విందైన వంటకం -ఎస్వీ.కృష్ణ జయంతి

    
"సమరానికి నేడే ప్రారంభం... గృహరాణికి మూడెను ప్రారబ్ధం... భువర్లోకమున ధరల ధాటికి ఎదురే లేదని చాటిద్దాం...జైజై చక్కెర...జై కందిపప్పూ...జైజై శనగనూనె! జయహో మినప్పప్పూ - జయజయహో దొడ్డు బియ్యం!!"

    అదేదో సినిమాలో పాటకి అనుగుణంగా పదాలు మార్చి పాడ్తున్న  పన్నెండేళ్ల కొడుకు 'నాని'గాడి పాట విని - వంటగదిలో పనిలో నిమగ్నమై వున్న భారతికి నవ్వూ, దుఃఖమూ రెండూ ఒకదానివెంట ఒకటి తన్నుకొచ్చాయ్.

    నానిగాడు మహాచురుకు పిల్లాడు! వాడికి చదువు, తెలివితేటలు, లౌకిక జ్ఞానం అన్నీ ఎక్కువే. పైగా అస్తమానం జోకులు వేస్తూ తెగ నవ్వించడమే గాక విసిగిస్తాడు కూడా!

    భారతి భర్త గంగాధర్ ప్రభుత్వోద్యోగి. మరీ పెద్ద ఆఫీసర్ కాకపోయినా, మధ్య తరగతి కుటుంబాన్ని 'మధ్యస్థం'గా కొనసాగించడానికి సరిపడా జీతభత్యాలున్నాయి. అప్పటివరకూ ఏ సమస్యలూ, బాదరబందీలూ లేవు. ఇంటి ఖర్చులకీ, నెలకి - రెండుసార్లు సినిమాలీకీ, ఓసారి హోటల్‌కీ వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితేమీ లేదు.  

    అంతేకాదు, నానిగాడి చదువుకీ, స్కూలు ఫీజులకీ 'అప్పులు' చేయడాలూ, ఆఫీసులో 'అడ్వాన్సులు' తీసుకోడాలు, 'లోన్‌లకి అప్లయ్' చేయడాలూ లాంటి అవసరం కూడా అప్పటివరకూ రాలేదు. ఒడిదుడుకుల్లేక అంతా సవ్యంగానే గడుస్తోందా సంసారానికి.

    అయితే...నిత్యజీవితానికి సంబంధించిన విషయాల్లో ఈ మధ్యే అకస్మాత్తుగా 'తేడా' వచ్చింది ఆ కుటుంబంలో.  

* * *

    భారతి వంట బాగా చేస్తుంది...

    ముఖ్యంగా 'పప్పు కూరలు' మహా బాగా చేస్తుంది. ముద్దపప్పు, మామూలు పప్పు, పాలకూర పప్పు, ఆనపకాయ పప్పు, వగీరా వగైరా... అసలు - 'పప్పు'తో కూడిన ఏ కూర చేసినా అదిరిపోవాల్సిందే! తినేవాళ్ళ చవులూరాల్సిందే!!

    అందుకే...గంగాధర్ ఆఫీసుకీ, నానిగాడు స్కూలుకీ బయల్దేరేటప్పుడు - మధ్యాహ్నం భోజనాన్నికి క్యారియర్‌లో "ఈరోజు ఏం పప్పుకూర సర్దావ్?" అని ఒకటికి నాలుగుసార్లు కన్‌ఫర్మ్ చేసుకునిగానీ ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టరు. నానిగాడికంటే గంగాధర్‌కే పప్పుకూరలంటే మహాప్రీతి. పప్పుతో తిన్నప్పుడే సుష్ఠుగా  భోంచేశానన్న తృప్తి కలుగుతుందంటాడతను తరచూ.

    ఇక ఆ'తృప్తి' కలకాలం నిలిచేది కాదనీ, ఆ'అనుభూతి' ఎల్లకాలం మిగిలేది కాదనీ, ఆవీరైపోయే ఆపద ముంచుకొచ్చిందన్న విషయం ఈ మధ్యే ఆ కుటుంబానికి అనుభవపూర్వకంగా అర్థమైంది.

    భర్తకి వెసులుబాటున్న రోజున వీలుచేసుకుని ఏదైనా సూపర్‌బజార్‌కి వెళ్లి నెలకి సరిపడా సరుకుల్ని ఒక్కసారే కొనితెచ్చుకుని నెల పొడవునా జాగ్రత్తగా, పొదుపుగా వాడడం భారతికి అలవాటు. క్రితం నెల 'షాపింగ్'లో - పెరిగిన సరుకుల ధరల్ని చూసినప్పటినుండీ ఆమె గుండె సక్రమంగా పనిచేయడం మానేసింది.

    కానీ, డిగ్రీదాకా చదువుకున్న 'ఎడ్యుకేటెడ్ లేడీ' కావడం వల్ల 'కష్టసుఖాలు' కావడి కుండలనీ, లాభనష్టాలు కలకాలం వుండవనీ...అనుకుంటూ తనకు తానే ధైర్యం చెప్పుకుని - 'పాజిటివ్ థింకింగ్'తో గుండె నిబ్బరం పెంచుకుని ఎలాగోలా ఆ నెల నెట్టుకొచ్చేసింది.

    తిరిగి ఈ నెల - తీరిక చేసుకుని సరుకులు కొనడానికి కొడుకు  నానిగాడితో పాటు బైక్ మీద భర్త వెనకాల కూర్చుని షాపింగ్‌కి బయల్దేరింది భారతి.

    షాపులోకి అడుగుపెట్టిన వెంటనే రొటీన్‌గా ట్రాలీ నెట్టుకుంటూ రాక్స్ దగ్గరికి వెళ్లి ఇంటికి అవసరమైన సరుకుల్ని అందులో పడేసుకుంటూ వెళ్లసాగింది భారతి. సరుకులు తీసుకోవడం పూర్తి చేసుకుని ఆమె బిల్లింగ్ కౌంటర్ దగ్గరికొచ్చేసరికి 'టైం' పడ్తుంది కాబట్టి - అప్పటివరకూ షాపంతా కలియ తిరుగుతూ...షాపింగ్‌కు వచ్చినవాళ్ళ వంక ఎగాదిగా చూస్తూ...తనకు నచ్చిన ప్రొడక్ట్స్ వున్న రాక్స్ దగ్గర నిలబడి గడపటం గంగాధరానికి అలవాటు.  

    అదే అలవాటుకొద్దీ షాపులో అటూఇటూ దిక్కులు చూస్తూ తచ్చాడుతున్న గంగాధర్‌కి అకస్మాత్తుగా 'సిక్స్త్ సెన్స్' మేల్కొని - గత నెల 'షాపింగ్ అనుభవం'తో పాటు తన 'మనీ పర్సుపై పడ్డ పెనుభారం' గుర్తొచ్చింది.

    అంతా...ట్రాలీలో సరుకులు వేసుకుంటూ ముంద్కు సాగుతున్న భార్యా, కొడుకూ ఉన్నచోటికి గబగబా పరిగెత్తాడు. వాళ్ళు తీసుకున్న వస్తువుల్ని తీసుకుని వాటి మీదున్న రేట్ల వంక పరీక్షగా చూశాడు. ఎందుకో...ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మినట్టయ్యింది గంగాధర్‌కి.

    "భారతీ...ఇవి మనం రెగ్యులర్‌గా కొనే సరుకులేనా? లేక, వేరే గ్రహంలో తయారై ఇండియాకి ఇంపోర్ట్ అయిన 'అదర్ ప్లానెట్' ప్రొడక్ట్‌లా?" అన్నాడు కంగారుగా.

    "చాల్లెండి...మీరూ, మీజోకులూనూ! మేమింత జాగ్రత్తగా, సీరియస్‌గా షాపింగ్ చేస్తుంటే...మీరేంటి ఇలా జోకులేసి డిస్టర్బ్ చేస్తారు? ఇవన్నీ మనం ప్రతినేలా కొనే ఉప్పూ పప్పులే!" అంది భారతి భర్తని విసుక్కుంటూ. 

    "జోకులు కాదే...పిచ్చి మొహమా! నేను సీరియస్‌గానే అడుగుతున్నాను - ఇవి వేరే గ్రహంలో తయారైనవి కాకపోతే... మరి, వీటి రేట్లేంటి ఈ 'రేంజ్'లో ఉన్నాయి...చంద్రమండలాన్ని దాటిపోయేట్లు??" ట్రాన్స్‌లోంచి ఇంకా బయటికి రాకుండానే అన్నాడు గంగాధర్.

    "అందుకే కదా... నేనింత జాగ్రత్తగా, సీరియస్‌గా, పూర్తి కాన్‌సన్‌ట్రేషన్‌తో ఎంతో అవసరమైన సరుకులు మాత్రమే తీసుకుంటున్నాను!" అంది భారతి - తన టాలెంట్‌ని తెలుపుతూ.

    అప్పటికి కాస్త తేరుకున్నట్లున్నాడు గంగాధర్ - "అది కాదు భారతీ! ఈ రేట్లు చూస్తుంటే... నాకు కళ్ళు తిరిగి, గుండె ఆగి ఆగి కొట్టుకుంటున్నట్లుగా ఉంది!" అన్నాడు.

    "మీకే కాదు - నాకూ కళ్ళూ, గుండె ఉన్నాయ్! అయినా... మనం బతకాలి కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ తట్టుకోవాలి మరి!" భర్త వంక జాలిగా చూస్తూ ధైర్యం చెప్పింది భారతి.

    "ఏంటో...ఇది కలో, నిజమో అర్థం కావడం లేదు నాకు!"

    "ఆనందమో, ఆశ్చర్యమో కలిగినప్పుడు అలా అనాలి కాని - ఇలాంటి ఆపదలొచ్చినప్పుడు కాదు!" భర్త భావప్రకటనని సరిచేసింది భారతి.

    చప్పున పాటందుకున్నాడు నానిగాడు "కలకానిదీ, విలువైనదీ...బ్రతుకు - కన్నీటి ధారలలోనే బలిచేయకూ!" అని. చాటుగా కొడుకు వీపు గిల్లింది భారతి - "ష్‌ష్‌ష్‌ష్... ఆపరా! అసలే మీనాన్న 'తెలుగు సినిమాలు చూసి కంటతడి పెట్టుకునేంత' సెన్సిటివ్!" అంది గుసగుసగా.

    నానిగాడు ఠక్కున 'స్పీకర్' ఆఫ్ చేశాడు. అంటే...నోర్మూసుకున్నాడు.

    షాపింగ్ పూర్తిచేసుకుని బిల్లింగ్ కౌంటర్ దగ్గరకొచ్చారు ముగ్గురూ.

    ట్రాలీలోని సరుకుల్ని ఒక్కొక్కటే పైకి తీసి, వాటి రేట్లు చూస్తూ 'కీ - బోర్డు'పై వేగంగా వేళ్లు కదిలిస్తూ కంప్యూటర్ బిల్లు తయారు చేస్తున్న కౌంటర్‌లోని క్లర్క్ వంక గుండెలు చిక్కబట్టుకుని, కనుగుడ్లు మిటకరించి బిక్కుబిక్కుమంటూ చూడసాగాడు గంగాధర్.

    బిల్లు తయారైంది!

    'సర్ర్‌ర్ర్‌ర్ర్...'మంటూ చింపి కౌంటర్‌లోని క్లర్క్ అందించిన బిల్లుని చేత్తో తీసుకుని, దానివంక చూసిన గంగాధర్‌కి - గుండె ఆగినట్లయి, స్పృహ తప్పుతున్నట్లనిపించింది.

    అసంకల్పితంగా "ఒరే నాని...భారతీ..." అంటూ ఆసరా కోసం కౌంటర్ పక్కనున్న గోడకి ఆనుకుని ఊపిరి భారంగా తీసుకోసాగాడు గంగాధర్.

    "ఏమైందండీ..." అంటూ కంగారుగా భర్త దగ్గరి కొచ్చింది భారతి. 

    కౌంటర్‌లోని క్లర్క్ కాస్త ముందుకి వంగి "మేడం...ఎనీ ప్రాబ్లం?" అన్నాడు భారతి వంక చూస్తూ.

    వెనక్కి తిరిగి అతడి వైపు చూస్తూ "అదీ..." అంటూ ఎదో అనబోయింది భారతి.

    "డోంట్ వర్రీ మేడం...ఈ మధ్య షాపుల్లోకి వచ్చిన కొంతమంది మగవాళ్ళు ఇలాగే బిల్లింగ్ కౌంటర్ దగ్గర అబ్‌నార్మల్ స్టేట్‌లోకి వెళ్లి అన్‌కాన్షస్ అవుతున్నారు. భయపడాల్సిందేమీ లేదు. జస్ట్... 'ఫస్ట్ ఎయిడ్' చేస్తే మళ్లీ నార్మల్ స్టేట్ కొచ్చేస్తారు. ఎందుకైనా మంచిదని మా కస్టమర్స్ కోసం ఓ 'వన్నాట్ ఎయిట్' అంబులెన్స్‌ని కూడా రెగ్యులర్‌గా మా షాపు ముందే రెడీగా ఉండే ఏర్పాట్లు చేశాం. సో... 'ఫస్ట్ ఎయిడ్' లేదా 'వన్నాట్ ఎయిట్' - మీకేది అవసరమైతే దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు!" చాలా కూల్‌గా చెప్పాడతను. 

* * *

    "భారతీ...ఓసారిలారా!" భోజనానికి కూర్చుంటూ భార్యని కేకేశాడు గంగాధర్.

    బాల్కనీలో బట్టలు ఆరేస్తున్న భారతి - భర్త కేకకి గబగబా లోనికొచ్చింది - "ఏమిటండీ...ఏమైందీ?" అంటూ.

    "మన నానిగాడి అల్లరి రోజురోజుకీ మితిమీరి పోతోంది...వాడ్ని నువ్వు కంట్రోల్‌లో పెట్టట్లేదు!"తీవ్రంగానే అన్నాడు గంగాధర్. భర్తకి కోపం తెప్పించే పనేదో నానిగాడు చేసెవుంటాడనుకున్న భారతి -

    "మళ్లీ ఏం చేశాడండీ?" అంది అనునయంగా.

    "చూడు...ఏం చేశాడో!?" అంటూ తన ముందున్న ప్లేటు వంక చూపించాడు.

    "ఏం చేశాడూ...?"అంటూ ముందుకి వంగి ప్లేటులోకి పరీక్షగా చూసింది.

    "ఏం... వేళాకోళమా? అన్నం ప్లేటులో ఒలకబోసిన నీళ్లు నీక్కనిపించట్లేదా?" రుసరుసలాడాడు గంగాధర్.

    "ఓస్...ఇదా?" అంటూ తేలిగ్గా  నిట్టూర్చి - "ఈ పని చేసింది వాడు కాదు... నేను!" అంది.

    "ఏంటీ...నువ్వా?"

    "ఔను...నేనే! అయినా...మీరనుకుంటున్నట్లుగా అవి నీళ్లు కావు!"

    "మరి...??"

    "చారు...పప్పుచారు! మీరెంతో ఇష్టపడే మీకు నచ్చిన కూర!"

    నివ్వెరపోయాడు గంగాధర్ - "ఏమిటీ... ఇది చారా? పైగా, నాకెంతో ఇష్టమీన పప్పుచారా?" అంటూ ప్లేటందుకుని పైకెత్తి పట్టుకుని, కంటికి దగ్గరగా పెట్టుకుని మరీ పరీక్షగా చూసి -"న్నో.." అని అరిచాడు.

    "మీరు 'నో' అన్నా 'నై'అన్నా...ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా... అది పప్పుచారే!" కుండబ్రద్దలు కొట్టినట్లు ఘంటాపథంగా చెప్పింది భారతి. 

    అయోమయంగా చూశాడు గంగాధర్ - "అది కాదు భారతీ! ఈ నీళ్లలో - సారీ...నువ్వనే ఈ 'పప్పుచారు'లో కందిపప్పు రేణువులు కంటికి కనిపించే రేంజ్‌లోనైనా వున్నాయా...? చూసి నువ్వే చెప్పు! మైక్రోస్కోప్‌లో చూస్తే అయినా కనిపిస్తాయంటావా?" అన్నాడు.

    "కందిపప్పుని మరపట్టించి పిండి చేయించి 'పప్పుచారు' చేశాను. మరి, వారానికి నాలుగుసార్లు చొప్పున కిలో కందిపప్పు మూడ్నెల్లయినా రావాలా, వద్దా?" ఎదురు ప్రశ్నించింది భారతి.

    "అలాగని..." అసహనంతో గంగాధర్ ఏదో అనబోయేంతలో...

    "మీరు ఎన్నైనా చెప్పండి... ఇక మీదట మీకిష్టమైన పప్పుకూరలన్నీ మనింట్లో ఇలాగే వుంటాయ్!" ఖండితంగా చెప్పేసింది భారతి.

    "అది కాదు భారతీ! అసలు నేను చెప్పేది..." అంటూ మళ్లీ గంగాధర్ ఏదో అనబోతుండగా...

    " ఏమిటండీ మీరు చెప్పేది? చాలామని తమ ఇళ్ళల్లో పప్పుకూరలు వండడమే మానేశారు...తెలుసా? కానీ, పప్పంటే మీకెంతిష్టమో, అది లేనిదే మీకు గొంతులోకి ముద్ద దిగదని నాకు తెలుసు కాగట్టి నేనింకా మానేయలేదు...తెలుసా? నన్నూ, నా మనసునీ అర్థం చేసుకోవాల్సింది పోయి - ఇలా తప్పు పడ్తారా?" అంది భారతి కొంచెం తీవ్రంగానే.

    "అలాగని... ఇలాగా చేయడం? అసలు..."

    గంగాధర్ మాటలు పూర్తికాకుండానే ఒక్కసారిగా బరస్ట్ అయ్యింది భారతి -

    "మీరేమనుకున్నా సరే... నాకు మీ ఇష్టాయిష్టాల కంటే మీ క్షేమం ముఖ్యమండీ! మొన్నటికి మొన్న సరుకులు కొనడానికి షాపు కెళ్లినప్పుడు ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయారా? మీరలా కళ్లు తిరిగి, గుండె చిక్కబట్టుకోవడాని క్కారణం... ఈ కందిపప్పు రేటే కదూ!?" గొంతు గాద్గదికమై - గుండెలోంచి దుఃఖం ఎగదన్నుకొస్తూంటే...

    "మీకు...మీకు...మీకు... ఏమైనా అయితే..." అంటూ వెక్కిళ్ళ మధ్యమాట పెగలక - ఒక్కసారిగా అతడి గుండెల మీద వాలిపోయి, "...నేనూ, నానిగాడూ ఏమయిపోతామండీ...!?" అంటూ బావురుమంది భారతి.

    బిక్కమొహంతో చేష్టలుడిగిపోయి నిల్చుండిపోయాడు గంగాధర్.
 
* * *

    నెల రోజుల తర్వాత - ఓ రోజు సాయంత్రం...

    "ఏమిటి భారతీ...మాట్లాడవ్?" పదకొండోసారి అడిగాడు గంగాధర్ భార్యని.

    "ఏంటి నాన్నా...అమ్మ ఏం మాట్లాడాలీ?" అప్పటిదాకా బయట ఆడుకుని వచ్చి, కాళ్లూచేతులూ కడుక్కొని చదువుకోవడానికి బుక్స్ ముందేసుకుని కూర్చుంటున్న నానిగాడు అడిగాడు నాన్నని.

    గంగాధర్ నానిగాడి వైపు తిరిగి "ఏంలేదు నాన్నా...రేపు నా బర్త్ డే! అంటే...నేను పుట్టినరోజన్న మాట! రేపు ఆఫీసుకి సెలవు పెట్టాను. ప్రతీ సంవత్సరం నా బర్త్‌డేని చాలా బాగా సెలెబ్రేట్ చేసుకుంటాం కదా! అలాగే 'రేపు ఉదయాన్నే అందరం ఇంట్లోంచి బయల్దేరి 'వాటర్ వరల్డ్'కో, 'స్నోవరల్డ్'కో, లేదా ఏదైనా చక్కటి పిక్‌నిక్ స్పాట్‌కో వెళ్లి సరదాగా గడిపి, మధ్యాహ్నం ఏదైనా హోటల్‌లో లంచ్ చేసి, ఆ తర్వాత పార్క్‌కీ, ట్యాంక్‌బండ్‌కీ వెళ్లి, అట్నుంచి 'ఐ-మాక్స్'లో సినిమా చూసి, వచ్చేటప్పుడు మళ్లీ ఏదైనా హోటల్‌లో డిన్నర్ చేసొద్దాం...ఏమంటావ్?' అని మీ అమ్మని ఇందాకట్నుంచీ అడుగుతున్నాను. కానీ, అమ్మేమీ రెస్పాన్స్ ఇవ్వట్లేదురా కన్నా!" అన్నాడు.

    "వావ్...వండ్రఫుల్! మరి, అమ్మ ఎందుకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు నాన్నా? ఈ ప్రోగ్రాం అమ్మకి నచ్చలేదా" అర్థం కానట్లు అడిగాడు నానిగాడు.

    "ఏమో...నాకేం తెలుసూ? మీ అమ్మనే అడుగూ...!" ఖాళీ చేసిన కాఫీ కప్పును తన చేతిలోంచి అందుకోడానికి ముందుకి వంగిన భారతి కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూస్తూ అన్నాడు గంగాధర్.  

    "ఏమ్మా! నాన్న చెప్పిన ప్రోగ్రాం  నీకు నచ్చలేదా?" అర్థంకానట్లు చూశాడు నానిగాడు తల్లివంక.

    "ఊహు... నచ్చలేదు!" అంది భారతి - నానిగాడి వంక నవ్వుతూ చూస్తూ.

    "వ్వాట్ట్...నచ్చలేదా?" ఉలిక్కిపడ్డాడు గంగాధర్ - "ఇంతకంటే గొప్ప ప్రోగ్రాం ప్లాన్ చేయగలవా నువ్వు?" అన్నాడు బింకంగా భార్యవంక చూస్తూ.

    "చేయగలను! అంతేకాదు, అది వింటే మీకు కూడా నచ్చుతుంది. మీరు అ సంతోషంగా ఒప్పుకుంటారు!" తల పైకెగరేస్తూ అంతే కాన్ఫిడెన్స్‌తో అంది భారతి.

    "ఏంటమ్మా...అదీ?" నానిగాడు గోముగా అడిగాడు.

    "చెప్తాను కానీ...మీ నాన్నకి ఇంట్రెస్ట్ లేనట్లుందిరా! ఆయన్ని కూడా అడగమను - చెప్తాను!" అంది ఊరిస్తున్నట్లుగా.

   "చెప్పు...చెప్పు... రేపెక్కడికి వెళ్దామో?! ఆ 'స్పాట్' అంత బాగుండేదైతే నేనెందుకు కాదంటానూ?!" అన్నాడు గంగాధర్ ఉడుక్కుంటూనే.

    నవ్వుతూ చెప్పింది భారతి - "ఎక్కడికీ వెళ్లక్కర్లేదు...ఆ 'స్పాట్' మనిల్లే! రేపుదయం మీరిద్దరూ నిద్రలేచి స్నానాలు ముగించే టైమ్‌కి - డైనింగ్ టేబుల్ మీద 'ముద్దపప్పు, మామూలు పప్పు, దోసకాయ పప్పు, గోంగూర పప్పు, పాలకూర పప్పు, ఆనపకాయ పప్పు'ఇంకా చిక్కటి 'పప్పుచారు' కూడా సిద్ధంగా వుంటాయ్... ఓక్కే!"

    అంతే..."వావ్...వండ్రఫుల్!" అంటూ నానిగాడు, "య్యురేకా...రియల్లీ యువార్ గ్రేట్ భారతీ!" అంటూ గంగాధర్...ఆపుకోలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

    ఆ తర్వాత - "బర్త్‌డే భోజనంబూ...విందైన వంటకంబూ..." అంటూ నానిగాడు పాటందుకునేసరికి - తనివితీరా నవ్వేశారు భారతి, గంగాధర్‌లు.

(ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక నవంబర్ 2009 సంచికలో  ప్రచురితం)    
Comments