వెన్నెల పండిన వేళ - పోరంకి దక్షిణామూర్తి

    గుంపులు గుంపులుగా వచ్చి జనం ఊరిమీద పడ్డారు, ఒకరా, ఇద్దరా? తండాలికి తండాలు!

    పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఊరిసత్రంలో ఒకటే రద్దీ. వచ్చేవాళ్ళూ పోయేవాళ్ళూ చోటు దొరకనివాళ్ళూ ఊరివాళ్ళ అరుగుల మీదే వంటలు. కొందరు బావుల దగ్గిరా గుడారాలు వేసుకున్నారు. ఎంతో హడావిడీ, ఎంతో గడబిడా.

    దుకాణదార్ల పుణ్యం పండింది. పనివాడు తూచిన సరుకు మొగ్గు ఎంతుందో కూడా చూసుకునేందుకు తీరకలేక, గళ్ళాపెట్టెల్లోనే తలలు దూర్చి దుడ్లు ఏరుకోడంతో సరిపోతుంది.

    పిల్లలు ఇళ్ళపట్టున నిలబడకుండా పెద్ద రాచకార్యం పెట్టుకుని ఊరంతా సేవించి వస్తున్నారు. వాళ్ళకేముందీ, ఇంతమంది జనం తొంబలు తొంబలుగా ఇలా కనిపిస్తుంటే. ఊరంతా పెళ్ళివారి విడిదయిపోతుంటే, కొత్త కొత్త మొహాలూ, చిన్న చిన్న జెడలూ,సన్న సన్న సిగలూ తీర్చుకొని ఊరంతా ఆలంగం తొక్కుతూంటే వీళ్ళు మాత్రం ఇళ్ళల్లో ఎలా ఉండిపోగలరూ? ఎదురు సన్నాహానికి వెళ్ళారు. జట్లు కట్టి జేజేలు కొట్టారు. పొగడ చెట్టునుంచి పూలు జలజలా రాలినట్లు చెట్లకింద ఎక్కడచూసినా పిల్లలే.

    నాలుగయిదు రోజులనుంచి తీర్థప్రజలా జనం ఇలా వస్తున్నారు. ఆ ఊరు చిన్నది. చాలా చిన్నది. ఆ లెక్కకొస్తే, అది ఊరే కాదు. నాలుగయిదు పూరిళ్ళు బాట పక్కన ఉండగా, ఏనాడో విజయనగరం రాజుల రోజుల్లో తవ్వించిన కపిల బావులు రెండు ఇంత ధారకం పోస్తున్నాయనే ఆశతో పది పన్నెండు కుటుంబాలు వచ్చి చేరాయి. చుట్టు పక్కల చెలకలు తీసుకొని సాగు ప్రారంభించి అక్కడే స్థిరపడి పోయారు. అది ఊరయింది. ఆ ఊరికొక పేరు మాత్రం ఎవరూ పెట్టలేదు. అక్కడి వాళ్ళకది అవసరం లేకపోయింది. రెవిన్యూ లెక్కలకి మాత్రం మరో ఊరి పేరు కింద ఆ భూములు నమోదయినాయి. అయితే ఆ ఊరి ప్రత్యేకత ఏమిటంటే, ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని పల్లెలనుంచి పట్నానికి పోయే బాట ఆ ఊరిమీదుగానే పోవటంవల్ల, బాటసారులకది ఇంత సేదతీర్చుకునేందుకు చక్కని మజిలీ అయింది.

    ఆవేళ శివన్నకు ఊపిరి సలపనంత పని తగిలింది. అయినా కండరాల్నెంత బిగబట్టినా చెమట పట్టని శరీరమేమో, మనిషిలో అలుపూ సొలుపూ కనిపించదు. వంచిన తల ఎత్తకుండా ఆ పూట అంతా పనిచేస్తూనే ఉన్నాడు.

    శివన్న మనసులో ఆలోచనలకి అప్పుడు తావులేదు. అయినా అప్పుడప్పుడు ఒక్కొక్క విషయం చివ్వల దూసుకు వచ్చి గుచ్చుకున్నప్పుడు మాత్రం గుండె చివుక్కుమంటుంది. కాక పోతే ఇంత ఉపద్రవం ఈనాడు మంచుకొస్తుందని ఎవరన్నా కలగన్నారా?

    లేదు. కాని, రాయలసీమ ప్రాంతం ఈ ఉపద్రవాలకి అలవాటు పడి ఉన్నదే. వెర్రివాళ్ళంతా రతనాలసీమ అని చెప్పుకుని మ్ర్చ్చట పడతారు. అదంతా పాపం వట్టి రాళ్ళసీమే. పంటపొలాలకు కాలవలులేక, బావులు చేదుకునేందుకు ఒళ్ళు విరగ్గొట్టుకుంటారు. అయిదారేళ్ళు వరసగా వానలు కురవకపోవడంతో బావులు కూడా ఎండిపోయి నీటి చుక్కకి కటకట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు తిండిగింజలు కరువై జొన్న సంకటికే మొహంవాచే దుస్థితి ఏర్పడుతుంది. బీదా బిక్కీ ఉన్నచోట నిలవలేక, తరతరాలుగా పెద్దల నాటినుంచి నమ్ముకున్న నేలతల్లిని విడిచిపెట్టి కుటుంబాలకి కుటుంబాలకి కుటుంబాలు తండాలుగా వలసపోతారు. వారి వెనుక ఊళ్ళు మాత్రం అలానే బిక్కుబిక్కమని నిలబడిపోయి పాతబడిపోతాయి. ఇలా జరుగుతూ ఉండటం కొత్త గాదు. అయినప్పటికీ, ఈ ఊరి ప్రాంతంలో ఎన్నడూ ఎవరూ తామై ఈ అవస్థకు గురికాలేదు. ఇదే మొదటి సారి.

    పొద్దువాటారిన తరవాత, ఊళ్ళో సద్దుమణిగిన తరవాత, యజమాని సామాన్లన్నీ పెట్టెల్లో బిగించి కట్టి శివన్న తన గుడిసెకు పోయి పొయ్యి రాజేసుకున్నాడు. చితుకులు చిటచిటా అంటుకోడంతో మంట బాగా వచ్చింది. పొయ్యిమీద మండికెతో ఎసరు పెట్టాడు. తొక్కిన జొన్నలు తెచ్చి పోసి మూకుడు పెట్టాడు. పెట్టి, అలానే పొయ్యి ముందు గొంతుక్కూచుని మంటని చూస్తూ ఉన్నాడు. చురచురా చితుకులు కాలిపోతునంటే, మంట మండికె మట్టుమీద నుంచి ఇటూ అటూ పాకుతూంటే అలానే, అలానే రెప్పవేయకుండా చూస్తూ ఉన్నాడు.మూకుడిని తోసుకుంటూ ఆవిరి దూసుకువస్తూంది. లోపల కుతకుతమని ఉడుకుతూ ఉంది. తెడ్డు పెట్టి ఒక్కసారి కలిపి, మంట కొంచెం తగ్గించి మళ్ళీ మూతపెట్టాడు.

    అక్కడ అలా కూచున్నప్పుడు, మనసుల్లో వచ్చిన ఆలోచన లన్నింటినీ పక్కకి నెట్టి గట్టిగా ఒక్కటి నిశ్చయం చేసుకున్నాడు. ఈ గుడిసెలో తన చుట్టూ ఎంత ఒంటరితనం ముసురుకొచ్చినా అందరిమల్లే తను మాత్రం నమ్ముకున్న ఊరిని విడిచి వెళ్ళకూడదనుకున్నాడు. యజమాని కుటుంబంతో పాటు పట్నం వెళ్ళిపోతున్నాడు. తనని రమ్మని ఆయన ఖచ్చితంగా అడగలేదు. అయినా ఆయన భార్యమాత్రం ఆ మాట చూచాయగా అన్నది. అప్పుడు తనకెందుకో, వాళ్ళవెంట వెళితే బాగుంటుందనే అనిపించింది. రమ్మని యజమాని అంటే బాగుంటుందనే ఎదురు చూశాడు. కాని, ఆయన అనలేదు. కొంత నిరాశ కలిగింది. తనకి తానై అడగలేదు. ఆయనతో కాకపోతే మరొక చోటికెక్కడికయినా వెళ్ళి కనీసం కూలి నాలి చేసుకునయినా బతకొచ్చుననిపించింది. ఒక్క ప్రాణం. రోజు గడవడమనగా ఎంత! తను పడుచువాడూ ఒళ్ళొంచి పని చేసేవాడు అయినా మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది; ఉన్న ఊరు ఎంత కొరగానిదయినా ఈనాటికి విడిచి వెళ్ళిపోవలసి వస్తూందే, అని దిగులవుతుంది. దీనితో తనకి చుట్టరికమేమిటి అసలు? ఏమో, ఏమిటో! తనకి అదే తెలీదు. ఉన్న పళాన ఒక్కసారి వెళ్ళిపోవడమంటే, కన్ను తడ్సి ఎరగని ఇరవైఏళ్ళ తన జీవితంలో ఈనాడు ఎందుకో దుఃఖం వస్తున్నది.

    'నేను వెళ్ళను, నా ఊరు విడిచి నేను వెళ్ళను. అంతా వెళ్ళిపోయినా సరే - ఏమయినా సరే, నేను వెళ్ళను. నా ఊరు వదిలి వెళ్ళను!' అనుకున్నాడు శివన్న. సొంతంగా పొయ్యి రాజేసుకోడం, జొన్నలు కడిగి ఎసట్లో పోసుకోడం, తరవాత అదంతా పళ్ళెంలోకి దిమ్మరించుకుని, ఊరగాయపచ్చడి తెచ్చి వేసుకుని కలుపుకుని, మెల్లగా, కులాసాగా తింటూ అలా గంటసేపు కూచోడం, అంతా తనకి చాలా చిత్రంగా, హాయిగా, తప్పజాలని అలవాటులా, ఇదే ఇదే తనకెంతో బావుందనుకున్నాడు. ఆరుబయట చాప పరచుకుని వెల్లకిలా పడుకొని తలకింద చేతులు పెట్టుకుని ఆకాశంలోకి చూస్తూ అలానే పడుకున్నాడు. పల్చగా వెన్నెల వచ్చి అతని మొహం మీద పడుతూంటే మెల్లగా కునుకు పట్టేసింది.

    రెండో జామురాత్రికి ఊళ్ళో సందడి ఆరంభమైంది. బండి గానుల కిరకిరలూ, ఎద్దుల మెడల్లో గంటల గణగణలూ వినిపిస్తున్నాయి. శివన్న తొందరగా లేచి మొహం కడుక్కుని, యజమాని ఇంటికి వెళ్ళాడు అప్పటికి బళ్ళు కూడా వచ్చి గుమ్మం ముందు వరసగా నిలబడి ఉన్నాయి.

    సామానంతా ఒంటి చేతిమీదే శివన్న బళ్ళకెత్తాడు. మిగిలిన రెండు బళ్ళల్లో శివన్న యజమాని కుటుంబం ఎక్కింది. బళ్ళను సాగనంపటానికి ఊరి చివరి వరకూ వెళ్ళాడు. వెడుతూంటే యజమాని భార్య మళ్ళీ అన్నది "పాపం శివన్న కూడా వస్తాడనుకున్నానండీ!"

    "ఔను. వస్తేనే బాగుండేది. కాని ఊరు విడిచి రాగలడా?" అని తేల్చేశాడు ఆయన.

    శివన్న ఇది విన్నాడు. యజమాని ఈ మాట మనస్ఫూర్తిగా అన్నది కాదని అతనికి తెలుసు. మరొకప్పుడయితే, ఇలాగ ఆయన అన్నందుకు బాధపడేవాడే. కాని ఇప్పుడు అతనికి ఆ దిగులు లేదు. 'ఔను. నేను ఊరు విడిచి రాలేను!' అనుకున్నాడు గట్టిగా. బళ్ళు ఊరు దాటి చాలా దూరం వచ్చేశాయి. యజమాని చేతిలో పది రూపాయల నోటు ఒకటి పెట్టి ఇక దిగమన్నాడు. శివన్నకు ఆ నోటు తీసుకునేందుకు మనసు ఒప్పలేదు. తిరిగి ఇచ్చేయబోతూంటే యజమానురాలు దగ్గరికి పిలిచింది. 'చూడు శివన్నా!ఇది మా సంతోషం. కాదనకు. నువ్వు చేసిన పనికి ఇది ఏ మాత్రం చాలదు. అయినా, నువ్వు కాదనొద్దు; అయ్యగారి మనస్సుకి కష్టం కలుగుతుంది. నీకు డబ్బు అవసరం లేదు. నాకు తెలుసు; అయినా నువ్వు ఎక్కడికో ఒక చోటికి వెళ్ళేందుకు నీకు కొంత కావాల్సి వస్తుంది. అందుకని ఉంచుకో; ఒక్క మాట. అప్పుడప్పుడు ఇంటిని కొంచెం చూస్తుండు!" అన్నది. శివన్న ఆమె ముందు తలొంచుకున్నాడు.

    బళ్ళు కదిలిపోయాయి. శివన్న అక్కడే నిలుచుండిపోయాడు. 

    యజమాని ఊరు విడిచిన రెండు మూడు రోజుల వరకూ శివన్న గుడిసె దాటి బయటికి రాలేదు.

    ఈ లోపుగా, ఊళ్ళో దాదాపు అన్ని ఇళ్లూ ఖాళీ అయిపోయాయి. పై ఊళ్ళనుంచి వచ్చేవాళ్ళు కూడా ఒక పూటో, ఆ రోజో ఆగి ముందుకు సాగిపోతున్నారు. కొందరు బళ్ళమీదా, కొందరు కాలినడకన, నడవలేని ముసలివాళ్ళు మంచాల డోలీలమీద; వెనకాలే వాళ్ళ పశువులూను.

    మూడోరోజున చీకటి పడిన తరవాత శివన్న గుడిసె దాటి బయటికి వచ్చాడు. రచ్చబండ దగ్గరకు వచ్చాడు. అక్కడ బాటసారులు అన్నాలు వండుకునేందుకు పొయ్యిలమర్చుకున్న రాళ్ళు నల్లగా మసిబారి కనిపించాయి. ఇంకా ముందుకు నడిచాడు. వీధి అరుగులమీద చినిగిన గుడ్డపీలికలూ, పాతకాగితం ముక్కలూ తప్ప ఇంకేం లేదు. వాకిళ్ళన్నీ దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. ఒకటి రెండు సందులు సన్నగా చీకటి గుయ్యారాల్లాగున్నాయి. పశువుల కొట్టాలలో వాసన ఏమీ రావటం లేదు. మచ్చుకయినా ఒక పచ్చని ఆకు కాని, గడ్డిపరకగాని ఏదీ కనిపించటం లేదు. ఒక్కొక్క ఇంటివైపునే చూస్తూ ఆ ఇంట్లోవాళ్ళని పేరుపేరునా గుర్తు చేసుకుంటూ ఇంకా ముందుకు నడిచాడు.

    ఊరి బావి దగ్గిర తెల్లగా ఏదో కనిపించింది. కదులుతున్నట్టనిపించింది.

    శివన్న దగ్గరకు వెళ్ళాడు.

    ఆవు!

    ఆశ్చర్యపోయాడు. 'మందలోంచి తప్పించుకుని వెనకి తిరిగొచ్చేసినట్టుంది, వెర్రితల్లి!' అనుకున్నాడు. "ఔను నాలాగే నీకు కూడా ఊరు విడిచిపోవడమంటే ఏడుపొస్తుంది కదూ?" అన్నాడు శివన్న. 

    ఆవు మోర పైకెత్తింది. శివన్న దాన్ని ఆప్యాయంగా నిమిరి, మెడమిద చెయ్యివేసి ముందుకు నడిపించుకొని వెళ్ళాడు. ఆవు బావి వంకకే వెనక్కి వెనక్కి చూస్తోంది.

    "వెర్రిదానా నీళ్ళు కావాలిటే? నా గుడిసెకి రా. కడూపునిండా నీళ్ళు పడతాను అన్నాడు. తరవాత మరో ఆలోచన వచ్చింది. ఇప్పుడు దీనికి మేత ఎక్కడనుంచి తేవడం? 

    ఆవు దారిలో మెల్లగా ఆగుతూ, బళ్ళవాళ్ళి ఏరుకోవటంలో కింద చెదురుమదురుగా పడ్డ గడ్డిపరకలు నములుతూ వస్తున్నది. శివన్న నవ్వుకున్నాడు.

    పల్చగా వచ్చిన వెన్నెల ఆవు ఒంటిమీద పడి చిక్కనైనట్లున్నది.

    మనిషి బతకటానికి కరువయిన ఈ చోట తనకి తోడు ఈ కొత్తజీవి మరొకటి రావడం అతనికి చిత్రమనిపించింది. అది ఎవరి ఆవో, ఏ ఊరిదో కూడా తెలియదు.

    తనలో తను చిన్నగా నవ్వుకుంటూ, మెల్లగా నడుస్తున్నాడు. ఆవు వెంట వస్తోంది. 

    ఆవు అక్కడే ఆగిపోయింది. చెవులు ఆ వైపుకి రిక్కించుకొని 'అంబా' అని అరిచింది.

    శివన్న కూడా ఆగాడు. అప్పుడు ఆ గొందిలోనుంచి సన్నగా ఏడుపు వినిపించింది. శివన్నకి ఆశ్చర్యం వేసింది. 

    ఆవు మళ్ళీ అరిచింది.

    శివన్న గొంది దగ్గిరకి వెళ్ళాడు. రెండువైపులా ఇళ్ళు దగ్గిరదగ్గిరగా ఉండటంవల్లా దారి సన్నగా ఉండాడం వల్లా అతనికి అంతా గుయ్యారంలాగుంది.

    శివన్న అలానే మెల్లగా వెళ్ళాడు. చిన్నపిల్ల ఏడుపు వినిపించింది. తొందరతొందరగా వెళ్ళాడు. పిల్ల కనిపించింది.

    అయిదేళ్ళు కూడా నిండని పిల్ల చిన్న పావడా తొడుక్కొని గౌను వేసుకొని ఉన్నది. అలానే ఏడుస్తూ నిలుచుండిపోయింది.

    ఆ పిల్లని చూడగానే శివన్న గుండె తరుక్కుపోయింది. ఆ పిల్ల ఎవరి పిల్లో తనకి తెలియదు. ఏ ఊరివాళ్ళు ఈ చిట్టిపాపను ఇక్కడ మరిచిపోయి వెళ్ళారో అంతకనే తెలీదు. ఏమిటో- ఏమిటో, ఈ జరుగుతున్న చిత్రమంతా అనుకున్నాడు.

    ఆ పాపను ఎత్తుకొని గుండెకు ఒత్తుకున్నాడు. "ఏడవకు తల్లీ! నేను ఎత్తుకున్నానుగా; నీకేం భయంలేదు. మన ఇంటికి పోదాం. నీకు బువ్వ పెడతాను. భుజంమీద పడుకోబెట్టి పాటలు పాడి జోకొడ్తాను. ఏం? ఏడవకేం? మనకేం భయం లేదు. నువ్వూ, నేనూ, మన ఆవూ ముగ్గురం, ముగ్గురం ఉన్నాం! మనం ఎప్పుడూ ఈ ఊరు విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్ళొద్దు ఏం?" అన్నాడు.

    పిల్ల ఏడుపు మానింది. కాని, ఇంకా ఎక్కిళ్ళు తగ్గలేదు. ఆవు ముందుకు నడుస్తోంది. 

    శివన్న అనుకున్నాడు - దేశం కరువుకి మాడి, ఊరు తిండికి మొహం వాచి, ఇళ్ళు పాడయిపఒయినప్పుడు తాను ఒక పట్టుదలతో ఒంటరిగా, బిక్కుబిక్కుమంటూనే, ఉండిపోవాలనుకున్న తనకి ఈ పిల్ల దొరకడం ఎన్ని జన్మల అదృష్టమో అనుకున్నాడు. భుజంమిద నుంచి చేతుల్లోకి తీసుకొని ఆ పాప నుదురు ముద్దుపెట్టుకున్నాడు. అప్పుడు ఆ పాప తన రెండు చేతులూ అతని మెడ చుట్టూ పెనవేసి, గుండెల్లో తల దూర్చుకుంది. 

    అప్పుడు శివన్న మొహంలో కనిపించిన ఆ ఆనందం ఆ పండువెన్నెలకే తెలుసు.

(జ్వాల మాసపత్రిక 1963లో ప్రచురితం)   

Comments