వరదానం - వూసల రజనీగంగాధర్

        
సీతా మహాసాధ్విని భూఖండంతో పెకలించి ఆకాశమార్గంలో అపహరించుకు పోతున్నాడు రావణాసురుడు. ఈ విషయాన్ని గమనించిన జటాయువు సీతను రక్షించాలని రావణున్నెటాక్ చేసింది. ఆరోజుల్లో బోఫోర్స్ గన్సు, ఏ.కే.ఫార్టీసెవెన్సు, రాకెట్ లాంచర్సు లేకపోవడంతో జటాయువు ముక్కుతో రక్కుతుంటే, రావణుడు గదతో ఫైట్ చేస్తున్నాడు. ఇలా చాలాసేపు ఇద్దరి మధ్యా ద్వంద్వ యుద్ధం జరిగింది. ఇక లాభం లేదని గదను ప్రక్కనబెట్టి తన ఖడ్గాన్ని దీసి ఒక్క వేటు వేశాడు రావణుడు. అంతే రెక్కలు తెగి రక్తం ఓడుతూ నేలకూలింది జటాయువు.
        “సీతా! సీతా!” అంటూ సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన శ్రీరాముడు కొన ఊపిరితో మూల్గుతున్న జటాయువును చూచి దగ్గరకొచ్చాడు. అలా వచ్చిన శ్రీరాముణ్ణి చూచి “ రామా! సీతకోసం ఈ డీప్ ఫారెస్టులో నువ్వెంత వెదికినా లాభం లేదు. నీ సీతను రావణాసురుడు ఆకాశమార్గంలో లంకకు అపహరించుకు పోయాడు. నేనెటాక్కిచ్చానని నా రెండు రెక్కలూ తెగ నరికాడు. కానీ నీకీ మేటర్ చెప్పాలనే ఇప్పటి వరకూ ప్రాణాలతో ఉన్నాను. ఇక నేను హేపీగా చచ్చిపోతాను” అని చెప్పింది.         ఆ మాటలు విన్న శ్రీరామునికి పక్షి మీద జాలి కలిగింది. ‘నా సీత జాడ చెప్పి నా దుఃఖాన్ని తీర్చినందుకు నీకేం వరం కావాలో కోరుకో ఇస్తా’నన్నాడు.         “శ్రీరామా! మరికొద్ది క్షణాల్లో చనిపోయే నాకు ఏ కోరికలూ లేవు. కానీ నేను చనిపోతే నాపిల్లలు అనాథలైపోతారు. వాళ్ళను ఏ అనాథ హాస్టల్లోనో పారెయ్యక వాళ్ళకి ఫుడ్డు, బెడ్డు ఉండేలా చూడు అంతే చాలు” అంది.

        "నీవు నాకింత సహాయం చేశాక నీకామాత్రం సహాయం చెయ్యలేనా? జరగబోయేది రామ రావణ యుద్ధం. ఆ యుద్ధంలో లక్షలాది రాక్షసులు మరణిస్తారు. నీ పక్షి సంతానమంతా కొన్నేళ్ళపాటు హేపీగా తీరిగ్గా కూర్చుని తినొచ్చు. నీకిదే అభయమిస్తున్నాను. నువ్వు విచారించకు" అన్నాడు రాముడు. ఆమాటలు విని ఆనందంతో కన్నుమూసింది జటాయువు.

* * *
        
        రాముడిచ్చిన వాగ్దానం ప్రకారం రామరావణయుద్ధం రానే వచ్చింది. ఇటు వానరసేనా, అటు రాక్షససేనా పద్దెనిమిది రోజులు భయంకరమైన యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో లక్షలాది రాక్షససేన మృత్యువాత పడింది. అంతిమంగా విజయం శ్రీరాముణ్ణే వరించింది. రామలక్ష్మణులతో బాటు వానరసేన ఆనందానికి అవధుల్లేవు. ఆ రోజు ఈవినింగ్ పెద్ద విజయోత్సవ సభ జరిపి, మాంచి డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు రాముడు. అందరూ హేపీగా గంతులేస్తుండగా హాలు బయట "శ్రీరాముడు - డౌన్‌డౌన్. మా జటాయువుకిచ్చిన వాగ్దానం వెంటనే నెరవేర్చాలి. మాట మరచిన రాముడు -డౌన్‌డౌన్" అంటూ స్లోగన్ల మోత. గేటు దగ్గరున్న వానర వాచ్మేన్ వాళ్ళకి లోపలికి ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకున్నాడు. శ్రీరాముడు వారిని లోనికి రావలసిందిగా చేత్తో సైగ చెయ్యడంతో వాళ్ళందర్నీ లోనికి అనుమతించారు.  

        ఆకలితో మండిపోతూ ఆవేశంతో ఊగిపోతున్న ఓ గెద్దముక్కు పక్షి రాజు ముందుకువచ్చి "ఓ శ్రీరామా! మా జటాయువుకిచ్చిన వాగ్దానం మర్చిపోయి మమ్మల్ని ఫుడ్ లేకుండా ఆకల్తో చంపుతూ మీరుమాత్రం లంచ్‌లు, డిన్నర్ పార్టీలు చేసుకోవడం ధర్మంగా ఉందా? రామరావణ యుద్ధంలో మరణించిన రాక్షసుల కళేబరాలను మిగిలిన రాక్షసులే విందారగించాయి. మాకొక్క పిల్ల శవంకూడా మిగల్లేదు. ఇది చాలా అన్యాయం. మాకు వెంటనే ఫుడ్ ఏర్పాటు చెయ్యాలి. లేకపోతే ఇక్కడ్నుంచి కదలం" అంటూ అక్కడే బైటాయించడంతో రాముడికేం చేయాలో తోచలేదు. క్షణంలో ఆలోచించి పక్షి సంతానంతో ఇలా అన్నాడు.

        "చూడండీ! జరిగిన పొరబాటుకు చాలా విచారిస్తున్నాను. ఇకముందెప్పుడూ అలా జరగదు. నేను కృష్ణావతారంతో ద్వాపర యుగంలో అవతరించి కురుక్షేత్ర మహాసంగ్రామం జరిపిస్తాను. అందులో కౌరవసేన పదకొండక్షౌహిణుల కళేబరాలను మీకు కానుకగా సమర్పిస్తాను. అది మీకు తరతరాలకు సరిపోయే ఆహారమని ప్రామిస్ చేస్తున్నాను. నన్ను నమ్మి మీరు నిశ్ఛింతగా వెళ్ళండి" అనగానే పక్షి సంతానం ఆనందంగా అరుస్తూ "శ్రీరాముడు-జిందాబాద్. శ్రీరాముడు-జిందాబాద్." అంటూ రెక్కలు రెపరెపలాడిస్తూ ఎగిరిపోయాయి.

* * *
       
        రాముడు చెప్పినట్లు కృష్ణావతారం, కురుక్షేత్ర మహా సంగ్రామం రెండూ జరిగిపోయాయ్. కానీ ఆయుద్ధంలో మరణించిన కౌరవసేన కళేబరాలను ఎవరో మాయాశక్తి రూపంలో వచ్చి విందారగించిందని, ఈసారి కూడా మాకు ఆహారం లభించలేదంటూ, శ్రీరాముడు మళ్ళీ మమ్మల్ని తప్పుడు వాగ్దానాలతో మోసం చేశాడంటూ కృష్ణుని ముందు ప్లేకార్డులు ప్రదర్శిస్తూ "కృష్ణుడు - డౌన్‌డౌన్" అంటూ పక్షుల అరుపుల నినాదాలతో ద్వారకా నగరమంతా ప్రతిధ్వనించింది. 

        ఆ అరుపులకు నిద్రాభంగం కలిగిన శ్రీకృష్ణపరమాత్ముడు లేచి బాల్కనీ లోకొచ్చి పక్షి సమూహాన్ని చూచి రామావతారంలో వాటికిచ్చిన వాగ్దానం గుర్తుకు తెచ్చుకుని జరిగిన పొరబాటుకు మనసులో చింతించి పక్షి దండునుద్దేశించి ఇలా అన్నాడు.

        "ఓ జటాయువు సంతానములారా! మీ బాధను నేనర్థం చేసుకో గలను. మీకు ఈసారికూడా అన్యాయం జరిగింది. దానికి నేను చాలా విచారిస్తున్నాను. దీనికి శాశ్వతమైన పరిష్కారం ఆలోచించాను. అదేమిటంటే... ఇక మీరు శవాలను తిని బ్రతకాల్సిన అవసరంలేదు. అంతేకాదు. యుద్ధంలో మరణించడం చేత వాటికి తగిలిన కత్తిగాయాలవల్ల వాటికి బాక్టీరియా రావచ్చు. వాటిని తింటే మీకూ మీపిల్లలకూ అనారోగ్యం రావచ్చు. అందుకే మీకీ యుద్ధ శవాలతో పని లేకుండా సజీవ శరీరాలనే ఆహారంగా ప్రజంట్ చేయాలనుకుంటున్నాను. రాబోయేది కలియుగం. మీరు మానవుల్లాగా అవతరిస్తారు. మీరూ మీపిల్లలూ రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయ నాయకులుగా ఎదగండి. అప్పుడు ప్రజల రక్తాన్ని తాజా డ్రింక్సులా తాగొచ్చు. మాంసాన్ని హాట్‌కేకుల్లా తినొచ్చు. తరతరాలూ మీపిల్లలూ, మీపిల్లలపిల్లలూ హాయిగా బ్రతకొచ్చు. ఇక మాట తప్పను. మీకిదే వరదానం చేస్తున్నాను" అని చెప్పి ముగించగానే "శ్రీకృష్ణుడు - జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్.శ్రీకృష్ణుడు - జిందాబాద్" అంటూ ఆనందంగా ఎగిరిపోయాయి.
 

* * *
Comments