వసుహోమ - లల్లాదేవి

    శ్రీ పర్వత పాద ప్రాంతాన పవిత్ర పీఠభూమి అది.

    జల జల పారే సెలయేళ్లు. ఆకాశంలో పల్లటీలు కొట్టే వల్లంకి పిట్టలు! పురోగమనానికి సంకేతాలయిన సెలయేళ్ళలో ఆకృతి దాల్చినట్లుంది. 

    గుండ్రాళ్లపై గలగలపారుతోంది నాగులేరు. 

    స్వేచ్ఛకు మరో రూపయై విహాయస వీధుల్లో పల్లటీలు కొట్టే వల్లంకి పిట్టలతో శ్రీ పర్వత పాద భూమి జీవచైతన్యమయింది. ఆ ప్రాంతమంతా ద్రావిడ గణాలయిన నాగజాతికి ఆవాసాలు.

    ఒక నాగజాతి యువతి నాగులేట జలకమాడుతోంది. వరదలో చిక్కిన కృష్ణ సర్పంలా విహరిస్తోందామె. నల్లని నేరేడు పండు మిసిమిఛాయలు మిలమిలలాడుతున్న శరీరకాంతి ఆమెది. 

    సుందర తరమయిన విశాల నయనాంచలాలు! ఎత్తయిన చెక్కిళ్ళు! ఒత్తయిన తల వెంట్రుకలు! శారీరకమయిన శక్తి సంపన్నతకు సంకేతంలా ఎగువ మూపురం!!

    భుజాలు దృఢతరంగా ఉన్నాయి. ఎత్తయిన వక్షోభాగం ఉన్నతోన్నతమయిన శ్రీ పర్వత గిరి శిఖరాల్లా కనిపిస్తున్నాయి. తొడ కండరాలు ఉక్కు ముక్కల్లా కనిపిస్తున్నాయి. పిక్కలు పెఠిల్లున ఆకాశం నించి రాలిపడిన పిడుగుల్లా ఉన్నాయి. మొరటయిన పాదాలు.

    యథేచ్ఛగా కావలసినంతసేపు ఈదులాడి ఒడ్డుకువచ్చి రవికాంతిలో కురులార్చుకొని, నారచీరలు కట్టుకుందామె. ధృఢమయిన శరీరమే సర్వసంపదల వలెఉన్న ఆమెకు బండ పూసలు కాక మిగిలిన అలంకారాలు సుగుణాలు మాత్రమే! 

    సుగుణాలే అలంకారాలుగా కలిగిన ఆమె నాగజాతి గణనాయకుడయిన ముచివింద నాగుడి కూతురు. ఏకైక సంతానం కావటం వల్ల యథేచ్ఛగా పెరిగిందామె. ప్రకృతిలో ఒక భాగంగా కన్పించే స్త్రీమూర్తి.

    ఆమె పేరు హోమ!

    తపనుడి కిరణాలతో శరీరాన్ని తడి ఆర్చుకొని నారచీరలు ధరించాక దూరం నించి ఒక స్నేహితురాలు పరుగెత్తుకు రావటం చూచిందామె. దగ్గరగా వచ్చాక అడిగింది నవ్వుతూ! "పిచ్ఛలీ ఎందుకే పరుగు?" పిచ్ఛలి నవ్వుతూ నిలిచిఉన్న వసుహోమను చిరుకోపంతో చూచింది.

    "ఈ వార్తలన్ని విన్న తరువాత నీకింకా నవ్వు ఎలా వస్తోంది?" అని అడిగింది. 

    "వార్త ఏమిటే? నీకు నచ్చే నాగ యువకుడెవరయినా తారసపడినాడా?" అని నవ్వుతూనే కోడిగం చేసింది వసుహోమ.

    "అవేమీ కాదుకాని నేనుచెప్పేది జాగ్రత్తగా విను. జాతవేదుడనే ఆర్యరాజొకడు ఉత్తరాపథంనించి దక్షిణాపథం మీదికి ఎత్తివచ్చి నాడంట. గౌతమిని తరించాడు. కృష్ణజలాల్లో రక్తపంకిలమయిన ఖడ్గాలను పరిశుభ్రం చేసుకున్నాడు. అతడింకా దక్షిణాదికి వస్తున్నాడని వార్తలు తెచ్చారు మనవారు. అంటే మనకు ఆర్యరాజుల దాడి ఆరంభయిందనికదా అర్థం" అంటూ వగర్చుతూ చెప్పింది పిచ్ఛలి.

    ఆ మాటలు వింటూనే వసుహోమ విశాల సుందరనయనాలు మరింత విశాలం అయినాయి. కింసుక పుష్పాలవలె అరుణారుణం అయినాయి. ముఖం పూచిన తంగేడు వనంలా అయింది.

    "ఏమేమీ! ఆర్యుడా! ఉత్తరాపథం నించి ఉరికి వచ్చినాడా! ఆర్య రాజుల ఆగడాలు అంతకంతకు అధికమవుతున్నాయి. ఈసారి ఆ రాజుకు బుద్ధి చెప్పవలసిందే. చూడవలసిన పనులు చాలా ఉన్నాయి పద పద!" అంటూ తొందరించింది వసుహోమ.

    పరుగుపరుగున వారు గణ ఆవాసానికి చేరుకున్నారు. అప్పటికే నాగులు గగ్గోలు పడిపోతున్నారు. పంటలు పండించుకుంటూ, వేటాడి క్షుత్తును చల్లార్చుకుంటూ ప్రశాంత జీవనం సాధించే నాగులకు ఈ దురవస్థ ఏమి అని ఎవరికి వారే దురపిల్లుతున్నారు.

    వారందరినీ క్షణాలపై ఒక చోటకి సమీకరించింది వసుహోమ. 

    "నాగజాతీయ సోదరులారా! యువతులారా! ఎందుకలా బెంబేలు పడి పోయినారు? ఒక్క ఆర్యరాజేమి మొత్తం ఆర్యలోకమే ఎత్తివచ్చినా త్రిప్పికొట్టగల చేవ ఈ నాగజాతికున్నది.

    మీ శక్తి సంపన్నత మీకు తెలియదు. ప్రతియువకుడు ఒక రుద్రమూర్తి. నాగ రక్తం పంచుకు పుట్టిన ప్రతి యువతీ ఒక భవాని! మీరంతా నాగ జాతీయులు. తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చిన నాగజాతి స్వాతంత్ర పరిరక్షణ కోసం ఆయుధం చేపట్టండి.

    వన్య మృగాలను వధించినట్లుగానే ఆర్య సైన్యాలపై విరుచుకుపడండి. నాగులు బుసకొడితే ఆర్యరాజుల ఊపిరులు ఆగిపోతాయి. ఈ దక్షిణాపథాన్ని పాతాళ లోకమనీ, కళింగనించి కడదాకా ఉన్న నాగులు బురదపాములనీ గ్రంథాలలో అభివర్ణించుకొన్న ఆర్యుల ఆటకట్టించే సుముహూర్తం ఆసన్నమయింది. సర్రున కత్తి దూసి రణక్షేత్రానికి సన్నద్ధులు కండి" అని ఉచ్ఛస్వరంతో పిలుపు యిచ్చింది వసుహోమ.

    అది విన్న నాగులు విడిగా పడగవిప్పినాయి. కసితో ఖస్సుమని బుసకొట్టినాయి. తోకమీదలేచి విలయనాట్యం ప్రారంభించినాయి. 

    "ఔరౌరా! ఆర్యుడా! ఎంత తెగింపు నీకు! నాగుల పడగలపై పాదం మోపాలని ఉబలాట పడుతున్నావా? మృత్యువు కౌగిలిలో నీకు చిర విశ్రాంతి ప్రసాదించనిదే నాగులు నిద్రపోవు. కసిపట్టిన నాగుల కోరలకు నీ భవితవ్యం బలికాక తప్పదు" అంటూ ఆయుధాలు ధరించి బయలుదేరారు నాగజాతి యువతీయువకులు. "ఆర్యుడా! నీ వుసురు విశ్వాంతరాళంలో విలీనం చేస్తాను. ఈ ఖడ్గంతో నీ తల నరికి నాగులేరులో దొర్లిస్తాను. అందాకా స్నానము, ఆహారము, నిద్రా వర్జిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ తీర్చలేకపోతే నేను ముచివింద నాగుని రక్తం పంచుకుపుట్టిన ముద్దుబిడ్డను కాదు" అంటూ వీరాలాపం చేసింది వసుహోమ.

    ఆమె మాటలు విని ఆనందాతిరేకంలో హర్షధ్వానాలు చేసారు నాగ యువతీయువకులు. అనుకున్న సమయానికి వారిపై విరుచుకుపడ్డాడు ఆర్యరాజైన జాతవేదుడు. 

    నాగరక్తంతో నాగభూములు తడిసిముద్ద అయినాయి. నాగులేరు నాగరక్తంతో ఎర్రఎర్రగా ప్రవహించసాగింది.  దయారహితంగా హింసామూర్తి అయినాడు జాతవేదుడు. నాగజాతిని సమూలంగా దహించివేయుట ప్రారంభించాడు. వార్తలు వింటున్న వసుహోమ ఆంతర్యం అగ్నిలా రగిలింది. వొరిగిపోతున్న వొక్కొక్క గణపతిని తలుచుకొని ఖేద పడిందామె. నాగజాతీయులు నేలకొరిగిన కొలది విజృంభించినాడు జాతవీరుడు. అంతకు పూర్వమే అప్పుడప్పుడు దక్షిణాపథం మీద ఆర్యుల దండయాత్ర జరిగినాయి. దక్షిణాపథంలో శాంతికాముకులయిన ప్రజలు శ్రమతో వ్యయంతో వ్యయప్రయాసలకోర్చి నేర్చిన వ్యవసాయంతో సుసంపన్నంగా ఉండినారన్న వార్త అతనికి తెలిసింది.

    అందువల్ల అతడు మానవరక్తం రుచి మరిగిన పులిలా, ఆకలిగొన్న సింహంలా అయినాడు. నాగభూములు రుద్రభూములుగా మారుతున్నవి. నాగజాతీయులు వేటలో, వ్యవసాయంలో నిపుణులు.  యుద్ధవిద్యలో శాంతికాముకులకు ప్రత్యేకమయిన నైపుణ్యం ఉండదు. 

    ఆర్యులు యుద్ధ విద్యావిశారదులు. ఆలమందలు మేపుకుంటూ అందందు ఆవాసాలు ఏర్పరచుకొంటూ ఉండిన వారికీ యుద్ధ కళ అనివార్యంగా నేర్వవలసిన విద్య అయింది. 

    అందువల్ల వారు ఆరితేరినవారైనారు. ఆర్య రాజు జాతవేదుడు నాగజాతీయులను నలినలి చేస్తున్నాడు. నాగజాతికి నీరసమయిన ఆలోచనలు ఆవహించినాయి. తానింకా జాప్యం చేస్తే పరాజాయమే కాదు పలాయనంకూడా తప్పనిసరి అయే దుర్దశ ఎదురయింది.

    వొకవేళ అటువంటి స్థితి సంభవమయితే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు ముప్పువాటిల్లటమే కాక తాను చేసిన శపథం మట్టిలో కలుస్తుంది. నాగజాతీయుల చరిత్రపుటలు పిరికి మందు తిన్నవారన్న అపప్రథతో మలినమవుతాయి. 

    అలా కావటానికి తానే కారకురాలవుతుంది. నాగులేటితీరంలో నాగుల గణులకు నాయకుడయిన ముచివిందుని తనూభవ అయివుండి ఇటువంటి అవమానానికి తాను గురికావటం ఎంత బాధాకరం!

    రణక్షేత్రంలో ఆర్యుల తలల్ని కందుకాల్లా దొర్లించాలని ఆలోచించి వొక నిర్ణయాకికొచ్చేసింది వసుహోమ.

    జాతవేదుని పొలకువ తెలుసుకునేందుకు పొలికలను అంతా కలయ చూచిందామె. యుద్ధతంత్రజ్ఞుడయిన జాతవేదుడు రథంపై అధిరోహించి వచ్చినాడు. నలుగురు చక్రరక్షకులున్నారు. అశ్వరక్షకులున్నారు. 

    కొందరు కేతనానికి కైవారం చేస్తున్నారు. 

    వీరుకాక అతని రథాన్ని పరివేష్టించి మరికొందరు సైనికులున్నారు. కోట చుట్టూ ఉండే ప్రాకారాలు, ఆ వెలుపల  అగడ్తలు, కోటను రక్షించే పద్ధతిలో సైనికులు అతని రథాన్ని కంటికిరెప్పలా కాచుకుంటున్నారు. 

    అతడి రక్షణ వలయంలో తానుండి పాదచారులతో యుద్ధరంగానికి వచ్చిన నాగ ప్రజలపై తీక్షణమయిన తూణీరాలను వర్షిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూచి వికల మనస్క అయిందామె. ఒక్కొక్క క్షణమూ గడిచిపోతూ ఉంటే ఒక్కొక్క నాగసోదరుని శిరస్సు తెగి కందుకంలా నేల మీదికి దొర్లి పడుతోంది. సోదర రక్తాన్ని చూచి విచలిత అయిన వసుహోమ నేత్రాలు విశాలమయినాయి. కనులు ఎర్రగా జీరలు వారినాయి. 

    పగపట్టిన కోడెత్రాచులా చుర్రున చూచిందామె. 

    హయహేషలు విన్పిస్తూ తన అశ్వం ముందుకు దూకింది. 

    అందరూ చూస్తూ ఉండగానే శరవేగంతో దూసుకు వచ్చింది. ప్రాకారాలవలె నిలిచిన సైనికుల రక్షణవలయాలను బద్దలు కొట్టుకుని రథాన్ని సమీపించింది. 

    అనుకోని ఈ సంఘటనకు సర్వులూ నిశ్చేష్టులయినారు. మెరుపు మెరిసిందో లేదో వెనువెంట పిడుగు దూసుకు వచ్చినట్లు రాజుని సమీపించింది వసుహోమ. చక్ర రక్షకులు చకచ్చకితులయినారు. కేతనానికి కైవారం చేస్తున్నవారు కలతపడినారు. అశ్వరక్షకులు అప్రతిభులయినారు.

    అందరూ ఆశ్చర్యం నించి తేరుకునేలోగానే గురికి లంఘించు సింహంలా రాజు మీదకి లంఘించిందామె. అశ్వంపైనించి లేచిన పాదాలు రథం మీద మోపింది. రాజు రణ శంఖాన్ని పూరించనే లేదు. మార్బాణాలను సంధించనే లేదు. ఒర నుండి సర్రున ఖడ్గాన్ని దూయనే లేదు. అతని తల నేలమిదకి దొర్లి పడిపోయింది. రక్తధారలు విరచిమ్మినాయి. తనువు ఒంగి పోయింది. 

    ఆర్య రాజు బ్రతుకుతో పాటు అతని దురాశకూడ అంతటితో అంతమయిపోయింది. 

    సైనికలోకంలో హాహాకారాలు చెలరేగినాయి. ప్రత్యర్థి అయిన ఒక నాగవనిత చేసిన ఈ సాహసం ఆర్యులను ఆశ్చర్యంతో తలమునక వేయించింది.

    వారు తేరుకుని ధనుర్బాణాలు సంధించారు.

    అప్పటికే వసుహోమ నేలమీదికి ఉరికింది. ఆర్యరాజు తలను వామ హస్తంలో యిరికించుకుని నాగులేరు వైపుగా దౌడు తీయటం ప్రారంభించింది. 

    ఆర్యులు ఆమెను గుర్తించి కసికసిగా కత్తులు విసిరారు. చువ్వీటెలను సువ్వు సువ్వున ఆమె శరీరం నిండా గ్రుచ్చారు. ములుకు బాణాలతో శరీరాన్ని చిల్లులు పొడిచినారు.

    అయినా ఆమె ఆత్మ చైతన్యంతో పరుగు తీసింది. సంకల్ప శక్తులను సమీకరించుకుని సలిల ధారల్లో కాలు మోపింది. నాగులేరు నిండుగా నవ్వింది. గుండాళ్లను దొర్లిస్తూ గల గల జాలు వారింది. తన ముద్దుబిడ్డ అయిన వసుహోమను సాదరంగా ఆహ్వానించి తనలో కలుపుకుంది.

    అతని రక్తంలో తడిపిన ఖడ్గాన్ని నాగులేరులో ముంచి, ఆర్యరాజు శిరస్సును సెలయేటికి సమర్పించుకుందామె.

    వెనువెంటనే నాగయువతి శరీరం చైతన్య రహితమై సలిల ధారలోకి ఒరిగిపోయింది. స్వజాతి జనుల శ్రేయః కామనతో లక్ష్యాన్ని సాధించి తనువు చాలించిన వసుహోమను కౌగలించుకుని తనలో యిముడ్చుకుంది నాగులేరు.

    నాయకుడు కానరాకపోవటం నించి అంతటితో ఆర్యసేనలు తెల్లముఖాలతో తిరుగు ముఖం పట్టినాయి. 

(జ్యోతి మాసపత్రిక ఏప్రిల్ 1984 సంచికలో ప్రచురితం)
Comments