వసంత కోకిల - వియోగి

    వసంత మాసంలో 'కుహూ-కుహూ' అంటూ కోకిల పాట పాడుతున్నది... అందరికి వీనులవిందుగా ఉంది. వాతావరణం ఆహ్లాదకరంగా - ఆశలు రేకెత్తిస్తూ ఉంది. 
    
    ఆరు సంవత్సరాల తర్వాత స్వదేశానికి వచ్చాడు రాజు భార్యతో. 

    అతను అమెరికాలో పెద్ద కంప్యూటర్ ఇంజనీరు. భార్యను కూడ ఏరికోరి ఉద్యోగస్తురాలినే చేసుకున్నాడు. వాళ్ళ పెళ్ళయింతర్వాత రావడం ఇదే మొదటిసారి. 

    చెన్నైలో దిగగానే రాజు భార్య రేవతి పుట్టింటికి వెళ్ళిపోయింది. చెన్నై నుండి రాజు ఒక్కడే నెల్లూరు చేరుకున్నాడు తన తల్లిదండ్రులను కలుసుకుందామని.

    రాజు తండ్రి అవధాని స్టేషన్‌కొచ్చి కన్న కొడుకును పూలదండతో సత్కరించి ఆటోలో యింటికి తీసుకువచ్చాడు.
    గుమ్మంలోకి రాగానే జానకమ్మ దిష్టి తీసింది రాజుకు.

    రాజు చెల్లెళ్లు స్వప్న - శారద ఎదురొచ్చారు. తమ్ముడు శశాంక నవ్వుతూ కౌగిలించుకున్నాడు.

    రాజు ఆ యింటి పెద్దకొడుకు. అవధాని పౌరోహిత్యంతో ఇంత సంసారాన్ని లాక్కొస్తున్నాడు. తనే కష్టపడి శ్రాద్ధకర్మలు - పెండ్లిండ్లు చేసి... రెక్కలు ముక్కలు చేసుకుని రాజును పై చదువులు చదివించాడు. రాజు కూడ తెలివిగలవాడు కావడంతో మెరిట్‌తోనే సీట్లు వచ్చాయి.  

    ఆపైన అమెరికా వెళ్ళే ఛాన్సు కూడ తగిలింది. అతని పని నచ్చి ఆ కంపెనీ అతనికి వెంటవెంటనే ప్రమోషన్లు కూడ యిచ్చింది. రెండేళ్ల తర్వాత ఇండియాకు వచ్చి - తండ్రి చూపించిన సంబంధాల్లో తనకు నచ్చిన రేవతిని చేసుకున్నాడు. తనకు కావల్సిన డిగ్రీలు - అర్హతలు ఉండటంతో. ఇద్దరు అమెరికాకు వెళ్ళిపోయింతర్వాత రేవతికి ఉద్యోగం రావడం పెద్ద కష్టం కాలేదు.

    రాజు - రేవతిలది నియమబద్ధమైన జీవితం - వచ్చిన జీతాలను పొదుపుగా వాడుకుంటుంటారు.
    చిన్నప్పుడు ఒకపూట పస్తు పడుకున్న రోజులు రాజుకు యింకా గుర్తు ఉన్నాయి. అందుకే అతనికి డబ్బు విలువ తెలుసు. రాజు బాగా రెస్టు తీసుకున్న తర్వాత శారద అడిగింది మురిపెంగా     "అన్నయ్యా! మాకోసం ఏం తెచ్చావు అమెరికా నుండి?"
    "ఏం తీసుకురావాలే!" ఆశ్చర్యంగా అడిగాడు.

    "అదికాదు రాజన్నయ్య! అమెరికా నుండి చాలామంది వాళ్ళ చెల్లాయిలకు బంగారు గొలుసులు - గాజులు తెస్తూ ఉంటారు" స్వప్న చెప్పింది.
    "పిచ్చి వాళ్ళు - ఏం ఆ బంగారు గాజులు - గొలుసులు ఇండియాలో దొరకవా?!" ఆశ్చర్యంగా అడిగాడు రాజు.     "దొరకవని కాదు - అక్కడ నాణ్యమైనవి - చౌకగా దొరుకుతాయని" శారద చెప్పింది.
    "పోదూ - దూరపు కొండలు నునుపు" రాజు చెప్పాడు.

    "అన్నయ్యా! కనీసం మా కోసం లేటెస్టు ఎలెక్ట్రానిక్సు వస్తువులు తెచ్చావా?" తమ్ముడు శశాంక అడిగాడు.
    "అవన్నీ మూట బరువురా! ఆ లగేజ్ వేసుకొచ్చి - కస్టమ్స్ ఆఫీసర్ల ముందు గంటల తరబడి నిల్చోవాలి! అయినా ఇండియా బాగానే డెవలప్ అయింది కదురా ఎలెక్ట్రానిక్సులో - దొరకనివేమున్నాయి కనుక!" ఆశ్చర్యంగా అడిగాడు రాజు.
    "అదికాదురా అబ్బాయ్! నువ్వేదో తెస్తావని నెల రోజులుగా వీళ్ళు కలలు కంటూ ఉన్నారు - స్నేహితులకు గొప్పగా చెప్పుకుంటున్నారు. మా అన్నయ్య అమెరికా నుంచి వస్తాడు - మాకు డిజిటల్ కెమెరా తెస్తాడు - విడియో కెమెరా తెస్తాడు అని" జానకమ్మ చిన్నపిల్లల ఆరాటం వర్ణించి నవ్వింది.

    "అమెరికాలో కొత్తవి ఏమున్నాయి - అన్నీ ఇండియాలోవే! ఇంతకీ వీళ్ళు ముగ్గురూ బాగా చదువుకుంటున్నారా? మార్కులు బాగా వస్తున్నాయా?" ఆరా తీశాడు.
    "ఏం బాగా మార్కులు వస్తే నీ వెంబడి అమెరికా తీసుకుపోతావా?" ఆశగా శశాంక అడిగాడు.     "అదంత సులభం కాదులే! పోటీ పరీక్షలు రాయాలి - ర్యాంకులు తెచ్చుకోవాలి. మునుపటంత ఈజీగా లేదు వ్యవహారం!" రాజు చెప్పాడు.     ఉగాది పండగ వచ్చింది నాలుగు రోజులకు.     "ఏమ్మా! అందరికీ కొత్తబట్టలు కొన్నారా నాన్న!" అడిగాడు రాజు.     "ఏమోరా! నువ్వు తీసుకు వచ్చావనుకుంటున్నారు మీ నాన్న!" జానకమ్మ చెప్పింది.
    "పోయి పోయి అమెరికా నుండి బట్టలు మోసుకురావాలా! అక్కడి వాళ్ళేమనుకుంటారు? ఇండియాలో ఆఖరికి బట్టలు కూడా తయారు కావడం లేదు - ఒట్టి బ్యాక్‌వర్డ్ కంట్రీ అనుకోరు. అందుకని తీసుకురాలేదు - ఇక్కడ డబ్బులు పడేస్తే అక్కడి కంటే యిక్కడే మంచి క్వాలిటీ బట్టలు దొరుకుతాయి" రాజు చిన్న స్పీచ్ ఇచ్చాడు.

    "నిజమే అనుకో! కాని...సమయానికి డబ్బు అందలేదురా రాజు! అందరికీ కొనాలంటే కనీసం రెండువేలన్నా అవుతుంది బిల్లు... నా దగ్గర లేదు" అవధాని చెప్పాడు బాధగా.
    "ఓస్! అప్పడిగితే ఎవడివ్వడు? బట్టల షాపువాళ్ళే యిస్తారుగా - ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టుకోవచ్చు" రాజు సూచించాడు.     ఆ సాయంత్రం జానకమ్మ తనకు తెలిసిన బట్టల దుకాణానికి వెళ్లి అందరికీ బట్టలు తెచ్చింది.     ఎలా తెచ్చావు - ఎంత అని అడగకుండా రాజు సంబరంగా తీసుకున్నాడు.     అదేం ఖర్మో కాని - రాజు జేబులోంచి నయా పైసా డబ్బు తీయలేదు. అది కావాలి, ఇది కావాలి అని అమ్మకు నాన్నకు చెప్పేవాడే కాని - తన మటుకు ఏదీ కొనలేదు.
    చెల్లెళ్ళు - తమ్ముడు అడిగినా చిల్లర లేదనో - ఇండియన్ కరెన్సీ దొరకలేదనో చెప్పి తప్పించుకున్నాడు.

    రెండు రోజుల తర్వాత కోడలు రేవతి చెన్నై నుండి వచ్చింది మామగారింటికి.
    రాగానే సౌకర్యాలు చూసి మొహం చిట్లించింది.     "అదేంటండి అత్తయ్యగారు - రాకరాక వస్తే ఇలా యిరుకు కొంపలో పడేశారు మమ్మల్ని - అక్కడ అమెరికాలో మా యింటికి పాతిక గదులున్నాయి - ఇక్కడ రెండు గదుల్లో ఇంతమంది ఇరుక్కున్నారు!" ఆశ్చర్యంగా - విషాదంగా అడిగింది.     బయటకు ఆటోలో పోవలసి వచ్చినందుకు బాధపడింది.     "ఇదేం దరిద్రమండి మామగారు! మాకు అక్కడ అమెరికాలో రెండు పడవ కార్లున్నాయి - ఒక్కోటి యిరవై లక్షలు పైన ఖరీదు చేస్తుంది. మీరింకా డొక్కు మోపెడ్ వాడుతున్నారు - ఓ కారు తీసుకుని ఉండాల్సింది!" రేవతి సానుభూతి చూపించింది.
    ఆడపడుచులు అక్కడక్కడ చిరుగులు పడ్డ చీరలు కట్టడం చూసి నొచ్చుకుంది.

    "అయ్యో! నాకు చెప్పినా తీసుకువచ్చేదాన్ని - బీరువాలో పట్టకుండ నాకు అక్కడ గౌన్లు - శారీలున్నాయ్ - కనీసం ఓ డజను నేను వాడి పడేసిన శారీలన్నా తెచ్చేదాన్ని - చాలా బాగున్నాయి" అని విచారించింది.

    అమ్మోరులాగా ఒంటినిండా నగలు దిగేసుకుని - అతి ఖరీదైన పట్టుచీర కట్టుకుని బయలుదేరేది - వారివెంట ఆడపడుచులు అత్తగారు దిష్టిబొమ్మల్లాగా కనిపించేవారు వెలసిపోయిన చీరల్లో - బోసి మెడలతో.
    "ఒరే రాజూ! మీ నాన్నగారికి మునపటి ఓపిక లేదురా - ఆ పౌరోహిత్యంలో పైసలు రావడం లేదురా - కాంపిటీషను పెరిగి పోయింది. సందుసందులు శాస్త్రులున్నారు - అప్పటికీ మన పాత కష్టమర్లు మనమీద గౌరవంతో వస్తున్నారు... వీళ్ళిద్దరి పెళ్ళి ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు - వీళ్ళేమో తోటకూర కాడల్లా పెరిగిపోయారు - శశాంక డాక్టరేట్ చేస్తానంటున్నాడు. ఈ సంవత్సరంలో తన పీ.జీ కూడా అయిపోతుంది. మీ యిద్దరు సంపాదిస్తున్నారు కదా - కాస్త నాన్నను ఆదుకుంటే ఈ సంసారం ఓ ఒడ్డున పడుతుంది" జానకమ్మ ఒంటరిగా వున్న రాజుతో తన బాధ చెప్పుకుంది.

    "పేరుకు ఇద్దరం సంపాదిస్తున్నా - ఎవరి సంపాదన వారిదేనమ్మా. దానిని ఒక్క పైసా అడగను - యివ్వదు - నా సంపాదనతో ఎంతని చేయను - అక్కడ పది లక్షల డాలర్లు పెట్టి ఇల్లు కొన్నాం - దాని బాకీ చెల్లించాలి... జీతంలో సగం ట్యాక్సులు - కటింగులు సరిపోతాయి. అది కడుపుతో వుంది. అమెరికాలో డెలివరీ అన్నా పిల్లలన్నా చాలా ఖరీదైన విషయాలు - వైద్యం చాలా ఖరీదైంది...ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇండియాకు రాకూడదనుకున్నా - కాని... డెలివరీ టైంకు అత్తగారు - మామగారు అన్నా అమెరికాకు వస్తారేమోనని పిలుద్దామని అది వచ్చింది...పిల్లా పీచు పుడితే మళ్ళీ రావడం యింకా ఖర్చెక్కువ అవుతుందని ముందే వచ్చాం" చెప్పుకు పోయాడు. 

    జానకమ్మ హతాశురాలైంది.
    రేవతి బలవంతం చేస్తే రేవతి యింటికి బయలుదేరారు రాజుకు సెండాఫ్ యివ్వడానికి చెన్నైకి వచ్చినప్పుడు.     పెద్ద బంగళా - మంచి లొకాలిటీలో ఉంది... ఎంత లేదన్నా... అరవై డెబ్బై లక్షలు తక్కువ కాదు - అవధాని గార్కి తెల్సి రేవతి తల్లిదండ్రులు చాలా బీదవాళ్ళు - అందుకనే అప్పుడు ఆరేళ్ళ క్రితం పైసా కట్నం లేకుండా పెళ్ళి చేశారు. ఆఖరుకి పెండ్లి ఖర్చు కూడా అవధాని కొంచెం భరించాల్సి వచ్చింది - రాజుకు ఆ అమ్మాయి బాగా నచ్చడంతో.     అటువంటిది ఆరేళ్ళలో వియ్యంకుడు యింత సంపాదించాడంటే...ఎలా నమ్మాలి...అతను ఓ ప్రయివేటు కంపెనీలో క్లర్కు మాత్రమే! ఇదంతా రేవతి పుణ్యంలాగుంది అనిపించింది జానకమ్మకు.     కార్లో ఎయిర్ పోర్టుకు వస్తూ రేవతి అడిగింది. "మా యిల్లు బాగుందా అత్తయ్యగారు!"     "చాలాబాగుందమ్మా! మీ మనసులాగా!" చెప్పింది జానకమ్మ.

    "అమ్మా - నాన్న - ఇంకో రెండు నెలల్లో అమెరికాకు వస్తారు. టికెట్లు ముందే బుక్ చేశాము వాళ్ళకు - నాకు డెలివరీ చేయించి - బిడ్డకు ఒక సంవత్సరం వచ్చేదాకా ఉండి వస్తారు - తప్పదు కదా కన్నవాళ్ళకు - మీరెలాగూ రాలేరు" రేవతి చెప్పింది.     జానకమ్మ మనసు చివుక్కుమంది... పిలవకుండానే రాలేమని వాళ్ళే నిశ్చయించేసుకున్నందుకు.     "మళ్ళీ ఎప్పుడొస్తావురా అన్నయ్యా!" శశాంక అడిగాడు.     "ఏమో తెలీదు...ఇప్పటికే ఈ ప్రయాణపు ఖర్చులతో ఆరిపోయాను"     "కనీసం చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకు రావా?" అవధాని అడిగాడు.     "పెళ్ళిళ్ళకు కాదు - శ్రాద్ధాలకు కూడా రాలేను" చెప్పేశాడు రాజు చటుక్కున.     శారద - స్వప్నలు బాధ పడ్డారు.     "ఆయన అలాగే అంటారులేండి...మీలో ఎవరన్నా పోతే రాక తప్పుతుందా? లోకం ఆడిపోసుకోదూ - ఆయనకు మాట్లాడటం రాదు అత్తయ్యగారు - ఈసారి ముగ్గురం వస్తాం - యిద్దరం కాదు" రేవతి వీడ్కోలు తీసుకుంటూ చెప్పింది.

    కాసేపటికి ఆకాశంలో విమానంలో ఎగిరిపోయారు అమెరికాకు - ఆ విమానంతో పాటు - అవధాని - జానకమ్మగారి ఆశలుకూడా ఎగిరిపోయాయి.     కని పెంచి - చదివించి...పెండ్లిచేసి ఆదుకుంటాడనుకున్న కొడుకు అణా పైసల లెక్కలు వేసుకుంటాడని వాళ్ళు చిన్నప్పుడు ఊహించలేకపోయారు - ఊహించి వుంటే కనీసం తనకు తోడుగా పౌరోహిత్యంలోకి దించుకునేవాడు అవధాని.     వియ్యంకుడు - వియ్యపురాలు వారిని రైల్వే స్టేషనులో వదిలేసి వెళ్ళిపోయారు.

    నెల్లూరుకు చేరుకున్న అవధాని దంపతులకు ఈ నెల రోజుల్లో చేసిన ఇరవై వేల అప్పు ఎలా తీరుతుందని దిగులు పట్టుకుంది.
    శారద - స్వప్న - శశాంకలకు యిప్పుడేమీ రంగుల కలలు రావడం లేదు. తమ భవిష్యత్తు గురించి దిగులు పట్టుకుంది. 

    అవధాని ఎవరో చెబితే విన్నాడు - కోకిల గుడ్డును కాకి పొదుగుతుందట తన గుడ్డు అనుకుని. అది కాకిపిల్లలాగా పెరుగుతుందిట - కాని వసంత మాసం రాగానే 'కుహూ' అంటూ తన వాళ్ళను వెతుక్కుంటూ పోతుందిట!

    ఇప్పుడు అవధానికి రంగుల కలలు రావడం కాదు - పీడ కలలు వస్తున్నాయి.
    తనకు - రాజుకు మధ్య జరిగిన సంభాషణ ఎవరికీ చెప్పలేదు.     ఆరోజు అవధాని తన కొడుకు రాజును ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకు వెళ్ళి అతని మనసు తెలుసుకుందామని ప్రయత్నించాడు.     "రాజూ! నీ నెల జీతం ఎంతరా?" అవధాని. 

    "సీక్రెట్! చెప్పకూడదు నాన్న!" రాజు.     "పోనీ నెలకు ఓ అయిదు లక్షలు ఉందా?"     "అంటే మన ఇండియన్ రుపీసులలోకి మారుస్తే ఇంకా ఎక్కువే ఉంటుంది".     "మరి అంత డబ్బు ఏం చేస్తున్నవురా?" ఆశ్చర్యంగా అడిగాడు.

    "ఎంత చెట్టుకు అంత గాలి - మీ అందరికీ నా జీతం ఇంత అని తెలుస్తుంది కాని - దాంతో పాటు నేను ఎన్ని ట్యాక్సులు కట్టాల్సింది తెలియదు. ఆ డబ్బును దాచుకోవాలంటే నేను ఎంత మనసును చంపుకోవలసింది - ఎన్ని అవమానాలు భరించాల్సింది తెలియదు. ఏదన్న తినాలన్న తాగాలన్న - అయ్యో - డాలరు ఖర్చయిపోతుందని బాధ పడి మానుకొవాలి - అమెరికాలో అమెరికన్ లాగా బ్రతికితే మనకొచ్చే జీతం ఏమీ మిగలదు. ఎంతో పిసినారిగా బ్రతికితేనే కొంచెం మిగల్చుకోగలం! దానికి ఎంత ఆత్మాభిమానం చంపుకోవాలో మీకు తెలియదు. ఒకే ఆఫీసులో ఒకే పనికి ఒకరికి ఒకజీతం - ఇంకోడికి ఇంకో జీతం - ముఖ్యంగా అమెరికన్ అయితే వాడికి చాలా ఎక్కువ జీతం" బాధగా చెప్పాడు.

    "కాదన్నురా! నువ్వు ఎన్నో అవమానాలు దిగమింగి ఎంతో శ్రమకోర్చి ఈ స్థితికొచ్చావు... నువ్వు పుట్టగానే కొడుకు పుట్టాడని విపరీతంగా అప్పులు చేసి స్నేహితులకు - బంధువులకు విందులు చేశాను - ఎందుకు - ప్రయోజకుడవై ఆదుకుంటావని" కళ్ళు చెమరుస్తుండగా చెప్పాడు అవధాని.

    "అది నీ స్వార్థం! కామంతో కళ్ళు కనపడక సంసారం చేస్తే నేను పుట్టాను. అప్పుడే నా పైన ఎన్నో స్వార్థపూరితమైన ఆలోచనలు పెట్టుకుని పెంచావు. పుట్టించిన వాడివి పెంచడం నీ బాధ్యత!" నిర్లిప్తంగా చెప్పాడు రాజు. 

    "రాజూ! నిన్నెలా పెంచానో తెల్సురా! నేను తిన్నా తినకపోయినా నీకు పెట్టానురా! నా శక్తికి మించి చదువులు చదివించాను. అప్పు చేసి నిన్ను బీటెక్ హైటెక్ చేయించాను. అప్పు చేసి అమెరికా పంపాను" ఏడుస్తూ చెప్పాడు.
    "స్టాపిట్! అమెరికా వెళ్ళగానే నువ్వు నాకోసం చేసిన అప్పులు సరిపడా డబ్బు పంపాను...నువ్వు కొంత మిగుల్చుకుని ఇల్లు కూడా కట్టుకున్నావు".

    "నిజమేరా! నువ్వు ఏం చేసినా నీ పెళ్ళి కాని ముందు చేశావు - తర్వాత నాకు పంపించావా? ఇప్పుడు చెళ్ళెళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలిరా - తమ్ముడికి భవిష్యత్తు కల్పించాలి - వీటికి నా దగ్గర డబ్బులు లేవురా - అందుకే ఈ ఒక్కసారికి మమ్మల్ని ఆదుకో - మళ్ళీ అడగను - పెద్దకొడుకుగా బాధ్యతలు పంచుకోరా! ఇవి చేతులు కావు" చేతులు పట్టుకున్నాడు.
         "సారీ నేను డబ్బు పంపిస్తే మీ కోడలు ఒప్పుకోదు - ఎవరికోసమో నా సంసారంలో కలతలు లేపుకోవడం నాకిష్టం లేదు. నేను సంపాదించే ప్రతి పైసా ఆమెకు తెలుసు" రాజు తిరస్కరించాడు. 

    "ఆ! మొగాడివి - నువ్వు చెబితే ఆమె వినాలి కాని - పెళ్ళాం చేతిలో కీలుబొమ్మవై పోయావా! అసమర్థుడా!" ఆక్షేపించాడు అవధాని - "నువ్వు మారిపోయావురా?" 

    "అమెరికాలో స్త్రీ పురుషులకు సమాన హక్కులు - ఆ లింగ బేధాలు లేవు - నీ పిల్లలు - పెళ్ళిళ్ళు నీ పర్సనల్ మేటరు - ఎవరు కనమన్నారు అంతమందిని - పంది కూడ కంటుంది" రాజు ఇంకా ఏదో చెప్పబోయాడు - అవధాని అవకాశం ఇవ్వలేదు. 

    "ఛీ నా కడుపున చెడబుట్టావురా అప్రాచ్యుడా!" అవధాని తన కోపం హద్దులు దాటుతుండడంతో వచ్చేశాడు - అప్పట్నించి కంటి మీద కునుకు తక్కువైంది.

    జానకమ్మ భర్తకు చెప్పకుండా దాచిన విషయం ఒకటి వుంది. అది గుర్తుకు వచ్చినప్పుడు ముల్లులాగా మనస్సును పొడుస్తుంది...దుఃఖం పొర్లుకొస్తుంది.

    "ఒరే రాజూ! చిన్నప్పుడు మేమంటే ఎంత అభిమానంగా వుండేవాడివిరా - పెళ్ళయింతర్వాత ఫోన్ చేయడం లేదు - ఉత్తరం పత్తరం లేదు" జానకమ్మ బాధగా అంది. 

    "ఆ! మీకు డబ్బుకూడ పంపడంలేదు. అంతేగా - ఏంటే మీ ఉద్దేశ్యం? కడుపులో విషయం దాచుకుని నన్ను పెంచారా! భవిష్యత్తులో మీకు నేనొక కల్పవృక్షంలాగా - మీరడిగినప్పుడల్లా డబ్బు పంపించేట్లుగా ఊహించుకుని పెంచారా! అప్పుడే పీక నులిమి చంపేస్తే బాగుండేది!" బాధగా అన్నాడు రాజు.

    "అది కాదురా! నీ మీద మేమెన్ని ఆశలు పెట్టుకున్నామో చెబుదామని - శారద్ - సప్న - శశాంకలు అయితే... అన్నయ్య వస్తాడని..." జానకమ్మ చెప్పబోయింది.     "అమ్మా ఆపు - అన్నయ్య అమెరికాలో వున్నారని వాళ్ళు సోమరులుగా తయారయ్యారు - నేను పైకి వచ్చానంటే నా కృషి - పట్టుదల - దేవుడు ఎవరికి మేలు చేస్తాడంటే ఎవరికి శ్రమ పడేతత్వం ఉందో - వారికి - వాళ్ళ బ్రతుకు వాళ్ళను బ్రతకమనండి. ఇలా విసిగిస్తే ఇంక ఇండియాకు రాను" చర చర బైటకు వెళ్ళిపోయాడు రాజు.

    కోకిల కుహూ -కుహూలు వినపడ్డం లేదు.     వసంతం వెళ్ళిపోయింది. రాబోయే గడ్డు కాలం గురించి అందరూ భయపడుతున్నారు.
(సాహిత్యనేత్రం త్రైమాసపత్రిక జులై - సెప్టెంబర్ 2007 సంచికలో ప్రచురితం)

    

    
    
Comments