వృక్షవేదన - పాలపర్తి జ్యోతిష్మతి

    నేనిక్కడికి వచ్చి పదిహేను రోజులవుతోంది. ఈ పదిహేను రోజుల్లో జీవితం పట్ల నా దృక్పథంలో వచ్చిన మార్పు నాకే ఆశ్చర్యం కలిగిస్తోంది. నేను ఇక్కడికి వచ్చిన రోజున ఎలాగోలా ప్రాణాలు నిలబడితే చాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఎందుకు బతికి బయటపడ్డానా అని దుఃఖపడుతున్నాను.
    ఇక్కడికి రాకపూర్వం నేను ఒక రోడ్డు పక్కన నిలబడి ఉండేదాన్ని. నాకు కుడివైపు ఒక నేస్తురాలు, ఎడమవైపు ఒక మిత్రురాలు ఉండేవాళ్ళు. ముగ్గురం ఒకే ఈడు వాళ్ళం కావదంతో ఎంతో స్నేహంగా మసలేవాళ్ళం. మాకు ఒకవైపు ఉన్న రోడ్డుమీద రకరకాల వాహనాలు తిరుగుతుండేవి. రెండోవైపు పచ్చటి పొలాలు ఉండేవి.

    ఒకరోజు కొంతమంది మనుషులు ఏవేవో పరికరాలు పట్టుకొచ్చి రోడ్డు కొలతలు వెయ్యడం మొదలుపెట్టారు. వాళ్ళ మాటల్నిబట్టి ఆ రోడ్డుని వెడల్పు చెయ్యబోతున్నారని మా కర్థమయింది.
    'రోడ్డు వెడల్పు చెయ్యడానికి మేము అడ్డమవుతామేమో! మా అడ్డు తొలగించుకోడానికి మమ్మల్ని కొట్టేస్తారేమో' అన్న ఆలోచన రావడంతో నిలువెల్లా కంపించిపోయాం. మాకు ఇదే చివరి రోజన్న నిర్ణయానికి వచ్చేశాం.
    జరగబోయేది తలుచుకుని బాధపడుతూ, ఒకరినొకరం ఓదార్చుకుంటూ, మా మీద గొడ్డలి దెబ్బ ఎప్పుడు పడుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఆ మనుషుల ప్రతి కదలికనీ గమనిస్తున్నాం.
    'మమ్మల్నిలా నాశనం చేసుకుంటూ పోతే ఈ భూమిమీద మీ మనుగడే ప్రమాదంలో పడితుందిరా పిచ్చి మానవులారా!' అని ఆక్రోశించాం.

    ఇంతలో మరోవైపునుంచి ఇంకొంతమంది మనుషులు గబగబా వచ్చారు. వాళ్ళు వృక్ష ప్రేమికులట! చెట్లని నరకడానికి వీల్లేదని పట్టుబట్టారు.

    రహదారులు నాగరికతకు చిహ్నాలట. ఇప్పుడు ఉన్న ఈ చిన్నచిన్న రోడ్లనే ఉపయోగించుకుంటూ, అభివృద్ధిచెందిన దేశాలతో పోటీపడి, అగ్రరాజ్యాల సరసన నిలవగలగడం అసాధ్యమట. అందువల్ల రోడ్ల విస్తరణ జరగవలసిందేనట. అడ్డు వచ్చిన దేన్నైనా నిర్దాక్షిణ్యంగా తొలగించక తప్పదట. ఇదీ అవతలివాళ్ళ అభిమతం.

    ఎండలో నిలబడి సాయంత్రందాకా వాదించుకుంటూనే ఉన్నారు ఇరువర్గాలవాళ్ళూ.

    చివరికి అంతా కలిసి ఒక అంగీకారానికి వచ్చారు. మమ్మల్ని వేళ్ళతోసహా పెకిలించి వేరేచోట పాతుతారట.

    అంతా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మా పరిస్థితేమిటో మా కర్థం కాలేదు. 'ఇంత పెద్దవాళ్ళ మయ్యాక మమ్మల్ని తీసుకెళ్ళి వేరేచోట ఉంచడం సాధ్యమయ్యే పనేనా?' అని దిగులు పడుతుండగానే చీకటి పడింది. మళ్ళీ తెల్లవారింది. మా జోలికి ఎవరూ రాలేదు. రెండురోజులు ప్రశాంతంగా గడిచి 'ఇంకేం ఫరవాలేదు. మనల్ని ఎవరూ ఏమీ చెయ్యరు ' అని ధైర్యంగా ఊపిరి పీల్చుకున్నామో లేదో పెద్దపెద్ద యంత్రాలని తీసుకుని అంతా వచ్చేశారు. వరసగా ఒకరి తరువాత ఒకరుగా మమ్మల్ని భూమిలోంచి బయటికి తీసి పెద్దపెద్ద వాహనాలలో ఎక్కించి తలా ఒకవైపుకు తీసుకెళ్ళారు. అట్లా ఇక్కడికొచ్చి పడ్డాన్నేను.
    నా చుట్టూ ఉన్న మట్టిని పెళ్ళగిస్తుంటే, ఉన్నచోటునుంచి కదలడం ఇష్టంలేక వేర్లతో నా కింది భూమిని గట్టిగా పట్టుకుని గింజుకున్నాను. ఆ పెనుగులాటలో నా వేర్లు కొన్ని దెబ్బతిన్నాయి. ఇంకొన్నివేర్లు తెగిపోతే నేను బతకడం అసాధ్యం అనిపించింది. మానవ సంకల్పానికి, యంత్రాల బలానికి తలవంచక తప్పలేదు. లొంగిపోయాను.

    నన్నెక్కించిన వాహనం గతుకుల రోడ్డుమీద ఊగిపోతూ వెళుతుంటే ఒళ్ళు హూనమైపోయింది. నా ఆకులన్నీ వాడిపోయి మొహాలు వేళ్ళాడేశాయి. ఒళ్ళంతా నీరసం ఆవహించింది.

    ఇక్కడొక పెద్ద గొయ్యి తీసి దాంట్లో నన్ను కుదేసి గొయ్యి పూడ్చేశారు. నేనెక్కడ అటూఇటూ కదిలిపోతానో, పక్కకి వాలిపోతానో అని వెంటనే గబగబా నా చుట్టూ సిమెంటు చప్టా కట్టేశారు. నన్ను కదలకుండా బిగించేశాక ఒక బుంగడు నీళ్ళు నా మొదలు దగ్గర కుమ్మరించి చేతులు కడిగేసుకున్నారు. నా భారీ కాయానికి, నేను పడిన హైరానాకి, ఆ కాసిని నీళ్ళు ఏ మూలకి సరిపోతాయి? ప్రాణాలమీద ఆశ
వదులుకున్నాను.

    ఆరాత్రి కుంభవృష్టి కురిసింది. వానలో తడుస్తున్న ఆ క్షణాన నిలువెల్లా పులకించిపోయాను. జీవించి ఉండగలనన్న నమ్మకం చిగురించింది. తెల్లవారి సూర్యకిరణాల స్పర్శ తగిలేటప్పటికీ శరీరమంతా కొత్త శక్తి ప్రసరించడం మొదలుపెట్టింది. ఉత్సాహంగా పరిసరాల్ని గమనించసాగాను.

    ఇదొక ఫ్యాక్టరీ ఆవరణ. ఫ్యాక్టరీనుంచి విడుదలయ్యే బొగ్గుపులుసు వాయువు పీల్చుకోడానికి నేను ఇక్కడ అవసరమయ్యాను. ఎంత నిక్కినిక్కి చూసినా చుట్టుపక్కల నా జాతివాళ్ళు ఒక్కరైనా కనిపించకపోవడంతో మనసంతా వెలితిగా అనిపించింది. నా స్నేహితురాళ్ళు గుర్తుకొచ్చారు. రాత్రి పగలు తేడా లేకుండా గాలి వీచినప్పుడల్లా ఆకులూ, రెమ్మలూ రాసుకుంటూ ఊసులాడుకునేవాళ్ళం. 'వాటిని ఎక్కడికి తీసుకెళ్ళారో? అవి రెండైనా ఒకచోటికి చేరాయో లేక చెరోదారి అయిందో? రాత్రి అంత వాన కురవబట్టి నేను బ్రతికి బయటపడ్డాను. వాటిని తీసుకెళ్ళినచోట వాతావరణం ఎట్లా ఉందో? ఇంత శ్రమకి తట్టుకుని అవి ప్రాణాలతో ఉన్నాయో లేదో?'

    నేను ఆలోచనల్లో ఉండగానే ఫ్యాక్టరీ కార్మికులు ఒక్కరొక్కరుగా రావడం మొదలుపెట్టారు. అందరూ నావైపు వింతగా చూస్తూ వెళుతున్నారు. నాగురించే మాట్లాడుకుంటున్నారు. సందడి పెరగడంతో నేను అక్కడ జరుగుతున్న పనుల్ని చూస్తూ ఒంటరితనాన్ని తాత్కాలికంగా మర్చిపోయాను.

    చెవులు చిల్లులుపడే శబ్దాలు, యంత్రాల రొద, మనుషుల అరుపులతో పగలంతా గడిచింది. నెమ్మదిగా సూర్యుడు పడమటి దిక్కుకు వెళుతుండగా, ఇక్కడి జనం కూడా ఇళ్ళకి వెళ్ళడం మొదలుపెట్టారు. చీకటి పడేటప్పటికీ మళ్ళీ ఒంటరితనమూ, విచారమూ నామీద దాడి చేశాయి.

    నేను రోడ్డు పక్కన ఉన్నప్పుడు ఇరవైనాలుగు గంటలూ అటూఇటూ తిరిగే వాహనాల చప్పుళ్ళు వినిపిస్తుండేవి కానీ ఇంత శబ్దకాలుష్యం నేనింతవరకూ ఎరగను. పైపెచ్చు ఉభయసంధ్యల్లో పక్షుల కిలకిలారావాల సంగీతం మనోహరంగా వినిపించేది.

    నా కొమ్మలనిండా పక్షుల గూళ్ళు ఎన్నుండేవో! ఉదయం లేచి ఆహారం కోసం అమ్మానాన్నలు గూడు విడిచి వెళుతుంటే పిల్లల మారాం, సాయంత్రం తిరిగి రాగానే అవి చేసే గారం చూస్తే ముచ్చటేసేది. తల్లిదండ్రులు ఆ పిల్లలకి తాము లేని సమయంలో ఏ ఆపద వస్తుందోనన్న భయంతో వదలలేక వదలలేక వదిలి వెళ్ళడం, తిరిగి వచ్చాక క్షేమంగా ఉన్న పిల్లలతో కలిసి కేరింతలు కొట్టడం చూస్తే 'ప్రేమ ఎంత తియ్యనిది' అనిపించేది. నిత్యం నివసించే పక్షులే కాకుండా అప్పుడప్పుడూ విహారాని కొచ్చే కొంగలూ, చిలుకలూ నా మీద వాలుతుండేవి. అటువంటిది ఇక్కడ కనీసం చిన్న పిట్ట కూడా నాకు కనిపించలేదు.

    ఇంతలేసి శబ్దాల్లో మనుషులుకాబట్టి బతికేస్తున్నారు కానీ ఆ అర్భకప్రాణులు తట్టుకోగలవా? దానికితోడు ఫ్యాక్టరీ గొట్టాలనుంచి వచ్చే పొగ, నల్లటి మసి గాలిని మలినం చేస్తున్నాయి. ఇప్పుడు ఆశ్రయమివ్వడానికి నేనున్నాను కదా అని పక్షులు ఇక్కడికి వచ్చినా ఈ వాయుకాలుష్యం వాటిని బతకనిస్తుందా?

    పొలాల్లో పనిచేసుకునే ఆడవాళ్ళు మా కొమ్మలకి ఉయ్యాలలు కట్టి పిల్లల్ని పడుకోబెట్టేవాళ్ళు. భూమిలోంచి బయటికి వచ్చిన మా వేళ్ళమీద కూర్చుని పిల్లలకి పాలిస్తుండేవాళ్ళు. మమ్మల్నీ, మా నీడనీ ఎంతో మెచ్చుకునేవాళ్ళు. మేము కలకాలం పచ్చగా ఉండాలని దీవించేవాళ్ళు. ఆ మాటలతో మాకు ఉత్సాహం పెరిగి పోటీపడి మా కొమ్మలని ఊపి మరింత గాలిని ప్రసరింపజేసేవాళ్ళం.
    'ఇక్కడ నా కిందికి ఎవరూ రావట్లేదేమిటబ్బా' అని ఆశ్చర్యం వేసింది. ఇంతలో ఒక వ్యక్తి నా దగ్గరికి రాబోతుంటే చౌకీదారు గట్టిగా అరిచి దూరంగా పంపించేశాడు. అప్పుడర్థమైంది నాకు, నా చుట్టూ కట్టిన చప్టా ఆరేదాకా నావైపు ఎవరూ రారని.

    నాలుగు రోజులు గడిచేటప్పటికీ నెమ్మదిగా ఫ్యాక్టరీ పనివాళ్ళు నా చుట్టూ చేరడం మొదలుపెట్టారు.

    మధ్యాహ్న సమయాల్లో కొంతమంది నా నీడలో కూర్చుని భోజనాలు చేస్తారు. వాళ్ళు పెనువిషాదాన్ని మనసులనిండా నింపుకున్న శోకమూర్తుల్లా ఉంటారు. ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోరు. గబగబా అన్నం తినేసి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు.

    సాయంత్రంవేళ అందరూ వెళ్ళిపోయాక నలుగురైదుగురు వచ్చి చప్టామీద కూర్చుంటారు. వీళ్ళు మిగతా వాళ్ళకి నాయకులట. వీళ్ళు ఒక్క నిముషం కూడా మాట్లాడకుండా ఉండలేరు. ఎప్పుడు బందు చెయ్యాలి? ఎందుకు స్ట్రైకు చెయ్యాలి? యాజమాన్యం ముందు ఏమి డిమాండ్లు పెట్టాలి? వాటిని ఎట్లా సాధించుకోవాలి? ఇటువంటి విషయాలుతప్ప వీనుల కింపైన విషయాలు మాట్లాడ్డం వీళ్ళకి తెలీదు.

    పాపం! పనిచేసి అలిసిపోయిన ఈ కార్మికులకి హాయి నిద్దామని నేను నా కొమ్మలని ఊపితే ప్రతిఒక్కరూ నామీది దుమ్మంతా వాళ్ళమీద పడుతోందని విసుక్కుంటారు. వీళ్ళకి నీడని అనుభవించడం తెలీదు. చల్లదనాన్ని ఆస్వాదించడం తెలీదు. చెట్టు గొప్పదనాన్ని గుర్తించడం తెలీదు.

    అసలు ఈ మనుషులకి తృప్తి, సంతోషం అంటే ఏమిటో తెలీదేమో అనిపిస్తుంది.

    క్రమంగా నా ఒళ్ళంతా మసిబారిపోయింది. ఎంత విదిల్చినా నా ఒంటికంటిన మలినం వదలడంలేది. మళ్ళీ ఒకసారి వాన కురిస్తే తలారా స్నానం చెయ్యొచ్చని నేను ఆశ పడుతుండగానే ఎండలు ఎక్కువైపోయాయి. నా శరీరం మీద ఒక పొరలా ఏర్పడ్డ నల్లటి మసికి మండే ఎండలు తోడవడంతో సెగలు రేగుతున్నయి. నా ఆకుల్లోని పత్రహరితాన్ని కోల్పోతున్నాను. నా వేర్లకు నీరందడంలేదు. బొగ్గుపులుసువాయువు, సూర్యరశ్మి పుష్కలంగా దొరుకుతున్నా ఆహారం తయారుచేసుకోలేక పోతున్నాను. నిస్సత్తువగా ఉంటోంది. ఆరోగ్యం దెబ్బతింటోంది.

    పూర్వం రోడ్డుమీద వెళ్ళే వాహనాలు రేపే దుమ్ము నామీద పడుతూనే ఉండేది. కానీ అది ఈ మురికిలా అంటుకుపోయేది కాదు. గాలికి కొట్టుకుపోయేది. ఒకవేళ అంటుకుపోయినా నేను బాధపడేదాన్ని కాదు. ఎందుకంటే అది నాకెంతో ఇస్టమైన మట్టి. నేను విత్తనంగా నేలతల్లి ఒడిలో చేరినప్పటినుంచి నాకు పరిచయమున్న మట్టి. నాకు జన్మనిచ్చిన మట్టి. నేనెంతో ప్రేమించిన మట్టి. చిన్నతనంలో నేను పడి పొర్లిన మట్టి. నాకు ఆహారాన్నందించి నన్ను దృఢంగా తీర్చిదిద్దిన మట్టి. ఎన్నో సంవత్సరాలుగా నన్ను తనలో పొదివి పట్టుకుని నిలబెట్టిన మట్టి. ఆ నేలను వదిలి రావడానికి నేనెంత బాధ పడ్డానో ఎవరికి అర్థమవుతుంది?
    అసలు నా స్వస్థానాన్ని వదిలి నేనెందు కిక్కడికి రావాలి? వచ్చినా ఎందుకు బతికుండాలి? ఆరోజు ఆ వాన కురవకపోతే హాయిగా చచ్చిపోయేదాన్ని. నాకీ నరక ముండేది కాదు.

    రహదారులు నాగరికతకు చిహ్నాలైతే పచ్చదనం అనాగరికతకు చిహ్నమా? రోడ్డు వెడల్పు చెయ్యాలంటే మమ్మల్ని అక్కణ్ణించి తొలగించడమే మార్గమా? ఠీవిగా నిలబడి ఉన్న మాకు అటూఇటూ రోడ్డు వేసి మా చుట్టూ డివైడరు కట్టొచ్చుగదా?

    మనిషి ఆర్థిక సమీకరణాలముందు మా ప్రాణాలు లెక్కలోవి కాదు కాబట్టి, తన మేధా సంపత్తితో అద్భుతాలు సృష్టిస్తున్న మనిషికి ఇంత చిన్న ఆలోచన రాదు.

(వార్త దిన పత్రిక ఆదివారం అనుబంధం 16-10-2011 సంచికలో ప్రచురితం)
Comments