వట్టి మనిషి - సుంకోజి దేవేంద్రాచారి

1
 
    తను ఆడమనిషి.

* * *

    తన ప్రమేయం లేకుండానే మనిషి పుట్టుకతో ఎలా అయితే కులం, మతానికి ప్రాతింథ్యం వహిస్తున్నారో అలానే లింగభేదం లేకుండా కొన్ని పనులకు పరిమితం చేస్తోంది. అలా సమాజం సన్నద్ధం చేస్తోంది.

* * *

    "మై నేమ్ ఈజ్ ఒజమాండియస్. ఐయామ్‌ది కింగ్ ఆఫ్ కింగ్స్..."

    "మేయ్... సుశీలా... ఎన్నిసార్లు పిల్చాలమే నిన్ను... ఇంటి ముందర కసువూడ్చుపో" అరిచింది నారాయణమ్మ్.

    అప్పటికి ఆమె అరవడం నాలుగోసారి. అయినా సుశీల ఆ పని చేయలేదు. తను చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తి ఒకసారి వీధిలోకి చూసింది. అన్న పడుకుని నిద్రపోతున్నాడు.

    'అమ్మ చిన్నప్పట్నించీ అంతే... అన్నకయితే ఏ పనీ చెప్పదు. నాకే అన్ని పనులూ చెప్తాది' అనుకుంది మనసులో. రేపు బడిలో అప్పజెప్పాల్సిన ఇంగ్లీషు పొయెంను నేర్చుకోవడం కోసం తిరిగి గట్టిగా చదవడం మొదలు పెట్టింది.

    "మై నేమ్ ఈజ్ ఒజమాండియస్. ఐయామ్‌ది కింగ్ ఆఫ్ కింగ్స్..."

    అని చదువుతుండగానే నారాయణమ్మ కోపంగా వచ్చి కూతురి చేతిలోని పుస్తకం లాగి దూరంగా విసిరేసింది.

    "మీ నాయన నిద్ర లేసేలకు ఇంటి ముందు కసువాడ్చి కళ్లాపి చల్లమని రోజూ చెప్పాలా?" అంది నారాయణమ్మ.

    "ఈ రోజు స్కూల్లో ఈ పొయెం అప్పజెప్పాలమ్మా..." అంది మెల్లగా సుశీల.

    "ఆడబిడ్డకు ముందు ఇంట్లో పని అయినాంకనే, చదువు... చదువుకుంటాను. ఇంట్లో పని చేయనంటే ఎట్లా?" అంది పొయ్యి దగ్గర వెళ్తూ నారాయణమ్మ.

    "మనిషికోమాట గొడ్డుకో దెబ్బ అంటారు. రెడ్డొచ్చె మొదులెత్తు అన్నెట్టు నీకు దినమ్మూ చెప్పలేను. ఇంట్లో మొగోళ్లు బయటికి పోయేలకు ఇంటి ముందర కసువూడిస్తే మనకే మంచిది. పోపో"

    ఒకసారి పెద్దగా నిట్టూర్చి, చీపురు తీసుకుని, తను అంతవరకూ నేర్చుకున్న 'ఒజమాండియస్' పొయెంను వల్లెవేసుకుంటూ చెత్త ఊడ్చడం మొదలు పెట్టింది సుశీల.

    సుశీలకు పధ్నాలుగేళ్లు దాటాయి. బక్కపలచగా, తెల్లగా ఉంటుంది. లంగా వోణీలో ఉంది. పొడవాటి జుట్టు. రాత్రి నిద్రతో చెదిరిన ముంగురులు, చెత్త ఊడుస్తుంటే ఆ అమ్మాయి కళ్లకు అడ్డం పడుతున్నాయి.
 
    తూర్పు ఆకాశం అరుణ వర్ణం పులుముకుంటోంది. సంజె వెలుగు నేలంతా పరుచుకుంటోంది. రెండువేల గడప ఉన్న ఊరది. దాదాపు అందరి ఇళ్లలో పాత్రల చప్పుడు వినిపిస్తోంది. అప్పటికే కొందరు ఇళ్లముందు కసువూడ్చి, కళ్లాపి చల్లి ముగ్గులేసేసారు. డిసెంబర్ నెల కావడంతో బాగా చలిగా ఉంది.
 
    "ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఈ బిడ్డకు. రేపు కట్టుకున్నోడు ఎట్లేగుతాడో ఏమో... ఏ పని చేసాంటే అదే బల్ల. గబగబా చేద్దామనే లోకమే ఉండదు... మేయ్ సుశీలా...తొందరగా కానిచ్చి రా... బోరింగ్‌కాడికి పోయి నీళ్లు తేవాల" గట్టిగా అరిచింది నారాయణమ్మ.
 
    ఇంటి ముందు పనయిపోగానే వంటగదిలోకి పోయి బిందె తీసుకుంది సుశీల. బోరింగ్ దగ్గరకు పోతూ పోతూ హాలులో పడుకోనున్న అన్నను చూసింది. అతనౌ ముసుగేసుకుని పడుకుని గుర్రు పెడుతున్నాడు. అతనికి చదువుకోవడం తప్ప వేరే ఏ పనీ చెప్పదు నారాయణమ్మ. ఏమంటే మగబిడ్డ కదా అంటుంది. వంట పని చేపించకపోతే పోనీలే, కనీసం బోరింగు దగ్గరనుంచు నీళ్లయినా తెమ్మని చెప్పచ్చు కదా అనుకుంటుంది సుశీల. ఓకసారి ఆ మాట అమ్మతో అననే అంది. దానికామె "మగబిడ్డ ఆడంగి పనులు ఎందుకు చేస్తాడే" అంది ఆశ్చర్యంగా. ఎంత తప్పుడు మాట చెప్పినావు అనే ధోరణిలో కూతురు వైపు చూసింది. ఇక అప్పటి నుంచి అలా ప్రశ్నించడం మానుకుంది సుశీల.
 
    వయసు పెరిగే కొద్దీ ఇంట్లో వంట చేయడం, బట్టలుతకడం, అంట్లు తోమడం, కసువూడ్చడం నాన్న ఏరోజూ చేయకపోవడం తను గమనించింది. అమ్మకు తీవ్రంగా జ్వరంగా ఉన్నా సరే... ఆ పనులన్నీ ఆమే చేసుకోవాల్సిందే. తన అన్న సుధాకర్ కూడా తనకేమీ పట్టనట్టు ఉండేవాడు. అమ్మ అవస్థ చూడలేక ఆమె పనుల్లో స్వచ్ఛందంగానే సాయం చేయడం మొదలు పెట్టింది సుశీల. అయితే అది వయసు పెరిగే కొద్దీ ఆ ధోరణిలో మార్పు మొదలయింది. దానికి చాలామంది పెద్దల దగ్గరనుంచి ముఖ్యంగా ఆడవాళ్ల దగ్గరనుంచి వచ్చిన సమాధానం 'వాళ్లు మొగోళ్లు కదామ్మా... ఈ పనులెందుకు చేస్తారు' అని.
 
    'మొగోళ్ల కోసరం కొన్ని పనులు, ఆడోళ్ల కోసరం కొన్ని పనులూ ముందుగానే నిర్ణయించేసి ఉంటారా? ఇద్దరూ సమానం కాదా? కుటుంబమన్నాక అన్ని పనుల్లో ఇద్దరూ పాలుపంచుకోరా' అనే ప్రశ్నలు సుశీలలో వచ్చాయి. అయితే వాటికెవరూ సమాధానం చెప్పలేదు సరికదా 'ఆడబిడ్డ అతిగా మాట్లాడకూడదు' అన్నారు.
 
    'అయితే మొగబిడ్డ మాట్లాడచ్చా' అనే ప్రశ్న నోటిదాకా వచ్చినా మౌనంగా ఉండిపోయింది సుశీల. చాలా చిన్నచిన్న విషయాలు... అంటే కూరలో ఉప్పు ఎక్కువయిందనో, తెల్ల చొక్కాకి నీలిమందు సరిగా అంటలేదనో అమ్మపైన నాన్న పెద్దపెద్దగా కేకలు వేయడం వింది. అయితే అమ్మ ఎప్పుడూ నాన్న మీదేం ఖర్మ, కనీసం నాన్న ఎదురుగా కూడా గట్టిగా మాట్లాడ్డం తను చూడలేదు.
 
    ఇవంతా ఆలోచించుకుంటూ బోరింగ్ దగ్గరకు పోయింది సుశీల. అప్పటికే అక్కడ సుమారు ఆరేడుమంది ఆడవాళ్లు బిందెలు వరుసలో పెట్టి నిల్చుని ఉన్నారు. 
 
2
 
    తను ఇంటి మనిషి
 
* * *
 
    ఇంట్లో ఉండేవాళ్లందరూ ఇంటి మనుషులు కారు. కేవలం స్త్రీ... అమ్మ, భార్య, కూతురు... వరస ఏదయైనా కావచ్చు... ఇంటిని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత స్త్రీదే(నా?)!
 
* * *
 
    "ఏమైంది సుశీలా... కుడికంటి కింద నల్లగా కమిలిండాది?"
 
    రాత్రి నాగాచారి తాగేసి వచ్చాడు. 'వయసుకొచ్చిన ఇద్దరు కూతుళ్లున్నారు. ఇంకా ఎందుకిలా తాగడం, ఏమన్నా మిగిలిచ్చి వోళ్లకు పెండ్లిండ్లు చేయాలా వద్దా' అని భర్తను నిలదీసింది సుశీల. 'నన్నే ఎదిరించి మాట్లాడతావా? నోర్మూసుకుని పడుండు' అంటూ భార్యను కొట్టాడు.వారంలో ఒకటి రెండు రోజులయినా నాగాచారి భార్యను కొడుతున్నాడు. పక్కన ఇంట్లో వాళ్లకు ఆ దెబ్బలు బాగా వినిపిస్తాయి. ఆ సంగతి తెలిసే అడింగింది పక్కింటి గోవిందమ్మ.
 
    "రాత్రి నిద్దట్లో లేచి, బాత్రూంకు పోతాండి పడిపోయినాక్కా" బదులిచ్చించి సుశీల.
 
    "జాగ్రత్తమ్మా... బెడ్‌లైట్ ఒకటి తెచ్చేసుకోండీ. ఇంతకు ముందు రోట్లో చానాసేపు రుబ్బుత్న్నావే... ఏంది?"
 
    "అల్సందలక్కా... వడలు చేసేదానికి..."
 
    "పండగలేదు ఏం లేదే... ఇప్పుడెందుకు వడలు?"
 
    "మా ఆయనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేయాల్సిందేనక్కా... ఐదుగంటలకంతా రుబ్బి పెట్టుకోమన్నేడు. వస్తా వస్తా నాటుకోడి మాంసం తెస్తానన్నేడు. ఆయనొస్తానే ఒగపొయ్యి మీద కూర, ఇంగో పొయ్యిమీద వడలు కాల్చాలంట. మా ఆయనకు కాలే కాలే వడలంటేనే ఇష్టం" చెప్పింది సుశీల.
 
    "నీకేంమా... ఇంట్లో ఇద్దురు కూతుండ్లుండారు... అత్తుండాది. వోళ్లు సాయం చేస్తారు. మొగుడు కోరుకునింది చేసి పెడతావు. నాకూ... ఇంట్లో ముగ్గురు మొగోళ్లు... ఒగదాన్నే ఇంటి పనులు చేసుకోలేకే సస్తాండాననుకో" అంది గోవిందమ్మ.
 
    "పెండ్లయి అత్తగారింటికొచ్చి ఇరవై ఏండ్లయితాండాది. ఇబ్బుటిదాకా మా అత్త నాకు వంటపనిలో ఏ పొద్దేగాని సాయం చేసింది లేదు. ఇంగా వాల్ల కొడుకుతో కలిసి నాలుగు మాటలంటాదంతే" కోపంగా అంది సుశీల. 
 
    "ఏ ఇంట్లో అయినా అత్తలంతేనమ్మా... రెండు రోజులనుంచి కనిపించలేదే ముసిలాయమ. యాడికి పోయింది"
 
    "చిన్నకొడుకింటికి పోయిండాది. రేపో మన్నాడో వస్తాది"
 
    "మీ ఇంట్లో రోజుమార్చి రోజు చికెనో, మటనో చేస్తాంటారు. ఆదివారం ఆదివారం బిర్యానీ చేస్తాంటారు. ఆ మాదిర్తో నీ ఎట్లామ్మా తినేది?"
 
    "నీసు లేని రోజు కోడిగుడ్లు పులుసన్నా చేయాల, లేదంటే ఆంలెట్టన్నా ఏసియ్యాల. మా ఆయనకు నీసులేందే ముద్ద దిగదక్కా... అదీ ఆయనకు చానా రుచిగా ఉండాల. కొంచెం ఉప్పెక్కువయినా తిట్లే, కొంచెం కారం తగ్గినా తిట్లే..."
 
    "అవునట, మీ అత్త చెప్పింది. మీ ఆయన చిన్నప్పటినుంచీ రుచిగానే తినేవాడంట కదా. అయినా, మీ ఆయన సంపాదనంతా తిండికి ఖర్చయిపోయేటిగా ఉండాదే" అంది గోవిందమ్మ.
 
    "తిండి ఒకటే అయితే బాదలేదక్కా... తాగేది కూడా ఉండాది కదా... తాగినప్పుడు ఆయనకు కిందా మీదా తెలీదు. రెండుమూడు తూర్లు తాగేసి దుడ్డు పోగొట్టుకున్నేడు. ఆ దుడ్డు ఆసాములిచ్చిందంట. వోళ్లు గమ్మునుటారా? దానికోసరం అప్పు... ఇంట్లో ఇద్దురు ఆడబిడ్డలుండారే.. వోళ్లకు పెండ్లిండ్లు చేయాల గదా... తాగుడు మానుకుందామే, దుబారా ఖర్చులు తగ్గిద్దామే అనేదే లేదు..." బాధగా చెప్పింది సుశీల.
 
    "పోనీ నువ్వేదన్నా పని చేయచ్చు గదా...?" సలహా ఇచ్చింది గోవిందమ్మ.

    "మా ఆయనకు ఇష్టం లేదక్కా... ఆడోల్లు బయట పనులు చేయకూడంట. ఇంట్లో అన్నీ సక్రమంగా చూసుకుంటే చాలంట. మొగోడు బయట ఎక్కడ తిరిగినా ఆడది ఇంటిని కనిపెట్టుకోనుండాలంట. కనీసం పుట్టింటికి కూడా పండగలకు పంపడక్కా... నువ్వూ చూస్తానే ఉండావు కదా... సమచ్చరానికో రెండేండ్లకో ఒకసారి పోతాంటాం. ఆడికి పోయినప్పటి నుంచీ, పోదాం పదా అంటా ఉంటాడీయన. అట్లయ్యి యాడికీ పోయేదే లేదు"

    "త్యాగరాయ మండపంలో చీరల ఎగ్జిబిషన్ పెట్టినారంట... డ్రెస్‌లు, ఫ్యాన్సీ వస్తువులు అన్నీ ఉండాయంట. బాగా అగ్గవకు దొరుకుతాండాయంట. రేప్పోతాండా. వస్తావా?" అడిగింది గోవిందమ్మ.

    "నీకు తెలుసు కదాక్కా... మా ఇంటి గడప దాటి నేను బయటకు పోయేది మా ఆయనకు ఇష్టం లేదు. 'అన్నీ తెచ్చేస్తా... లక్షణంగా చేసుకోని తిను, ఇంట్లో ఉండు. బయటకు పోవద్దు. నీకేం కావాలో చెప్పు. తెచ్చి పడేస్తా' అంటాడు. ఆయనకు తెలీకుండా అంగిట్లోనించి చిన్న సూది తెచ్చినా తప్పే... పెద్ద గొడవ చేసేస్తాడు" అంది సుశీల నవ్వుతూ.


    "మా ఇంట్లో కూడా బయటకి పోవద్దంటారు కానీ, వోళ్లు లేనప్పుడు నేనే పోతాంటా"
 
    "నేను గూడా అట్లొగసారి పోయినా. ఆ సంగతి తెలిసి మా ఆయన నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టినాడు. అప్పుట్నించి బయటకు పోవడం మానుకున్నే... మా ఆయన వస్తాండాడుక్కా... దగ్గు ఇన్పిస్తాండాది... వస్తా" అంటూ పరుగున ఇంట్లోకి పోయింది సుశీల.
 
3
 
    తను వంటమనిషి.
 
* * *
 
    వంటలు బాగున్నాయని అనగానే అందరూ గుర్తు చేసేది నలభీమ పాకాన్నే. వాస్తవానికి స్త్రీ వంట ఇంటికే పరిమితం అవుతోంది. వంట చేయడం అనేది కేవలం స్త్రీల పనిలా మారింది. అదే 'వంటచేయడం' ఒక కుటుంబాన్ని నిలబెట్టింది.
 
* * *
 
    "రాజన్న వస్తాండాడున్నో" అరిచారు వీధి చివరనుంచి ఎవరో. 
 
    ఆ పేరు వినగానే సుశీల, నాగాచారి ఇంటికి తాళం వేసేసి పరుగున వెళ్లి పక్కింటిలో దాక్కున్నారు. 
రాజన్న స్కూటర్‌లో వచ్చి నాగాచారి ఇంటిముందు ఆగాడు. ఇంటికి తాళం వేసి ఉండటం చూసి పక్కింటి గోవిందమ్మతో "వీళ్లు యాడికి పోయినారమ్మా" అనడిగాడు.
 
    "ఈ రోజు పద్దన్నే సుశీల వాళ్లమ్మోల్ల ఊరికి పోయిందన్నా... నాగాచారన్న  యాడికిపోయినాడో తెలీదు" అందామె.
 
    "ఈ నాకొడుక్కు బంగారిచ్చి ఈళ్ల ఇంటి సుట్టకారం తిరుక్కునే పనయిపోయిందే. ఏ పొద్దొచ్చినా ఇంట్లో ఉండడు. ఆడేమో అంగడి మూసేసినాడు.  ఇంగా చానా మందికి బాకీ ఉండాడంట. ఈడూ ఈని తాగుడు, ఈని పెగ్గి మాటలు... ఇబ్బుడేమయినాయో!? మ్మోవ్... ఇంగ ఇదే కడ! వచ్చే ఆదివారం వస్తాను. ఆ పొద్దుటికి నా బ్రాస్‌లెట్, మైనర్‌చైనూ ఇచ్చేయాలని జెప్పు. లేదంటే నేను చానా చెడ్డనాకొడుకును. మంచిగా అడగతాంటే ఈడు ఇనేటిగా లేడు. తీసకపోయి బొక్కలే ఏపిస్తా" అని గట్టిగా అరిచాడు రాజన్న.
 
    "ఇచ్చేస్తార్లేన్నా... ఏవో ఇబ్బందుల్లో ఉండారు" సర్ది చెప్పింది గోవిందమ్మ.
 
    "ఇబ్బందులందరికీ ఉంటాయిమా... మాగ్గూడా ఉండాయి. అట్లని మేం ఇవ్వాల్సినోళ్లకు ఎగ్గొట్టేస్తాండామా? దాంకొంటాండామా? నేనొచ్చి పోయినానని చెప్పు" అని స్కూటర్‌లో వెళ్లిపోయాడు రాజన్న.
 
    ఆమె వీధి చివరిదాకా వచ్చి చూసి రాజన్న కనుమరుగయ్యాక ఇంటికొచ్చి అతనెళ్లిపోయాడని చెప్పింది.
 
    అప్పుడు బయటకు వచ్చారు సుశీల, నాగాచారి.
 
    ఇద్దరి గుండెలు భయంతో వేగంగా కొట్టుకుంటున్నాయి.
 
    "ఏందిన్నా ఇది... నువ్వేమో ఆయన బంగారంతా అమ్ముకుని తినేసినావు...ఆయనేమో ఇంటిమిదికొచ్చి అరస్తాండాడు. ఇట్ల ఎన్ని దినాలు" అంది గోవిందమ్మ. 
 
    నాగాచారి మౌనంగా ఉండిపోయాడు. తప్పు చేసిన వాడిలా తల దించుకున్నాడు.

    "ఇద్దురు బిడ్డలకు పెండ్లిండ్లు చేసినాం కదాక్కా... నేను చెప్తానే ఉండా ఊరోళ్ల బంగారొద్దని. ఈయన ఇంటే కదా... బంగారిచ్చినోళ్లు ఊరికే ఉంటారా?" అంది సుశీల.

    "మొగున్ని ఎనకేసుకోని రావద్దమ్మా... సగం బంగారు తిండికి, తాగుడుకే ఖర్చు చేసింటాడు. ఎంతటోనికయినా టయాలు ఒగోసారి బాగుండవు. అప్పులయతాయి. వోటిని తీర్చుకోవాల కదా... ఇట్లా దాంకోని ఎన్ని రోజులుంటారు?" అంది గోవిందమ్మ.

    నాగాచారి, సుశీల మౌనంగా వుండిపోయారు.

    "సుశీల అన్నం కూరలు బాగా చేస్తాది... హైదరాబాదులో మాకు తెలిసినోళ్ళుండారు. వోళ్ళకు వంటమనిషి కావాల. నెలకు పదైదు నూర్లిస్తారు. తిండంతా గడిచిపోతాది. రెండేండ్లుంటే మీ అప్పులన్నీ తీరిపోతాయి. నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇనిపించుకోవడం లేదన్నా" అందామె.

    అక్కడి నుండి నాగాచారి విసురుగా వెళ్ళిపోయాడు. ఆ పోవడంలో భార్య హైదరాబాదుకు పోవడం ఇష్టం లేదనే సంగతి స్పష్టంగా తెలుస్తా ఉంది.


    "వోళ్ళతో మాట్లాడక్కా. నేను పోతాను" అంది సుశీల.
 
    ఆమె మొదటిసారిగా భర్తను అడగకుండా, ఆయన సమ్మతి కోసం చూడకుండా నిర్ణయం తీసుకుంది. తమ పెళ్ళైన పాతికేళ్ళలో మొదటి సారిగా ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకుంది సుశీల. మరో వారం రోజుల్లోనే సుశీల హైదరాబాదుకు వెళ్ళిపోయింది.
 
    సుశీల వంటను ఆ ఇంట్లో వాళ్ళు బాగా మెచ్చుకున్నారు. తనకు చిన్నప్పుడు అమ్మ వంట పనులు నేర్పిస్తుంటే, పెళ్ళయ్యాక భర్త తనను వంట ఇంటికే పరిమితం చేస్తుంటే సుశీల ఆ ఇద్దర్నీ బాగా తిట్టుకునేది. అమ్మతో అయినా ఎప్పుడన్నా ఎదురు తిరిగి మాట్లాడిందిగానీ, భర్తకు ఏనాడూ ఎదురు చెప్పలేదు. అతను కోరిన రీతిలో వంటలు చేసిపెట్టింది. పోనీలే, అప్పుడు నేర్చుకోవడం ఇప్పుడు తమ కుటుంబం పరువు కాపాడ్డానికి ఉపయోగపడుతోంది అనుకుంది సుశీల. విషాదంలో కూడా అదొక ఆనందం!
 
    రెండేళ్ళయ్యాయి. మధ్యలో సుశీల ఒకసారి తిరుపతికి వచ్చిపోయింది. నాగాచారి ఒకసారి హైదరాబాదుకు పోయి వచ్చాడు. సుశీల తిరుపతికి వెళ్ళిపోతానంటే ఆ ఇంట్లోవాళ్ళు ఉండమన్నారు. 'నీ మాదిరిగా పని చేసే మనిషి దొరకదు... ఇంకొన్ని రోజులుండు. ఎవరినైనా చూసుకుంటాం'అన్నారు. అలా మరో ఏడాది గడిచిపోయింది.
 
    అప్పులన్నీ తీరిపోవడంతో నాగాచారికి ఇప్పుడు ఒంటరితనం బాగా ఇబ్బంది అనిపిస్తా ఉంది. ఆర్నెల్ల నుంచి భార్యకు నెలకోసారి ఫోన్ చేసి వచ్చెయ్యమని చెబుతున్నాడు.
 
    ఆ రోజుకూడా సుశీలకు నాగాచారి ఫోన్ చేశాడు.
 
    "ఏమే... వచ్చెయ్యి ఇంగ..." అన్నాడు.
 
    "ఆడికొస్తే ఏం పనుటాదిబ్బా... ఈడుంటే నెలకు రెండు వేలు వస్తాండాయి కదా..." అంది సుశీల. 
 
    "ఇంగ నేను పని చేస్తాలే..."
 
    "ఇంతకు ముందు కూడా చేసినావు కదా?" అంది సుశీల.
 
    "అప్పటి కత వేరులేమ్మే... పనికొచ్చిన బంగారు బిడ్డల పెండ్లికి వాడేస్తిమి. అగ్గవకొస్తాందని దొంగ బంగారు కొని మోసపోతిమి. అప్పులైపోతిమి. ఇప్పుడు కుదురుగా పని చేసుకుంటాలే. అప్పులన్నీ తీరి పోయిండాయి. వచ్చేసేయి."
 
    "ఆడికొచ్చినా కూడా నేను ఖాళీగా ఉండలేనబ్బా... ఎవరింట్లోనో ఒగరింట్లో పనికి కుదురుకుంటా. వెయ్యో పదైదునూర్లో వచ్చినకాడికి రానీలే... అట్లయ్యేటిగా ఉంటేనే వస్తా" భర్తకు షరతు విధించింది సుశీల.
 
    మరో రెండు నెలలకు సుశీల తిరుపతికి వచ్చేసింది.
 
    నాగాచారి బజార్లో మళ్ళీ ఒక చిన్న గది అద్దెకు తీసుకొని బంగారుపని చేయడం మొదలు పెట్టాడు. 'నువ్వు ఎవరింట్లో పని చేసే అవసరం లేదులే... నేనే సంపాదిస్తాను' అన్నాడు. భర్తలో మార్పుకు సంతోషించింది సుశీల. అయితే అతనిలో మార్పు శాశ్వతం కాదని కొద్దిరోజులకే తెలిసిపోయింది. నాగాచారిలో పూర్వపు అలవాట్లు మళ్ళీ మొదలయ్యాయి. అతని సంపాదనంతా తాగుడుకే చాలడం లేదు. ఇంటికి కూతుండ్లొస్తే వాళ్ళకు అరువుగా తిండి పెట్టలేని స్థితి. దీంతో సుశీల భర్తను అరిచింది. 'నువ్వు పనేమీ చెయ్యద్దు. నేనే సంపాదిస్తాను' అంది. తమకు రెండు వీధుల అవతల ఒక ఇంట్లో వంట చేయడానికి ఒప్పుకుంది. నెలకు వేయి రూపాయల జీతం.
 
    ఏడాడి గడిచింది. సుశీలకు ఆరోగ్యం బాగాలేకుండా పోడంతో ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. దీంతో సుశీల బయట పని చేయడం మానేసింది. అయినా నాగాచారిలో పెద్దమార్పేమీ లేదు. బాధ్యతా లేదు.
 
4
 
    తను వట్టి మనిషి.
 
* * *
 
    పుట్టుకతో మనిషికి ఎలాంటి కోరికలూ, ఆలోచనలూ, నైపుణ్యాలూ ఉండవు. పెరిగే క్రమంలో అవసరాలు మనిషిని రకర్కాలుగా తయారు చేస్తాయి. అలాంటి అవసరాల సంకెళ్ళను తెంచుకున్న ఓ మనిషి వట్టి మనిషిలా మిగిలిపోయింది.
 
* * *
 
    ఎదురుగా నేలమీద నాగాచారి శవం. పైన పూల దండలున్నాయి. తలవద్ద అగరొత్తులు వెలిగించి, ప్రమిదలో దీపం పెట్టారు. బంధువులు ఒక్కొక్కరే వస్తున్నారు. సుశీల గోడకు ఆనుకుని కూర్చుని భర్త మృతదేహాన్నే చూస్తోంది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఇంకిపోయినట్టున్నాయి. ఆమెకు అటూ ఇటూ కూతుళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు.
 
    "నాగాచారి సచ్చిందాకా తన పద్ధతి మానుకోలేదమ్మా..."
 
    "ఆఁ... ఆ తాగుడు లేకుండా ఉన్నింటే ఇంగో ఇరవై ఏండ్లు బతికుండేవాడు. ఆడమనిషి సంపాదించి ఏస్తాండాది కదా... తాక్కుండా ఇంటి పట్టున ఉన్నింటేనేమి"
 
    "ఆయన తాక్కుండా ఉండేటిగా ఉంటే ఆడమనిషి పని చేసే అవసరం ఏముండాది"
 
    "సుశీల కాబట్టి చేసిందమ్మా... ఇంకో ఆడదయింటే చేసిండునా?"
 
    "కట్టుకునిందానికి భార్యను ఏపొద్దన్నా సుఖపెట్టినాడా... ఆయన సుఖపడినాడంతే... మొగోని మాదిర్తో సుశీలే కష్టపడింది. కుటుంబాన్ని నిలబెట్టింది."

    "పోతే పోనీలేమ్మా... ఆయన ఉన్నే లేనట్టే... ఉన్నే ఈయమ్మకు ఇంగా పనెక్కువ... ఇంగ ఎవురికీ ఏ సేవలూ చేసే అవసరం లేదు. తింటుందో తినదో... హాయిగా ఉండచ్చు. అడిగే వాళ్ళెవరూ ఉండరు"

    చావుకు వచ్చిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
 
    వాళ్ళమాటలు సుశీల వింటోందో లేదో, ఆమె ముఖంలో సంతోషమూ దుఃఖమూ కలగలిప్న విచిత్రమైన భావం కదలాడుతోంది.
 
    బంధువులంతా వచ్చారు. సాయంత్రానికి నాగాచారి మృతదేహానికి అంత్యక్రియలు అయి పోయాయి.  బంధువులు ఎవరి ఊర్లకు వారు వెళ్ళిపోయారు. పదకొండో రోజు కర్మక్రియలు అయ్యాయి.
 
    ఇంట్లో సుశీల ఒంటరిగా మిగిలింది. మనుషులతో మాట్లాడ్డం తగ్గించింది. రెండు వేల రూపాయలిస్తామన్నా వంట పనికి ఒప్పుకోలేదు. నాలుగిండ్లలో పాచిపనికి కుదురుకునింది. నెలకు వేయి రూపాయలు వస్తాయి. వాళ్ళు ఇచ్చే మిగిలిన కూరలు, అన్నాలు తెచ్చుకుంటుంది. వాటినే తిని నీళ్ళు తాగి ఉంటుంది. ఇంట్లో పొయ్యి ముట్టించడం మానేసింది.
 
    రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు పెద్ద కూతురు అల్లుడు వచ్చారు. సుశీల అన్నం చేసి పప్పు, చారు చేసింది. వాటిల్లో రుచే లేదు!
 
    "ఏందమ్మా... కూరలు ఇట్లుండాయి?" అడిగింది కూతురు.
 
    "చిన్నప్పట్నుంచీ కూరలు చేసీ చేసీ విసిగిపోయిండా... అమ్మను కాదనలేక వంట నేర్చుకున్నే. మీనాయన్ను ఎదిరించలేక వంట చేసినా. కుటుంబం పరువుకోసం వంటమనిషిగా మారినా. నాకోసరమైతే వంట చేసుకునే పనే లేదు. కానీ వంట చేయక తప్పలేదు.  నాకు వంట చేయడం అంటే విసుగు. కోపం... మీ నాయన సచ్చిపోయాలకు నాకు చానా ఆనందమేసింది. ఇంగ అరువుగా వంట చేసే పని లేదు కదా అన్పించింది. నిజంగా కూడా ఇప్పుడు నాకు కూరలు ఎట్ల చేయాలో తెలీడం లేదు... రసం పెట్టుకున్నే బాగుండటం లేదు... ఏ కూరకు ఏమెయ్యాల్నో, ఎంతెయ్యాల్నో గుర్తే లేదు. ఏమేం కూరలు చేస్తారో కూడా గుర్తు లేదు. వంట సంగతులన్నీ నా బుర్రలో లేకుండా పోయినాయి. అయ్యి లేకపోతేనే ఆనందంగా ఉండాను. మీరొచ్చినారని కష్టపడి ఇయ్యి చేసినా. నాకేపనీ రాకపోయినా బాధ లేదు. నన్నెవరూ మెచ్చుకోవాల్సిన పనిలేదు. నాకిట్లే ఆనందంగా ఉండాది" అంటున్న సుశీలను కూతురు, అల్లుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
 
(నవ్య వీక్లీ 2009 దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితం)
 
Comments