోగం, ఇంకో ప్రక్క ఇంటిపనులు వీటన్నిటితో అమ్మ చాలా బాధలు పడేది. నాన్నగారు మాత్రం ఏ విషయాలు పట్టించుకునేవాడు కాదు. నేను పుట్టిన సంవత్సరం తరువాత నాన్నగారు మా అమ్మని ఉద్యోగం మానివేయమని కోరితే మా అమ్మ ఒప్పుకోలేదు. అప్పటికీ నన్ను చూడటానికి మా అమ్మమ్మని పిలిపించింది. దాంతో అతనికి మరింత కోపం కలిగి ఇంట్లో రోజూ గొడవలు పెడుతుండేవాడు. అలా తగవులు ముదిరి నాకు పదో సంవత్సరం వచ్చేటప్పటికి అమ్మ అతనితో విసిగిపోయి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. నిజానికి మా అమ్మకి ఆ ఆలోచన వచ్చేటట్లు పరిస్థితులు మా నాన్నగారే కల్పించారు...

    విడిపోవద్దనీ, అలా అయితే కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందనీ మా చిన్నాన్నలు, అత్తలు చెప్పినా నాన్నగారు వినలేదు. చివరకు కోర్టు దాకా వెళ్ళి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత మా అమ్మ మా ఊరికి దూరంగా తను ట్రాన్స్‌ఫర్ చేయించుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తరువాత మేము మా నాన్నగారి ఊరు చాలా రోజుల వరకు వెళ్ళలేదు. ఆ తరువాత ఎప్పుడో మా అమ్మ నాన్నగారు మళ్ళీ పెళ్ళి చేసుకున్నట్లు నాకు చెప్పింది. మా అమ్మ మాత్రం నాకోసం మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా నన్ను కంటికి రెప్పలా చూసుకుని బాగా చదివించింది. విడాకులు తీసుకున్నందుకు ఆమెకు పుట్టింటి వారి నుంచి కూడా నిరసనలు ఎదురయ్యాయి. వాళ్ళు కూడా మా అమ్మకి అండగా నిలబడలేదు. అయినా మొక్కవోని ధైర్యంతో జీవితానికి ఎదురీది నన్ను ఇంజనీరింగ్ చదివించింది. ఆ తరువాత నాకు నోయిడాలో పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం రావడంతో మా అమ్మ చేత ఆ ఉద్యోగాన్ని మానిపించేసి నాతో పాటు తీసుకెళ్ళి పోయాను. అప్పటికి మా అమ్మకి ఇంకా ఆరేళ్ళ సర్వీసుంది. నాకు ఉద్యోగం వచ్చిన మూడేళ్ళకు మా కంపెనీలో పనిచేస్తున్న హరిచందనతో నాకు వివాహం అయ్యింది. ఆమె తల్లితండ్రులు తెలుగువారే అయినా చాలా రోజుల క్రితం ఢిల్లీలో స్థిరపడటం వలన ఆమెకు తెలుగు భాషగానీ, ఆచార వ్యవహారాలు గానీ అంతగా తెలియవు. మొదట్లో ఆమె గురించి అమ్మతో చెప్పినప్పుడు అమ్మ మా పెళ్ళికి ఒప్పుకోదేమోనని భయపడ్డాను. కానీ అమ్మ చాలా విశాల హృదయంతో ఆలోచించి మా పెళ్ళికి ఒప్పుకుంది. అలా నా పెళ్ళి చందనతో జరిగిపోయింది.

    అప్పుడప్పుడు అమ్మని చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంటుంది. నాకోసం ఎన్నో త్యాగాలు చేసి తనకు మాత్రం ఒకతోడు లేకుండా చేసుకున్న అమ్మంటే నాకు అమితమైన ప్రేమ. అందుకే ఆమెకి కష్టం రాకుండా చూసుకుంటుంటాను.

    ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత చిన్నాన్న వ్రాసిన ఉత్తరం అమ్మకి చూపించాను. దాన్ని చదివిన తరువాత అమ్మ చాలాసేపు మౌనం దాల్చింది. ఆ తరువాత చెప్పింది "ఎంతైనా అతను నీ తండ్రి. ఒంటరిగా వృద్ధాప్యంతో బాటు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తండ్రిగా కాకపోయినా కనీసం వృద్ధుడిగా భావించి సహాయం చెయ్యడంలో తప్పులేదు. కాబట్టి వీలు చూసుకుని నువ్వూ కోడలు ఒకసారి మన ఊరు వెళ్ళండి"

    ఆమె మాటలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆమెను జీవితంలో ఎన్నో కష్టాలకు గురి చేసి విడాకులిచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకున్న వ్యక్తిమీద సానుభూతి చూపించడం నిజంగా ఆమె మంచి మనసుకు తార్కాణం.

* * *

    రెండు రోజుల తరువాత నేను, చందన కలసి నాన్నగారిని చూడటానికి సమతా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వెళ్ళాము. సమతా ఎక్స్‌ప్రెస్ బొబ్బిలి చేరేసరికి ఉదయం ఐదు గంటలైంది. అప్పటికే మా చిన్నాన్న ఎడ్లబండితో మాకోసం ఎదురు చూస్తున్నాడు. 'ఆటోలో వెళ్దాం' అని చిన్నాన్న అంటే నేనే వద్దనీ ఎడ్లబండి తెమ్మనమనీ చెప్పాను. చాలారోజుల తరువాత నాకెందుకో ఎడ్లబండిమీద ప్రయాణించాలనిపించింది. ముఖ్యంగా చందనకి పల్లెలంటే కొత్త. ఆమెకి ఎప్పట్నించో మా ఊర్ని చూపించాలని అనుకుంటున్నాను. అది ఈ రూపంలో తీరబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ట్రైన్‌లోంచి దిగిన కాసేపటికి దగ్గర్లోని హోటల్‌లో టిఫిన్ చేసి బండిలో బయలుదేరాము.

    మా బండి అరగంట తరువాత పట్నం వదలి పచ్చటి పొలాల బాట పట్టింది. చుట్టూరా పచ్చటి పొలాలు, మధ్యలో మామిడి తోటలు, నిర్మలమైన ఆకాశం, అందులో తెల్లని బారులు తీరిన కొంగలు, అప్పుడే సూర్యోదయం అవుతుండటంతో సింధూరవర్ణపు తూర్పు దిక్కు. అలా ప్రకృతి ఆ పరిసరాల్లో శోభానమాయంగా కనిపించసాగింది. నా కన్నా చందనే ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చెయ్యసాగింది.

    కొద్దిసేపటికి నేను చిన్నాన్న మాటల్లో పడ్డాము. "ఏం జరిగింది చిన్నాన్నా! ఎన్నాళ్ళ నుంచి ఆయన ఆరోగ్యం పాడైంది" అని అడిగాను.

    "నీకు తెలుసు కదరా, మీ నాన్న మీ అమ్మతో విడిపోయిన తరువాత మళ్ళీ రెండవ పెళ్ళి చేసుకున్న సంగతి. ఆమె ఉన్నన్నాళ్ళూ వీడి బ్రతుకు బాగానే గడిచింది. ఆ ఇల్లాలు కూడా మంచిదేనురా... మీ నాన్నని కంటికి రెప్పలా చూసుకుంది. కానీ మీ నాన్నే ఆవిడని బాగా కోప్పడేవాడు. అయినా ఓర్పుతో వీణ్ణి జాగ్రత్తగా చూసుకుంది. కానీ దురదృష్టవశాత్తూ ఆమె చనిపోవడంతో మీ నాన్న తట్టుకోలేక పోయాడు. ముఖ్యంగా తన శేషజీవితం ఎలా గడుస్తుందోనని బెంగపెట్టుకున్నాడు. అందుకే మంచం పట్టేశాడు. ఏ రోగానికైనా మందుంటుంది కానీ మనో వ్యాధికి మందేమిటి చెప్పు... వీటికి తోడు రోజూ ఏట్లో మడిగా స్నానాలు, తనే వండుకోవడం, సరియైన భోజన సదుపాయం లేకపోవడంతో మరింత ఆరోగ్యం పాడైంది. అప్పటికీ నేను మా ఇంట్లో భోజనం చెయ్యమని చెప్పినా వాడు విన్నాడు కాదు. ఏం చేస్తాం... ఇదంతా మన ప్రారబ్ధం" అన్నాడు తువ్వాలుతో కళ్ళను తుడుచుకుంటూ.  
 
    "చిన్నాన్నా... నువ్వు ఈ ఉత్తరాన్ని కొద్ది రోజుల ముందు రాస్తే బాగుండేది. మా అమ్మ ముందు ఒప్పుకోదనుకున్నాను కానీ ఆమెది మంచి మనసు. అనుకే తక్షణం మమ్మల్ని వెళ్ళమంది" అన్నాను.

    "నీకు తెలుసు కదరా, మేమంతా పాతకాలపువాళ్ళం. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన మేము ఆచార వ్యవహారాల చట్రాల్లో పెరిగాము. అందుకే అంత త్వరగా వాటి నుంచి బయటపడలేము. అయినా చాలా రోజులనుంచి మీ నాన్నకి నీ మీద దృష్టి మళ్ళిందిరా... తనకి మళ్ళీ పిల్లలు కలగకపోవడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చూసుకోవాలని ఎంతో మనసు పడ్డాడు. ఆ విషయం నాతో ఎన్నోసార్లు చెప్పాడు కూడా... కానీ మీ అమ్మ ఒప్పుకోదని ఆ విషయాన్ని చెప్పడానికి భయపడ్డాడు. మీ అమ్మతో విడాకులు తీసుకున్నందుకు చాలా విచారించాడు కూడా... కానీ ఏం చేస్తాం. ఏదీ మన చేతిలో లేదు" అన్నాడు.

    అలా మాట్లాడుతున్న కొద్దిసేపటికే బండి మా ఊళ్ళోకి ప్రవేశించింది. నాకెందుకో బండిలోంచి మా ఊరుని చూస్తుంటే ఓళ్ళు పులకరించడం మొదలైంది... ఎన్నాళ్ళైంది ఈ ఊరుని చూసి. చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే పుట్టాను. ఇక్కడే పదేళ్ళు పెరిగాను.  దూరంగా అమాయకంగా ఏరు కనిపిస్తోంది. నేను ఎప్పుడూ ఎక్కువగా ఏటిఒడ్డునే ఉండేవాడిని. దూరంగా ఏటి ఒడ్డున ఉన్న శివాలయంలోంచి గుడిగంటల శబ్దం వినిపిస్తూ ఉంటే ఓంకార నాదం గుర్తుకొచ్చింది నాకు...

    ఇంతలో బండి మా వీధిలోకి ప్రవేశించి మా ఇంటి ముందర ఆగింది... నాలో ఎందుకో ఉద్విగ్నత... కళ్ళల్లో తడి... భారంగా బండిలోంచి దిగాను. చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ నేను పుట్టి పెరిగిన ఇంట్లోకి అడుగుపెడుతుండటం నాకు ఆనందంతో పాటు విచారం కలిగిచింది. ఇంట్లోకి అడుగుపెడుతుంటే నా కంట్లో నీళ్ళు తిర్గడాన్ని చందన ఆశ్చర్యంగా చూడసాగింది...

    నిజానికి ఇంటితో ప్రతివారికి ఎంతో అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా బాల్యాన్ని గడిపిన ఇంట్లో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళగానే ఎదురుగా కనిపించిన దృశ్యం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంటి మధ్యలో మంచం మీద అచేతనంగా నాన్నగారు నిద్రపోతూ కనిపించారు. మనిషి బాగా చిక్కిపోయి ఉన్నారు. ఒకప్పుడు ఆయన్ని చూస్తే ఊళ్ళో పిల్లలందరికీ హడల్... అటువంటి వ్యక్తి ఇలా మంచం మీద అచేతనంగా... నాకే ఆశ్చర్యమనిపించింది. 

    కొద్దిసేపటి తరువాత చిన్నాన్న అతని దగ్గరకు వచ్చి గట్టిగా "అన్నయ్యా! ఎవరొచ్చారో చూడు" అని అనడంతో ఆయన కళ్ళల్లో వేయి బల్బుల కాంతి... ఒక్క ఉదుటన లేవడానికి ప్రయత్నించాడు. కానీ నేను వారించడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. నేను వెంటనే ఆయన పక్కనే కూర్చున్నాను. నా చేతిని ఆప్యాయంగా తడుముతూ మెల్లటి స్వరంతో "వచ్చావా... బాగున్నావా?" అన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు తాకిన చేయి మళ్ళీ ఇన్నాళ్ళకు... నాకు ఆనందంతోపాటు బాధవేసింది.

    "ఇంతలో చందన నాన్నగారి కాళ్ళకు మొక్కింది. నాన్న వెంటనే ఆమె తలమీద చేయి వేసి నావైపు ప్రశ్నార్థకంగా చూసారు.

    "నీ కోడలురా అన్నయ్యా! చాలా మంచి పిల్ల" అన్నాడు చిన్నాన్న.

    ఒక్క ఉదుటున నాన్నగారు లేచి కూర్చుని ఆమె తలమీద రెండు చేతులు వేసి ఆశీర్వదించారు.

* * *

    మేము ఆ ఊరొచ్చి అప్పుడే వారం రోజులైంది. ఆరోజే నేను పట్నం నుంచి డాక్టర్ని తీసుకుని వచ్చి నాన్నగారికి వైద్యం చేయించడంతో ఇప్పుడతని ఆరోగ్యం కాస్తా కుదుట పడింది. ఇప్పుడు లేచి తన పనులు తాను చేసుకుంటున్నారు. చందన అతనికి రెండు పూటలా సేవలు చేస్తూ కావలసినవి వండి పెడుతుండటంతో అతను త్వరగానే కోలుకున్నాడు. నాన్నగారిలో పూర్వపు ఆవేశం తగ్గిపోయి దాని స్థానే పశ్చాత్తాపం మొదలైనట్లు గమనించాను. 

    ఆ రోజు సాయంత్రం చిన్నాన్నతో కలిసి మా పొలానికి వెళ్ళాను. ఇద్దరం ఏరు దాటి నడవటం మొదలు పెట్టాం. సాయం సంధ్య ఆహ్లాదంగా ఉంది. పడమటి సంజె సంధ్యారాగాన్ని ఆలపిస్తున్నట్లు హోరుగాలి ఏటిమీద నుంచి వస్తూ పాటగా మారుతోంది. "చిన్నాన్నా! నాన్నగారి ఆరోగ్యం కొద్దిగా కుదుటపడింది. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో తోచటం లేదు. ఆయన్ని నాతో తీసుకెళదాం అనిపిస్తోంది. ఆయన ఒప్పుకుంటాడా అని నాకు సందేహం కలుగుతోంది. ఈ విషయాన్ని అమ్మతోకూడా సంప్రతించలేదు. ఏం చేస్తే మంచిదంటావ్" అన్నాను పొలం దగ్గర ఉన్న చెరువు గట్టుపై కూర్చుంటూ.

    "ఒరేయ్! చెప్పాలంటే చాలా ఉందిరా... వాడి జీవితంలో అన్నీ ఒడిదుకులేనురా... మీ అమ్మతో పెళ్ళి, విడాకులు, ఆ తరువాత రెండో పెళ్ళి... ఆవిడ చనిపోవడం... అనారోగ్యం... ఇలా ఎన్నో! ముఖ్యాంగా నాకు తెలిసి, వాడు బాగా ఒంటరితనానికి గురయ్యాడు. ఈ అవసానదశలో భార్యా పిల్లలతో జీవితాన్ని గడపాలని ప్రతీ వ్యక్తి కోరుకుంటాడు. కానీ అది వాడికి సాధ్యం కాలేదు. ఈ వయసులో వాడు ఈ ఊరిని వదిలి వెళ్తాడా అన్నది నా అనుమానం. అదీగాక మీ అమ్మ అభిప్రాయం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. మీ నాన్నతో మనస్ప్రథలొచ్చి ఆవిడ విడాకులు తీసుకుంది. అటువంటిది ఇప్పుడు మీనన్నని నువ్వు మీ ఇంటికి తీసుకెళతానంటే ఆవిడ ఒప్పుకుంటుందా అన్నది నా అనుమానం." 

    "అయితే నేనిప్పుడు ఏం చెయ్యాలి"

    "నువ్వు కొన్నాళ్ళిక్కడ ఉండి వాడి ఆరోగ్యం బాగుపడితే అప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ అభిప్రాయం కనుక్కో. అయినా వాణ్ణి ఒంటరిగా వదిలి వేయడం కూడా మంచిపని కాదు. నువ్వూ, నీ భార్య కలిసి ఓ నిర్ణయం తీసుకోండి. పద చీకటి పడుతోంది" అంటూ లేచాడు చిన్నాన్న.

* * *   

    నేను నోయిడా వచ్చి వారం రోజులైంది. నేను ఇక్కడికొచ్చేముందు నాన్నగార్ని మాతో ఇక్కడికి రమ్మనమని అడిగితే అతను మౌనం వహించారు. ఆలోచించుకొమ్మని చెప్పి వచ్చేసాం. నోయిడాకి రాగానే అమ్మకీ విషయం చెబితే ఆమె కూడా ఏ నిర్ణయం తీసుకోలేక పోయింది. మరో వారం రోజుల తరువాత నాన్నగారి నుంచి ఒక ఉత్తరం వచ్చింది. 

ప్రియమైన రఘుకి,

    మీ నాన్న ఆశీర్వదించి వ్రాయునది. నువ్వూ, కోడలు వెళ్ళిపోయిన తరువాత నాలో అంతర్మథనం మొదలైంది. నేను వయసులో ఉన్నప్పుడు నా అహంకారంతో మీ అమ్మ పట్ల తప్పుగా ప్రవర్తించాను. ఒక విధంగా మేమిద్దరం విడిపోవడానికి నేనే కారణం. ఈ వృద్ధాప్యంలో ఆ నిజాన్ని అంగీకరించడాన్ని నేనేమీ తప్పుగా భావించడం లేదు. ఇదేదో నా రెండవ భార్య చనిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు మీ అవసరం ఉందన్న ఆశతో స్వార్థంతో చెబుతున్న మాటలు కావు. జీవితంలో తప్పులు చేయడం ప్రతి మానవుడికి సహజం. అందుకు నేనేమీ మినహాయింపు కాదు. కాకపోతే ఆ తప్పును తెలుసుకోవడం ప్రతి మానవున్ని విధి. ఇప్పుడు నాలో ఆ ప్రాయశ్చిత్తం కలుగుతోంది. జీవితపు చరమదశలో వచ్చిన ఈ మార్పు నాలో కోపాన్ని అహంకారాన్ని పూర్తిగా తగ్గించి ఒక విరాగిగా మారడానికి కారణమైంది. ఇక మొన్న నువ్వొచ్చి అక్కడికి రమ్మనమని అడినప్పుడు నేను సరియైన సమాధానం చెప్పక పోవడానికి కారణం మీ అమ్మ మనసులో ఏముందో తెలియక పోవడం వల్లే. కాబట్టి ఈ విషయాన్ని అమ్మతో మాట్లాడి నాకు వివరంగా ఉత్తరం వ్రాయి. ఆ తరువాత ఏం చెయ్యాలో ఆలోచిస్తాను. కోడల్ని, మీ అమ్మని అడిగినట్లు చెప్పు.

ఉంటాను, మీ నాన్న కామేశ్వరరావు.

    ఈ ఉత్తరాన్ని సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన తరువాత అమ్మకిచ్చాను. ఆ ఉత్తరాన్ని చదివిన అమ్మ మౌనం దాల్చింది. ఆ రాత్రంతా ఆమె ముభావంగా ఉంది. ఆ మర్నాడు ఉదయాన్నే నేను స్నానం చెయ్యబోయే ముందు నన్ను తన గదికి పిలిచి "రఘూ! నేను మన ఊరు వెళ్దామనే నిర్ణయించుకున్నానురా. ట్రైన్‌కు రిజర్వేషన్ చేయించు" అని చెప్పింది.

    ఆమె మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. "అన్నీ ఆలోచించుకున్నావా అమ్మా!" అన్నాను కాసేపటి తరువాత.

    "అన్నీ ఆలోచించానురా. అతను ఒకప్పటి నా భర్తనీ, నీ తండ్రనీ కాదు గానీ ఎంతైనా ఒంటరిగా ఉన్న వృద్ధుడతను. ఈ అవసానదశలో ఒకరి ఆసరా అవసరం అతనికి. ఇక అతను చేసిన తప్పులంటావా... తప్పులన్నవి ప్రతిమనిషి జీవితంలో సహజం... ఎంతైనా అతను నీకు జన్మనిచ్చిన తండ్రి. ఒంటరివాడు. అటువంటి వ్యక్తి వానప్రస్థ జీవితం కొడుకు దగ్గర గడిచిపోతే అంతకన్నా ఆనందం అతనికేముంటుంది చెప్పు. అందుకే అతని దగ్గరకు నేనే వెళ్ళి కొన్నాళ్ళక్కడ ఉండి అప్పుడు ఇక్కడకు రావాలా అక్కడే ఉండ్డిపోవాలా అని నిర్ణయం తీసుకుంటాను" అంది.

    ఆమె మాటలు నాకు చాలా ఆనందం కలిగించాయి. ఆ మర్నాడే ఆమెను ట్రైన్ ఎక్కించాను. అప్పుడే ఆమె వెళ్ళి నెలరోజులు కాబోతోంది. వాళ్ళిద్దరి రాకకోసం నేను, చందన ఎదురు చూస్తున్నాం.

(చిరుగాలి మాసపత్రిక జూన్ 2011 సంచికలో ప్రచురితం)

Comments