వాసంత తుషారం - సింగమనేని నారాయణ

    ఆ చిన్న పల్లెటూళ్ళో ఉదయం పది గంటలప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ముందు ఆగిన ఆర్టీసీ బస్సు నుండి ఇద్దరమ్మాయిలు దిగటం అక్కడున్న వాళ్ళందరి దృష్టిని ఆకర్షించింది. ఆ అమ్మాయిలద్దరూ ఇరవై రెండూ, ఇరవై మూడూ సంవత్సరాల ప్రాయంలో ఉన్నారు. ఇద్దరూ పంజాబీ డ్రస్‌లు ధరించారు. లేత ఆకుపచ్చరంగు బట్టల్లో ఒకరూ, ముదురు గోధుమ రంగు బట్టల్లో ఒకరూ, ఎంతో పొందికగా కన్పిస్తున్నారు. వాళ్లలో ఒకమ్మాయి కాస్త చామన ఛాయలో ఉండగా, మరో అమ్మాయి పండిన నిమ్మపండు రంగులో మరింత కాంతివంతంగా ఉంది. దాదాపు ఇద్దరూ ఒకే పొడవుతో మరీ సన్నగానూ, లావుగాను కాకుండా, ఎత్తుకు తగిన శరీర సౌష్టవంతో, చాలా నెమ్మదైన మనుషుల్లా కన్పిస్తున్నారు. వాళ్ళ భుజాల మీదుగా చిన్న చేతి సంచీలు మాత్రం వేలాడుతున్నాయి. ఒక చేతికి రెండు చిన్నగాజులూ, మరో చేతికి చిన్న వాచీ అంతే వారి అలంకారాలు. మెడల్లో సన్నపాటి గొలుసులు కూడా లేవు. వాటిలో కనిపించని ఆకర్షణ, అలంకారం, అందం, వాళ్లముఖాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

    అది చాలా చిన్నపల్లె కాబట్టి ఎవరూ వెంట లేకుండా ఇద్దరమ్మాయిలు, ఆధునికమైన దుస్తుల్లో విద్యావంతుల్లా కనిపిస్తున్న వాళ్లు బస్సులో నుండి దిగటం, అక్కడున్న వాళ్లకు కాస్త ఆశ్చర్యమే మరి! అక్కడున్నవాళ్లు అంటే వందలాదిమందేమీ కాదు. ఆ బస్సు స్టాప్ దగ్గర, ఎలిమెంటరీ స్కూల్ పక్క ఒక వేప చెట్టు కిందున్న రచ్చబండలాంటి అరుగు మీద కూచున్న ఏ ఆరేడు మంది మాత్రమే. వాళ్ళలో ఇద్దరు ముసలి వాళ్ళూ, ఇద్దరు నడి వయసు వాళ్ళూ, ఇద్దరు పడుచు వాళ్ళూ ఉన్నారు. ఆగిన బస్సు ఎక్కటానికి సిద్ధంగా ఉన్న మరో నలుగురు కూడా అక్కడ లేకపోలేదు. ఆ ఎలిమెంటరీ స్కూల్ ముందు నాలుగైదు ఇళ్లు కూడా ఉన్నాయి. ఆ ఇంటి వాకిళ్ల ముందూ, అరుగుల మీదా ఉన్న నలుగురైదుగురు ఆడవాళ్లు కూడా బస్సు దిగిన అమ్మాయిల్ని చూడకపోలేదు. బస్సు దిగిన వాళ్లు బస్సు దగ్గరే ఉండరు కదా! నాలుగడుగులు ముందుకు వేయనే వేశారు. ఎక్కడికి? నేరుగా రచ్చబండ దగ్గరికే! రచ్చబండ మీదున్న ఒక నడి వయసు మనిషి లేచి నిలబడి, చాలా మర్యాదగా "ఎవరింటికి పోవాలమ్మా?" అనడిగాడు. ఎవరింటికో కాకపోతే ఈ పనులకు ఏ పనులకైనా ఎవరు మాత్రం వస్తారు? అందునా ఆడవాళ్ళు? వాలకాలు ఉద్యోగస్తుల వాలకాల్లాకూడా లేవు. కాలేజీ చదువుతున్న అమ్మాయిల్లా ఉన్నారు. ఈ ఊళ్లో ఎవరైనా బంధువులో, కావాల్సిన వాళ్లో ఉండవచ్చు! 

    చామన ఛాయ రంగులో ఉన్న అమ్మాయి "రామక్రిష్ణప్ప ఇంటికి వెళ్ళాలి. ఇల్లు చూపిస్తారా?" అని చాలా ఒద్దికగా అడిగింది.

    "యా రామక్రిష్ణప్ప తల్లీ - కొత్తపల్లి రామక్రిష్ణప్పా? మాదాపురం రామక్రిష్ణప్పా?" అడిగాడు ఆ మనిషి.

    వాళ్ళిద్దరూ వెంటనే ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకున్నారు. ఇలాంటి సందిఘ పరిస్థితి ఎదురౌతుందని వాళ్లు ఊహించినట్టు లేదు. వాళ్లకు మనిషి పేరు తప్ప ఇంటి పేరు తెలియదులా ఉంది. వాళ్లు ఒక నిమిషం గుణించుకుని, కులం పేరు చెప్పి అడిగారు. ఇద్దరూ ఒకే కులం వాళ్లే అన్న సమాధానం రావటంతో, వాళ్లు మరో రెండు నిమిషాలు ఆలోచనలో పడి "వెంకటపతి అనే అబ్బాయి యింటికి" అని తేల్చేశారు. 

    "ఓహో! ఎమ్మే చదువుకొండే వెంకటపతి ఇంటికా? అయితే కొత్తపల్లి రామక్రిష్ణప్ప ఇంటికన్నమాట. సరి - నా వెంట రండమ్మా చూపిస్తాను - ఈటికి దగ్గరే" అంటూ ముందుకు నడిచాడు ఆ నడివయసు మనిషి. ఆయన వెంట వాళ్లిద్దరూ నెమ్మదిగా అడుగులు వేశారు ఊపిరి పీల్చుకుంటూ.

    పది అడుగులు వేసిన తర్వాత ఆ మనిషి "ఇంతకూ మీదే వూరు తల్లీ" అనడిగాడు విషయాలు కనుక్కుందామన్న ఆసక్తితో.

    "మాది అనంతపురం నాయనా" అన్నది నిమ్మపండు రంగు అమ్మాయి.

    "రాక్రిష్ణప్పా వాళ్లు మీకు బంధువులేనా తల్లీ" అడిగాడాయన మళ్లీ.

    "ఇప్పటి వరకూ కాదు" అంది చామనఛాయ రంగు అమ్మాయి.

    ఆమాట అతనికి బోధపడినట్టులేదు - ఆ తర్వాత ఏమడగలో తనకి తోచినట్లు లేదు - మరి కాస్తా నడిచింతర్వాత, "వెంకటపతి కాలేజీలో మీరు కూడా చదువుకుండారా తల్లీ" అనడిగాడు. 

    "ఇంతవరకూ మేము ఆ వెంకటపతిని చూడను కూడా లేదు" అన్నారు వాళ్లు కూడబలుక్కున్నట్టుగా. 

    వాళ్ల వ్యవహారం ఏమీ అర్థం కానట్టుగా ముఖం పెట్టాడాయన. దారిలో ఒకరిద్దరు ఎదురైతే వాళ్లు యింకా ఏదీ అడక్కముందే "మన రామక్రిష్ణప్ప యింటికి తెలిసిన వాళ్ళు వస్తే - ఇల్లు చూపించమంటే" - అంటూ ముందుకు నడిచాడు. 

    అయిదారు నిమిషాల్లో ఒక సందు మలుపు తిరిగి ఆ సందు చివర విశాలమైన ఆవరణలో ఉన్న ఒక పెద్ద ఇంటి ముందు నిలబడి "ఇదేనమ్మా రామక్రిష్ణప్ప ఇల్లు" అని చూపించి వెనక్కు వెళ్లిపోయాడతను. 

    పాతకాలపు ఇల్లే అయినప్పటికీ, చాలా పెద్దగా సౌకర్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది ఆ ఇల్లు - తలవాకిలి ముందు రెండు ఎత్తు అరుగులు - ఆ అరుగుల మధ్య దారి లాంటి నడవ.

    వీళ్లు గడప దగ్గరకు వెళ్లే సరికి, లోపల్నుండే దాదాపు యాభై ఏళ్ళ వయస్సున్న మనిషి ఎదురుగా వచ్చి వీళ్లను కాస్తా పరిశీలనగా చూస్తూ "ఎవరమ్మా మీరు" అనడిగాడు. 

    "ముందు మమ్మల్ని లోపలకు రానివ్వండి" చిరునవ్వుతో పల్కరిస్తూ గడపదాటి లోపలికొచ్చారు వాళ్లిద్దరూ. 

    విశాలంగా ఉంది హాలు - రెండు పొడవాటి బెంచీలు, నాలుగైదు కుర్చీలూ, ఒక చిన్న టేబులూ ఒక పక్కగానూ, మరో పక్క ధాన్యం మూటల దొంతరా, పొందికగా కనిపిస్తున్నాయి ఆ హాల్లో.

    "కూచోండమ్మా" అన్నాడాయన వాళ్లకు కుర్చీలు చూపిస్తూ - వీళ్లెవరో, ఏమిటో, ఇలా తమ ఇంటికి ఎందుకొచ్చారో ఆయనకు అంతు పట్టినట్టు లేదు. 

    "ఈ అమ్మాయి పేరు వసంత. వీళ్ల ఇంటికి మీరు పది రోజుల క్రితం వచ్చినారు - గుర్తుందా. వీళ్ల నాన్నపేరు నరసింహప్ప. నా పేరు తుషార. మేమిద్దరం డిగ్రీ దాకా కలిసి చదువుకున్నాం" అంటూ చేతులు జోడించి నమస్కారం చేసింది చామనఛాయ అమ్మాయి - వసంత కూడా ఆయనకు నమస్కారం చేసింది.

    ఆ మాటలు విన్న తరువాత ఆయన వసంతను నింపాదిగా చూసి గుర్తు పట్టినట్టుగా ముఖం పెట్టి "నరసింహప్ప బిడ్డవామ్మా నువ్వు - గుర్తు పట్టలేక పోయినాను - ఆ పొద్దు మీ యింటికొచ్చినప్పుడు నువ్వు చీర కట్టుకొనింటివి కదా - అందు వల్ల గుర్తు పట్టలే. ఈ వారంలో ఒకసారి మీ నాయనా, అమ్మా ఈటికి వస్తామని చెప్పి వుండిరి. వాళ్ళు రాలేదేమిటమ్మా" అన్నాడతను. 

    పెద్దవాళ్లెవరూ లేకుండా ఈ ఆడపిల్లలు నేరుగా తమ యింటికి రావటం ఆయనకు చాలా ఆశ్చర్యంగానూ, కొంత అసహజంగానూ తోచింది. ఇంతకూ వీళ్లెందుకు వచ్చినట్లో ఆయనకు ఊహకు అందలేదు.

    "మా నాన్నా, అమ్మా  వద్దామనే అనుకున్నారు - మేమే వెళ్ళి ఒకసారి చూసివస్తాం నాన్నా అంటే ఆయన సరేనని మమ్మల్ని పంపించినారు" అంటూ దాపుగా వున్న బెంచీమీద కూచుంది వసంత. తుషార కూడా పక్కనే కూచుని, చేతి సంచీలో ఉన్న పూలనూ, పళ్లనూ తీసి దగ్గరే వున్న టేబుల్ మీద ఉంచింది.

    ఆ మాటలు విన్న తర్వాత కూడా ఆయనకు సంగతేమిటో బోధపడనే లేదు. తాను పది రోజుల క్రితం మరో ముగ్గురు బంధువులతో కలిసి వాళ్ళయింటికి వెళ్ళిన మాట నిజమే. తన కొడుకు వెంకటపతికి సంబంధం చూడటం కోసం ఆ యింటికి వెళ్ళినారంతా. నరసింహప్ప తమ బంధువులకు దూరపు బంధువు. నరసింహప్పకు బి.ఏ.చదివిన అమ్మాయి వుందనీ, ఆయన ఏదో పెద్ద ఉద్యోగం చేసి ఈ మధ్యనే రిటైర్డ్ అయినాడనీ, చాలా నిజాయితీ పరుడూ, యోగ్యుడూ అని తెలిసి, తమ బంధువుల వెంట వెళ్లి, వాళ్లమ్మాయిని చూసి వచ్చాడు తను. అమ్మాయి కూడా అందరికీ బాగా నచ్చింది. తమ యింటికి పది రోజుల్లోగా వస్తామని వాళ్లు అన్నారు. తన కొడుకు వెంకటపతి అమ్మాయిని యింకా చూడనే లేదు. వాళ్లు వచ్చి వెళ్లిన తర్వాత అబ్బాయిని పెళ్లి చూపులకోసం వాళ్ల యింటికి పంపించాలని తన ఆలోచన. ఇప్పుడీ వ్యవహారం చూస్తుంటే అంతా తలకిందులుగా కనిపించింది రామక్రిష్ణప్పకు. 

    ఇంతకూ ఈ ఆడపిల్లలు ఇక్కడికి ఎందుకొచ్చినట్లు? కొంపతీసి తమ అబ్బాయినిగాని చూట్టానికి రాలేదు గదా! ఆ అలోచన తట్టగానే ఇదేదో వాళ్లనే అడిగి తేల్చుకోవాల్సిన వ్యవహారమే అనుకున్నాడతను. 

    "ఇంతకూ మీరు ఏం పని మీద వచ్చినట్లమ్మా" అని కాస్త బెరుకుగానే అడిగాడతను.

    "ఒకటే పని. పెళ్లి చూపుల పనే! మీ అబ్బాయిని చూసి వెళ్దామని వచ్చినాము" అంది తుషార. 

    ఇంత ఖండితంగా, నిస్సంకోచంగా చెప్పేసరికి రామక్రిష్ణప్ప నిలువు గుడ్లేశాడు. ఇదెక్కడి కథరా తండ్రీ! ఆడపిల్ల మొగపిల్ల వాన్ని పెళ్లి చూపులు చూడటమా! ఇలా కూడా జరగవచ్చని తాను ఎప్పుడూ విన్నది కూడా లేదే! ఈ ఆడపిల్లలేమో చూడటానికి చాలా నెమ్మదిగానూ, వినయంగానూ, సౌమ్యంగానూ కనిపిస్తున్నారు. వీళ్ల ధోరణి చూస్తే ప్రపంచాన్ని తలకిందులు చేసేట్టుగా ఉందే!

    వసంతా, తుషారా ఆయన ముఖంకేసే చూస్తున్నారు. తమ మాటా, ప్రవర్తనా ఆయన్నేమీ యిబ్బంది పెట్టలేదుగదా అని. నాలుగైదు నిమిషాల తీవ్ర నిశ్శబ్దం తర్వాత రామక్రిష్ణప్ప ఈ లోకంలోకి వచ్చి, వచ్చినవాళ్లెవరైనా మర్యాద చెయ్యక తప్పదుకదా అనుకున్నాడేమో, ఇంట్లోకి తొంగి చూస్తూ 'ఎమేవ్ - ఇట్లారా' అంటూ గట్టిగా కేకేశాడు. 

    ఆ అరుపుకు లోపల్నుంచీ ఆయన భార్య వెంకటలక్ష్మమ్మ "వస్తావుండా" అన్న జవాబుతో పాటు, క్షణంలో గడపదాటి వచ్చి రామక్రిష్ణప్ప పక్కన నిలబడింది, బెంచీమీద కూర్చున్న వీళ్లని చూస్తూ. ఆమెకు 45సం.ల వయసు వుండవచ్చు. ఎర్రటి, గుండ్రటి ముఖం - ఎర్రటి బొట్టు - వెంకటగిరి చీరలో హుందాగా నాజూకుగా కన్పిస్తున్న ఆమెను చూడగానే గౌరవభావం మెరిసి లేచి నమస్కారాలు చేశారు వసంతా, తుషారా.

    రామక్రిష్ణప్ప వీళ్లను భార్యకు పరిచయం చేస్తూ "అనంతపురం నరసింహప్ప ఇంటికి మేము పెత్తనానికి వెళ్లింటిమి కదా! ఆయన బిడ్డ ఈయమ్మ - ఈయమ్మతో పాటు చదువుకుందట ఈ పిల్ల" అని ఒక క్షణం ఆగి "మనవాడు వెంకటపతిని చూడటానికి పెళ్లి చూపులకి వచ్చినారంట వీళ్లు" అన్నాడు కొంత వ్యంగ్యమూ, అసహనమూ ధ్వనిస్తున్న గొంతుతో.

    ఆ మాట విని వాళ్లిద్దరివేపూ ఎగాదిగా చూసి ఉన్నపళంగా, రెండు నిమిషాల సేపు ఆపకుండా గలగలా నవ్వింది వెంకటలక్ష్మమ్మ. ఆమె నవ్వుకు బిత్తరపోయి చూశారందరూ. ఆమె నవ్వులో ఒక శ్రుతీ, ఒక లయా, ఒక సౌందర్యమూ కనిపించి ముగ్ధులైపోయారు వసంతా, తుషార.

    వెంటనే వాళ్లిద్దర్నీ దగ్గరకు తీసుకొని, సుతారంగా కౌగిలించుకొని "మావాణ్ణి చూడటానికి వచ్చినారేమమ్మ మీరు - అదృష్టవంతుడమ్మా మావాడు - రండమ్మా రండి - కాళ్లూ ముఖం కడుక్కుందురుగాని" అంటూ లోపలికి తీసుకు పోతుంటే నిర్విణ్ణుడై చూస్తుండిపోయాడు రామక్రిష్ణప్ప.

    ముఖాలు కడుక్కున్న తర్వాత, దువ్వెన తీసుకొని వాళ్లిద్దరి తలలూ తనే దువ్వింది వెంకటలస్ఖ్మమ్మ - జడల్లో మల్లెపూలు తురిమింది. "చాలా మంచిపని చేసినావు తల్లీ! నా మనసులో ఎప్పుడూ అనుకునేదాన్ని - బోడి ఎప్పుడూ మగపిల్లలేనా ఆడపిల్లల్ని పెళ్లిచూపులు చూసేది - ఏం? ఆడపిల్లలే వెళ్లి ఎందుకు చూడకూడదు? నేను మా అమ్మాయి వెళ్లి మగపిల్లాడిని చూసొస్తాం అంటే అందరూ ఎగిరి గంతులేసినారు తల్లీ కోపంతో. ఇన్నాళ్లకు నా కోరిక తీరినట్లు నువ్వు వచ్చినావు. మావాడు తోట దగ్గరకు వెళ్లినాడు - పిలిపిస్తాను" అంది వెంకటలక్ష్మమ్మ.

    వసంతా, తుషారా ఒకటే విస్తుపోతున్నారు. ఆడవాళ్ళ మనసుల్లో అంతర్గతంగా ఒకేలా ఆలోచిస్తారేమో అనిపించింది వాళ్లకు. ఒక అపురూపమైన మనిషిలా కనిపించిందామె వాళ్లకు.

    అరగంట తర్వాత తోట నుండి వచ్చాడు వెంకటపతి ఇంటికి. చెదిరిన జుట్టూ, నలిగిన బట్టలూ, వాడిన ముఖంతో ఉన్నాడతను.

    "నాయనా వెంకటపతీ! ఈ అమ్మాయి నిన్ను చూట్టానికి పెళ్లిచూపులకొచ్చిందిరా" అంటూ వసంతతో "వీడేనమ్మా - మావాడు. మావాడికి చదువెంత ఇష్టమో, సేద్యమూ అంతే ఇష్టం" అంది మెచ్చుకోలును కళ్లలో మెరిపిస్తూ వెంకటలక్ష్మమ్మ.

    వెంకటపతి వాళ్లకు నమస్కారం చేసి, "ప్రయాణపు ఇబ్బందులేవీ పడలేదు గదా" అని విచారించాడు, చాలా ఆప్యాయంగా. ఎమ్మెస్సీ చదివినా బొత్తిగా కాలేజీ కుర్రాడి లక్షణాలు కన్పించలేదు అతనిలో - చాలా సాదా బట్టల్లో, వాళ్ళమ్మ నోట్లోంచి ఊడిపడ్డ బొమ్మలా ఉన్నాడతను.

    భోజనాలు చేసి హాల్లో కూచున్నారందరూ. వీళ్ల యింటికి అమ్మాయిలు వచ్చిన సంగతి తెలిసి ఇరుగూ పొరుగూ ఆడవాళ్లు కూడా వచ్చి హాల్లో చాపల మీద కూచుని ఉత్సుకతతో చూస్తున్నారందరూ.

    వసంతా, తుషారా, వెంకటలక్ష్మమ్మ ప్రక్కనే కూచునున్నారు. రామక్రిష్ణప్ప బెంచీ మీద కూచుని తాంబూలం నములుతున్నాడు. అతని మనసు కూడా పరిస్థితికి కొంత అలవాటుపడినట్టుగానే ఉంది. ఏదో ముచ్చట కోసం ఆ పిల్లలు వచ్చినట్టుగా ఆయన సమాధాన పడినాడు. 

    "ఏమమ్మా వసంతా - మావాడిని ఏమైనా అడుగు తల్లీ - ఇంత దూరం వచ్చినావు సిగ్గెందుకు" అంది వెంకటలక్ష్మమ్మ.

    వసంత, తుషారలకు వాతావరణమంతా ప్రఫుల్లంగా కనిపిస్తోంది. మామూలు కుర్రకారుకు భిన్నంగా, వెంకటపతి సంస్కారవంతంగా కనిపించాడు వాళ్లకు. తమిలా రావడం విపరీతంగా తోస్తుందేమో, ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని తొలుత అనుకున్నారు కాని..., ఇంటి మనుషుల సౌజన్యం వాళ్లను ఆర్ద్రం చేసింది. పట్టణాలకంటే పల్లెలే మార్పును తొందరగా ఇముడ్చుకుంటాయి అనిపించింది వాళ్లకు. 

    "ఎమ్మెస్సీ చేశారు కద. ఏం చేద్దమనుకుంటున్నారు" మాట వరుసకు అడిగింది వసంత వెంకటపతిని.

    "బి.యిడి. కూడా చేశాను. మొన్ననే టీచర్స్ ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చాను. మాథ్స్ అసిస్టెంట్‌గా సెలక్షన్ వచ్చింది. ఈవారంలోగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ వస్తాయి" అన్నాడు వెంకటపతి. 

    "సాహిత్యం అంటే మీకు అభిరుచి వుందా. మా వసంత తెగ చదువుతుంది పుస్తకాలను" అడిగింది తుషార.

    "పాత సాహిత్యంతో పెద్ద పరిచయం లేదు గాని, గురజాడ, శ్రీశ్రీ, చలం, కొడవటిగంటి, రావిశాస్త్రి, మధురాంతకం, వీళ్ల రచనలంటే నాకు చాలా ఇష్టం" అన్నాడు వెంకటపతి.

    వసంతా, తుషారా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, మెరిసే కళ్లతో. "అరే - అచ్చు మా వసంతలాగే మాట్లాడుతున్నారే. మా వసంత అల్మారా నిండా ఆ పుస్తకాలే" అంది మెచ్చుకోలుగా తుషార.

    "మేమిలా వచ్చి పెళ్లి చూపుల వ్యవహారం నడపటం గురించి మీరేమనుకుంటున్నారు?" అడిగింది వసంత చిరునవ్వుతో.

    "కొత్త అయినప్పటికీ అసహజమైందేమీ కాదు. నేను చదువుకున్న సాహిత్యం వల్ల, ఇది అసాధారణంగా ఎమీ అనిపించలేదు నాకు. మీ ఇంటికి పెళ్లిచూపులకొచ్చే భారం నాకు తప్పించారు" అన్నాడు వాళ్లమ్మలాగే గలగలా నవ్వుతూ.

    హాల్లో కూచున్న అందరూ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు వీళ్ల మాటల తీరును.

    సాయంత్రం కావస్తుండగా, వసంతా, తుషారా ఊరికెళ్లటానికి బయల్దేరితే "రాత్రి ఇక్కడే ఉండండమ్మా - రేపు పొద్దున్నే మావాడు మిమ్మల్ని దిగబతాడుగాని" అంది వెంకటలక్ష్మమ్మ.

    "ఆమాత్రం ప్రయాణాలు మేము చెయ్యలేమేమ్మా. ఇప్పుడే వెళ్తాం" అంది తుషార.

    "ఏ సంగతీ చెప్పి వెళ్లండమ్మా. మావాడు నచ్చినట్టేనా" అని వసంత చెక్కిలిని మీటింది వెంకటలక్ష్మమ్మ.

    "అప్పుడేనా? అదంతా సస్పెన్స్. మేము ఊరికెళ్లింతర్వాత చర్చించుకొని మీకు ఉత్తరం రాస్తాం" అంది పరిహాసంగా తుషార. 

    అందరూ ఫక్కుమని నవ్వితే, వెంకటపతి మాత్రం ముసిముసినవ్వులు ముగ్ధంగా ఒలకపోశాడు. 

(సాహిత్య నేత్రం మార్చి 1997 సంచికలో ప్రచురితం)   
Comments