వేటగాడు - సాదనాల వేంకట స్వామి నాయుడు

    వెంకట్రాజు వీధి అరుగుమీద వాలుకుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు.
 
    "బావ్, ఎంకట్రాజు బావ్. అడవిపందులు  సెనగసేల్ని దున్నేత్తున్నాయ్" అన్నాడు దగ్గర్లో వున్న పల్లె నుంచి వచ్చిన రాములు.
 
    ఆ మాట వినగానే స్ప్రింగ్‌లా లేచి కూర్చున్నాడు వెంకట్రాజు.
 
    "పందులా? ఏ వేళప్పుడు దిగుతున్నాయ్?" ఎక్సైట్‌మెంట్‌ని కప్పి పుచ్చుకుంటూ హుందాగా అడిగాడు వెంకట్రాజు.
 
    "ఒక్కోసారి ఎలుతురండగానే వొచ్చేత్తున్నాయి. ఒక్కోసారి తెల్లారగట్ల దిగుతున్నాయి. ఆటికి అప్పుడూ యిప్పుడూ అని లేదండి" చెప్పాడు రాములు.
 
    "మందలు మందలుగా వస్తున్నాయా? విడివిడిగా వస్తున్నాయా?"
 
    "అలాగా, ఇలాగా వొత్తున్నాయి బావ్. ఆ మద్దిన పిల్లల పంది కూడా ఒకటి దిగింది బావ్"
 
    "ఎన్నిరోజుల్నుంచి వస్తున్నాయ్?"
 
    "ఎక్కడ బావ్, సానా రోజుల్నుంచి."
 
    "మరిన్నాళ్ళూ ఏం జేసావ్? నా దగ్గర తుపాకీ వుందని నీకు తెల్సుకదా!" చిరాగ్గా అడిగాడు వెంకట్రాజు.
 
    "మొన్న రేత్రి ఒంటిడి గూడా వచ్చినాది బావ్" రాములు.
 
    "ఒంటిడా...?!" అదేవిఁటీ అన్నట్టు ఆశ్చర్యపోతూ అడిగాడు వెంకట్రాజు.
 
    "అదేనండి - పోతు పంది"
 
    "ఓహో. అదా!" తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటూ కాస్త తడబడ్తూ అన్నాడు.
 
    బాగా బలిసిన మగపంది మందని విడిచి ఒంటరిగా తిరుగుతుంది. అందుకే దాన్ని "ఒంటిడి" అంటారనే విషయం మొదటిసారిగా రాములుద్వారానే తెల్సుకున్నాడు.
 
    "ఇంతకీ ఆ వేరుశెనగ చేలెక్కడ?"
 
    "మా యింటి యెనకాలే బావ్. పెద్ద సెరువు ఎనకాల వూరులేదా! అదే మా వూరు."
 
    "మనం కొడ్తే తిరుగుండదు. పండిపడ్తే నువ్వే తీస్కో. దాని గుండెకాయ మాత్రం వేటగాడే తినాలి."
 
    "తమ చిత్తం బావ్."
 
* * *
 
    వెంకట్రాజు చిన్నప్పట్నుంచీ వేటన్నా, వేటాడే మనుషులన్నా ఎంతో యిష్టం. అతని తాతగారు వేటలో సిద్ధహస్తులు. మంచి వేటగాడిగా ఆయనకు చుట్టుప్రక్కల పేరుండేది. తాతగారు చెప్పిన వేటకథలు వెంకట్రాజునెంతో చిన్నతనంలోనే యిన్స్‌పైర్ చేశాయి. పెద్దాయన తర్వాత తను కూడా పెద్ద వేటగాడిగా పేరు సంపాదించు కోవాలనేదే అతని ఆకాంక్ష. ఎప్పుడూ అడవులూ, అందులో తిరిగే జంతువుల మీద ధ్యాసే.
 
    వెంకట్రాజు కాలేజీ చదువుతుండగా అతని తాతగారు కాలధర్మం చేశారు. ఆయన వాడిన తుపాకిని వెంకట్రాజు తండ్రిగారు వెంకట్రాజు ఎంత ప్రాధేయపడినా వినకుండా పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేసేశారు. కారణం - అతని తాతగారికి వేటంటే ఎంత మోజో, తండ్రిగారికి వేటంటే అంత అయిష్టం. పరమ అహింసావాది.
 
    తన తండ్రిగారి వ్యసనం కుమారునికబ్బినందుకు వెంకట్రాజు తండ్రిగారెంతో విచారిస్తుండేవారు. వేట పరమ కిరాతకమని పరిపరివిధాల కొడుక్కి నచ్చచెప్పి చూశారు. కానీ వెంకట్రాజుకి వేటపై వ్యామోహం నానాటికీ పేరగటమే తప్ప ఏమాత్రం తగ్గలేదు.
 
    వెంకట్రాజు డిగ్రీ పూర్తిచేశాక తండ్రితో తగువుపడ్డాడు. మైనారిటీ తీరడంతో ససేమిరా తుపాకీ కావాలని కూర్చున్నాడు. రెండు పూటలు తిండికూడా మానేశాడు. కొడుకు గొడవ భరించలేక తండ్రి "ఫో. నీ కర్మ" అని వదిలేశాడు. వెంటనే వెంకట్రాజు స్వంతంగా లైసెన్స్ సంపాదించాడు. తాతగారి తుపాకిని విజయ గర్వంతో డిపాజిట్ నుంచి విడుదల చేయించుకున్నాడు.
 
    అప్పటికే బాగా తుప్పుపట్టిపోయిన ఆ తుపాకితో రెండు రోజులు కుస్తీపట్టి కిర్సనాయిల్‌తో క్లీన్ చేశాడు. తూటాలు కొన్నాడు. స్వర్గస్థులైన తాతగారి ఫోటో క్రింద గోడకు రెండు మేకులు దిగ్గొట్టి వాటికి తుపాకిని తగిలించి వివిధ కోణాల్లోంచి దాని అందాన్ని తిలకించి మురిసి పోతుండేవాడు. ఇహ వెంకట్రాజుకి మరో పనిలేదు - రోజూ వేటే. కొండల్లో, గుట్టల్లో, తుప్పల్లో, వాగుల దగ్గర, చెరువుల దగ్గర ఎక్కడ చూసినా వెంకట్రాజు తుపాకితో కన్పిస్తుండేవాడు. అచిర కాలంలోనే ఆ వూరిలో మంచి పిట్టల వేటగాడిగా గుర్తింపు పొందాడు. దాంతో అతనిలో గర్వం చోటు చేసుకుంది. పిట్టల వేటనుంచి పులివేటకి వొక్కసారిగా ఎదిగిపోవాలని తహతహలాడి పోతున్నాడు.
 
* * * 
 
    ఆ మధ్యాహ్నం వెంకట్రాజు రాములుతో ఆ చేలున్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ పందుల్ని వేటాడ్డానికి మాటు కోసం అనువైన పొదలకోసం చూశాడు. కానీ అవి లేకపోవడం వల్ల మాటు కట్టడానికి ఒకచోట గొయ్యిని తవ్వించాడు. చూట్టూ కంపలతోనూ, తుప్పలతోనూ కప్పాడు. దూరం నుంచి చూడ్డానికి తుప్పల్లో తుప్పలాగే వుంది.
 
    సూర్యుడు కృంగి పోతున్నాడు.
 
    పక్షులు గూళ్ళకు చేరుకుంటున్నాయి.
    
    ఫ్లాస్క్, టార్చ్లైట్ తూటాల్ని కిట్ బాగ్లో వెంకట్రాజు సర్దుకున్నాడు. గన్ని క్లీన్ చేశాడు. ఇంకా వెల్తురుండగానే రాములు యింట్లో కోడిమాంసంతో భోజనం చేశాడు. చీకటి పడుతుండగా రాముల్తో పందుల వేటకి బయల్దేరాడు. ఇద్దరూ మాటులోకి దిగి తిరిగి కొమ్మల్ని నరికిన డొంకల్ని మరొక్కసారి జాగ్రత్తగా అమర్చుకున్నారు.
 
    వెన్నెల విరగగాస్తోంది. ఆ కాంతిలో చెట్లు వింతశోభను సంతరించుకున్నాయి. చలిగా వుంది.  
తొమ్మిది గంటలు కావస్తోంది. 

    పందుల వేట వెంకట్రాజుకి క్రొత్త అనుభవం కావడం చేత అతనిలో కొద్దిగా భయం చోటు చేసుకుంది. కానీ దానికి మించి ఏదో ఎడ్వెంచర్ చెయ్యబోతున్నాననే ఉత్సాహం ఆ భయన్ని మింగేసింది.  
 
    అతనిలో ఎక్సైట్‌మెంట్, థ్రిల్, ఎప్పుడు పందులు దిగుతాయా అనే ఆతృత.
 
    అప్పుడప్పుడు దూరాన కొండల్లో ఏవో అరుపులు, వింతగా, వికృతంగా, భయంకరంగా విన్పిస్తున్నాయి.

    చేలలో చిన్న చప్పుడైతే చాలు అతను వులిక్కిపడుతున్నాడు. శరీరం రోమాంచితమౌతోంది. గుండె జల్లుమంటోంది. రివ్వున చలిగాలి వీస్తున్నా అతనికి చిరుచెమటలు పట్టేస్తున్నాయి. కళ్ళల్లో కొవ్వొత్తులు వేసుకొని పరిసరాల్ని ఏకాగ్రతతో పరికిస్తున్నాడు. పరిశీలిస్తున్నాడు.

    అర్ధరాత్రి దాటిపోయినా పందుల అలికిడి లేదు. వేట తమకంలో గంటలు నిముషాల్లా దొర్లి పోతున్నాయి. దూరంగా పల్లెలో కోడి కూసింది.

    వెంకట్రాజు రేడియం డైల్ వాచ్ చూసుకున్నాడు. రెండుగంటలయింది.

    "బాబుగారూ తుప్పలు కదులుతున్నాయండి" మెల్లగా చెవిలో చెప్పాడు రాములు. 

    వెంకట్రాజు తన చూపుల్ని తుప్పలపై నిలిపాడు. అవి గాలికి కదుల్తున్నాయి. ఏ జంతువు కనబడ్డం లేదు.

    వెన్నెల కృంగిపోతోంది.

    వెంకట్రాజుకు నిరాశ కలుగుతోంది.

    ఇంతలో -

    ఆ మనసక వెన్నెల్లో ఏదో నల్లని ఆకారం కదుల్తోంది. అడివిపంది, కాదు - ఒంటిడి...దూరానికి పొదల నీడలమధ్య మరీ పెద్దదిగా కన్పిస్తోంది.

    వెంకట్రాజు వొళ్ళు జల్లుమంది. ఎంత పెద్ద పందో!

    ఊపిరి బిగవట్టాడు. వొణుకుతున్న చేతుల్ని నిభాయించుకున్నాడు. గన్ సేఫ్టీ కేచ్ తొలగించాడు. తుపాకీ భుజానికి లేచింది.

    రాములు ఉద్వేగంతో చూస్తున్నాడు.

    ధన్ - ధన్ - రెండు బారక్స్ పేలాయి.

    ఆ శబ్దంతో ఆ ప్రదేశమంతా మార్మ్రోగిపోయింది.

    గురి తప్పలేదు. పంది నేలమీద పడి పోయి దబదబమని తన్నుకొంటోంది. ఉండుండి చిన్న గురక, బుసలు, మరణాయాసం.

    సక్సెస్ - గ్రాండ్ సక్సెస్ - తుపాకిని ముద్దు పెట్టుకొని మాటులో లేచి నిలబడ్డాడు వెంకట్రాజు. 

    రానురాను పొదల్లో శబ్దం తగ్గిపోయింది. 

    "ఒంటిడి చచ్చి పోయింది - పదా" అన్నాడు వెంకట్రాజు. 

    "ఇంత పెద్ద పందిని నేనెప్పుడూ చూడలేదు బాబోయ్. ఎంత పెద్ద వొంటిడో" అనుకుంటూ రాములు ఆనందం పట్టలేక వెంకట్రాజు కంటే ముందే పరుగెత్తి, తుప్పుల్నీ, డొంకల్నీ దాటుకుంటూ పంది పడివున్న దగ్గర కెళ్ళాడు. తుప్పలు చిందరవందరగా తన్నేస్తున్నాయ్. రాములు భయపడ్తూ, భయపడ్తూ మెల్లగా పొదల్లోకి చూశాడు.

    అంతే-

    రాములు నిర్ఘాంతపోయాడు.

    వెనుకే వచ్చిన వెంకట్రాజు షాక్ తిన్నాడు.

    ఆ చచ్చి పడింది గేదె.

    "పొట్టి కొమ్ముల్ది. ఇది నా గేదే" గొల్లుమన్నాడు రాములు. 

    "ఏవిఁటీ! నీ గేదా?!" బిక్కచచ్చిపోయాడు వెంకట్రాజు.

    "వారం పదిరోజుల కిందే దీన్ని తొమ్మిదొందలెట్టి కొన్నాను. రేత్రి కట్టిడిపోయి సేలో జొరబడి పోనాదిగావాల" ముంచుకొస్తున్న దుఃఖంతో తలపట్టుకొని కుప్పకూలిపోయాడు రాములు. వెనువెంటనే తేరుకొని వెంకట్రాజు మీద విరుచుకు పడ్డాడు.

    "చాల్చాల్లేవయ్యా! గొప్ప ఏటకాడివి దొరికేవు. పందని నా ఎయ్యి రూపాయల గేదెను కొట్టేత్తావా? ఆ డబ్బు మర్యాదగిచ్చుకో. లేకపోతే నా సంగతి నీకు తెల్దు. పంది గుండెకాయ తింటాడట ఏటగాడు" అని చచ్చిపడివున్న గేదెవైపు తిరిగి బాధగా చూస్తున్నాడు.

    హఠాత్తుగా - 

    తుప్పల మీద నుంచి జరజరమని చప్పుడైంది. 

    రాములు వెనక్కితిరిగి చూశాడు. ప్రక్కనున్న వెంకట్రాజు లేడు.

    "పట్టుకోండి. పట్టుకోండీ" పారిపోతున్న వెంకట్రాజు వెనుక పరిగెత్తుతూ రాములు అరుస్తున్నాడు.

    వెంకట్రాజు తుపాకీ పుచ్చుకొని గుట్టల్నీ, రాళ్ళనీ దాటుకుంటూ, తుప్పల మీద నుంచి, డొంకల మీద నుంచి ఎగురుకుంటూ ఊరి వైపు దౌడు తీస్తున్నాడు.

    తూరుపు కొండల మీద వెలుగు రేఖలు చిక్కబడ్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రిక 29-10-1982 సంచికలో ప్రచురితం)     
 
Comments