యిడ్పు కాయితం - చెన్నూరి సుదర్శన్

  
    "నీచేతులకు జెట్టలు బుట్ట...నువు నాశనమై పోను..." అని ఏడ్సుకుంటనే ముక్కు ఎడంచేత్తోటి చీది గోడకు రుద్ది తన చీర కొంగంచుకు తుడ్సు కున్నది సమ్మక్క. "ఓ...నాఅవ్వో...అవ్వా..., నువు సచ్చి ఏలోకానె ఉన్నవే...అవ్వా..., నాబత్కు తెర్లైంది గాదే...అవ్వా..., యీ ముదనట్టపోని కిచ్చిన వేందే...అవ్వా..." అని రాగం తీస్కుంట నోట్ల కెల్లి సొల్లు గార్తాంటె ఏడ్వ బట్టింది. సమ్మక్క పెద్దపొల్ల సుత ఏడ్సుకుంట అవ్వ గదుమ పట్టుకొని ఊకుంచ బట్టింది. పొల్లది రామసక్కని మొకం. కండ్లెంబడి ఓపక్క నీళ్ళు గారి ఆరిపోయి అట్టు గట్టినై. వాటిమీదికెల్లే మల్ల మల్ల నీళ్లు కారుతానే ఉన్నై.

    చిన్నపొల్ల రాతెండి గిన్నెల కంచుట్ల కెల్లి ఊర్చేసిన కూరల నాల్గు మెతుకులేత్తే, కుడి చేత్తోటి కల్పుకుంట...ఎడ్మచెయ్యి సూపుడేలు తోటి కెలు క్కుంట తింటాంది. సందు సందుల ఎడ్మచెయ్యి మట్ట తోటి చీమిడి కారుతాంటె ఎగచీదుకుంట తుడ్సుకుంటాంది.

    సమ్మక్క మొగడు సారయ్య ఏనుగలను మింగి ఎకసక్కాలు పడ్డట్లు పెండ్లాం తలెంటుక లిగ్గి ఈపుల గుద్ది గుడిసెముందున్న చిన్న గద్దె మీద కూకొని తాత్పరంగ బీడి తాగుతాండు. " రాత్రి చడావు కిచ్చిందిగాని యీ దొంగముండ కేమైంది యియ్యాల ఉతార్‍కిత్తలేదు. కూడబెట్తిన పైసలన్ని ఏమిండని కిత్తదో..." అని మనసులనుకుంట మిడ్కబట్టిండు. " ఉతార్‍కు మల్లో సౌ ఏత్తేగాని యీతల్కాయె నొప్పి పోదు. నీయవ్వ..." అనుకుంట ఎడ్మచేతి పెద్దనేలు తోటి ఎడ్మ పక్క కంత నొత్తుకుంట యింట్లకు పోయిండు కుడిచేత్తోటి సూర్ల కట్టె గుంజుకొని.

    సారయ్యను సూడంగనే సమ్మక్క యమున్ని సూసినట్టు సూసి గజ్జ, గజ్జ వన్కుంట ఏడ్పు సౌండు పెంచింది. పెద్దపొల్ల " నాయ్నా..కొట్టకే...నీ కాల్మొక్కుతా..." అనుకుంట సంగ, సంగ ఎగురబట్టింది అయ్య చేతిల కట్టెను సూసి. చిన్న పొల్ల ఏలుమీదున్న మెత్కు నోట్లె పెట్టుకోబోయి బీరుపోయింది. లేచి పంగ కాల్లేస్కొని ఓపక్క చెడ్డి జారి పిర్రల మీదకత్తె ఎడ్మచెయ్యి తోటి నడుంమీద్కి గుంజుకుంట ఉర్కుంటచ్చి సారయ్య ఎడ్మకాలును రెండు చేతుల్తోటి లప్టాయించింది.

    " పోరీ...ఎంగ్లి చెయ్యే...నీయవ్వ నా దోతి కరాబయ్యె... " అని ఈపు మీద ఎడ్మచెయ్యితోటి ఒక్కటిచ్చిండు. దెబ్బకు పొల్ల ఊపిరి బట్టింది కాని కాలిడ్వలే...

    "అయ్యో...పోరిని సంపిండ్రో...నీచేతులు పడిపోనూ...నీకేంరోగమొచ్చిందిరా...పోరిని పిడాత సంపబడ్తివి...పెద్దపోరినీ నన్నూ పీక్కతిను యిగుడ్సమ్ముకొని లోప్కతాగు...నీకండ్లు సల్లపడ్తై...దైద్రపోడెక్కడ్నో దాపురించిండు..." అనుకుంట సమ్మక్క చిన్న పొల్లను తిసుకో బోయింది. సారయ్య చిన్నపొల్ల పట్టుకున్న కాలును జాడిచ్చిండు. పొల్లబోయి అంత దూరమ్ల పడ్డది. సమ్మక్క పొల్లను తీసుకుందామని పోతాంటే ఎంట్కెలు పట్టుకొని ఎన్కకు గుంజి " నువ్వే నాకు దాపురించినౌ నాపానానికి...నీఅయ్య అవ్వ కల్సి నన్ను తాళ్ళల్లకు తీస్కపొయి నా తక్దీర్ మార్చిండ్లు. నువ్వేమో పొల్లెన్క పొల్ల ఆడపోరగాడ్లనే కంటాంటివి. వాల్లనెట్ల సాదాలే...లగ్గాలెట్ల చెయ్యాలే...అని రంది తోటి నాపానం కలికలైతాంది. ఎటూ సుజరాయించక సుక్కేసుకుందామంటే నువు సందిత్తలేవైతివి...నువు కూలికి నాలికి పోయి తెచ్చిన పైసలేడపెడ్తానవో తెల్వనిత్తనావె...దొంతులన్ని ఎత్కితి దొర్కక పాయె...మరి నాకెట్ల దూప సల్లార్తెదే.." అనుకుంట పట్టుకున్న ఎంట్కెల్ని ఎన్కకు గుంజి కుడిచేతులున్న కట్టెను సమ్మక్క ముకం మీద ఊపుకుంట  " ఇగ్గో నేను తాగందే మనిషిని గాను...మంచి మాటతోని చెప్తాన...ఓ పదన్నా ఇయ్యి...సీస కల్లన్నా తాగత్త."

    "యింగ వీడు పైసలియ్యంది యిడ్చి పెట్టెటట్టు లేడు. ఇయ్యాలేందో వీని మీద దయ్యం కూకున్నది" అని మన్సులనుకుంట బొడ్లో ఉన్న చేసంచి తీసి పదినోటిచ్చింది సమ్మక్క.

    కిసుక్కున నవ్విండు సారయ్య "ఏందే...సంచిల ఎన్ని అర్రలున్నయేంది...నాకు దొరక్కబాయె.." అని సమ్మక్క వెంట్కలిడ్చిపెట్టి పది నోటు తీసుకొని చేతిలున్న కట్టెను తిప్పుకుంట బైటికచ్చి కట్టెను ఎన్గులకిసిరేసి ఈలేసుకుంట బజాట్లపడ్డడు.

    సమ్మక్క తలెంట్కలను కుడిచేత్తోటి వలెమోలె సుట్టి దగ్గరికి తోకముడేసుకున్నది.

    "ఇయ్యాల కైకిల్కు పోను...రెక్కలు ముక్కలు చేస్కొని తెచ్చిన పైసలు వాని పాడెమీదే పెట్టుడైతాంటిని. వాడోపననడాయె...పాటనడాయె ... బొండిగెలదాక తాగుడు...నడింట్ల ఎల్లెల్కల సాప్కొని పండి నిట్టాడుకందెటట్లు  నిలబెట్టుడు...థూ...రోత పాడుగాను ఏంపుట్కో ఏందో... గిట్లైతెట్ల... నేనొక్క దాన్ని ఎంత కని సంసారాన్ని గుంజుకరాను...ఏమన్నంటే గొడ్డును గొట్టినట్లు కొట్టబట్టె...యిగనావల్లగాదు...వీనితోని సంసారం చేసుడుకంటె యిడ్పుకాయితం చేస్కొని, వాన్ని గుడ్సెలకెల్లి ఎల్లగొడ్త..యిది నా గుడ్సె. నాఅయ్యా అవ్వ యిచ్చిండ్లు. ఇల్లరికమని ఇంట్ల సొచ్చి ఇక్మతులు పడ్తాండు. దేవుడిచ్చిన రెక్కలు సల్ల గుండాలె గాని బత్కలేనా..." అంటూ తనలో తాను వదురుకుంటూ చిన్న పొల్లను సంకలేస్కొని గిన్నెల మిగిలిన మెతుకుల్ని నోట్ల గుక్కింది. గిలాసల కొన్ని నీల్లుంటె తాగిపిచ్చి మూతి కడ్గింది. పెద్దపొల్ల తోని " దొర దగ్గర్కి పోదాం బిడ్డా...దా..." అని గుడిసెకు తాలమేసింది. "వాడత్తె వాకిట్లనే పండాలె" అని గులుక్కుంట ఎన్గు దడి దగ్గర్కి నూకి పటేలింటికి పయానమైంది.

* * *  

    సమ్మక్క కిస్మత్ బాగున్నది. సర్పంచ్ నర్సింగరావు దొర యింట్లనే ఉన్నడు. సమ్మక్క దొరతాన తన కడ్పులున్న యాతనంతా బైటబెట్టింది. యిద్దరి పోరగాండ్లను దొర కాల్లమీద పడేసి " దొరా...నీ బాంచెను...నాపోరగాండ్ల బత్కులు నీచేతులున్నై. ఎట్లనన్నసేసి నాకు యిడ్పు కాయిత మిప్పీయాలె. లేకుంటే పోరగాండ్లను బాయిలేత్త...నేను సుత సత్త..." అని దొరనొకరకంగ బెదిరిచ్చుకుంట తన కడ్పుల మస్లుతున్న ఏడ్పునంత ఎల్లగక్కింది.

    ఎట్లతెల్సుకున్నడో ఏందో ఆడకుక్క తోక కింద వాసన సూసుకుంట మగ కుక్కచ్చినట్లు సారయ్య కర్నంపంతుల్ని తోలుకొని సొలుక్కుంట చ్చిండు. సమ్మక్కను సూడగానె చెయ్యిలేపుతాంటె పంతులాపిండు.

    నర్సింగరావు దొర కల్గజేస్కొని " మంచి టయిమ్కే వచ్చినౌర...ఏంరా సారయ్యా... నీపెండ్లాం యిడ్పుకాయితమడ్గుతాంది. మరి నీసంగతేంది?" అంటూ సారయ్యనడ్గుగంగనే వాడు తోకతొక్కిన పామోలె సర్రున లేచిండు.

    "యిడ్పుకాయితమా... నేనెందుకిత్త...బజాట్ల కొట్టుకొచ్చే శిత్తు కాయితాలా అవి...పిలగాండ్ల పరాశ్కాలా..."సమ్మక్కను సూసుకుంట "ఎందే  నకరాలు  చేత్తానౌ... ఇది నీకు పుట్టిన బుద్దా... ఇంకెవడన్నా... నీమిండెని ఇక్మతా...నీకు ఇడ్పుకాయితమిచ్చి మరి నేనెట్ల బత్కాల్నె...నాకు తాగడాన్కి పైశలెవరిత్తరే... నీ మిండెడిత్తడా...నేనిడ్పు కాయితమియ్య...నువ్వైతే ఇంటికిపా... నీ తోలు శాన మందమైంది...సాగదీత్తపా..." అంటూ మూతి, కండ్లు, చేతులు వంకర్లు తిప్పుకుంట నిలబడడాన్కి ఓసర లేక గోడనాసర సేస్కొని నిలబడ్డడు.

    దొర సమ్మక్క పెద్ద పోరిని సూసుకుంట " ఏందే పోరీ...నీకు అయ్యగావాల్నా...అవ్వగావాల్నా" అని అడ్గిండు.

    పెద్దపొల్ల " నాకయ్యద్దు...అవ్వను కొడ్తాండు. పైసలు గుంజుకుంటాండు. నాకవ్వనే గావాలె" అని అయ్య వైపు ముక్కిర్సి సూసుకుంట సెప్పింది. చిన్న పొల్ల కేందో తెల్సినట్లు అవ్వ చీర చింగుల్ల దాక్కున్నది.

    "సమ్మక్కా...యిడ్పుకాయితం నువ్వొక్కదానివడుగుతే ఎట్లిత్తరే...మీ అందరి కుత్కెలొక్కటిగావాలె(ఏకాభిప్రాయం). నీమొగడేమో యిడ్పు కాయితం ఇయ్యననబట్టె...మరి ఎట్లైతెదే...పెండ్లాం మొగలు కూకొని మాట్లాడుకొని ఒక్క మాట మీదత్తెనే మీ కులపోడ్లముందు యిడ్పు కాయితమిప్పిత్త. అప్పుడిదాక సప్పుడు సేయకు...నీ యవ్వ పొద్దు, పొద్దుగాల్నె రప, రప బెట్టి నాపనంత చెడగొట్టిండ్లు." అంటూ సర్పంచ్ దొర గదమాయిఛే సరికి బిత్తిరి పోయిన పోరగాండ్లను తీస్కొని సమ్మక్క తన యింటి దిక్కు బైల్దేరింది. "ఎవ్వడన్న దొర ఉంటే పెండ్లా మొగల్ల నడ్మ కట్టాలేంది... నట్టాలేంది... యిడ్పుకాయితమన్న మాట ఎందుకచ్చింది... అని ఇచారించి తక్ష్ప చెయ్యాలె గాని ఇదేంది ఒక్క కుత్కె గావాలంటడు... నారెక్కల కట్టం రుచి మర్గినోడు ఇడ్పుకాయితమిత్తడా... కల్సుందామనే అంటడు..." అని తొవ్వబొంటి యిల్లచ్చేదాక గులుక్కుంటనే పోయింది.

    ఆరాత్రి సారయ్య ఫుల్లుగ సార తాగచ్చి పెండ్లాం యిడ్పు కాయితం అడ్గుతాందన్న కోపం తోటి ఈపు చింతపండోలె చితక్కొట్టిండు. సమ్మక్క, పొలగాండ్ల పెడబొబ్బలకు యింటిపక్కోల్లెవ్వరు రాలె. ఇది ఒక్కనాటి బాగోతం గాదాయె... నిత్తె ఇదేతంతైతే ఎవలత్తరు?... సమ్మక్క ఏడ్సీ, ఏడ్సీ తన కండ్ల నీల్లే తాగి పొలగాండ్లను పక్కలేస్కొని పండుకున్నది. పక్కపొంటున్న మంచంల ఎల్లెల్కల పండుకొని సారయ్య "ఇద్దరాడ పోరగాండ్లను గ్యాసునూనె పోసి తలగబెడ్త" అని కలవరిత్తాండు.  సమ్మక్క కండ్లు నిలబడ్డై.

* * *  
    సారయ్య ఉరేస్కొని సచ్చిండన్న వార్త ఊల్లె గుప్పుమంది. జాతరలెక్క జనమొచ్చిండ్లు. సర్పంచి నర్సింగరావు దొర, పోలీసు పటేల్, కర్నం పంతులు అంతా సమ్మక్కింట్ల జమైండ్లు. సమ్మక్క దీర్ఘాలు తీస్కుంట శోకునం బెట్టింది. ఇంటిపక్కోల్లచ్చి ఊకుండబెడ్తాండ్లు. ఒకామె సమ్మక్క పొల్లగాండ్లను దగ్గర్కి తీస్కొని సమ్దాయిత్తాంది. " ఎంతైనా మొగడాయె... మనిన్నప్పుడు ఏం సుకబెట్టిండో లేదో గాని...పోరగాండ్లనాగం సేసి పోయిండు. పాపం సమ్మక్క బతుకేంగావాలె..." అంటాంది మరొకామె. " మాగసచ్చిండు సమ్మక్క పీడ ఇర్గడైంది" అని గుస, గుస పెడ్తాంది ఇంకో ఆమె. ఇట్ల నల్గురు నాల్గు రకాల అనుకో బట్టిండ్లు.

    పంచనామా రాత పూతలన్నీ అయినంక సారయ్యను దానం సేసే సంగతి సూస్కొమ్మని ఎలోన్కి చెప్పి దొర ఓరగ సమ్మక్కను "యిదే రాత్రి ఉరేసుంటదని" అనుమానంగ సూస్కుంట పోతాంటే సమ్మక్క ముకంల " దొరా...యిప్పుడు మాది ఒక్క కుత్కెనే గదా..." అని చెంపమీద కొడ్తున్నట్లు కన్పిచ్చింది. 

(నమస్తే తెలంగాణా దినపత్రిక 07 అక్టోబర్ 2012 ఆదివారం సంచిక బతకమ్మలో ప్రచురితం)     
Comments