వర్ధనమ్మ మొగుడు - రవికుమార్

    నిర్ణయం జటిలమయింది.

 

     బండి దూరమయింది.

 

    వర్ధనమ్మ ముందుకు నడిచింది

    

    అంతవరకూ నిద్ర నటించిన వర్ధనమ్మ మొగుడు రైలు కిటికిలోంచి ఆమె కనుమరుగు అయ్యే దాక చూసి పెల్లుబుకు తున్న దుఖాన్ని దిగమింగుకుని కళ్ళలో ఆగకుండా కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ గతం లోకి వెళ్ళిపోయాడు .

 

    పెళ్ళైన కొత్త రోజులు . ఎప్పుడెప్పుడు ఆఫీసు అవుతుందా యింటికి వెళ్లి పోయి ఆమె కళ్ళలోకి చూస్తూ వళ్ళో తల పెట్టుకుని ఆమె తన  ముంగురులు సవరిస్తూ గోముగా టిఫిన్ నోట్లో పెడుతుంటీ తన చేతులతో ఆమె నడుముని వీణాలా మీటుతూ భవిష్యత్తు గురించి తాను కన్న బంగారు కలలు ,అవి నిజం చేసుకునే ప్రణాళికలు చెప్పుకోవాలని ఆశించే వాడు .వెళ్ళ గానే పెరట్లో బట్టలు ఉతుక్కుంటోనో ,గిన్నెలు తోము కుంటునో వుండేది .

    "పనిమనిషిని పెట్టుకోవచ్చు గా వర్ధనం ?"

    "పనికి మనీ యిచ్చి షి ని వాడుకుంటారని , కాపురాలు నిలకడగా ఉండాలంటే మన పని మనమే చేసుకోవాలని మా అమ్మ కాపురానికి పంపే ముందే చెప్పిందండీ ."

    "ఆవిడ స్వీయ అనుభవాలు అందరికి ఆపాదించడం తగునా ?" అన్న పాపానికి వారం రోజులు సహాయ నిరాకరణ చేసేసింది . ఏంటో అంత సెన్సిటివ్ చిన్న మాట అంటే చీదుకుంటూ అటు తిరిగి పడుకోవడమే. తన తప్పులేక పోయినా పోనిలే అని సముదాయిద్దామంటే  "నీ పని కానిచ్చుకోవడం కోసమే కాళ్ళ బేరానికి వచ్చావు గాని నీ తప్పు తెలుసుకుని మాత్రం కాదు" అంటూ నిష్టూరాలు వేసేది . మనసు చివుక్కు మనేది .

 

    ఎదటి వాడి కోణం లోంచి సమస్యని చూద్దామనే ఆలోచనే లేదు . ఎప్పుడు తన పని తన ధోరణే . భర్త కి బట్టలు వుతికామా? టిఫిన్ ఏమి చేసాం ? రేపటి టిఫిన్ కి ఏమి నానా బెట్టుకోవాలి యివే ఆలోచనలు తప్ప రొమాంటిక్ ఆలోచనలంటేనే రోత . పెళ్ళైన కొత్తలో కొద్దో గొప్పో వున్నా అవి కాస్తా పిల్లలు పుట్టేసాక పులిస్టాప్ పెట్ట బడ్డాయి . ఎప్పుడన్నా ప్రేమగా దగ్గరికి వెళ్ళినా వూర్కోండి మీకు ఎప్పుడు అదే యావ పిల్లలు లేస్తారు పోయి పడు కొండని అదిలింపు . ఎప్పుడన్నా యింక వుండ బట్టలేక బలవంతం చేస్తే ఛి ఛి రాక్షస గణం రాక్షస బుద్దులు , రాక్షస రతి అంటూ రాత్రంతా మాటలతో సతాయింపు . ఎప్పుడన్నా కొంచెం నలత గా వుంటే చాలు వెంటనే మంచం ఎక్కేసి ముసుగు తన్నేసి విశ్రాంతి పేరు తో యద్దనపూడి నవలలు చదువుకుంటూ కూర్చునేది . అమ్మ తనకి వోపిక లేక పోయినా మా పంచన వున్న పాపానికి వండి పడేసేది . పిల్లల మీద పెట్టె శ్రద్ద లో వెయ్యో వంతు కూడా నామీద పెట్టేది కాదు . ఏదన్నా సంతోషంతో పంచుకుందామని యింటికొస్తే నే చెప్పే లోపే రోజు మీ అమ్మ ఏంచేసిందో తెలుసా అంటూ నేరాలు చెప్పేది .

 

     మొదట్లో వర్ధనం ధోరణిని మార్చుదామని ప్రయిత్నించి విఫలం అయ్యాడు తను. సెల్ఫ్ పిటి ఉన్నవాళ్ళని ఎప్పటికి మార్చలేమని పట్టాభిరాం ఎప్పుడో చెప్పాడు . యిటువంటి పరిస్థితులలోనే ఆఫీసు లో పంకజం పరిచయం అయ్యింది . ఆమెకీ  యింట్లో తనలాంటి పరిస్థితులే. శాడిస్టు భర్త పెట్టె బాధలు తట్టుకోలేక విడాకులు కూడా తీసేసుకుని వొంటరిగా ఉంటోంది . రోజుకి ఏడెనిమిది గంటలు పక్క పక్కనే కూర్చుని పని చేస్తూ కష్ట సుఖాలు పంచుకుంటూ, యిరువురికి వొకే ఆలోచనా విధానం అవడం తో యిద్దరం యిట్టే కలిసి పోయాం . వొక రోజు స్కూటర్ మీద పంకజాన్ని వాళ్ళింట్లో దింపడానికి వెళ్తుంటే గుడి నుంచి వస్తున్న వర్ధనంచూసి రాత్రి అన్నాలప్పుడు  యిద్దరికీ అక్రమ సంభంధం అంట గట్టి మాట్లాడుతుంటే అన్నం లో చెయ్యి కడిగేసుకుని వెళ్లి పోవడం తప్పని రాద్దాంతం చేసింది . అమ్మ తట్టుకోలేక ఆడదానిలో లోటుంటే మగాడు పక్క దారి పడతాడు అన్న పాపానికి పిల్లల్ని తీసుకుని నెల్లాళ్ళ పాటు పుట్టింటికి వెళ్ళిపోయింది . తనే అహం చంపుకుని వాళ్ళింటికి వెళ్లి మళ్ళి పెళ్ళాం పిల్లల్ని తెచ్చు కున్నాడు.

 

     సద్దుకు పోయే తత్త్వం అలవాటు చేసుకుని ఆమె అన్న ప్రతి దానికి తల ఆడిస్తూ వుండడం తో తన అసలు పేరు జనాలు మర్చి పోయి వర్ధనమ్మ మొగుడుగా మిగిలి పోయాడు తాను. యిప్పుడు పిల్లల పెళ్లిళ్ళు అయి ఎవరి కాపరాలు వాళ్ళు చేసుకుంటున్నారుమేము ఎప్పుడన్నా వొక నెల పది హేను రోజులు వాళ్ళ దగ్గర వుండ డానికి వెళితే మళ్ళీ యీవిడ గారి ధోరణి మొదలుమొన్నటికి మొన్న చెప్పా పెట్టకుండా యింటి నుంచి వెళ్ళిపోయి తామంతా నానా కంగారు హైరానా పడుతూ వెతుక్కుంటుంటే మెల్లిగా సాయంత్రానికి వచ్చి మందుల కోసం వెళితే యింత రాద్దాన్తమా అంటూ తమ పైనే విరుచుకు పడుతోంది

 

    యిదంతా  ఐడెంటిటి క్రైసిస్ అని పట్టాభిరాం ఎప్పుడో చెప్పాడు . తనని ఎవరు పట్టించు కోవడం లేదనే ఆత్మా న్యూనతా భావం . గుర్తింపు కోసం పడే పాట్లతో యెంత కైనా తెగిస్తారు . దీనికి విరుగుడుగా మందు కూడా చెప్పాడు . కొన్నాళ్ళ పాటు వీళ్ళు ఆత్మీయులకి దూరంగా వుండే పరిస్థితి వస్తే అప్పుడు ఆత్మీయుల విలువ తెలిసొచ్చి నార్మల్ గా ఉంటారుట . ప్రణాళిక లో భాగమే టీ వి లో ప్రకటన .

    
    టీవీలో ప్రకటన మీద తన కళ్ళూ - మనసూ నిలిచిపోయాయి అకస్మాత్తుగా! 'ఎవ్వరూ లేని లేడీ ప్రొఫెసర్కి - వండి - వడ్డించి - ఆమెతో కలిసిపోయే వ్యక్తి కావాలిట. బాదర బందీలు లేనిదై వుండాలి. ఆత్మీయత ఇచ్చిపుచ్చుకునేదై వుండాలి. జీతం ఎంతయినా ఫరవాలేదు. వ్యక్తి నేరుగా వచ్చి కలిస్తే మంచిది' అనే ప్రకటన. తరువాత ఆమె చిరునామా. వర్ధనమ్మలో వెలుగు నింపింది. గదిలోనికెళ్ళి అడ్రస్ నోట్ చేసుకుంది.

    చాయి చాయి అన్న పిలుపుతో ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు.  ట్రైన్ ఏదో స్టేషన్ లో ఆగింది .

 

    సెల్ లో కుడా సిగ్నల్ రావడం తో వెంటనే పంకజానికి ఫోన్ కొట్టాడు . "జాగర్త గా చూసుకో పంకజం పెళ్లి అయిన యిన్ని ఏళ్ళలో తనని వదిలి వెళ్ళిన సందర్భాలు చాల తక్కువ . నిన్ను ఎప్పుడో పాతికేళ్ళ క్రితం తను వొక్క సారే చూడడం తో గుర్తు పట్టే అవకాశం లేదు . టీ వి లో ప్రకటన నువ్వే యిచ్చావని నమ్మి వస్తోంది . కంట్లో నలుసు పడిందని కన్ను పీక్కోము కదా!  అలాగే తనలో కూడా చిన్ని చిన్ని లోపాలు . నీ తోబుట్టువు లా భావించుకుని తనకి మళ్ళీ నా ద్యాస కలిగే వరకు కంట్లో పెట్టుకు చూసుకో ."

 

     కళ్ళు చెమరుస్తున్నాయి , సిగ్నల్ వీక్ అయ్యి పోతోంది . మాటలు కట్ అయి పోతున్నాయి .

 

    రైలు వేగం పుంజుకుంది గమ్యం వైపు దూసుకు పోడానికి .  

 

Comments